27, ఏప్రిల్ 2018, శుక్రవారం

నూర్ భాషాభిమానం - కర్లపాలెం హనుమంతరావు


                                      నూర్ భాషాభిమానం
    కర్లపాలెం హనుమంతరావు
         8142283676

'కూరలు బేరం చేయడానికి తప్ప తెలుగు  దేనికీ పనికి రాదు'  అంటారు కొడవటిగంటి.ఇవాళ తెలుగు మాట్లాడే జనం సంఖ్య 9 కోట్ల పై చిలుకు. పొరుగునున్న మరాఠీ, తమిళం కన్నా తెలుగు మాట్లాడే వాళ్ల సంఖ్యే ఎక్కువ. దేశభాషలందు తెలుగు  ఏ విధంగా లెస్సు?
1975 లో జరిగిన మొదటి తెలుగు ప్రపంచ మహా సభలకు మొన్నటి 2017 లో  జరిగిన మహాసభలకు  మధ్య  ప్రభుత్వాలు, ప్రజలు మాతృభాష తెలుగును మన్నించే తీరులో మార్పేమన్నా వచ్చిందా? అని పలు కోణాల్లో సాధికారికంగా తర్కించారు ఈ ప్రభుత్వ అధికారి. 'మార్పయితే వచ్చింది.. కానీ తిరోగమన రీతిలో' అని సందర్భాలను బట్టి ఉదాహరణలతో సహా మరీ తేల్చేసారు.   
నూర్ బాషా రహంతుల్లాగారు ప్రభుత్వ ఉన్నత పదవుల్లో చాలా ఏళ్ల బట్టి ఉన్న పెద్దలు.  ఉద్యోగ రీత్యా తనకు  ఎదురైన సవాళ్ళు ఎలాంటివో.. వాటిని ఎలాంటి మొక్కవోని దీక్షతో తాను ఎదుర్కొన్నారో  వినాలనుకునే వారు ఈ వ్యాసాలను ఓ పాఠ్యగ్రంధంలా పరీశీలించవలసిన అవసరం ఉంది.
 మొదటి నుంచి  మన తెలుగువాడికి పెరటి చెట్టంటే చులకనే. తెలుగుభాషను ఉద్ధరించే పని పెట్టుకున్నానని గంటం పట్టుకున్న  నన్నయకైనా మహాభారతం మొదటి పర్వం  కనీసం మంచి తెలుగుపద్యంతో మొదలు పెట్టాలన్న ధ్యాస కలగలేదు! గురజాడ అప్పారావుగారు తెలుగోడి పరభాషాభిమానాన్ని కన్యాశుల్కంలో ఉతికి ఆరేసారు.  మేధావులు సైతం ఎట్లా  ఆంగ్లభాష మాయాజాలంలో పడి కొట్టుకుపోతున్నారో రచయిత పలు వ్యాసాలలో సాధికారికంగా నిరూపించారు. అవసరమైన విషయాలను సున్నితంగా, నచ్చచెప్పే తీరు నిజాయితీగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు సైతం సామరస్యంగానే స్పందిస్తాయి. అందుకు తార్కాణం నూర్ బాషా గారికి ప్రభుత్వాల తరుఫు నుంచి కూడా అందుతున్న సహకారం. కుంటి సాకులతో మంచి పనులకు పిల్లి శకునాలు చెప్పే ప్రభుత్వ బాధ్యులందరూ నూర్ బాషా  గారిని స్ఫూర్తి దాయకంగా తీసుకుంటే తెలుగు అధికారభాష హోదాకున్న పెద్ద అడ్డంకి తొలగినట్లే!
తెలుగు భాష దుస్థితికి మందు వేయాలంటే రోగానికి మూలమెక్కడుందో ముందు కనిపెట్టాలి కదా! ఆ భాషాచికిత్సకు చక్కని వైద్యపరికరాలు ఎన్నో ఇక్కడి నూర్ బాషా వ్యాసాలలో మనకు లభిస్తాయి. తెలుగుభాషకు పూర్వ వైభవం నవీన సాంకేతికయుగం ద్వారా అందివచ్చే హూందాతనం రెండూ సమకూర్చాలన్న దీక్ష పుష్కలంగా కల  భాషాభిమానులందరికి సరైన దారులు సూచించిన నూర్ బాషా గారిని కొత్తతరం భాషామార్గదర్శకులు అంటున్నాను నేను.
కార్యాలయాలు, ఠాణాలు, న్యాయస్థానాలు, ఆసుపత్రులు, సమాచార మాధ్యమాలు  అన్నింటా ఇంగ్లీషేనా? పేరుకి స్వతంత్రులమై   డెబ్భైయ్యేళ్ళు దాటినప్పటికీ  తెలుగువాళ్లం భాషరీత్యా  అస్వతంత్రులం,పరభాషకు బానిసలం!తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో నాటి  ఎం.పి నందమూరి హరికృష్ణ రాజ్యసభలో తెలుగు ప్రసంగం చేస్తానంటే  గేలిచేసారు సాక్షాత్తు సభాపతి. అనువాదకులు లేరని  కుంటి సాకులతో విషయం దాటేసినప్పుడు కనీసం నిరసన ప్రదర్శించిందా ఆంధ్రావని?మన బంగారం మంచిది కానప్పుడు కంసాలిని ఎన్నిఅని ప్రయోజనమేముంది?ఆసుపత్రుల్లో వైద్యులు వల్లించే రోగాలు, మందు చీటీల్లో రాసిచ్చే ఔషధాలపేర్లు ఇంగ్లీషే! ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించే, వినిపించే తెలుగు వాస్తవానికి ఓ కంటి తుడుపు చర్య. తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ జరగాలన్న నిబంధనలు ఎన్ని  వస్తున్నాఅమలు చేసే చిత్తశుద్ధి ,సిబ్బందిలో కరువవుతున్నప్పుడు 'ఇక తెలుగుభాషకు నిజమైన అధికార హోదా దక్కేది ఎప్పుడు?తల్లివంటి తెలుగు పలుకును ఈ దయనీయమైన దుస్థితి నుంచి గట్టున పడేసే పద్ధతులేమిటో అంటూ తన బుర్రకు పదును పెట్టిన కార్యవాది రహంతుల్లా . వృత్తిరీత్యా వారు ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివో మొక్కవోని దీక్షతో వాటిని మట్టు పెట్టేటందుకు అధికారిగా వారు ఎన్నుకొన్న మార్గాలు ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి గల  తెలుగు భాషాభిమానులంతా తప్పక తెలుసుకోదగ్గ కొత్తవిశేషాలు ఎన్నో ప్రతీ వ్యాసంలో  తారసపడతాయి.. అదీ ఈ పుస్తకం విశిష్టత.  
అసలు తెలుగుభాష బతక్కపోతేనేమయ్యా మన బతుగ్గడవదా? అని ఎదురడిగే మహానుభావులకి  'భాష ఉన్నది కేవలం బతుకు గడిచేటందుకేనా?  బతుకు కమ్మగా గడిపేటందుకు కాదా?' అని ఎదురడిగే దమ్ము ఈ అధికారి క్రియాశీలతను పరిశీలించే ఎవరికైనా కలిగి తీరాలి.నిజంగా బతుకు తెరువుకు ఒక  మంచి దారి చూపిస్తుందా ఇప్పుడున్న తెలుగు?అంటూ నిలదీస్తాయి ఇందులోని పలు వ్యాసాలు. 
   తల్లిభాషతో లోకాన్ని స్వయంగా అవగాహన చేసుకున్న మెదళ్లే ఎదిగే కొద్దీ జీవితంలో ఎన్ని సవాళ్లనయినా సమర్థవంతంగా అధిగమించేది. ఉన్నతశిఖరాలు అధిరోహించడంలో చిన్ననాటి చదువు సంధ్యలపాత్ర ఎనలేనిది.సినిమాలకు, టీవీలకు, గాసిప్పులకి, కొట్లాటలకి  పనికొచ్చే తెలుగు బళ్లల్లో చదువుకొనేటందుకు ఎందుకు దండగ సరుకవుతున్నట్లు?! తేరగా చదువుచెపుతామన్నా తెలుగు ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తైనా చూడడం లేదు కనీసం బీదాబిక్కీ జనమైనా! ఇంట్లో హాయిగా వాడుకొనే తెలుగు మాట గడప దాటంగానే ఎందుకు వెగటవుతుందో? భేషజం కోసమా భాష? ఆంగ్లభాషా వ్యామోహం ఓ మహమ్మారి. ఏ మహామంత్రంతో ఈ మాయలాడి ఆటను కట్టడి చేయాలో చెప్పే తారకమంత్రాలతో పలుశ్రమదమాదుల కోర్చి   నూర్ బాషా రహంతుల్లా గారు రూపొందించినది ఈ అపురూపమైన మార్గదర్శక గ్రంథం.మన కోసమే మనం అవుపోసన పట్టవలసి ఉంది.
సర్కారు కొలువుల్లో చేరేందుకు ఏ విధంగానూ ఉపయోగపడని భాష మీద ఎవరికైనా గౌరవం ఎందుకుంటుంది? ఎందుకూ కొరగాని మందబుద్ధి మాత్రమే ఎంచుకొనే మీడియం తెలుగు అన్న ధోరణి జనసామాన్యంలోనూ పెరిగేందుకు కారకులెవరు?  ఇప్పుడంటే తెలుగు రాష్ట్రాలు కనీసం పది, పన్నెండు తరగతుల వరకైనా తెలుగును తప్పనిసరి మాధ్యమం చెయ్యాలని తలపోస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ పాలకులే గురుకులాల తెలుగుకు సైతం  మంగళం పాడేందుకు సిద్ధమయారు! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మార్పుకైనా ముందు  మామూలు జనం వైపు నుంచే చొరవ రావాలన్న మూలసూత్రం తెలిసిన  మేధావి అధికారి నూర్బాషా రహంతుల్లా గారు! ముందుగా ఓ ప్రభుత్వ బాధ్యుడిగా తన పక్షం నుంచి వీలైనన్ని భాషాసంస్కరణలకు శ్రీకారం చుట్టారు.చిత్తశుద్ధితో పనులు చేశారు,చేస్తున్నారు.
పాలనాధికారి స్థాయిలో ఎన్నో పని వత్తిళ్లున్నా అదే పనిగా పెట్టుకొని మాతృభాషకు సేవలందించే నూర్బాషా రహంతుల్లా గారి మాతృభాషాభిమానం ఎందరికో స్ఫూర్తిదాయకం! తాను ఎమ్మార్వోగా ఉన్న రోజుల్లో పట్టుబట్టి ముఖ్యమైన కొన్ని ధరఖాస్తులను తెలుగుభాషలో అందుబాటులోకి తెచ్చారు.  ఎవరి సాయం అవసర పడకుండానే అర్జీపత్రాన్ని సామాన్యుడు సైతం సులభంగా  నింపగలిగే పరిస్థితి కల్పించడం చిన్న విషయం కాదు.విద్యార్థి దశలో వివిధ రకాలైన ధృవీకరణ పత్రాలు తెలుగులో సాధించేందుకు తాను పడిన ఇబ్బందులేవీ మర్చిపోని మాతృభాషాప్రేమి నూర్ బాషా స్వామి. పెద్ద కుర్చీలు ఎక్కినా చిన్నప్పటి తిప్పల్ని  గుర్తుంచుకుని వాటిని అధిగమించేందుకు ఎంత మంది అధికారులు నూర్ బాషామాదిరి  ఏటికి ఎదురీది మరీ అనుకున్నది సాధించేది?
'వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేల్ తలపెట్టవోయ్' అన్న గురుజాడవారి సూక్తి గట్టిగా వంటబట్టించుకోబట్టే 2008లో పులిచింతల ప్రాజెక్టులో భూసేకరణ సమ్మతి అవార్డు తెలుగులో ఇచ్చి కొత్త వరవడి సృష్టించారు నూర్ బాషా రహంతుల్లా .ఎలాంటి మాదిరి పత్రం  లేని పరిస్థితుల్లో సైతం సరికొత్త అనువాదానికి స్వయంగా పూనుకుని రాసిన ఆ అవార్డు రాష్ట్రంలో మొదటి తెలుగు అవార్డు! బడుల్లో చదువుకోవలసిన పిల్లలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వృథాగా ఎందుకు ప్రదక్షిణాలు చెయ్యాలన్న తలంపుతో.. శాశ్వత కుల, నివాస స్థల, పుట్టిన తేదీల వంటి ఎన్నో అవసరమైన ధ్రువీకరణపత్రాలను  వారి వారి పాఠశాలల్లోనే నేరుగా పిల్లలకు పంపిణీ చేయించే విధానానికి  శ్రీకారం చుట్టడం  అప్పట్లో ఎమ్మార్వోగా నూర్బాషాగారు సృష్టించిన సంచలనం.  పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ఇళ్లకు  చేరవేయించి మనసున్న మా రాజుకు మార్గం దానంతట అదే ఎలా దొరుకుతుందో  నిరూపించారు. ఇలాంటి స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల సేవలో రెవెన్యూ అనే మంచి కార్యక్రమం కొనసాగుతున్నట్లు వింటున్నాం! ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు'  అన్న తెలుగు సినిమా పాటకు అచ్చమైన నిలువెత్తు ఆచరణ దర్పణం నూర్ బాషా రహంతుల్లాగారు. ఆదర్శముర్తి తన ఆశయసిద్ధికి  ముళ్ళదారుల వెంటబడి ముందుకు సాగారో ముందు తరాలకి తెలపాలంటే ముందు మన వంతుగా పెద్దలం పలు సంస్కరణలతో నిండిన వ్యాస సంకలనం పరిశీలించడం అవసరం.
దారేలేని ముళ్ల  డొంకల గుండా కాయా కంపా కాళ్ల కడ్డుపడి ఇబ్బంది పెడుతున్నా మొక్కవోని దీక్షతో ముందుకు సాగే మొండి సాహసం కొంతమందికే ఎందుకు వరమవుతుందో.. నూర్బాషాగారి వంటి కార్యదీక్షాపరుల జీవితాలను పరిశీలిస్తే గానీ బోధపడదనిపిస్తుంది!   గిరిజన ప్రాంతం రంపచోడవరం మొబైల్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ గా అచ్చమైన తెలుగువాళ్ళకు స్వఛ్చమైన తెలుగులో తీర్పులిచ్చే అవకాశం వచ్చిందని ఆయన ఉత్సాహపడ్డారు.  నల్లకోట్ల వకీళ్లు ఎప్పట్లానే 'యువరానర్' అంటూ ఆంగ్లం పరిభాషలో ముందు కొచ్చి మరీ పిల్లి శకునం చెప్పబోయారు. అంతో ఇంతో గుండె పటుత్వం ఉన్న ఎంత పెద్ద అధికారయినా నిజానికి నీళ్లు కారిపోక తప్పదు అట్లాంటి పరిస్థితుల్లో! అంత తేలికగా లొంగే ఘటమా నూర్బాషాగారు! తన తెలుగుభాషాదీక్షకు అదో పరీక్షా సమయమని బావించారు. ఆదర్శాల వల్లెవేత చెవులకు ఎంత ఆకర్షణీయం.  ఆచరణలోనే అవి ఒక్కోసారి  ఎంత అసాధ్యాలో, దుస్సాహసాలో.. అప్పుడు గాని నూర్బాషాగారి స్వీయానుభవానికి  వచ్చింది కాదు.వాద, ప్రతివాదనలు, సాక్షుల  వాంగ్మూలాలన్నీ  చెప్పింది చెప్పినట్లు  తెలుగులో  టైప్ చేసేందుకు చేతి కష్టం చాలా ఉందనీ , ఆంగ్లంలో తర్జుమా చేసి చెబితే తప్ప పని ముందుకు సాగదని  సిబ్బంది తమ ఇబ్బందులు మొరపెట్టుకొన్నప్పుడు గానీ జ్ఞాననేత్రం విచ్చుకొన్నది కాదు.తెలుగు మీద అభిమానం ఎంత పుష్కలంగా ఉంటేనేమి? తెలుగులో తీర్పులు ఎందుకు రావో రచయితగారికి అప్పటికి గానీ బోధపడింది కాదు.ఎన్నో ఇడుములకోర్చి ఏవో తంటాలు పడ్డా 'తెలుగు తీర్పుల'కు ఉండే చట్టబద్ధత మాటేమిటి?  అధికార హోదా  అన్ని స్థాయిలలో ఆచరణలో కొస్తే తప్ప తెలుగుభాషకు వెలుగులు అసాద్యమని నూర్ బాషా రహంతుల్లా గారు నేర్చుకొన్న నీతిసారాన్నే పొందుపరుచుకొన్నాయి ఇక్కడి వ్యాసాలన్నీ!
తెలుగు భాషకు పూర్వ వైభవం తిరిగి  తెచ్చేటందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలూ  నడుం కడుతున్న ఈ శుభ సందర్భానికి అవసరమైన ఉపకరణాలెన్నో నూర్బాషాగారి ఈ వ్యాసాలలో పొందుపరిచి ఉన్నాయి. ఈయన తన అనుభవసారం, అభిరుచులు రెండింటినీ రంగరించి మరీ రాసిన ఈ వ్యాసాలనన్నింటినీ  ఆమూలాగ్రం చదివిన పిదప రాసిన ఈ రెండు మాటలు నిజానికి కొండను అద్దంలో చూపించే చిరుప్రయత్నం కన్నా చిన్నవి.
తెలుగులో చదువుకున్న వారికి పోటీ పరీక్షల్లో అయిదు శాతం ప్రోత్సాహక మార్కులు, ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్లు ఇప్పించమని ఒకప్పుడు  ఆంధ్రప్రదేశ్ అధికారభాషా సంఘం బాధ్యులు  మండలి బుద్ధప్రసాద్ గారి ఎదుట  పెట్టిన డిమాండ్లు నూర్బాషాగారి మదిలో  మెదిలే వందలాది కోరికల్లో కొన్ని మాత్రమే!  
నూర్ బాషారహంతుల్లాగారితో నాది పరోక్ష పరిచయం. నిరంతరంగా ప్రవహించే ఈ గురుతుల్యుల తెలుగుభాషా మమకార స్రవంతి నుంచి సందర్భం తటస్థించినప్పుడల్లా ఓ పుడిసెడు మంచితీర్థంలా పుచ్చుకుని దప్పిక తీర్చుకొనే  వారి ఆశేష అభిమాన సందోహంలో నేనూ ఒక  బిందువుని. ప్రాచీన హోదా కోసం పాకులాడే కథ సగంలో ఉండగానే అధునాతన యుగ సాంకేతిక అవసరాలకూ తెలుగుభాషను ఎలా సంసిద్ధం చేయాల్సుందో.. వివిధ నవీన అంతర్జాల పరికరాల సాయంతో లిపి, పద నిర్మాణం, నిఘంటువుల తయారీ, జనంభాషతో కలగలసిపోయే  తారకమంత్రం, కుల మత వర్గ వృత్తుల వారీ వాడుక, మాండలిక పదజాలాలకూ పండితభాషల పక్కనే సమానమైన పీఠం దక్కే తంత్రం, పెరుగుతున్న జీవితావసరాలకు తగిన విధంగా ఆంగ్లభాష విస్తరణ దారిలోనే ఏ భేషజాలకు పోకుండా అంతర్జాతీయ, జాతీయ పదజాలాలను తెలుగు సొంతం చేసుకొనే యంత్రాంగం.. వంటి ఇంకెన్నో సరికొత్త ఆలోచనా విధానాలతో తెలుగుభాషాభిమాని నూర్ బాషా రహంతుల్లాగారు సాగించారీ  వ్యాసాల పరంపర. తెలుగును దేవభాషగా నూర్బాషాగారు నిరూపించబోయిన విధానం నా వరకు సరికొత్తది.   
 మన  తల్లిభాష తెలుగుకు మళ్లీ మంచి రోజులు రావాలనే రచయిత తహతహతో నేనూ పాలుపంచుకుంటున్నాను.గురుతుల్యులు నూర్ బాషారహంతుల్లాగారికి నిండు మనసుతో శతకోటి నమస్కార కృతజ్ఞతాంజలులు! 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి