18, మే 2018, శుక్రవారం

నాగసూరి వేణుగోపాల్ గారి ముందుమాట



                   డా. నాగసూరి వేణుగోపాల్
                                                                                                                 ఆకాశవాణి డైరెక్టర్ ,తిరుపతి
9440732392

                                  నూరుడు నడిపే భాషా రధం

కావలి వెంకట బొర్రయ్య (1776-1803) తొలి భారతీయ ఆంగ్ల రచయిత.మహాశయుడు 1793 లో నే ఉత్తర భారత కొండజాతుల వారిపై ఆంగ్లంలో పుస్తకాన్నిరచించారు. కావలి సోదరులుగా పిలవబడే ముగ్గురు కల్నల్ మెకెంజి దొరకు దోహదపడ్డారు. ఈ ముగ్గురిలో పెద్దవారు బొర్రయ్య. మామిడి వెంకయ్య(1764-1834) రచించిన  ఆంధ్రదీపిక తొలి తెలుగు అకారాది నిఘంటువు. పోకల లక్ష్మీ నరసు రచించిన బౌద్ధసారం అనే ఆంగ్ల గ్రంథం 1740 ప్రాంతాల్లో అంబేద్కర్ ను చాలా ప్రభావితం చేసింది. అందువల్లనే ఈ గ్రంథాన్నిఅంబేద్కర్ 1948 లో స్వీయ పరిచయంలో పునర్ముద్రించారు.
                        తెలుగుకు సంబంధించీ, తెలుగు వారికి సంబంధించీ మనం సదా గర్వపడి, స్ఫూర్తి పొందగలిగే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే మనకు అభిమానం లేకపోవడంతోనే ప్రస్తుత దురవస్థ. పరాయి పాలనలో కూడా నాణేలపై ఉన్న నాలుగు భాషలలో ఒకటిగా తలెత్తుకుని గౌరవం పొందినది తెలుగు. ఇలాంటి గత వైభవాన్నీ, ప్రస్తుత స్థితినీ తలచుకున్నప్పుడు ఎంతో నిరాశా, నిర్వేదం, నిర్లిప్తత తప్పక కలుగుతాయి. అయితే, అలాంటి, సందర్భాల్లో మనకు ఆశలు నింపి, ఆకాంక్షలు రేపే వ్యక్తి నూర్ బాషా రహంతుల్లా! వారు నాకు రెండు దశాబ్దాలుగా తెలుసు. వారి డీఎన్ఏ లో  తెలుగు వినబడుతుంది, కనబడుతుంది, పరిమళిస్తుంది. వెలుగు రథాన్ని నడిపే సూర్యుడి సారధిని అనూరుడు అంటారు. దానికి మించి తెలుగు వెలుగు రథంలాగా  సాగాలంటారు ఈ నూరుడు !
        నూర్ బాషా రహంతుల్లా ప్రస్తుత వ్యాస సంపుటిలో ఆవేశం ఉంది. ఆలోచన ఉంది, ఆక్రోశం ఉంది, ఆర్తి ఉంది. ఇవన్నీ కూడా తెలుగు పట్లనే! విక్టోరియా మహారాణి బంగారు పతకం తెలుగులో ఉందని చరిత్ర గుర్తుచేస్తారు. తెలుగు భాషకు సేవ చేసే ఛాన్స్ వచ్చిందని సర్వీసు కమీషన్లకు బాధ్యత గుర్తు చేస్తాడు. దేవుడికి తెలుగు రాదనే పచ్చి వాస్తవాన్ని కుండబద్ధలు కొడతారు. చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలంటూ పిడికిలి బిగిస్తారు. ప్రాంతీయ భాషలు చచ్చి పోవాలా అని గొంతెత్తుతారు. పార్లమెంటులో తెలుగు వినబడాలని ఆశిస్తారు. తెలుగు లిపిని ఆంగ్లలిపిలా సంస్కరిస్తేనే మంచి రోజులంటారు. తెలుగులో పాలన చేయలేమా అంటూ ప్రశ్నిస్తారు! ఇది బాషా గారి భాషా ప్రణాళిక! ఏ మాత్రం అవకాశం దొరికినా, ఎక్కడ వీలు దొరికినా తెలుగు కుండే సౌలభ్యం, హేతుబద్ధత, ఔన్నత్యం, అందుకోవాల్సిన దార్శనికత గురించి విరిస్తాడు. వీరి కృషి ఇలాగే, మరింత సమగ్రంగా, తీక్షణంగా సాగాలి. వీరి తపనా, ఆర్తి అందుకుని మేధావులు, రచయితలు, రాజకీయనాయకులు, ప్రజలు సవ్యంగా స్పందించాలని కర్తవ్యాన్ముఖులు కావాలని నా ఆశా, అభిలాషా!                                                           


1 కామెంట్‌: