5, సెప్టెంబర్ 2013, గురువారం

తెలుగు పాలనా భాష కావాలంటే ఏం చెయ్యాలి ?



తెలుగు పాలనా భాష కావాలంటే ఏం చెయ్యాలి ?
నూర్ బాషా రహంతుల్లా  9948878833
తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభల వాగ్దానాలతో ప్రజలకు కలిగిన ఆనందం మరుసటి నెలనుండే ఆవిరి కావటం ఆరంభించింది.మండలి బుద్ధప్రసాద్ గారి రాజీనామాతో తెలుగు భాష మళ్ళీ అనాధలా మిగిలిపోయింది.ఇప్పుడు ఎవరిని అడగాలన్నా భాషకంటే ముఖ్యమైన ఉద్యమాలలో తలమునకలై ఉన్నారు.తెలుగు భాష తెలుగు జాతి అనే పదాలు మాత్రం మారుమోగిపోతున్నాయి.కానీ తెలుగు భాషకు ఏ ప్రయోజనమూ కలగటం లేదు. అంతా ఎరుదాటాక తెప్ప తగలేసిన చందంగా ఉంది.భాషపేరుతో ఐక్యత కోరే వాళ్ళు ఆ భాషను బ్రతికించటానికి కూడా కృషి చెయ్యాలి.భాష చచ్చిపోతే ఇక ఈ భాషా నినాదం కూడా చేయలేము.

తెలుగు కంఠ శోష
పాలనా భాషగా తెలుగుభాష అమలు గురించి 33 సంవత్సరాలుగా రాస్తూనే ఉన్నాను.తెలుగు భాష అధికారికంగా కార్యాలయాల్లో అమలు కావడానికి ఎంతోమందిసూచనలు చేస్తున్నారు. భాష అమలుకోసం ఎవరెవరు ఏమేం చేశారో తెలిపితే ఔత్సాహికులకు ప్రోత్సాహకంగా ఉంటుందని భావించి  ఏం చేస్తే బాగుంటుందో గూడా మళ్ళీ చెబుతున్నాను.తెలుగు భాషోద్యమం  రాష్ట్రోద్యమం దెబ్బకు ఎటో వెళ్ళిపోయింది.ఇక ఎవరికి చెప్పాలి?తెలుగు ప్రజలు,నాయకులు,అధికారులు అందరికీ చెబుతాను. రాష్ట్రం ఒకటిగా ఉన్నా రెండుగా ఉన్నా తెలుగు భాష అందరికీ అవసరమే.తెలుగు పాలనలో అందరికీ సమానంగా అవే భాషాపరమైన అవసరాలు పదే పదే  ఎదురౌతాయి.
నా అనుభవాలు  
ఆనాటి అధికార భాషా సంఘం అధ్యక్షులు గజ్జెల మల్లారెడ్డిగారు నేను గుమాస్తాగా పనిచేస్తున్న ఒక కార్యాలయ తనిఖీకి వచ్చారు. పూర్తిగా తెలుగులోనే ఫైళ్ళు నిర్వహించే ఉద్యోగి ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చర్చించుకొని ఆయన్ని నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన నేను రాసిన ఫైళ్ళన్నీ చూసి తెగ సంబరపడ్డారు. ''ఈ కుర్రవాణ్ణి చూసి మీరంతా నేర్చుకోవాలి. తెలుగు పదాలు దొరక్కపోతే ఏ మాత్రం సంకోచించకుండా ఇంగ్లీషు పదాలనే తెలుగులో రాశాడు. ఇతని వాక్య నిర్మాణం చాలా సులువుగా, సహజంగా, అందరికీ అర్థమయ్యేలా ఉంది. ఇదే మేము కోరుకునేది'' అంటూ నన్ను అభినందించారు. అది హైదరాబాద్‌లోని డైరెక్టొరేట్‌ కార్యాలయం కావడంతో అక్కడ పనిచేసే ఉర్దూ సోదరులు, ఆంగ్ల మేధావుల మధ్య నాకూ, నా భాషకూ ఒక గుర్తింపు వచ్చింది. పూర్తిగా తెలుగులో ఫైళ్ళు నిర్వహించవచ్చు అనే సత్యం తెలిసింది.
తెలుగులో హైకోర్టుకు జవాబులు
పశ్చిమ గోదావరిలో ఎమ్మార్వోగా ఉండగా 23 రిట్‌ పిటీషన్‌లకు పేరావారీ జవాబులు తెలుగులోనే రాసి పంపాను. కలెక్టరేట్‌ నుండి ఫోన్‌. తెలుగులో ఎందుకు పంపారనే ప్రశ్న. తెలుగులోనైతే జవాబులు తప్పుల్లేకుండా సూటిగా, స్పష్టంగా ఇవ్వగలననీ, అర్థంకాక పోవడమనే సమస్యే రాదనీ, వాటిని యధాతథంగా హైకోర్టుకు సమర్పించమనీ, కాదు కూడదంటే ఇంగ్లీషులోకి తర్జుమా చేయించి జిల్లా కేంద్రం నుండే హైదరాబాద్‌కు పంపించండనీ వేడుకున్నాను. అధికార భాషా చట్టం పుణ్యాన వారు వాటిని హైకోర్టులో నివేదించారు. యధాతథంగానో, ఆంగ్లంలోకి మార్పించో నాకు తెలియదుగానీ అన్ని కేసులూ గెలిచాం. ఆలోచన మన అమ్మ భాషలోనే పుడుతుంది. అమ్మ భాషలో వాదిస్తే గెలుపు ఖాయం అనే సంగతి అర్థమయ్యింది.
తెలుగులో దరఖాస్తులు
ఇంకో మండలంలో ఎమ్మార్వోగా ఉండగా ధరఖాస్తు ఫారాలు నింపడానికి ఆఫీసు బయట ఒక ప్రైవేటు వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన వ్యక్తుల అవసరాలనుబట్టి ఇంతింత ఈ ఫారం నింపడానికివ్వాలని వసూళ్ళు చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫారాలు ఇంగ్లీషులో ఉండేవి. ఏయే పనుల కోసం ఈ ఆఫీసుకు ప్రజలు వస్తున్నారు, ఏమేమి ఫారాలు వాళ్ళు పూరించి ఆఫీసులో ఇవ్వాలో తెలుసుకున్నాను. ఓపికగా ఆయా ఫారాలన్నీ తెలుగులోకి అనువదించాను. నాలుగైదు తరగతులు చదివిన వారెవరైనా సులువుగా పూర్తిచేయటానికి వీలుగా అన్నిరకాల ధరఖాస్తుఫారాలు తయారయ్యాయి. వాటిని ఆ ఊళ్ళోని జిరాక్సు షాపులన్నిటికీ ఇచ్చి కేవలం అర్ధరూపాయికే ఏ ఫారమైనా అమ్మాలని చెప్పాము. ఎవరికివారే ఫారాలు నింపుకొని వస్తున్నారు. ప్రతిఫారమూ నాలుగైదు దశలు దాటివచ్చే పద్ధతి తీసేశాం. గ్రామ పాలనాధికారి, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ సంతకాలు చేస్తే చాలు. వాటిపైన నేను సంతకం చేసేవాడిని. ఆఫీస్‌లో గుమాస్తాల ప్రమేయం తగ్గింది. పత్రాల జారీ వేగం పెరిగింది.
పిల్లల బాధలు,రైతుల అగచాట్లు
నేను హై స్కూల్ చదువుకు రోజూ 7 కి.మీ.కంకటపాలెం నుండి బాపట్ల నడిచి వచ్చే వాడిని.కుల,ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్ దార్ ఆఫీస్ కు వారం రోజులపాటు తిరిగేవాడిని.ఎండకు తాళలేక బాపట్ల తహసీల్ దారు ఆఫీసు ఆవరణలో చెట్టు కింద నిలబడేవాడిని.ప్రతిరోజూ డఫేదారు దగ్గర ఒకటే సమాధానం;"దొరగారు క్యాంపు కెళ్ళారు.రేపు రండి" .ఆనాడు ఆ చెట్టు కింద అనుకున్నాను "నేను గనక తాసీల్దారునైతే చిన్నపిల్లలకు చకచకా సంతకాలు చేసి పంపిస్తాను".తహసీల్దారునయ్యాక మాటనిలుపుకున్నాను.
స్కూళ్ళు తెరిచే జూన్‌ మాసంలో సర్టిఫికెట్ల కోసం పిల్లలు బారులు తీరేవాళ్ళు. రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఆ పిల్లల చేతనే సర్టిఫికెట్లపై నంబర్లు వేయించి స్టాంపు, సీలు కొట్టుకోమనేవాడిని. అరగంటలో పిల్లలంతా ఉత్సాహంగా తమ పని ముగించుకొని, సర్టిఫికెట్లతో వెళ్ళిపోయేవారు. అంతా తెలుగులోనే. తెలుగు పిల్లలు తెలుగులో ఎంతో వేగంగా పనిచేసేవాళ్ళు. నా 13 సంవత్సరాల ఎమ్మార్వో పదవీ కాలంలో తెలుగు పిల్లలు ఎక్కడా పొరపాటు చేయలేదు. రిజిస్టర్లన్నీ చక్కటి తెలుగులో మన తెలుగు పిల్లలే నిర్వహించారు. ఆ కాలమంతా నాకు మధురానుభూతి. మండలంలోని అన్ని హైస్కూళ్ళ ప్రధానోపాధ్యాయులకూ ఒక ప్రొఫార్మా ఇచ్చి, వారి స్కూల్లోని పిల్లలందరి కులం, స్వస్థలం, పుట్టిన తేదీ... మొదలైన వివరాలు నింపి ధ్రువీకరించి పంపమని కోరాను. ఆయా గ్రామ పాలనాధికారులు కూడా ఆ వివరాలను ధ్రువీకరించారు. పిల్లలెవరూ మండల కార్యాలయానికి రానక్కరలేకుండా ''శాశ్వత కుల, నివాస స్థల, పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని'' వారి ఫొటోలు అంటించి వారి వారి పాఠశాలల్లోనే పంపిణీ చేశాం. పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ఇళ్లకు పంపిణీ చేయించాం. వీటన్నిటిని తెలుగు రాత పనిలో, మంచి చేతిరాత కలిగిన గ్రామ సేవకులు, ఉపాధ్యాయులు, గ్రామ పాలనాధికారులు, విద్యార్థుల్ని కూడా ఉపయోగించుకున్నాం. ఎలాంటి తప్పులూ దొర్లలేదు. ఏ ఊరి ప్రజల పని ఆ ఊళ్లోనే ఆ ఊరివాళ్లే చేసుకున్నందువలన ఎంతో స్పష్టంగా పని జరిగింది. పల్లెటూళ్ల అందం వాళ్లు రాసిన తెలుగు అక్షరాలతో మరింత పెరిగింది. తల్లి భాషకు దూరమైన రోగులు పల్లెటూళ్లకెళ్లి ప్రాణవాయువెక్కించుకోవచ్చుననే అనిపించింది.ప్రజలకు అవకాశం ఇస్తే వాళ్లు మాట్లాడే భాషలోనే శక్తివంతంగా, జ్ఞానయుక్తంగా దరఖాస్తులు పెడుతున్నారు, విన్నవిస్తున్నారు, పోరాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆంగ్లం వారికి అరగటంలేదు. తెలుగు చక్కగా జీర్ణమౌతున్న అమృతాహారం.
ఇప్పుడు తెలుగు వాడకంలోంచి సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ పదాలను తీసివేయలేము. అవి మన భాషలో అంతర్భాగాలైపోయాయి. అక్కరలేని ఆపరేషన్‌ ఎవరు చేయించుకుంటారు? చేసినా గాయాలవడం తప్ప మరే మేలూ కలుగదు. అందువలన మన భాష సంకరమైనా బలమైన హైబ్రీడ్‌ భాషలాగా తయారైనందుకు సంతోషపడుతూ, ఈ సంకర తెలుగు భాషలోనే ఆఫీసుల్లో ఫైళ్ళు నడిపితే అదే పదివేలుగా భావించాలి. ఛాందసవాదులు వాళ్ళు చెయ్యరు, ఇంకొకళ్ళను చేయనివ్వరు. ఒకవేళ ఈ పనిని వాళ్ళకప్పజెబితే ఎవరికీ అర్థంగాకుండా పాడుచేస్తారు. ప్రజలు ఇంతకంటే ఇంగ్లీషే నయమని వాపోయేలా చేస్తారు. మన శాసన సభలో ఎమ్మెల్యేలు ఈ మూడు భాషల పదాలు కలగలిపి మనోరంజకంగా మాట్లాడుతున్నారు. అదే నేటి తెలుగు, వాడుక తెలుగు, వారు అడిగింది అడిగినట్లు తెలుగు లిపితో సాగదనుకుంటే ఆంగ్లలిపినే వాడుకోండి. మన మాట ముఖ్యం. వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు మాట్లాడుతున్నది మన ప్రజల భాష. ఆ భాషలో, యాసలో జీవోలు రావాలి. అప్పుడే తెలుగు అధికార భాషగా విరాజిల్లుతుంది.

ఇంకా చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి :
1. మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష. ఈ రెండు భాషల ప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవ గాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి.ఉర్దూ- తెలుగు నిఘంటువు, ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు ఎక్కడా అమ్మకానికి దొరకడం లేదు.ముద్రించాల్సిన అవసరం ఉంది. ముషాయిరాల కంటే ముఖ్యమైన తెలుగు-ఉర్దూ ,ఉర్దూ తెలుగు నిఘంటువులు కావాలి. వక్ఫ్‌బోర్డు నిఖా నామా లు (వివాహ ద్రువపత్రాలు )  తెలుగు భాషలో కూడా ప్రచురించాలి. తెలుగు జాతీయలూ, నుడికారాలూ, పదబంధాలూ కూర్చిన నిఘంటువుల అవసరం ఉంది
2. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ,పెద్దన,తిమ్మన,తెనాలిరామకృష్ణ,సూరన్న,రామరాజ,మల్లన్న,ధూర్జటి,రామభద్ర, గిడుగు,గురజాడ,సురవరం, యన్.టి.ఆర్.,మండలి,నాట్స్, పొన్నాల,రవిప్రకాష్,లక్కిరెడ్డి అనే 18 అక్షరరూపాలను విడుదల చేశారు.కానీ ఇప్పటికే అనూ,సూరి,లాంటి యూనీ కోడేతర ఫాంట్లలో ముద్రితమై ఉన్న విస్తారమైన తెలుగు సాహిత్యాన్ని తెలుగు యూనీకోడు లోకి మార్చే మార్పిడి సాధనాలు కావాలి.తర్జుమాలో తప్పులు వస్తున్నాయి.అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి.ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.వాటిని తయారు చేసే సాంకేతిక నిపుణులకు నిధులు ఇవ్వాలి, ప్రతి యేటా తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది.కాగితం, కలం రోజులు పోయాయి. ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి. పదాల శుద్ధి`యంత్రం, గుణింత, వ్యాకరణ పరిష్కారయంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్‌నిఘంటువులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, ఉచ్ఛారణ ` పద ప్రయోగ నిఘంటువులు, వ్యుత్పత్తి కోశాలు, లిపిబోధినిలు, సాహిత్య శోధనా పరికరాలు, పదాను క్రమణికలు... ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడిరచే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగా ఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి.
 3. తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇస్తే, తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు మీడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగును అమలు చేయాలనే పట్టుదల, ఆకాంక్ష ఉంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి.
4. ప్రైవేటు, కార్పోరేట్‌ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉండాలి.రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వాడుక బాషలోకి తేవాలి. ఎనిమిదో షెడ్యూల్డ్‌లో పేర్కొన్న బాషలన్నిటినీ అప్పటికప్పుడు తర్జుమా చేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటు చేయాలి. న్యాయస్థానంలో తీర్పులు అధికార భాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి. తెలుగు భాషా రక్షణ అభివృద్ధికై మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయగల ఐ.ఎ.యస్‌. ఐ.పి.యస్‌ అధికారుల్ని, గవర్నర్లును మాత్రమే మన రాష్ట్రంలో నియమించేలా కేంద్రాన్ని కోరాలి.తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ , అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను తెలుగు ప్రజలకు బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు అంటే కోడ్లు, మాన్యువల్‌లు, లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కమీషన్‌ పోటీ పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి. కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులు సంకలనం, వ్యవకలనం లాంటి సంస్కృత పదాలను వాడి తెలుగు మీడియం అంటే పిల్లలు భయపడేలా చేశారు. పిల్లల పుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి. .కేవలం తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వాడికి ఇంగ్లీషురాక పోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో నయినా ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే వాతావరణం కల్పించాలి. అంటే ఇంగ్లీషు రాకపోయినా కలెక్టరు , డాక్టరు , ఇంజనీరు కాగలిగే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి. అప్పుడు జనం తండోపతండాలుగా తెలుగులో చదువుతారు.హైదరాబాదును రెండవ రాజధానిగా  ఏర్పాటు చేసినా చెయ్యపోయినా తెలుగును మాత్రం రెండవ జాతీయ భాషగా ప్రకటించాలి. 
 (సూర్య 6.9.2013)
http://www.suryaa.com/opinion/edit-page/article-152137
  https://www.facebook.com/photo.php?fbid=627311750634152&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

2 కామెంట్‌లు:

  1. Telugu paalanaa bhasha ela kaagalado chaala baaga suchincharu, mee lanti Telugu bhaashabhimaanulu inka unnanduku anandanga undi..

    రిప్లయితొలగించండి
  2. https://www.facebook.com/groups/AdhikaraBhashaSangam/permalink/557067794471102/?comment_id=557088407802374&notif_t=group_comment&notif_id=1460177566263898

    రిప్లయితొలగించండి