27, ఏప్రిల్ 2018, శుక్రవారం

చిన్నభాషల్ని మింగేస్తున్న పెద్దభాషలు




చిన్నభాషల్ని మింగేస్తున్న పెద్దభాషలు (ఆంధ్రప్రభ 15.12.2017)
గత పది సంవత్సరాలలో 516 భాషలు దాదాపుగా అంతరించి పోయాయట. చాలా కొద్దిమంది పెద్దవాళ్ళు మాత్రమే ఆ భాషలు మాట్లాడుతున్నారట. ప్రస్తుతం 7299 భాషలు ప్రపంచంలో వాడకంలో ఉన్నట్లు గుర్తించిన సంస్థలు, వాటిలో సగానికి సగం రాబోయే తరానికి అందకుండా అంతరించిపోయే దశలో ఉన్నాయని చెబుతున్నాయి. అంతరించిపోయే దశలో ఒక భాష ఉంది అనటానికి ప్రాతిపదికలు ఏంటంటే `1. ఆ భాషను పెద్దవాళ్ళు పిల్లలకు నేర్పరు. 2. రోజువారీ వ్యవహారాల్లో వాడరు. 3. ఆ భాష మాట్లాడే జనం సంఖ్య తగ్గిపోతుంటుంది. 4. ప్రభుత్వం, దేవాలయం కూడా ఆ భాషను ఉపయోగించవు. 5. ఆ భాషను కాపాడుకోవాలని ప్రజలు సంఘటితంగా ఉద్యమించరు. 6. భాష పట్ల గౌరవ భావం ప్రజల్లో ఉండదు. 7. ఆ భాష అక్షరాలను గానీ, సాహిత్యాన్ని గానీ ఆ ప్రజలు విరివిగా వాడరు.
Ethnologue.com లో ఈ అంతరించిపోతున్న భాషల చిట్టా ఉంది. ఆఫ్రికాలో 46, అమెరికాలో 170, ఆసియాలో 78, ఐరోపాలో 12 పసిఫిక్‌లో 210 భాషలు ఈ చిట్టాలో ఉన్నట్టు తెలిపారు. ఇక ఇండియా విషయానికి వస్తే 17 భాషలు అంతరించాయట. అవి :
1.
పుచిక్‌వార్‌: అండమాన్‌దీవుల్లో 2000 సంవత్సరంలో కేవలం 24 మంది షెడ్యూలు తెగల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ భాషను హిందీ మింగేసింది.
2.
కామ్యాంగ్‌: 2003 నాటికి అస్సాంలో 50 మంది ఈ భాషను మాట్లాడేవాళ్ళు మిగిలారు. కాస్త ముసలివాళ్ళు మాత్రం తాయ్‌లిపిలో ఈ భాష రాసేవాళ్ళట. ఇదీ గిరిజన భాషే. అస్సామీ భాష దీన్ని మింగింది.
3.
పరెంగా : 2002 నాటికి ఒరిస్సా, కోరాపుట్‌జిల్లాల్లో 767 మంది మిగిలారు. ఈ భాష మీద మన తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా పరిశోధన చేశారు. ఈ భాష మాట్లాడే ‘గడబ’ అనే గిరిజన తెగ క్రమేణా ఆదివాసీ ఒరియా భాషలోకి మారిపోయారు.
4.
రూగా : మేఘాలయలోని ఈ భాష నామరూపాల్లేకుండా అంతరించి పోయింది. మిగిలిన కొద్దిమంది గారో భాషలోకి మళ్ళారు.
5.
అహాం : అస్సాం ప్రాంతంలో పూర్వం 80 లక్షల మంది మాట్లాడే ఈ భాషను మాట్లాడే వాళ్ళే లేరు. కేవలం మంత్ర తంత్రాల్లో మాత్రమే ఈ భాషను వాడుతున్నారు.
6.
అకాబియా : అండమాన్‌దీవుల్లోని ఈ భాషలు అంతరించిపోయాయి. అవి : 7. అకాబో, 8. అకాకరి, 9. అకాజెరు, 10. అకాకెడి, 11. అకాకోల్‌, 12. అకాకోరా, 13. అకర్‌బాలె, 14. ఒకొజువోయ్‌.
15.
పాలి : బౌద్ధమత సాహిత్యం ఈ భాషలో ఓనాడు వికసించింది. 1835లో బైబిల్‌లోని కొత్త నిబంధన కూడా ప్రచురించారీ భాషలో. ఇండియాలో నాశనమైపోయింది. శ్రీలంక, బర్మా, టిబెట్‌లలో ఇంకా కొంతమంది ఈ భాష మాట్లాడే వాళ్ళున్నారంటారు.
16.
రంగకస్‌: ఉత్తరాంచల్‌ప్రాంతాల్లో జొహరి అని కూడా పిలిచే ఈ భాషస్తులు ఓ వెయ్యి మంది ఉండొచ్చట. ఈ భాషాపోయింది.
17.
తురుంగ్‌: అస్సాం గొలాగట్‌జిల్లాలోని ఈ గిరిజన జనం మెల్లగా సింగ్‌పో భాషలోకి మళ్ళారట.
ప్రతి రెండు వారాలకు ఒక భాష చచ్చిపోతోందని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలోని 6800 భాషలలో 90 శాతం భాషలు ఈ శతాబ్దంలోగా అంతరించిపోతాయట. ఎందుకంటే వాటిలో సగం భాషలు మాట్లాడేవారు 2500 మంది కంటే తక్కువగా ఉన్నారట. వరల్డ్‌వాచ్‌సంస్థ హెచ్చరిక ఇది. యుద్ధాలు, హత్యాకాండలు, ప్రకృతి బీభత్సాలు పెద్ద భాషల్ని ఆశ్రయించటం లాంటివన్నీ ఇందుకు కారణాలట. ఒక తరం నుండి మరో తరానికి భాషను తరలించటానికి కనీసం లక్ష మందైనా ఆ భాష మాట్లాడే వాళ్ళుండాలని లేకపోతే ఆ భాష అంతరిస్తుందని యునెస్కో ప్రకటించింది.
ఏ మతం వాళ్ళు ఎంత మంది పెరిగారు. ఎంతమంది తరిగారు లాంటి లెక్కల్ని తప్పుల తడకలతో హడావుడిగా పార్లమెంటుకు అందజేసి, తరువాత నాలుక కరచుకున్న కేంద్ర గణాంక శాఖ 2011 నాటి భాషల వారీ జనాభా లెక్కల్ని ఇంతవరకూ మన ప్రజల ముందు ఉంచలేదు. భాషల అభివృద్ధికి, పంచవర్ష ప్రణాళికల్ని ఆపుచేసి దశ వర్ష ప్రణాళికగా మార్చుకోవాల్సిందేనా? భాషల జనాభా వివరాలు చెప్పటానికి ఆరేళ్ళు సరిపోలేదా? 90 లక్షల మంది గుడ్డివాళ్ళు, కోటీనలభై లక్షల మంది చెవిటి వాళ్ళకు లేని బాధ మీకెందుకంటున్నారు సెన్సస్‌వాళ్ళు. ఇప్పుడు 2001 జనాభా లె
క్కల్లో 428 భాషలు నమోదయితే వాటిలో 415 వాడకంలో ఉంటే 13 భాషలు నశించిపోయాయట. ఎనిమిదవ షెడ్యూలు లోకి మరో నాలుగు భాషలు కలిపినందున, షెడ్యూలు భాషల సంఖ్య 22కు పెరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి