20, మే 2018, ఆదివారం

ఎక్కడితెలుగు అక్కడే

ఎక్కడి తెలుగు అక్కడే (ఈనాడు తెలుగు వెలుగు మాసపత్రిక డిశంబర్ 2017)
ఎక్కడ ఉన్న తెలుగు అక్కడే ‘‘విద్య, పని ప్రదేశాలు, ప్రసార, ప్రచురణ మాధ్యమాలు, ప్రభుత్వవ్యవహారాల్లో వాడుకలో ఉండే భాష మాత్రమే ఎల్లకాలం నిలుస్తుంది’’ అనిఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఘంటాపథంగాచెప్పింది. కానీ, దురదృష్టవశాత్తూ ప్రసార, ప్రచురణ మాధ్యమాల్లో తప్ప మనమాతృభాష ఎక్కడా కనపడట్లేదు. ముఖ్యంగా పరిపాలన భాషగా తెలుగు అమలు మరీతీసికట్టుగా ఉంది. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుంది? పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే నిర్వహించేలా త్వరలోనే అన్ని ఏర్పాట్లూచేస్తామని మొదటి ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రకటించారు. ఆ మహాసభలు జరిగి 40 ఏళ్లుదాటిపోయినా పరిపాలనా భాషగా తెలుగు అమలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుఉంది. భాషా ప్రాతిపదిక మీద ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.తమిళభాష ఆధిపత్యాన్ని వదిలించుకుని మన తెలుగు భాషలో మనల్ని మనమేపరిపాలించుకుందామనే సదాశయంతో ఆనాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమం జరిగింది.ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటయ్యింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌రెండూ తెలుగు రాష్ట్రాలే. ఉమ్మడి రాష్ట్రంలోని భాషాపరమైన కోరికలే ఇప్పటికీతెలుగు ప్రజల్లో ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. అవి తీరేదాకా ప్రజలు అడుగుతూనేఉంటారు. ప్రజల భాషలో పరిపాలన జరగాలనే కోరిక అతి సహజమైంది. ‘జిల్లాస్థాయి, దిగువస్థాయి న్యాయస్థానాల్లో వాద ప్రతివాదాలు తెలుగులోజరగాలి. తీర్పులన్నీ తెలుగులోనే ఇవ్వాలి’ అంటూ మార్చి 29, 1974 నాడు మొదటిప్రభుత్వ ఉత్తర్వు (జీవో నం.485) వెలువడింది. ఆ తర్వాత తెలుగులో పాలనసాగించడం కోసం 1988 నుంచి రాష్ట్ర విభజన ముందు వరకు నాలుగు ముఖ్యమైనప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. వాటి ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నిప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగును కచ్చితంగా అమలు చెయ్యాలి.జీవోలిచ్చారు గానీ ఆ ఉత్తర్వులు ఎన్నడూ సరిగా అమలు కాలేదు. అవేంటోచూద్దాం.. * ఆంగ్లంలో వచ్చిన ఏ ఉత్తరంపైనా, ప్రతిపాదనపైనా ఎలాంటి చర్యతీసుకోకుండా తిప్పి పంపే అధికారం ప్రతి గజిటెడ్‌ అధికారికీ ఉంది. తమకంటేపైఅధికారుల నుంచి వచ్చినా సరే ఆంగ్లంలోని లేఖలను తిప్పి పంపవచ్చు. ఇలాచేయడం వల్ల జరిగే కష్టనష్టాలకు, జాప్యానికీ వాటిని ఆంగ్లంలో పంపినఅధికారులదీ, కార్యాలయాలదే బాధ్యత. (ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 167, 19.03.1988) * 1988 నవంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తరప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి. అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకితెలుగుభాషనే ఉపయోగించాలి. ఆంగ్లం వాడకూడదు. కేంద్ర ప్రభుత్వం, ఇతరరాష్ట్రాలు, రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లంఉపయోగించాలి. (ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 587, 28.10.1988) * అన్నిరాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్నిసంస్థలు, అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి.అన్ని శాసనేతర అవసరాలకు, ప్రజలతో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనేఉపయోగించాలి. (ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 218, 22.03.1990) * రాష్ట్రప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, నియమాలు, నిబంధనలు, ఉపవిధులు అన్నీ కూడాతెలుగుభాషలోనే ఉండాలి. (ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 420, 13.09.2005) వీటితో పాటు ‘రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, సముదాయాల బోర్డులు ప్రభుత్వపథకాల ప్రారంభోత్సవ నామఫలకాలు, శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనేరాయించాలి’ అంటూ సెప్టెంబరు 14, 2016న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ యువజన, సాంస్కృతిక, అధికార భాషా మంత్రిత్వ శాఖ జీవో నం.11ను వెలువరించింది. ఈఉత్తర్వులన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తే పరిపాలన పూర్తిగా తెలుగులోనేజరుగుతుంది. జరిగి తీరాలి. రెండు రాష్ట్రాల్లోనూ ఎందుకీ పరిస్థితి? తెలుగువాడిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలమనీ, రాయల కాలంనాటి రాజభాష అనీగొప్పలు చెప్పుకోవటమే గానీ క్రమంగా తెలుగు భాష పాలనకు దూరమైంది. కవులకూకవిత్వాలకు మాత్రమే పరిమితమైపోయింది. తెలుగులో చదువుకునే పిల్లలుతగ్గిపోయారు. తెలుగు బడులు మన కళ్లముందే ఇంగ్లీషు కాన్వెంట్లుగామారిపోయాయి. ‘తెలుగులో చదివితే ఉద్యోగాలు రావు’ అనే అభిప్రాయానికి ప్రజలువచ్చారు. ప్రాథమిక పాఠశాలలు కూడా ఆంగ్ల మాధ్యమానివే కావాలనిపట్టుబడుతున్నారు. ఎందుకంటే తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రానిపరిస్థితి నెలకొంది. తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ, డబ్బు వస్తుంటేఅప్పుడు కొందరైనా స్వార్థం కొంత చంపుకొని తెలుగు చదువుతారు. ప్రజల భాషపాలనా భాషగా మారకపోతే ఆ భాష చచ్చిపోతుంది. తెలుగు ప్రజలు ఇంట్లో తెలుగులోమాట్లాడుకున్నా.. కార్యాలయాల్లో, న్యాయస్థానాల్లో ఆంగ్లం మాట్లాడాల్సివస్తోంది. తెలుగు మనిషి మనసుతో పనిలేని ఓ యంత్రంలాగా మారాడు. అలా కాకుండాకార్యాలయాల్లో కూడా మన మనసే (మాతృభాష) రాజ్యమేలాలి అంటే ఆ భాష బాగా నేర్చినవారిని మాత్రమే అధికారులుగా రానివ్వాలి. అయితే... పాలకులకు ఆచరణలో కొన్నిభాషాపరమైన అవసరాలు, సమస్యలు పదేపదే ఎదురవుతాయి. వాటితో పాటు మన భాషలోపరిపాలన బాగా జరగటానికి ఇంకా ఏమేమి సమస్యలు ప్రతిబంధకాలు అవుతున్నాయో, వాటిని అధిగమించి ఎలా పనులు చెయ్యాలో చూద్దాం. అన్ని దరఖాస్తులూ తెలుగులోనే... రెండు రాష్ట్రాల్లో ఉన్న తొమ్మిది కోట్ల మంది తెలుగువారికి సేవలందించవలసినలక్షలాది మంది ఉద్యోగులు నిజానికి తెలుగులోనే పనిచేయాలి. ప్రజలకు వారిభాషలోనే పనులు చేసిపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదా, అధికారుల మీదాఉంది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ విధిగా తెలుగు భాషలోనే సాగించాలన్న సంకల్పంపాలకులకు ఉండాలి. నేను ఎమ్మార్వోగా ఉన్నప్పుడు కొన్ని దరఖాస్తులుతెలుగులోకి అనువదిస్తే ఎవరికివారే నింపి ఇచ్చారు. అలా ప్రభుత్వదరఖాస్తులన్నింటినీ మన భాషలోకి తెచ్చుకోవాలి. దానివల్ల ఆంగ్లం తెలిసినవాళ్ల కోసం వెతుక్కునే పరిస్థితి తొలిగిపోతుంది. మన భాషలోనే ధ్రువీకరణ పత్రాలు విద్యార్థి దశలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహశీల్దారుకార్యాలయానికి వారం రోజులపాటు తిరిగేవాణ్ని. ఆనాడు అనుకున్నాను.. నేనే కనుకతహశీల్దారునైతే చిన్న పిల్లలకు చకచకా సంతకాలు చేసి పంపిస్తానని.తహశీల్దారునయ్యాక మాట నిలుపుకున్నాను. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలప్రధానోపాధ్యాయులకూ ఒక నమూనా ఇచ్చి, వారి బడిలోని పిల్లలందరికీ కులం, స్వస్థలం, పుట్టిన తేదీ లాంటి వివరాలు నింపి ధ్రువీకరించి పంపమని కోరాను.ఆయా గ్రామ పాలనాధికారులు కూడా ఆ వివరాలను ధ్రువీకరించారు. పిల్లలెవరూ మండలకార్యాలయానికి రానక్కరలేకుండా శాశ్వత కుల, నివాసస్థల, పుట్టిన తేదీధ్రువపత్రాన్ని వారి ఫొటోలు అంటించి, వారి వారి పాఠశాలల్లోనే పంపిణీ చేశాం.పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ఇళ్లకు పంపిణీ చేయించాం. ఇప్పుడుఆంధ్రప్రదేశ్‌లో ‘విద్యార్థుల సేవలో రెవెన్యూ’ అనే మంచి కార్యక్రమంజరుగుతోంది. ఇంకా మెరుగైన అనువాదాలు 2008లో పులిచింతలప్రాజెక్టులో భూసేకరణ సమ్మతి అవార్డు తెలుగులో ఇచ్చాను. అంతకుముందు ఎలాంటిమాదిరీ లేని పరిస్థితుల్లో కొత్తగా అనువాదానికి పూనుకుని రాసిన ఆ అవార్డురాష్ట్రంలో మొదటి తెలుగు అవార్డు అయ్యింది. ఎవరో ఒకరు పూనుకొని కొత్తపత్రాలను తయారు చేయాలి. అవే కాలక్రమేణ మెరుగుపడుతూ వాడుక భాషలోకి మారుతూఅందరికీ మార్గదర్శకమవుతాయి. ప్రస్తుతం ఇంగ్లీషు నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీషులోకి కంప్యూటర్‌పై జరిగే అనువాదాలు సవాలక్ష లోపాలతోఉన్నాయి. తెలుగువారు సాంకేతికంగా ఎంత ఎదిగినా నేటి వరకూ అనువాద యంత్రాలతయారీలో బాగా వెనకబడే ఉన్నారు. తెలుగులో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌లు తయారు చేసినవారికి, తెలుగు భాషకు ఉపకరించే సులభ ఉపకరణాలను రూపొందించిన వారికి తెలుగువైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. తెలుగులోకి తర్జుమాలోతప్పులు రాకుండా మెరుగు పరిచే వారికి ఆర్థిక సాయం చెయ్యాలి. అనువాదఉపకరణాలు లెక్కకు మిక్కిలిగా రావాలి. అనువాదంలో చోటు చేసుకున్న లోపాలనుతప్పుల్నీ సరిదిద్దడానికి తెలుగు సాంకేతిక నిపుణులు అందరూ పూనుకోవాలి. ఈఅనువాద సామగ్రి ఎంత నాణ్యంగా అభివృద్ధి చెందితే తెలుగులో పాలన అంత నాణ్యంగాఉంటుంది. నిఘంటువుల్లో వాడుక భాష మన రెండు రాష్ట్రాల్లోతెలుగు మొదటి అధికార భాష అయితే, ఉర్దూ రెండో అధికార భాష. ఈ రెండు భాషలప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవగాహన, మరింత పెరగటానికినిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి. ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూసామెతలు లాంటి పుస్తకాలు ముద్రించాలి. తెలుగు-ఉర్దూ, ఉర్దూ-తెలుగునిఘంటువులు కావాలి. వక్ఫ్‌బోర్డు నిఖా నామాలు (వివాహ ధ్రువపత్రాలు) తెలుగుభాషలో కూడా ప్రచురించాలి. తెలుగు జాతీయాలూ, నుడికారాలూ, పదబంధాలూ కూర్చిననిఘంటువుల అవసరమూ ఉంది. ఆన్‌లైన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించేఅవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలావాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగా ఉన్నట్లు భావించినకొత్తపదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. ఖతులు, లిపి సమస్యలూ.. తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, సురవరం’ తదితర 18 తెలుగు ఖతులను (ఫాంట్లను) విడుదల చేశారు. కానీఇప్పటికే ‘అనూ, సూరి’లాంటి యూనీకోడేతర ఖతుల్లో ముద్రితమై ఉన్న విస్తారమైనతెలుగు సాహిత్యాన్ని తెలుగు యూనీకోడులోకి మార్చే మార్పిడి సాధనాలు కావాలి.పదాల శుద్ధియంత్రం, గుణింత, వ్యాకరణ పరిష్కార యంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్‌ నిఘంటువులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, ఉచ్చారణ పద ప్రయోగ నిఘంటువులు, లిపి బోధినులు, సాహిత్య శోధనా పరికరాలు, పదానుక్రమణికలు -ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. కంప్యూటర్‌ చదువులు కూడాతెలుగులో రావాలి. అలా చదివిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలుప్రకటిస్తే తెలుగు చాలాకాలం బతుకుతుంది. యంత్రాను వాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు అకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగాతెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి. లిపి సంస్కరణ తెలుగు లిపిసంస్కరణ జరగాలనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ‘‘ముత్యాల్లాంటితెలుగక్షరాలంటూ లిపి మీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్‌లిపిలో తెలుగును నేర్పితే మన దేశం ఆధునిక యుగంలోనికి ప్రవేశిస్తుంద’’నిశ్రీశ్రీ లాంటివారూ సూచించారు. వత్తులు, గుణింతాల ఇబ్బందిని అధిగమించలేకనేచాలామంది బాగా తెలుగు వచ్చిన వాళ్లు కూడా తెలుగు టైపింగ్‌ జోలికిరాలేకపోతున్నారు. అయితే.. లిపి సంస్కరణ విధివిధానాల మీద ఇంకా విస్తృత చర్చజరగాలి. చరిత్రలో తెలుగు లిపి ఎన్నోసార్లు మారింది. ప్రస్తుత కాలమానఅవసరాలకు తగ్గట్టు దాన్ని తీర్చిదిద్దుకోవడంలో తప్పులేదు. అన్నిచోట్లా తెలుగుకే ప్రాధాన్యం ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో కూడా అన్నిస్థాయుల్లో పదో తరగతి వరకుతెలుగు మాధ్యమంలో ఉండాలి. కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులుసంకలనం, వ్యవకలనం, పరిచ్ఛేదము లాంటి సంస్కృత పదాలను వాడి తెలుగు మాధ్యమంఅంటేనే పిల్లలు భయపడేలా చేశారు. పాఠ్యపుస్తకాలన్నీ వాడుక తెలుగులోరూపొందించాలి. అలాగే, రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలనువాడుక భాషలోకి తేవాలి. ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలన్నింటినీఅప్పటికప్పుడు తర్జుమా చేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటు చేయాలి.న్యాయస్థానంలో తీర్పులు అధికార భాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అధికారభాషను అమలు చెయ్యని అధికారుల మీద చర్యలు తీసుకునే అధికారాన్ని అధికార భాషాసంఘాలకి ఇవ్వాలి. అలాగే, తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయగల ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల్ని మాత్రమే ప్రజలతో సంబంధమున్న కీలక స్థానాల్లోనియమించాలి. తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషి చేసిఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏం చేశాయో, ఏం సాధించాయో ప్రగతినివేదికలను బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుంచి సూచనలు తీసుకోవాలి.పరిపాలక గ్రంథాలు అంటే.. కోడ్లు, మాన్యువల్‌ లాంటివన్నీ తెలుగులోప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌ కమిషన్‌ పోటీ పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలను తెలుగులో నిర్వహించాలి. ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు ‘ఎవరి భాషను వాళ్లు కాపాడుకోవాలి - అధికార భాషగా అభివృద్ధి చేసుకోవాలి’అని రాజ్యాంగంలోని 345వ అధికరణ స్పష్టం చేస్తోంది. కోయంబత్తూరులో జరిగినప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలుసులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళ మాధ్యమం అభ్యర్థులకుఉద్యోగాలు దొరక్కపోతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమంలో చదివించరనీ, ఎవరూచదవని భాష నశిస్తుందనీ, తమిళం పదికాలాలపాటు బతకాలంటే ఆ భాషలో మాత్రమేచదివిన వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానించారు. ఇందుకోసం ఓఅత్యవసర ఆదేశాన్నీ (ఆర్డినెన్సు) తెచ్చారు. శాసనసభలో, స్థానిక సంస్థల్లో, ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీల్లో తమిళ అభ్యర్థులకు 20 శాతం ఉద్యోగాలుఇవ్వాలని శాసించారు. తమిళనాడులో తెలుగు బడుల్లోనూ తమిళాన్ని తప్పనిసరిచేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి రాసే లేఖల్లోనూతమిళభాషను వినియోగిస్తారు. జతగా ఆంగ్లంతో కూడిన లేఖను ఉంచుతారు. ఉత్తరప్రత్యుత్తరాలను తమిళంలోకి అనువాదం చేసేందుకు 35 మంది అనువాదకులనునియమించారు. తమిళ మాధ్యమంలో చదివే వారికి ఉద్యోగాల నియామకాల్లో అయిదు శాతంమార్కులు అదనంగా ఇస్తున్నారు. తమిళం చదివిన వారికి మాత్రమే 12వ తరగతి వరకుర్యాంకులు ఇస్తున్నారు. అలాగే, కన్నడ మాధ్యమంలో దేశంలో ఎక్కడచదువుకుంటున్నా కర్ణాటక ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.2,500 ఉపకారవేతనాన్ని అందిస్తోంది. ఉద్యోగాల్లో అయిదు శాతం రిజర్వేషన్లు అమలుచేస్తోంది. ప్రాథమిక విద్య తప్పనిసరిగా ఆయా రాష్ట్రాల మాతృభాషల్లోనేనిర్వహించేలా ఆదేశాలు ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ కోరారు. ఈ కృషిని తెలుగురాష్ట్రాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు రెండూ భారీ ఎత్తున గ్రూప్‌-2, 3 సర్వీసుఉద్యోగాలు భర్తీ చేస్తున్నాయి. వీటిలో చాలా ఉద్యోగాలుప్రజలతో మమేకమైవారితో ముఖాముఖి మాట్లాడుతూ, వారిమధ్యే నివసిస్తూ వారికిసేవలందించాల్సినవి. ఈ ఉద్యోగులు ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషించాలి. గ్రామ సామాజిక, ఆర్థిక వ్యవస్థపై తగిన అవగాహన తెచ్చుకోవాలి. ప్రజాపరిపాలనపరిజ్ఞానం పెంచుకోవాలి. అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు, సూచనలు, వినాలి, రాయగలగాలి. ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాషలోతెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. గ్రూప్‌-1, గ్రూప్‌-2, 3 లాంటి సర్వీసు ఉద్యోగాల్లో తెలుగు మాధ్యమంలో చదివిన వారికిగతంలో ఇచ్చిన మాదిరే అయిదు శాతం ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి. తమిళనాడుమాదిరిగా ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్‌ ఇస్తే, అప్పుడు తెలుగులో కార్యాలయవ్యవహారాలు నడిపేవాళ్లు రంగప్రవేశం చేస్తారు. కొంతవరకైనా కార్యాలయాల్లోతెలుగు బతుకుతుంది. ఉద్యోగాలొస్తాయన్న ఆశతో కొంతమందైనా తెలుగులో చదువుతారు.తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నింటికీ ‘కొత్తపదాలు’ పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చేశాస్త్రీయ పాలనా తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగు అమలు కావాలంటేతెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగాచేయాల్సిందే. కొరడా కూడా అవసరమే రోజువారీ పాలనాపరమైనకార్యకలాపాల్లో ప్రతిపాదన తయారు దశ నుంచి చట్టసభల్లో బిల్లు ప్రతిపాదన వరకుఅన్నీ తెలుగులోనే జరపాలి. సచివాలయ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు అన్నీ విధిగా తెలుగులోనే ఉండాలి. తెలుగుఅమలును నిర్లక్ష్యం చేసే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. వ్యాపారసంస్థలు, దుకాణాల మీద కన్నడ భాషలో నామఫలకాలు ఏర్పాటు చేయకపోతే వాటిలైసెన్సులు రద్దు చేసే అధికారం కన్నడ అధికార భాషా సంఘానికి ఉన్నట్లుగా, తెలుగు అధికార భాషా సంఘానికి కూడా ఉండాలి. మండలస్థాయి నుంచి సచివాలయం వరకుఅధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషాసంఘానికి ఇవ్వాలి. ప్రతిజిల్లాకు అధికార భాష అమలు పర్యవేక్షకుణ్నినియమించాలి. తెలుగులోనే ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాల నిర్వహణకు అవసరమైనపదజాలం, వాక్య నిర్మాణ విధానాలపై తగిన శిక్షణ ఎప్పటికప్పుడు అందించాలి.ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే పరిపాలనా భాషగా తెలుగు పక్కాగా అమలవుతుంది. ఈలక్ష్యం సాధ్యమైనంత త్వరగా సాకారం కావాలంటే పాలకులు, అధికారులు అమ్మభాషపట్ల గట్టి సంకల్పం చెప్పుకోవాలి. దాన్ని తు.చ. తప్పక పాటించాలి. పాలనాభాషకు ఉండాల్సినంత పదసంపదను ఎన్నేళ్లు గడిచినా సమకూర్చలేకపోతున్నాం.అనువాదకులు తేట తెలుగుకు బదులు సంస్కృతం వాడి భయపెడుతున్నారు. కాలగమనంలోకొత్తకొత్త ఆంగ్లపదాలే మనకు అబ్బుతున్నాయిగానీ, కొత్త తెలుగు పదాలుగానీ, పాతవైనా కొత్తగా వాడకంలోకి రావడం లేదు. ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాషతయారు కావాలి. ఆంగ్లంలో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి.పూర్తిస్థాయి పాలనాభాషగా తెలుగును తీర్చిదిద్దుకోవాలి. తమిళ మాధ్యమంలోడిగ్రీ వరకూ చదివిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 20 శాతంరిజర్వేషన్‌ ఇవ్వడాన్ని మద్రాసు హైకోర్టు కూడా సమర్థించింది.ప్రభుత్వోద్యోగాలకు నేరుగా జరిపే నియామకాల్లో తమిళ మాధ్యమ అభ్యర్థులకుఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది. రాజ్యాంగంలోని 345 అధికరణను ఉకిస్తూ ఎవరి భాషను వాళ్లు కాపాడుకోవాలని, ఆయా రాష్ట్రాల్లో పాలనా భాషగా అధికార భాషగా అభివృద్ధి చేసుకోవాలని తెలియజేసింది. - నూర్‌బాషా రహంతుల్లా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి