18, మే 2018, శుక్రవారం

తెలుగే దేవభాష ...ఆచార్య ప్రబోధానంద యోగి


తెలుగే దేవభాష  ...ఆచార్య ప్రబోధానంద యోగి





         




తెలుగు భాష కోసం ఏరంగం లోనైనా కష్టపడి పనిచేసే వ్యక్తి గురించి నా చెవిన బడితే వెళ్ళి అతని కృషిని గురించి తెలుసుకుంటాను.  2014 విజయవాడ పుస్తకాల సంతలో ప్రబోధానంద యోగిగారి తెలుగు సామెతలు పుస్తకం కొన్నాను. అదిగో అలా పరిచయమయ్యింది ఈయన తెలుగు కృషి. నేను బాబాలు స్వాముల మహిమలు మహత్యాల జోలికి వెళ్ళను.వారు వెలువరించిన తెలుగు జ్నానం వరకే పరిమితమౌతాను.తెలుగు భాషకోసం వాళ్ళు  ఆధ్యాత్మికరంగంలో కల్పిస్తున్న పదాలు ,అర్ధాలు  తెలుగు విన్యాసాలు చూసి ఆకర్షితుణ్ణవుతాను.తెలుగు దేవభాషే పుస్తకంలో పుట్టపర్తి సాయిబాబా గారు  చేసిన  తెలుగు భాషా సేవ గురించి ఒక వ్యాసం రాశాను.అందులో ఆయన  తెలుగు తన హృదయ భాష అన్నారు.
ఆకోవలోనే ఆచార్య ప్రబోధానంద యోగి గారు తెలుగును తన నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు.మన తెలుగు సామెతలకు ,పొడుపుకధలకు,తిట్లు దీవెనలకు అసలు అర్ధాలు ఇవి ,అనర్ధాలు అపార్ధాలు ఇవి అని విడమరచి చెబితే ఆయన చెప్పిన అర్ధాలు వింతగా ఉన్నా అంగీకరించక తప్పలేదు.  
  
 కులాంతర,మతాంతర వివాహాలకు తన ఆశ్రమాన్ని వేదికగా చేశారు. అన్ని మతాలవారినీ సమంగా ఆదరిస్తున్నారు. కాళ్ళకు మొక్కించుకోరు. నేనూ మనిషినే అంటారు. త్రైత సిద్ధాంతాన్ని బోధిస్తూ భగవద్గీత తో పాటు బైబిల్,ఖురాను గ్రంధాలు కూడా దైవగ్రంధాలనీ, అవి ఒకే దైవ గ్రంథంలోనివేననీ, బ్రహ్మ విద్యలో భాగాలైన ఆ మూడింటిని సమాదరిస్తూ, వాటిలోరిఫరెన్సులతో సహా పేర్కొంటూ సమావేశానికి వచ్చిన వారితో అలా ఉందో లేదో చూడమని చదివిస్తున్నారు.ఆయన గ్రంధాలయం సర్వమతగ్రంధాలకు నిలయంలాఉంది.
 కర్నూలులో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలక్టర్ గా ఉన్నప్పుడు  12.7.2014 గురుపౌర్ణమి నాడు  తాడిపత్రి దగ్గర చినపొడమల గ్రామం వెళ్ళాను. ప్రబోధానంద యోగి గారితో కాసేపు మాట్లాడాను.   

ఆస్తిక హేతువాద ధోరణి   
ప్రతి పౌర్ణమికీ త్రైతసిద్ధాంత ప్రసంగాలిస్తారు. ఈ భజనలు, ఆస్థులూ చచ్చేటప్పుడు అక్కరకు రావనే సదా గ్రహింపుకోసం అక్కడే ఒక ఖాళీ సమాధిని కూడా కళ్ళముందు ఉంచుకున్నారు.స్వామిగారి ఉద్దేశంలో మతమనేది ఒక మాయ,  మనిషి నుంచి దైవాన్ని దూరం చేసే ఒక అధర్మం. మతం అనే ప్రాధమిక అజ్ఞానంనుంచి మనిషి బయటపడాలి, దైవజ్ఞానము గల విశ్వనరుడు కావాలి. మూడు మత గ్రంధాలలో కూడా ఉన్న దైవజ్ఞానాన్ని ఏ మతస్తుడైనా స్వేచ్చగా పొందాలి. మనిషి పూర్తిగా మతవిముక్తుడై దైవజ్ఞాని మాత్రమే కావాలనేదే ఆయన కోరిక.  
అసలైన దైవద్రోహం అంటే మతమార్పిడి మాత్రమే కాదు, అన్నిమతాలలో ఉన్న దైవజ్ఞానాన్నీ పరమతమనే వంకతో స్వీకరించకపోవటమే నిజమైన ఆత్మద్రోహమూ దైవద్రోహము అన్నారు. మనిషికి దైవజ్ఞానం కావాలి కానీ ఏ మతమూ అక్కరలేదు. మనిషి ఒక మతంలో బిగుసుకుపోతే పరమతస్తులపట్ల అతనికి అశాంతి ఆవహిస్తుంది. దైవజ్ఞానికి మాత్రం సర్వమతాలలో ఇప్పటికే నిక్షిప్తమై ఉన్నదైవవాక్కులు గోచరిస్తూ, వాటి అవగాహన కలిగి అతనిని శాంతి ఆవరిస్తుందన్నారు.
తెలుగు భాషపట్ల ఆయన భావాలను నేను ఎందుకు ఉదాహరిస్తున్నానంటే ఇవి కొందరికి అతిశయోక్తులుగా అనిపించవచ్చు . కానీ మన భాష గొప్పతనం గురించి అనేకమంది మేధావులు  రకరకాలుగా  చెప్పిన విశేషాలను నిరంతరం నేను సేకరిస్తూనే ఉంటాను.అది నాకు ఇష్టమైన పని. ప్రభోదానంద గారు తెలుగే దేవభాష అంటూ చెప్పిన కొన్ని అభిప్రాయాలను చూడండి:  
తెలుగు దైవభాషే,తెలుగుభాష శాశ్వతం
" తెలుగు భాష ''జ్ఞానచిహ్నము''గా భూమి మీద తయారయినది కానీ ఆవిషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు. మన భాషకు ''తెలుగు'' అని పేరు పెట్టిన వాడు సూర్యుడని ఎవరికీ తెలియదు. నేడు సూర్యునకున్న పేర్లన్నీ తెలుగు భాషలోనివే. ఆదిత్యుని చేత పేరు పెట్టబడిన ఆదిభాష 'తెలుగు'.  చాలా భాషలపేర్లలో అర్థములేదు. అట్లే భాషయొక్క లిపిలో కూడా అర్థము లేదు. భాషకు అర్థము, మరియు భాషయొక్క లిపికి అర్థము ఒక్క తెలుగు భాషకే ఉంది. ప్రపంచములో మొదట పుట్టినభాష తెలుగు భాష అయినందున, సూర్యుడు భూమిమీద తన జ్ఞానమును తెలుగు భాషలోనే తెలియజేసియుండుట వలన, తెలుగు భాష దైవజ్ఞానమునకు దగ్గరగా అర్థములను కలిగియుండుట వలన తెలుగు భాషను అన్ని విధములా దైవభాషగా చెప్పవచ్చును. తెలుగుభాష ప్రపంచములో మొట్టమొదట పుట్టిన భాష. అయినా ఆనాడు భాషకు పేరు లేకుండాయుండెడిది. సంస్కృతము చాలా వెనుక పుట్టినదని తెలియవలెను. తెలుగుభాషలో యున్నన్ని అక్షరములు మరి ఏ ఇతర భాషలో లేవు. అందువలన ఏ చిన్నశబ్దమునయినా, ఎంత కఠినమైన శబ్దమునయినా తెలుగు లిపిలో వ్రాయవచ్చును. సంస్కృత భాషకు లిపిలేదు. సంస్కృతమును వ్రాయుటకు ఇతర భాషలను వాడుకోవలసి వచ్చినది. భాష అన్న తర్వాత అది భావమును తెలుపుటకే ఎక్కువగా ఉపయోగపడవలసి యుండగా, సంస్కృత భాష మాత్రము భావమును తెల్పు సందర్భములలోబహు తక్కువగా వాడబడుచున్నది. అర్చనలందును, పొగడ్తలందును, మంత్ర జపములందును వాడుకొంటున్నారు.అంతేకాక మొదట పుట్టినతెలుగు భాషలోని పదములను ఎక్కువగా సంస్కృతములో పెట్టుకోవడము జరిగినది. ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు. ప్రపంచములో అన్నిటికంటే పెద్దదయిన బ్రహ్మవిద్యను చెప్పబడిన భాష తెలుగు. ప్రపంచములోని ఎన్నో భాషలలో తెలుగు భాషా బీజములుకనిపించుచున్నవి. తెలుగు పదములు అన్ని భాషలలో ఉన్నాయి. తెలుగు కంటే పెద్దభాష ఏదీ లేదు. వాస్తవానికి ప్రపంచ భాషలన్నిటికీ రాజుగా, చక్రవర్తిగా తెలుగు భాష ఉండాలి. శ్లోకము తప్ప పద్యము వ్రాయుటకు పనికిరాని సంస్కృతము కంటే పద్యమును శ్లోకమును రెండిటినీ వ్రాయగల తెలుగే గొప్ప. ఆధ్యాత్మికమునకు తెలుగులో యున్నంత అర్థము, వివరము వేరే భాషలో లేదు. ''ఆత్మ'' అను పదము తెలుగుభాషలోనే పుట్టినది. వాస్తవముగా తెలుగు భాష దైవభాషయే". (ఌ అంటే ఏమిటి? 2016)

·        భూమి మీద పుట్టిన మొదటి భాష తెలుగే
దేవునికి సృష్ఠ్యాదిలో పరమాత్మ, సృష్ఠికర్త, అల్లాహ్ అను మూడు బిరుదు పేర్లు మాత్రము ఉండేవి. ఈ మూడు పదములను, అర్థమును బట్టి, భావ సహితముగా ఆదిలో గల తెలుగుభాషలో చెప్పడమైనది. . దేవుడు ఒక మతమునకు సంబంధించినవాడు కాడు. మొదటి జ్ఞానమును తెలుగు భాషలో, మనుషుల భావములో చెప్పడము వలన భూమి మీద మొదట భారతదేశములో దక్షిణ భాగమునగల శ్రీలంక ప్రాంతములో తెలుగుభాష తయారయినది. తెలుగుభాష తయారయినప్పటి నుండి భాషను మాట్లాడు వారిని ప్రతి దినము చూచి చూచి తాను తెలుగుభాషను సులభముగా నేర్వగలిగాడు. అంతకుముందు ఆకాశము తనశబ్దము ద్వారా తెలియజేసిన జ్ఞానమును గ్రహించిన సూర్యుడు తనకు తెలిసిన జ్ఞానమును భూమిమీద తెలియజేయాలని అనుకోవడము జరిగినది. అప్పుడు దక్షిణభారతదేశములో కలిసియున్న శ్రీ లంకలోని మనువు అను వ్యక్తికి తనకు తెలిసినజ్ఞానమును తెలుగుభాషలోనే చెప్పాడు. తౌరాత్ అనగా ‘మూడు రాత్రులు’ అను తెలుగు అర్థమేనని తెలియవలెను.తెలుగు దేవభాషే. తెలుగే దేవభాష . ప్రపంచములోనే మొదట పుట్టిన భాష తెలుగు.ఆత్మజ్ఞాన వివరణకు తగ్గట్టుగా  కృతయుగములోనే దేవుడు అందించిన దేహి భాష తెలుగు.
ఖురాన్ తెలుగులో చదవండి
మేము అన్ని మతములను, అన్నిగ్రంథములను సమానముగా చూస్తున్నాము. అట్లుకాకుండా ఒక గ్రంథమే గొప్పది, మిగతా గ్రంథములు గొప్పవికావు అని మేము చెప్పలేము. అలా చెప్పితే మతబోధవుతుందిగానీ, జ్ఞాన బోధఅనిపించుకోదు . మేము మూడు గ్రంథములు చదువాలని ఖురాన్ గ్రంథములో వాక్యము ప్రకారమే చెప్పాముగానీ మేము స్వయముగాచెప్పలేదు. ఖురాన్ (5:68)  
ముస్లీమ్ లందరూ అరబ్బీ భాషలోనే ఖురాన్ ను చదువవలెనని చెప్పుచున్నవారు, అరబ్బీ భాషరాని ముస్లీములను అరబ్బీ భాష నేర్చుకొని చదవమనీ, తెలుగులో చదవరాదని చెప్పుచున్నారు. నేడు భారతదేశములోని ముస్లీమ్లు అరబ్బీ భాష రాని కారణముగా 80 శాతము మంది ముస్లీమ్ లు ఖురాన్ గ్రంథమును చదువలేదు. ఖురాన్ గ్రంథములో ఏమున్నదో వారికి తెలియదు. వచ్చిన ప్రాంతీయ భాషలోగానీ, తెలుగుభాషలోగానీ చదువుతామనుకొంటే అలా చదువకూడదు, ముస్లీమ్ అయిన వాడు అరబ్బీ భాషలోనే ఖురాన్ను చదువవలెనను, మత నియమమును తమ మత పెద్దలు చెప్పుచుండుట వలన వారు చదువలేకపోవుచున్నారు.
తెలుగుభాష మాత్రమే వచ్చిన ఎందరో ముస్లీమ్ లు అరబ్బీ భాషలోనే చదువవలెనను మత నియమముతో దైవగ్రంథమునకు దూరము చేయబడి అరబ్బీ భాషలో చదువలేకయున్నారు. అయితే నేడు తెలుగుభాషలో ఎన్నో అనువాద ఖురాన్ గ్రంథములు తయారైనాయి. తెలుగుభాష వచ్చిన ఎందరో ఇస్లామ్ పండితులు ఖురాన్ గ్రంథమును తెలుగు లో అనువదించి వ్రాసి గ్రంథమును తయారు చేశారు. అయినా తెలుగు గ్రంథమును ముస్లీమ్ లు చదువకూడదు అను నియమము ప్రకారము చదవకూడదు. అలాంటప్పుడు తెలుగుభాషలోఖురాన్ గ్రంథమును ఎందుకు వ్రాశారు? ఎవరు చదువాలని వ్రాశారు? అలావ్రాయడములో వారి ఉద్దేశ్యము ఏమి? అని ఆలోచించిన వారి భావము స్పష్టముగా బయటికి కనిపించుచున్నది.
తెలుగు మూలపదాలు
నమాజ్  మరియు అల్లాహ్ అను రెండు పదములు స్వచ్ఛమయిన తెలుగు పదములు. ప్రపంచములో మొదటి భాష తెలుగు భాష. తెలుగు భాష నుండే మిగతా భాషలు పుట్టాయి.. .కాలక్రమములో కొన్ని తెలుగు పదములు మిగతా అనేక భాషలలో చేరిపోవడము జరిగినది. అలా అరబ్బీ మొదలైన భాషలలో చేరిపోయిన ముఖ్యమైన పదములు అల్లాహ్, నమాజ్.ఈ రెండు పదములు తెలుగు భాషలో పుట్టిన పదములని ముస్లీములకు ఎవరికీ తెలియదు. తెలుగు భాషలో ప్రతి పదము భావముతో కూడుకొన్న పదమైయుండును. పదములోని శబ్దమును బట్టి అందులోని సారాంశము తెలియునదిగా ఉండును.
+ల్లాహ్=అల్లాహ్. ల్లాహ్ అనగా అంతు లేక గట్టు అని అర్థము. అ అనగా లేదు, కాదు అని అర్థము. ఈ అర్థముల ప్రకారము అంతులేని వాడు, హద్దులేనివాడు, లేక గట్టు లేనివాడు దేవుడు అని తెలియుచున్నది. అల్లాహ్ అంతు ఎవరికీ తెలియదు. అందువలన పూర్వము తెలుగు భాషలో దేవున్ని అల్లాహ్ అని అన్నారు. .తెలుగులో దేవుడు అనినా వెతకబడేవాడు అని అర్థము గలదు. అల్లాహ్ అనినా, దేవుడు అనినా ఎవరికీ తెలియనివాడే యని అర్థమగుచున్నది.
న అనగా లేదు, కాదు అని అర్థము గలదు. మ అనగా నేను, నా యొక్క అని అర్థము. జ్ అనగా పుట్టుక లేక జన్మయని అర్థము. దీనిని అంతటినీ కలిపి చూస్తే 'నాకు జన్మ వద్దు' అని అర్థము.తెలుగు భాషలో నమాజ్ అను పదమునకు జన్మరాహిత్యమును తెలుపు అర్థము కలదని చెప్పవచ్చును".
(
ద్యానము - ప్రార్థన - నమాజ్ 2017)
నమాజ్ లోని మూడుఅక్షరములకు అర్థమును చెప్పుకొంటే ‘న’ అనగా వద్దు అని అర్థము. ‘మ’ అనగా నాకు యని అర్థము. ‘జ’ అనగా జన్మఅని అర్థము. ‘‘నాకు జన్మవద్దు’’ అని అర్థమును తెల్పునదే నమాజ్. నమాజ్ ఆదినుండి యున్న తెలుగుపదమే యనిచెప్పవచ్చును. కృతయుగము లోనే స్వచ్ఛమయిన తెలుగుపదముగా నమాజ్ మరియు రోజా అను పదము ఉండేవి. ‘

 ‘రోజా’ అనగా ‘జన్మ నాశనము’ అని అర్థము. నమాజ్లో నాకు జన్మవద్దు, నాకు జన్మలేదు అని అర్థము.
రంజాన్, రోజా, నమాజ్ అను మూడు పదములు తెలుగుభాషలో మంచి అర్థమును కలిగియున్నవి.మొదట భూమి మీద పుట్టిన భాష తెలుగుభాష. తెలుగుభాషలో ‘రం’ అంటే ‘నాశనము’ అని అర్థము గలదు .రంజాన్ పదములో రం+జాన్=రంజాన్ అనుట వచ్చినది. ‘జా’ అను శబ్దమునకు ‘పుట్టుక’ అని అర్థము. రంజాన్ అనగా జన్మ నాశనము అని అర్థము.
అల్లాహ్’ అను పదము కూడా సృష్ఠి ఆదిలోనిదే. ఈ పదములన్నియూ ఆనాడున్న తెలుగుభాష లోనివే అయినా, ఆ విషయము ఈనాడు ఏమాత్రము ఎవరికీ తెలియదు. ‘అల్లాహ్’ అనునది దేవుని పేరు కాదు. ఆయనకున్న బిరుదు. ‘దేవుడు’ అనగా దేవులాడబడేవాడు, వెతకబడేవాడు అని భావము. ఆయన ఎవరికీ దొరకడు, కనిపించడు కావున ఆ బిరుదును ఉంచి ‘దేవుడు’ అన్నాము. దేవుడు పేరు లేనివాడని చెప్పవచ్చును. ఇంతవరకు చెప్పిన బిరుదులన్నీ తెలుగుభాషలో గలవే. కృతయుగములో మొదట పుట్టిన భాష తెలుగు .అందువలన నేడు దేవున్ని పిలుచుపదములన్నీతెలుగుపదములుగానే యున్నవి.
ఖురాన్ గ్రంథములోగల దేవున్ని, దేవుని ఆరాధనను గురించి చెప్పిన పదములు అరబ్బీ భాషవని అందరూ అనుకోవడము జరిగినది. అయితే సృష్ఠ్యాదిలో కృతయుగమందే ఆ పదములు ఉండేవని నేడు ఎవరికీ తెలియదు. దేవుని ఆధ్యాత్మిక భావమునకు సరిపోవు అర్థముతో కూడిన తెలుగుభాషలోని పదములే నేడు గలవు. నేడు దేవునికి, దేవుని ఆరాధనకు సంబంధించిన పదములకు అరబ్బీ భాషలో ఆధ్యాత్మికమునకు సరిపోవు అర్థము తెలుగుభాషలోయున్నట్లు లేవు. నేడు కొందరు అరబ్బీ భాషలో కొన్ని పదములకు అర్థముచెప్పినా అవి ఆధ్యాత్మిక భావమునకు పూర్తి దగ్గరగాయుండవు. ఉండినా తెలుగుభాషలో యున్నంత దగ్గర పదములుగా ఉండవు. నేడు అరబ్బీ భాషలో కొన్ని పదములున్నాఅవి తెలుగుభాషకు దగ్గర సంబంధముగా యున్నట్లు కనిపించుచున్నవి.
తెలుగు లో ‘‘జ’’ అను అక్షరము పుట్టుకకు సంబంధించినది. ‘జాతకము’ అనగా పుట్టినప్పుడు నిర్ణయించబడిన కర్మఫలము అని అర్థము. దానిని పూర్వము ‘జాఫతకము’ అని అనెడివారు. అయితే కాలక్రమమున జాఫతకములో ‘ఫ’ అనుఅక్షరము పోయి జాతకము అని అసంపూర్ణముగా మిగిలిపోయినది.  ‘జ’ అనునది జన్మకు సంబంధించిన భావము.నమాజ్, జకాత్, రోజా, హజ్, రంజాన్. అట్లే తౌరాత్, తౌహీద్ అను పదము ‘త్రి’ అను శబ్దముతో ముడిబడి యున్నవి. ‘తౌ’ అనగా తెలుగుభాషలో మూడుయని అర్థము.
·        త్రైత సిద్ధాంత ఆధారంగా తెలుగులిపి
తెలుగు లిపి లోని అచ్చులు హల్లులు  జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ల వరుస క్రమములోనే పేర్చబడ్డాయి తెలుగు అక్షరాల ద్వారా కూడా "ఆత్మ జ్ఞానం" చేర్చబడింది అంటారు.("అక్షర జ్ఞానము"10.05.2017)
·       త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక ఘంటు
తెలుగులో చాలా పదాలు పూర్వము ఏ అర్థంతో ఉండేవో మళ్ళీ ఆ ఆధ్యాత్మిక అర్ధాలను వివరిస్తుంది.
·       తెలుగు సామెతలు, పొడుపుకధలు
మన తెలుగు సామెతలు, పొడుపుకథలలో "అక్షర జ్ఞానం"తో పాటు ఆత్మ జ్ఞానం కూడా ఉంది.ఆత్మ జ్ఞాన సంబంధ సమాచారాన్ని కూడా మన పూర్వికులు ఈ తెలుగు సామెతల్లో,పొడుపుకథల్లో పొందుపరిచారు.వేమన పద్యాల్లో,జానపద గేయాల్లో, వీర బ్రహ్మం గారి తత్వాలలో నిగూఢముగా ఎంతో ఆత్మ జ్ఞానము ఉంది.వాటిని పరిశీలనగా చదివిన తరువాత  తెలుగు  దేవభాషే అని అంటున్నాను .
సర్వమత సమభావన చాటుతున్న ప్రబోదానంద స్వామీజీ సామాజిక సేవలో కంచి ,సిద్ధగంగ,పుట్టపర్తి లాంటి పీఠాల సరసన తన పొడమల ఆశ్రమాన్ని కూడా చేర్చేందుకు బీజాలు వేస్తారని  కోరుతున్నాను.


1 కామెంట్‌: