11, నవంబర్ 2016, శుక్రవారం

సర్వీస్‌ కమిషన్లకు తెలుగు భాషా సేవ చేయాలి (సూర్య 12.11.2016)


సర్వీస్‌ కమిషన్లకు తెలుగు భాషా సేవ చేయాలి



(సూర్య 12.11.2016)

-గ్రూప్‌-2,3 సర్వీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్న సర్వీస్‌ కమిషన్లు
-తెలుగు మాధ్యమ విద్యార్థులకు ఛాన్సు ఇవ్వాలి
-5 శాతం అదనపు మార్కులతో ప్రోత్సహించాలి
-తెలుగు మాట్లాడే జనం సమస్య తీర్చే పోస్ట్ లు
-తెలుగుభాషలోనే వ్యవహారాలు సాగాలి
-ప్రజలతో మమైకమైతేనే రాష్ట్రాల అభివృద్ధి
-జనం భాషకు ప్రభుత్వాలు పట్టం కట్టాల్సిందే

తెలుగుభాషకూ ,తెలుగు విద్యార్ధులకూ సేవ చేసేందుకు సర్వీస్ కమీషన్లకు మంచి అవకాశం వచ్చింది . త్వరలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలు రెండూ భారీ ఎత్తున గ్రూప్‌-2,3 సర్వీసు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయి. వీటిలో మున్సిపల్‌ కమిషనర్‌, ఏసీటీఓ, సబ్‌ రిజిస్ట్రార్ , డిప్యూటీ తహసిల్దార్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డెవలప్ మెంట్‌ ఆఫీసర్‌, ఎక్‌‌స టెన్షన్‌ ఆఫీసర్‌,ఎకైసజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌,అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ఆడిటర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, గ్రామపంచాయతీ సెక్రెటరీ లాంటి ఉద్యోగాలున్నాయి.
తెలుగు ప్రజలతో వ్యవహరించే ఉద్యోగాలే
ఇవన్నీ ఐ ఏ ఎస్‌ ,ఐ పి ఎస్‌ లాంటి ఉన్నతోద్యోగాలు కావు. తెలుగు ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగాలు. తెలుగు ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషణ చేయాలి. గ్రామ సామాజిక , ఆర్థిక వ్యవస్థ పై తగిన అవగాహన తెచ్చుకోవాలి. ప్రజా పరిపాలన పరిజ్ఞానం పెంచుకోవాలి. అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు, సూచనలు వినాలి, రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష లో తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి.
తెలుగు విద్యార్ధులకు ఎన్ని ఉద్యోగాలు?
ఈ ఉద్యోగాలలో తెలుగు మాధ్యమం ద్వారా డిగ్రీలు చేసిన వారికి ఎన్ని దక్కుతాయనేదే నేటి ప్రశ్న. జన్మభూమినీ మాతృభాషను మరువకండి అని పదే పదే తెలుగు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. మన తెలుగుకు ప్రాచీన భాష హోదా రాకుండా అడ్డుపడిన తమిళులతో పోరాడి మరీ సాధించారు. ప్రాచీన భాషా కేంద్రాన్ని కూడా తెలుగు నేలపైకి త్వరలో తేబోతున్నారు. ప్రజల భాషకు పరిపాలనలో పట్టం కడతామనే నాయకుల వాగ్దానాలు రెండు రా„షా్టల్ల్రోనూ వినబడుతున్నాయి. తెలుగును ఉపాధి వనరుగా మార్చాలని అందరూ కోరుతున్నారు. కొందరైతే ప్రజల భాష పదికాలాలపాటు పాలించాలని తపిస్తున్నారు కూడా. తెలుగు విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందేలా ప్రజా సేవ (పబ్లిక్‌ సర్వీస్‌) చేసే బంగారం లాంటి అవకాశం మన సర్వీసు కమీషన్లకు వచ్చింది.
తెలుగు మాధ్యమ అభ్యర్థులను ఆదరించాలి
2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాలు ప్రకటించిన విధానాలు చూస్తే తెలుగు ప్రాణం పోసుకొని తిరిగి లేస్తుందనిపించింది. కాల గమనంలో మన ఆశలు నీరుగారిపోయాయి. 2016లో కూడా మళ్ళీ అవే అంశాలపై అవకాశాలు అన్వేషిస్తున్నాం . తెలుగునాట తెలుగు మీడియం విద్యార్ధులకు పోటీ పరీక్షల్లో ఇంగ్లీషు చదువు వల్ల, విదేశాల్లో కొలువులవల్ల డబ్బు సంపాదన విపరీతంగా ఉంది కాబట్టే అటు జనం పరుగులు పెడుతున్నారు. ఇక్కడే ఉండి దేశ ప్రజలకే సేవ చెయ్యండి, విదేశాలకు పోకండి అని వావిలాల, కాళోజీ లాంటి మహనీయులు ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. వినటం లేదు. కారణం తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ, డబ్బు వస్తుంటే అప్పుడు కొందరైనా స్వార్థం కొంత చంపుకొని తెలుగులో విద్యభ్యాసం చేస్తున్నారు. భాషతో సాంకేతిక, ఆర్ధిక విషయాలను ముడిపెట్టకుండా అభివృద్ధి సాధ్యం కాదు. సమస్త వ్యవహారాలు మాతృభాషలో జరిగే దేశాలే అభివృద్ధి చెందుతాయి. భాష పేరుతో ఐక్యత కోరే వాళ్ళు ఆ భాషను బ్రతికించటానికి కూడా కృషి చెయ్యాలి. మాతృ భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే
ప్రోత్సాహకాలు కావాలి
తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు మనుగడకు దోహద పడుతుంది. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇస్తే, తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగపవ్రేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బతికి బట్టకడుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగును అమలు చేయాలనే పట్టుదల, ఆకాంక్ష ఉంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి. కేవలం తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వాడికి ఇంగ్లీషురాక పోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలోనయినా ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే భరోసా కల్పించాలి. భాషను ఉపాధికి సాంకేతికతకు ముడి పెట్టాలని దివంగత రాష్టప్రతి అబ్దుల్‌ కలాం అన్నారు.అంటే తెలుగు మాధ్యమంలో చదివినా కలెక్టరు, డాక్టరు, ఇంజనీరు కాగలిగే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి! తెలుగు మీడియంలో చదివిన విద్యార్ధులకు సర్వీసుకమీషను పరీక్షల్లో రిజర్వేషన్లో, ప్రోత్సాహక మార్కులో తిరిగి ఇప్పించటానికి కృషి చేస్తామని 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన ప్రకటన ప్రభుత్వ ఉత్తర్వుగా రావాల్సిఉంది.
తమిళనాడు భాషా విధానం అనుసరణీయం
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళ మీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమం లో చదివించరనీ ,ఎవరూ చదవని భాష నశిస్తుందనీ ,తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆభాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు .అందుకోసం అత్యవసరంగా ఒక ఆర్డినెన్‌‌స తెచ్చారు. శాసన సభలో, స్థానిక సంస్థల్లో ,ప్రభుత్వ కార్పోరేషన్లు, కంపెనీలలో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని శాసించారు.
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్‌ నంబర్‌ 145 డిపార్‌‌ట మెంట్‌ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నారు. చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది. ప్రమోషన్లలో కాకుండా ప్రభుత్వోద్యాగాలకు మొదటిసారిగా నేరుగా జరిపే నియామకాలకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.
తెలుగు రాష్ట్రాల ‘సర్వీస్’ కమీషన్ల కర్తవ్యం
తెలుగు మీడియంలో డిగ్రీ చదివిన వారికి తమిళనాడు తరహాలో 20% ఉద్యోగాలు రిజర్వేషన్‌ ఇవ్వాలి ఉమ్మడి రాష్ట్రంలో 1985 వరకు ఇచ్చినట్లు పోటీ పరీక్షల్లో 5% ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి. తెలుగు అభివృద్ధి మంత్రిత్వ శాఖల పెద్దలందరూ ఇలాంటి ప్రతిపాదనల అమలుకు ఆహ్వానం పలుకుతున్నారు. అడ్డుచెప్పటం లేదు. కాబట్టి తెలుగు నిరుద్యోగులకు ప్రోత్సాహకాలు అందజేసే మంచి అవకాశం సర్వీస్‌ కమీషన్లకు వచ్చింది. ఉద్యోగ నియామకాలు పూర్తయ్యే లోపు ఈ ప్రతిపాదనలను పబ్లిక్‌ సర్వీసు కమీషన్లు ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాలి.
----నూర్ బాషా రహంతుల్లా 9948878833
http://www.suryaa.com/news/opinion/edit-page/article.asp…
(విశాలాంధ్ర 14.11.2016)
 http://54.243.62.7/images_designer/article_docs/2016/11/13/mainall.pdf

2 కామెంట్‌లు: