నా మాట
1952 లో తెలుగు భాష పేరుతో మన రాష్ట్రం ఏర్పడింది.భాషా ప్రయుక్త రాష్ట్రాలలో మనదే మొదటి రాష్ట్రం.భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? తెలుగు రాష్ట్రాన్ని తెలుగులోనే పరిపాలించటం. గత 66 సంవత్సరాల సుధీర్గ కాలంలో తెలుగు పాలన సిద్ధించిందా? ఏమి ఆశించి భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాలు ఈనాటికీ నెరవేరకపోగా భవిష్యత్తులో కూడా ప్రజల భాషలో పాలన నడుస్తుందనే ఆశలుకూడా వదులుకోవాలనే హెచ్చరికలు వస్తున్నాయి. అసలు పాలించటానికి మీ భాష బ్రతికి ఉంటుందా అనే సవాళ్ళు నిత్యమూ ఎదురవుతున్నాయి. తెలుగు జనమే ఇంగ్లీషు కాన్వెంట్లకు ఎగబడుతుంటే తెలుగు బడులు నిలుస్తాయా తెలుగులో ఫైళ్ళు నడుస్తాయా అని కార్పోరేట్ యజమానులు ,ఆంగ్లాధికారులూ పరిహాసాలు ఆడుతున్నారు.
తెలుగు జాతీయ
భాష కావాలి
జాతీయ భాష కాగల అర్హత తెలుగుకే ఉందన్నాడు జేబీ హాల్డెన్ .నిజమేననుకొని సంబరపడ్డాం. కానీ ప్రాంతీయభాషగా కూడా నిలదొక్కుకోలేక ఈనాడు
తెలుగు తల్లడిల్లుతోంది.ఉపాధి
కోసం జనం కూడా ఆంగ్లం మోజులో పడి కొట్టుకుపోతున్నారు.తెలుగు సొంతగడ్డపైనే మనుగడ
కోల్పోతున్నది. పిల్లల మానసిక ఎదుగుదలకు మాతృభాష ఎంతో కీలకం.పాఠశాలల్లో పదవ తరగతి వరకు విధిగా తెలుగు మాధ్యమంలోనే బోధన సాగాలి. ప్రతి బడీ
అమ్మ భాషకు గుడి
అయినప్పుడే పిల్లలకు సొంత భాష
వస్తుంది. మాతృభాషలోనే అన్నివిషయాలూ నేర్చుకున్న పిల్లలే తమ సొంత భాషలో పాలన
చేయగలుగుతారు.
ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషల్లో తెలుగుది ఆరోస్థానం.మన ప్రజల నాలుకలపై అది నిత్యం నడయాడాలంటే ,మన పిల్లలు తెలుగు నేర్చుకోవాలి. మాతృభాష కళ్లు అయితే, పరాయిభాష కళ్లజోడు అన్నాడు అన్నాదురై. తమిళం,మరాఠీ, కన్నడ బోధనలను తప్పనిసరి చేస్తూ
అక్కడ గట్టి చట్టాలు చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో తెలుగును రాష్ట్ర భాషగా గుర్తిస్తూ 1966లోనే అధికార భాషా చట్టాన్ని చేశారు.అధికార భాషా సంఘం ఏర్పాటయ్యింది.తెలుగు రాష్ట్రం అన్న పేరేగాని చట్టసభల్లో, పాలన వ్యవహారాల్లో, పాఠశాలల్లో,తెలుగు అమలు లేదు. ప్రభుత్వ పాలన
కూడా తెలుగులో జరగాలని పాలకులు ఆశిస్తున్నారో లేక ఆశిస్తున్నట్లు నటిస్తున్నారో
అని అనుమానం కలుగుతోంది.కాబట్టి శాసన నిర్మాణ క్రతువులో, పాలన వ్యవహారాల్లో తెలుగును తప్పనిసరి చేయాలి.అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు
జపాన్, జర్మనీ, చైనా, రష్యా తమ భాషల్ని సాంకేతిక ప్రగతికోసం తీర్చిదిద్దుకొన్నట్లు మన తెలుగు భాషనూ ఆధునిక అవసరాలకు తగినట్లు సంస్కరించుకోవాలి. తెలుగులో చదివి పట్టభద్రులైనవారికి ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి.పోటీ పరీక్షలలో 5శాతం ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి. తమిళనాడులో ఇస్తున్నట్లుగా మన పిల్లలకూ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. రాష్ట్రపతి కోవింద్ కోరినట్లు కక్షిదారుల భాషలోనే హైకోర్టు తీర్పులుండాలి.శాసన, కార్యనిర్వాహక, న్యాయవిభాగాలన్నిటిలో తెలుగు రాజ్యమేలాలి . ప్రజలు కూడా తెలుగును దేవభాషగా గౌరవించాలి. తెలుగులో మాట్లాడటం గౌరవప్రదంగా భావించాలి. మతాల ఆచరణలన్నీ తెలుగు లోకి మారాలి .
తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళు పార్లమెంటు సభ్యులైతే?జపాన్, జర్మనీ, చైనా, రష్యా తమ భాషల్ని సాంకేతిక ప్రగతికోసం తీర్చిదిద్దుకొన్నట్లు మన తెలుగు భాషనూ ఆధునిక అవసరాలకు తగినట్లు సంస్కరించుకోవాలి. తెలుగులో చదివి పట్టభద్రులైనవారికి ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి.పోటీ పరీక్షలలో 5శాతం ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి. తమిళనాడులో ఇస్తున్నట్లుగా మన పిల్లలకూ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. రాష్ట్రపతి కోవింద్ కోరినట్లు కక్షిదారుల భాషలోనే హైకోర్టు తీర్పులుండాలి.శాసన, కార్యనిర్వాహక, న్యాయవిభాగాలన్నిటిలో తెలుగు రాజ్యమేలాలి . ప్రజలు కూడా తెలుగును దేవభాషగా గౌరవించాలి. తెలుగులో మాట్లాడటం గౌరవప్రదంగా భావించాలి. మతాల ఆచరణలన్నీ తెలుగు లోకి మారాలి .
రాజ్యసభలో హరికృష్ణ తెలుగులో మాట్లాడారు.నాకు అర్ధంకావటంలేదని,ఇంగ్లీషులోనో హిందీలోనో మాట్లాడాలని వెటకారంగా మాట్లాడిన డిప్యూటీ చైర్మన్ కురియన్ కు అనువాదకుల్ని పెట్టుకోవటం మీబాధ్యత అని గట్టిగా బుద్దిచెప్పారు.తన మాతృభాషలో మాట్లాడే స్వేచ్చ ప్రతి సభ్యుడికీ ఉందని వెంకయ్యనాయుడు వెనకేసుకొచ్చారు.అందుకే ఇంగ్లీషుగానీ హిందీగానీ రాని,తెలుగు మాత్రమే వచ్చిన సభ్యులనే మనం ఇకమీదట ఎన్నుకొంటుంటే వాళ్ళే కేంద్రం మెడలు వంచి తెలుగును వెలుగులోకి తెస్తారు. ఇంగ్లీషు రాకపోవటం పాపం కాదు.దాన్ని అందరిమీదా రుద్దటం నేరం.అగ్రభాషలు చిన్న భాషల మీద ఇలాగే స్వారీ చేస్తుంటాయి.ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్ని భాషలకూ అనువాదకుల్ని పెట్టాలిగానీ ఇలా అహంకారంగా ప్రవర్తించకూడదు. హిందీ,ఇంగ్లీషు రాకపోతే ఏంచేస్తారు?తన మాతృభాష లోనేకదా మాట్లాడేది?నోరు మూసుకోమంటే ఎలా ఉంటుంది? తెలుగును వదిలి పిల్లల్ని ఇంగ్లీషులో చదివించేది ఉపాధికోసమే అని అందరికీ తెలుసు.అందుకని మాతృభాషలు వదిలెయ్యాలా?ఎవరి పిల్లల్ని ఏ భాషలో చదివించుకోవాలో వారి తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు.ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ మరో భాష రాని వాళ్ళ మీద ఎక్కువ భాషలు వచ్చినవాళ్ళు తమ బహు భాషా ప్రతాపం చూపకూడదు.ఎవరి భాషలో వారిని మాట్లాడనివ్వాలి.తెలుగులో మాట్లాడొద్దు అనటం ఏమిటి?తెలుగులో మాట్లాడొద్దని పిల్లల మెడలో పలకలు వేలగట్టిన స్కూళ్ళకూ రాజ్యసభకూ తేడా ఏమిటి?ఇది తెలుగు భాషకు అవమానమే.మాతృభాషలో మాట్లాడటానికి ముందుగా పర్మిషన్ తీసుకోవాలని నియమం పెట్టటంలోనే హిందీ వాళ్ళ అహంకారం ఉంది.వారికి పర భాషా సహనం కూడా అవసరం.అనువాదకుల్ని పెట్టకపోవటం మరోతప్పు. భాష ప్రతి మనిషికీ అత్యవసరమైన సమాచార సాధనం.దేశ ప్రజలు వద్దన్నా ఇంగ్లీషు,హిందీ నేర్చుకుంటున్నారు.అవసరం అలాంటిది.పేదరికం,ఆకలిచావులు,ఉద్యోగాలు...ఇలా ఏ అంశాన్నైనా చర్చించాలంటే ఏదో ఒక భాష కావాల్సిందే.మనిషితోపాటు సర్వజీవులూ కోరికలను తమ మాతృభాషలో చెప్పగలిగినంత సుళువుగా స్పష్టంగా పరాయి భాషలో చెప్పలేవు.అది సర్వ ప్రాణులకూ ఉండే సహజ బలహీనత.దేశ సర్వోన్నత సభలు ఈ బలహీనతమీద దెబ్బకొట్టి అవమానించకుండా,రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ భాషలన్నిటికీ అనువాదకులను సభలో సదా సిద్ధంగా ఉంచటం ప్రజాస్వామిక ధర్మం.
30 ఏళ్ళ క్రితం ఎన్టీరామారావు గారి పాలనలో తెలుగులోనే సచివాలయం నుండి నాకు ఇచ్చిన జవాబు ఈ పుస్తకంలోనే ఒక అధ్యాయం ‘తెలుగులో పాలన చేయగలమా?’లో ఉంది చూడండి. జన భాషలోకే పాలన రావాలంటే ఎప్పటికప్పుడు ఆ భాషకు మరిన్ని ఆర్ధిక సాంకేతిక సౌకర్యాలు సమకూర్చాలి. ఉపాధి అవకాశాలు పెరగాలి . రాజకీయ శక్తులూ దన్నుగా నిలవాలి.
ఒక్కసారే పుస్తకంరాయలేక అప్పుడప్పుడు పత్రికలకు రాసిన వ్యాసాలే పుస్తకాలు గా తెచ్చాను.తెలుగు అధికార బాష కావాలంటే ?(2004,2006),తెలుగు దేవభాషే (2012) తరువాత తెలుగులో పాలన (2018) తెస్తున్నాను. ఇవన్నీ వివిధ పత్రికలలో అచ్చయిన వ్యాసాలే. ఈ వ్యాసాలను కూడా నా బ్లాగు ‘అధికార భాష తెలుగు” లో చేర్చాను. https://www.blogger.com/blogger.g?blogID=6982090862782011703#allposts/src=sidebar . వీటిని అవసరమొచ్చిన చోట స్వేచ్చగా వాడుకోండి.
ఈ
పుస్తకానికి ముందు మాటలు రాసిన పెద్దలలో ఎంతోకాలం తెలుగులో పరిపాలన నడిపిన
అనుభవజ్నులున్నారు. తెలుగుకు కార్యాలయాలలో అధికారమిచ్చి ఆనందించిన సహృదయులున్నారు.తెలుగే
దేవభాష అంటూ దాని ఆధ్యాత్మిక మూలాలను వివరించగల సమర్ధులున్నారు.తెలుగు భాష మాధురీ
మహిమను ప్రజలకు పంచిన ప్రముఖ రచయితలున్నారు. చరిత్రకారులున్నారు.వీరంతా
-“తెలుగులో పాలన జరగాలి ” అనే ఒక్క మాట దగ్గర ఏకమయ్యారు.
మనిషి జీవితం చిన్నది.నా మటుకు నా తరం తెలుగులోనే గడిచింది,తెలుగులోనే ముగుస్తుంది.నలభై
ఏళ్ళపాటు తెలుగు పాలనా రంగంలో కూడా ఏలాలని పోరాడాను. గెలిచి సాధించుకోలేకపోయానుగాని నా పోరాటమంతటినీ
గ్రంధస్థం చేశాను.విఫలయత్నం కూడా సంతృప్తినిచ్చింది.నాది తెలుగుతో సరిపెట్టుకున్న జీవితం.
తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళ మధ్యన బ్రతికిన జీవితం. నా తల్లి నాకు నేర్పిన భాష రాజ్యమేలాలని ఉద్యోగంలో అడుగుపెట్టింది మొదలు నేటి వరకు క్రమశిక్షణతో పని చేసి నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది,ఆనందంగా ఉంది.ఇన్నేళ్ళపాటు ఈ పనిలో నాకు తోడ్పడిన అనేకమంది పెద్దలకు నా వందనాలు తెలియజేస్తున్నాను.
నల్గొండ
జిల్లా మాజీ కలక్టర్,తిరుమల తిరుపతి దేవస్థానాల టీవీ చానెల్ అధికారి నండివెలుగు ముక్తేశ్వరరావు
గారికీ, కర్నూలు జిల్లా కలక్టర్ శ్రీరాము సత్యనారాయణ గారికీ,రాష్ట్ర దేవస్థానాల నిర్వహణ సంస్థ డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు
గారికీ,రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్
గారికీ, తిరుపతి ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ నాగసూరి
వేణుగోపాల్ గారికీ, త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద యోగీశ్వరులు
గారికి, ఈనాడు
ప్రముఖ రచయిత యర్రాప్రగడ రామకృష్ణ గారికీ,ప్రముఖ రచయిత
కర్లపాలెం హనుమంతరావు గారికీ, ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్
నసీర్ అహమద్ గారికీ , టైటిల్ పేజీ రూపకర్త షేక్ అబ్దుల్లా
గారికీ,వ్యాసాలను టైపుచేసిన నా కుమార్తె నూర్ బాషా జమీలాకు ,పుస్తక ముద్రాపకులు శ్రీ విశ్వేశ్వరరావు
గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నూర్
బాషా రహంతుల్లా
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్
అమరావతి
9948878833
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి