సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్!
“ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగ చుక్కకు గతి లేదు” అన్నట్లు సెయింట్ల కాన్వెంట్లలో చదువు మహా డాబుసరి వ్యవహారంగా తయారయింది. ఇంటికూడు తిని, ఎవరి వెంటో పడినట్లుగా కాన్వెంట్ల యాజమాన్యం ప్రవర్తిస్తున్నది. అసలు ఈ ప్రపంచంలో ఏ మూల ఏ ప్రక్రియ సక్సెస్ అవుతుందో దాన్ని మనవాళ్లు ఇట్టే స్వతంత్ర్యం చేసుకుంటారు. ఆనవాలు పట్టడానికి కూడా వీలు లేకుండా దానికి నకిలీ తయారు చేస్తారు. నాణ్యతలో తప్ప మరి దేనిలోనూ తేడా మనకు కనపడదు.
ఏదో నాలుగు తెలుగక్షరాలు నేర్చుకొని కుదురుగా చదువుకొంటున్న మా అమ్మాయిని ఇంగ్లీసు మీడియం చదివించాల్సిందేనని మా ఆవిడ పట్టుపట్టింది. ఎందుకంటే మా పక్కింటివాళ్లమ్మాయి పొద్దున్నే బూట్లు, టై, బ్యాడ్జీ మరేవేవో వేసికొని టిప్‌టాప్‌గా కాన్వెంటుకు వెళ్లేది. ఇంటికొచ్చి “బటర్‌ఫ్లై.. బటర్ ఫ్లెయి” అని అరుస్తూ ఉండేది. పక్కింటివాళ్ల పిల్ల అరుపులు విన్న మా ఆవిడ ఒక్క ఉదుటున నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి “మన పిల్లను కూడా కాన్వెంటులో చేరుస్తారా లేదా? అని నిగ్గదీసేది. ఈ ఇంటిపోరు పడలేక చివరికి కాన్వెంట్ల వేటలో పడ్డాను. దారిలో ఓ మిత్రుడు తోడయ్యి అచ్చంగా కాన్వెంట్లే ఉండే ఒక బజారుకు తీసికెళ్ళాడు.
అన్ని కాన్వెంట్లూ తిరిగి చూసాం. కొద్దో గొప్పో తేడాతో అందరూ మూడువేలదాకా ముట్టజెప్పుకోమని అడిగారు. మూడు రూపాయల ఖర్చు కూడా లేకుండా మా వూరి వీధి బడిలో చేరి చదివానే. ఇక్కడేంటి మూడు వేలు ఫీజంటున్నారు? ” అని వెంటొచ్చిన మిత్రుణ్ణి అడిగాను.
“ఊదు వేయందే పీరు లేవదోయ్ బాషా! అయ్యెలిమెంటరీ స్కూళ్ళూ, ఇయ్యేమో సెయింట్ స్కూళ్ళు. ఆటికి ఈటికి తేడాలేదా?” అన్నాడు సెయింట్ అనే మాటకు అంత విలువ ఉందట. “సెయింటంటే ఏందని అడిగాను. “సన్యాసి, రుషి లేదా ముని” అని తడుముకోకుండా జవాబిచ్చాడా బైరాగి. సన్యాసుల స్కూళ్ళకు సంపాదనాశ మెండా?”అని అనబోయి కూడా ఆపుకున్నాను.
ఇంకాస్త ముందుకొస్తే అతి విచిత్రమైన బోర్డు కనబడింది. అది “ఆల్ సెయింట్స్ హైస్కూల్” నాకు నానార్ధాలు గోచరించాయి.. ఇదేం పేరురా మిత్రమా ఇలా ఉంది? అన్నాను. అవునోయ్ రోజుకొక కాన్వెంట్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో కొత్త కొత్త సెయింట్ల పేర్లు వాటికి తగిలిస్తున్నారు. ఉదాహారణకు సెయింట్ వాణి, సెయింట్ రాణి, సెయింట్ జాక్‌పట్, సెయింట్ ఆయిషా, సెయింట్ ఖాదర్ వలీ, సెయింట్ ఫకీర్‌సాహెబ్, సెయింట్ లిల్లిపుట్.. ఇలా అడ్డమైన పేర్లన్నీ పెట్టేస్తున్నారు కదా? వీళ్లందర్నీ భూత, వర్తమాన భవిష్యత్కాలంలో చావుదెబ్బ తీయడానికి ఈ మహానుభావుడు “ఆల్ సెయింట్స్” అని పెట్టుకున్నాడు. తప్పేమిటి?” అని ఎదురు ప్రశ్న వేసాడు.
సరే ఆ రోజుకు పని కాలేదు ఇంటికి తిరిగొచ్చాను. పక్కింటి పాపాయిని పిలిచి, “పాపా! నీవు చదివే స్కూలు పేరేంటమ్మా?” అని అడిగాను. “సెయింట్ వోణి” అనుకుంటూ ఆ పిల్ల పరుగు తీసింది. “స్కూలు పేరడిగితే సెంటూ, వోణీ అంటుందేమిటి ఆ పిల్ల?” అని మా ఆవిడ ప్రశ్నించింది. అదేలే “సెంట్ వాణి” అన్నాను. “మధ్యలో ఆ సెంట్ ఏమిటండి. ఎంచక్కా వాణి కాన్వెంటో, వాణి స్కూల్ అనో పెట్టుకోక” అంది. “ఆ సెంటు లేకపోతే స్కూలు వాణికి విలువలేదే పిచ్చిమొగమా!” అన్నాను. నా ఫ్రెండుతో గడించిన జ్ణానాన్ని ఉపయోగించుకొని ఆ సెంట్ అంత ఖరీదైనదా? మళ్ళీ ప్రశ్న. చివరికెలాగో ఒక గంట సుధీర్ఘోపన్యాసం చేసి ఆమె చేత “అలాగా” అనిపించాను.
మరునాడు అమ్మాయిని తీసికెళ్ళి కేవలం రెండొందలు మాత్రమే అడ్మిషన్ ఫీజు తీసుకొన్న సెయింట్ చెన్నారెడ్డి ఇంగ్లీషు మీడియం స్కూలులో చేర్పించాను. పక్కింటి పాపాయితో ధీటుగా మా పిల్లను తయారుచేసి బండెడు పుస్తకాలను వీపుమీదకెత్తి పంపించాము. అలా సంవత్సరం గడిచింది. అమ్మాయి ఇంగ్లీషులో మాట్లాడేదింకెప్పుడు? అని నాకు ఆదుర్దాగా ఉండేది. “అమ్మా మీ స్కూల్లో టీచర్లు ఇంగ్లీషులో మాట్లాడతారా? ఆపుకోలేక అడిగాను “లేదు నాన్నా, ఎంచక్కా తెలుగులోనే మాట్లాడుకుంటారు. పాఠం మాత్రం ఇంగ్లీషులో చెబుతారు” అంది. ఇంతకు ముందు తెలుగులో పాఠాలు చదివి అర్ధం చేసుకునేది. ఇప్పుడు ఇంగ్లీషు, తెలుగు ఏదీ పూర్తిగా రావటంలేదు అనుకొన్నా. మా పక్కింటి పాపయ్య భార్యతో అంటున్నాడు. “సెంట్ వాణిలో అంతా తెలుగోళ్ళే. లాభం లేదు. సెంట్ పంగనామం స్కూలులో చేర్పిస్తేగాని పిల్ల బాగుపడదు. అక్కడ అంతా అరవోళ్లు..
గీటురాయి1.8.1986
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి