14, నవంబర్ 2019, గురువారం

భాషా రాజకీయం - తెలుగు చదివితే ఉద్యోగమేది ?

భాషా రాజకీయం - తెలుగు చదివితే ఉద్యోగమేది ? (సూర్య 17.11.2019)


తెలుగు ద్వారా ఉద్యోగమివ్వటం తెలుగు ప్రభుత్వాల వల్లకాదు.ఉద్యోగం కావాలంటే ఇంగ్లీషు అవసరమే అనుకోని ఇన్నాళ్లూ ధనవంతులు తమ పిల్లల్ని కాన్వెంట్లలో చదివించారు.ఇంగ్లీషు కాన్వెంట్లకు ట్యుటోరియల్ కాలేజీలకు వ్యతిరేకంగా పోరాటాలెమీ తెలుగునాట జరుగలేదు.ఉద్యోగము ఇవ్వలేని చదువు వ్యర్ధమే.ఇంగ్లీషు మాధ్యమం కోరుతున్నవారి వాదన అదే.ఇన్నేళ్ల పాలనలో తెలుగుకు ఉద్యోగాలు ఇచ్చే శక్తి స్థాయి ఏ ప్రభుత్వమూ తేలేకపోయింది. తెలుగు పద్యాలకు కవిత్వాలకు పరిమితమై పోయింది. బడిపిల్లలకు తెలుగు వ్రాయడం, చదవడం వీలుకాని పరిస్థితి.తెలుగులో పాలన అంటే ఒక కోరరాని కోరిక,అత్యాశలాగా మాట్లాడుతున్నారు.
‘నేను తెలుగు మాట్లాడను’ అని వందసార్లు పిల్లల చేత వ్రాయించిన వాళ్ళను దేశభక్తులుగా పొగుడుతున్నారు.మేము ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంకాదు,తెలుగుమాధ్యమంపై నిషేధం తప్పంటున్నాం.కావాలంటే హిందీని,సంస్కృతాన్ని తీసెయ్యండి.తెలుగులో ఒత్తులు,గుణింతాలు తీసేసి తమిళంలాగా బాగుచెయ్యండి.పనికిమాలిన ఛందస్సును వ్యాకరణాన్నీ ఎత్తేసి ప్రజలలో పాలనలో వాడుకభాషను అమలుచెయ్యండి అని ఇన్నాళ్లూ అడిగారు కానీ ఎవరూ మనసు పెట్టలేదు.మీ పుత్రులను మనమళ్లను ఇంగ్లీషు మీడియంలో ఎందుకు చేర్చారని వెంకయ్యానాయుడును,చంద్రబాబును, పవన్ కల్యాణ్ , రామోజీరావును జగన్ విమర్శించారు.తెలుగులో చదివితే ప్రపంచ స్థాయిఉద్యోగాలు రావని అందరికీ తెలుసు. ఆస్థాయికి తెలుగును తీసికెళ్లటం ఏ పాలకునివల్లా కాలేదు.ఇకమీదట అవ్వదు కూడా.కష్టపడి తయారు చేసుకోవటం కంటే అప్పటికే అమర్చిపెట్టినదాన్ని మేయటం సులభంకదా?

చావు,పెండ్లి మంత్రాలు తెలుగులో యెందుకు చదువరు అని కొందరు అడిగారు. ఏ మాతృభాషైనా సరే దాన్ని మాట్లాడేవాళ్ళ మారే అవసరాలకి ఆదుకోకపోతే మృతమవుతుంది.తెలుగు వ్యాకరణం పనికిరాని సంధులు, సమాసాలతో పాటు ఉంటుంది.ఉద్యోగాలకు పనికిరాని తెలుగు నేర్చుకుంటే ఉపయోగం ఏమిటి ?ఇప్పటికే 50% ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నది.దాన్ని 100% చేస్తే తప్పేమీ కాదు.కాని తెలుగు మీడియం పూర్తిగా తీసివేయడం న్యాయమా? విద్యార్ధులు తమ తల్లిదండ్రుల లేదా తమ కోరిక మేరకు నచ్చిన మీడియంలో చేరి చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ ప్రపంచానికి ద్వారమే .ఎవరు కాదన్నారు?ప్రస్తుతం అందరూ ఆంగ్ల మాధ్యమం లోనే చదువుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే తెలుగు మీడియం కూడా ఉండాలన్నవారు అభివృద్ధి నిరోధకులా? పేదవారికి వ్యతిరేకమా?మాధ్యమాన్ని ఎంచుకొనే స్వేఛ్చ విద్యార్ధికి ఉండాలా వద్దా?ఇప్పటికే ఉన్న మాధ్యమాన్ని కొనసాగించవచ్చుకదా?

ఇంగ్లీష్ విద్య తోనే వుయ్యూరు అమ్మాయి యలమంచిలి అర్చనారావు న్యూయార్కు న్యాయమూర్తి పదవిని సాధించిందన్నారు. ప్రైవేటు స్కూళ్లల్లో చదివిన, చదువుతున్న పిల్లలున్న సంపన్నుల కాలనీల్లోని ఇళ్లలో తెలుగు ఎందుకు చనిపోలేదు? పేద పిల్లలు కూడా తమలాగే ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. ఆయన విధానంలో తప్పేముంది? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగిష్‌ను ప్రధాన బోధనా భాషగా చేస్తామని చెప్పినందునే ప్రజలు ఆయనకు ఓట్లువేసి గెలిపించారు.మన జాతి నిర్మాతలు ఆ ఇంగ్లీషుభాషను ఎందుకు కొనసాగించారు? పైగా దేశాన్ని, రాష్ట్రాలను పా లిస్తున్న కులీనవర్గాలలో ఇంగ్లిష్‌ ఎందుకు మనగలిగి ఉంటోంది? 1947లో ఇంగ్లిష్‌ను జాతీయ భాష గా గుర్తించాలని, ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లిష్‌ను తప్పకుండా బోధించాలని అంబేడ్కర్‌ పట్టుపట్టారనీ , ప్రైవేట్‌ స్కూళ్ళు కాలేజీలు ఇంగ్లిష్‌ బోధన చేశాయనీ,ఆబోధతో పైకులాలవాళ్లు బాగుపడ్డారనీ,కింది కులాలకు ఆంగ్లం అలవడితే మంచిదనీ,దానికి అడ్డుపడకూడదని కంచ ఐలయ్య లాంటి వారు వాదిస్తున్నారు. అవన్నీ నిజమే.ఇంగ్లీషు మీడియం ను ఎవరూ వద్దనటంలేదు.అడ్డుపడటం లేదు. మన పాలకులు పాడుపడ్డ తెలుగును బాగుచేయ్యకుండా ముందుకు పోతున్నారు.తెలుగు అసలు అనవసరం వదిలేద్దాం అంటున్నారు. ఆంగ్లాన్ని కాపాడుకుంటూనే మరో ప్రక్క తమిళనాడు ప్రభుత్వం తమిళంలో ఉద్యోగాలు సృష్టించింది. పెరియార్ కాలంనుండి తమిళ లిపిని సామాన్యులకోసం అనేకసార్లు మార్చుకుంది.తమిళంలో చదివితే భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించింది.తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇవ్వటం రాజ్యాంగబద్దమేనని ఏ రాష్ట్ర భాషను ఆ రాష్ట్రం కాపాడుకోవాలని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది.రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించినా తమిళం పాఠ్యాంశంగా ఉంటే మాత్రమే టాప్‌ ర్యాంకర్‌గా పరిగణిస్తారు.తమిళ భాషాభివృద్ధి కోసం ప్రత్యేక శాఖ ఉంది. తమిళమాధ్యమంలో పోటీ పరీక్షలు రాసిన న్యాయ,ఇంజినీరింగ్‌ విద్యార్థులను న్యాయమూర్తి పొగిడారు.వారూ తమిళం చదవాల్సిందే.కేంద్రమేమో హిందీ పక్షపాతి. తమిళనాడులో మాతృభాషకి ఇస్తున్న ప్రాముఖ్యం ఆంధ్రా,తెలంగాణాల్లో కూడా తెలుగుకు ఇ వ్వాలి.మాకు ఉపాధి దొరికే భాష కావాలని ప్రజలే ప్రభుత్వాలను అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 10 శాతం మంది మాత్రమే ఇంగ్లీషు మీడియంలో బోధన చేయగలరు. మిగిలిన 90 శాతం మంది తెలుగు మీడియమే! ఆకస్మికంగా ఇంగ్లీషు మీడియం లోకి మారిన పిల్లల విద్యాప్రమాణాలు పడిపోయి,అర్ధంతరంగా చదువు మానేసి, న్యూనతకు గురైతే అందుకు బాధ్యత ఎవరిది? 5వ తరగతి వరకు ప్రతిఒక్కరూ మాతృభాషలోనే చదువుకోవటం వలన మాతృభాష రక్షించబడుతుంది.6 వ తరగతి నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే మంచిది.మాతృభాషలో బోధనకు పూర్తిగా మంగళం పలకడం దేశంలో ప్రపంచంలో మరెక్కడా లేదు. ఫ్రాన్స్‌, చైనా, జర్మనీ, జపాన్‌ దేశాల్లో బోధన మాతృభాషలోనే జరుగుతుంది.అవన్నీ మనకంటే అభివృద్ధి చెందిన దేశాలే. తెలుగు అంకెలు ఇప్పుడు ఎవరూ వాడటం లేదు. ఇంగ్లీషు వాళ్ళు కూడా రోమన్ అంకెలు మానేసి అరబిక్ అంకెలు వాడుతున్నారు. శ్రీ శ్రీ గారు తెలుగు లిపి లో ఉన్న ఆటంకాలు గ్రహించి ఆంగ్ల లిపిలోకి మారటం మంచిది అన్నారు.తెలుగులో ఉన్న సవాలక్ష సమస్యలు సరిదిద్దుకోవాలి. అక్షరాలు మన పిల్లలకు ఎంతో సులువుగా ఉండాలని వాదిస్తూ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాలా కష్ట పడ్డారు. ప్రభుత్వ పాలకులు తెలుగు మహాసభలు జరిపారు కానీ లిపి సమస్యను పట్టించుకోలేదు.శ్రీ శ్రీ కూడా భవిష్యత్తు ఆలోచించి ఆంగ్ల లిపిని తెలుగుకు వాడుకొమ్మన్నారు.మన జనం కోసం మనం వారి బాట పట్టాలి.ఈ భాషను ఈస్థాయికి తెచ్చిన మన పితరులున్నారు.ఆ ప్రజల అందరి వాడకం వలన మనకు పదాలు స్ధిరపడతాయి.వాటిని అలా వాడితేనే మంచిది.తెలుగు నిఘంటువులోకి ప్రజల నోళ్ళలో నానుతున్న వేలాది ఇంగ్లీషు పదాలను తీసుకొని అనువాదాలలో వాడాలి. ఇప్పటి వరకు ప్లస్‌, ఈజీక్వల్టు, మైనస్‌, ఇంటు లాంటి ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధక పదాలను కల్పించి లెక్కలు చెప్పలేదు. తెలుగు విూడియం వాళ్ళు కూడా ప్లస్‌, మైనస్‌ అనే శబ్ధాల్నే వాడుతున్నారు. గత్యంతరం లేదు,అనుకున్న ఆంగ్లపదాలను మాత్రం తెలుగు నిఘంటువులో చేర్చటం అవశ్యం, అత్యవసరం. వాడుక పదాల సంపద భాషకు జీవమిస్తుంది. అవి పరభాషపదాలు కూడా కావచ్చు.తెలుగును వాడుక భాషలోకి ప్రజలకుపనికొచ్చేలా మార్చాలి.తెలుగు భాష రక్షణ,తెలుగులో పాలన కోసం తెలుగు మాధ్యమం లో చదివినవారికి ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలవాలి.ప్రోత్సాహకాలు,రిజర్వేషన్లు ఇచ్చిమరీ తెలుగు భాషను రక్షించుకోవాలి. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగాలకల్పన తెలుగు వారికోసం కూడా జరపా లి. తెలుగును కాపాడుకుంటూనే తమిళనాడు లాగా ఇంగ్లీషు మాధ్యమాన్నీ కొనసాగించవచ్చుకదా? తెలుగు పత్రికాధిపతులు,భాషాసంఘాలు తెలుగు మాధ్యమం కావాలంటూ హైకోర్టుకు వెళ్ళవచ్చుకదా?మాతృభాషలో ప్రాధమిక విద్య నేర్పటం కనీసధర్మం,రాజ్యాంగబద్దం.మన రాష్ట్రంలో కూడా తెలుగులో విద్యను కాపాడుకోటానికి తెలుగువిద్య ద్వారా ఉపాధి కల్పనకు హైకోర్టు మార్గదర్శకత్వాన్ని కోరటం మంచిది.
--నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

8, నవంబర్ 2019, శుక్రవారం

తెలుగు ఎవరికి కావాలి? ఎందుకు కావాలి?

                                      తెలుగు ఎవరికి కావాలి? ఎందుకు కావాలి?
ఇకమీదట ఆంగ్లమాధ్యమం లోనే చదువులన్నీ ఉండబోతున్నాయని జీవో వచ్చింది.చదువంతా ఇంగ్లీషుమయమైతే ఇక అధికార భాషా సంఘం ఎందుకు,తెలుగు అకాడమీ ఎందుకు,వాటికి పని ఏముంటుంది,వాటి చైర్మన్లు ఏమి చెయ్యను? మొదలైన ప్రశ్నలు భాషా సంఘాలవాళ్ళు సంధిస్తే ,ఇంగ్లీషు మీడియాన్ని ప్రజలు కోరుకున్నారు కాబట్టే ప్రభుత్వంకూడా సరే అందని మంత్రులు కూడా సమర్ధించుకున్నారు.
తెలుగు గురించి గొప్పగా రాసేవారిలో ఎంత మంది తమ పిల్లలను తెలుగుమీడియంలో చదివిస్తున్నారు ? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ పెడితే ఎందుకు ఏడుస్తున్నారూ? ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఉద్యోగం దోరుకుతుంది . తెలుగు బాష వల్ల ప్రయోజనం ఏమిటి?ఉద్యోగం వస్తుందా? తెలుగును ఇన్నాళ్ళూ హత్తుకున్న ఎస్సీ ఎస్టీ, బీసీ. మైనార్టీలకు ఏమి ఒరిగింది? అంబేద్కర్ ఇంగ్లీషు చదువు ద్వారానే దేశానికి రాజ్యాంగం రాయగలిగాడు.పాలకులుకూడా అతన్నే శరణ్యం అనుకున్నారు.గవర్నమెంట్ స్కూల్స్ టీచర్లు కూడా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్చేది ఉద్యోగాలను ఆశించే. తెలుగు భాష మాత్రమే వస్తే తెలుగు రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు రావు. కాబట్టి ఈ దేశంలో గానీ విదేశాలలో గానీ ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలకు ఇంగ్లీష్ మాత్రమే వస్తే చాలు. మాతృభాష కాబట్టి తెలుగు ఎలాగూ మాట్లాడను వస్తుంది.రాష్ట్రం దాటితే తెలుగుకు దిక్కులేదు.ఇంగ్లీష్ హిందీ వస్తే ప్రపంచంత తిరుగొచ్చు. రాజకీయ నాయకుల పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు.ఎమ్మేల్యేలు,మంత్రులు తమ కొడుకులను కూతుళ్ళను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పమనండి చూద్దాం?ఎవరూ చెప్పరు.
తెలుగు పాఠశాలలు ఎలా ఏడుస్తున్నాయో తెలియదా? అసలు అవి ఉంటేగా చేర్చటానికి?అది ఆంగ్లమాధ్యమం మీద ఏడుపుకాదు.తెలుగు భాష ఉనికిలో లేకుండా పోతుందే అని బాధ.తెలుగోళ్ళు వద్దంటున్నది ఇంగ్లీషు ని కాదు, ఇంగ్లీష్ మీడియంని.ఉద్యోగాలు కేవలం భాషనుబట్టి రావువృత్తి లో ప్రావీణ్యత నుబట్టి వస్తాయి . ఇంగ్లీషు పెట్టినా ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నీటిసరఫరా లాంటి ప్రాధమిక సదుపాయాలకల్పన జరగకపోతే మళ్ళీ ఆందోళన మామూలే. తెలుగు పత్రికాధిపతులు తెలుగు మాధ్యమం కావాలంటూ హైకోర్టుకు వెళ్ళవచ్చుకదా?మాతృభాషలో ప్రాధమిక విద్య నేర్పటం కనీసధర్మం,రాజ్యాంగబద్దం. తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇవ్వటం రాజ్యాంగబద్దమేనని ఏ రాష్ట్ర భాషను ఆ రాష్ట్రం కాపాడుకోవాలని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది.మన రాష్ట్రంలో కూడా తెలుగులో విద్యను కాపాడుకోటానికి తెలుగువిద్య ద్వారా ఉపాధి కల్పనకు హైకోర్టు ఉద్దేశాన్ని కోరటం మంచిదికాదా? హోం మంత్రి షా ఒకే దేశం, ఒకే భాష అని ఒక శుష్క నినాదం దేశానికి వినిపించాడు. అప్పుడు హిందీని కూడా మన తెలుగు జనం వ్యతిరేకించారు. ఆంగ్లమీడియం అనగానే ఇంగ్లీషుకు మాత్రం నీరాజనాలు పడుతున్నారు. కారణం ఉపాధే . భారతీయ భాషలన్నీ ఆ భాషలద్వారా ఉద్యోగ కల్పనకు ఊపిరి పోయలేదు. సంస్కృత మంత్రాలు నేర్చుకున్న అర్చకునికి పూజారి ఉద్యోగమైనా దొరకవచ్చు గానీ తెలుగు మాధ్యమం లో డిగ్రీ చేసిన వానికి ఏదైనా గ్రామ సచివాలయంలో ఉద్యోగమైనా దొరుకుతుందా?తెలుగు విద్యార్ధులకు మేలు చేసే ఉద్దేశంతో 1985 వరకు సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షలలో 5 శాతం ప్రోత్సాహక మార్కులు ఇచ్చారు.దానిని పునరుద్ధరించటానికి ఎవరూ ప్రయత్నించలేదు.
ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా పరిరక్షణ దినోత్స వంగా తలుచుకోవటం తప్ప తెలుగు పరిరక్షణకోసం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ద్వారా ఫలానా పనులు జరుగుతాయి ఫలానా ఉద్యోగాలు దొరుకుతాయి అనే వాగ్దానం దొరికితే తప్ప ఆంధ్రప్రదేశ్ ఆంగ్లప్రదేశ్ గా మారిపోవటం ఖాయం. కట్టు బొట్టు మాత్రమే కాదు తెలుగు భాష అంటే,తెలుగు పిల్లలకు తెలుగులో చదువు నేర్పటం ఉపాధి కల్పించటం. మధురై హైకోర్టు న్యాయమూర్తి న్యాయ పరీక్షలను తమిళ మాధ్యమం లో రాసిన విద్యార్ధిని అభినందించారట. తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.కోటివిద్యలు కూటికొరకే
ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలో లేకపోతే తెలుగును పాలనా భాషగాఅమలు చెయ్యలేము.ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలోకి మారాలి.తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పడాలి.తెలుగులో పాలన జరగాలి.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్ధులకు పోటీ పరీక్షలలో ప్రోత్సాహక మార్కులు,ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఇన్నాళ్ళూ కోరుతూ ఉన్నాము. తెలుగు మాధ్యమం లో ఇకమీదట చదువే ఉండకపోతే ఈ కోర్కెలు కోరేదెవరు,తీర్చేదెవరు?ప్రస్తుతం కోరేవాళ్ళు చాలా తక్కువ కాబట్టే తీర్చే అవసరం రాక పాలకుల పని సుళువయ్యింది.
నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266