27, మార్చి 2012, మంగళవారం

తెలుగు భాషకు సత్యసాయి అండ

తెలుగు భాషకు సత్యసాయి అండ తెలుగు భాషకు సత్యసాయి అండ “దైవారాధనలో వాడే భాషను దేవ భాష అంటారు.తెలుగును దైవారాధనలో వాడరు కాబట్టి అది దేవ భాష కాదు.అసలు తెలుగు దేవ భాష అనటానికి ఆధారాలేంటి? దానికా హోదా ఎవరిచ్చారు?” లాంటి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేక చాలా సార్లు నాకు తలకొట్టేసినట్లయ్యింది. ఎవరి దేవుడి భాషకు వాళ్ళు స్తోత్రగీతాలు పాడుతున్నారు.ముక్కోటి దేవతల్లో తెలుగు మాట్లాడే దేవుడే లేడంటే నాకు అవమానంగానూ అనుమానంగానూ ఉంది. పైగా తెలుగును ఇంత దిక్కు మాలిన భాషగా చేసి 18 కోట్ల ప్రజలను పర భాషా దాసులుగా పడి ఉండండి అని మన తల రాత ఇలా రాసిన దేవుళ్ళ రాజకీయం కూడా నాకు నచ్చకుండా పోయింది. పోనూ పోనూ నాకూ ఇందులో మానవ కుట్రే ఏదో దాగి ఉందనీ అనిపించింది.దేవుడు సమవర్తి కదా మనిషికి లాగా ఆయనకు ఇంత భాషా పక్షపాతం ఎందుకుంటుంది?ఇదేదో భక్తి రంగంలోనే తేల్చుకోవాలి అనిపించింది. రాయిని విగ్రహంగా చేసి మొక్కితే దేవుడిలా పూజలందుతుంది.మొక్కటమే ఇక్కడ ముఖ్యం.18 కోట్ల ప్రజలు మాట్లాడుతున్న సజీవ భాషకు ఆపాటి గౌరవం కట్టబెట్టలేమా?మన జనమే మన భాష ను అవహేళన చేస్తుంటే పరాయి వాళ్ళు పొగుడుతారా?ప్రజల విస్తృత వాడకంలోకి తేకపోతే ఈ భాష కొడిగట్టడం చచ్చి పోవటం ఖాయం అని ఐఖ్య రాజ్య సమితి తేల్చింది. ప్రజలు తెలుగును విస్తృతంగా వాడాలంటే తెలుగు దేవ భాషే అని మనమంతా గట్టిగా నమ్మి,మరింత సమర్ధవంతమైన వాదనలతో ఋజువు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రవాహంలో పడి కొట్టుకేళ్ళేవాడు ప్రాణ రక్షణ కోసం ఏ గడ్డిపరకనైనా పట్టుకుంటాడు.అలాంటి ప్రమాద బాధితుడి ఆర్తనాదమే ఈ వ్యాసం.మరణశయ్య మీద ఉన్న వాడు ఏ మతస్థుడి సహాయమైనా సరే ఇష్టంగానే తీసుకుంటాడు.తెలుగు భాష ప్రాణం నిలవటానికి అండగా నిలిచిన వారు ,ఆ భాష గొంతులో కాసిని నీళ్ళు పోసిన వారు ఏ రంగం లోని వారైనా సరే ఆశ్రయించాను,అవసరంకొద్దీ తప్పలేదు. బాబాలపై నాకు వ్యక్తిగత విశ్వాసాలు ఏమీ లేకపోయినా సరే నా భాషకు కూడా దైవ భాష హోదా ఉంది అనే వాదనలో కొన్ని మెట్లు ఎక్కటానికి వారి సాహిత్యం ఉపయోగపడింది. విమర్శలు ఎన్నో వైపుల నుండి వస్తాయని తెలుసు.ఇది అవకాశవాదం కాదు ప్రాణం మీదకొచ్చిన ఒక భాషకు అవసరమైన వాదం. తెలుగు భాషలో రచనలు చేసిన వాగ్గేయకారులు ,భక్తి వేదాంత జ్నానులపై దృష్టి నిలిపాను.గతించిన మహానుభావులు గతించిపోగా మన సమకాలికుల్లో సత్యసాయిబాబా కూడా నాకు ఒక తెలుగు పరిరక్షకుడిగా కనబడ్డారు.కారణాలు వరసగా వివరిస్తాను.ఆయన మహిమాలూ గట్రా పక్కన పెట్టి తెలుగు భాషకే జీవితాంతం ఎలా కట్టుబడిపోయాడో మిగతా ప్రపంచాన్ని తన తెలుగు భాషతో ఎలా ప్రభావితం చేశాడో అన్న అంశం వరకే పరిమితమై పరిశోధించాను. సాయి భక్తుల నమ్మకం “బాబా దేవుడు.ఆయనకు అన్నీ భాషలూ వచ్చు.ఆయన ఒక భాషకు పరిమితం కాలేదు.ఆయన భాషా పక్షపాతి కాడు.అన్ని భాషలూ ఆయనవే.సంస్కృతం దేవ భాష అనీ ఆయన చెప్పాడు కానీ తెలుగు భాష గొప్పదనీ ,అందులోనే పరిపాలన జరగాలనీ ,ఆయన ఎప్పుడూ చెప్పలేదు.కాకపోతే ఆయన వాళ్ళ అమ్మకు ఇచ్చిన మాట నిలుపుకునేందుకు పుట్టపర్తిలో నిలిచిపోయాడు.తెలుగు నేలపై ఒక తెలుగు తల్లికి పుట్టాడు గనుక తెలుగులోనే మాట్లాడాడు.అంతకంటే ఆయన దృష్టిలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు గౌరవం ఏమీలేవు” అని పలువురు బాబా భక్తులు అన్నారు. హేతువాదుల వాదన బాబాకు తెలుగు తప్ప మరే భాషా రాదు.అన్ని భాషలూ వస్తే అనువాదకులను ఎందుకు పెట్టుకుంటాడు? అని భాషోద్యమకారుల్లోని హేతువాదులు కొందరు వాదించారు.అయితే సాయి తెలుగువాడు కావటాన భక్తి గొడవ వదిలేసి భాషాపరంగా ఆయనపై తెలుగు ప్రేమ చూపించారు. బాబా గురించిన ఇలాంటి నమ్మకాలూ అద్భుతాల వాదనలూ విమర్శలూ వినీ వినీ తెలుగు భాషకు పనికొచ్చే నాలుగు ముక్కలు ఏమన్నా దొరక్కపోతాయా అన్న ఆశతో 2012 మార్చి 13 ,14 తేదీలలో పుట్టపర్తి వెళ్ళాను.మిత్రులు బొడ్డు రామయ్య గారు ( ఫోన్.9948471264,9393283099 ) ఆతిధ్యమిచ్చారు.80 ఏళ్ళ వయసులో కాళ్ళు ఈడ్చుకుంటూ కూడా నాకు వండి వడ్డించి నేను తిన్నాకనే తాను తిన్నారు.అదేంటంటే బాబా మాకు నేర్పిన పద్ధతి అన్నారు. తెలుగు భాషతో సంబంధం ఉన్న అందరి దగ్గరకూ తీసికెళ్ళారు. వాళ్ళందరినీ ఒకటే అడిగాను.తెలుగు భాష గురించి బాబా ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారో ఆ వాక్యాలు కావాలన్నాను.తెల్లారేలోగా లైబ్రరీలో నరసింగరావు గారూ,వెంకట మునియప్ప గారూ ఆయా పుస్తకాలను వెతికి పట్టుకొని టేబుల్ మీద పెట్టారు.నాకు చాలా సమయం కలిసి వచ్చింది.ఇక అక్కడ తెలుగు విభాగంలో పనిచేస్తున్న గరిమెళ్ళ కృష్ణమూర్తి గారు “ఇప్పటి దాకా బాబా సందేశాలను భక్తి కోణం నుంచి మాత్రమే పరిశోధించాను. ఇక మీదట భాషాకోణం నుంచి కూడా పరిశీలిస్తాను , తెలుసుకున్న విషయాలు మీదృష్టికి తెస్తాను “ అన్నారు . బాబా అనువాదకులు కామరాజు అనిల్ కుమార్ గారు “ ఈ విషయంలో శ్రీనివాసులు దిట్ట.అతను ఎంత చెబితే నేనూ అంతే “ అన్నారు.శ్రీనివాసులు గారు “ఇక నేను కూడా తెలుగు భాష గురించి బాబా గారు సెలవిచ్చిన ముత్యాలు ఏరి మీకు పంపిస్తాను”అన్నారు.బాబా తన జీవితాంతం చేసిన అసంఖ్యాక ప్రసంగాల్లో తన తల్లి భాష గురించి ఎక్కడా ఏమీ చెప్పలేదా?అన్న నా ప్రశ్నతో వాళ్ళూ పునరాలోచనలో పడ్డారు.”వెతికి తీస్తాం సార్” అన్నారు. ఆధారాలు,ఋజువులూ,సాక్ష్యాలూ లేకుండా న్యాయవాది వాదిస్తే న్యాయమూర్తి ఒప్పుకోడు.తెలుగు దేవ భాషే అని నిరూపించటానికి ఎక్కడెక్కడ ఎన్ని ఆధారాలు దొరికితే అన్నీ తీసుకోవాలి. భవిష్యత్తులోనన్నా మన జనానికి కనువిప్పు కలగొచ్చు. తెలుగుకింత దివ్య శక్తి ఉందా అని తెలుసుకొని తప్పిపోయిన కుమారుల్లాగా తిరిగి రావచ్చు.తల్లి భాషకు పట్టం గట్టి పూజించనూ వచ్చు.చరిత్ర తిరగబడానూ వచ్చు. బాబా మహత్యాల గురించిన చర్చలోకి నేను వెళ్ళను. ఆయన తెలుగు భాషకు ఏ మాత్రం సాయపడ్డాడో ఆలోచిద్దాం .తెలుగు భాషకు బాబా సమకూర్చిపెట్టిన అండా దండా ఏమైనా ఉందా? అని పరిశీలిద్దాం. 125 దేశాల్లో ఉన్న బాబా భక్తులు ఆయన తెలుగులో చేసిన ప్రసంగాలు కలకాలం నిలిచే నిత్య సత్యాలు అని నమ్ముతున్నారు. ప్రపంచంలోని ఏ భాషస్తులైనా సరే తన సందేశాలను తెలుగు భాషలో విని,చదివి,అనువదించుకొని పోవాల్సిన గొప్ప స్థాయిని , గత్యంతరం లేని స్థితిని బాబా తెలుగుకు కలుగజేశారు. ఇంతకీ భాషల గురించి బాబా ఏమన్నారు?: “గంగా యమునల్లాగా ఈ సభలో తమిళులు,తెలుగులు ఇద్దరున్నారు. నేను ఎప్పుడూ ఒకే భాష లో మాట్లాడుతాను. శ్రోతల కోసం నా భాష నేను మార్చుకోను.తెలుగు రాని వారు కూడా నా సందేశ సారాంశం తెలుసుకుంటారు.నాతో వ్యవహరించటానికి భాష ఒక అడ్డంగా ఉంది.మానవ జీవన యాత్రలో ఆన్ని భాషలకూ గొప్ప పాత్ర ఉంది.వారి భావాలను వ్యక్తం చేయటానికీ,వారి బలహీనతలను దాయటానికీ,వారి ఆలోచనలు రూపుదిద్దుకోటానికీ వగైరా..కానీ నేను హృదయ భాషలో మాట్లాడుతాను,వింటాను.మనుషులు నాలుకలతో మాట్లాడే భాషలు అయోమయంలో పడేస్తాయి.వాటివలన తెగలు,విభేదాలు,అడ్డుగోడలు పుడతాయి.ఈ ప్రపంచమే నా ఇల్లు.అందులో ఎన్నో గదులున్నాయి.నీ భాషకు ప్రాముఖ్యత ఇవ్వక భావానికి ఇవ్వు.దయా దాక్షిణ్యాలతో నిండిన హృదయ భాషే అసలైన భాష.అది అందరికీ అర్ధమయ్యే భాష.మూగవాడు కూడా మాట్లాడే భాష .చెవిటి వాడు కూడా వినగలిగే భాష.ఒక భాష కంటే మరో భాష గొప్పదని గర్వ పడకండి,తగాదాలు పెట్టుకోకండి.అనేక భాషలలోని బలహీనతలను అదిగమించటానికి సులభంగా అర్ధమయ్యే వాడుక భాషను ,హృదయ భాషను నేర్చుకొని ,ఉపయోగించండి” అన్నారు బాబా.( (18.8.1984) Satya Sayi Speaks vols.II,IV) హృదయ భాష అంటే ? ఎవరి మాతృ భాషే వారి హృదయ భాష. బాబా హృదయ భాష తెలుగు.ఈయన ద్వారా వెలువడిన సాహిత్యమంతా తెలుగులో వచ్చింది.ఆయన తెలుగు సాహిత్యం కావాలనుకున్న వాళ్ళంతా వారి వారి భాషలలోకి దానిని మార్చుకున్నారు. అయితే మూల భాష కు అన్ని మతాలూ దేవ భాష అంటూ పెద్దపీట వేస్తాయి.తమ మూల భాష కోసం ఆయా మతస్తులు ప్రాణమిస్తారు. బైబిల్ కు హెబ్రూ ,గ్రీకు –ఖురాన్ కు అరబీ –గీతకు సంస్కృతం లాగా సత్యసాయి భక్తులకు తెలుగే మూల భాష కాబట్టి దేవ భాషల సరసన తెలుగు కూడా చేరింది. ఆంధ్రుల హృదయ భాషైన తెలుగును మన ప్రభుత్వం మన పాఠశాలల్లో తప్పనిసరి చేయలేక పోయింది.కానీ బాబా విశ్వ వ్యాప్తమైన తన భక్తులందరికీ తెలుగులో మాత్రమే తన సందేశాలను వినిపించారు.తెలుగులో వినక తప్పని పరిస్థితి కల్పించారు. బాబా బోధనలకు తెలుగే మూల భాష కాబట్టి సాయి భక్తులకు తెలుగే దేవ భాష . తెలుగులో ఆశువుగా పద్యాలు ‘అల్లా యంచు మహమ్మదీయులు జహోవా యంచు సత్ క్రైస్తవుల్ పుల్లాజ్జాక్షుడటంచు వైష్ణవులు శంభుండంచు శైవులు సదా ఉల్లాసంబున గొల్వ నెల్లరును నాయుర్భోగ భాగ్యాది సం పల్లాభంబు లొసంగి బ్రోచు పరమాత్ముం డోక్కడే చూడుడీ’ ---అని బాబా సర్వ మత హితంగా సందేశమిచ్చారు ( 27.7.1978) తేట తెలుగులో ఆశువుగా బాబా ఎన్నో పద్యాలు చెప్పారు.పద్యాలే కాదు పాటలు కూడా రచించారు,పాడారు.తెలుగు భాషకు బాబా చేసిన సేవ చాలాగొప్పదే .మహిమలూ మహత్యాలూ సరే గానీ ఆయన భాషను అందులోని చమత్కారాలనూ పదసంపదనూ ఇకనైనా తెలుగు భక్తులు పరిశోధించాలి. రాజీ పడని తెలుగు బోధకుడు తెలుగు దేశంలో తెలుగు శ్రోతల ముందు తెలుగులో మాట్లాడటానికి బెదిరిపోతున్న బ్రహ్మానంద పాండా అనే ఒరియా పండితుడిని తెలుగులో మాట్లాడు అంటాడు బాబా.నేను తెలుగులో మాట్లాడుతాను,నీవు ఆంగ్లం లోకి అనువదించు” అంటాడు బాబా.(సనాతన సారధి,ఏప్రిల్ 2009). రాజకీయ రంగంలో ఎన్టీ రామారావు లాగా ఆధ్యాత్మిక రంగంలో సత్య సాయి తెలుగు భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠ లు తెచ్చి పెట్టారు.తెలుగు మామూలు భాష కాదు ,అది విలువైన భాష , మాహా గొప్ప భాష అని అందరూ తెలుసుకునేలా చేశారు.వీళ్ళీద్దరూ తెలుగుకు వారి వారి రంగాలలో ఒక అధికార హోదా తెచ్చి పెట్టారు. గొప్పల కోసం మాతృ భాషను వదలలేదు.మరో భాష కోసం పరుగులు తీయలేదు.అవసరాలకోసం రాజీ పడి తల్లి భాషను వదులుకోలేదు. తెలుగు పుటక పుట్టిన అనేక మంది ప్రముఖ బోధకులు వారికి తెలుగు వచ్చినా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడుతూ తెలుగు అనువాదకుల్ని పెట్టుకోవటం చూస్తున్నాము.సత్యసాయి ఈ కృత్రిమ స్వభావం చూపకుండా యావజ్జీవితం నిక్కమైన తెలుగు వాడిగా నిలిచాడు. తెలుగు భాషకు పట్టిన మహద్భాగ్యం “జగద్గురువుగా నిర్గుణ పరబ్రహ్మము తన సకల శక్తులతో మానవరూపంలో మన మధ్య అవతరించడం,అందునా తెలుగు దేశంలో అవతరించడం,సర్వప్రపంచ భాషలలో మాట్లాడగలిగిన్నీ వారు మన తెలుగులోనే మాట్లాడటం,ఈ పత్రికలో వారు మాట్లాడిన తెలుగు సందేశాలను ముద్రించడం ఇవన్నీ సామాన్య అదృష్టాలు కావు.ఇవన్నీ సాయి భగవానుని అపార అనుగ్రహానికి సంకేతాలు” --- ముదిగొండ వీర భద్రయ్య సంపాదకుడు సనాతన సారధి,ఏప్రిల్ 2009). సాక్షాత్తూ భగవంతుని నోట వెలువడిన ఈ తెలుగు పద్యాలను ఆంగ్లం లోకి అనువదించాను --ఎస్.బి.సీతారాం (సత్యసారం-పద్యరూపం) “భగవాన్ బాబా తెలుగు దేశంలో పుట్టటం,తెలుగులో రచించటం,తెలుగు పాటలు పద్యాలూ పాడటం,తెలుగు దేశానికీ తెలుగు భాషకూ పట్టిన మహద్భాగ్యం .తెలుగు జాతికి తరగని ధనం శ్రీ సత్య సాయి నాధ సుధ” -- బి.రామరాజు (23.11.2005) తెలుగుకు బాబా బంగారం లాంటి అవకాశం మాతృభాషను విడనాడకుండా బాబా అన్యాయమై పోతున్న తెలుగుకు రక్షకుడుగా నిలిచాడు.నీవొకందుకు పోస్తే నేనొకందుకు తాగాను అన్నట్లు నేను భాషా కోణంలో నుంచి బాబాను చూశాను.బాబా కూడా ఒక అన్నమయ్య, ఒక త్యాగయ్య, ఒక రామదాసు , ఒక ఉమర్ అలీషా లాగా తెలుగు లో విస్తారమైన భక్తి వేదాంత సాహిత్యాన్ని రచించారు,ప్రసంగించారు, పాడారు.ఆయనకు దైవత్వాన్ని ఆపాదించి,ఆయన భక్తిలో మునిగిపోతున్న భక్తులు ఆయన భాషపై తగినంత శ్రద్ద పెడితే భాషకు పెద్ద లాభం కలుగుతుంది.తెలుగు దేవ భాషే అనే నమ్మకం ఒకసారి రుజువై బలపడితే అన్ని భాషల భక్తులూ తెలుగు భజనలు చేస్తారు.తెలుగులో పాడక తప్పని పరిస్థితి వస్తే ఆ భాష నేరుస్తారు.ఆయా మతాల వాళ్ళు నానా కష్టాలూ పడి సంస్కృతం,అరబీ,హెబ్రీ నేర్చుకుంటున్నట్లే విశ్వ వ్యాప్తం గా ఉన్న బాబా భక్తులు తెలుగు భాష వల్లె వేస్తారు.బాబా ఇచ్చిన బంగారం లాంటి అవకాశం బాబా భక్తుల్లోని తెలుగు భాషోధ్యమ కారులు,భాషాభిమానులు వాడుకోవాలి.ఎందుకంటే ఇలాంటి పని ఇతర భాషల వాళ్ళు చెయ్యరు .ఆయన సాహిత్యమంతా వారి సొంతం అయ్యాక బాబా మా ఆంగ్లేయుడు ,మా తమిళుడు అంటే మాత్రం ఏం చేస్తాం? అసలే శక్తి చాలక సాధుత్వం వహించే తెలుగు వాళ్ళం కదా? బాబా చేతిరాత “బలమే జీవం.బలహీనతే మరణం” అన్నాడు వివేకానందుడు.భాషలకు కూడా ఈ సూక్తి వర్తిస్తుంది.నిజాం నవాబుల చేతి రాతలను కూడా హైదరాబాదు మ్యూజియం లో భద్ర పరచుకొని మురిసిపోతున్నారు వారి వారసులు.బాబా చేతిరాత సాహిత్యం యావత్తూ తెలుగు లోనే ఉంది .దానిని స్కానింగ్ తీయించి తెలుగు భక్తులు ‘ప్రేమ ధార’,’దివ్య జ్నాన దీపికలు’ లాంటి పుస్తకాలు ప్రచురించారు.14.10.1946 న బాబా రాసిన పద్యం ఆయన చేతివ్రాతలో ఎలా ఉందో చూడండి: ఇండియా టుడే 2012 జనవరిలో Divine Grace satya saibaba అనే 120 పేజీల ప్రత్యేక సంచిక విడుదల చేసింది.అందులో బాబా ఇంగ్లీషులో రాసిన 4 ఉత్తరాలను స్కాన్ చేసి ముద్రించింది.ఆయన తెలుగు లిపిలో రాసిన లేఖలు గానీ,ఆంగ్లలిపిలో రాసిన తెలుగు లేఖలు గానీ,ముద్రించలేదు.తెలుగు దేవ భాష అంటే తప్ప బాబా రాసినవైనా సరే ఒక్క తెలుగు లేఖను కూడా ఇతర భాషల వాళ్ళు ముట్టరు. తమిళులు త్యాగయ్య రచించిన తెలుగు కీర్తనలను అనువాదం చెయ్యకుండా యదాతదంగా తమిళంలో రాసి పాడుకొంటున్నారు.దానికి కారణం సంగీతం.త్యాగయ్య తెలుగు సంగీత బాణీలు తమిళంలో ఇమడవు.సంగీత జ్నానము భక్తి వినా సన్మార్గము కలదే ఓ మనసా ?అన్న త్యాగరాజు తమిళ దేశంలో ఉండి కూడా తెలుగు పాటలు పాడాడు.మూల భాష తప్పనిసరి అనే షరతు పెడితే సరి- తెలుగు వాళ్ళు తమిళ పాశురాలు పాడినట్లు, తమిళ భక్తులు త్యాగయ్య కీర్తనలను తెలుగులోనే పాడినట్లూ , బాబా కీర్తనలను కూడా ప్రపంచమంతా తెలుగులోనే పాడుతారు. బాబా తెలుగులో చేసిన ప్రసంగాలన్నింటినీ ,మన తెలుగు భక్తులు ఆంగ్లంలోకి ,తమిళంలోకి అనువదించిపెట్టాక ఇక తెలుగు అవసరం ఏముంటుంది? అవసరంతీరాక తెలుగును తీసి అవతల పారేస్తే ఎలా? మిగతా మతాల లేఖనాల మూల బాష దేవ భాషలు ఎలా అయ్యాయో అలాగే సాయి లేఖనాల మూల భాష కూడా దేవ భాషే అవ్వాలి కదా? బాబా మూల భాష తెలుగు సాయి ప్రసంగాల మూల భాషే తెలుగు అయినప్పుడు తెలుగులో ఆయన సాహిత్య ముద్రణ పరాయి భాషలకంటే సులభం . అనువాదమే అక్కరలేని తెలుగు వాళ్ళు ఇంకా ఆపని పూర్తి చేయలేదు.తెలుగు భక్తులు ఆయన సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి,అరవం లోకి అనువాదం చేసిపెట్టారు గానీ తమ సొంత భాషలోకి Satya Sayi Speaks తరహా లో 42 సంపుటాలు తేలేకపోయారు. బలవంతుడు తోసుకొని ముందుకెళుతుంటే పోనీలే అని ముచ్చటపడి వెనక్కి తగ్గే సహనశీలత, పక్కకు జరిగి ప్రోత్సహించే ఉదారత తెలుగు వాడిది.అదే తెలుగుతనం ఇక్కడా గోచరిస్తోంది. “పాండిత్యమున చాల ప్రఖ్యాతి గాంచియు ప్రతిభ చూపించిన భరత భూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీ శక్తి చూపిన దివ్య భూమి ఔర ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగదో అట్టులైనారు మన భారతీయులు నేడు “ అని బాబా ఆవేదన చెందారు. మిగతా భాషల సంగతేమో గానీ తెలుగు వారికి ఈ పద్యం చక్కగా సరిపోతుంది. చేతిలోని ముద్దను చెరువులో విసిరేసి చెయ్యి నాకినట్లుగా ఉంది మన పరిస్థితి . దివ్యాత్ముని మాతృ భాష తెలుగు బాబా తెలుగు ప్రసంగాలను ఇంగ్లీషులోకి అనువదించే అనిల్ కుమార్ గారు బాబా సమాధి ని ఇలా వర్ణించారు: ‘బంగారూ’ అని తెలుగులో పిలిచే సాయి శయన మందిరం ఇది.ఈ మహా సమాధి దర్శన అనుభవం సరస్వతీ దేవాలయం,మక్కాలోని కాబా లాగా,బెత్లేహేమూ,ఎరూషలేముల్లోని క్రీస్తు జ్నాపకాల్లాగా,సిక్కుల గురుద్వారా,బుద్ధగయ,అరుణాచల క్షేత్రం,శ్రీశైలకాశీ క్షేత్రం,షిర్డీ సమాధి,మసీదు దర్గాల సందర్శన అనుభవం లాగా ఉంటుంది. (సనాతన సారధి సెప్టెంబర్ 2011) సమాధి దర్శనమే ఇంత భాగ్యదాయకంగా ఉంటే ఆ సమాధి లో శయనించిన దివ్యాత్ముని సందేశ శ్రవణం కూడా భాగ్యదాయమే. అదీ ఆయన మాతృ భాష (దేవ భాష) లో ఆయన చెప్పింది చెప్పినట్లు వినే భాగ్యం తెలుగు వాడిదే. తనను తాను తగ్గించుకోవటం తనను తాను ఉపేక్షించుకోవటం తెలుగు వాడి సహజ లక్షణం . బాబాతో ఆడి పాడిన బాల్య మిత్రుడు కరీం సాహెబ్ “ఆ స్వామి హజ్రత్ మహమ్మదు,హజ్రత్ ఇబ్రాహీము,ఏసు క్రీస్తు లాంటి వాడు “ అన్నాడు (సనాతన సారధి మార్చి 2008) మరి అలాంటి స్వామి సొంత భాషను దేవ భాషే అని ఎందుకు అనుకోరు ? సాయి భక్తులు సాయి భాష ను కూడా గొప్పగా పొగడాలి.దేవుళ్ళను చాలా గొప్పగా చెప్పి , వాళ్ళ భాషను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ కోసమే నేను ఇలా కావాలని అడుగుతున్నాను. తెలుగు కీర్తనలకు దేవుళ్ళు దిగి వచ్చారు బమ్మెర పోతన, కంచర్ల గోపన్న (రామదాసు),త్యాగయ్య,అన్నమయ్య,లాంటి ఆద్యాత్మిక వేత్తలు ,సంగీత కారులు,మహా భక్త గాయకులు,భగవంతుని దయానుగ్రహాలపై తమకు హక్కు ఉన్నట్లు గా రచించిన కీర్తనలన్నీ తెలుగులోనే ఉన్నాయి .ఆ తెలుగు కీర్తనలు విని దేవుళ్ళు దిగి వచ్చారని బడాయి పోతుంటాము. వారి భాషను మాత్రం దైవ భావన లేకుండా అగౌరవ పరుస్తాము.ఇదేం నీతి? “పలికెడిది భాగవతమట,పలికించెడువాడు రామభద్రుండట” అని పోతన అంతటోడే అన్నప్పుడు తెలుగును దేవ భాష అనటానికి మనకెందుకు సిగ్గు,సందేహం? సంస్కృత వాసనలేమీ సోకకుండా అచ్చ తెలుగులో లక్ష్మీదేవి హావ భావాలను ఆ రామ భద్రుడే ఎలా పలికించాడో చూడండి: “అడిగెదనని కడు వడి జను నడిగిన దన మగడు నుడువడని నడ యుడుగున్ వెడ వెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్” --- (శ్రీమదాంధ్ర భాగవతం 8:103) రామ భద్రుడే ఇలా తెలుగులో పలికించాడనీ,పోతన రాయలేక వదిలేసిన పద్యాలను రాముడే వచ్చి స్వయం గా తెలుగులో పూరించి పోయాడనీ , తానీషాకు డబ్బు చెల్లించి రామదాసును విడిపించాడనీ . . . ఇంకా ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా తెలుగు దేవ భాషే అనిపించటంలేదా?అలా అనిపించక పోతే వాళ్ళలో ఏదో తేడా ఉన్నట్లే. “ఇదినాదు మాతృదేశము ఇది నా ప్రియ మాతృ భాష ,ఇది నా మతమం చెద గొట్టి నుడువ నేరని బతికిన జీవి యొకండీవసుధను గలడా? “ – సత్య సాయి (25.5.1990) అర్ధం కాకపోయినా కొన్ని భాషలను ఏవేవో కారణాలతో ఏవేవో ప్రయోజనాలు ఆశించి నెత్తిన మోసే వారు తెలుగు దగ్గర కొచ్చేసరికి ఎందుకో విచిత్రంగా బిగుసుకు పోతున్నారు. ఆంగ్ల భాషా మోహ మావరించిన వారికి ఒకటే చెప్పేది : మీరు నెత్తిన పెట్టుకొని మొయ్యాలనుకున్న భాషలను మొయ్యండి.మా భాషను కూడా సమానంగా గౌరవించండి ,మా పిల్లలకు వాతలు పెట్టకండి.మా పిల్లల మెడల్లో పలకలు కట్టకండి.మా భాష ఉసురు తీయకండి అని కోరుతున్నాం .ఇంగ్లీషు మీడియం లో చదివితేనే మోడల్ స్కూళ్ళలో ఉపాద్యాయ ఉద్యోగాలు దొరికే “ఆదర్శ “ సమాజం గదా మనది?.తెలుగులో చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగాలిచ్చి ఆదుకోండి అని ప్రాధేయపడుతున్నాం.దిక్కు( లేని) మాలిన మాతృ భాషలో చదివి వెనుకబడిపోయినందుకు జాలిపడి కాసిని మార్కులు ముష్టి పడెయ్యమంటున్నాం.మా పిల్లలు మా భాషలోనే చదివేలా సహాయపడండి అని వేడుకుంటున్నాం . ‘పాశ్చాత్య విద్యల ప్రాభవంబదియేమో సంస్కృతి అడుగంటి సన్నగిల్లే తల్లి భాషను మాట్లాడుట తప్పు ఆయె జన సమ్మతమైనట్టి మార్గంబు దూరమాయే మాతృ భావము కంటే మాన్యమెద్ది? ఆంగ్ల భాషా మోహ మావరించిన నాడే స్వమత విజ్నానంబు సన్నగిల్లే ఆంగ్ల విద్యయె ప్రాముఖ్య మందియుంట ఆత్మ విద్యనుపేక్షింప నారిపోయే –సత్య సాయి (21.5.1992) “తల్లి భాష మాటాడ తప్పు తోచే సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే ధర్మమన్నది బోధింప తప్పిపోయే ఇట్టు లైనది భారత జాతి నేడు” -- సత్య సాయి (4.10.1967) అచ్యుత భాష తెలుగు ఇలాంటి వక్ర స్థితిని నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు అచ్యుతుడు పుట్టపర్తిలో అవతారం దాల్చాడు --- కామరాజు అనిల్ కుమార్ (సనాతన సారధి మే 2009). ఈ అచ్యుతుని తల్లి భాష తెలుగు కాబట్టి తెలుగు దేవ భాషే అయి తీరాలి .మాతృ భాషను విడిచిన తెలుగు ప్రజల వక్రస్థితి ని సరిచేసి వారిని నయ మార్గం (సహజ భాష) లోకి త్రిప్పటానికి బాబా తన వంతు కృషి తాను చేశాడు.మాతృ భాషకు పట్టం గట్టండి అంటూ బాబా ఆవేదన పడ్డాడు . సత్య శాయి –తెలుగు వాయి భక్తుల అభిప్రాయం ప్రకారం సాయికి అన్ని భాషలు వచ్చనుకుందాం. ఏదో భాష ను కాకుండా తన మాతృ భాష తెలుగును మాత్రమే ఎంచుకున్నందుకు ఆజన్మాంతం తెలుగులోనే ప్రసంగించినందుకు తెలుగు భక్తులు ఆయన్ను అభినందించాలి. హేతువాదుల లెక్కప్రకారం బాబా కు తెలుగు తప్ప మరే భాషా రాదనుకుంటే అదికూడా తెలుగు జనానికి మహా భాగ్యమే అయి కూర్చుంది.ఆ నోరే తెలుగు నోరు.ఓ తెలుగు వాడిగా సాయి తెలుగు భాష ను తన భక్త ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితిని , తెలుగును ఆశ్రయించక తప్పని పరిస్థితిని తెచ్చినందుకు తెలుగు భాషా ప్రేమికులు ఆయన్ని అభినందించాలి. తెలుగు భాష వర్ధిల్లటానికి సాయి మార్గం భారతీయ భాషలు చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో సత్య సాయి చెప్పాడు. “కొంతమంది ఎక్కువ జీతం వస్తుందని విదేశాలకు వెళుతున్నారు.అక్కడ నెలకు ఐదు వేల డాలర్లు సంపాదించవచ్చు.ఇండియన్ కరెన్సీ తో పోల్చుకుంటే అది ఎన్నో లక్షలౌతుంది .కానీ అక్కడ ఆ దేశానికి ఎంత ఆదాయమో ఇక్కడ ఈ దేశానికి అంత నష్టం.అక్కడ అయిదు వేల డాలర్లు సంపాదించే బదులు ఇక్కడ ఐదు నూర్లు సంపాదించినా చాలు మనకు.ఈ సత్యాన్ని గుర్తుంచుకొనలేక అనేకమంది అనేక రకములైన ఆశలు పెంచుకొని విదేశాలకు పోతున్నారు.కానీ ఎబ్రాడ్ లో ఏముంది?బ్రాడ్ నెస్ (విశాల భావం) మీలోనే ఉంది.దానిని వదిలి పెట్టి మీరు అబ్రాడ్ పోవటం చాలా పొరపాటు.మీరు విదేశాలకు పోనక్కరలేదు.ఇక్కడే ఉండి మీ తల్లి దండ్రులను సేవించండి. భారతీయ సంస్కృతిని మీ బిడ్డలకు నేర్పండి “అని సత్య సాయి చెప్పాడు.15.1.2008.(సనాతన సారధి మార్చి 2008) మాతృభాషను ప్రేమించటమే నిజమైన దేశభక్తి ఇప్పుడు 32 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఊడిగం చేస్తున్నారు.మిగతా దేశాల్లో ఇంకెంతమంది ఉన్నారో! అవకాశం వస్తే విదేశాలకు ఉరకాలని లక్షల మంది కాచుకొని ఉన్నారు.వీళ్ళంతా మన దేశంలోనే ఉండి మన ప్రజలకే సేవ చేసే పరిస్థితి మన ప్రభుత్వం,మన పారిశ్రామిక వేత్తలూ కల్పిస్తే విదేశాల తలదన్నేలా మన దేశం అభివృద్ధి చెందదా?మన మాతృభాషలు ఇలా మరణ శయ్యమీదకు చేరుతాయా? అన్ని భాషలూ ఇంగ్లీషు దెబ్బకు చచ్చి పోతున్నాయి. భారతీయ సోదరులారా, ఎన్నో శతాబ్ధాల పాటు నిర్మించుకున్న మన సాహిత్యం ,దేశీయ జన విజ్నానం మట్టిపాలు కానీయవద్దు.మీ దేశ భక్తి ,భాషాభిమాన కబుర్లు ఆపి ఈ ఒక్క సాయి సలహా పాటించండి చాలు. పదేళ్ళలో మళ్ళీ మన భాషలు ప్రాణం పోసుకొని తిరిగి జనశక్తితో తప్పక లేస్తాయి. మన భాషలు బ్రతకాలంటే ఇలా చెయ్యక తప్పదు. నోరెత్తి అడుగరా తెలుగోడా చుక్కాని బట్టరా తెలుగోడా ‘మాతృభాషను ప్రేమించటమే నిజమైన దేశభక్తి ‘అనే సూక్తికి లోబడి విదేశాలలో తెలుగు ఘన కీర్తులు చాటుతున్న తెలుగు వీరులారా లేవండి.పల్లవి మార్చండి.ఆంధ్రదేశమే మాకు అమర దైవతము అనండి.ఆంధ్రత్వము లేని బ్రతుకును ఆశించకండి.తెలుగు గడ్డమీదకు తరలి రండి.తెలుగు ప్రజలకే సేవ చెయ్యండి. చనిపోయే వ్యక్తికి సాయపడాలని మానవత్వం ఉన్న ఏ వ్యక్తికైనా అనిపిస్తుందికదా?అలాంటి ఉదారబుద్ధితోనే తెలుగు భాషకు సహాయపడండి అని మనవి చేస్తున్నాను. (నడుస్తున్న చరిత్ర ఏప్రిల్ 2012)