26, జనవరి 2021, మంగళవారం

పేదవాళ్లకూ స‌త్వ‌ర న్యాయం! న్యాయం త్వరగా జరగాలి

 


పేదవాళ్లకూ స‌త్వ‌ర న్యాయం! న్యాయం త్వరగా జరగాలి
https://vyus.in/?p=9773 (వ్యూస్ 21.1.2021)
అప్పుడే స‌మ‌స‌మాజ స్థాప‌న‌
ప్రభుత్వాలు వున్నది పేదల సంక్షేమం కోసం. రాజ పోషకులైన కార్పొరేట్ల క్షేమంతోపాటు పేదల సంక్షేమం కూడా ముఖ్యం.సకాలంలో న్యాయం అందకపోతే ప్రజల్లో అసంతప్తి, తిరుగుబాటు తలెత్తుతాయి. నూతన పార్లమెంటు భవనంగానీ తెలంగాణ అసెంబ్లీ భవనం కానీ, చంద్రబాబు అమరావతి నిర్మాణం కానీ ప్రజల ఆలోచనలు అటు మళ్ళించాయి. కట్టబోయే పార్లమెంటు భవనం సుఖ సంతోషాల స్వగృహమే అన్నారు ముఖేష్‌ అంబానీ. ఆ నవీన భారత దేవాలయంలో ప్రజల సమస్యలు చర్చిస్తారు. ఇక్కడ తేలని విషయాలు మాత్రమే న్యాయస్థానానికి వెళతాయి. నాగార్జున సాగర్‌, భాక్రానంగల్‌ , బిహెచ్‌ఇఎల్‌, స్టీల్‌ ప్లాంట్‌ వంటి నవీన దేవాలయాల ద్వారా లక్షలాదిమంది ప్రజలు ఉపాధి పొందారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పటేల్‌ విగ్రహం గానీ, రామమందిర నిర్మాణం వలన గానీ అద్భుత భవనాలతో ప్రజల ఆకలి తీరదు. ప్రజలకు ఉపాధి కల్పించాలి. ప్రజల అవసరాలు తీర్చాలి. న్యాయవ్యవస్థలో మహిళ లకు అతి తక్కువ ప్రాతినిధ్యం వున్నదని ఈ పరిస్థితిని మార్చాలని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ సుప్రీం కోర్టులో సూచించారు. సుప్రీం కోర్టులోనూ, వివిధ హైకోర్టుల్లోనూ మొత్తం న్యాయమూర్తుల పదవులు 1,113 వుంటే అందులో కేవలం 80 మంది మాత్రమే మహిళలు. సుప్రీంకోర్టులో 34 న్యాయమూర్తుల పదవులుంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా దేశంలో మహిళా న్యాయమూర్తులు తగిన సంఖ్యలో లేరని చెప్పారు. జస్టిస్‌ ఫాతిమా బీవీ 1989లో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి. తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ భానుమతి , జస్టిస్‌ ఇందిరా బెనర్జీ మాత్రమే వున్నారు. ఇంతవరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళలు లేనేలేరు. సమాజంలో నిత్యం ఏవో సమ స్యలు, సంక్షోభాలూ తప్పవు. వాటికి ఎప్పటికప్పుడు మెరుగైన పరిష్కారాలు సాధించాలి. సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అందరిలోనూ నమ్మకం కలగాలి.
వివ‌క్ష‌కు వ్య‌వ‌స్థ అతీతం కావాలి
కులం, మతం, ప్రాంతం, జెండర్‌ వంటి వివక్షలు ఏ వ్యవస్థలోనూ కొనసాగకూడదు. సైన్యంలో పురుషులతో సమానంగా మహిళలకు బాధ్యతలు అప్పగించాలని, లైన్‌మన్‌ పోస్టులకు మహిళలనూ పరిగణించాలనీ న్యాయవ్యవస్థ మంచి తీర్పులు వెలువరించింది. న్యాయ వ్యవస్థలోనే వేళ్లూనుకున్న లింగ వివక్షను నిర్లక్ష్యం చేయకూడదు. ఒక సమాజం సాధించిన ప్రగతి మహిళలు సాధించిన ప్రగతినిబట్టే అంచనా వేస్తానని డాక్టర్‌ అంబేడ్కర్‌ అన్నారు. న్యాయస్థానాల్లో వ్యాజ్యాల పరిష్కరణ ప్రక్రియ ఏళ్లూపూళ్లూ పట్టి కక్షిదారుల్ని కుంగదీస్తోంది. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వృద్ధుల పరిస్థితి మరింత దుర్భరమవుతోంది. వ్యాజ్యాలు ఏళ్లపాటు పెండింగులో పడి ఉంటున్నాయి. వృద్ధుల కేసుల్ని త్వరగా పరిష్కరిస్తేనే సముచిత గౌరవం ఇచ్చినట్లవుతుంది. ఎనభై ఆరేళ్ల విశాఖ వాసి తప్పుడు ఆరోపణలతో భర్తను విధులనుంచి తప్పించిన కళాశాల యాజమాన్యంపై మూడున్నర దశాబ్దాల న్యాయపోరాటం చేసి గెలిచింది. జమునాలాల్‌ పటేల్‌, మోతీలాల్‌ పర్మార్‌ లాంటి ఎందరో సీనియర్‌ పౌరుల దురవస్థ చూడాలి. వయసు మీదపడే కొద్దీ అనారోగ్యం, నిస్సహాయత, కుటుంబ క్లేశాలు, సంతానం దగ్గర లేరన్న బాధ, ఉన్నానిరాదరణకు గురైన అశక్త భావన, తగిన జీవనాధార లేమి అన్నీ వృద్ధాప్యంలో చుట్టుముట్టే సమస్యలే. ఆ దశలో వ్యాజ్యాలు తక్షణ పరిష్కరణకు నోచుకోనట్లయితే, వారికి కోర్టులూ అన్యాయం చేసినట్లే!
వృద్ధుల‌కు భ‌ద్ర‌త అవ‌స‌రం
అరవై ఏళ్ల వయసుకు పైబడినవారి సంఖ్య దేశ జనాభాలో 20 శాతం.వృద్ధులకు ఆహార, ఆరోగ్య, ఆర్థిక, న్యాయ భద్రత కల్పించాలి. సుప్రీంకోర్టు నిర్దేశాల అనుసారం 60 ఏళ్లకు పైబడినవారి కేసుల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలి. వ్యాజ్యాలు అపరిష్కృతంగా పేరుకుపోతున్నాయి! దేశంలో సివిల్‌ కేసులు నిర్ణాయక దశకు చేరడానికి పదిహేనేళ్లు పడుతుండగా, క్రిమినల్‌ కేసుల పరిష్కారానికీ ఏడేళ్ల వరకు నిరీక్షణ తప్పడంలేదు. దేశవ్యాప్తంగా అపరిష్కృత వ్యాజ్యాలు 3.20కోట్ల మేర ఉండగా, అందులో 83వేలకుపైగా 30 సంవత్సరాలకు పైబడినవే. అన్నేళ్లు న్యాయ పోరాటంలో మగ్గిపోయినవారు జీవిత చరమాంకంలోనైనా నిరీక్షణ ఫలాలు పొందుతారా? కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల కోసమే మంచి ఉద్దేశంతో చేసినా’ కోర్టులు చట్టపరంగా రక్షణ కల్పించలేవు.ఎవరికి వారే న్యాయవాదులు , న్యాయమూర్తులుగా, న్యాయాన్ని అమలు చేసే అధికారులుగా మారతారు. ఆంధ్రప్రదేశ్‌ రూ. 3.73 లక్షల కోట్ల అప్పులో ఉన్నా అమరావతి శంకుస్థాపనకు మట్టి, నీరు తెచ్చిఓదార్చిన పద్ధతిలోనే ప్రధాని మోడీ ‘దేశమంటే మట్టి కాదోయ్ ‘ అని గురజాడ పద్యం పాడి తెలుగువారిని మెప్పించారు.
అరాచ‌కాలు అనేకం
ఉత్తరకొరియాలో సరిగా కూర్చోలేదని ఒక మంత్రిని కాల్చి చంపారు. థాయ్ లాండ్‌లో రాచరికాన్ని దిక్కరించిందని అక్కడి ఒక మహిళా ఉద్యోగినికి 43 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మనదేశంలో ఇంకా ఖాఫ్ పంచాయతీలు ,గ్రామపెద్దల మొరటు తీర్పులు కొనసాగుతున్నాయి.చెట్టుకో స్తంభానికో కట్టేసి నేరగాళ్లని అనుమానించి కొట్టిచంపిన సంఘటనలు చాలా చోట్లజరిగాయి.
దుష్టుడు తిన్నగా ఉండడు. మంచివాళ్ళను బాధిస్తాడు. తనపాటికి తాను మర్యాదగా మంచిగా బ్రతికేవాడిపై దుష్టుడు దౌర్జన్యం చేసి దోచుకుంటాడు.అదేమని అడిగితే తగాదా పెట్టుకొని దూషించి హింసిస్తాడు. హానికితోడు అవమానం జరిగిందని మంచివాడే బాధపడుతున్నాడు. బుద్ధుడు మరొకరిని హింసించి ఆనందించడం పాశవికమైన చర్య కాబట్టే దుష్టుడికి దూరంగా ఉండమన్నాడు. క్రూరజంతువులకు దూరంగా తప్పుకొని సాధుజంతువులు బ్రతుకుతున్నట్లు, క్రూరుడి బలానికి దుర్మార్గానికీ భయపడి సజ్జనులు దాక్కుని బ్రతుకుతున్నారు. సజ్జనులు తప్పుకొని తిరగటం తమరక్షణ కోసమే తప్ప దుష్టుల అన్యాయాన్ని ఆమోదించి కాదు. ఎన్నికలు లేని రోజుల్లో యుద్ధాలే జరిగేవి. ఇప్పుడు నామినేషన్ల దశలోనే రౌడీల యుద్ధకాండ మొదలౌతున్నది. తింటానికి లేకపోయినా ఉగ్రవాదానికి యుద్ధాలకు ఎగబడిపోతున్నారు. 2014 లో మెహదీపట్నం మిలిటరీ గ్రౌండ్ లో ఆడుకోటానికి వెళ్ళిన 12 ఏళ్ల బాలుడిని తగలబెట్టి చంపిన సైనికుల దుర్మార్గం చాలా తీవ్రమైనది. పాడేరులో అప్పుతీర్చలేదని రత్నం అనే విధవరాలి తలను మరుగుతున్ననూనెలో ముంచి హింసించాడు పెంటారావు అనే డైలీ ఫైనాన్స్ వ్యాపారి. కోర్టుకు వెళుతున్న అత్యాచార బాధితురాలిని తగలబెట్టిన దుర్మార్గులున్నారు. రైల్వే గేటు తెరవలేదని గేట్ మ్యాన్ చేతులు నరికిన దుష్టులున్నారు. పోలీసు కానిస్టేబుళ్లను కొట్టిన ఎమ్మెల్యేలున్నారు. చెప్పినమాట వినలేదని పని పిల్లవాడిని కొట్టిన, పాలేరు పనికి ఆలస్యంగా వచ్చాడని షాకు ఇచ్చి చంపిన యజమానులున్నారు. అందరిలో దౌర్జన్యం, నేర తత్వమే కనిపిస్తోంది. దుష్ట స్వభావం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. నెల్లూరులో ఒక టూరిస్టు అధికారి తనను మాస్కు వేసుకొమ్మని సలహా ఇచ్చిందని ఒక వికలాంగురాలిని రాడ్డు తీసుకొని విచక్షణా రహితంగా ఆఫీసులోనే కొట్టి వార్తలకెక్కి సస్పెండ్ అయ్యాడు. కేరళలో కోడలిని అత్తింటివారే కడుపుమాడ్చి చంపారట. పెడనలో పిల్లల బాణాసంచా శబ్దాలను భరించలేక భార్య భర్తలపై కత్తితో దాడిచేసి ఒకడు భర్తను చంపేశాడు. భూమి తగాదాలో ఒక మహిళను కత్తితో నరికి చంపాడు మరొకడు. నిర్భయ దోషులు నలుగురికీ మరణదండన అమలు చేశారు. మన దేశంలో న్యాయ ప్రక్రియ సుదీర్ఘమైనది. తమ కుమార్తెపై అత్యాచారం జరిపి హతమార్చిన దుండగులకు శిక్ష విధించడంలో ఎంతో జాప్యం జరిగిందని నిర్భయ తల్లి, ఆయెషా తల్లి అనేకసార్లు కన్నీరుమున్నీరయ్యారు. నేరగాళ్ళు అందరూ ఉరికంబం ఎక్కినరోజునే తమ కుమార్తెల ఆత్మ శాంతిస్తుందని ఆ తల్లులు ఆవేదన చెందారు. ఎనిమిదేళ్ళ తరువాత నిర్భయకు న్యాయం జరిగిందని చాలామంది పెద్దలు సంతోషించారు. ఆయెషా బేగం తల్లి ఇంకా ఆక్రందిస్తూనే ఉన్నారు. సత్కార్యాల పేరుతో పబ్బులమీద పడి అమ్మాయిలను తంతున్నారు, పార్కుల్లో ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, గ్యాంగ్ వారుల్లో మునిగితేలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లైంగిక నేరాల కేసుల్లో దుండగులను పట్టుకుని 21 రోజుల్లో శిక్షించడానికి వీలుగా దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దాంతోపాటు దిశ యాప్‌ను రూపొందించి విడుదల చేసింది. న్యాయం త్వరగా జరుగుతుంటేనే ప్రజలు శాంతిగా ఉంటారు. (వ్యాస ర‌చ‌యిత ఏపీ రిటైర్డ్ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌)
--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి