27, ఏప్రిల్ 2018, శుక్రవారం

సందేశం - విజయభాస్కర్ సంచాలకులు


                              సందేశం     
- డా|| డి. విజయభాస్కర్
మాతృభాషలో బోధన, మాతృభాషలో పాలన ఇటీవల కాలంలో ఊపందుకున్న నినాదం. ఈ నినాదం వెనుక ఒక గొప్ప ఆశయముంది. ఆకాంక్ష ఉంది. ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అది మాతృభాషతో మొదలవుతుంది. తన పసితనంలో సంజ్ఞల ద్వారా చిన్ని చిన్ని మాటల ద్వారా జరిపే సంభాషణంతా అమ్మనుడితో సాగుతుంది. తర్వాత బడిలో జరిపే బోధన దాని కొనసాగింపుగా మాతృభాషలో జరిగితే అతని అవగాహన సవ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఒక్కసారి పరాయి భాష వచ్చి పడేసరికి విద్యార్థి గంద్రగోళ పరిస్థితికి గురవుతాడు. మాతృభాషలో నిష్ణాతుడైన వాడు ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యత సాధిస్తాడని శాస్త్రీయంగా నిరూపితమైన సత్యం .

ఇక పరిపాలనకొస్తే, సామాన్యుడే పాలకుడ్ని ఎన్నుకునే అద్భుతమైన వ్యవస్థ వర్థిల్లుతున్న దేశం మనది. ఈ దేశంలో తయారయ్యే చట్టాలు, నియమాలు, నిబంధనలు ప్రజల భాషలో ఉండటం సంస్కారవంతమైన విధానంగా పరిగణించాలి. ఈనాడు ప్రజల అవసరాలు పెరిగాయి. పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. అధికార్లతో మాటామంతీ పెరిగింది. ఈ నేపథ్యంలో పరిపాలన విదేశీ భాష నుండి స్వదేశీభాషలో అందులోనూ మాతృభాషలోకి మార్చుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆంగ్లేయులు వదిలివెళ్లిన అనేకమైన అవశేషాల్లో ఆంగ్ల భాష ఒకటి. ఇంగ్లీష్ అవసరాన్ని తక్కువ చెయ్యలేం. అలాగే తెలుగు భాష గొప్పదనాన్ని తక్కువ చెయ్యలేం. సంస్కృతం మొదలుకొని నిన్న మొన్నటి ఆంగ్ల భాష వరకు అనేక భాషలతో ఏర్పడిన సంపర్కంతో తెలుగు భాష సుసంపన్నమైంది. పురాణ, ప్రబంధ, కావ్య నాటక ప్రక్రియలకు, తాత్విక, ఆధ్యాత్మిక, న్యాయ వైశేషిక జ్ఞానాన్ని, ఆధునిక శాస్త్రీయ, వైజ్ఞానిక విషయ పరిజ్ఞానాన్ని తనలో ఇముడ్చుకొని అపారమైన శక్తి సంతరించుకుంది తెలుగుభాష.

ఇటువంటి తెలుగు భాషను బోధన భాషగా, పాలన భాషగా ఉపయోగించడంలో చొరవ చూపినవారు అతికొద్ది మంది అధికార్లున్నారు. వారిలో నూర్ భాషా రహంతుల్లా ఒకరు. తెలుగు వాడుక భాషలో పరిపాలన జరగాలని గట్టి పట్టుదలతో పనిచేస్తున్నారు. వారు అనేక సందర్భాల్లో తెలుగువాడకాన్ని సోదాహరణంగా చూపిస్తూ వ్రాసిన పుస్తకం ఇది. ఇందులో పొందుపర్చిన విషయాలు మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ, వారి కృషిని అభినందిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి