12, జూన్ 2019, బుధవారం

అమ్మఒడి -రాజన్న బడి

అమ్మఒడి కంటే రాజన్న బడిబాటేమేలు
"అమ్మ ఒడి పథకం" ప్రకారం పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. ఈ పధకాన్ని ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తింపచేయడంతో కార్పోరేట్ స్కూళ్ళు ఈ నిధుల్ని భోంచేస్తాయని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. పేదవాళ్ళే ప్రభుత్వ బడులకు పోతారు కాబట్టి ఈ సహాయాన్ని వాళ్ళవరకే పరిమితం చేస్తే బాగుండేది అని కొందరు అంటున్నారు.ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు వశమైపోయిన విద్యా వైద్యరంగాలలో ప్రభుత్వ సహాయం చిన్నదైనా పెద్దదైనా ప్రభుత్వ సంస్థలకే చేస్తే అవి బాగుపడతాయని వారి భావన.

అందరినీ మెప్పించడం అలవి గాని పని
ఈసురోమంటున్న ప్రభుత్వ స్కూళ్ళు కూడా పదోతరగతి ఫలితాలలో 93.21% ఉత్తీర్ణత సాధించాయి. గురుకుల పాఠశాలలు 98.28% ఉత్తీర్ణత సాధించాయి.ప్రభుత్వ సాయం పెరిగే కొద్దీ సర్కారు బడుల ఫలితాలూ మెరుగవుతాయి. ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయకుండా చూడాలి. పేదలకు ఈ పథకం ద్వారా వచ్చే 15 వేల రూపాయలను ప్రైవేటు పాఠశాలలు రాబట్టుకోకూడదు. ఫీజు రియంబర్సుమెంట్ల ద్వారా ప్రైవేటు కాలేజీలు బాగుపడ్డాయి.ప్రభుత్వ కళాశాలల్లో సరైన సదుపాయాలు , బోధనా సిబ్బంది ఉంటే అంత డబ్బు వెచ్చించి ప్రైవేట్ కాలేజీలకు ఎవరూ వెళ్ళరు.అయితే ప్రైవేటు విద్యా సంస్థలకు ఇచ్చే ప్రభుత్వ సాయం సరిపోవటం లేదనీ ఆ పధకాల కోసం ప్రైవేటు సంస్థలేమీ వెంపరలాడటం లేదనీ కార్పోరేట్ వర్గాలు వాదిస్తున్నాయి. పైగా ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచే పథకాల అమలుకోసం కార్పోరేట్ శక్తులే కృషి చేస్తున్నాయని ప్రైవేట్ పెట్టుబడులు లేకపోతే ప్రభుత్వం ఈ పధకాలు అసలు అమలు చేయగలదా? అని వాదిస్తున్నారు.ఇద్దరినీ మెప్పించటం అలవిమాలిన పని
.
అందరూ ఒక ఎత్తు - అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు
ప్రజోపయోగకర పథకాలు, ప్రణాళికలు రూపొందించినప్పుడల్లా ప్రైవేట్ కార్పొరేట్ వర్గాలు అందులో తమ వాటా కోసం ప్రయత్నించడం ఖాయం. ప్రజాసేవ పేరుతో పాలకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టే పధకాలు విజయవంతం కావాలంటే ముందు అంతర్గత లోపాలను సవరించుకోవాలి. మరుగు దొడ్లు లేని స్కూలుకు ,నీళ్ళు దొరకని స్కూలుకు ,పిల్లల్ని పంపించాలని ఏ తల్లి కి అనిపించదు. అమ్మఒడి కార్యక్రమం కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమం లాగా తయారుకాదని ఏమిటి గ్యారంటీ? ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ పాఠశాలలను ఈ రెండు కార్యక్రమాలకు కేటాయించిన నిధులతో బాగుచేయవచ్చు.అక్షరదీక్షకు ఇచ్చిన పలకలను ముసలివాళ్ళు తమ పిల్లలకే ఇచ్చారట.అమ్మఒడికి చేర్చిన 15 వేలు ఎన్నిరకాల ఖర్చులకు వాడుకుంటారో?ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రైవేటు స్కూళ్ళలాగా ఉంటే పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలోనే చేరుస్తారు.ప్రజలు కోరారని ప్రభుత్వ స్కూళ్ళలో తెలుగు మీడియం బదులు ఇంగ్లీషు మీడియం కూడా ప్రవేశపెట్టారు.ఇక ప్రైవేటు వాళ్ళకంటే ఏమి తక్కువయ్యిందని ప్రైవేటు స్కూళ్ళకూ,ప్రైవేటు స్కూళ్ళలో పిల్లల్ని చేర్చే వాళ్ళకూ అమ్మఒడి డబ్బులివ్వాలి? ఎవరు ఎట్లాపోతే నాకేంటి ? ఇందులో నాకొచ్చేదెంత అని అడిగే జనం ఎక్కువయ్యారు.కోర్కెలు అనంతాలు. అవి తీరేకొద్దీ కొత్తవి పుట్టుకొస్తాయి. వ్యక్తిగత కోర్కెల బదులు సమిష్టి కోర్కెల సాధనకు జనం సిద్ధపడితే బాగుండు.

అ - ఆ లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట
ప్రభుత్వ పధకాలన్నీ ప్రభుత్వ సంస్థలకే రావాలని ఉద్యమించే వాళ్ళు ప్రభుత్వ సంస్థల బాగుకోసం పని చెయ్యాలి.వర్షానికి కారిపోయే,కూలిపోయే పాఠశాలలు,ఆసుపత్రులను బాగుచేయటానికి అధికారులు ,పార్టీల నేతల దగ్గరకు,పదే పదే తిరగాలి.కొంతమంది డాక్టర్లు, ఉపాధ్యాయులు వారు పనిచేసే భవనాల బాగుకోసం నిరంతరం కృషి చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.అలాగే ప్రైవేట్ ప్రాక్టీసును మానిపించాలి.స్థానికంగా నివాసం ఉండే ఉపాధ్యాయునికి పాఠశాల సమస్యలు బాగా అవగతమౌతాయి.అలాగే ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివిస్తే బడులు బాగుపడతాయి. ఉపాధ్యాయులు బాధ్యతగా పాఠాలు చెబుతారు.బడి ప్రతిష్ఠ పెరుగుతుంది..ఈమధ్య కొంతమంది కలక్టర్లు,డిప్యూటీ కలక్టర్లు కూడా తమ బిడ్డల్ని ప్రభుత్వ బడుల్లో చేర్చి ఆదర్శంగా నిలిచారు.ఏ వసతులూ లేని ప్రభుత్వ స్కూళ్ళలో ఎలా చేరతారు?స్కూళ్ళ బాగుకోసం ఏమీ చెయ్యకుండా వాటికి ప్రాధాన్యత ఎలా వస్తుంది?ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా ఉపాధ్యాయులు,అధికారులు,రాజకీయ నాయకులు వాళ్ళపిల్లల్ని చేరిస్తే కొంత నిఘా పెరిగి అవి బాగుపడతాయి.

అడిగేటంత అన్యాయానికి లోబడతానా?
అడిగిందే పాపం - అనుగ్రహించటం తన స్వభావం అన్నట్లు ఉంది అమ్మఒడి వరం.వరమడిగిన జనం ఈ డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచమని కోరాలి.పిల్లల సంఖ్యకు తగ్గట్లు టీచర్ల సంఖ్యను పెంచమని కోరాలి.టీచర్లకు బోధనా నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించమని కోరాలి.కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం బోడేమ్మనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బస్సు ను ఏర్పాటు చేసినట్లు అవసరమైన ప్రతిస్కూలుకీ బస్సు ఏర్పాటు చేసుకోవాలి.స్కూళ్ళకు చేయాలనుకుంటే ఎన్ని పనులు లేవు? సత్తా ఉంటే స్వయంగా చెయ్యాలి,లేకపోతే చేయించాలి.రెండూ అవసరమే. ఒక కేంద్ర మంత్రి మధ్యాహ్న భోజనం పధకం దండగామారి పధకం పిల్లలు భోంచేసి కూలి పనులకు వెళ్ళిపోతున్నారు అని వాపోయారు గానీ ఆ పధకం మంచిదే.దానిని ఇంకా ఇంకా ఉపయోగకరంగా తీర్చిదిద్దుకోవాలి.మనసుంటే మార్గముంటుంది.

రాజన్న బడి బాట నిభంధనలు నయం
రాజన్న బడి బాట లో బూట్లు,సాక్సు,దుస్తులు,సైకిలు ... లాంటివన్నీ ప్రభుత్వ స్కూళ్ళకు పోయే వారికేనట. అమ్మ ఒడికి,ఆరోగ్యశ్రీ కి కూడా ఇలాంటి నియమాలే పెడితే బాగుండేది. విద్యాభివృద్ధి జరగాలి అది ప్రవేటుదైనా ప్రభుత్వపరంగా నైనా సరే అనుకుంటే ఆరోగ్యశ్రీ లో కార్పొరేట్ ఆసుపత్రలకు,ఫీజు రీయింబర్సుమెంటులో కార్పొరేట్ కాలేజీలకు ఇచ్చినట్లు ఇవీ ఇవ్వవచ్చు.కానీ ప్రభుత్వ ఆసుపత్రలు,ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలి వాటి ద్వారానే ఈ సేవలన్నీ ప్రజలకు అందించాలి అనుకుంటే మాత్రం వీటికి కేటాయించిన నిధులు ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలు,ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పనకు వాడాలి.తద్వారా ప్రజలు ప్రభుత్వ స్కూళ్ళకు ,హాస్పిటళ్ళకు రావటానికి మొగ్గుచూపే వాతావరణం తేవాలి. ప్రభుత్వ స్కూళ్ళలో ,హాస్పిటళ్ళలో ఖచ్చితంగా కనీస సదుపాయాలు కల్పించాలి.108,104 సేవలను ప్రజలు మరచిపోలేరు.అలాగే అమ్మఒడి రాజన్న బాట పట్టాలి.దీర్ఘ కాలంలో ప్రజలకు మేలు చేస్తాయనుకున్న పధకాలు నిరంకుశంగా అమలు చెయ్యాలి.మీకు వెయ్యి రూపాయలు వ్యక్తిగత సాయం చేస్తామనే పధకంకంటే మీ స్కూల్లో ఇంకో గది కట్టిస్తామనే పధకమే మేలు.
---నూర్ బాషా రహంతుల్లా ,6301493266

6, జూన్ 2019, గురువారం

మాతృభాషతోపాటు ఆంగ్లం చాలు - హిందీ భారమెందుకు?

మాతృభాషతోపాటు ఆంగ్లం చాలు - హిందీ భారమెందుకు?
1632 భాషలున్న మన దేశంలో లక్ష మందికి పైగా మాట్లాడే భాషలు 33 ఉన్నాయి.60 శాతంమంది హిందీయేతర భాషలు మాట్లాడుతున్నారు. మిగిలిన 40 శాతంమంది  బ్రజ్‌భాష, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వీ వంటి 49 రకాల హిందీ యాసలు మాట్లాడుతారు. 
భాషా ప్రాతిపదిక మీద జాతుల విభజన అనే సూత్రాన్ని మన దేశం సోవియట్ నుండే స్వీకరించింది. అక్కడ రష్యన్ భాషా రుద్దుడు ఎలాంటి ఫలితాన్ని తెచ్చిందో ఇక్కడ హిందీని బలవంతంగా రుద్దడం కూడా అలాంటి ఫలితాన్నే తెస్తుంది.రష్యాలోని వివిధ భాషల పట్ల అవలంబించిన వివక్ష బలవంతంగా రష్యన్ భాషను ఇతర భాషలవారిపై రుద్దడం వంటి పనుల వల్ల, జాతీయ మైనారిటీలను స్టాలిన్ ఛిన్నాభిన్నం చేసినందువల్ల ఎక్కువ హాని జరిగిందని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చండ్ర రాజేశ్వరరావు పేర్కొన్నారు. సోవియట్ యూనియన్ లో 15 యూనియన్ రిపబ్లిక్కులు, 20 స్వయం ప్రతిపత్తి గల రిపబ్లిక్కులు, 8 స్వయం పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 130 భాషలున్నాయి.వందకు పైగా జాతులున్నాయి. 1917 అక్టోబర్ విప్లవంలో ఈ జాతులు విడిపోయి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకునే హక్కును లెనిన్ ప్రసాదించాడు. భాషా ప్రాతిపదిక మీద జాతుల విభజన సూత్రాన్ని మన దేశం సోవియట్ యూనియన్ నుండే స్వీకరించింది. నేటి వరకు హిందీని బలవంతంగా రుద్దడం కొనసాగుతూనే ఉంది.రేడియో, టీవీ, ప్రభుత్వ ఆఫీసుల్లో హిందీ ఆధిపత్యం సాగుతోంది.హిందీయేతర రాష్ట్రాల వాళ్ళు తమకు హిందీ వచ్చినా రాకపోయినా హిందీ వార్తలు వినాలి,హిందీ సినిమాలు సీరియళ్ళు చూడాలి. వినోదసాధనాలతో ఈ నిర్బంధం ఆగలేదు.మన తెలుగు రాష్ట్రాలలో కూడా బ్యాంకుల్లో,పోస్టాఫీసుల్లో ఫారాలు,ఎల్లైసీ పత్రాలు హిందీలో వస్తున్నాయి.    ఉత్తరాదిన కొంత ప్రాంతానికి పరిమితమైన హిందీ భాషను జాతీయ భాషగా చేయదలుస్తున్నారు. దేశంలోని మిగతా భాషలకు  కేంద్రం నుండి ప్రోత్సాహం కొరవడింది. సోవియట్ లో రష్యన్ భాష పట్ల పెల్లుబికిన అసంతృప్తి మన దేశంలో హిందీ పట్ల కూడా పెల్లుబుకుతుంది. కేంద్రం దీన్ని గమనించి మసలుకోవాలి.
కస్తూరిరంగన్‌ కమిటీ హిందీ పక్షపాతం   
హిందీయేతర రాష్ట్రాల్లో సైతం హిందీని కచ్చితంగా బోధించాలని  కస్తూరిరంగన్‌ కమిటీ సిఫార్సు చేసిందట. త్రిభాషా సూత్రాన్ని అమలుచేయాలని సూచిందట. ఇది హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దడమేనంటూ తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, కేరళ ఎదురుతిరిగితే  ఇది ముసాయిదా నివేదిక మాత్రమేనని, ఏ రాష్ట్రంపైనా బలవంతంగా హిందీని రుద్దబోమని కేంద్రం ప్రకటించింది.
1937 లో సి.రాజగోపాలాచారి మద్రాసులో హిందీని  తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెడితే నిరసనలు చెలరేగి  నటరాజన్‌, థలముత్తులు జైల్లోనే మరణించారు. అప్పుడు  హిందీ తప్పనిసరి కాదని ఉత్తర్వును 1940 లో ప్రభుత్వం  21న ఉపసంహరించుకుంది.హిందీని అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయడానికి మళ్లీ ప్రయత్నాలు జరగటం ,నిరసనలు చెలరేగాక ఉత్తర్వులు ఉపసంహరిం చుకోవటం మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి.
రాజ్యాంగం ప్రకారం దేశంలో మాట్లాడే ఏ భాషకూ జాతీయ హోదా లేదు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ, ఇంగ్లీషు భాషలకు మాత్రమే ఆ అవకాశం ఉంది.తమ  అధికారిక భాషను నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంది. 22 షెడ్యూల్డ్  భాషల్ని  అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రంపై ఉంది.కానీ కేంద్రం ఎప్పుడైనా హిందీకి తప్ప మరో భాషకు సహాయపడిందా?
దక్షిణాది వారి ఆందోళన
దేశానికి తమ హిందీ భాషే జాతీయ భాష కావాలని ఉత్తరాది నేతలు నిరంతరం కోరుకుంటున్నా రు. అప్పట్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి హిందీ భాషా పెత్తనాన్ని ప్రశ్నిస్తూనే ఉండేవారు. ఎన్‌జీ రంగా, వెంకయ్యనాయుడు  వంటి నేతలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. జన ఘోషకు స్పందించాల్సిన సర్కారీ యంత్రాంగం జన భాషకు పట్టం కట్టాల్సిందేనంటూ పట్టుపట్టిన ఎన్టీఆర్‌, దస్త్రం తెలుగులో రూపొందిస్తేనే సంతకం చేస్తానన్నాడు.ఫైలు తెలుగులో తెస్తేనే సంతకం పెట్టాడు.యదారాజా తధా ప్రజా అన్నట్లు అధికారులు తెలుగులో ఫైళ్ళను పరుగులెత్తించారు.తెలుగులోనే తీర్పులు వచ్చేలా గ్రామ న్యాయాలయాలను నెలకొల్పుతానన్నారు.ప్రజలు ఎంతగానో సంతోషించారు.ఇలాంటి నాయకులున్నప్పుడు స్థానిక భాషలు క్షేమంగా వర్ధిల్లుతాయి.
ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణాదిపై చెలాయించడానికే హిందీని రుద్దుతున్నారనేది దక్షిణాది వారి ఆందోళన. సంస్కృతం నుంచి ఉత్తరాది భాషలు పుట్టగా , దక్షిణాది భాషలు స్వతంత్రంగా అభివృద్ధి అయ్యాయి.మూలవాసులు ద్రావిడులు, మధ్య ఆసియా నుంచి ఉత్తరాదిలోకి ప్రవేశించిన ఆర్యులు దక్షిణాదికి వలస వచ్చారు.ఉత్తర, దక్షిణ భారతాల విభజన జరగాలి.దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రధాన కార్యాలయం చెన్నైలోనే ఉంది.హిందీ ప్రభావం వల్ల ద్రవిడ భాషల ఉనికి ప్రమాదంలో పడుతోంది. త్రిబాషా సూత్రమే పిల్లలపై అదనపు బరువు. మూడో బాష తాము ఇష్టమొచ్చింది నేర్చుకోవాలనేదీ మోసపూరితమే, అది దొడ్డిదారిన హిందీని తోయడమే.అందుకే తమిళనాడు దశాబ్దాలుగా ద్విభాషా సూత్రాన్నే అమలు చేస్తోంది.
మాతృభాషలోనే విజ్ఞాన బీజాలు
బాలల్లో మాతృభాషలోనే విజ్ఞాన బీజాలు నాటాలి. కానీ కస్తూరి రంగన్‌ కమిటీ  రో రెండు భాషల్నీ బోధించాలంటూ పిల్లలపై అదనపు బరువు మోపింది.  హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇంగ్లిషుతోపాటు ఆధునిక భారతీయ భాషల్లో ఒకదాన్ని ఎంచుకోవాలట. హిందీయేతర రాష్ట్రాల్లోనైతే  స్థానిక భాషతోపాటు హిందీ ఆంగ్లం బోధన సాగాలట. త్రిభాషా సూత్రం పేరిట హిందీని బలవంతంగా రుద్దే ఎత్తుగడ కదా ఇది? మాతృభాషతోపాటు జీవన నైపుణ్యాల మెరుగుదలకు ఆంగ్లం నేర్పితే సరిపోదా? మధ్యలో ఈ హిందీ ఎందుకు ?మన పిల్లలకు తెలుగే సరిగా రాదు,ఇంకా ఈ భాషల అదనపు బారమా ?ఆలోచన వికసించేదశలో తనభాష తనకు రాకుండా పసి మనసును పరాయి భాషలకు వశం చేయటం ప్రభుత్వాల పాపమే.
ఇంగ్లీషే జాతీయ భాష అన్నాయి కోర్టులు
సుప్రీం కోర్టులో చెలామణి అయ్యేదే జాతీయ భాష. ఆస్థాయి హిందీకి మాత్రమే కట్టబెడదామని ఉత్తరాది వాళ్ళ ప్రయత్నం.విద్యాలయాల్లో హిందీని ప్రవేశపెట్టగలిగారు గానీ న్యాయస్థానాల్లోకి హిందీనితీసుకు రావటం లో సఫలం కాలేకపోయారు.అందుకే మామూలు జనానికి హిందీ నేర్పుదామని బయలుదేరారు.ఇక్కడ ఎవరి భాషను వాళ్ళు తమ ప్రాంతంలోనే ప్రాభవం లోకి తెచ్చుకోలేక నానా తంటాలు పడుతుంటే మూడో భాష బరువునూ మోయటానికి ఒప్పుకుంటారా? భిన్నత్వంలో ఏకత్వ భావన,జాతి సమైక్యత, భాషాపర సఖ్యతల కోసం 1968లో  త్రిభాషా సూత్రం తెచ్చారు.హిందీ రాష్ట్రాలు మాత్రం ఆంగ్లంతోపాటు మరో  భారతీయ భాష ను నేర్వకుండా సంస్కృతాన్ని ఎంచుకున్నాయి. త్రిభాషా సూత్రం పనికిరాకుండా పోయింది.మూడు భాషల మోత కంటే జాతీయ భాషగా ఇంగ్లీషు నే చేసి నేర్చుకోవటం నయం కదా అంటూ భారతీయ జాతీయనాయకులు సైతం ఇంగ్లీషు వైపే మొగ్గారు.రాజ్యాంగమే ఇంగ్లీషులో రాశారు.హిందీ భాషా నేతలు విశ్వప్రయత్నం చేసినా అక్కడి హైకోర్టులు,సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు ఆభాషను న్యాయస్థానాల గడప దగ్గరే ఆపేశారు. అందరూ ఇంగ్లీష్ అభిమానులే.
లిపి మార్చటమే కుదరదన్నవారికీ ఇంకో భాషా? 
వత్తుల,గుణింతాల బెడదలేని ఆంగ్ల లిపి పిల్లలు అందరికీ దగ్గరఅయ్యింది.తమిళలిపి కూడా ఇంచుమించు అలాంటిదే.వేటూరి ప్రభాకరశాస్త్రి లాగా తెలుగు లిపిని  పిల్లలకు అక్షరాలను సులభతరంచేస్తూ సంస్కరించటానికి ఎవరూ పూనుకోలేదు.శ్రీశ్రీ కోరినట్లు ఇంగ్లీషు అక్షరాలను తెలుగు కోసం వాడుకునే అవకాశమూ ఇవ్వలేదు.జనమే ఆపనికి శ్రీకారం చుట్టారు. తెలుగును రోమన్ లిపిలో రాస్తున్నారు.కోర్టుల్లో న్యాయవాదులకు న్యాయమూర్తులకు ఈ లిపిని వాడుకొనే స్వేచ్చ ఇచ్చినా తెలుగు నిలబడేది.భాషమారటం కంటే లిపి మారటం కొంత నయం.భారతీయ భాషలన్నీ  ఆంగ్లలిపిలో అర్ధం కాకపోయినా కనీసం చదువవచ్చు. 
ఇంగ్లీషు తప్ప మరేభాషా హైకోర్టుల్లో వద్దన్నారు

హైకోర్టులో తమిళం వినియోగంపై చేసిన విన్నపాన్ని కేంద్రం తిరస్కరించిందని,మద్రాసు హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా వినియోగించేందుకు అనుమతించాలని తమిళనాడు శాసనసభ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలించాలని ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ పుష్ప కేంద్రప్రభుత్వాన్ని కోరారు.దానిపై స్పందిస్తూ స్థానిక భాషలను హైకోర్టుల్లో అధికార భాషగా ఉపయోగించడం ఆదర్శవంతంగా ఉంటుందని రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.అయితే అందుకు విస్తృతస్థాయిలో ఏకాభిప్రాయం అవసరమని వ్యాఖ్యానించారు.
2008 లో హిందీ నేతలు రాజ్యాంగం లోని ఆర్టికిల్ 248ని సవరించి హైకోర్టు,సుప్రీంకోర్టుల్లో హిందీ తీర్పులు తేవాలని ప్రతిపాదించారు.లాకమీషన్ దేశవ్యాప్తంగా నిష్ణాతులైన న్యాయమూర్తుల్ని సంప్రదించి ఇంగ్లీషులో తప్ప హిందీ లో గానీ ఇంకా ఏ ఇతర భారతీయ భాషలలో గానీ వాదనలు తీర్పులు కుదరవని ఏకగ్రీవంగా తీర్మానించింది.అందుకు లాకమీషన్ చెప్పిన కారణాలు :
భాష దేశ ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. భాష ప్రజలను ఐక్యపరుస్తుంది. ఎవరిమీదా ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడదు.ఉన్నతన్యాయస్థానాలలోని వాదనలు తీర్పులు మామూలుగా జరిగేది ఆంగ్ల భాష లోనే.భారతీయ న్యాయ వ్యవస్థ ఇంగ్లీషుకు అమెరికా న్యాయ పుస్తకాలకు అలవాటుపడింది. కాబట్టి ఉన్నత న్యాయమూర్తుల్ని ఇంగ్లీషుకే స్వేచ్ఛగా వదిలేయ్యాలి.ఒక రాష్ట్ర హైకోర్టు జడ్జి మరో ప్రాంతానికి బదిలీపై వెళితే ఆ రాష్ట్ర భాష నేర్చుకొని ఆ భాషలో తీర్పులివ్వాల్సివస్తుంది. అది చాలా కష్టం. జడ్జీలమీద అనేక భాషల భారం మోపకూడదు. వాళ్ళమీద ఏ భాషనూ రుద్దకుండా జడ్జీలను వాళ్ళ భాషకు వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయ్యాలి. దేశప్రజలందరూ తప్పక సర్వోన్నత న్యాయస్థానం తీర్పులిచ్చే ఏకైక భాష అయిన ఇంగ్లీషును అర్ధం చేసుకోక తప్పదు.అన్నీ కోర్టుల్లో ఇంగ్లీషే ఉంటే వివిధ భాషా ప్రాంతాలమధ్య న్యాయవాదుల కదలిక సులభం అవుతుంది.కోర్టుల్లో హిందీ అమలు కోసం కావాల్సిన చట్టపరమయిన నియమాలు నిబంధనలుమాత్రం ముందు ఇంగ్లీషులోనే చెయ్యాలి. దానికి అధి కారపూర్వకమైన అనువాదం చేసుకోవచ్చు.ఉన్నత న్యాయ స్థానాలను మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంగ్ల భాషను మార్చుకోమని అడగవద్దు”.
ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు తీర్పులు ఆశించగలమా?
రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి లాంటి పెద్దలంతా కక్షిదారుల భాషలోనే హై కోర్టుల్లో కూడా వాదనలూ తీర్పులు ఉండాలని చెబుతున్నారు కదా అన్న ధైర్యంతో 2017 లో రాజధాని ప్రాంత భూసమీకరణ   కేసులో తెలుగులో ప్రతివాదన తయారుచేసి తీసికెళితే హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది దానిని తీసుకోటానికే తిరస్కరించారు. ఎంత సవివరంగా రాసినా తెలుగులో రాస్తే హైకోర్టులో మీ  వాదన చెల్లదు అన్నారు.తెలుగులో ప్రతి వాదనా?అదీ హైకోర్టుకు ఎలా తెచ్చారు?అంటూ తెచ్చినందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంగ్లీషులో వాదించలేని నేను డిప్యూటీ కలక్టర్ పదవికి తగనని ఎగతాళి చేశారు. చివరికి నాతెలుగు ప్రతివాదాన్ని ఇంగ్లీషులోకి మార్చి ఇస్తేనే తీసుకున్నారు. హైకోర్టు స్థాయికి తెలుగు భాష ఇంకా వెళ్ళలేదు.మనము మన మాతృ భాషలను వదిలి ఆంగ్లానికి దాసోహమవటానికి సగం కారణం కోర్టులు,కోర్టులిచ్చే ఆంగ్ల తీర్పులే.ఇంగ్లీషు రాని వాళ్ళెవరూ కోర్టుల్లో పనికిరాని పరిస్తితి దాపురించింది.

దేశానికి ఆంగ్లమే దిక్కు అంటున్న న్యాయమూర్తులు కల్పించే ఇలాంటి అడ్డంకుల్ని అధిగమించి ప్రజల భాషలలో న్యాయస్థానాలు నడిచేలా చేయాలి.హైకోర్టుల్లో ప్రాంతీయ భాషలలో వాదనలు వినిపించేలా న్యాయవ్యవస్థతో సంప్రదింపులు లేకుండా కేంద్రమే ఓ నిర్ణయం తీసుకునేందుకు తగినన్ని అధికారాలను రాజ్యాంగం కల్పించిందని పార్లమెంటరీ సంఘం పేర్కొంది కాబట్టి ఇప్పటికైనా కేంద్రం ప్రాంతీయ భాషలు బ్రతకడం కోసం తనకున్న రాజ్యాంగ అధికారాలు వినియోగించుకోవాలి.ప్రాంతీయ భాషలలో తీర్పులు ఇవ్వాలని చట్టం చెయ్యాలి. న్యాయవ్యవస్థ హిందీగానీ,మరే భారతీయ భాషగానీ తనదరిదాపుల్లోకి రాకుండా తనను తాను కాపాడుకుంది.మిగతా సామాన్య జనం మీద మూడు భాషలభారం మోపుతుంటే న్యాయవ్యవస్థ మౌనం గా ఉంది. 
 జాతీయ భాష హిందీ కాదు ఇంగ్లీషే   
జాతీయ అనుసంధాన భాషగా హిందీ ఎప్పటికీ కాలేదని దశాబ్దాల చరిత్రే చాటుతోంది. దక్షిణ భారతంలోని కేంద్ర  కార్యాలయాలలో  హిందీవారం’, “రాత కోతలన్నీ హిందీలోనే “ అనే కార్యక్రమాలు విఫలమయ్యాయి.ఇది గ్రహించకుండా  దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో  హిందీని నిర్బంధంగా బోధించాలని చూడటం హిందీపాలకుల కుటిల పన్నాగాన్ని తెలియజేస్తోంది.   ఉత్తరప్రదేశ్ విద్యా సంస్థల్లో బోధన భాషగా ఆంగ్లాన్ని రద్దు చేసేసిన ములాయంసింగ్‌, ప్రభుత్వ వ్యవహారాల్లో ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీనే వినియోగించాలంటూ 1990లో ముఖ్యమంత్రిగా ఆదేశించారు. అది హిందీ రాష్ట్రం గనుక సరిపోయింది.అలాంటి పని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చెయ్యమని అడిగే వాళ్ళూలేరు ,అమలుచేసే వారూ లేరు.మీరు హిందీలో ఉత్తరం రాస్తే మేము తెలుగులో బదులిస్తామని కరుణానిధి లాగా కేంద్రాన్ని హెచ్చరించే నాయకులూ లేరు .తమిళనాట మైలురాళ్లపై ఉన్న హిందీ  అక్షరాలను చెరిపేసి తమిళంలో  రాసినట్లు తెలుగు వాళ్ళు రాయలేరు.ఆంధ్రులు అంత సౌమ్యులు.మరో భారాన్ని మోపినా ఆనందంగా మోస్తారు.
తెలుగునాట మూడో భాష కావాలా?  
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరిగా ఉండాలన్న ప్రతిపాదనను  వైఎస్‌ రాజశేఖర రెడ్డి వ్యతిరేకించారు.వాటిని అమల్లోకి తెస్తే హిందీ భాషా ప్రాంతాల అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందుతారని, హిందీయేతర  రాష్ట్రాల వారు నష్టపోతారన్నారు.ప్రజలు ఏ దేశంలో నివసించినా  వారి భాషలో,భాషతోనే బ్రతుకుతారు. భాషపోతే ప్రాణం పోయినట్లు ఉంటుంది. ఏ భాషా ప్రాంతం వారైనా మరో భాష పెత్తనాన్ని సహించలేరు. భాష అధికారానికీ, ఆధిపత్యానికీ చిహ్నం.ఆ అధికారం మరో భాషకు ఇవ్వరు. తమ భాషా సంస్కృ తులను ఆ భాష నాశనం చేస్తుందని భయపడతారు.తమ భాషను  కించపరుస్తున్నారనేది ఒక కారణాంకదా  తెలంగాణ విడిపోవటానికి ?తమ భాషపైనా, మాండలికంపైనా, సంస్కృతిపైనా ప్రజలకుండే మక్కువ అలాంటిది.పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులు సలహాలే కానీ  ఆదేశాలు కానప్పుడు విద్యాలయాల్లో హిందీని తప్పనిసరి చేయడంఏమిటి? హిందీని తప్పనిసరి చేస్తే ఇతర భాషల ప్రజలు నష్టపోరా?హిందీ నేర్చుకుతీరాలని ఇతరులపై ఒత్తిడి తీసుకు రావడం,హిందీ వస్తేనే ఉద్యోగం,హిందీలో రాణిస్తేనే పదోన్నతి,అంటే ఇతర భాషల వాళ్ళు సాహిస్తారా?  అసలు హిందీ వాళ్ళు ఎప్పుడైనా  మరో భారతీయ భాష నేర్చుకున్నారా?ఇతర భాషలను వాటి మానాన వాటిని ఎదగనిచ్చారా? హిందీ ప్రాంతాలలోకి ఇతరభాషల జనం ఉద్యోగాల కోసం  వలసలు పోయేలా చేశారు.దేశమంతా హిందీ వాళ్ళ వాణిజ్యం, వినోదం అల్లుకుపోయాయి. హిందీ చలనచిత్రాలు, టెలివిజన్‌ సీరియల్స్, హిందీ భాషను వ్యాప్తి చేశాయి. మరే భారతీయ భాషకూ ఈ అవకాశం లేదు.
ఉత్తరాది నాయకులకు హిందీ రాజభాషగాచేసి మిగతా భాషా ప్రాంతాలనూ ఏలాలన్న దురాశ,ఆదుర్దా మాత్రమే ఉన్నాయి. హిందీ జాతీయ భాష కాదు. 22 అధికార భాషల్లో అదొకటి మాత్రమే. 1965 కల్లా ఇంగ్లిష్‌ స్థానంలోకి  హిందీని తేవాలనే లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు. అనేక భాషల మనుషులు. అనేక మతాల మనుషులు.వారి సంస్కృతులు వేరు.వారి సంప్రదాయాలు వేరు. వారి మాటలను , పలుకుబడిని,భాషను,యాసను గౌరవించడం అవసరం.అధికారం వచ్చిందికదా అని ఒక్క భాషకే అన్నీ అవకాశాలూ కట్టబెడుతూ  పెత్తందారీ శాసనాలు చేస్తే ఇతర భాషల ప్రజలు ఎదురు తిరగరా? 
     ఇప్పటి దాకా ఇంగ్లీషు మీడియం కాన్వెంట్లతో పోటీ పడలేక తెలుగు పాఠశా లలు తెలుగు ప్రజలు,ప్రభుత్వాల దయవల్ల ఇంగ్లీషు పాఠశాలలుగా క్రమేణా రూపాంతరం చెందాయి.ఇక ఇప్పుడు హిందీ పాఠశాలలు గా కూడా వాటిని మార్చాలి.ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగల కాళ్ళు విరగదొక్కినట్లుగా మారుతోంది పరిస్తితి.సుప్రీం కోర్టు ఈ భాషా సమస్యను  మరో దేశ విభజన లాంటి  పెద్ద సమస్య కాకముందే  తనంతట తానుగా తీసుకొని పరిష్కరించాలి.
--- నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, 6391493266   

2, జూన్ 2019, ఆదివారం

ఇకపై తెలుగు మాధ్యమం లో చదువులు ఉంటాయా ?


                                  తెలుగు మాధ్యమం లో ఇక చదువు ఉండదా?
                 తెలుగు మాధ్యమం లో చదువుకు,ఉపాధికి ఏ పార్టీ అయినా హామీ ఇచ్చిందా ?
తెలుగుదేశం, వైసిపి పార్టీలు రెండూ కూడా ప్రాధమిక విద్యను ఇంగ్లీషు మాధ్యమానికి మార్చుతామని, తెలుగును ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంచుతామని తమ మ్యానిఫెస్టోలలో ప్రకటించాయి.కానీ ప్రాధమిక విద్యను తెలుగు మాధ్యమం లో ఉంచి ఇంగ్లీషు ను ఒక సబ్జెక్టుగా మాత్రమే నేర్పాలని తెలుగు భాషాభిమానులు కోరుతున్నారు. మన రాష్ట్రం లో పోయిన సంవత్సరం 9 వేల ప్రాధమిక పాఠశాలల్ని ఆంగ్లమీడియం లోకి మార్చారు. ఈ సంవత్సరం మిగిలిన 40 వేల పైచిలుకు ప్రాధమిక పాఠశాలల్ని ఆంగ్ల మీడియం లోకి మార్చబోతున్నారు.ఇకమీదట అన్నీ ఆంగ్లమాధ్యమపాఠశాలలే ఉంటాయి. ఎందుకంటే  విద్యార్ధుల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం పై మక్కువ చూపుతున్నారట. ఈ ఒక్క కారణం చూపుతూ ఇప్పటిదాకా కొన  సాగిన తెలుగు మాధ్యమాన్ని మూల దశలోనే లేకుండా తీసి పారేస్తున్నారు .బ్రతుకుతెరువుకు  పనికివచ్చే వృత్తి విషయాలను తెలుగులో బోధించకుండా కవిత్వాలు పద్యాలు కధలు ఉండే  తెలుగును  ఒక సబ్జెక్టుగా మాత్రమే బోధిస్తా రట.విద్యార్ధులకు అటు తమ భాషను రానివ్వకుండా, ఇటు స్వేచ్చగా అనుమానాలు  నివృత్తి చేసుకోనివ్వకుండా ఇదేమి చదువు? ఇది పిల్లల మాతృభాషను మార్చటం కాదా?మరో భాషలోకి వలస తీసికెళ్ళటం కాదా?  

సివిల్స్ లో సత్తాచాటిన తెలుగు తేజాలకు సన్మానం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.ఇది మంచి సంప్రదాయమే.
కానీ తెలుగులోనే డిగ్రీ దాకా చదివి ,తెలుగు మాధ్యమం లోనే సివిల్స్ పాసైన అభ్యర్ధులకు ఘనసన్మానం చెయ్యాలి. తెలుగు మాద్యమం ద్వారా పరీక్షల్లో నెగ్గే పద్దతుల్లో నైపుణ్యశిక్షణ ఇప్పించాలి.
తెలుగు మాధ్యమం లో చదివిన వారికి ప్రోత్సాహకాలు రిజర్వేషన్లు ఇవ్వాలి.  
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా దేశ భాషలకు స్వాతంత్య్రం రాలేదు. మాతృభాషలో విద్య ఉంటే, స్వరాజ్యం ఎప్పుడో వచ్చేది అన్నారట గాంధీజీ. భాషా చాతుర్యం ఉంటే ఎంతటి క్లిష్టమైన వ్యవహారాలనైనా అవలీలగా పరిష్కరించుకోవచ్చు.చెప్పాలనుకున్న విషయాలు సాఫీగా చెబుతూ నదీ ప్రవాహంలా ముందుకు సాగేది మాత్రుభాషే. ప్రపంచ భాషలను శాసిస్తున్న ఆంగ్లం కూడా ఎన్నెన్నో పరభాషా పదాలను తనలో ఇముడ్చుకొని నేడీ రూపం తీసుకొంది. ఇంగ్లీషు ఎప్పటికప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇముడ్చుకోవటమేకాక విశ్వవ్యాప్తంగా విద్యాలయాలను సమకూర్చుకొని విద్యార్ధులకు నేర్పుతూ ప్రపంచ భాష గా ఎదిగింది. నాలుగు మాటలు ఇంగ్లీషు కలవకుండా తెలుగులో మాట్లాడే పరిస్థితి నేడు మనకు లేదు. మన పిల్లలు పై స్థాయిలోకి వెళ్లడానికి, బాగా చదవడానికి ఇంగ్లీషు మీడియం చదువులే మంచివన్న అభిప్రాయానికి తల్లిదండ్రులు , ప్రభుత్వాలు వచ్చేశాయి. ఇక్కడి భాషతో ఇక్కడే బతకవచ్చన్న భరోసా ఎప్పుడు ఏర్పడుతుంది?  మాతృభాష బువ్వ పెడుతుందన్న విశ్వాసం ఎలా వస్తుంది?
ఇంట్లో తెలుగు - బడిలో ఇంగ్లీషు
మనిషి మాతృభాషలో ఆలోచిస్తాడు. మన ఊహకూ, కాల్పనికశక్తికీ, నూతన సృజనకూ మూలం మాతృభాషే. మాతృభాషగా తెలుగు మన ఇళ్ళల్లో ఇంకా బ్రతికే ఉంది.ఇంట్లో తెలుగు - బడిలో ఇంగ్లీషులా ఉంది మన జీవితం.. మన పిల్లలకు నేర్పే చదువు కూడా తెలుగు మాధ్యమంలోనే ఉండాలని కొందరు అడుగుతున్నారు. మాతృభాషను విస్మరించి పరభాషకు పట్టం ఎందుకు కడుతున్నారు అంటే ఉద్యోగాలు పరభాష లోనే దొరుకుతున్నాయి కాబట్టి. మన పిల్లలకు మాతృభాషలో కనీసం ప్రాధమిక విద్య లేకపోవడం వల్ల పిల్లల్లో సృజన పోయింది.అందుకే చాలా మంది ఇంగ్లీషు మీడియం లో చదివిన యువకులు , నాయకుల పిల్లలు  తెలుగులో తప్పులు మాట్లాడుతున్నారు.
 మన దేశం లో నేడు 60 శాతం విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారు. ఎన్నోప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు ఆంగ్లంలోకి మారాయి.ప్రజలు కూడా ఈ మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు మాధ్యమానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవు. ఆంగ్లమాధ్యమం వల్ల కొందరు విద్యార్ధులకు విదేశాలల్లొ ఉద్యోగాలు  దొరకవచ్చేమో కానీ, రాష్ట్ర  ప్రజల భాషా సాహిత్యాల  భవిష్యత్తును అది నాశనం చేస్తుంది. విద్యార్థులు కూడా పరభాషా మాధ్యమం వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.న్యాయం,  వైద్యం, ఇంజినీరింగ్‌, భౌతిక రసాయన శాస్త్రాలన్నీ తెలుగులో నేర్పగలగాలంటే   మాతృభాషలోనే ఆ సాంకేతిక సమాచారమంతా లభించేలా పదసంపద ఎప్పటికప్పుడు పెరగాలి.ఇందుకు గాను తేలికగా అర్ధమయ్యే ఇంగ్లీషు పదాలను కూడా తెలుగు పుస్తకాలలోకి తీసుకోవాలి.
ప్రోత్సాహకాలతోనే తెలుగు వృద్ధి
తెలుగు మాధ్యమంలో చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలుగులో పరీక్షలు రాసేవారికి 5 శాతం మార్కులను అదనంగా కలిపినా, తెలుగు మాధ్యమంలో డిగ్రీ వరకు చదివిన పిల్లలకు మొత్తం ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించినా తెలుగు భాషకు గొప్ప మేలు జరుగుతుంది. నానాటికి నీరసించి పోతున్న భాషకు బలవర్ధక ఔషధాలు ఇవ్వాలి కానీ అసలు ప్రోత్సాహకాలేమీ ఇవ్వకూడదు అని కొందరు తెలుగు వాళ్ళే వాదిస్తుండటం విచిత్రంగా ఉంది. బలహీనవర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎక్కదీసుకొచ్చినట్లే మన మాతృభాషలకు కూడా ప్రోత్సాహకాలిచ్చి బలపరచాలి, బ్రతికించాలి. డబ్బురాని విద్య దరిద్రానికే అంటారు. ఏ ఉద్యోగమూ రాక ఎందుకూ పనికిరాక పోయేటట్లయితే తెలుగులో ఎవరు చదువుతారు? ఎందుకు చదువుతారు? తెలుగు చదవడాన్ని పెంచాలంటే ప్రోత్సాహకాలు కూడా ఉండాల్సిందే.

1985 పరీక్షల వరకూ తెలుగు మీడియం అభ్యర్ధులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కుల పునరుద్ధరణకోసం ప్రభుత్వం అసలు కోర్టులో ప్రయత్నమే చేయలేదు. ప్రోత్సాహక మార్కుల కేసులో దీటుగా ఎదుర్కొని వాదించగల తెలుగు న్యాయవాదిని నియమించి మార్కుల పునరుద్ధరణ జరపాలి. ప్రజల భాషకు వ్యతిరేకంగా తమిళనాడులో ఎవరైనా న్యాయస్థానాలకు వెళితే ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొంటున్నట్లుగా మన ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకోవాలి. విషయం కోర్టులో ఉందన్న సాకుతో తెలుగు విద్యార్థులకు ప్రోత్సాహకాలు ప్రకటించటాన్ని మరచిపోకూడదు. 5 శాతం అదనపు మార్కులను ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది.

తెలుగు మాధ్యమం వారికన్నా ఇతర మాధ్యమాల వారు ఉద్యోగాలకు జరిగే పరీక్షల్లో చాలా ఎక్కువ మార్కులు ఎందుకు తెచ్చుకొంటున్నారు? పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టే కుటుంబాలు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమానికే ఎందుకు పంపుతున్నాయి? ఆంగ్ల మాధ్యమ పంతుళ్ళ స్థాయిలో తెలుగు మాధ్యమ పంతుళ్ళకు కూడా జీతాలు ఇవ్వగలిగితే తెలుగు విజ్ఞానులు తెలుగునేలపైనే నిలబడతారు. తెలుగులో పోటీ పరీక్షల పుస్తకాలు వెల్లువెత్తుతాయి. తెలుగులో చదివితే కొన్ని ప్రోత్సాహకాలు కూడా
 ఉన్నాయనే ధీమా ప్రభుత్వం కల్పించక తప్పదు. ప్రజలు ఏ పనికైనా ప్రయోజనం ఆశిస్తారు. ప్రజల పక్షాన ప్రభుత్వం ఉంటే ప్రజలూ ప్రభుత్వాన్ని నిలుపుకుంటారు.మనిషి ఆశాజీవి. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి చేరతాడు. తెలుగు విద్యార్థుల్ని కాపాడుకోవటం ద్వారానే తెలుగును రక్షించుకోగలం. ఈ మర్మాన్ని గ్రహించే తమిళనాడు ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లు తమిళ విద్యార్థులకు కల్పించింది. అక్కడ ఎలా సాధ్యమయ్యిందో కనుక్కొని అదే పద్ధతి ఇక్కడ మనమూ అనుసరించాలి. అప్పుడు ఆంగ్ల మాధ్యమం వాళ్ళు కూడా తెలుగు మాధ్యమంలో చదవడానికి తరలివస్తారు. తమిళనాడులో నివసించే విద్యార్థులు తమిళంలో చదవక తప్పదు అని దివంగత ముఖ్యమంత్రి జయలలిత హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్‌కు అసెంబ్లీలో తెగేసి చెప్పారు. అక్కడ రాని పెను ప్రమాదం ఇక్కడ ఎందుకు వస్తుంది? భాష విషయంలో తమిళనాడునే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రాష్ట్రం తమిళాన్ని అభివృద్ధి చేసుకోటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలూ అన్వేషించి సఫలమయ్యింది. అందువలన పై ప్రతిపాదనలకు తోడు ఉద్యోగ నియామక పరీక్షలలో తెలుగును ఒక కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టాలి. ఈ నియమం వల్ల అభ్యర్థులు తెలుగు మాధ్యమంలో చదివి తెలుగు బాగా నేర్చుకొని పాస్ కాక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగు తప్పనిసరి కావాలి. ప్రభుత్వోద్యోగులు ప్రజల దగ్గరకు వెళ్ళాలి, వారి సమస్యలు వినాలి, వారికి అర్థమయ్యేట్లు పరిష్కార మార్గాల గురించి వారి భాషలోనే చెప్పాలి. కాబట్టి వారికి తెలుగులో పరిజ్ఞానం ఉండాల్సిందే.
ఇంట గెలిచి రచ్చ గెలవాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి. అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి. ఆంగ్లం వాడకూడదు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు, రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లం ఉపయోగించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు, అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి. అన్ని శాసనేతర అవసరాలకు ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనే ఉపయోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, నియమాలు, నిబంధనలు, ఉపవిధులు అన్నీ కూడా తెలుగు భాషలోనే ఉండాలి. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, సముదాయాల బోర్డులు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ నామఫలకాలు, శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనే రాయించాలి. తెలుగు మన ప్రజల భాష. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆరు నెలల్లో తెలుగు నేర్చుకోవాలి. తెలుగులో సంతకం పెట్టాలి. తెలుగులో నోట్స్ రాయాలి. తెలుగు పిల్లలు తెలుగులోనే ఎందుకు వెనుకబడి ఉండాలి? మాతృభాషలో వెనుకబడేవాళ్ళు అన్ని భాషల్లోనూ వెనుకబడే ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మాతృభాషకు ఇచ్చే ప్రోత్సాహకాల
 పైన ఇక ఎవరు న్యాయస్థానాలకు వెళ్ళకుండా చట్టంలోనే నియమం పెట్టాలి.
తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు
ఎట్టకేలకు 10.7.2018 న తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటుకు జీవో నంబరు 40 వెలువడింది. అందులో 7 భాగాలలో కార్యాలయాలలో తెలుగు భాషాభివృద్ధికి చేయవలసిన పనులు,చేయకపోతే వేయవలసిన జరిమానాలతో సహా ఎన్నో నియమాలున్నాయి.ఈ జీవో ప్రకారం తెలుగులో ఫైళ్ళు నడిపే ఉద్యోగులకో మద్దతు దొరికింది.కొన్నిజీవోలు కూడా తెలుగులో వస్తున్నాయి.ముఖ్యంగా 7వ భాగంలో నిబంధనలు ఇలా ఉన్నాయి: 1. సంస్థ బోర్డులు తెలుగులో పెట్టని యజమానికి రూ.50000 జరిమానా 3 నెలల జైలు,2.శంకుస్థాపన ,ప్రారంభోత్సవాల శిలాఫలకాలు తెలుగులో ఏర్పాటు చెయ్యని శాఖాధిపతులకు రూ.10000 జరిమానా 3.ప్రజలతో ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో జరపని ఉద్యోగికి రూ.5000 జరిమానా ,4.అధికార భాషగా తెలుగు ఎలా అమలు అవుతుందో సమీక్షించని శాఖాధిపతికి రూ.5000జరిమానా 5.ప్రజలతో జరిపే కార్యకలాపాలలో తెలుగు భాష ఉపయోగించని ఉద్యోగికి రూ.10000 జరిమానా 6. తెలుగు పాఠ్యాంశం గా గాని,బోధనా మాధ్యమంగా గాని అమలు చేయని విద్యాసంస్థాధిపతికి రూ.50000/ జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షను విధించవచ్చు.ఇవి ఖచ్చితంగా అమలు చేస్తే తెలుగు వ్యతిరేకులు దారికొస్తారు ,తెలుగు వ్యతిరేక వాతావరణం తగ్గుతుంది.
 తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు
డిగ్రీ తెలుగు మాధ్యమం లో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఆనాటి మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, భూమా అఖిలప్రియ వాగ్ధానం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇంగ్లీషు మీడియంలోనే ప్రవేశపెడతామన్నారు. ఇంగ్లీషు మీడియం లేకపోవటం వల్లనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయనీ, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదనీ ఉభయ రాష్ట్రాల్లో చర్చ నడుస్తున్నది. మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దుచేస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.మరోవైపు రాష్ట్ర మంత్రీ నారాయణ  తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఉద్యోగాలు రావని, ఇంగ్లీషు మాధ్యమంలోనే ఉద్యోగాలొస్తాయని, మున్సిపల్‌ పాఠశాలలన్నింటిలో తెలుగు మాధ్యమం తీసేసి ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెడతామని  ప్రకటించారు. ఎవరిమాటలు నమ్మాలి? ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను నేర్చుకొనే అవకాశం కోల్పోయి మరోసారి స్వాతంత్ర్యాన్ని కోల్పోయాము. గత్యంతరంలేక పరాయి భాష లోకి తప్పనిసరై కావాలనే మన పిల్లల్ని నేడుతున్నాము. తెలుగులోనే పరీక్షలు రాసి, ఆ భాషలోనే ముఖాముఖిలో పాల్గొని, కేంద్రప్రభుత్వ అధికారులుగా ఎంపికైనవారు ఎంతమంది లేరు?అలా మాతృభాష ద్వారా ఉద్యోగాలను సాధించే స్థాయికి మన పిల్లలను తీసుకెళ్ళాలని మన నాయకులు కూడా కోరుకోవాలి కదా?
సర్వీస్ కమీషన్ ఉద్యోగాలలో తెలుగు మాధ్యమం ద్వారా డిగ్రీలు చేసిన వారికి ఎన్ని దక్కుతాయి?ప్రజల భాషకు పరిపాలనలో పట్టం కడతామనే నాయకుల వాగ్దానాలు రెండు రాష్ట్రాల్లోనూ వినబడుతున్నాయి.తెలుగును ఉపాధి వనరుగా మార్చాలని అందరూ కోరుతున్నారు.కొందరైతే ప్రజల భాష పదికాలాలపాటు పాలించాలని తపిస్తున్నారు కూడా.తెలుగు విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందేలా చెయ్యాలి మన  ప్రజా సేవ (పబ్లిక్ సర్వీస్)  కమీషన్లు. 
1985 వరకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షల్లో తెలుగు మీడియం డిగ్రీ విద్యార్థులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులు హై కోర్టు తీర్పుతో ఆగిపోయాయి.ప్రభుత్వం హై కోర్టులో అప్పీల్ చేసి మార్కుల పునరుద్ధరణకు ప్రయత్నించాలి. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి. తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే అభ్యర్ధులకు దారి ఇవ్వాలి.  ఆఫీసుల్లో తెలుగు బ్రతకాలి. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగాలు రావాలి. మన పిల్లలు తెలుగులో చదవాలి.  తెలుగు అధికారులు తెలుగులో కార్యాలయాలు నడపాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి.అప్పుడు జనం తండోపతండాలుగా తెలుగులో చదువుతారు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్ధులకు సర్వీసుకమీషను పరీక్షల్లో రిజర్వేషన్లు , ప్రోత్సాహక మార్కులు  తిరిగి ఇప్పించటానికి కృషి చేస్తామని 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇచ్చిన హామీపై జీవోలు ఇవ్వాలి.
తెలుగు భాషలో సాధికారత ఏదీ?
ఎవరి భాషలో వారికి విద్యను బోధిస్తేనే ప్రయోజనమన్నారు
 గిడుగు రామమూర్తి.  బడి పలుకుల భాష కంటే పలుకుబడుల భాషే అవసరమని కాళొజీ చెప్పారు.అసలైన పురోగతి మాతృభాషతోనే సాధ్యమని గాంధీజీ వాదించారు.   అమ్మభాషలో బోధన విద్యార్థి సృజనను ఎంతో పెంచుతుందని విశ్వకవి రవీంద్రుడు భావించాడు.ఇవేవీ పట్టించుకోకుండా ఇంగ్లీషులో మాత్రమే నేర్పుతున్న చదువు పిల్లలకు భారంగా మారింది. కళాశాల విద్య అర్థం కావటం లేదు.పనిమీద ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారికి అక్కడ ఏమి జరుగుతుందో తెలియటం లేదు. న్యాయస్థానాల్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో, అక్కడ జరుగుతున్నప్రక్రియ కక్షిదారులకు అంతుపట్టడం లేదు. ఇటు సొంత తెలుగు భాష చెల్లక, అటు పరాయి కోర్టు భాష సాంతం తెలియక,ఎంతకీ అవగతం కాక అవస్థ పడుతున్నారు. సొంత భాషలో చెప్పుకోలేను, పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను' అన్నట్లు మారింది పరిస్తితి. అర్ధమైనా కాకపోయినా ప్రతి విషయం ఇంగ్లీషులోనే చెప్పుకోవాల్సి వస్తోంది.మాతృభాషలో స్వేచ్ఛగా మాట్లాడే భాగ్యాన్నిపోగొట్టుకున్నాం. సొంత  మాటలను,పదసంపదను పోగొట్టుకొని మూగవాళ్ళలాగా బ్రతుకుతున్నాం.భాషా దారిద్య్రం, భావ దారిద్ర్యం   రెండూ మన ప్రజల్ని బాధించేలా మన పాలనా,విద్యా,న్యాయ రంగాలను తయారు చేశారు.
భాషా ప్రయోజనాల్ని అందరి దరికీ చేర్చే బాధ్యత ప్రభుత్వానిది. తెలుగునాట తెలుగు భాషాబోధనను నిర్బంధం చేయాలి. ప్రాథమిక దశ నుంచి ఉన్నత పాఠశాల చదువు ముగిసే పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే బోధించాలి. పాఠ్యపుస్తకాల్ని పిల్లలందరికీ బాగా అర్థమయ్యేలా రూపొందించాలి.
కన్నడ భాషాబోధనను అక్కడి ప్రభుత్వం ఉన్నత పాఠశాలదాకా నిర్బంధం చేసింది. కర్ణాటకలో పనిచేసేవారికి ఆ భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలని తేల్చిచెప్పింది. తమిళనాడులో మాతృభాషలో చదివితేనే అక్కడ ఉద్యోగాలిస్తారు, మలయాళ భాష, సంస్కృతిని పదిలపరచుకొనేందుకు అక్కడ ప్రత్యేకంగా ప్రాధికార సంస్థ ఏర్పాటైంది. ఒడిశా, గుజరాత్‌, పశ్చిమ్‌ బంగ, మహారాష్ట్రల్లోనూ చదువుల్లో, ఉద్యోగాల్లో అక్కడి మాతృభాషలకే పెద్దపీట వేస్తున్నారు.
ఆంగ్లంలోని గ్రంథాల్ని ఇజ్రాయెల్‌ తన భాషలోకి కొద్దికాలంలోనే తర్జుమా చేసుకొంది. అత్యాధునిక పరిజ్ఞానానికి సంబంధించిన ఏ పదమైనా వెంటనే స్వీడన్‌ భాషలోకి అనువాదమవుతోంది
 ఉన్నత న్యాయ స్థానాలలో తెలుగు కనీసం ప్రవేశిస్తుందా?
మన పాఠాల్లో ఉన్నతెలుగుఎంత? ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో తెలుగు మాయమవుతోంది! మార్కులకు పనికిరానిసబ్జెక్టుగా మిగిలిపోతోంది. తమిళనాడులో సెంట్రల్‌ సిలబ్‌సలోనూ తొమ్మిదవ తరగతి వరకు తమిళం తప్పనిసరిగా బోధించాల్సిందే.తెలంగాణలో పాఠశాల నుంచి జూనియర్‌ కళాశాల వరకు ఒక బోధనాంశంగా తెలుగు ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. తెలుగును బోధించే విద్యాలయాలకు మాత్రమే తెలంగాణలో అనుమతి దక్కుతుందన్నాడు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నామఫలకాలపై తెలుగు విధిగా కనిపించాలన్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏమిటి పరిస్థితి?
హైకోర్టులో తెలుగు వాదన పనికిరాదు పొమ్మన్నాడో ప్రభుత్వ న్యాయవాది. 1952 లో తెలుగు భాష పేరుతో మన రాష్ట్రం ఏర్పడింది.భాషా ప్రయుక్త రాష్ట్రాలలో మనదే మొదటి రాష్ట్రం.భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? తెలుగు రాష్ట్రాన్ని తెలుగులోనే పరిపాలించటం. గత 66 సంవత్సరాల సుధీర్గ కాలంలో తెలుగు పాలన సిద్ధించిందా? ఏమి ఆశించి భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాలు ఈనాటికీ నెరవేరకపోగా భవిష్యత్తులో కూడా ప్రజల భాషలో పాలన నడుస్తుందనే ఆశలుకూడా వదులుకోవాలనే హెచ్చరికలు వస్తున్నాయి. అసలు పాలించటానికి మీ భాష బ్రతికి ఉంటుందా అనే సవాళ్ళు నిత్యమూ ఎదురవుతున్నాయి. తెలుగు జనమే ఇంగ్లీషు కాన్వెంట్లకు ఎగబడుతుంటే తెలుగు బడులు నిలుస్తాయా తెలుగులో ఫైళ్ళు నడుస్తాయా అని పరిహాసాలు ఆడుతున్నారు. తెలుగు జాతి మనది- నిండుగ వెలుగు జాతి అనే పాటను తెలుగు జాతి మనది- రెండుగ వెలుగు జాతి అని పాడుకుంటున్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు, దిగువ కోర్టుల్లో న్యాయపాలన అంతా మాతృభాషలోనే సాగేందుకు వీలుగా రెండు హైకోర్టులూ సాయపడాలని వేడుకుంటున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు అన్ని కోర్టుల్లో కూడా ఆంగ్లానికే ఆదరణ దొరుకుతోంది.ఎన్నో అవాంతరాలున్నా తెలుగులో తీర్పులు ఇచ్చి కొందరు న్యాయమూర్తులు సాహసోపేతమైన శ్రమ చేశారు. 
తెలుగు జాతీయ భాష కావాలి
జాతీయ భాష కాగల అర్హత తెలుగుకే ఉందన్నాడు జేబీ హాల్డెన్‌ .నిజమేననుకొని సంబరపడ్డాం. కానీ ప్రాంతీయభాషగా కూడా నిలదొక్కుకోలేక ఈనాడు తెలుగు తల్లడిల్లుతోంది.ఉపాధి కోసం జనం కూడా ఆంగ్లం మోజులో పడి కొట్టుకుపోతున్నారు.తెలుగు సొంతగడ్డపైనే మనుగడ కోల్పోతున్నది. పిల్లల మానసిక ఎదుగుదలకు మాతృభాష ఎంతో కీలకం.పాఠశాలల్లో పదవ తరగతి వరకు విధిగా తెలుగు మాధ్యమంలోనే బోధన సాగాలి. ప్రతి బడీ అమ్మ భాషకు గుడి అయినప్పుడే పిల్లలకు సొంత భాష వస్తుంది. మాతృభాషలోనే అన్నివిషయాలూ నేర్చుకున్న పిల్లలే తమ సొంత భాషలో పాలన చేయగలుగుతారు.
ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషల్లో తెలుగుది ఆరోస్థానం.మన ప్రజల నాలుకలపై అది నిత్యం నడయాడాలంటే ,మన పిల్లలు తెలుగు నేర్చుకోవాలి. మాతృభాష కళ్లు అయితే, పరాయిభాష కళ్లజోడు అన్నాడు అన్నాదురై. తమిళం,మరాఠీ, కన్నడ బోధనలను తప్పనిసరి చేస్తూ అక్కడ గట్టి చట్టాలు చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో తెలుగును రాష్ట్ర భాషగా గుర్తిస్తూ 1966లోనే అధికార భాషా చట్టాన్ని చేశారు.అధికార భాషా సంఘం ఏర్పాటయ్యింది.తెలుగు రాష్ట్రం అన్న పేరేగాని చట్టసభల్లో, పాలన వ్యవహారాల్లో, పాఠశాలల్లో,తెలుగు అమలు లేదు. ప్రభుత్వ పాలన కూడా తెలుగులో జరగాలని పాలకులు ఆశిస్తున్నారో లేక ఆశిస్తున్నట్లు నటిస్తున్నారో అని అనుమానం కలుగుతోంది.కాబట్టి శాసన నిర్మాణ క్రతువులో, పాలన వ్యవహారాల్లో తెలుగును తప్పనిసరి చేయాలి. రాష్ట్రపతి కోవింద్‌ కోరినట్లు కక్షిదారుల భాషలోనే హైకోర్టు తీర్పులుండాలి.శాసన, కార్యనిర్వాహక, న్యాయవిభాగాలన్నిటిలో తెలుగు రాజ్యమేలాలి . రాజ్యసభలో హరికృష్ణ తెలుగులో మాట్లాడారు.నాకు అర్ధంకావటంలేదని,ఇంగ్లీషులోనో హిందీలోనో మాట్లాడాలని వెటకారంగా మాట్లాడిన డిప్యూటీ చైర్మన్ కురియన్ కు అనువాదకుల్ని పెట్టుకోవటం మీబాధ్యత అని గట్టిగా బుద్దిచెప్పారు.తన మాతృభాషలో మాట్లాడే స్వేచ్చ ప్రతి సభ్యుడికీ ఉందని వెంకయ్యనాయుడు వెనకేసుకొచ్చారు. తెలుగును వదిలి పిల్లల్ని ఇంగ్లీషులో చదివించేది ఉపాధికోసమే అని అందరికీ తెలుసు.అందుకని మాతృభాషలు వదిలెయ్యాలా? ఎన్ని భాషలు వస్తే అంత మంచిది.ఎవరి భాషలో వారిని మాట్లాడనివ్వాలి.తెలుగులో మాట్లాడొద్దు అనటం ఏమిటి?తెలుగులో మాట్లాడొద్దని పిల్లల మెడలో పలకలు వేలగట్టిన స్కూళ్ళకూ రాజ్యసభకూ తేడా ఏమిటి?ఇది తెలుగు భాషకు అవమానమే.మాతృభాషలో మాట్లాడటానికి ముందుగా పర్మిషన్ తీసుకోవాలని నియమం పెట్టటంలోనే హిందీ వాళ్ళ అహంకారం ఉంది. 30 ఏళ్ళ క్రితం ఎన్టీరామారావు గారి పాలనలో తెలుగులోనే సచివాలయం నుండి నాకు  జవాబు ఇచ్చారు. జన భాషలోకే పాలన రావాలంటే ఎప్పటికప్పుడు ఆ భాషకు మరిన్ని ఆర్ధిక సాంకేతిక సౌకర్యాలు సమకూర్చాలి. ఉపాధి అవకాశాలు పెరగాలి . రాజకీయ శక్తులూ దన్నుగా నిలవాలి.
సాహిత్య అకాడమీలు,అధికారభాషా సంఘాలు    
తెలంగాణాలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లోనూ, ఇంటర్మీడియట్‌లోనూ బోధించవలసిన తెలుగు పాఠ్యాంశాలను నిర్ణయించే, పుస్తకాలను ముద్రించే బాధ్యత సాహిత్య అకాడమీది.ప్రభుత్వ, ప్రైవేటు భేదం లేకుండా ఒక తరగతి పిల్లలందరూ అవే పాఠ్యాంశాలను చదువుతూ భాషను సవ్యంగా, సక్రమంగా ఏకరీతిన అలవర్చుకోవాలని ఈ నియమం పెట్టారు.ప్రైవేటు విద్యాలయాల దయవల్ల పాఠశాలల్లో పదవతరగతి వరకూ తెలుగును తప్పనిసరి కాలేదు. మాధ్యమంగా ఐదోతరగతి వరకూ తెలుగును తేలేకపోయారు.ఇంగ్లీష్‌ మాధ్యమం ప్రజలే కోరుతున్నారన్నారంటూ నాయకులే వాదిస్తున్నారు.వారే ఇంగ్లీషు మీడియం కాన్వెంట్లు,స్కూళ్ళు,కాలేజీలు నడుపుతున్నారు.వాళ్ళ పిల్లల్ని విదేశాలలో ఇంగ్లీషు చదువు చదివిస్తున్నారు. అసలు మాతృభాషకోసం ఎలాంటి ఆశయం లేనప్పుడు భాషోద్ధరణకు వాగ్దానాలు ఇవ్వటం , చట్టాలు తేవటం ఎందుకు?ఎవరికోసం?
మాయమాటలు  
పాలకుల్లో మాతృభాషాభిమానం మచ్చుకైనా లేదు. అధికార శ్రేణులకు తెలుగుపట్ల చిన్నచూపు చెప్పనలవికాదు.తెలుగును అధికార భాషగా ప్రకటిస్తూ 1966లో చేసిన శాసనానికి 39 సంవత్సరాల తరవాత తీరిగ్గా 2005లో చట్టబద్ధ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలుగురాష్ట్రాల్లో ఉన్న తొమ్మిదికోట్లమంది తెలుగువారికి సేవలందించవలసిన లక్షలాదిమంది ఉద్యోగులు వాస్తవానికి తెలుగులోనే పనిచేయవలసి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు వారి భాషలోనే పనులు చేసిపెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన, అధికారులపైన ఉన్నది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ విధిగా తెలుగుభాషలోనే సాగించాలనేగా భాషాదినోత్సవాలలో పాలకులు మాట్లాడేది? మరి ప్రజలలో ఈ ఇంగ్లీషు మోజు పెంచేది ఎందుకు? పైశాచిక భాషానువాదాలతో తెలుగు అంటేనే ప్రజలు ఠారెత్తిపోయేలా బ్యూరోక్రసీ కసిగా వెలగబెట్టిన నిర్వాకాలు ఎన్నో !
తెలుగు భాషకు ప్రాచీన హోదా
2008లో తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చింది. తెలుగు ప్రాచీన భాషా పీఠాన్ని ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలోకి తరలించనేలేదు. కేంద్రం నుంచి 2008–2019 వరకు సంవత్సరానికి 100 కోట్లు చొప్పున ప్రాచీన హోదా నిధులు మనకు రావాలి. ఆ డబ్బులకోసం ప్రయత్నిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఏడాయికి 50 కోట్లచొప్పున గడచిన పదేళ్ళకు 500 కోట్లు వస్తాయి.ప్రాచీన హోదా డబ్బుతో ఏం చెయ్యొచ్చు?
1.తెలుగు భాషలో ఉన్న ప్రాచీన సాహిత్య శాస్త్ర విజ్ఞానాలను ఆధునిక సాంకేతిక విజ్ఞానంలో భద్రపరుచుకోవచ్చు.
2. తెలుగు సాంకేతిక నిపుణులకు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కాలుకదపకుండా  గ్రామాల్లోనే ఉపాధి కల్పించవచ్చు.
3. తెలుగు డిక్షనరీలు,పదకోశాలు ముద్రించవచ్చు.
4.తెలుగులో పరిశోధనలు పెంచ వచ్చు.
తమిళనాడులో ఈ పనులన్నీ జరిగిపోతుంటే తెలుగు రాష్ట్రాలవాళ్ళు కాలుకదపటం లేదు.
2013లో ఏర్పాటు చేసిన  తెలుగు భాష సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా గానీ 2018 లో ఏర్పాటు చేసిన  తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ద్వారా గానీ ఏమేమి పనులు చేయించుకున్నారు?
భాష విషయంలో పాలకుల సంకల్పాలు,ప్రమాణాలు,గొప్పగా ఉంటున్నాయి.కానీ
 ప్రభుత్వాల ఉత్తర్వులు మాత్రం  అమలు కావడం లేదు.తెలంగాణాలో సాహిత్య అకాడమీ, ఆంద్రప్రదేశ్ లో  తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ  వచ్చాయి. పాలనలోనూ, చదువుల్లోనూ తెలుగు కచ్చితంగా ఉండాలి. కార్యాలయాలలోనూ , పాలనలోనూ, కోర్టుల్లోనూ తెలుగును వెలిగించాలి.చిత్తశుద్ధిలేని నాయకుల మాటలతో ప్రజలలో నమ్మకం పోయింది.కూడు పెట్టని భాష మనకు కోటీశ్వరులయ్యే చదువులు వాళ్ళకా? అని పేద ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ విమర్శలను సాకుగా చూపి పాలకులు అసలు తెలుగు మాధ్యమానికే ఎసరు పెడుతున్నారు.
పాఠశాల స్థాయి నుంచే తెలుగు మాయం
తెలుగు రాష్ట్రాలు రెండూ భాషను కాపాడేందుకు కట్టుబడాలి.మాతృ భాషలోనే మాట్లాడండి, మాతృభాషను ఎవరూ మరిచిపోవద్దు  అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెబుతున్నారు . స్కూళ్ళ లో తెలుగు నేర్పుతుంటే కదా పిల్లలకు ఆభాష వచ్చేదీ మాట్లాడేదీ ?ప్లేస్కూల్‌ పేరిట మూడో ఏడు దాటగానే బడిలో వేస్తున్నారు.వారికి... మొదలు పెట్టడమే ఏ ఫర్‌ యాపిల్‌!అ-అమ్మ, ఆ-ఆవుఅని తెలుగు అక్షరాలు నేర్పించరు. కొన్ని స్కూళ్లలో ఐదో తరగతి దాకా తెలుగు చెప్పనే చెప్పరు. 6, 7, 8 తరగతుల్లో మొక్కుబడిగా చదివితే చాలు. 9, 10లో తెలుగు ఆప్షనల్‌ మాత్రమే! అంటే... ఇష్టముంటేనే తీసుకోవచ్చు.ఇంటర్‌లో కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ భాషగా ఆంగ్లం, ద్వితీయ భాషగా సంస్కృతం మాత్రమే బోధిస్తారు. అసలు ఎక్కడా తెలుగు కనిపించదు.త్రిభాషా సూత్రం అమలు కాగితాలకే పరిమితమవుతోంది.నాయకుల హామీల ప్రకారం ఎలిమెంటరీ స్థాయిలో పూర్తిగా మాతృభాషలోనే బోధన ఉందా ? ప్రైవేటు స్కూళ్లన్నీ  ఇంగ్లీషు మీడియమే! ప్రైవేటు బడుల్లో బోధనా మాధ్యమంగా తెలుగు ఎప్పుడో మాయమైపోయింది. ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇది మిగిలి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల్లోని ఇంగ్లీషుమోజే దీనికి కారణం. ప్రైవేటు స్కూళ్లను తెలుగు బాట పట్టించాల్సిన ప్రభుత్వం... తానే ఆంగ్ల మాయలో పడుతోంది. మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియంను తగలేస్తూ... ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతోంది. తల్లిదండ్రులు కూడా  తమ పిల్లలకు తెలుగు రాకపోవడాన్ని గర్వంగా చెప్పుకొంటున్నారు.తెలుగులోనే డిగ్రీ దాకా చదివి ,తెలుగు సాహిత్యమే ఆప్షనల్ గా తీసుకొని ,తెలుగులోనే ఇంటర్వ్యూ కి హాజరై సివిల్స్ లో తెలుగు మాధ్యమం తోనే మూడవ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణను మనం గుర్తు తెచ్చుకోవాలి.

తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్లు  తెలుగు మాధ్యమానికి అండగా ఉండాలి
  
తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్లు తెలుగు మాధ్యమ విద్యార్ధులకు ఎంతో  సేవ చేయవచ్చు. ఇవి జరిపే గ్రూప్ 1,2,3,4  ఉద్యోగ నియమకాలలో డిప్యూటీ కలక్టర్,మున్సిపల్‌ కమిషనర్,ఏసీటీఓ,సబ్‌ రిజిస్ట్రార్,డిప్యూటీ తహసిల్దార్‌,అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌,అసిస్టెంట్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌,ఎక్స్టేన్షన్‌ ఆఫీసర్‌,ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌,అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌,సీనియర్‌ ఆడిటర్‌,సీనియర్‌ అకౌంటెంట్‌,జూనియర్‌ అకౌంటెంట్‌,జూనియర్‌ అసిస్టెంట్‌,గ్రామపంచాయతీ సెక్రెటరీ లాంటి వన్నీ తెలుగులో చేసే ఉద్యోగాలే. ఇవన్నీ ఐ ఏ ఎస్ ,ఐ పి ఎస్ లాంటి ఉన్నతోద్యోగాలు కావు.తెలుగు ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగాలు.తెలుగు ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషణ చేయాలి. గ్రామ సామాజిక , ఆర్థిక వ్యవస్థ పై తగిన అవగాహన తెచ్చుకోవాలి.ప్రజా పరిపాలన పై పరిజ్ఞానం పెంచుకోవాలి. అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష లో తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి.
తమిళనాడు భాషా విధానం అనుసరణీయం
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళ మీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమం లో చదివించరనీ ,ఎవరూ చదవని భాష నశిస్తుందనీ ,తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆభాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు .అందుకోసం అత్యవసరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చారు.శాసన సభలో,స్థానిక సంస్థల్లో ,ప్రభుత్వ కార్పోరేషన్లు,కంపెనీలలో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని శాసించారు.
న్యాయస్థానం సమర్ధించింది
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది.తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల తక్షణ  కర్తవ్యం
1.తెలుగు మీడియంలో డిగ్రీ చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20%  రిజర్వేషన్ ఇవ్వాలి.
2.తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు పోటీ పరీక్షల్లో 5% ప్రోత్సాహక మార్కులు పునరుద్ధరించాలి.
ఈ రెండు ప్రతిపాదనలు ప్రభుత్వాల ఆమోదం పొంది జీవోలు వస్తే ఆ జీవోలతోపాటే తెలుగు మాధ్యమంలో విద్యా బోధనా జరిపే స్కూళ్ళు,కోచింగ్ సెంటర్లు,పాఠ్య పుస్తకాలూ మొదలైనవన్నీ వచ్చేస్తాయి.తెలుగు నేర్చుకునే పిల్లలద్వారా తెలుగు భాషకు జీవం వస్తుంది.మన తెలుగు పిల్లల్నిఅన్ని విధాలా  ప్రోత్సహించి ప్రభుత్వాలు కాపాడాలి.ఎన్నో హామీలతో మళ్ళీ ఎన్నికలో చ్చాయి . తెలుగును కాపాడుకోవాలి అనే ప్రజలు ఒక్క ప్రశ్న వేసుకోండి:  తెలుగు మాధ్యమం లో చదువుకు,ఉపాధికి ఏ పార్టీ అయినా హామీ ఇచ్చిందా ?
--- నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్
అమరావతి 6301493266 https://www.facebook.com/nrahamthulla/posts/2468534633178512