17, మే 2018, గురువారం

సయ్యద్ నశీర్ అహమ్మద్ ఆప్తవాక్యం




సయ్యద్ నశీర్ అహమ్మద్                                                           
ప్రముఖ రచయిత, చరిత్రకారుడు
 ఆప్తవాక్యం
తెలుగు భాషోద్యమకారులు శ్రీ నూర్ బాషా రహంతుల్లా 2000 లో నాకు పరిచయమయ్యారు. ఆయన సోదరులు, నా మిత్రులు డాక్టర్ నూర్ బాషా అబ్దుల్ (ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం, గుంటూరు) ద్వారా అప్పట్లో ఆకివీడు మండల రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేస్తున్న శ్రీ రహంతుల్లాతో నాకు స్నేహం కుదిరింది. నేను 2001 లో రాసిన భారత స్వాతంత్యోద్యమం : ఆంధ్రప్రదేశ్ ముస్లింలు’  పుస్తకాన్ని చదివిన శ్రీ రహంతుల్లా ఈ పుస్తకాన్ని ప్రజాప్రతినిధులకు అందజేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ తనకు పరిచయం ఉన్న ఆకివీడు పెద్దల ద్వారా నాలుగు వందల ప్రతులను ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు పంపిణి చేయించారు. ఈ విధంగా ఆరంభమైన మా స్నేహం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడులో ఇల్లు కొని స్థిరపడ్డాక ఆ ఇంటి సమీపాన నా గృహం కూడా ఉండటంతో మా మిత్రత్వం మరింతగా బలపడింది. ఆ తరువాత 2006 నుండి మేమిరువురం ఉదయం పూట నడకకు వెళ్ళటం ప్రారంభించాము. ఆ ఉదయం పూట నడక ఈనాటికి కొనసాగుతుండటం, మా ఇళ్ళ మధ్య 12 ఏండ్లుగా రాకపోకలు, వివిధ అంశాల మీద చర్చలు-సమాలోచనలు, వాదోపవాదనలు మా ఇరువురి మధ్య నిత్యం కొనసాగుతూరావడం వలన ఆయనను కొంతలో కొంత అర్థం చేసుకున్నాననుకుంటున్నా. ఆ కారణంగా శ్రీ రహంతుల్లా రచించిన తెలుగులో  పాలన పుస్తకానికి ఆప్తవాక్యం రాస్తున్నాను.
చిన్నతనం నుండి తెలుగు  బాషపట్ల మక్కువ ఏర్పర్చుకున్న శ్రీ నూర్ బాషా రహంతుల్లా 1974 నుండి రాయటం ఆరంభించారు. 1974 లో తొలిసారిగా ఆయన ఒక కథను రాశారు. ఆ కథను ఆయన ఉంటున్న బాపట్ల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ సంరక్షకులు శ్రీ రంగారావు చూసి అభినందించడంతో ఉత్సాహభరితుడైన శ్రీ రహంతుల్లా పుస్తకాలను విస్త్రుతంగా చదవడం, రాయడం ఆరంబించారు. ఆ క్రమంలో ముందుగా ప్రజల సమస్యలను స్వయంగా తనకు ఎదురైన సమస్యల గురించి వివిధ తెలుగు పత్రికలకు లేఖలు రాయడం ప్రారంభించారు. ఈ ప్రవృత్తిని ఆయన 1978 లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరాక కూడా సాగించారు. ఆయనకు, ప్రజలకు ఎదురయ్యే సమస్యలను అధికారులకు ఆ సమస్యల పూర్వోపరాలను వివరిస్తూ, పరిష్కారమార్గాలను సూచిస్తూ వినతిపత్రాలను పంపటం అలవాటుగా చేసుకున్నారు.

మంచి చదువరి అయిన శ్రీ రహంతుల్లా విద్యార్థి దశలోనే క్రైస్తవ ధార్మిక సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేశారు. సంవత్సరాల తరబడి సాగిన ఈ అధ్యయనానికి ప్రతిఫలంగా వివిధ వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థల నుండి ప్రసంశలు, వందలాది ప్రశంసా పత్రాలను పొందారు. క్రైస్తవ ధార్మిక వ్వవస్థలోని పలు మౌలిక అంశాల మీద శ్రీ రహంతుల్లా వందలాది వ్యాసాలు రాశారు. 1976 నుండి 1996 వరకు వందలాది క్రైస్తవ ధార్మిక వ్యాసాలను ఆంగ్ల భాష నుండి తెలుగులోకి అనువదించారు. ఈ వ్యాసాలు సత్యసువార్త (పాలకొల్లు), సత్యస్వరం(హైదరాబాద్), ఎక్లీసియా (రాజమండ్రి) తదితర పత్రికలలో చోటుచేసుకున్నాయి. ఆయన 1980 లో భగవద్గీతను గ్రాంధిక బాష నుండి వాడుక బాషలోకి స్వయంగా మార్చుకుని అధ్యయనం చేశారు. ఆ తరువాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో తరలివెళ్ళినప్పుడు సహచర ఉద్యోగి, ప్రముఖ రచయిత శ్రీ అబుల్ ఇర్ఫాన్ ప్రోద్భలం వలన ఇస్లామిక్ ధార్మిక గ్రంథాల అధ్యయనం ఆరంభించారు. గ్రంథాలయంలో ప్రధానంగా ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం లోని అన్నీ సంపుటాలను లోతుగా అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా వందలాది పుటల నోట్స్ కూడా తయారుచేసుకున్నారు.
ఈ మేరకు సమకూర్చుకున్న సమాచారంతో ఇస్లాంకు సంబంధించిన వందలాది వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలు గీటురాయి (హైదరాబాద్), నెలవంక (పాలకొల్లు), ఆంధ్రపత్రిక (హైదరాబాద్) లాంటి వివిధ వార, మాస, దినపత్రికలలో వెలువడ్డాయి. వెలువడుతున్నాయి. సర్వమత సమభావన ప్రదర్శించే శ్రీ రహంతుల్లా అన్ని ధార్మిక గ్రంథాలను అందరూ చదవాలి. అన్నిటినీ వివక్ష లేకుండా అధ్యయనం చేయాలంటారు. ఈ ధార్మిక గ్రంధాల అధ్యయనంలో, ఆయా మతస్థుల ఆచరణలో తనకు నచ్చిన విషయాలపట్ల తన రచనలలో ఎంతటి గౌరవాన్ని వ్యక్తం చేస్తారో ఆయనకు నచ్చని విషయాల పట్ల కూడా అంత తీవ్రంగా స్పందిస్తారు. తనను తాను ఆస్తిక హేతువాది గా ప్రకటించుకున్న ఆయన తనకు నచ్చిన లేక నచ్చని విషయాలను ప్రజలు ధార్మిక పండితులతో చర్చకు పెడతారు. శ్రీ రహంతుల్లా తెలుగు బాషలో నమాజు (19-7-1987, ఆంధ్రపత్రిక) అనే వ్యాసం ద్వారా తెలుగులో వారిని ఖురాను చదువుకోనివ్వడం, నమాజు చేసుకోనివ్వడం, వివాహాలు జరుపుకోనివ్వడం మేలు, ఈ విషయంలో సంస్కరణలు జరగాలి అంటూ సూచనలు చేశారు. ఈ వ్యాసం ప్రజలు, ధార్మిక పండితులలో చాలా కాలం చర్చనీయాంశం అయ్యింది. మన దేశంలో ముస్లిం ప్రజానీకంలో పెళ్ళిళ్ళు నిఖానామా ను ఉర్దూ భాషలో నిర్వహిస్తారు. ఆ నిఖానామా మీద వధువు- వరుడి, సాక్షుల చేత తమకొచ్చిన భాషలో సంతకాలు చేయిస్తారు. ప్రతి దంపతుల జీవితంలో ఎంతో ప్రాధాన్యత గల నిఖానామా ఉర్దూ భాష రాని తెలుగు ముస్లిముల కోసం  తెలుగులో రూపకల్పన చేయాలంటూ పదిమందిలో చర్చకు పెట్టారు (సాక్షి దిపత్రిక 19-10-2010). ఆ విధంగా చర్చకు పెట్టి ఊరకుండకుండా ఉర్దూ-అరబ్బీ-తెలుగు భాషలు తెలిసిన ధార్మిక పండితులను సంప్రదించారు. ఆ పండితుల సహకారంతో నిఖానామా  తెలుగు భాషలో రూపొందించారు. ఆ నిఖానామా ను తాను 2012 లో వెలువరించిన తెలుగు దేవభాషే గ్రంథంలో తెలుగులో పెళ్ళి(పుట 130-133) శీర్థికన ప్రచురించి పదిమంది దృష్టికి తెచ్చారు.అలాగే తెలుగు ఉర్దూ ప్రజలకు పరస్పరం ఒకరి బాష మరొకరికి అర్థం కావాలంటే నిఘంటువులు రావాలంటారు. 1938 నాటి ఐ. కొండలరావు గారి ఉర్దూ తెలుగు నిఘంటువును సంపాదించి అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎబికె ప్రసాద్ గారికి ఇచ్చి ప్రచురింపజేశారు.
తెలుగును అమితంగా ప్రేమించే శ్రీ రహంతుల్లా తెలుగు భాషోద్ధరణ, పరిరక్షణకు కంకణం కట్టుకుని తెలుగు బాషకు మరింత ఆయుష్షు పోసేందుకు నిరంతర అధ్యయనం, రచన, ప్రచురణ సాగిస్తున్నారు. ప్రస్తుత తెలుగులో పాలన గ్రంథానికి ముందు 2004 లో  తెలుగు అధికార భాష కావాలంటే, 2012 లో తెలుగు దేవభాషే అను గ్రంథాలను శ్రీ రహంతుల్లా ప్రచురించారు. ఈ పుస్తక ప్రచురణ సమయంలో శ్రీ రహంతుల్లా కు నా వంతు ప్రోత్సాహాన్ని అందించాను. ఆ రెండు గ్రంథాలకు కూడా ముందుమాట రాయమని ఆయన నన్ను కోరారు. తెలుగు భాషోద్యమంలో పాల్గొంటున్న పెద్దల ద్వారా ముందుమాటలు రాయిస్తే మంచిదన్న భావనతో నేను కాదన్నాను. గత 18 ఏండ్ల మా పరోక్ష పరిచయం 12 ఏండ్లుగా సాగుతున్న ప్రత్యక్ష పరిచయం వలన శ్రీ రహంతుల్లాను అతి సమీపం నుండి చూడటం, ఆయనతో కలసి తెలుగు భాషోధ్యమంలో పాల్గొనడం, తెలుగు భాష పట్ల ఆయనకున్న మమకారాన్ని గమనించడం, ప్రజలకు పరిపాలన తెలుగు భాషలో అందాలన్న ఆయనలోని పట్టుదలను, అందుకు అనునిత్యం ఆయన పడుతున్న తపనను అర్థం చేసుకున్నాక ఈసారి కాదనడం నాకు సాధ్యం కాలేదు. ఆ కారణంగా ముందుమాటకు బదులుగా ఆప్తవాక్యం అందిస్తున్నాను.
శ్రీ నూర్ బాషా రహంతుల్లా అక్షర పోరాట యోధుడు, అక్షరం ద్వారా తెలుగు భాషా పరిరక్షణకు కంకణ బద్ధుడైయున్నారు. తెలుగు భాష పరిరక్షణకు సాగుతున్న ఉద్యమాలలో ఆయన భౌతిక ఉద్యమాలలో కన్పించరు. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినా, తెలుగు భాషా పరిరక్షణ మహాసభలు జరిగినా, తెలుగు భాషోద్యమ సభలు, సమావేశాలు, సదస్సులు, చిన్న చిన్న గోష్టులు ఎక్కడ జరిగినా ఆహ్వానం అందటంతోనే అక్కడకు రెక్కలు కట్టుకుని వాలిపోతారు. ఆయా సభలు-సమావేశాల్లో క్రియాత్మకంగా పాల్గొంటూ చర్విత చర్వణంతో సభికులను సహన పరిక్షకు గురిచెయ్యకుండా, నిర్వాహకులకు అసౌకర్యం కల్గించకుండా తన నిర్మాణాత్మక సూచనలను చెప్పి ఆయా వినతి పత్రాలను సంబంధితులకు అందించి వినయంగా నిష్క్రమిస్తారు. ఏ ప్రముఖుడికి సూచనలు, సలహాలు అందజేసిన ఏ సభలో, ఏ సమావేశంలో ప్రసంగించినా ఆయా విషయాలను ఖచ్చితంగా పత్రాల రూపంలో సంబంధితులకు అందించడం మాత్రమే కాకుండా ఆయా పత్రాల జిరాక్స్ కాపీలను తీసి తనకు తెలిసిన తెలుగు భాషోద్యమకారులకు అందించి, అంతర్జాలం ద్వారా పదిమందికి అందుబాటులోకి తెస్తారు.
మొదటి నుండి తెలుగు భాషాప్రియుడిగా తెలుగు భాషాభివృద్ధి,పరిరక్షణ, విస్త్రుతిని ఆకాంక్షిస్తున్న శ్రీ రహంతుల్లా 1974 నుండి తెలుగు భాషా రంగాన అక్షరయోధుడిగా ఉద్యమించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ పాలన ఆంగ్లభాషలో సాగుతున్నందున పరాయి భాష ఏ మాత్రం పరిచయం లేని సామాన్య తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా, ఉన్నతాధికారిగా అత్యంత సమీపం నుండి ఆచరణాత్మకంగా గమనించారు, గుర్తించారు. పరాయి భాష పరిచయం లేనందున తెలుగు ప్రజల పరాధీనత, నిస్సహాయతను తద్వారా అనుభవిస్తున్న అధిక వ్యయప్రయాసలను, అవమానాలను చూస్తూ ఆయన సహించలేక పోయారు. తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషకు దూరంగా సాగుతున్న పాలన వలన తెలుగు ప్రజలు పడుతున్న వెతలను రూపుమాపుటకు తీసుకోవాల్సిన ఆచరణయోగ్యమైన చర్యలను ప్రభుత్వాధినేతలకు ఎరుక పరచాలన్న ఉద్దేశ్యంతో 1972 నుండి లేఖాస్త్రం చేబట్టారు. ఆనాటి నుండి తెలుగు భాషా పరిరక్షణోద్యమం మాత్రమే కాకుండా, తెలుగులో పరిపాలనోద్యమాన్ని కూడా శ్రీ రహంతుల్లా సమాంతరంగా సాగిస్తున్నారు.
తెలుగు భాషోద్యమకారుడిగా లేఖాస్త్రాలను సంధించడం దగ్గర నుండి ఆరంభమైన ఆయన ఉద్యమకార్యాచరణ మెల్లగా  వ్యాసాల రూపం దిద్దుకుంది. ఆయన మస్తిష్కంలో మెరిసిన ప్రత్యేక విషయంగాని, అనుభవంలోకి వచ్చిన సార్వజననీయమైన అంశంగాని  ఏదైనా సరే ఆ విషయాన్ని ఒక వ్యాసంగా రూపొందించి సమాచారాన్ని ప్రజలలోకి ప్రవహింపజేయడానికి పత్రికలను, ప్రధాన సాధనంగా చేసుకున్నారు. ఆ లక్ష్యసాధనలో భాగంగా శ్రీ రహంతుల్లా అసంఖ్యాకంగా వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలలో తెలుగు భాషోద్యమానికి సంబంధించిన వ్యాసాలు మచ్చుకు కొన్ని తెలుగు భాషలో నమాజు (ఆంధ్రపత్రిక, 19-7-1987), అధికార భాషగా తెలుగు (6-7-1988, ఆంధ్రపత్రిక), తెలుగువారు పలికే ఉర్దూపదాలు (గీటురాయి, 27-1-1989), తెలుగు అధికార భాష కావాలంటే (15-2-1990), మాతృభాషలో జరిగే పాలనలో దళారులు ఉండరు (ఆకాశవాణి విశాఖపట్నం 21-2-2007), అధికారులారా! ఇలా మీరెందుకు రాయలేరు?! ‘ (సమ్మతి అవార్డు,సమాచార నేత్రం, జనవరి 2009), తెలుగు భాషకు సత్యసాయి అండ (నడుస్తున్న చరిత్ర, ఏప్రిల్ 2012), తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు, రచయితలు (గీటురాయి, 18-5-2012), పార్లమెంటులో తెలుగు వినపడాలి (తెలుగు వెలుగు, ఆగస్టు 2014), సర్వీసు కమీషన్లకు తెలుగు భాషా సేవ చేసే అవకాశం (సూర్య 12-11-2016), ఇంటి భాషలంటే ఎంత చులకనో! ‘ (31-3-2016 గీటురాయి), ‘దేవుడికి తెలుగు రాదు (17-12-2017, ఆంధ్రప్రభ), ఎక్కడున్న తెలుగు అక్కడే (తెలుగు వెలుగు, డిసెంబర్ 2017), జనభాషకు జేజేలు (ఆంధ్రప్రభ 29-11-2017), జనభాషకు జేజేలు (ఆంధ్రప్రక్ష 29-11-2017), చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు (ఆంధ్రప్రభ, 15-12-2017), లిపిని సంస్కరిస్తేనే మంచి రోజులు (ఆంధ్రప్రభ 21-2-2018), విక్టోరియా మహారాణి బంగారు పతకం తెలుగు లిపిలో ఉంది (అమ్మనుడి, ఫిబ్రవరి 2018), తెలుగులో పెళ్ళి (తెలుగు దేవ భాషే, పుట 139-138), అన్ని భాషలూ దేవ భాషలే (తెలుగు దేవ భాషే 118-129), తెలుగు తల్లి భాష కూడా దేవ భాషే (తెలుగు దేవ భాషే, పుట 106-117), ఈ వ్యాసాల శీర్షికలే ఆ వ్యాసాంశాన్ని వెల్లడి చేస్తాయి. ఈ వ్యాసాలు శ్రీ రహంతుల్లాలోని తెలుగు భాష ప్రియత్వాన్ని వెల్లడిస్తాయి.
తెలుగు భాషాభివృద్ధికి, పరిరక్షణకు శ్రీ రహంతుల్లా దాదాపు మూడు దశాబ్దాల నుండి కృషి చేస్తున్నారు. తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు పోటీ పరీక్షలలో ప్రత్యేక ప్రోత్సహక మార్కుల్ని, ఉద్యోగాలలో రిజర్వేషన్లను  కల్పించాలని ప్రభుత్వాధినేతలను కోరుతూ వివిధ వేదికల ద్వారా, లేఖల ద్వారా తన డిమాండ్ ను వెల్లడిస్తున్నారు. తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమీషన్ పరీక్షలలో తెలుగు భాషలో రాసిన అభ్యర్థులకు 1976లో జరిగిన ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా చేసిన తీర్మానం మేరకు ఐదుశాతం  ప్రోత్సాహక మార్కులని కల్పించింది రాష్ట్రప్రభుత్వం. ఈ ప్రోత్సాహక మార్కులు 1990 నుండి ఆగిపోయాయి.ఈ విధంగా ఆపేయడం సరికాదంటూ ఐదుశాతం అదనపు మార్కుల ప్రోత్సాహకాన్ని పునరుద్ధిరించాల్సిందిగా శ్రీ రహంతుల్లా ఆనాటినుండీ డిమాండ్ చేస్తున్నారు. (ఎక్కడున్న తెలుగు అక్కడే, తెలుగు వెలుగు మాసపత్రిక, డిసెంబర్ 2017).
తెలుగు భాష పరిరక్షణ విషయంలో శ్రీ రహంతుల్లా గిరి గీసుకుని కూర్చోలేదు. తెలుగు భాషలోకి వచ్చి కూర్చున్న అన్యభాషా పదాల విషయంలో ఆయన చాలా ఉదారవాది. ఏ భాషలోంచి ఏ పదం వచ్చినా అవి తెలుగు ప్రజల వాడుకలో స్థిరపడిపోయినట్టయితే, అటువంటి పదాలను స్వాగతించి తెలుగు ప్రజలు స్వంతం చేసుకోవాలంటారు. అసంఖ్యాకంగా తెలుగులో కలసిపోయి ఉన్న అన్య భాషా పదాలకు సమానమైన, సరైన తెలుగు పదాల కోసం శ్రమించడం, ఆ ప్రయత్నంలో సమయం వృధా చేయడం ఉచితం కాదన్నది ఆయన అభిప్రాయం. శతాబ్దాలుగా తెలుగు ప్రజల వాడుకలోకి వచ్చేసిన కొన్ని పరాయి భాషా పదాలను కూడా తెలుగు నిఘంటువులోకి చేర్చుకోవాలంటారు. ఆ విధంగా తెలుగు పద సంపద పెరుగుతుందని ఆయన అభిప్రాయం. ఆయనకు భాషకు సంబంధించిన లిపి గురించి కూడా పట్టింపులేదు. భాషగాని, లిపి గాని అందంగా కన్పించడం కంటె ప్రజల అవసరం తీర్చడం అత్యవసరం అంటారు. ఈ విషయాలు ఆయన రాసిన తెలుగు నిఘంటువులో చేరాల్సిన ఇంగ్లీషు పదాలు (గీటురాయి, 3-10-2003), ఇంగ్లీషునే లింకు లిపిగా చేస్తే ? ‘ (గీటురాయి, 11-6-2014). ప్రజల పదాలతో నిఘంటువు చేయాలి (గీటురాయి, ఈటీవీ ఇంటర్వ్యూ, 20-5-2007) లాంటి పలు వ్యాసాల ద్వారా రూఢీ అవుతుంది. ఈ వ్యాసాల ద్వారా ఆంగ్ల, ఉర్దూ తదితర భాషల్లోని వందలాది పదాలు ఏ విధంగా తెలుగు భాషలో కలసిపోయి తెలుగుతనాన్ని సంతరించుకున్నాయో ఆయన సాధికారికంగా వివరిస్తారు. ఈ విషయంలో తెలుగు భాషా పండితులు తమ సొంత అభిప్రాయాలను తెలుగు ప్రజల నెత్తిన రుద్దుతున్నారని ఆరోపిస్తారు. ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలను తన వ్యాసాల ద్వారా ప్రజల, పండితుల ఎరుకలోకి తెస్తారు. సామాన్య ప్రజలు వాడే భాష పట్ల పండితులకు గాని మరెవ్వరికీ గానీ చిన్న చూపు ఉండటం సరికాదంటారు. కూడికను సంకలనం అంటూ, తీసివేతను వ్యవకలనం అంటూ తెలుగు పదాల పేరుతో సంస్కృత పదాలను తెచ్చిపెడుతున్నారంటూ విచారం వ్యక్తం చేస్తారు. అసంఖ్యాక సామాన్య ప్రజలు ఉపయగించే అలతి అలతి తెలుగు పదాలన్నిటిని ఏర్చి, కూర్చి తెలుగు నిఘంటువులో చేర్చుకుంటూ నిఘంటువులను పరిపుష్టం చేయాలని వాంఛిస్తారు. ఈ ఆలోచనల మేరకు ఒక తెలుగు మహానిఘంటువును రూపొందించాలన్నది తన అభిమతమంటారు.
మన దేశంలోని వివిధ రాష్ట్రాలలోని ప్రజలు తమ తమ భాషల అభివృద్ధికి, పరిరక్షణకు అనుసరిస్తున్న విధానాలను శ్రీ రహంతుల్లా అధ్యయనం చేస్తుంటారు. ఆయా ప్రాంతాల మాతృభాషా ప్రియులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చర్యలను తెలుసుకుని మనమూ ఆచరించదగిన చర్యలను లేఖలు, వ్యాసాల రూపంలో ఇటు తెలుగు భాషోద్యమ నాయకులకు, అటు రాష్ట్ర ప్రభుత్వాధినేతల దృష్టికి తెస్తుంటారు. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో తమిళ సోదరులు తమ భాష పట్ల వ్యక్తం చేస్తున్న అవ్యాజ్య ప్రేమాభిమానాలను వివరిస్తూ ఆయన వ్యాసాలు రాశారు. అయ్యయ్యో...తెలుగు (గీటురాయి, 16-7-2004) అంటూ తెలుగు భాష ఊపిరితో నిలబడడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ వ్యాసం రాస్తూ, తమిళ నాయకులను చూసైనా నేర్చుకోవాలి శీర్షికన మరొక వ్యాసం రాసి తమిళ తంబీలు అనుసరిస్తున్న పద్ధతులు, తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల దృష్టికి తెచ్చారు (తెలుగు అధికార భాష కావాలంటే 2006, పుట 104-105), తమిళ మాధ్యమంలో డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసిన వారికి ప్రభుత్వ ఉద్యగాలలో తమిళనాడు ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించటాన్ని తమిళనాడు ఉన్నత న్యాయస్థానం కూడా పూర్తిగా సమర్థించింది. తమిళనాడు రాష్ట్రంలో అమలులో ఉన్నట్టు మన రాష్ట్రంలో కూడా 20 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు (ఎక్కడున్న తెలుగు అక్కడే, తెలుగు వెలుగు మాసపత్రిక, డిసెంబర్ 2017). ఈమధ్య తెలుగు మాధ్యమ అభ్యర్డులకూ  పదిశాతం ఉద్యోగాలిస్తామని మన మంత్రులు వాగ్ధానం చేశారు.ఈ వాగ్దానాన్ని పదే పదే ప్రభుత్వాధినేతలకు గుర్తుచేస్తున్నారు.
ప్రజల జీవన పద్ధతులు, ఆచార సాంప్రదాయాలను ఏకరువు పెట్టి, అతి పెద్ద విషయాన్ని అతి తేలిగ్గా అర్థం చేసుకోడానికి వీలు కల్పించే సామెతల పట్ల ఆయనకు ఆసక్తి అధ్యయనం ఎక్కువ. ఆ జిజ్ఞాస కారణంగా వేలాది సామెతలను సేకరించుకున్నారు. ఆయన ఎటువంటి జ్ఞానాన్ని సంతరించుకున్నా, పది మందికి ఉపయుక్తం కాగల ఎలాంటి సమాచారాన్ని సంపాదించుకున్నా ఆ భావ సంపద/అక్షర సంపదను అందరితో పంచుకుంటారు. తాను సేకరించుకున్న సామెతలను తన వ్యాసాలలో అలవోకగా ప్రయోగిస్తారు. తెలుగు వాక్యాలకు ధీటుగా తెలుగు సామెతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉబుసుపోక శీర్షికతో చిన్న చిన్న ఖండికలను హైదరాబాద్ నుండి వెలువడుతున్న గీటురాయి వారపత్రికలో ధారావాహికంగా రాశారు. ఆయన మనస్సునుగాని, మస్తిష్కాన్ని గాని స్మృశించిన సమకాలీన సమస్యలను, వింత-విశేషాలలో ప్రజోపకరమైన ఏ అంశాన్ని వదలకుండా తనదైన శైలిలో సున్నిత హాస్యాన్ని, చమత్కారాన్ని జోడిస్తూ గంభీరమైన వ్యవహారాన్ని కూడా సరిపడే భావాన్ని అందించగల తెలుగు సామెతలతో ఉబుసుపోక ఖండికలను ఆయన రూపొందించారు. 1986 నుండి 1993 వరకు వారం వారం ప్రత్యేక కథనాలతో గీటురాయి లో ప్రచురితమైన ఉబుసుపోక అసంఖ్యాక పాఠకులను ఆకర్షించింది.
శ్రీ  రహంతుల్లా తన ఎరుకలోకి వచ్చిన ప్రజా సమస్యలు, తెలుగు భాష వరకు మాత్రమే తన రచనా వ్యాసాంగాన్ని పరిమితం చేయలేదు. తెలుగు భాషను పరిపాలనకు మాత్రమే సరి పెట్టకుండా ఆర్థిక, సాంఘిక, విద్యా, వైద్య, సాంకేతిక, ధార్మిక తదితర ప్రజా జీవన రంగంతో ముడి పెట్టారు. ఆ కారణంగా భాషాపరంగా ఉద్యమిస్తున్న తెలుగు భాషోద్యమకారుడుగా మాత్రమే కాదు, ప్రజలు తమదైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, ప్రతి సామాజిక సమస్యను శ్రీ రహంతుల్లా తన లేఖాస్త్రానికి వస్తువుగా స్వీకరించారు. ప్రజల జీవనాన్ని మరింత సౌకర్యవంతం చేయగల మార్పులు చేర్పులను కూడా ఆయన చేపట్టారు. ప్రభుత్వపరంగా, పాలనా పరంగా జరిగిన, జరుగుతున్న అవకతవకలను, ప్రజల అలసత్వం, కాబట్టనితనం వలన సభ్య సమాజం అనుభవిస్తున్న వెతలను చూస్తూ ఆయనలోని సామాజిక ఉద్యమకారుడు, రచయిత మిన్నకుండలేక పోయాడు. ఆ కారణంగా శ్రీ రహంతుల్లా లేఖాస్త్రంతోపాటుగా వ్యాసాలను అస్త్రాలుగా మార్చి సంబంధితుల దిశగా సంధించడం ఆరంభించారు. ఈ మేరకు ఖజానా శాఖకు మోక్షం ఎప్పుడు? ‘ (25-5-1986, ఆంధ్రపత్రిక), చిన్న జిల్లాలే ప్రజలకు మేలు (28-12-1987, ఆంధ్రపత్రిక), కోస్తా అభివృద్ధి కోసం కొన్ని చర్యలు (ఆంధ్రపత్రిక), అందరికి ఇల్లు ఆశయం ఫలించేనా (9-5-1989, ఆంధ్రప్రభ), హైకోర్చు బెంచ్ ల ఏర్పాటు (1986, ఆంధ్రప్రభ), రోజాగార్ యోజనలో ప్రయోజనమెంత? ‘ (ఆంధ్రప్రభ, 21-5-1989), అక్కరకు రాని అపార భూసంపద (ఆంధ్రప్రభ, 13-6-1989), న్యాయవ్యవస్థ ప్రక్షాళన జరిగేదెలా? ‘ (28-6-1990, ఆంధ్రపత్రిక), ప్రజలకు పనికొచ్చేలా పాలనా వ్యవస్థ (ఆంధ్రప్రభ), రుణ భారతం మంచిది కాదు- అప్పుల సుడిగండంలో అభివృద్ధి నావ (31-3-1989), రిజర్వేషన్ల పరుగులో వెనుకబడిన కులాలు (8-8-1989, ఆంధ్రప్రభ), హైకోర్టుల స్థాపనలో శాస్త్రబద్ధత శూన్యం-కోస్తా రాయలసీమ ప్రజల పాలిట శాపం (గీటురాయి, 17-9-1993), తదితర వ్యాసాలను ఆయన వెలువరించారు. ఈ వ్యాసాల ద్వారా శ్రీ నూర్ బాషా రహంతుల్లాలోని భాషోద్యమకారుడితోపాటుగా సామాజిక ఉద్యమకారుడు కూడా బహిర్గతమవుతాడు.
రాష్ట్రప్రభుత్వంలో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ రహంతుల్లా ప్రజలపక్షం, ప్రజాసామ్యంలో ప్రజలు పాలకులు కనుక ప్రజల సంక్షేమమే శిరోధార్యంగా ఆయన వ్యవహరించారు. ప్రజల పక్షంగా వ్యవహరించడంలో ఆయన ఎటువంటి జంకుబొంకూ లేకుండా తన ఉద్యోగ భాధ్యత నిర్వహిస్తున్నారు. ఒక ప్రభుత్వాధికారిగా క్రమశిక్షణ, నిషేదాలు ఉన్నా ఆయన ప్రజల సంక్షేమం ప్రదానం అనుకున్నప్పుడు ఎవ్వరినీ ఖాతరు చెయ్యలేదు. ఆయన ప్రభుత్వాధినేతలకు కూడా నేరుగా ఉత్తరాలు రాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రజల వద్దకు పాలనను సునాయాసంగా తీసుకెళ్ళాలంటే సువిశాలంగా ఉన్న (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) రాష్ట్రంలో మరిన్ని జిల్లాలను సృష్టించాలని భావించి అప్పటి ముఖ్యమంత్రులు డాక్టర్ నందమూరి తారకరామారావుకు 1990 లో, డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి 1987 లో ప్రజల సమస్య పూర్వోపరాలను వివరిస్తూ, చిన్న చిన్న జిల్లాల ఉపయోగాన్ని విశదీకరిస్తూ లేఖలు రాసి తెలుగులోనే సమాధానాలు పొందారు. ఆనాడు శ్రీ రహంతుల్లా రాసిన వ్యాసాలలో చిన్నజిల్లాల నిర్మాణం-నేటి అవసరం(29-6-1980, ఆంద్రపత్రిక), ప్రజలకు చేరువలో ప్రభుత్వం : చిన్న చిన్న జిల్లాలు లేనిదే ఎలా సాద్యం (గీటురాయి, 18-8-1995) వెల్లడించినట్టుగా ప్రస్తుతం తెలంగాణలో చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిన్న జిల్లాల ఏర్పాటు గురించి అధికార అనధికార వర్గాలలో చర్చ జరుగుతుండటం విశేషం. చిన్న చిన్న జిల్లాలు మాత్రమే కాకుండా చిన్న రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మాత్రమే పరిపాలన ప్రజలకు చేరువవుతుందని ఆయన భావించి ప్రచారం చేశారు. ఈ విషయాన్ని 1990లో తాను రాసిన వ్యాసాలు చిన్న రాష్ట్రాల వాదన విచ్చిన్నకరమా? (ఆంధ్రప్రభ 3-3-1990), చింతలు దూరం చేసే చిన్న రాష్ట్రాలు (2-4-1991,ఆంధ్రప్రభ) ద్వారా ప్రజలతో పంచుకున్నారు.
తెలుగులో పాలన కోరుకుంటున్న శ్రీ రహంతుల్లా రాష్ట్ర రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారిగా ప్రజలకు చేరువయ్యేందుకు తెలుగు భాషలో పాలనా పద్ధతులను పాటిస్తున్నారు. ఆయన తహసీల్దార్ గా రెవెన్యూ శాఖలో చేరినప్పటి నుండి తన పరిధిలో తెలుగు భాషను అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. తెలుగు భాషలో పాలన జరిగితే మధ్యదళారుల ప్రమేయం తగ్గుతుందని గట్టిగా నమ్మిన ఆయన 2004 లో రంపచోడవరంలో  సంచార న్యాయాధికారిగా బాధ్యతలు చేపట్టినప్పుడు న్యాయస్థానంలో తెలుగును ఉపయోగించ పూనుకున్నారు. న్యాయవాదుల సహకారం లేకపోవడం, చట్టపరమైన కొన్ని అవరోధాల కారణంగా ఆయన ప్రయోగం విజయవంతం కాలేదు. ఆ తరువాత 2007 లో పులిచింతలలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు సమ్మతి అవార్డు ను పూర్తిగా తెలుగులో ప్రకటించి ఇటు ప్రజల నుండి అటు తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ ఏబికె ప్రసాద్ ల నుండి ప్రశంసలు అందుకున్నారు. 2015 లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని సిఆర్ డి ఎ లో ఉన్నతాధికారిగా బాధ్యతలు చేపట్టినా తన ప్రయత్నాలను విరమించుకోలేదు. తెలుగు భాషలో సమాచారాన్ని అందించవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులున్నా ఆచరణలో అవి న్యాయస్థానాలలో విఫలమౌతున్నాయన్నారు. 2017 లో ఒక వివాదం విషయమై రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదికి తెలుగులోనే ప్రతివాదనలు పంపారు.అందుకు ఆ ప్రభుత్వ న్యాయవాది  “ఇంగ్లీషు రాకుండా డిప్యూటీ కలక్టర్ ఎలా అయ్యారు?”  అని ప్రశ్నించగా, ఇది మీ ఆంగ్లభాషాహంకారానికి గుర్తు మీకు తెలుగురాదా? న్యాయం తెలుగులోనూ చెప్పవచ్చు అని శ్రీ రహంతుల్లా  ఆ న్యాయవాదికి సంబందిత ప్రభుత్వ ఉత్తర్వులను  చూపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది .
తెలుగు భాష పట్ల అలవికానంత ప్రేమ కలిగియున్న శ్రీ రహంతుల్లాలో పరిశోధకుడు కూడా దాగున్నాడు. తెలుగు భాష ఔన్నత్యాన్ని, ప్రాధాన్యతను చాటే విషయాలను, తెలుగు భాషకు ఆలంబనగా నిలిచే దృష్టాంతరాల కోసం ఆయనలోని పరిశోధకుడు వెతుకులాడుతుంటాడు. ఆయన కర్నూలులో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న సందర్భంగా, కొయిలకుంట్లకు చెందిన వదాన్యులు శ్రీ బుద్ధా వెంగళ రెడ్డికి విక్టోరియా మహారాణి 1866 లో తెలుగు భాషలో ప్రశంసాపత్రాన్ని తయారు చేసి పంపించిందన్న సమాచారం తెలిసింది. ఆ విషయం తెలియగానే ఆఘుమేఘాల మీద ఆయన శ్రీ బుద్ధా వెంగళ రెడ్డి వారసుల వద్దకు వెళ్ళి, అలనాటి పతకాలను, ఆయా పత్రాలను పరిశీలించి వాటి ఛాయా చిత్రాలతో సహా వ్యాసం రాసి ఈ చారిత్రక విశేష సమాచారాన్ని ప్రజలకు తెలిపారు (అమ్మనుడి మాసపత్రిక, 2018 ఫిబ్రవరి).  ఈ విధంగా వెలికితీతల కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రముఖుడైనా తెలుగు భాష గురించి వెల్లడించిన  సానుకూల వాక్యాలు, మాటలు ఉన్నట్లయితే శ్రమకోర్చి వెతికిపట్టుకుని తన వ్యాసాలలో ఆ అంశాలను పొందుపర్చి తద్వారా ప్రజల దృష్టికి తెస్తుంటారు. ఈ క్రమంలో శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా తెలుగు ప్రాశస్థ్యాన్ని వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలను  వెల్లడించడం మాత్రమే కాకుండా శ్రీ సాయిబాబా తెలుగులో రాసిన లేఖను కూడా ఆయన ప్రచురించారు(తెలుగు భాషకు సత్యసాయి అండ (వ్యాసం), నడుస్తున్న చరిత్ర, ఏప్రిల్ 2012).
ఈ ప్రయత్నాలన్నీ ఒక ఎత్తయితే పరుగులెత్తుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకుని ఆ సాంకేతికతను తెలుగు భాషోద్యమానికి శ్రీ రహంతుల్లా ఉపయోగిస్తారు. ఆయనకు 2004 లో అంతర్జాలం అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి అంతర్జాలం ద్వారా సమాచార మార్పిడికి అందుబాటులోకి వచ్చి ముఖపుస్తకం, బ్లాగులు, వాట్సాప్, టెలిగ్రాం లాంటి సమాచార చేరవేత వ్యవస్థలను విస్త్రుతంగా ఉపయోగిస్తున్నారు. తెలుగు ముస్లింలు, తెలుగు అధికార భాష కావాలంటే, సందేశాత్మక గీతాలు లాంటి పలు బ్లాగులను 2007 లో ఆరంభించి  సంబంధిత సమాచారాన్ని ఆయా బ్లాగులలో పొందుపర్చి ప్రజల పరం చేస్తున్నారు. ఈ వ్యవస్థలలో తన వ్యాసాలు, తాను సేకరించిన సమాచారంతో సుసంపన్నం చేస్తున్నారు. ముఖపుస్తకం, బ్లాగ్స్, వాట్సాప్,  టెలిగ్రాం లాంటి సమాచార చేరవేత వ్యవస్థలను ఆయన బాగా ఉపయోగించుకోవడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఆయా వ్యవస్థలను సులువుగా ఉపయోగించుకోవడానికి అవసరమగు సాంకేతిక సమాచారం, పరిజ్ఞానాన్ని తనదైన రీతిలో తెలుగులో రూపొందించి కరపత్రాలు ప్రచురిస్తున్నారు. ఈ కరపత్రాలను తెలుగు భాషోద్యమ సభలు, సమావేశాల్లో , ప్రజల్లో పంపిణీ చేస్తున్నారు. ఆయా కరపత్రాలను తన గ్రంథాలలో కూడా పొందుపర్చుతూ పుస్తక ప్రియులకు అందుబాటులోకి తెచ్చి మరింత ఉపయుక్తం చేస్తున్నారు (కంప్యూటర్లో తెలుగు-తెలుగు వెబ్ సైట్లు, తెలుగు దేవభాషే, 2012, పుట 82-86).
ఈ కృషిలో భాగంగా 2010 లో ముఖపుస్తకం ఆరంభించి ఆసక్తిదాయకమైన పలు అంశాలతోపాటుగా ప్రజలకు ప్రయోజనకరమని భావించిన ప్రతి సమాచారాన్ని సేకరించి పోస్టు చేస్తున్నారు. ఆయన ప్రజా జీవన రంగాలను ప్రభావితం చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా తన ముఖపుస్తకం ద్వారా చర్చకు పెడుతున్నారు. ఈ పోస్టింగ్స్ వలన అనుకూల-ప్రతికూల చర్చలు జరిగినా , ఆ చర్చల ఫలితంగా సరికొత్త సమాచారం వెలుగులోకి రావడం మాత్రమే కాకుండా నూతన కోణాలు కూడా బహిర్గతం అవుతాయని శ్రీ రహంతుల్లా భావిస్తారు. “మన ముఖం మనకుండగా మనకో “ముఖపుస్తకం“ ఎందుకు? “ అంటూ సాంకేతిక ప్రగతి సాధనాల వాడకం మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న “ప్రముఖుల“ ఐహేతుక విమర్శలకు సమాధానంగా మనం  రూపొందించుకున్న సాంకేతిక సాధనాలు మంచికి చెడుకు ఉపయుక్తం. సాంకేతిక సాధనాలను మంచిగా ఉపయోగించుకోకుండా చెడుకు వినియోగించుకునే వారిని చూపుతూ అసలు సాంకేతిక ప్రగతి సాధనాలనే ఉపయోగించుకోవద్దంటున్న “పెద్దల“ పద్ధతి సమాజ ప్రగతికి అవరోధం కాగలదని శ్రీ రహంతుల్లా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ కారణంగా నిష్ప్రయోజనకర విమర్శలకు దూరంగా తన ప్రచారాన్ని తాను నిశ్శబ్దంగా నిబద్ధతతో చేసుకుపోతుంటారు.
ఒక అంశాన్ని ప్రతిపాదించినప్పుడు ఆ అంశం మీద ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనివ్వాలని ఈ విషయంలో నియంతృత్వం ఏ మాత్రం పనికిరాదంటారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు అడ్డు పడటం సరికాదన్నది  ఆయన అభిప్రాయం. ఆయన భావాలతో ఏకీభవించని విమర్శకులకు కూడా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ మాత్రమే కాదు సమయం కూడా ఇవ్వాలంటారు. నూతనంగా అనిష్కృతమవుతున్న ప్రతి అంతర్జాల సాధనాలను తెలుగు భాషోద్యమం విస్తృతికి ఉపయోగించాలని ఆయన భావిస్తారు. ఈ మేరకు తనకు తెలిసిన ప్రతి అంశాన్ని ఇతరులతో పంచుకుంటారు. తనకు తెలియని విషయాన్ని ఇతరులను అడిగి తెలుసుకోటానికి  శ్రీ రహంతుల్లా ఏ మాత్రం సంకోచించరు.
శ్రీ రహంతుల్లా ప్రత్యేకంగా తెలుగు అక్షర రూపాల (ఖతులు) మీద శ్రద్ధ చూపుతున్నారు. అక్షర రూపం ఏ రకంగా ఉన్నా ఆ అక్షర రూపాన్ని ప్రపంచంలో ఎవరెక్కడ ఉన్నా ఏకరూపత (యూనీకోడ్) లోకి మార్చుకోడానికి అవసరమగు మార్పిడి సాధనాల (కన్వర్టర్లు) కోసం అవిశ్రాంతంగా అంతర్జాల సాంకేతిక నిపుణులతో సాగించారు.  ఈ దిశగా ఆయన నిరంతరం సాగించిన ప్రయత్నాల మూలంగా అంతర్జాల సాంకేతిక నిపుణులు శ్రీ కొలిచాల సురేశ్ గారు శ్రీ రహంతుల్లా  పేరిట ఒక కన్వర్టర్ ను కూడా రూపొందించారు. మన తెలుగు రాష్ట్రాలలోని తెలుగు పత్రికలు తమ పత్రికలకోసమే రూపొందించుకున్న  ప్రత్యేక అక్షర రూపాలతో పత్రికలను ప్రచురించేవి. ఆ కారణంగా ఆయా పత్రికలలో ప్రచురితం అయిన సమాచారాన్ని కాపీ చేసి పేస్ట్ చేయడానికి వీలయ్యేదికాదు.అలా కాకుండా అన్ని పత్రికలు ఏకరూపత లోకి మారినట్టయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు పత్రికలలోని అవసర సమాచారాన్ని తేలిగ్గా తీసుకుని ఉపయోగించుకోడానికి అవకాశం ఉంటుందని శ్రీ రహంతుల్లా ఎప్పటి నుండో విజ్ఞప్తులు చేసేవారు.ప్రస్తుతం ప్రచురణ సంస్థలలో ఉన్న వివిధ అక్షర రూపాలకు (ఖతులు) బదులుగా ఏకరూపత అక్షర రూపాలు (యూనీకోడ్)లో గ్రంథాల ప్రచురణ సాగించి నట్టయితే ఆయా గ్రంథాలలోని సమాచారాన్ని అంతర్జాలం సాథనాల ద్వారా ప్రపంచ వ్యాప్తం చేయవచ్చంటారు.
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డశీర్షికన 2012 లో శ్రీ రహంతుల్లా వెలువరించిన తెలుగు అధికార భాష కావాలంటే, తెలుగు దేవభాషే రెండు గ్రంథాలలోని సమాచారం ఆధారంగా శ్రీ ఆకురాతి గోపాలకృష్ణ శతకం రాశారు. ఈ పుస్తకాన్ని వ్యయప్రయాసలకోర్చి మొత్తంగా ఏకరూపత తెలుగు అక్షర రూపంలో ప్రచురించారు. ఆ కారణంగా అంతర్జాలంలో ఈ శతకం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాప్రియులకు చేరింది. ఈ పుస్తకాన్ని 2013 లో తిరుపతిలో జరిగిన తెలుగు ప్రపంచ మహాసభలలో ఆవిష్కరించి ప్రజలకు మహాసభల చిరుకానుకగా శ్రీ రహంతుల్లా అందించారు. ఈ శతకంలోని పద్యాలను తెలుగు భాషోద్యమ నిర్మాణానికి విస్త్రుతికి నినాదాలుగా, సందేశాలుగా ఉపయోగించుకోవాలని తెలుగు భాషోద్యమకారులు శ్రీ సామల రమేష్ బాబు (సంపాదకులు నడుస్తున్న చరిత్ర మాసపత్రిక) ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ సూచించడం ద్వారా తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ శతకం ఎంతటి ప్రయోజనకరంగా రూపొందిందో అర్థం చేసుకోవచ్చు.
అలాగే తన సన్నిహిత మిత్రులు ప్రముఖ ధార్మిక పండితులు శ్రీ అబుల్ ఇర్ఫాన్ రూపొందించిన ఖురాన్ బావామృతం అను బృహత్తర గ్రంథాన్ని అంతర్జాల సాంకేతిక నిపుణులు శ్రీ షేక్ రహమానుద్దీన్ (విజయవాడ) ద్వారా ఏకరూపత అక్షర రూపంలోకి మార్పించి తెలుగు వికీపీడియా ద్వారా అందరికి అందుబాటులోకి తెచ్చారు. భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ  1998 నుండి నేను రాసిన 11 గ్రంథాలను కూడా ఏకరూపత అక్షరరూపంలోకి మార్పించి తెలుగు తెలుగు వికి సోర్స్  కు అందజేయడంలో నన్ను కూడా శ్రీ రహంతుల్లా ప్రోత్సహించారు.తన మూడవ గ్రంధం “తెలుగులో పాలన” యూనీ కోడ్ లోనే ప్రింటు చేయిస్తున్నారు. తెలుగు వికిపీడియా ను మరింత సమాచార యుక్తం చేయడానికి నిరంతరం కృషి సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని చరిత్ర ప్రసిద్ధికెక్కిన గ్రామాలు, పట్టణాలు మాత్రమే కాకుండా వివిధ రంగాలలో లబ్దిప్రతిష్టులైన ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని శ్రమకోర్చి సేకరించి తెలుగు వికిపీడియా లో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రజలకు ఉఫకరించే ఎటువంటి జ్ఞానమైనా ప్రజాపరం కావాలంటే  ఇటువంటి చర్యలు, విధానాలు, ఆవిష్కరణలు చాలా అవసరమని శ్రీ రహంతుల్లా అభిప్రాయపడతారు.
తెలుగు భాషోద్యమకారుడిగా, తెలుగు భాషాప్రియుడిగా, సాంఘికోద్యమకారుడిగా, దార్శనికుడిగా, ప్రజల సంక్షేమం ఆశించే నిబద్ధత గలిగిన ప్రభుత్వాధికారిగా శ్రీ రహంతుల్లాతో నాకున్న పరిచయంలో నేను అర్థం చేసుకున్న, ఆయన రచనల ద్వారా, నాతో ఆయన సాగించిన అసంఖ్యాక సంభాషణల ద్వారా నేను అవగతం చేసుకున్నంత మేరకు  ఆప్తవాక్యం  రూపొందించాను. ఒక లేఖకుడిగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా, గ్రంథ రచయితగా నిత్యం నూతనత్వాన్ని సంతరించుకుంటూ తన ప్రజ్ఞాపాటవాలను తెలుగు భాషాభివృద్ధి, పరిరక్షణల కోసం బహుముఖంగా వెల్లడిచేస్తున్న మిత్రులు శ్రీ నూర్ బాషా రహంతుల్లా మూడవ గ్రంథం తెలుగులో పాలన ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు నా హృదయ పూర్వక శుభాభినందనలు.

1 కామెంట్‌: