27, జులై 2019, శనివారం

మేమేంతో మాకంత ఇవ్వండి -సామాజిక న్యాయం చేకూర్చే బీసీ బిల్లులు


సామాజిక న్యాయం చేకూర్చే బీసీ బిల్లులు

23.7.2019 న ఏపీలో అసెంబ్లీ సమావేశాల్లో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటుకు చట్టం చేసి బిల్లును ఆమోదించారు.అంతకుముందు  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ఓబీసీ ప్రైవేటు బిల్లుకు పది రాజకీయ పార్టీలు మద్దతిచ్చినా పార్లమెంటు యధాప్రకారం  మూజువాణి ఓటుతో తిరస్కరించింది. పార్లమెంట్‌లో బీసీల ప్రాతినిధ్యం ఎన్నడూ కూడా ఇరవై శాతానికి మించలేదు.చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్ల నుంచి బీసీలు కోరుతున్నారు. బీసీ కులాలు  జనాభాలో 52 శాతం ఉన్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉపాధి రంగాలలో బీసీలకు అగ్రకులాల వారితో పోటీపడే సత్తా లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లు జనాభా ప్రాతిపదికన వారికి చట్టసభల్లో సరైన స్థానం లభిస్తే తప్ప ఎదిగిరాలేరు. ఎస్సీ, ఎస్టీలు  రిజర్వేషన్ల వల్ల విద్య, ఉపాధి రంగాల్లో, చట్టసభల్లో ప్రవేశం పొందినపద్ధతి లోనే  బీసీలు కూడా రిజర్వేషన్లు కోరుకుంటున్నారు.మేమెంతో మాకంతఇవ్వండి అనే సామాజిక న్యాయం  కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు బీసీల్లోని పాముల,పంబల,కాటికాపరి, బుడబుక్కల, గంగి రెద్దుల, బుడగజంగాల లాంటి కొన్ని కులాలు మిగతా కులాలకంటే మరీ వెనుకబడే ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వం 123వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించింది. కానీ  ఓబీసీ బిల్లు పార్లమెంట్‌లో ఇంకా ఆమోదం పొందలేదు. జగన్‌ పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మొదటి బిల్లు వీగిపోయింది. దానిని కూడా గెలిపించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదించిన కీలకమైన అయిదు బిల్లుల్లో  నాలుగు బీసీలకు సంబందించినవే.1.రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు2.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు  నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు 3.నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు 4.నామినేటెడ్‌ పోస్టుల్లో, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో మహిళలకు 50 శాతం కోటా. చట్టసభల్లో, ఉద్యోగావకాశాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు బీసీలకు, మహిళలకు విద్య, ప్రభుత్వోద్యోగాల్లో కోటా కల్పించాయి.బీసీలకు కూడా రాజకీయ అధికారం కల్పించాలనే పోరాటం జరుతూనే ఉంది.ఆంధ్రప్రదేశ్ లో  మండల్‌ కమిషన్‌ సిఫార్సుల వల్ల బీసీలకు ఎనలేని మేలు జరిగింది. మళ్ళీ ఈ బిల్లు వల్ల  బీసీలకు మిగిలిన కొన్ని విషయాలలో లబ్ధి చేకూరుతుంది.
జగన్ కేబినెట్‌లో దాదాపు 60 శాతం మంత్రి పదవులు, అత్యంత కీలకమైన శాఖలు ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వడంతోపాటు స్పీకర్‌ పదవిని కూడా బీసీ వర్గానికే కేటాయించారు.ఇదే పద్ధతిలో గ్రామ స్థాయి వరకు రాజకీయ అధికారాల పంపిణీ బీసీలకూ అందించే ఉద్దేశం ఈ 5 బిల్లుల్లో కనిపిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో కోటా అమలు, ధ్రువీకరణ పత్రాలు పొందడం లాంటి వాటిలో ఎదురౌతున్న సమస్యలు తేల్చడానికి  శాశ్వత స్థాయి బీసీ కమిషన్‌ ఏర్పాటు, నామినేటెడ్‌ పోస్టులనూ,నామినేషన్లపై ఇచ్చే పనులూ  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వటం,అందులో మహిళలకు 50 శాతం కోటా ఇవ్వటం తప్పనిసరిగా  బీసీల అభ్యున్నతికి తోడ్పడుతుంది.
పెరుగుతున్న బీసీ కులాలు-పెరగని రిజర్వేషన్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2005లో 93 కులాలున్న బీసీ కులాల జాబితా ఇప్పుడు 144 కి చేరింది. గ్రూపు లోని54 కులాలకు 7 శాతం, గ్రూపు బీలోని 28 కులాలకు 10 శాతం, గ్రూపు సీలోని 1 కులానికి 1 శాతం, గ్రూపు డీలోని 47 కులాలకు 7 శాతం, గ్రూపు లోని 14 కులాలకు 4 శాతం కలుపుకొని మొత్తం 29 శాతం రిజర్వేషన్లు అమలౌతున్నాయి. రాజకీయ లబ్ధికోసం రిజర్వేషన్లు పొందే కులాల సంఖ్య పెంచుతున్నారు. కోటా వాటా పెంచకుండానే రిజర్వేషన్ల జాబితాలో కొత్తకులాలు చేరుస్తున్నారు. బీసీ కులాల మధ్య అంతర్గత విద్వేషాలు రేగుతున్నాయి. సుప్రీంకోర్టు రిజర్వేషన్లమీద 50 శాతం  పరిమితిని విధించింది. తమిళనాడులో 69 శాతం ,కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.వివిధ కులాల జనాభా దామాషా ప్రకారం ఆయా కులాలకు రిజర్వేషన్ల కోటా దక్కేలా చట్టం చేయాలని ,వెనుకబడిన కులాలలో అభివ్ఱుద్ధి చెందిన కులాలను గుర్తించి కాలక్రమంలో వడపోసి మరీ వెనుకబడినకులాలకు మాత్రమే రిజర్వేషన్ల ఫలితాలు దక్కేలా చేయాలని ఇప్పుడు మరీ బడుగు కులాల వాళ్ళు కోరుతున్నారు.
ముదిరాజ్‌ కులాన్ని బిసి డిగ్రూపులో నుంచి- బిసి గ్రూపులోకి మార్చటం,ముస్లింలను బిసి ఇ గ్రూపులో చేర్చటం, కాపుల్ని బిసిల్లో చేరుస్తామని హామీలివ్వటం,ఇంకా కొన్ని కులాల గ్రూపులు మార్చటం ,కొన్ని కులాలను జాబితాలోనుంచి తీసేయబూనటం వలన రకరకాల గొడవలు చెలరేగాయి.
రిజర్వేషన్ల కోటాను పెంచకుండా జాబితాలో కొత్త కులాలను చేర్చుకుంటూ పోవటం పట్ల  బీసీలు కంటగింపుగా ఉన్నారు.కొత్తగా బలమైన కులాల చేరికవలన ఇప్పటికీ ఎదిగిరాలేక  బలహీనంగా ఉండిపోయిన చిన్నకులాలు ఇక ఎదిగిరావటం కల్ల అంటున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అన్ని బీసీ కులాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చలేదు. కేంద్రం గుర్తించిన ఒబిసి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ కులాలు 107 మాత్రమే గుర్తింపు పొందాయి. మహారాష్ట్రలో 261 ,ఒడిషా లో 200,కర్ణాటకలో 195,తమిళనాడులో 180,బీహార్ లో 133,జార్ఖండ్ లో 127,అస్సాంలో 124,కులాలు ఓబీసీ జాబితాలో చేరితే ,ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 107 కులాలే కేంద్రజాబితాలో చోటు చేసుకోగలిగాయి.
2021 జనాభా లెక్కల్లో బీసీల కులాల వారీ జనాభా గణాంక వివరాలు సేకరించి ఆ గణాంకాలను బట్టి  స్థానిక సంస్థలు , చట్టసభలలో రిజర్వేషన్‌లు ఇవ్వాలని కోరుతున్నారు .
అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి
కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని,బీసీ డిక్లరేషన్‌ ప్రకటించింది గతంలో తెలుగుదేశంప్రభుత్వం. బీసీ మోడీ ప్రధాని కావడం ఖాయం అన్నది బిజెపి.బీసీలు చట్టసభల్లో పాగా వేయాలి అంది టీఆర్ ఎస్. బీసీలకు పార్టీలు టిక్కెట్లు ఇవ్వటం సరిపోదు . బీసీలకు అందరం కలిసి ఇస్తామన్న 100 అసెంబ్లీ పార్లమెంటు సీట్లు ఏ నియోజకవర్గాలు కేటాయించాలో ఉమ్మడిగా నిర్ణయిద్దామా అని వైఎస్సార్ పార్టీ మిగతా పార్టీలకు సవాలు విసిరారు.
వెనుకబడిన కులాల అసంతృప్తి ఏమిటి?
భారత రాజ్యాంగం పీఠికలోనే సామాజిక న్యాయాన్ని ప్రధమ లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ 50 శాతానికిపైగా వున్న బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం భూమి పంపిణీలో, బడ్జెట్ కేటాయింపుల్లో, బ్యాంకులు  అందించే రుణాల్లో, కీలక పదవుల్లో, న్యాయంగా రావలసిన వాటాలు బీసీలకు రావడం లేదు. నిరంతర శ్రామికులై తమ శ్రమతో జాతి సంపదని సృష్టిస్తోన్న బీసీలు ,ముస్లిం మైనారిటీ ప్రజలు రానురాను ఎస్సీ ఎస్టీ లకంటే కటిక దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. ఏ పార్టీ కూడా పెద్దగా ఒరగబెట్టింది ఏమీలేదు. మేమే ఒక  రాజకీయ పార్టీ స్థాపించుకోవాల. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కలిసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల డిమాండ్ అరణ్యరోదనగానే మిగిల్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోటా బిల్లును అటక మీదే ఉంచాయి. బీసీలకు చట్టసభల్లో మూడోవంతు స్థానాలు రిజర్వు చేయాలని రాష్ట్ర శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసినా, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టలేదు. బీసీలకు టిక్కెట్లు ఇచ్చినా, వారిని గెలిపించుకొనే బాధ్యత ఆ పార్టీలు స్వీకరించడం లేదు. బీసీ అభ్యర్థులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించడం లేదు.
హైదరాబాదులో 15.12.2013 న జరిగిన బీసీల సింహగర్జన సభలో కూడా  పార్లమెంటు, అసెంబ్లీల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనీ , బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలనీ, బీసీ ఉద్యోగులకు ఉద్యోగోన్నతుల్లో రిజర్వేషన్లను అమలు చేయాలనీ,పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 50 శాతానికి పెంచాలనీ, కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలనీ ,  బీసీ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించి,అమలులోకి తేవాలనీ కోరారు. 
పార్లమెంటులో గానీ, శాసనసభలో గానీ ఇంకా ప్రాతినిధ్యమే దక్కని బీసీ కులాలకు  అవకాశాలు కల్పించాలి. బీసీలకు ఉప ప్రణాళిక ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
దళిత ముస్లిములు, దళిత క్రైస్తవులు బీసీలుగా
దళితుల కంటే ముస్లీములు ఇంకా ఎక్కువ పేదరికంలో మగ్గుతున్నారని సచార్‌ కమిటీ చెప్పింది.  రాజేందర్ సచార్, రంగనాథ్‌మిశ్రా సిఫారసులను అమలు చేయలేదు.దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు వర్తింప చేసిన విధంగానే రిజర్వేషన్‌లను దళిత ముస్లింలకు, దళిత క్రిస్టియన్‌లకు వర్తింపచేయలేదు. 1901 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ముస్లింలలో 133 కులాలను గుర్తించారు.1911,1932,1935 సంవత్సరాల్లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన జనగణన తర్వాత 96 కులాలను దళిత ముస్లింలుగా షెడ్యూల్డ్ చేసి, వీరికి 1936 నుంచి ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు కల్పించింది. వీటిని దళితముస్లిం వర్గాలు 1950 జూలై వరకు పొందారు. కానీ 10- 08-1950 న కాన్సిట్యూషనల్(షెడ్యూల్డ్ కాస్ట్,ప్రెసిడెన్సియల్) ఆర్డర్‌ తో దళిత ముస్లింలకు, క్రిస్టియన్‌లకు, సిక్కులకు, బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించకుండా చేశారు.ఆ తరువాత వీరిని ఓబీసీలుగా చేశారు. నాటి నుంచి దళిత ముస్లింలే కాకుండా దళిత సిక్కులు,దళిత క్రిస్టియన్‌లు రిజర్వేషన్లకు దూరం చేయబడ్డారు.
బీసీలలో మరీ వెనుక బడ్డ కులాల ఉద్ధరణ
బీసీలలో జనాభా ఎక్కువగా ఉండి, రాజకీయ శక్తులను భయపెట్టగలిగే కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లాభపడుతూ ఉండగా, జనాభా తక్కువగా ఉండి, రాజకీయ నాయకత్వమే లేని కులాలు నష్టపోతున్నాయి. అందువలన శక్తివంతమైన కులాలను, శక్తిహీనమైన కులాల సరసన ఉండకుండా వేరు చేయాలి. ఆ విధంగా శక్తిమంతమైన కులాలు, శక్తిహీనమైన కులాలకు అడ్డురాకుండా కాపాడాలి. శక్తిమంతమైన రాజకీయ పలుకుబడి గల కులాలను అంతకంటే  క్రిందివరస  వర్గంలోకి చేర్చాలి.అలాంటి నిరంతర వడపోత , పునర్వర్గీకరణ పద్ధతి ద్వారా కొంత కాలానికి రిజర్వేషన్లు అక్కరలేదని ఎత్తివేసే పరిస్థితి రావాలి. బాలసంతు, బుడబుక్కల, దాసరి,దొమ్మరి, గంగిరెద్దుల, జోగి, జంగం,కాటిపాపల, మందుల, మొండిబండ,పంబల, పాముల, పెరికి ముగ్గుల, పిచ్చిగుంట్ల,వీరముష్టి ,మెహతార్, అచ్చుకట్ల వాళ్ళు, దేవాంగులు, దూదేకుల,జాండ్ర, కరికాల భక్తులు,సెగిడి, తొగట, ఆగరు, ఆరెకటిక, చిప్పోళ్లు,కొడమి, జక్కల, జింగారు,కచ్చి, కండ్ర, కొష్టి, మాలి, నెల్లి,పస్సి, పూసల, సాతాని, అత్తరు సాయిబులు,తురక చాకలి, నాయి ముస్లిమ్,గంటా ఫకీర్లు,గారడీ సాయిబులు,పకీరుసాయిబులు,ఎలుగుబంటు వాళ్లు,కుక్కుకొట్టె జింకసాయిబులు,కూడా శాసన సభల్లో ప్రవేశించాలంటే ఇప్పటికే బీసీలలో ఎదిగొచ్చిన కులాలను మరీ వెనుకబడిన కులాలకు అడ్డంరాకుండా తొలగించాలి.కనీసం రొటేషన్ పద్ధతి అయినా పెట్టి అన్నీ కులాలకూ రిజర్వేషన్ ఫలితం అందేలా చెయ్యాలి.ఉమ్మడి ప్రయోజనం కోసం భారీ చాకిరీ చేసినా చివరికి అమృతం దక్కలేదనే ఆవేదనతో,మోసపోయామనే బాధతో ఆనాడు కొందరు రాక్షసుల్లాగా మారిపోయారు.భావిషత్తులో ఈ కులాలపోటీ ఎక్కువౌతుంది.
 కులాలను వడపొయ్యాలి
 శాశ్వత బీసీ కమిషన్ వేశారు కాబట్టి వెనుకబడిన తరగతులలోని శక్తిమంతమైన కులాలను ప్రతి అయిదేళ్ళకొకసారి వడపోయించాలి. బలహీన కులాల అభివృద్ధి కోసం కులాల పేరు పేరు వరుసన నిధులు కేటాయించి సబ్ ప్లాన్ తరహాలో అవి వారికే అందేలా చూడాలి. అయిదేళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఆ కులం స్థాయి సాంఘికంగాను, ఆర్ధికంగాను,రాజకీయంగానూ బాగుపడాలి. ఆ విధంగా కాలక్రమేణా రిజర్వేషన్ల చట్రంలో నుండి బాగుపడ్డ అన్ని కులాలు తొలగిపోవాలి. కులం పేరు మీద ఇక ఎవ్వరూ రిజర్వేషన్ కోరలేని పరిస్థితి రావాలి. అన్ని కులాలలోని పేదలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే ఒక శాస్త్రీయ దృక్పథం ఏర్పరచుకోవాలి.ప్రభుత్వం ఇక మీదట రూపొందించే పధకాలు ఆయా కులాలలోని ధనవంతులను తప్పించి, నిరుపేదలను ఉద్ధరించేలా ఉండాలి. కులానికి పేదలైన వారిలోనే కూటికి పేదలైన వారికి నిధులు చేరాలి.
వర్గం
మొత్తం కులాల సంఖ్య
గ్రూపులో కొంత మెరుగైన కులాలు
మరీ వెనుకబడిపోయిన శక్తిహీన కులాలు
వెనుకబడిన తరగతులు ' ' గ్రూపు
54
అగ్నికుల క్షత్రియ,నాయీబ్రాహ్మణ, మేదరి, మంగలి, వడ్డెర,రజక
బాలసంతు, బుడబుక్కల, దాసరి,దొమ్మరి, గంగిరెద్దుల, జోగి, జంగం,కాటిపాపల, మందుల, మొండిబండ,పంబల, పాముల, పెరికి ముగ్గుల, పిచ్చిగుంట్ల,వీరముష్టి ,మెహతార్ మొదలైన కులాలు
వెనుకబడిన తరగతులు ' బి ' గ్రూపు
28
 గౌడ, కుమ్మర,పద్మశాలి, పెరిక బలిజ, విశ్వబ్రాహ్మణ, కురుమ
 దేవాంగులు, దూదేకుల, జాండ్ర, కరికాల భక్తులు,సెగిడి, తొగట మొదలైన  కులాలు
వెనుకబడిన తరగతులు ' సి ' గ్రూపు
1
క్రైస్తవులుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారు

వెనుకబడిన తరగతులు ' డి ' గ్రూపు
47
భట్రాజులు, కళావంతులు,కొప్పులవెలమ, కృష్ణ బలిజ,ముదిరాజులు, మున్నూరు కాపులు, గవర,ఉప్పర, యాదవ,వాల్మీకి
ఆగరు, ఆరెకటిక, చిప్పోళ్లు,కొడమి, జక్కల, జింగారు,కచ్చి, కండ్ర, కొష్టి, మాలి, నెల్లి,పస్సి, పూసల, సాతాని మొదలైన  కులాలు
వెనుకబడిన తరగతులు '  ' గ్రూపు
14
 షేక్,అచ్చుకట్లవాండ్లు, లబ్బి ,
అత్తరు సాయిబులు,తురక చాకలి, నాయి ముస్లిమ్,గంటా ఫకీర్లు,గారడీ సాయిబులు ,పకీరుసాయిబులు,ఎలుగుబంటు వాళ్లు,కుక్కుకొట్టె జింకసాయిబులు,మొదలైన  కులాలు

వాటా పేదల జనాభా నిష్పత్తిలో ఉండాలి
కోటా పెంచకుండా 93 కులాల బీసీ కులాల జాబితాని 144 కి పెంచారు. మురళీధర రావు కమిషన్‌ 1986 లో బీసీల  కోటా 44 శాతానికి పెంచాలని సిఫార్సు  చేసినా కోటా ఇప్పటికీ 29 శాతమే ఉంది. 50 శాతం సీలింగ్‌ వలన పంచాయితీరాజ్‌ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కోటాను 24 శాతానికి తగ్గించారు. పరిమితిని జనాభా దామాషా ప్రకారం  పెంచుతూ  పార్లమెంట్‌లో చట్టం చెయ్యాలని దేశవ్యాప్తంగా  డిమాండు ఉంది . కులాలను వడపోయకుండా ఇలా శాశ్వతంగా రిజర్వేషన్లను కొనసాగిస్తే మరీ అడుగునబడిపోయిన కులాలు పైకి లేవనే లేవలేవు.ఇలాంటి పద్ధతి అట్టడుగు కులాలకు ఎప్పటికీ అన్యాయం చేసినట్లే అవుతుంది.
 
n  నూర్ బాషా రహంతుల్లా 6331483266

4, జులై 2019, గురువారం

ఇంగ్లీషుతో పాటు హిందీని కూడా మొయ్యాలా ?ఇంగ్లీషుతో పాటు హిందీని కూడా మొయ్యాలా ?
 తెలుగు మీడియం మానిపించి స్కూళ్ళ లో యింగ్లీషు మీడియం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి  తెలుగు బరువు వదిలిందనుకుంటే త్రిభాషాసూత్రం పేరుతో హిందీ బరువు అదనంగా మెడకు తగులుకోటానికి కాచుకొని ఉంది.మాతృభాష నేర్చుకోటానికి నోచకపోయినా సరే  భారతీయులు అందరూ హిందీని తప్పనిసరిగా నేర్వాల్సిందే అంటూ    ఉత్తరాది కేంద్రం దక్షిణాది  పిల్లలపై అదనపు భారం మోపటానికి  పదే పదే  ప్రయత్నిస్తోంది.తమ సొంత సమస్యల్లో తలమునకలై ఉన్న హిందీయేతర రాష్ట్రాలపై కేంద్రం హిందీ బాణాలు వదులుతూ మిగతా భాషలు చచ్చాయా లేదా అని అప్పుడప్పుడు  పరీక్షిస్తుంది.ఇంగ్లీషు దెబ్బకు ఇప్పటికే అనేక భాషలు వడలిపోయాయి.శక్తిహీనమైన భారతీయ భాషలమీద హిందీ కూడా తన ప్రతాపం చూపిస్తోంది.  
1632 భాషలున్న మన దేశంలో లక్ష మందికి పైగా మాట్లాడే భాషలు 33 ఉన్నాయి.60 శాతంమంది హిందీయేతర భాషలు మాట్లాడుతున్నారు. మిగిలిన 40 శాతంమంది  బ్రజ్‌భాష, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వీ వంటి 49 రకాల హిందీ యాసలు మాట్లాడుతారు. 
భాషా ప్రాతిపదిక మీద జాతుల విభజన అనే సూత్రాన్ని మన దేశం సోవియట్ నుండే స్వీకరించింది. అక్కడ రష్యన్ భాషా రుద్దుడు ఎలాంటి ఫలితాన్ని తెచ్చిందో ఇక్కడ హిందీని బలవంతంగా రుద్దడం కూడా అలాంటి ఫలితాన్నే తెస్తుంది.రష్యాలోని వివిధ భాషల పట్ల అవలంబించిన వివక్ష బలవంతంగా రష్యన్ భాషను ఇతర భాషలవారిపై రుద్దడం వంటి పనుల వల్ల, జాతీయ మైనారిటీలను స్టాలిన్ ఛిన్నాభిన్నం చేసినందువల్ల ఎక్కువ హాని జరిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చండ్ర రాజేశ్వరరావు పేర్కొన్నారు. సోవియట్ యూనియన్ లో 15 యూనియన్ రిపబ్లిక్కులు, 20 స్వయం ప్రతిపత్తి గల రిపబ్లిక్కులు, 8 స్వయం పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 130 భాషలున్నాయి.వందకు పైగా జాతులున్నాయి. 1917 అక్టోబర్ విప్లవంలో ఈ జాతులు విడిపోయి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకునే హక్కును లెనిన్ ప్రసాదించాడు. భాషా ప్రాతిపదిక మీద జాతుల విభజన సూత్రాన్ని మన దేశం సోవియట్ యూనియన్ నుండే స్వీకరించింది. నేటి వరకు హిందీని బలవంతంగా రుద్దడం కొనసాగుతూనే ఉంది.రేడియో, టీవీ, ప్రభుత్వ ఆఫీసుల్లో హిందీ ఆధిపత్యం సాగుతోంది.హిందీయేతర రాష్ట్రాల వాళ్ళు తమకు హిందీ వచ్చినా రాకపోయినా హిందీ వార్తలు వినాలి,హిందీ సినిమాలు సీరియళ్ళు చూడాలి. వినోదసాధనాలతో ఈ నిర్బంధం ఆగలేదు.మన తెలుగు రాష్ట్రాలలో కూడా బ్యాంకుల్లో,పోస్టాఫీసుల్లో ఫారాలు,ఎల్లైసీ పత్రాలు హిందీలో వస్తున్నాయి.    ఉత్తరాదిన కొంత ప్రాంతానికి పరిమితమైన హిందీ భాషను జాతీయ భాషగా చేయదలుస్తున్నారు. దేశంలోని మిగతా భాషలకు  కేంద్రం నుండి ప్రోత్సాహం కొరవడింది. సోవియట్ లో రష్యన్ భాష పట్ల పెల్లుబికిన అసంతృప్తి మన దేశంలో హిందీ పట్ల కూడా పెల్లుబుకుతుంది. కేంద్రం దీన్ని గమనించి మసలుకోవాలి.
కస్తూరిరంగన్‌ కమిటీ హిందీ పక్షపాతం   
హిందీయేతర రాష్ట్రాల్లో సైతం హిందీని కచ్చితంగా బోధించాలని  కస్తూరిరంగన్‌ కమిటీ సిఫార్సు చేసిందట. త్రిభాషా సూత్రాన్ని అమలుచేయాలని సూచిందట. ఇది హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దడమేనంటూ తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, కేరళ ఎదురుతిరిగితే  ఇది ముసాయిదా నివేదిక మాత్రమేనని, ఏ రాష్ట్రంపైనా బలవంతంగా హిందీని రుద్దబోమని కేంద్రం ప్రకటించింది.
1937 లో సి.రాజగోపాలాచారి మద్రాసులో హిందీని  తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెడితే నిరసనలు చెలరేగి  నటరాజన్‌, థలముత్తులు జైల్లోనే మరణించారు. అప్పుడు  హిందీ తప్పనిసరి కాదని ఉత్తర్వును 1940 లో ప్రభుత్వం  21న ఉపసంహరించుకుంది.హిందీని అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయడానికి మళ్లీ ప్రయత్నాలు జరగటం ,నిరసనలు చెలరేగాక ఉత్తర్వులు ఉపసంహరించుకోవటం మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి.
రాజ్యాంగం ప్రకారం దేశంలో మాట్లాడే ఏ భాషకూ జాతీయ హోదా లేదు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ, ఇంగ్లీషు భాషలకు మాత్రమే ఆ అవకాశం ఉంది.తమ  అధికారిక భాషను నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంది. 22 షెడ్యూల్డ్  భాషల్ని  అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రంపై ఉంది.కానీ కేంద్రం ఎప్పుడైనా హిందీకి తప్ప మరో భాషకు సహాయపడిందా?
దక్షిణాది వారి ఆందోళన
దేశానికి తమ హిందీ భాషే జాతీయ భాష కావాలని ఉత్తరాది నేతలు నిరంతరం కోరుకుంటున్నా రు. అప్పట్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి హిందీ భాషా పెత్తనాన్ని ప్రశ్నిస్తూనే ఉండేవారు. ఎన్‌జీ రంగా, వెంకయ్యనాయుడు  వంటి నేతలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. జన ఘోషకు స్పందించాల్సిన సర్కారీ యంత్రాంగం జన భాషకు పట్టం కట్టాల్సిందేనంటూ పట్టుపట్టిన ఎన్టీఆర్‌, దస్త్రం తెలుగులో రూపొందిస్తేనే సంతకం చేస్తానన్నాడు.ఫైలు తెలుగులో తెస్తేనే సంతకం పెట్టాడు.యదారాజా తధా ప్రజా అన్నట్లు అధికారులు తెలుగులో ఫైళ్ళను పరుగులెత్తించారు.తెలుగులోనే తీర్పులు వచ్చేలా గ్రామ న్యాయాలయాలను నెలకొల్పుతానన్నారు.ప్రజలు ఎంతగానో సంతోషించారు.ఇలాంటి నాయకులున్నప్పుడు స్థానిక భాషలు క్షేమంగా వర్ధిల్లుతాయి.
ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణాదిపై చెలాయించడానికే హిందీని రుద్దుతున్నారనేది దక్షిణాది వారి ఆందోళన. సంస్కృతం నుంచి ఉత్తరాది భాషలు పుట్టగా , దక్షిణాది భాషలు స్వతంత్రంగా అభివృద్ధి అయ్యాయి.మూలవాసులు ద్రావిడులు, మధ్య ఆసియా నుంచి ఉత్తరాదిలోకి ప్రవేశించిన ఆర్యులు దక్షిణాదికి వలస వచ్చారు.ఉత్తర, దక్షిణ భారతాల విభజన జరగాలి.దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రధాన కార్యాలయం చెన్నైలోనే ఉంది.హిందీ ప్రభావం వల్ల ద్రవిడ భాషల ఉనికి ప్రమాదంలో పడుతోంది. త్రిబాషా సూత్రమే పిల్లలపై అదనపు బరువు. మూడో బాష తాము ఇష్టమొచ్చింది నేర్చుకోవాలనేదీ మోసపూరితమే, అది దొడ్డిదారిన హిందీని తోయడమే.అందుకే తమిళనాడు దశాబ్దాలుగా ద్విభాషా సూత్రాన్నే అమలు చేస్తోంది.
మాతృభాషలోనే విజ్ఞాన బీజాలు
బాలల్లో మాతృభాషలోనే విజ్ఞాన బీజాలు నాటాలి. కానీ కస్తూరి రంగన్‌ కమిటీ  మరో రెండు భాషల్నీ బోధించాలంటూ పిల్లలపై అదనపు బరువు మోపింది.  హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇంగ్లిషుతోపాటు ఆధునిక భారతీయ భాషల్లో ఒకదాన్ని ఎంచుకోవాలట. హిందీయేతర రాష్ట్రాల్లోనైతే  స్థానిక భాషతోపాటు హిందీ ఆంగ్లం బోధన సాగాలట. త్రిభాషా సూత్రం పేరిట హిందీని బలవంతంగా రుద్దే ఎత్తుగడ కదా ఇది? మాతృభాషతోపాటు జీవన నైపుణ్యాల మెరుగుదలకు ఆంగ్లం నేర్పితే సరిపోదా? మధ్యలో ఈ హిందీ ఎందుకు ?మన పిల్లలకు తెలుగే సరిగా రాదు,ఇంకా ఈ భాషల అదనపు బారమా ?ఆలోచన వికసించేదశలో తనభాష తనకు రాకుండా పసి మనసును పరాయి భాషలకు వశం చేయటం ప్రభుత్వాల పాపమే.
ఇంగ్లీషే జాతీయ భాష అన్నాయి కోర్టులు
సుప్రీం కోర్టులో చెలామణి అయ్యేదే జాతీయ భాష. ఆస్థాయి హిందీకి మాత్రమే కట్టబెడదామని ఉత్తరాది వాళ్ళ ప్రయత్నం.విద్యాలయాల్లో హిందీని ప్రవేశపెట్టగలిగారు గానీ న్యాయస్థానాల్లోకి హిందీనితీసుకు రావటం లో సఫలం కాలేకపోయారు.అందుకే మామూలు జనానికి హిందీ నేర్పుదామని బయలుదేరారు.ఇక్కడ ఎవరి భాషను వాళ్ళు తమ ప్రాంతంలోనే ప్రాభవం లోకి తెచ్చుకోలేక నానా తంటాలు పడుతుంటే మూడో భాష బరువునూ మోయటానికి ఒప్పుకుంటారా? భిన్నత్వంలో ఏకత్వ భావన,జాతి సమైక్యత, భాషాపర సఖ్యతల కోసం 1968లో  త్రిభాషా సూత్రం తెచ్చారు.హిందీ రాష్ట్రాలు మాత్రం ఆంగ్లంతోపాటు మరో  భారతీయ భాష ను నేర్వకుండా సంస్కృతాన్ని ఎంచుకున్నాయి. త్రిభాషా సూత్రం పనికిరాకుండా పోయింది.మూడు భాషల మోత కంటే జాతీయ భాషగా ఇంగ్లీషు నే చేసి నేర్చుకోవటం నయం కదా అంటూ భారతీయ జాతీయనాయకులు సైతం ఇంగ్లీషు వైపే మొగ్గారు.రాజ్యాంగమే ఇంగ్లీషులో రాశారు.హిందీ భాషా నేతలు విశ్వప్రయత్నం చేసినా అక్కడి హైకోర్టులు,సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు ఆభాషను న్యాయస్థానాల గడప దగ్గరే ఆపేశారు. అందరూ ఇంగ్లీష్ అభిమానులే.
లిపి మార్చటమే కుదరదన్నవారికీ ఇంకో భాషా? 
వత్తుల,గుణింతాల బెడదలేని ఆంగ్ల లిపి పిల్లలు అందరికీ దగ్గరఅయ్యింది.తమిళలిపి కూడా ఇంచుమించు అలాంటిదే.వేటూరి ప్రభాకరశాస్త్రి లాగా తెలుగు లిపిని  పిల్లలకు అక్షరాలను సులభతరంచేస్తూ సంస్కరించటానికి ఎవరూ పూనుకోలేదు.శ్రీశ్రీ కోరినట్లు ఇంగ్లీషు అక్షరాలను తెలుగు కోసం వాడుకునే అవకాశమూ ఇవ్వలేదు.జనమే ఆపనికి శ్రీకారం చుట్టారు. తెలుగును రోమన్ లిపిలో రాస్తున్నారు.కోర్టుల్లో న్యాయవాదులకు న్యాయమూర్తులకు ఈ లిపిని వాడుకొనే స్వేచ్చ ఇచ్చినా తెలుగు నిలబడేది.భాషమారటం కంటే లిపి మారటం కొంత నయం.భారతీయ భాషలన్నీ  ఆంగ్లలిపిలో అర్ధం కాకపోయినా కనీసం చదువవచ్చు. 
ఇంగ్లీషు తప్ప మరేభాషా హైకోర్టుల్లో వద్దన్నారు

హైకోర్టులో తమిళం వినియోగంపై చేసిన విన్నపాన్ని కేంద్రం తిరస్కరించిందని,మద్రాసు హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా వినియోగించేందుకు అనుమతించాలని తమిళనాడు శాసనసభ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలించాలని ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ పుష్ప కేంద్రప్రభుత్వాన్ని కోరారు.దానిపై స్పందిస్తూ స్థానిక భాషలను హైకోర్టుల్లో అధికార భాషగా ఉపయోగించడం ఆదర్శవంతంగా ఉంటుందని రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.అయితే అందుకు విస్తృతస్థాయిలో ఏకాభిప్రాయం అవసరమని వ్యాఖ్యానించారు.
2008 లో హిందీ నేతలు రాజ్యాంగం లోని ఆర్టికిల్ 248ని సవరించి హైకోర్టు,సుప్రీంకోర్టుల్లో హిందీ తీర్పులు తేవాలని ప్రతిపాదించారు.లాకమీషన్ దేశవ్యాప్తంగా నిష్ణాతులైన న్యాయమూర్తుల్ని సంప్రదించి ఇంగ్లీషులో తప్ప హిందీ లో గానీ ఇంకా ఏ ఇతర భారతీయ భాషలలో గానీ వాదనలు తీర్పులు కుదరవని ఏకగ్రీవంగా తీర్మానించింది.అందుకు లాకమీషన్ చెప్పిన కారణాలు :
భాష దేశ ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. భాష ప్రజలను ఐక్యపరుస్తుంది. ఎవరిమీదా ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడదు.ఉన్నతన్యాయస్థానాలలోని వాదనలు తీర్పులు మామూలుగా జరిగేది ఆంగ్ల భాష లోనే.భారతీయ న్యాయ వ్యవస్థ ఇంగ్లీషుకు అమెరికా న్యాయ పుస్తకాలకు అలవాటుపడింది. కాబట్టి ఉన్నత న్యాయమూర్తుల్ని ఇంగ్లీషుకే స్వేచ్ఛగా వదిలేయ్యాలి.ఒక రాష్ట్ర హైకోర్టు జడ్జి మరో ప్రాంతానికి బదిలీపై వెళితే ఆ రాష్ట్ర భాష నేర్చుకొని ఆ భాషలో తీర్పులివ్వాల్సివస్తుంది. అది చాలా కష్టం. జడ్జీలమీద అనేక భాషల భారం మోపకూడదు. వాళ్ళమీద ఏ భాషనూ రుద్దకుండా జడ్జీలను వాళ్ళ భాషకు వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయ్యాలి. దేశప్రజలందరూ తప్పక సర్వోన్నత న్యాయస్థానం తీర్పులిచ్చే ఏకైక భాష అయిన ఇంగ్లీషును అర్ధం చేసుకోక తప్పదు.అన్నీ కోర్టుల్లో ఇంగ్లీషే ఉంటే వివిధ భాషా ప్రాంతాలమధ్య న్యాయవాదుల కదలిక సులభం అవుతుంది.కోర్టుల్లో హిందీ అమలు కోసం కావాల్సిన చట్టపరమయిన నియమాలు నిబంధనలుమాత్రం ముందు ఇంగ్లీషులోనే చెయ్యాలి. దానికి అధి కారపూర్వకమైన అనువాదం చేసుకోవచ్చు.ఉన్నత న్యాయ స్థానాలను మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంగ్ల భాషను మార్చుకోమని అడగవద్దు”.
ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు తీర్పులు ఆశించగలమా?
రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి లాంటి పెద్దలంతా కక్షిదారుల భాషలోనే హై కోర్టుల్లో కూడా వాదనలూ తీర్పులు ఉండాలని చెబుతున్నారు కదా అన్న ధైర్యంతో 2017 లో రాజధాని ప్రాంత భూసమీకరణ   కేసులో తెలుగులో ప్రతివాదన తయారుచేసి తీసికెళితే హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది దానిని తీసుకోటానికే తిరస్కరించారు. ఎంత సవివరంగా రాసినా తెలుగులో రాస్తే హైకోర్టులో మీ  వాదన చెల్లదు అన్నారు.తెలుగులో ప్రతి వాదనా?అదీ హైకోర్టుకు ఎలా తెచ్చారు?అంటూ తెచ్చినందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంగ్లీషులో వాదించలేని నేను డిప్యూటీ కలక్టర్ పదవికి తగనని ఎగతాళి చేశారు. చివరికి నాతెలుగు ప్రతివాదాన్ని ఇంగ్లీషులోకి మార్చి ఇస్తేనే తీసుకున్నారు. హైకోర్టు స్థాయికి తెలుగు భాష ఇంకా వెళ్ళలేదు.మనము మన మాతృ భాషలను వదిలి ఆంగ్లానికి దాసోహమవటానికి సగం కారణం కోర్టులు,కోర్టులిచ్చే ఆంగ్ల తీర్పులే.ఇంగ్లీషు రాని వాళ్ళెవరూ కోర్టుల్లో పనికిరాని పరిస్తితి దాపురించింది.
దేశానికి ఆంగ్లమే దిక్కు అంటున్న న్యాయమూర్తులు కల్పించే ఇలాంటి అడ్డంకుల్ని అధిగమించి ప్రజల భాషలలో న్యాయస్థానాలు నడిచేలా చేయాలి.హైకోర్టుల్లో ప్రాంతీయ భాషలలో వాదనలు వినిపించేలా న్యాయవ్యవస్థతో సంప్రదింపులు లేకుండా కేంద్రమే ఓ నిర్ణయం తీసుకునేందుకు తగినన్ని అధికారాలను రాజ్యాంగం కల్పించిందని పార్లమెంటరీ సంఘం పేర్కొంది కాబట్టి ఇప్పటికైనా కేంద్రం ప్రాంతీయ భాషలు బ్రతకడం కోసం తనకున్న రాజ్యాంగ అధికారాలు వినియోగించుకోవాలి.ప్రాంతీయ భాషలలో తీర్పులు ఇవ్వాలని చట్టం చెయ్యాలి. న్యాయవ్యవస్థ హిందీగానీ,మరే భారతీయ భాషగానీ తనదరిదాపుల్లోకి రాకుండా తనను తాను కాపాడుకుంది.మిగతా సామాన్య జనం మీద మూడు భాషలభారం మోపుతుంటే న్యాయవ్యవస్థ మౌనం గా ఉంది. 
 జాతీయ భాష హిందీ కాదు ఇంగ్లీషే   
జాతీయ అనుసంధాన భాషగా హిందీ ఎప్పటికీ కాలేదని దశాబ్దాల చరిత్రే చాటుతోంది. దక్షిణ భారతంలోని కేంద్ర  కార్యాలయాలలో  హిందీవారం’, “రాత కోతలన్నీ హిందీలోనే అనే కార్యక్రమాలు విఫలమయ్యాయి.ఇది గ్రహించకుండా  దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో  హిందీని నిర్బంధంగా బోధించాలని చూడటం హిందీపాలకుల కుటిల పన్నాగాన్ని తెలియజేస్తోంది.   ఉత్తరప్రదేశ్ విద్యా సంస్థల్లో బోధన భాషగా ఆంగ్లాన్ని రద్దు చేసేసిన ములాయంసింగ్‌, ప్రభుత్వ వ్యవహారాల్లో ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీనే వినియోగించాలంటూ 1990లో ముఖ్యమంత్రిగా ఆదేశించారు. అది హిందీ రాష్ట్రం గనుక సరిపోయింది.అలాంటి పని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చెయ్యమని అడిగే వాళ్ళూలేరు ,అమలుచేసే వారూ లేరు.మీరు హిందీలో ఉత్తరం రాస్తే మేము తెలుగులో బదులిస్తామని కరుణానిధి లాగా కేంద్రాన్ని హెచ్చరించే నాయకులూ లేరు .తమిళనాట మైలురాళ్లపై ఉన్న హిందీ  అక్షరాలను చెరిపేసి తమిళంలో  రాసినట్లు తెలుగు వాళ్ళు రాయలేరు.ఆంధ్రులు అంత సౌమ్యులు.మరో భారాన్ని మోపినా ఆనందంగా మోస్తారు.
తెలుగునాట మూడో భాష కావాలా? 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరిగా ఉండాలన్న ప్రతిపాదనను  వైఎస్‌ రాజశేఖర రెడ్డి వ్యతిరేకించారు.వాటిని అమల్లోకి తెస్తే హిందీ భాషా ప్రాంతాల అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందుతారని, హిందీయేతర  రాష్ట్రాల వారు నష్టపోతారన్నారు.ప్రజలు ఏ దేశంలో నివసించినా  వారి భాషలో,భాషతోనే బ్రతుకుతారు. భాషపోతే ప్రాణం పోయినట్లు ఉంటుంది. ఏ భాషా ప్రాంతం వారైనా మరో భాష పెత్తనాన్ని సహించలేరు. భాష అధికారానికీ, ఆధిపత్యానికీ చిహ్నం.ఆ అధికారం మరో భాషకు ఇవ్వరు. తమ భాషా సంస్కృ తులను ఆ భాష నాశనం చేస్తుందని భయపడతారు.తమ భాషను  కించపరుస్తున్నారనేది ఒక కారణాంకదా  తెలంగాణ విడిపోవటానికి ?తమ భాషపైనా, మాండలికంపైనా, సంస్కృతిపైనా ప్రజలకుండే మక్కువ అలాంటిది.పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులు సలహాలే కానీ  ఆదేశాలు కానప్పుడు విద్యాలయాల్లో హిందీని తప్పనిసరి చేయడంఏమిటి? హిందీని తప్పనిసరి చేస్తే ఇతర భాషల ప్రజలు నష్టపోరా?హిందీ నేర్చుకుతీరాలని ఇతరులపై ఒత్తిడి తీసుకు రావడం,హిందీ వస్తేనే ఉద్యోగం,హిందీలో రాణిస్తేనే పదోన్నతి,అంటే ఇతర భాషల వాళ్ళు సాహిస్తారా?  అసలు హిందీ వాళ్ళు ఎప్పుడైనా  మరో భారతీయ భాష నేర్చుకున్నారా?ఇతర భాషలను వాటి మానాన వాటిని ఎదగనిచ్చారా? హిందీ ప్రాంతాలలోకి ఇతరభాషల జనం ఉద్యోగాల కోసం  వలసలు పోయేలా చేశారు.దేశమంతా హిందీ వాళ్ళ వాణిజ్యం, వినోదం అల్లుకుపోయాయి. హిందీ చలనచిత్రాలు, టెలివిజన్‌ సీరియల్స్, హిందీ భాషను వ్యాప్తి చేశాయి. మరే భారతీయ భాషకూ ఈ అవకాశం లేదు.
ఉత్తరాది నాయకులకు హిందీ రాజభాషగాచేసి మిగతా భాషా ప్రాంతాలనూ ఏలాలన్న దురాశ,ఆదుర్దా మాత్రమే ఉన్నాయి. హిందీ జాతీయ భాష కాదు. 22 అధికార భాషల్లో అదొకటి మాత్రమే. 1965 కల్లా ఇంగ్లిష్‌ స్థానంలోకి  హిందీని తేవాలనే లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు. అనేక భాషల మనుషులు. అనేక మతాల మనుషులు.వారి సంస్కృతులు వేరు.వారి సంప్రదాయాలు వేరు. వారి మాటలను , పలుకుబడిని,భాషను,యాసను గౌరవించడం అవసరం.అధికారం వచ్చిందికదా అని ఒక్క భాషకే అన్నీ అవకాశాలూ కట్టబెడుతూ  పెత్తందారీ శాసనాలు చేస్తే ఇతర భాషల ప్రజలు ఎదురు తిరగరా? 
     ఇప్పటి దాకా ఇంగ్లీషు మీడియం కాన్వెంట్లతో పోటీ పడలేక తెలుగు పాఠశా లలు తెలుగు ప్రజలు,ప్రభుత్వాల దయవల్ల ఇంగ్లీషు పాఠశాలలుగా క్రమేణా రూపాంతరం చెందాయి.ఇక ఇప్పుడు హిందీ పాఠశాలలు గా కూడా వాటిని మార్చాలి.ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగల కాళ్ళు విరగదొక్కినట్లుగా మారుతోంది పరిస్తితి.సుప్రీం కోర్టు ఈ భాషా సమస్యను  మరో దేశ విభజన లాంటి  పెద్ద సమస్య కాకముందే  తనంతట తానుగా తీసుకొని పరిష్కరించాలి.
--- నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, 6391493266