27, జులై 2019, శనివారం

మేమేంతో మాకంత ఇవ్వండి -సామాజిక న్యాయం చేకూర్చే బీసీ బిల్లులు


సామాజిక న్యాయం చేకూర్చే బీసీ బిల్లులు

23.7.2019 న ఏపీలో అసెంబ్లీ సమావేశాల్లో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటుకు చట్టం చేసి బిల్లును ఆమోదించారు.అంతకుముందు  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ఓబీసీ ప్రైవేటు బిల్లుకు పది రాజకీయ పార్టీలు మద్దతిచ్చినా పార్లమెంటు యధాప్రకారం  మూజువాణి ఓటుతో తిరస్కరించింది. పార్లమెంట్‌లో బీసీల ప్రాతినిధ్యం ఎన్నడూ కూడా ఇరవై శాతానికి మించలేదు.చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్ల నుంచి బీసీలు కోరుతున్నారు. బీసీ కులాలు  జనాభాలో 52 శాతం ఉన్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉపాధి రంగాలలో బీసీలకు అగ్రకులాల వారితో పోటీపడే సత్తా లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లు జనాభా ప్రాతిపదికన వారికి చట్టసభల్లో సరైన స్థానం లభిస్తే తప్ప ఎదిగిరాలేరు. ఎస్సీ, ఎస్టీలు  రిజర్వేషన్ల వల్ల విద్య, ఉపాధి రంగాల్లో, చట్టసభల్లో ప్రవేశం పొందినపద్ధతి లోనే  బీసీలు కూడా రిజర్వేషన్లు కోరుకుంటున్నారు.మేమెంతో మాకంతఇవ్వండి అనే సామాజిక న్యాయం  కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు బీసీల్లోని పాముల,పంబల,కాటికాపరి, బుడబుక్కల, గంగి రెద్దుల, బుడగజంగాల లాంటి కొన్ని కులాలు మిగతా కులాలకంటే మరీ వెనుకబడే ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వం 123వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించింది. కానీ  ఓబీసీ బిల్లు పార్లమెంట్‌లో ఇంకా ఆమోదం పొందలేదు. జగన్‌ పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మొదటి బిల్లు వీగిపోయింది. దానిని కూడా గెలిపించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదించిన కీలకమైన అయిదు బిల్లుల్లో  నాలుగు బీసీలకు సంబందించినవే.1.రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు2.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు  నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు 3.నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు 4.నామినేటెడ్‌ పోస్టుల్లో, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో మహిళలకు 50 శాతం కోటా. చట్టసభల్లో, ఉద్యోగావకాశాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు బీసీలకు, మహిళలకు విద్య, ప్రభుత్వోద్యోగాల్లో కోటా కల్పించాయి.బీసీలకు కూడా రాజకీయ అధికారం కల్పించాలనే పోరాటం జరుతూనే ఉంది.ఆంధ్రప్రదేశ్ లో  మండల్‌ కమిషన్‌ సిఫార్సుల వల్ల బీసీలకు ఎనలేని మేలు జరిగింది. మళ్ళీ ఈ బిల్లు వల్ల  బీసీలకు మిగిలిన కొన్ని విషయాలలో లబ్ధి చేకూరుతుంది.
జగన్ కేబినెట్‌లో దాదాపు 60 శాతం మంత్రి పదవులు, అత్యంత కీలకమైన శాఖలు ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వడంతోపాటు స్పీకర్‌ పదవిని కూడా బీసీ వర్గానికే కేటాయించారు.ఇదే పద్ధతిలో గ్రామ స్థాయి వరకు రాజకీయ అధికారాల పంపిణీ బీసీలకూ అందించే ఉద్దేశం ఈ 5 బిల్లుల్లో కనిపిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో కోటా అమలు, ధ్రువీకరణ పత్రాలు పొందడం లాంటి వాటిలో ఎదురౌతున్న సమస్యలు తేల్చడానికి  శాశ్వత స్థాయి బీసీ కమిషన్‌ ఏర్పాటు, నామినేటెడ్‌ పోస్టులనూ,నామినేషన్లపై ఇచ్చే పనులూ  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వటం,అందులో మహిళలకు 50 శాతం కోటా ఇవ్వటం తప్పనిసరిగా  బీసీల అభ్యున్నతికి తోడ్పడుతుంది.
పెరుగుతున్న బీసీ కులాలు-పెరగని రిజర్వేషన్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2005లో 93 కులాలున్న బీసీ కులాల జాబితా ఇప్పుడు 144 కి చేరింది. గ్రూపు లోని54 కులాలకు 7 శాతం, గ్రూపు బీలోని 28 కులాలకు 10 శాతం, గ్రూపు సీలోని 1 కులానికి 1 శాతం, గ్రూపు డీలోని 47 కులాలకు 7 శాతం, గ్రూపు లోని 14 కులాలకు 4 శాతం కలుపుకొని మొత్తం 29 శాతం రిజర్వేషన్లు అమలౌతున్నాయి. రాజకీయ లబ్ధికోసం రిజర్వేషన్లు పొందే కులాల సంఖ్య పెంచుతున్నారు. కోటా వాటా పెంచకుండానే రిజర్వేషన్ల జాబితాలో కొత్తకులాలు చేరుస్తున్నారు. బీసీ కులాల మధ్య అంతర్గత విద్వేషాలు రేగుతున్నాయి. సుప్రీంకోర్టు రిజర్వేషన్లమీద 50 శాతం  పరిమితిని విధించింది. తమిళనాడులో 69 శాతం ,కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.వివిధ కులాల జనాభా దామాషా ప్రకారం ఆయా కులాలకు రిజర్వేషన్ల కోటా దక్కేలా చట్టం చేయాలని ,వెనుకబడిన కులాలలో అభివ్ఱుద్ధి చెందిన కులాలను గుర్తించి కాలక్రమంలో వడపోసి మరీ వెనుకబడినకులాలకు మాత్రమే రిజర్వేషన్ల ఫలితాలు దక్కేలా చేయాలని ఇప్పుడు మరీ బడుగు కులాల వాళ్ళు కోరుతున్నారు.
ముదిరాజ్‌ కులాన్ని బిసి డిగ్రూపులో నుంచి- బిసి గ్రూపులోకి మార్చటం,ముస్లింలను బిసి ఇ గ్రూపులో చేర్చటం, కాపుల్ని బిసిల్లో చేరుస్తామని హామీలివ్వటం,ఇంకా కొన్ని కులాల గ్రూపులు మార్చటం ,కొన్ని కులాలను జాబితాలోనుంచి తీసేయబూనటం వలన రకరకాల గొడవలు చెలరేగాయి.
రిజర్వేషన్ల కోటాను పెంచకుండా జాబితాలో కొత్త కులాలను చేర్చుకుంటూ పోవటం పట్ల  బీసీలు కంటగింపుగా ఉన్నారు.కొత్తగా బలమైన కులాల చేరికవలన ఇప్పటికీ ఎదిగిరాలేక  బలహీనంగా ఉండిపోయిన చిన్నకులాలు ఇక ఎదిగిరావటం కల్ల అంటున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అన్ని బీసీ కులాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చలేదు. కేంద్రం గుర్తించిన ఒబిసి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ కులాలు 107 మాత్రమే గుర్తింపు పొందాయి. మహారాష్ట్రలో 261 ,ఒడిషా లో 200,కర్ణాటకలో 195,తమిళనాడులో 180,బీహార్ లో 133,జార్ఖండ్ లో 127,అస్సాంలో 124,కులాలు ఓబీసీ జాబితాలో చేరితే ,ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 107 కులాలే కేంద్రజాబితాలో చోటు చేసుకోగలిగాయి.
2021 జనాభా లెక్కల్లో బీసీల కులాల వారీ జనాభా గణాంక వివరాలు సేకరించి ఆ గణాంకాలను బట్టి  స్థానిక సంస్థలు , చట్టసభలలో రిజర్వేషన్‌లు ఇవ్వాలని కోరుతున్నారు .
అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి
కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని,బీసీ డిక్లరేషన్‌ ప్రకటించింది గతంలో తెలుగుదేశంప్రభుత్వం. బీసీ మోడీ ప్రధాని కావడం ఖాయం అన్నది బిజెపి.బీసీలు చట్టసభల్లో పాగా వేయాలి అంది టీఆర్ ఎస్. బీసీలకు పార్టీలు టిక్కెట్లు ఇవ్వటం సరిపోదు . బీసీలకు అందరం కలిసి ఇస్తామన్న 100 అసెంబ్లీ పార్లమెంటు సీట్లు ఏ నియోజకవర్గాలు కేటాయించాలో ఉమ్మడిగా నిర్ణయిద్దామా అని వైఎస్సార్ పార్టీ మిగతా పార్టీలకు సవాలు విసిరారు.
వెనుకబడిన కులాల అసంతృప్తి ఏమిటి?
భారత రాజ్యాంగం పీఠికలోనే సామాజిక న్యాయాన్ని ప్రధమ లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ 50 శాతానికిపైగా వున్న బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం భూమి పంపిణీలో, బడ్జెట్ కేటాయింపుల్లో, బ్యాంకులు  అందించే రుణాల్లో, కీలక పదవుల్లో, న్యాయంగా రావలసిన వాటాలు బీసీలకు రావడం లేదు. నిరంతర శ్రామికులై తమ శ్రమతో జాతి సంపదని సృష్టిస్తోన్న బీసీలు ,ముస్లిం మైనారిటీ ప్రజలు రానురాను ఎస్సీ ఎస్టీ లకంటే కటిక దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. ఏ పార్టీ కూడా పెద్దగా ఒరగబెట్టింది ఏమీలేదు. మేమే ఒక  రాజకీయ పార్టీ స్థాపించుకోవాల. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కలిసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల డిమాండ్ అరణ్యరోదనగానే మిగిల్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోటా బిల్లును అటక మీదే ఉంచాయి. బీసీలకు చట్టసభల్లో మూడోవంతు స్థానాలు రిజర్వు చేయాలని రాష్ట్ర శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసినా, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టలేదు. బీసీలకు టిక్కెట్లు ఇచ్చినా, వారిని గెలిపించుకొనే బాధ్యత ఆ పార్టీలు స్వీకరించడం లేదు. బీసీ అభ్యర్థులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించడం లేదు.
హైదరాబాదులో 15.12.2013 న జరిగిన బీసీల సింహగర్జన సభలో కూడా  పార్లమెంటు, అసెంబ్లీల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనీ , బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలనీ, బీసీ ఉద్యోగులకు ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లను అమలు చేయాలనీ,పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 50 శాతానికి పెంచాలనీ, కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలనీ ,  బీసీ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించి,అమలులోకి తేవాలనీ కోరారు. 
పార్లమెంటులో గానీ, శాసనసభలో గానీ ఇంకా ప్రాతినిధ్యమే దక్కని బీసీ కులాలకు  అవకాశాలు కల్పించాలి. బీసీలకు ఉప ప్రణాళిక ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
దళిత ముస్లిములు, దళిత క్రైస్తవులు బీసీలుగా
దళితుల కంటే ముస్లీములు ఇంకా ఎక్కువ పేదరికంలో మగ్గుతున్నారని సచార్‌ కమిటీ చెప్పింది.  రాజేందర్ సచార్, రంగనాథ్‌మిశ్రా సిఫారసులను అమలు చేయలేదు.దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు వర్తింప చేసిన విధంగానే రిజర్వేషన్‌లను దళిత ముస్లింలకు, దళిత క్రిస్టియన్‌లకు వర్తింపచేయలేదు. 1901 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ముస్లింలలో 133 కులాలను గుర్తించారు.1911,1932,1935 సంవత్సరాల్లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన జనగణన తర్వాత 96 కులాలను దళిత ముస్లింలుగా షెడ్యూల్డ్ చేసి, వీరికి 1936 నుంచి ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు కల్పించింది. వీటిని దళితముస్లిం వర్గాలు 1950 జూలై వరకు పొందారు. కానీ 10- 08-1950 న కాన్సిట్యూషనల్(షెడ్యూల్డ్ కాస్ట్,ప్రెసిడెన్సియల్) ఆర్డర్‌ తో దళిత ముస్లింలకు, క్రిస్టియన్‌లకు, సిక్కులకు, బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించకుండా చేశారు.ఆ తరువాత వీరిని ఓబీసీలుగా చేశారు. నాటి నుంచి దళిత ముస్లింలే కాకుండా దళిత సిక్కులు,దళిత క్రిస్టియన్‌లు రిజర్వేషన్లకు దూరం చేయబడ్డారు.
బీసీలలో మరీ వెనుక బడ్డ కులాల ఉద్ధరణ
బీసీలలో జనాభా ఎక్కువగా ఉండి, రాజకీయ శక్తులను భయపెట్టగలిగే కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లాభపడుతూ ఉండగా, జనాభా తక్కువగా ఉండి, రాజకీయ నాయకత్వమే లేని కులాలు నష్టపోతున్నాయి. అందువలన శక్తివంతమైన కులాలను, శక్తిహీనమైన కులాల సరసన ఉండకుండా వేరు చేయాలి. ఆ విధంగా శక్తిమంతమైన కులాలు, శక్తిహీనమైన కులాలకు అడ్డురాకుండా కాపాడాలి. శక్తిమంతమైన రాజకీయ పలుకుబడి గల కులాలను అంతకంటే  క్రిందివరస  వర్గంలోకి చేర్చాలి.అలాంటి నిరంతర వడపోత , పునర్వర్గీకరణ పద్ధతి ద్వారా కొంత కాలానికి రిజర్వేషన్లు అక్కరలేదని ఎత్తివేసే పరిస్థితి రావాలి. బాలసంతు, బుడబుక్కల, దాసరి,దొమ్మరి, గంగిరెద్దుల, జోగి, జంగం,కాటిపాపల, మందుల, మొండిబండ,పంబల, పాముల, పెరికి ముగ్గుల, పిచ్చిగుంట్ల,వీరముష్టి ,మెహతార్, అచ్చుకట్ల వాళ్ళు, దేవాంగులు, దూదేకుల,జాండ్ర, కరికాల భక్తులు,సెగిడి, తొగట, ఆగరు, ఆరెకటిక, చిప్పోళ్లు,కొడమి, జక్కల, జింగారు,కచ్చి, కండ్ర, కొష్టి, మాలి, నెల్లి,పస్సి, పూసల, సాతాని, అత్తరు సాయిబులు,తురక చాకలి, నాయి ముస్లిమ్,గంటా ఫకీర్లు,గారడీ సాయిబులు,పకీరుసాయిబులు,ఎలుగుబంటు వాళ్లు,కుక్కుకొట్టె జింకసాయిబులు,కూడా శాసన సభల్లో ప్రవేశించాలంటే ఇప్పటికే బీసీలలో ఎదిగొచ్చిన కులాలను మరీ వెనుకబడిన కులాలకు అడ్డంరాకుండా తొలగించాలి.కనీసం రొటేషన్ పద్ధతి అయినా పెట్టి అన్నీ కులాలకూ రిజర్వేషన్ ఫలితం అందేలా చెయ్యాలి.ఉమ్మడి ప్రయోజనం కోసం భారీ చాకిరీ చేసినా చివరికి అమృతం దక్కలేదనే ఆవేదనతో,మోసపోయామనే బాధతో ఆనాడు కొందరు రాక్షసుల్లాగా మారిపోయారు.భావిషత్తులో ఈ కులాలపోటీ ఎక్కువౌతుంది.
 కులాలను వడపొయ్యాలి
 శాశ్వత బీసీ కమిషన్ వేశారు కాబట్టి వెనుకబడిన తరగతులలోని శక్తిమంతమైన కులాలను ప్రతి అయిదేళ్ళకొకసారి వడపోయించాలి. బలహీన కులాల అభివృద్ధి కోసం కులాల పేరు పేరు వరుసన నిధులు కేటాయించి సబ్ ప్లాన్ తరహాలో అవి వారికే అందేలా చూడాలి. అయిదేళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఆ కులం స్థాయి సాంఘికంగాను, ఆర్ధికంగాను,రాజకీయంగానూ బాగుపడాలి. ఆ విధంగా కాలక్రమేణా రిజర్వేషన్ల చట్రంలో నుండి బాగుపడ్డ అన్ని కులాలు తొలగిపోవాలి. కులం పేరు మీద ఇక ఎవ్వరూ రిజర్వేషన్ కోరలేని పరిస్థితి రావాలి. అన్ని కులాలలోని పేదలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే ఒక శాస్త్రీయ దృక్పథం ఏర్పరచుకోవాలి.ప్రభుత్వం ఇక మీదట రూపొందించే పధకాలు ఆయా కులాలలోని ధనవంతులను తప్పించి, నిరుపేదలను ఉద్ధరించేలా ఉండాలి. కులానికి పేదలైన వారిలోనే కూటికి పేదలైన వారికి నిధులు చేరాలి.
వర్గం
మొత్తం కులాల సంఖ్య
గ్రూపులో కొంత మెరుగైన కులాలు
మరీ వెనుకబడిపోయిన శక్తిహీన కులాలు
వెనుకబడిన తరగతులు ' ' గ్రూపు
54
అగ్నికుల క్షత్రియ,నాయీబ్రాహ్మణ, మేదరి, మంగలి, వడ్డెర,రజక
బాలసంతు, బుడబుక్కల, దాసరి,దొమ్మరి, గంగిరెద్దుల, జోగి, జంగం,కాటిపాపల, మందుల, మొండిబండ,పంబల, పాముల, పెరికి ముగ్గుల, పిచ్చిగుంట్ల,వీరముష్టి ,మెహతార్ మొదలైన కులాలు
వెనుకబడిన తరగతులు ' బి ' గ్రూపు
28
 గౌడ, కుమ్మర,పద్మశాలి, పెరిక బలిజ, విశ్వబ్రాహ్మణ, కురుమ
 దేవాంగులు, దూదేకుల, జాండ్ర, కరికాల భక్తులు,సెగిడి, తొగట మొదలైన  కులాలు
వెనుకబడిన తరగతులు ' సి ' గ్రూపు
1
క్రైస్తవులుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారు

వెనుకబడిన తరగతులు ' డి ' గ్రూపు
47
భట్రాజులు, కళావంతులు,కొప్పులవెలమ, కృష్ణ బలిజ,ముదిరాజులు, మున్నూరు కాపులు, గవర,ఉప్పర, యాదవ,వాల్మీకి
ఆగరు, ఆరెకటిక, చిప్పోళ్లు,కొడమి, జక్కల, జింగారు,కచ్చి, కండ్ర, కొష్టి, మాలి, నెల్లి,పస్సి, పూసల, సాతాని మొదలైన  కులాలు
వెనుకబడిన తరగతులు '  ' గ్రూపు
14
 షేక్,అచ్చుకట్లవాండ్లు, లబ్బి ,
అత్తరు సాయిబులు,తురక చాకలి, నాయి ముస్లిమ్,గంటా ఫకీర్లు,గారడీ సాయిబులు ,పకీరుసాయిబులు,ఎలుగుబంటు వాళ్లు,కుక్కుకొట్టె జింకసాయిబులు,మొదలైన  కులాలు

వాటా పేదల జనాభా నిష్పత్తిలో ఉండాలి
కోటా పెంచకుండా 93 కులాల బీసీ కులాల జాబితాని 144 కి పెంచారు. మురళీధర రావు కమిషన్‌ 1986 లో బీసీల  కోటా 44 శాతానికి పెంచాలని సిఫార్సు  చేసినా కోటా ఇప్పటికీ 29 శాతమే ఉంది. 50 శాతం సీలింగ్‌ వలన పంచాయితీరాజ్‌ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కోటాను 24 శాతానికి తగ్గించారు. పరిమితిని జనాభా దామాషా ప్రకారం  పెంచుతూ  పార్లమెంట్‌లో చట్టం చెయ్యాలని దేశవ్యాప్తంగా  డిమాండు ఉంది . కులాలను వడపోయకుండా ఇలా శాశ్వతంగా రిజర్వేషన్లను కొనసాగిస్తే మరీ అడుగునబడిపోయిన కులాలు పైకి లేవనే లేవలేవు.ఇలాంటి పద్ధతి అట్టడుగు కులాలకు ఎప్పటికీ అన్యాయం చేసినట్లే అవుతుంది.
 
n  నూర్ బాషా రహంతుల్లా 6331483266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి