29, జనవరి 2021, శుక్రవారం

మ‌ద‌న‌ప‌ల్లి నుంచి మండ‌పేట వ‌ర‌కూ..!రాజ్య‌మేలుతున్న మూఢ న‌మ్మ‌కాలు

 


మూఢనమ్మకాల నిర్మూలనపై చట్టం రావాలి

 https://vyus.in/?p=10006

మదనపల్లెలో క్షుద్రపూజలు చేసే విద్యావంతులైన తల్లిదండ్రులు తాము కని పెంచిన ఇద్దరు ఆడపిల్లలను దారుణంగా, క్రూరంగా చంపారు.చంపిన వారిలో పశ్చాత్తాపం లేకపోగా మానసిక రోగుల్లాగా పిల్లలు మళ్లీ బతికొస్తారంటున్నారు. వారం రోజులుగా ఇంట్లో మంత్రగాడితో క్షుద్రపూజలు చేయించారు. ముగ్గురూ నగ్నంగా ఇంట్లో పూజలు చేశారు.ముగ్గు తొక్కినప్పటి నుంచి కూతురిలో మనోదుర్భలం వచ్చిందన్నారు. దయ్యం వీడుతుందంటూ కూతురిని తల్లి డంబెల్‌తో కొట్టి చంపింది . చెల్లి ఆత్మను తెస్తాను నన్నూ చంపమ్మా అన్నదట పెద్దమ్మాయి. నేనే పార్వతిని.. కాళికను. బిడ్డలిద్దరూ పుణ్యలోకాల్లో ఉన్నారు.వారిని బయటకు తీసుకొస్తానంటూ అరిచిందట తల్లి. ఆధ్యాత్మిక మూఢత్వమే వారి ప్రాణాలు తీసింది! అన్నీ మతాలలో మూఢనమ్మకాలు చదుకున్నవాళ్లలో కూడా తీవ్రంగా వ్యాపించాయి.నూనెలు తావీజుల స్థాయి దాటిపోయింది.


 

ప్రక్కరాష్ట్రం కర్ణాటక మూఢనమ్మకాలు,‘అమానవీయ సాంఘిక చర్యలు, చేతబడి నివారణ, నిర్మూలన బిల్లును 2017 లోనే తెచ్చ్గింది. జాతీయ మహిళా కమిషన్‌ సూచనతో ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బిహార్‌, అసోం, మహారాష్ట్రలు మూఢనమ్మకాల్ని నిరోధించే చట్టాల్ని ప్రవేశపెట్టాయి. భారత రాజ్యాంగంలోని 51-A (h) పౌరుల ప్రాథమిక విధుల ప్రకారం ‘‘ప్రతి పౌరుడు ఇతరులలో శాస్త్రీయ దృష్టినీ, మానవతా వాదాన్నీ, పరిశోధనాసక్తినీ, సంస్కరణాభిలాషను పెంపొందించేందుకు కృషిచేయాలి.’’ మూఢ, అనాగరిక విశ్వాసాలకు వ్యతిరేకంగా పౌరులందరూ ప్రచారం చేయాలి. నిష్కారణంగా నరేంద్ర ధబోల్కర్‌, కల్బుర్గీ, పన్సారే, గౌరీ లంకేశ్‌ లాంటి మేధావులను మూఢనమాకాల దుండగులు హతమార్చారు. జయలలిత,బీజేపీ మీద విపక్షాలు చేతబడి చేయించారని ఎంపీ ప్రజ్నాసింఘ్ లాంటివారు వాపోతే దమ్ముంటే నాపైన చేతబడి చేయండని మంత్రి కామినేని శ్రీనివాస్ సవాలు విసిరారు. నేటికీ కొందరు మోసగాళ్ళు మంత్రాలతోనే రోగాలు నయంచేస్తామనీ, ఎలాంటి పరికరాలూ లేకుండా ఒట్టి చేతులతోనే శస్త్ర చికిత్సలు చేసి శరీరంలోని కణుతులను తీసేస్తామని మోసంచేస్తున్నారు. దెయ్యం విడిపిస్తామంటూ జనాన్ని చిత్రహింసలకు గురిచేయడం, గుప్త నిధులకోసం నరబలులూ, క్షుద్రపూజలు చేయడం, నగ్న పూజలు, గర్భంలోని శిశువు ఆడపిల్ల అయితే మగపిల్లవాడిగా మార్చేస్తామనే పేరుతో మోసాలు చేస్తున్నారు , అగ్నిగుండాలలో నడుస్తున్నారు. కొన్ని దేవాలయాలలో తమ దుష్కర్మలు నశిస్తాయనీ, రుగ్మతలు తొలగిపోతాయని చెప్పేమడె స్నాన’ ‘పులివిస్తర’ (ఎంగిలాకు), దురాచారాన్ని నిషేధించినా బాణామతి చేతబడి పేరిట చాలా దౌర్జన్యాలు, మోసాలు జరుగుతున్నాయి.తమకు లొంగని కుటుంబాన్ని సాధించదలచిన గ్రామ పెత్తందార్లు ఆ అమాయకుల ఇండ్ల ముందు తమ మనుషులతో రాత్రికి రాత్రే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేయించి, వారికి మంత్రగాళ్లనే ముద్రవేసి, వారి జుట్టు గొరిగించి, పళ్ళు ఊడగొట్టించి వీధుల్లో నగ్నంగా ఊరేగించి కసి తీర్చుకుంటున్నారు.చేతబడి చేస్తామని కొందరు , ఇతరులు చేసిన చేతబడిని తిరగగొడతామనీ ఇంకొందరు సొమ్ముచేసుకుంటున్నారు.


 పక్షవాతం కారణంగా కోమాలో ఉన్నవారిని ఎవరో చేతబడి చేసిన కారణంగానే వారలా అయ్యారని చెబుతున్నారు. కొందరు అమ్మలూ, అవధూతలూ, బాబాలూ, స్వాములూ, రాజకీయ దళారులు,డేరా బాబాలు అత్యాచారాలు చేస్తున్నా ,స్వామిజీలను ఆధ్యాత్మిక గురువులను, బాబాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అత్యాచారి నిత్యానందస్వామి పోలీసులకు చిక్క కుండా విదేశాలకు వెళ్లి ఏకంగా ఒక ద్వీపాన్నే కొనుగోలు చేసి అక్కడ స్వతంత్రంగా కైలాస రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు.మరికొందరు స్వామిజీలు, బాబాలు జైళ్లల్లో కాలం గడుపుతున్నారు. కొందరు చేసే వికృతచేష్టలు అమాయకుల ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. మంత్రాల పేరుతో రోగాలను నయం చేస్తామంటూ కిందపడేసి తొక్కుతున్నారు , వాతలు పెడుతున్నారు , ఇష్టానుసారంగా కొడుతున్నారు. కోరికలు లేని మనిషి లేడు. కోరికలు పెరుగుతూనే ఉంటాయి. రకరకాల కోరికలతో మనశ్శాంతి కోసం ఇంగ్లీషు మాట్లాడే స్వామీజీలను బాబాలను ఆశ్రయిస్తున్నారు.భైరవకోనలో గుప్తనిధులకోసం అమావాస్య నాడు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు.ఆలయఅధికారిని సస్పెండ్‌ చేశారు. కదిరి కొర్తికోటలో క్షుద్రపూజలు చేస్తూ ముగ్గురిని బలి ఇచ్చారు. చేతబడులు క్షుద్రపూజలతో దేశంలో వేల హత్యలు జరిగాయి.పుత్రసంతానం కోసం చిన్నారులను బలి ఇవ్వాలన్న భూతవైద్యుడి సలహాతో పసికందులను పొట్టనపెట్టుకున్నారు.భార్య ఆరోగ్యంకోసం, పక్షవాతం నయమౌతుందని, కొడుకు పుట్టాలనే ఆశతో యాగంచేసిమరీ పసిపాపలను బలి ఇచ్చారు.కొత్త పొక్లైయినర్‌కు నరబలి , గంగాలమ్మ తల్లికి ఒక మహిళను బలిచ్చారు.అత్యాచారం చేసినతరువాత మహిళలను తగలబెడుతున్నారు.క్షుద్రపూజలు బలుల నివారణ పై జాతీయ స్థాయిలో చట్టం కోసం కేంద్రమూ సన్నాహాలు చేసింది . అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. క్షుద్రపూజలు చేస్తామంటూ వచ్చి ఇంట్లో సొమ్మంతా దోచుకుపోయిన దొంగలను పట్టుకోటానికి కూడా పోలీసులు తటపటాయిస్తున్నారు. దీనిపై ప్రత్యేక చట్టం లేనందున పోలీసులు కూడా దీన్ని నేరం కింద పరిగణిచలేకపోతున్నారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, క్షుద్రపూజలు చేసినవారిపై కేవలం మోసం కేసు మాత్రమే పెట్టగలుగుతున్నారు. గతంలో కొంతమంది ఎంపీలు మాత్రం ప్రజలు ఇంతలా మోసపోతున్నా, భాదపడుతున్నా ఎందుకు చట్టం తేలేదని ప్రశ్నించారు. ఇంకా బిల్లు రావాలి. దేవుళ్లకు, దెయ్యాలకు బలులిస్తే తమ కోరికలు నెరవేరుతాయని ఇప్పటికీ కొంతమంది జనం నేరమనస్తత్వంతో నమ్ముతున్నారు. జంతువులు కన్నా నరబలి ఇస్తే తమ కోరికలు నెరవేరుతాయనే మూఢత్వంతో ఉన్నారు. మనిషిలో శాస్త్రీయ దృక్పథం పెరగాలి. ఇలాంటి బలుల మూఢత్వాన్ని తిప్పికొట్టాలి.మూఢ విశ్వాసాలు తాము చేస్తున్నది ఏమిటో కూడా తెలియనంతగా మనిషిని లొంగదీసుకుంటాయి. ఇలాంటి అమానుష చర్యలు తప్పుకావని, ఫలానా గ్రంథంలో ఉంది , ఫలానా శాస్త్రంలో ఉంది అంటూ సమర్ధించుకునే మానసిక స్థితి వారిలో ఉంటుంది. శాస్త్రవేత్తలు శ్రీహరికోట చంద్రయాన్‌ గురించి తిరుపతి, శ్రీరంగం వెళ్లి గొప్పగా చెబుతున్నారు. కొందరు ఈనాటికీ గోమూత్రం, రంగు రాళ్లు, వాస్తు, కొండదొరల జోస్యాలు సినిమాలు, టివి సీరియళ్లలో  మానవాతీత  పరలోక పరకాయ ప్రవేశాలు , మూఢత్వ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు.సత్యలోకం వచ్చిందనీ,శవాలు గంతులేస్తాయనీ బాబాలు చెబితే నమ్ముతున్నారు.పహాడీ షరీఫ్ లో ఆవు కూడా చెలరేగి కొందరిపై దాడి చేసిందట.మానసికంగా చెలరేగితే దివ్య పశువులూ మనిషికి హానిచేస్తాయని గ్రహించాలి.పిల్లలకు దిష్టితీసి వెంట్రుకలతాళ్లు తాయెత్తులు కట్టి పసివయసునుండే మూఢనమ్మకాలకు అలవాటు చేస్తున్నారు. మంత్రగత్తెలను , మంత్రగాళ్ళను కొట్టిచంపుతున్నారు. మదనపల్లి సంఘటన చూశాకనైనా జంతుబలి, నరబలి, మూఢత్వ నిర్మూలనకు చట్టం తేవాలి.విజ్నానులతో నిండిన దేశాభివృద్ధికోసం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చదువులు రావాలి .

---నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266






   

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి