27, ఏప్రిల్ 2018, శుక్రవారం
ఎర్రాప్రగడ రామకృష్ణ - చిన్నమాట
నాదో చిన్న మాట
శ్రీ నూర్ బాషా రహంతుల్లా తెలుగు బాషాభిమానిగా సుప్రసిద్ధులు. వారితో నాకు ముఖపరిచయం లేకున్నా ముఖగ్రంథ (ఫేస్ బుక్) పరిచయం చాలాకాలంగానే ఉంది. వ్యాసరచయితగానూ వారు నాకు సుపరిచితులే ! మూడు దశాబ్దాలుగా ఈనాడు దినపత్రిక లో నేను రాసిన వ్యాసాలు – నా దగ్గర లేనివి కూడా వారి వద్ద భద్రంగాఉన్నాయని తెలిసి నేను ముందు ఆశ్చర్య పోయాను, దరిమిలా తీరిగ్గా గర్వపడ్డాను. ప్రస్తుతం ఈ పుస్తకానికి తొలిపలుకులు రాసే క్రమంలో వారికున్న మాతృభాషాభిమానాన్ని గ్రహించి కొంచెం సిగ్గుపడుతున్నాను. సుమారు 15 వేల వ్యాసాలను రచించిన నాకు తెలుగుపట్ల వారికున్నంత నిబద్ధత లేకపోవటం దానికి కారణం.
వారిది ఏ స్థాయి అంకిత భావమంటే అధికార రీత్యా కూడా అవకాశం ఉన్న చోటల్లా తెలుగును వాడుక లోకి తేవాలన్నది ఆయన పట్టుదల. ఈ పుస్తకం నిండా దానికి గట్టి ఆధారాలు ఎన్నో లభిస్తాయి. వ్యక్తిగతంగా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తూనే తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ, దానితో ఆగి పోకుండా, లిపి సంస్కరణల నుంచి నాయకుల, అధికారుల అలసత్వాన్ని ప్రశ్నించే పాటి గుండె దిటవు నన్ను ఆశ్చర్య చకితుణ్ని చేసింది. అధికార భాషా సంఘం అలసత్వాన్ని , యూపీపిఎస్సీ నిర్వాహకులను ప్రశ్నించడం నన్ను విస్మయానికి గురిచేసింది. ధృఢమైన నిశ్చయం తీవ్రమైన నిబద్ధత విశేషభాషాభిమానం కల్గిన ఇలాంటి అధికారులు ఎందరో ఉన్నా మరీ మన తెలుగు భాష ఎందుకు ఇంతగా వెనుకబడి ఉందనేది నన్ను ఎన్నో ఆలోచనల్లోకి నెట్టింది. ఈ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భాష పట్ల నా అవగాహనను మీతో పంచుకోవాలనిపిస్తోంది.
నా తెలుగుతల్లికి మల్లెపూదండ
తెలుగును ‘అజంత‘ భాషగా పిలుస్తారు. మాటలన్నీ అచ్చులతో అంతమవడం దానికి కారణం. తెలుగు సాహిత్యం ఏదేశ భాషకూ తీసిపోదు. సాక్షాత్తు శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువే ‘దేశ భాషలందు తెలుగు లెస్స‘ అన్నాడు. ‘తెలుగదేలయన్న దేశంబు తెనుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ‘ అని ఒక నిర్ణయానికి వచ్చాడు కృష్ణరాయలు. ‘భాషలొక పది తెలసిన ప్రభువు మదిని గెలుచుకున్నట్టి మేటి మా తెలుగుభాష‘ అని తెలుగువారు గర్వపడుతుంటారు. గీర్వాణ భాషలోని అమరకావ్యాలను తెలుగులోకి అనువదించే అవకాశం లభిస్తే కవులు పొంగిపోయేవారు. ‘నన్నయ తిక్కనాది కవులీయుర్విన్ పురాణావళుల్ తెనుగుం జేయుచు, మత్పురాకృత శుభాధిక్యంబు‘ ఫలించి భాగవతం మాత్రం తనకు వదిలిపెట్టారని పోతన్న ఎంతో ముచ్చటపడ్డాడు. నిజానికి అది పోతన్న అదృష్టం కాదు. తెలుగు వారి పుణ్యఫలం. అలాంటి కవులు జన్మించడం జాతికే గర్వకారణం!
తెలుగుభాషను సుసంపన్నం చేసిన ఖ్యాతి ఎందరో సత్కవులకు దక్కుతుంది. ఆది కవి నన్నయ మొదలు- ఆధునిక కవుల వరకు చాలామందికి ఆ పుణ్యంలో భాగం ఉంది. ‘తెరపి వెన్నెల ఆణిముత్యాల సొబగు పునుగు జవ్వాది ఆమని పూలవలపు, మురళి రవళులు కస్తూరి పరిమళములు కలసి ఏర్పడె సుమ్ము మా తెలుగుభాష‘ అన్న నండూరి రామకృష్ణమాచార్య పలుకుల్లో సాహిత్యాభిమానుల గుండె చప్పుళ్ళు ప్రతిధ్వనిస్తాయి. ఆ అభిరుచి విశేషాన్ని ప్రశంసిస్తూ రాయప్రోలు, ‘సంతోషింపగదమ్మ ఆంధ్రజననీ! సారస్వత స్నాన విశ్రాంతి ప్రీతుల, నీదు పుత్రకుల, దీక్షాబద్ధులం చూచి‘ అని తెలుగు తల్లికి విన్నవించారు. చక్కని తెలుగు వింటుంటే సంగీతం విన్నట్లుంటుందన్నది చాలామందికి అనుభవం. విశ్వనాథ ‘ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్డు విన్పించు భాష‘ అంటూ తీపి పలుకును కొనియాడారు. నండూరి దృష్టిలో తెలుగు భాష ‘సాహితీ తరంగ సంగీత రసధుని!‘ ఈ కవులంతా పూర్వకుల సత్తాను పరిచయం చేయడం ద్వారా పాఠకులకు అభిరుచిని నేర్పారు. రసజ్ఞతను మప్పారు. ‘పలికిన పల్కు పల్కునను పట్టున పిండిన క్రొత్త తేనియల్‘ చవి చూపించారు. భాషపై ప్రేమను పెంచారు. పరంపరను కాపాడుతూ వచ్చారు. మన వరకు తెలిసేలా చేశారు. తుమ్మల మాటల్లో ‘ఏ పుణ్యలేశమ్ము నా పాలిదాయెనో నీ పావనోదార శ్రీపరంపరలలో నీ పదార్చకులలో నేను నొక్కడనైతిని‘ అని మనం గర్వించేలా చేశారు.
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం మాత్రం కొనుక్కో‘ అని కందుకూరి వీరేశలింగం చెప్పినంత కాకపోయినా యువతరానికి తెలుగుభాషా సాహిత్యాల పట్ల చెప్పుకోదగ్గ సదభిప్రాయం అంటూ ఉంది. అయితే చాలామందికి చదివే ఓపిక, తీరిక లేవు. ‘పొట్టకూటికి కాదివి గిట్టుబాటు‘ అన్న భావంతో కొందరు దూరం పెట్టారు. పట్టుతేనె రుచి తెలియక శాక్రిన్ తీపితో మురిసిపోతున్నారు మరికొందరు .శివకేరా ప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస గ్రంథం ‘యుకెన్విన్‘ అట్టమీద వాక్యం ‘విన్నర్స్ డోన్ట్ డూ ది డిఫరెంట్ ధింగ్స్, దేడూ ది థింగ్స్ డిఫరెంట్లీ‘ అన్నదాన్ని అరవై ఏళ్ళ క్రితమే విశ్వనాధ అంతకన్నా ప్రభావవంతంగా చెప్పారని యువతకు గుర్తు చేసేవారు కరువయ్యారు. రాముడి గురించి మారీచుడు “అందరి వలె మాట్లాడడు,అందరివలె చేయడేదియైనన్ తన ఆత్మం ఒలుకబోసిన చందంబున పలుకు సేయు సర్వము తానై” అని రావణుడికి చెప్పాడు. ఆ వాక్యాన్ని శివకేరా మాటలతో పోల్చి చెబితే ఏది మెరుగైనదో యువత తేల్చుకోగలరు.
తెలుగుభాషా సంధర్భాన్ని తిలకించిన వారు, దాని మాధుర్యాన్ని ఆస్వాదించిన వారు యువతకు వాటిని పరిచయం చేయాలన్నది శ్రీ రహంతుల్లా గారి వాదన. దానికి అనుగుణంగా ఆయన చేస్తున్న సూచనలు మెచ్చుకోదగినట్లున్నాయి. లిపిని సంస్కరిస్తేనే మంచి రోజులు , దేవుడికి తెలుగు రాదు వంటి వ్యాసాల్లో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను మనం ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి.
పార్లమెంటులో తెలుగు వినపడాలి అన్న వ్యాసం చదివినప్పుడు నాకు తమిళుల భాషాభిమానం గుర్తుకొచ్చింది. ఈ విషయంలో మనం చాలా వెనుకబడ్డాం.
తమిళుల మాతృభాషాభిమానం ఎంత తీవ్రమైనదో మనకు తెలుసు. భాష విషయంలో వారిది కేవలం మథన కుతూహలంకాదు,కదన కుతూహలమూ వారిలో ఎక్కువే. 1999 లో భాజపా ప్రభుత్వం సంస్కృత భాషకు రాజసత్కారం తలపెడితే మా తమిళం సంగతేమిటని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిరసన దీక్షలు పూనారు. ప్రభుత్వం స్వయంగా బంద్ నిర్వహించింది. జనజీవనం స్తంభించింది. పరభాషా నాయికలు తమిళ చిత్రాలలో నటించడానికి అభ్యంతరం లేదు. అయితే తమిళ భాష నేర్చి,సంభాషణలు స్వయంగా పలికి తీరాలన్నది అక్కడి ప్రజల పట్టుదల. తమ మాతృభాష పట్ల వారికింత ప్రచండమైనది నిబద్ధత, ధృడవైఖరి ఉన్నాయి కాబట్టే – రాజకీయ పక్షాలూ ఆదారినే నడుస్తున్నాయి. 1999 ఆందోళనల్లో తమ భాషకోసం రాజకీయనేతలు జైళ్ళకు వెళ్లారు. అంతెందుకు 1996 ఎన్నికల ముందు తిరుచ్చిలో జరిగిన డిఎంకె సదస్సు తమిళాన్ని కేంద్రం ప్రాచీనభాషగా గుర్తించి తీరాలని రాజకీయ తీర్మానం చేసింది. దాన్ని తమ ఎన్నికల వాగ్దానాలలో ప్రముఖంగా ప్రజల ముందుకు తెచ్చింది. ఈ వైఖరిని తెలుగు ప్రజలు ఏరకంగా అర్థంచేసుకోవాలి?
తమిళ మహాసభలు కోయంబత్తూర్ లో వైభవంగా జరిగాయి. కొన్నేళ్ళక్రితం అప్పటి ముఖ్యమంత్రి డా||కరుణానిధి మహాసభల భూమికను వివరిస్తూ ఇరవై రోజుల ముందుగా ‘హిందూ’ పత్రికలో విఫులమైన వ్యాసం రాశారు. ప్రాచీన భాషగా గుర్తింపు పొందేందుకై తమ ముందుతరం చేసిన విశేష కృషిని శ్లాఘిస్తూ మొదలైన ఆ వ్యాసం దానికై తమిళానికి గల అర్హతను, ఔచిత్యాన్ని నిరూపిస్తూ సాగింది. రాబోయే తరాలకు సర్వసత్తాకమైన భాషను అందించడానికి అవసరమైన దిశానిర్దేశం చేస్తూ ముగిసింది. “శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతిని దృష్టిలో పెట్టుకుని, ఆదునిక యుగ అవసరాలకు సరితూగేలా తమిళభాష తగినంత పరిపుష్టిని సాధించుకోవడానికి ఈ మహాసభలు దారిచూపిస్తాయి. రాబోయే శతాబ్దంలోకి భాషను సగర్వంగా తోడ్కొని వెళతాయి“ అని డా||కరుణానిధి తమ ధృడసంకల్పాన్ని వెల్లడి చేశారు. తానే స్వయంగా సమావేశాల ఇతివృత్త గీతాన్ని (థీమ్ సాంగ్) రచించి, అంతటి పెద్దవయసులోనూ ఉత్సవ నిర్వహణకు తానే పూనుకున్నారు. దీంతో ప్రజలు ఎంత ఉత్తేజితులై ఉంటారో మనం ఊహించుకోవచ్చు. మన పొరుగునే ఉన్న తమిళ ప్రజల, రాజకీయ నేతల తపన, భాషపట్ల అంకిత భావం, చిత్తశుద్ధి, దీక్షల నుండి మనం ఏమైనా నేర్చుకోగల్గితే ఎంత బాగుండును !
శ్రీ రహంతుల్లా గారి అభి ప్రాయాలతో మనం పూర్తి గా ఏకీభవించక పోవచ్చు. కాని వారి చిత్తశుద్ధి మాత్రం తప్పక ఆకట్టుకుంటుంది. వారి సూచనలు సర్వదా ఆమోద యోగ్యం అనిపిస్తాయి. వాటికోసం తెలుగువారంతా ఈ వ్యాసాలను తప్పక అనుశీలించాలి. మరో సారి వారిని మనసారా అభినందిస్తూ, వారి నుంచి మరిన్ని వ్యాసాలను ఆహ్వానిస్తున్నాను.
ఎర్రాప్రగడ రామకృష్ణ
ఈనాడు రచయిత ,రాజమండ్రి
9397907344
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
https://www.facebook.com/nrahamthulla/posts/1924511834247464
రిప్లయితొలగించండి