30, జనవరి 2018, మంగళవారం

తెలుగు వాడుక భాషలో పాలన జరగాలి

తెలుగు వాడుక భాషలో పాలన జరగాలి
28.1.2018 తెనాలి తెలుగు మహోత్సవంలో నేను చదివి సమర్పించిన వినతి పత్రం :
పాలనా భాషగా తెలుగుఅమలులో ఎదురౌతున్న సమస్యలు – అనుభవాలు -పరిష్కారాలు
తెలుగులో పాలన కోసం అవసరమైన పనులన్నీ చేస్తామని ముఖ్యమంత్రులు అందరూ ప్రకటించారు.ప్రజాస్వామ్య పాలనలో ప్రజావాక్కే శిరోధార్యం.తెలుగులో పరిపాలన కార్యక్రమం విజయవంతం కావటానికి కేవలం ప్రభుత్వ సాయం మాత్రమే సరిపోదు. ప్రజల పట్టుదల,ప్రయత్నం,ఆదరణ కూడా కావాలి.వాస్తవానికి అధికారభాషగా తెలుగును పాలనలో అమలు చేయటంలో పాలకులకు ,అధికారులకు ఇంకా కొన్ని సమస్యలు ఎదురౌతున్నాయి.
ప్రభుత్వం అవసరమైన ఉత్తర్వులు చాలావరకు ఏనాడో ఇచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సింది అధికారులే. వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో కారణాలు తెలుసుకోవాలి. నిర్లక్ష్యంతో తెలుగులో దస్త్రాలను నిర్వహించని వారిని శిక్షించాలి. కాలయాపనకు సహేతుకమైన కారణాలు ఉంటే వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు సరిగా అమలుకు నోచుకోకలేదు. ఉత్తరువులను అమలుచేయటంలో అధికారులకు కలుగుతున్న ఆటంకాల పరిష్కారానికి అవలంబించదగ్గ పద్ధతులు పరిశీలిద్దాం.
నేను ఒక గుమాస్తా స్థాయి నుండి తహసీల్దారు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ వరకు అనేక ఉద్యోగాలు చేశాను. తెలుగు భాషలో ఫైళ్ళ నిర్వహణ,ఉత్తరప్రత్యుత్తరాలలో నాకు ఎదురైన అనుభవాలు,సమస్యలు, నాకు తోచిన సలహాలు పరిష్కార మార్గాలు మీతో పంచుకుంటాను:
అనుభవం1 : ఆంగ్ల న్యాయవ్యవస్థతో:
పశ్చిమ గోదావరిజిల్లా మొగల్తూరు మండలంలో ఎమ్మార్వోగా ఉండగా 23 రిట్ పిటీషన్లకు పేరావారీ జవాబులు తెలుగులోనే రాసిపంపాను. కలెక్టరేట్ నుండిఫోన్. తెలుగులో ఎందుకు పంపారనే ప్రశ్న. తెలుగులోనైతే జవాబులుతప్పుల్లేకుండా సూటిగా, స్పష్టంగా ఇవ్వగలననీ, అర్థంకాక పోవడమనే సమస్యేరాదనీ, వాటిని యధాతథంగా హైకోర్టుకు సమర్పించమనీ, కాదు కూడదంటే ఇంగ్లీషులోకితర్జుమా చేయించి జిల్లా కేంద్రం నుండే హైకోర్టుకు పంపించండనీ వేడుకున్నాను. అప్పుడు 167/19.3.1988 అనే ప్రభుత్వ ఉత్తర్వు నన్ను ఆదుకుంది. దాని ప్రకారం ఆంగ్లంలో వచ్చిన ఏ ఉత్తరం పైనా ,ప్రతిపాదనపైనా ఎలాంటి చర్యతీసుకోకుండా తిప్పి పంపే అధికారం ప్రతి గజిటెడ్ అధికారికీ ఉంది. తమకంటే పై అధికారుల కార్యాలయాలనుండి వచ్చినా సరే ఆంగ్లంలో వచ్చిన లేఖలను తిప్పిపంపవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల జరిగే కష్ట నష్టాలకు,జాప్యానికీ వాటిని ఆంగ్లంలో పంపిన అధికారులదీ, కార్యాలయాలదే బాధ్యత. ఈ జీవో పుణ్యాన వారు నన్నేమీ అనకుండా వాటిని ఆంగ్లంలోకి మార్పించి హైకోర్టులోనివేదించారు.
మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారుః “మాతృమూర్తికి ఎంతటిగౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితోసమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయస్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈదారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినప్పుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం.” (“అమ్మనే మరుస్తారా!” ఈనాడు 27-2-2006).
కరీంనగర్జిల్లా సిరిసిల్ల ఆర్డీవో నాగేందర్150 పేజీల ప్రతివాదనను తెలుగులో రూపొందించి హైకోర్టులో దాఖలు చేస్తే, దానిని హైకోర్టు కూడా సదభిప్రాయంతో స్వీకరించింది. ఇందుకు ఎ.బి.కె. ప్రసాద్ గారు హర్షం వ్యక్తం చేస్తూ, ఆర్డీవోకు అభినందనలు తెలియజేశారు. (ఈనాడు 28.6.2006) ఇలాంటి వారిని గుర్తించి,ప్రోత్సహించాలి.
రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి లాంటి పెద్దలంతా కక్షిదారుల భాషలోనే హై కోర్టుల్లో కూడా వాదనలూ తీర్పులు ఉండాలని చెబుతున్నారు కదా అన్న ధైర్యంతో ఇటీవల ఒక కేసులో తెలుగులో ప్రతివాదన తయారుచేసి తీసికెళితే హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది దానిని తిరస్కరించారు. హైకోర్టులో తెలుగు వాదన చెల్లదు అన్నారు. తెలుగులో వాదన తెచ్చినందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇంగ్లీషులో వాదించలేని నేను డిప్యూటీ కలక్టర్ పదవికి తగనని ఎగతాళి చేశారు. చివరికి నా తెలుగు ప్రతివాదాన్ని ఇంగ్లీషులోకి మార్చి ఇస్తేనే తీసుకున్నారు. హైకోర్టు స్థాయికి తెలుగు భాష ఇంకా వెళ్ళలేదు.తెలుగులో వాదించుకునే పరిస్తితి ఇంకా దిగజారింది.
పరిష్కారమార్గాలు : జిల్లా స్థాయి కోర్టుల్లో దిగువ స్థాయి న్యాయస్థానాల్లో వాదప్రతివాదాలు తెలుగులో జరగాలి. తీర్పులన్నీ తెలుగులోనే ఇవ్వాలి అని 29.3.1974 న హోమ్ శాఖ 485 నంబరు తొలిసారిగా జీవో జారీ చేసింది. దానిని ఖచ్చితంగా జిల్లాస్థాయి న్యాయవాదులు న్యాయమూర్తులు అమలు చేసేలా చూడాలి. ఈ సౌలభ్యం హైకోర్టుల్లో కూడా దొరికేలా చెయ్యాలి. అన్నీ న్యాయస్థానాలతో పాటు అన్నిఆఫీసుల్లో కూడా తెలుగులోకి అనువదించి రాయగల రైటర్లను నియమించాలి. పోలీసు స్టేషన్లు,హైస్కూళ్ళలో లాగా ఈ రైటర్లు వివిధ పత్రాలను దస్త్రాలను తెలుగులో రాసి కంప్యూటర్లో భద్రం చెయ్యాలి. ప్రతి ఆఫీసుకు అవసరమైన రైటర్లను సర్వీసు కమీషన్ పరీక్ష ద్వారా నియమించుకోవాలి.రైటర్లకు కంప్యూటర్ లో తెలుగు భాషా పరిజ్నానం తప్పనిసరి అర్హతగా నిర్ణయించాలి. 587/28.10.1988,218/22.3.1990,420/13.9.2005, 11/14.9.2016 జీవోల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వఉత్తర ప్రత్యుత్తరాలన్నీ సాధ్యమైనంత తెలుగులోనే జరగాలి. అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి. ఆంగ్లం వాడకూడదు. కాబట్టి తెలుగు రైటర్ల విస్తృత నియామకం వలన వేలాది తెలుగు యువకులకు ఉపాధి దొరుకుతుంది. తెలుగు భాషను కాపాడే రక్షకులు కూడా ఏర్పడతారు. పరిపాలన పూర్తిగా తెలుగులోనే జరుగుతుంది.
అనుభవం2:మాదిరి తెలుగు ధరఖాస్తులు :
ఒక మండలంలో ఎమ్మార్వోగా ఉండగా దరఖాస్తు ఫారాలు నింపడానికి ఆఫీసుబయట ఒక ప్రైవేటువ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన వ్యక్తుల అవసరాలనుబట్టి ఇంతింత ఈ ఫారం నింపడానికివ్వాలని వసూళ్ళు చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫారాలు ఇంగ్లీషులో ఉండేవి. ఏయే పనులకోసం ఈ ఆఫీసుకు ప్రజలువస్తున్నారు, ఏమేమి ఫారాలు వాళ్ళు పూరించి ఆఫీసులో ఇవ్వాలో తెలుసుకున్నాను.ఓపికగా ఆయా దరఖాస్తులు తెలుగులోకి అనువదించాను. నాలుగైదు తరగతులు చదివిన వారెవరైనా పూర్తిచేయటానికి వీలుగా అన్నిరకాల దరఖాస్తుఫారాలు తయారయ్యాయి. వాటిని ఆ ఊళ్ళోని జిరాక్సు షాపులన్నిటికీ ఇచ్చి కేవలం అర్ధరూపాయికే ఏఫారమైనా అమ్మాలని చెప్పాము. ఎవరికివారే ఫారాలు నింపుకొని వస్తున్నారు. ప్రతిఫారమూ నాలుగైదు దశలు దాటివచ్చే పద్ధతి తీసేశాం. గ్రామ పాలనాధికారి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సంతకాలు చేస్తే చాలు. వాటిపైన నేను సంతకంచేసే వాడిని. ఆఫీస్లో గుమాస్తాల ప్రమేయం తగ్గింది. పత్రాల జారీ వేగం పెరిగింది.
పరిష్కారమార్గాలు: అన్నిరకాలదరఖాస్తులు తెలుగులోముద్రించి అన్ని శాఖల వెబ్ సైట్లలో ఉంచాలి. తెలుగుభాషా సంస్కృతుల అభివృద్ధి అధ్యయన కమిటీ చేసిన ఈ సూచనలు అమలు చెయ్యాలి: 1. తెలుగు భాషాభివృద్ధిప్రాధికార సంస్థ - ఏడు విభాగాలు : అధికార భాష అమలు , తెలుగుభాషాభివృద్ధి, ఈ-తెలుగు, అనువాద, ప్రచురణలు, అంతర్జాతీయ తెలుగుభాషాభివృద్ధి, గ్రంథాలయాలు అన్ని అధికారాలతో ఏర్పాటు చేయాలి. తెలుగు భాషను కించపరిచే ధికారులను దండించే అధికారం ఈ సమ్స్థకు ఉండాలి.
* సచివాలయం స్థాయినుంచి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు అన్నీతెలుగులోనే ఉండాలి. తెలుగు అమలును నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యతీసుకునే అధికారం ప్రాధికార సంస్థకు కల్పించాలి.
* తెలుగు మాధ్యమవిద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి విభాగంలోనూ 10శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
* అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించాలి.
* ఆంగ్ల మాధ్యమంలో తెలుగును, తెలుగు మాధ్యమంలో ఆంగ్లాన్ని ఒక బోధనాంశంగాఉంచాలి. డిగ్రీ స్థాయిలో అన్ని సెమిస్టర్లలో తెలుగును తప్పనిసరిగాబోధించాలి.
* ఇంటర్మీడియట్, డిగ్రీల స్థాయిల్లో తెలుగు, సంస్కృతం మిశ్రమ బోధనా విధానాన్ని పాటించాలి.
* హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పరిచి, న్యాయపాలనలో తెలుగు అమలు కోసం సత్వర చర్యలు తీసుకోవాలి. తెలుగులో తీర్పులువెలువరించేలా న్యాయమూర్తులను ప్రోత్సహించాలి.
* ఆన్లైన్లోఈ-తెలుగు పద్ధతిలో తెలుగు బోధన, అంతర్జాలంలో తెలుగు సాహిత్యం, శాస్త్రసాంకేతిక గ్రంథాల వ్యాప్తి, శాసనాల డిజిటలీకరణ, వెబ్సైట్ల నిర్వహణ, కంప్యూటర్లలో తెలుగు ఉపకరణాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
అనుభవం3: పనుల జాప్యం :
నేను హై స్కూల్ చదువుకు రోజూ 7 కి.మీ. కంకటపాలెం నుండి బాపట్ల నడిచి వచ్చే వాడిని. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్ దార్ ఆఫీస్కు వారం రోజులపాటు తిరిగేవాడిని. ప్రతిరోజూ డఫేదారు దగ్గర ఒకటే సమాధానం- దొరగారు క్యాంపు కెళ్ళారు, రేపురండిఅనేవాడు.ఎర్రటి ఎండ తట్టుకోలేక ఆవరణలో ఒక చెట్టు క్రింద చేరేవాడిని. ఆ చెట్టుకింద ఆనాడు అనుకున్నాను. నేను గనక తాసీల్దారునైతే చిన్నపిల్లలకు చకచకా సంతకాలు చేసి పంపిస్తాను అని. తహసీల్దారునయ్యాక మాట నిలుపుకున్నాను.
పరిష్కారమార్గాలు:ఇప్పుడు ‘విద్యార్ధుల సేవలో’ రెవిన్యూ’ అనే మంచి కార్యక్రమం జరుగుతోంది. “జన్మభూమి-మన ఊరు”లో కూడా ఇలా పాత పెండింగ్ కేసులన్నీ పరిష్కరించవచ్చు. తెలుగులో చక్కగా స్వేచ్ఛగా పని చేయవచ్చు. కంప్యూటర్లో కూడా తెలుగులో పనిచేయగలిగే సిబ్బంది మనకు మంచి సంపదే. తెలుగులో కంప్యూటర్ల వాడకంపై మంచి శిక్షణ ఇప్పిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు రైటర్ల సంపదను పెంచాలి.
అనుభవం 4.అనువాదాలు, మొదటి తెలుగు అవార్డు :
2008 లో పులిచింతల ప్రాజెక్ట్ లో భూసేకరణ సమ్మతి అవార్డు తెలుగులో ఇచ్చాను.అంతకు ముందు ఎలాంటి మాదిరీ లేని పరిస్థితుల్లో కొత్తగా అనువాదానికి స్వయంగా పూనుకొని రాసిన ఆ అవార్డు రాష్ట్రంలో మొదటి తెలుగు అవార్డు అయ్యింది. అధికారులారా! ఇలా మీరెందుకు రాయలేరు? అంటూ అప్పటి అధికారభాషా సంఘం అద్యక్షులు వారి మాసపత్రిక  పాలనాభాష (సమాచారనేత్రం) జనవరి, 2009, లో ఆ అవార్డును ప్రచురించారు. కాబట్టి ఎవరో ఒకరు పూనుకొని కొత్త పత్రాల్ని తయారు చేయాలి. అవే కాలక్రమేణా మెరుగు పడుతూ వాడుక భాషలోకి మారుతూ అందరికీ మార్గదర్శక మౌతాయి.
పరిష్కారమార్గాలు:తెలుగుఅనువాదాలు ఇంకా బాగుపడాలి. ప్రస్తుతం ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషు లోకి కంప్యూటర్ పై జరిగే అనువాదాలు సవాలక్ష లోపాలతో ఉన్నాయి. తెలుగువారు సాంకేతికంగా ఎంత ఎదిగినా నేటివరకూ అనువాద యంత్రాల తయారీలో బాగా వెనుకబడే ఉన్నారు. కారణం సర్వ సమగ్ర తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు లేకపోవటమే!
అనువాదాలను తప్పుల్లేకుండా చేసి ఇచ్చే సాఫ్ట్ వేర్ల తయారీదార్లపై తెలుగు ప్రజలు,నాయకులు దృష్టి సారించాలి. మంచి తమిళంలోఉత్తమ సాఫ్ట్ వేర్ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. తెలుగులో కూడా ఉత్తమ సాఫ్ట్‘వేర్ లు తయారుచేసిన సాంకేతిక నిపుణులకు, తెలుగు భాషకు ఉపకరించే సులభ ఉపకరణాలను తయారు చేసిన సాంకేతిక పరిఙ్ఞానులకు తెలుగు వైతాళికుల పేరుమీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. మనకు కూడా కొలిచాల సురేశ్ ,వెన్ననాగార్జున, రహమాన్ లాంటి కంప్యూటర్ తెలుగు లిపి సాంకేతికులు చాలామంది ఉన్నారు. తెలుగులోకి తర్జుమాలో తప్పులు రాకుండా మెరుగు పరిచే వారికి ఆర్ధిక సహాయం చెయ్యాలి. అనువాద ఉపకరణాలు లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి. యంత్రాను వాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులోకంప్యూటర్ వాడకం పెరగాలి. తెలుగు నుండి ఇంగ్లీషు తదితర భాషల్లోకి అలాగే ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేసే ఉపకరణాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. అనువాదంలో చోటుచేసుకుంటున్న లోపాలను తప్పుల్నీ సరిదిద్దటానికి తెలుగు సాంకేతిక నిపుణులు అందరూ పూనుకోవాలి. ఈ అనువాద సామాగ్రి ఎంత నాణ్యంగా అభివృద్ధి చెందితే తెలుగులో పాలన అంత నాణ్యత గా ఉంటుంది. ఫైళ్ళ కదలికలో వేగం పెరుగుతుంది. ఏ ఏటికాయేడు విడుదలైన అనువాద ఉపకరణాలలో నాణ్యమైన వాటికి బహుమతులివ్వాలి.
అనుభవం 5.వాడుక పదాలు:
1986-90 ప్రాంతాల లో హైదరాబాదు డైరెక్టరేట్ల లో పనిచేసాను. నండూరి రామకృష్ణమాచార్య గారు అధికార భాషా సంఘం తరుపున నేను పనిచేస్తున్న కార్యాలయాన్ని దర్శించారు. అచ్చగా తెలుగులోనే ఫైళ్ళు నడిపే వారిది ఒక్క సీటు చూపించండి అని అడిగితే నాదగ్గరకు తీసుకొచ్చారు. ఆయన నా ఫైళ్ళను చూసి ఆనందం వ్యక్తంచేశారు. ఆంగ్ల పదాలకు అర్ధం తెలియకపోతే భయపడకుండా అందరికీ వాడుకైన ఆంగ్లపదాలనే తెలుగులో స్వేచ్ఛగా సరళంగా రాస్తున్నారు .ఇదే మేము కోరుతున్నది” అని ప్రశంసించారు.
“సార్, తెలుగు మాతృభాషగా గల 'తెలుగు ముస్లిములు' నిఖానామాను తెలుగులో ప్రచురించి ఇవ్వమని కోరుతున్నారని వారిని అడిగితే వక్ఫ్ బోర్డు వారిని సంప్రదించారు. కొన్ని ఉర్దూ పదాలు తెలుగు ముస్లిములు కూడా పలుకుతారు కాబట్టి వాటినే తెలుగులో ప్రచురిస్తే చాలు అన్నారు.
2009 లో అధికార భాషాసంఘం అధ్యక్షులు ఏ బి కె ప్రసాద్ గారికి ఐ.కొండలరావు గారి ఉర్దూ –తెలుగు నిఘంటువును అందజేశాను. 2009 ఏప్రిల్ 25 వతేదీన ఈనిఘంటువును పునర్ముద్రించి విడుదలచేశారు. ఉర్దూ అకాడమీ డీటీపీ తరువాత ప్రచురించకుండా ఆపివేసిన పటేల్ అనంతయ్య కమిటీ తెలుగు-ఉర్దూ నిఘంటువును తెలుగు అధికారభాషాసంఘం నిధులతో పూర్తి చేయించడానికి ప్రయత్నించారు.
2013 లో తెలుగు అధికార భాషాసంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ గారు కూడా తెలుగు- ఉర్దూ నిఘంటువు ప్రచురణకు ఆదేశించారు కూడా.
పరిష్కారాలు:మనం మాట్లేడేటప్పుడు ఎలా మాట్లాడుతామో రాసేటప్పుడు కూడా అలానే రాస్తే అందరికీ తేలికగా అర్ధమౌతుంది. రైలు ను ధూమశకటం అననక్కరలేదు. ఇంగ్లీషును ఉర్దూను పరభాషాపదాల పేరుతో తోసివేయ నక్కర లేదు. తెలుగు జనం కొన్ని పరభాషా పదాలనే వాడుకలో పలుకుతున్నారు. అందువలన నిఘంటువులలోకూడా వాడుక భాష పదసంపద పెరగాలి. వాడుకభాష లోకే చట్టాలు, దస్త్రాలు మారాలి. ఏ పదాన్ని ఎలా వాడాలో తెలియజేసే సోదాహరణ పదకోశాలు పంపిణీ చెయ్యాలి. అనేక అవసరాలలో ఉపయోగించేలా మాదిరి ఉత్తరాలను, ఆదేశాలను తెలుగులో తయారు చేయించి వాటిని నెట్ లో ఉంచాలి. ఫైళ్ళ నిర్వహణలో కలిగే అనుమానాలను నివృత్తి చేసే యంత్రాంగాన్ని సిద్ధం చెయ్యాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష వాడకం పరిరక్షణ నిరంతర కార్యక్రమంగా సాగాలి.
ఆన్లైన్లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలావాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగాఉన్నట్లు భావించినకొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి. వాడుక భాషలో నానా భాషలూ కలగాపులగంగా ఉంటాయి.అయితే అవన్నీ ప్రజలకు బాగా అర్ధమౌతాయి. పరభాషా పదాలనే కారణంతో ఇప్పుడు తెలుగు వాడకంలోంచి సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ పదాలను తీసివేయలేము. ఎందుకంటే అవి మనభాషలోఅంతర్భాగాలై పోయాయి. తెలుగు లోపాలించటం అంటే గ్రాంథుఇక తెలుగులో కాక, జనవ్యవహారంలో ఉన్న భాషలోనే పాలించడం అనే విషయాన్ని మొదట గుర్తించాలి. ప్రజలు ఇంతకంటే ఇంగ్లీషే నయమని వాపోయేలా తెలుగు అనువాదాలు ఉండకూడదు. అందరికీ అర్థమయ్యే రీతిలో, సరళంగా క్లుప్తంగా, వేగంగా పలికేందుకు వీలుగా ఉండేలా తెలుగు మాటలను వాడటం అలవాటు చేసుకోవాలి.
సంస్కృతం, ఇంగ్లీషు భాషల మితిమీరిన వాడకం వల్ల, అవి మన భాషాపదాలను కబళించి తామే తెలుగై కూర్చున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీషు మాటలు జనం నాలుకలమీద విస్తారంగా వాడబడుతున్నవాటిని యథాతహంగా పాలనాభాషలో వాడుకోవటం ఉత్తమం. ఇక ఇప్పుడు ఈ ఇంగ్లీషు పదాలను నిర్మూలించడం మన తరం కాదు. వాటిని మన పదాలుగా అంగీకరించడమే మంచిది.
అనుభవం 6.కంప్యూటర్లో తెలుగు టైపు సమస్యలు :
కంపూటర్లో తెలుగు టైపు చేసేటప్పుడు తెలుగు ఫాంట్లు లేక యూనీకోడ్ లోకి మార్చటానికి రకరకాల సమస్యలు వచ్చేవి. 2009లో అను నుండి యూనికోడ్ లోకి మార్చే ఒకమారకానికి anurahamthulla version అని నా పేరుని పెట్టారు. తెలుగు భాషలో మంచిఫాంట్లు అభివృద్ధి చేశారు. సాంకేతిక పరికరాలు వచ్చాయి.
పరిష్కారాలు:
అక్షర రూపాలు పెరగాయి .లిపి,అనువాద సమస్యలు తగ్గాలి .ప్రపంచతెలుగు మహాసభల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలిరామకృష్ణ, సూరన్న, రామరాజ, మల్లన్న, ధూర్జటి, రామభద్ర, గిడుగు, గురజాడ, సురవరం, యన్.టి.ఆర్., మండలి, నాట్స్, పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి అనే18 అక్షరరూపాలను విడుదలచేశారు.అనూ, సూరిలాంటి యూనీ కోడేతర ఫాంట్లలో ముద్రితమై ఉన్న విస్తారమైన తెలుగుసాహిత్యాన్ని తెలుగు యూనీకోడు లోకి మార్చే మార్పిడి సాధనాలు కూడా వచ్చాయి.
ఇప్పటికీ తెలుగు ప్రజలకు అనువాద సమస్య అలాగే ఉంది .తర్జుమాలో ఇప్పటికీ చాలా తప్పులు వస్తున్నాయి. అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ వాటిని విరివిగా వాడుకునే సౌలభ్యాలు కలగాలి. వాటిని తయారు చేసే సాంకేతిక నిపుణులకు నిధులు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.
అధికారుల దగ్గర కంప్యూటర్ అనువాదకుల్ని కూర్చోబెట్టి తెలుగునుండి ఇంగ్లీషుకు ,ఇంగ్లీషు నుండి తెలుగుకు వందలాది వాక్యాలను అనువాదం చేయించి పరిశీలించాలి. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో రకరకాల పరిస్థితుల్లో మనం వాడుతున్న తెలుగు ఇంగ్లీషు వాక్యాలకు సరైన అనువాదం వస్తుందా లేదా అని పరిశీలించాలి. వేరే అర్ధం వస్తుందా?పదాల పొందిక క్రమము సరిపోతోందా? అనీ చూడాలి.
అనుభవం 7 .రోమన్ లిపి :
వత్తులు ,గుణింతాల ఇబ్బందిని అధిగమించలేకనే చాలామంది బాగా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగు టైపింగ్ జోలికి రాలేకపోతున్నారు.లిపి సంస్కరణ కూడా అవసరమే. వత్తులూ గుణింతాల బెడద లేకుండా ఒకే వరసలో సాగిపోయేలా రోమన్ లిపిని యంత్రానికి తగ్గరీతిలో ఆంగ్లేయులు ఎంతగానో అభివృద్ధి పరిచారు, అరబిక్ అంకెలను,భారతదేశపు సున్నాను అరువు తెచ్చుకొని మరీ ఆంగ్ల లిపిని విశ్వవ్యాప్తం చేశారు.ఆంగ్ల భాషనూ, అంకెల్ని మనం ఎలాగూ వాడుతూనే ఉన్నాం. ఇక అక్షరాలను కూడా వాడుకుంటే అధికార భాషగా రోమన్ తెలుగును పిల్లలకు నేర్పటం, ఫైళ్ళలో ద్వారా అమలు చేయటం ఎంతో సుళువవుతుంది
పరిష్కారాలు:
వత్తులూ గుణింతాల బెడద అంటూ తెలుగు లిపిసమస్య సాకుతో అధికారభాష అమలును ప్రక్కన పెట్టటం కంటే అంతర్జాతీయంగా అమలవుతున్న లిపినే మన భాషకు వాడుకుంటే మేలు జరుగుతుంది.దేశమంతటికీ ఉమ్మడి లిపిగా ఆంగ్లాక్షరాలను ఉపయోగించుకోవాలి. ప్రపంచం మొత్తం చదవగలిగే స్థాయికి ఎదిగిన ఆంగ్ల లిపిని వాడుకోవటం ద్వారా మన దేశ భాషలన్నింటికీ జవసత్వాలు సమకూరుతాయి.పైగా అన్నిభాషల వాళ్ళూ సెల్ ఫోనుల్లో ఆంగ్ల లిపి ద్వారానే మెసేజీలు ఇప్పటికే పంపుకుంటున్నారు.ప్రపంచ దేశాలలో ఆంగ్ల లిపిలోని సంస్కృత శ్లోకాలను,అరబీ సూరాలను చదువు కుంటున్నారు. దేశ వాసులందరినీ రోమన్ లిపి ద్వారా త్వరగా అక్షరాస్యుల్ని చేయవచ్చు.దేశ మంతటా ఒకే లిపి ఉండటం వలన అందరూ అన్ని భాషలనూ అర్ధం చేసుకోలేకపోయినా కనీసం అన్ని భాషలనూ చదవగలుగుతారు,కార్యాలయాలనుండి వచ్చే ఉత్తర్వులను చదవటం, చదివించుకొనటం సులువౌతుంది.లిపి ద్వారా ఐక్యత వస్తుంది.అందువలన తెలుగులో పాలన వ్యవహారాలు సులువుగా జరగాలంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆనాడు కోరినట్లు లిపి సంస్కరణన్నా జరగాలి లేదా శ్రీ శ్రీ గారి సలహా మేరకు రోమన్ లిపిలో అయినా కార్యాలయ వ్యవహారాలు నడపాలి.
అనుభవం 8. తెలుగు మాధ్యమం :
తెలుగు తెలుగు రక్షణ అంటూ తెగ అరిచేవాళ్ళు తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో ఎందుకు చదివిస్తున్నారు?అనే ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి అనేకసార్లు ఎదురయ్యింది. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళ స్థాయిలో తెలుగు బడులు లేవు. కార్పోరేట్ స్కూళ్ళతో పోటీ పడలేక కునారిల్లుతున్నాయి. తెలుగు స్కూళ్ళ ద్వారా చదివితే ఉద్యోగాలు వస్తాయో రావో అనే సందేహమే తల్లిదండ్రుల తటపటాయింపుకు కారణం. తెలుగు మాధ్యమంలో అసలు ఉన్నత విద్యే లేనప్పుడు ఎంత తెలుగు భాషాభిమాని అయినా, భాషోద్యమకారుడైనా తమ పిల్లల్ని ఎక్కడ ఎలా చదించగలడు?
పరిష్కారాలు:
తెలుగు మాధ్యమంలో చదువులు పెరగాలి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో తెలుగు మీడియం ఉండాలి.వివిధ వృత్తివిద్యలు ,న్యాయ, వైద్య సాంకేతిక విద్యలు కూడా తెలుగు మాధ్యమంలో నేర్వగలిగిన నాడు తెలుగు సమాజమంతా తెలుగులో పాలన పరిధిలోకి దానంతట అదే వచ్చేస్తుంది. తెలుగులో ఉన్నత విద్యా సదుపాయాలు అత్యంత అవసరం.తెలుగులో చదువు చెప్పేశాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలనూ కళాశాలల్నీ,తెలుగులో చదివే విద్యార్ధులనూ రాయితీ లిచ్చి ప్రోత్సహించాలి. రాష్ట్రంలోని కేజీ టూ పీజీ వరకూ అన్ని స్థాయిలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తామని ప్రభుత్వం వారు ప్రకటించారు. అయితే పిల్లల పాఠ్యపుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి. సంకలనం, వ్యవకలనం లాంటి పదాల స్థానంలో కూడికలు, తీసివేతల్లాంటి మాటలు రావాలి.
అనుభవం 9.ప్రోత్సాహకాలు ,ఉద్యోగాలు :
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకుప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళమీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమంలో చదివించరనీ, ఎవరూ చదవనిభాష నశిస్తుందనీ, తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆ భాషలో మాత్రమే చదివిన వారికివెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు. .అందుకోసం అత్యవసరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. శాసన సభలో, స్థానిక సంస్థల్లో, ప్రభుత్వకార్పోరేషన్లు, కంపెనీలలో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని శాసించారు.
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్-ది. 30.09.2010 ద్వారాతమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది.ప్రమోషన్లలో కాకుండా ప్రభుత్వోద్యాగాలకుమొదటిసారిగా నేరుగాజరిపే నియామకాలకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది. రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళుకాపాడుకోవాలని, ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధిచేసుకోవాలనికూడా తెలియ జేసింది. కాబట్టి, తమిళనాడును ఆదర్శంగా తీసుకొని ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకుతెలుగుమాధ్యమంలో చదివిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలేరా ? తమిళనాడులో లాగా ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వవచ్చు కదా? లాంటి ప్రశ్నలు కొన్నిచోట్ల అడిగారు.
పరిష్కారాలు:
గ్రూప్ 1, గ్రూప్ 2,3 లాంటి సర్వీసు ఉద్యోగాలలోతెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇకమీదట కూడా ఇవ్వవచ్చు. తమిళ మాధ్యమంలో చదివే వారికి ఉద్యోగాల నియామకాల్లో ఐదు మార్కులు అదనంగా తమిళనాడులో ఇప్పటికీ ఇస్తున్నారు. మనకు కోర్టు కేసులు ఏమన్నా ఉంటే తెలుగు మాధ్యమ అభ్యర్డులకు ఎందుకు ఇలా ప్రోత్సాహక మార్కులివ్వాల్సి వస్తుందో కారణాలను స్పష్టంగా తెలియజేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి భాషలను ఆయారాష్ట్రాల పాలక భాషలుగా అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే బలహీన భాషల రక్షణ ఎలా జరుగుతుంది? సొంత వాళ్ళ రక్షణ ,ఆదరణ కరువైనందువల్లే మరోమార్గం లేక అన్నిభాషలు ఆంగ్లాన్ని ఆశ్రయిస్తున్నాయి.
అంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల సర్వీస్ కమీషన్లు రెండూ భారీ ఎత్తున గ్రూప్-2,3 సర్వీసుఉద్యోగాల భర్తీచేస్తు న్నాయి. వీటిలో మున్సిపల్ కమిషనర్, ఏసీటీఓ, సబ్రిజిస్ట్రార్,డిప్యూటీ తహసిల్దార్,అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్,అసిస్టెంట్ డెవల్పమెంట్ ఆఫీసర్, ఎక్స్టేన్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,సీనియర్ ఆడిటర్,సీనియర్అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, గ్రామపంచాయతీ సెక్రెటరీ లాంటి ఉద్యోగాలున్నాయి. ఇవన్నీ తెలుగులో చేసే ఉద్యోగాలే. ఐ ఏ ఎస్ ,ఐ పి ఎస్ లాంటి ఉన్నతోద్యోగాలు కావు.తెలుగు ప్రజలతోమమేకమై వారితోముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగాలు. వీరు తెలుగు ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషణ చేయాలి .గ్రామ సామాజిక , ఆర్థిక వ్యవస్థ పై తగిన అవగాహన తెచ్చుకోవాలి. ప్రజా పరిపాలన పరిజ్ఞానం పెంచుకోవాలి. అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు, సూచనలు వినాలి, రాయగలగాలి. ఈ నైపుణ్యాలన్నీ తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి.
గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5 శాతం ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి.తమిళనాడు తరహాలో తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు 20 శాతం ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ ఇస్తే, అప్పుడు తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి.
--- నూర్ బాషా రహంతుల్లా,స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,అమరావతి,9948878833


విక్టోరియా మహారాణి బంగారు పతకం తెలుగులో ఉందివిక్టోరియా మహారాణి బంగారు పతకం తెలుగులో ఉంది

ఇది బుడ్డా వెంగళరెడ్డి గారికి విక్టోరియా మహారాణి ఇంగ్లాండులో చేయించి పంపిన బంగారు తెలుగు పతకం.నేను దానిని తీసుకొని పరిశీలించాను.దాని వెనుకవైపు తెలుగు అక్షరాలే ఉన్నాయి.తెలుగు అంకెలున్నాయి.ఈ అక్షరాలు చదవటానికి అనుకూలంగానే ఉన్నాయి. "1866 (౧౮౬౬) సంవత్సరము లో సంభవించిన క్షామకాలమందు నిరాధారముగా వుండిన తన స్వదేశస్థులపట్ల జరిగించిన వుత్కృష్టమయిన ఔదార్యమునకు గాను హర్ మెజస్టీ రాణి గారి వల్ల చేయబడిన శ్రేష్ఠమయిన గణ్యతకు ఆనవాలుగా బుడ్డావెంగళరెడ్డి గారికి బహుమానము ఇయ్యబడ్డది."అని ఉంది.
ఆంగ్లపాలకులు ఆంగ్లంలోనే పతకం ఇస్తే ఎవరూ కాదనలేరు. పరభాష అనో,పాలితుల భాష అనో వివక్షతో చిన్నచూపు చూడకుండా ఎక్కడికక్కడ మన ప్రజల భాషలు నేర్చుకొని మరీ పాలించారు.పతకం మనపూర్ణకుంభాన్ని పోలి ఉంది.మన రాజులు ఏర్పరచుకున్న రాజముద్రలు,పూర్ణకుంభాల రూపాలను కూడా బ్రిటీష్ పాలకులు అంత్యంత నిశితంగా గమనించి ఆయా ప్రాంతాల ప్రజల భాషలతోపాటు సంస్కృతీ చిహ్నాలను కూడా స్వీకరించి వాటి రూపాలలోనే పతకాలు కూడా ప్రదానం చేశారన్నమాట.పాలనలో తెలుగు అమలు చేసిన విషయంలో మన వాళ్ళకంటే బ్రిటీష్ పాలకులే కొంత నయమనిపించారు. కర్నూలు జిల్లా కోయిలకుంట్లలోని వ్యక్తికి బ్రిటన్ దేశంలోని లండన్ లో తెలుగు అక్షరాలతో బంగారుపతకం చేయించి ఆంగ్లపాలకులు ఇవ్వటం అద్భుతమే.భాషాప్రాతిపదికమీదనే తెలుగురాష్ట్రాన్ని సాధించుకున్న మనము మన ప్రజలకు తెలుగులో పరిపాలన అందించగలము.తెలుగులో తీర్పులు ఇవ్వగలము.శాస్త్ర సాంకేతిక విద్యలను మాతృభాష లోకి మార్చగలము.ప్రభుత్వ కృషితో పాటు తెలుగు ప్రజలలో కూడా ప్రతి స్థాయిలోనూ తెలుగుకై కదలిక రావాలి.మన భాషలో మనల్ని మనం పరిపాలించుకుందాము అనే పట్టుదల కలగాలి.జన ఘోషకు స్పందించాల్సిన సర్కారీ యంత్రాంగం జన భాషకు పట్టం కట్టాల్సిందేనంటూ పట్టుపట్టి, దస్త్రం తెలుగులో రూపొందిస్తేనే సంతకం చేస్తానన్నాడు ,చేశాడు తెలుగు దేశ అదినేత తెలుగు పాలకుడు ఎన్టీఆర్‌, ఆయన చూపిన బాటలో మనమందరమూ గట్టిగా కలిసి ప్రయత్నిస్తే తెలుగులో పాలన సాధ్యమే.
2.9.2014 న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి కోయిలకుంట్ల వెళ్ళి బుడ్డా వెంగళరెడ్డి గారి వారసులను కూడా దర్శించాను.నన్ను ఎంతగానో ఆకర్షించిన అంశం బుడ్డా వెంగళరెడ్డి గారికి విక్టోరియా మహారాణి ఇచ్చిన పతకం వెనుక ముద్రించిన తెలుగు అక్షరాలు.ఆయన వారసులు దానిని ఆనాటి చెక్కపెట్టెతో సహా భద్రపరిచారు.ఆయన ఇల్లు,వారసులు,పతకం పెట్టె ఇక్కడ చూడవచ్చు :
(అమ్మనుడి, ఫిబ్రవరి 2018) 

 20, జనవరి 2018, శనివారం

తెలుగు లిపి సంస్కరణ,తెలుగు లిపిని సంస్కరిస్తేనే మంచిరోజులు
తెలుగు లిపి సంస్కరణ 

తెలుగు లిపిని సంస్కరిస్తేనే మంచిరోజులు
ఆంగ్ల భాష ప్రపంచంలో అతిపెద్దభాషగా ఎదిగి ఏలటానికి దాని అక్షరాలు  నాలుగు బడుల్లో ఉండటం ఒక కారణమని ఆచార్య ప్రబోధానంద యోగి గారు అంటుంటే నిజమేనా అని ఆగి ఆలోచించవలసి వచ్చింది.ప్రపంచం లో ఎన్నో భాషలు ఉంటే లిపి నాలుగు రకాలుగా ఏ భాషకన్నా ఉందా అని ఆయన ప్రశ్నించాడు.నిజమే కదా ? నాలుగు రకాల లిపులు ఇంకే భాషకన్నా ఉన్నాయో లేదో తెలిసినవాళ్ళు చెప్పాలి.చాతుర్వర్ణం మయా సృష్ట్యామ్ అనే శ్లోకం ఆధారం చేసుకొని అదే మాదిరిలో నాలుగు బడుల అక్షరాలు చేసుకున్నారేమోనని ఆయన సందేహమూ వ్యక్తం చేశారు.భాష ఎదగాలంటే లిపి కూడా ముద్రణకు,రాయటానికి అనుకూలంగా బాగుండాలన్నమాట.56 అక్షరాలున్న మన అతిపెద్ద తెలుగు లిపికి కూడా నాలుగు బడుల అక్షరాలు సమకూర్చలేము కానీ  ఉన్న ఒకే ఒక్క లిపిని ముద్రణకు రాతకూ ఎలా అనుకూలంగా చెయ్యాలో  ఆలోచిద్దాం.

ఇణి ,,న్య

ఇది ఇటీవలే ఎదురైన సమస్య. జ్ఞానము అని రాయకుండా జ్నానము అని రాస్తే ఫేస్ బుక్ అంగీకరిస్తోంది. జ్ఞా అనే తెలుగు అక్షరం ఎక్కడ కనబడ్డా మొత్తం పోస్టునే తొలగిస్తోంది. జ్ఞా లోని ఇణి గుర్తు సురక్షితమైనదే కాబట్టి అనుమతించాలని అభ్యర్ధన పంపాను.ఇణి గుర్తు తెలుగు అక్షరమాల లో ఒక అక్షరం.దాని ప్రత్యేకత దానిది.ఈ అక్షరాన్ని వదిలేద్దామా కాపాడుకుందామా?అని మిత్రులను అడిగితే అక్షరాన్ని వదులుకోకూడదు అని కొందరు ,ఇది తాత్కాలిక సమస్యే త్వరలో తొలగిపోతుంది అని కొందరు అన్నారు. యూనీకోడ్ లో ఉన్న అక్షరమే అయినప్పటికీ ఈ అక్షరం ఉన్న వ్యాసాలను అది ఎందుకో తిరస్కరించి ఫేస్ బుక్ మిత్రులను ఇబ్బంది పెట్టింది.  
 
ప్రపంచ తెలుగు మహాసభలు ఇన్ని సార్లు జరిగినా ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య లిపి సమస్య. మన జాతి వెనుకబడి పోవటానికి ,తెలుగులో చదువులు బండబారిపోవటానికి,ఇంగ్లీషుతో సమానమైన వేగం అందుకోలేకపోవటానికి మన లిపే ప్రధాన కారణమని పండితులు,మేధావులు ఎప్పటినుండో చెబుతూనే ఉన్నారు. అయినా లిపి సంస్కరణ జోలికి వెళ్ళకుండానే మహాసభల్ని ముగించేస్తున్నారు.భాషను బాగుచేసే లిపి సంస్కరణ కార్యక్రమాన్ని ఇప్పటికైనా చేపట్టడం మంచిది.
బ్రహ్మ ఏర్పరచిన లిపి 'బ్రహ్మలిపి' అనుకుంటున్నారేమోగాని మనవాళ్ళు లిపి సంస్కరణకు భయపడుతున్నారనిపిస్తోంది. సవర భాషకు గిడుగు కొత్త లిపిని తయారు చేశాడు అంటారు. కానీ కొత్త లిపి ఎందుకు?తెలుగు లిపినే వాడుకోవచ్చుకదా?కొత్త లిపి జనామోదం పొందటం కష్టమే.భాష వాక్కు రూపంలో ధ్వనిస్తే, ఆ ధ్వనికి సంకేతమే లిపి, ఈ లిపి మనిషి తన సౌలభ్యంకోసం తయారు చేసుకున్నాడు. మోషేకు పది ఆజ్ఞలు దేవుడు రాతి పలకల విూద హెబ్రూ లిపిలో చెక్కి ఇచ్చాడట. ఎందుకంటే మోషే భాష హెబ్రూగనుక. మనమంతా కలిసి ఈ శబ్దాన్ని ఈ అక్షరంతో రాయాలి. ఇలా రాయాలి అని నిర్ధారించుకుంటే అదే మన లిపిగా నిలబడుతుంది. ప్రపంచంలో వేలాది బాషలకు లిపి లేదు. ఆ భాషలు రానురాను నాశనమై పోతున్నాయి. కేవలం 26 అక్షరాలతో వత్తులు, గుణింతాలను కూడా కల్పించుకొని సాఫీగా యంత్రాల విూద సాగిపోతున్న ఇంగ్లీష్‌ తరహలో తెలుగు లిపిని కూడా సంస్కరించుకోవాలి.
భూపతి నారాయణమూర్తి 'భోధన, పాలన జనజీవన రంగాలలో తెలుగు' (1998) అనే పుస్తకంలో ఇలా అంటారు: మన లిపిలో ఉపయోగం లేని అక్షరాలు మూడోవంతు వరకు ఉన్నాయి. వాటిని రద్దుచెయ్యాలి. ఉ,ఖ,ఘ,ఞ,ఝ,థ,ణ వగైరా అక్షరాలను తీసి వేయాల్సి ఉంది. చైనా 3 సార్లు తన లిపిని సంస్కరించింది. శాస్త్ర సాంకేతిక పరికరాలకు అనుకూలంగా లిపిని తయారు చేసుకున్నారు. అలాగే తెలుగు లిపిని కూడా సంస్కరించాలి. అప్పుడే అధికార భాషగా తెలుగు రాణించగలదు. లిపిని సంస్కరించటం వల్ల అత్యధిక సంఖ్యలో ఉన్న నిరక్షరాస్యుల్ని కూడా అక్షరాస్యులుగా చేయటం తేలిక అవుతుంది.'' ఇప్పటికే మనం ఋ,బుూ,ఌ ,ఁ,ఱ,చ,జ,లాంటి అక్షరాలను వదిలించుకున్నాము. ''అక్షర దీక్ష'' వాచకాల్లో కేవలం 30 అక్షరాలే ఉపయోగించారు.
బూదరాజు రాధాకృష్ణ ''భాషాశాస్త్ర వ్యాసాలు'' (1990) అనే పుస్తకంలో ఇలా అన్నారు. ''నిజానికి పారిశ్రామిక విప్లవం, సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలైన రోజుల్లో యూరప్‌లోని దేశాలు లాటిన్‌, గ్రీకు భాషల ప్రభావం నుంచి వేర్పడి దేశభాషల్లో సమస్త వ్యవహారాలు జరుపుకోవటం మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు మనం పడుతున్న కష్టాలన్నీ తామూ అనుభవించాయి. అన్ని సమస్యలూ మనకే రాలేదు. ప్రయత్నలోపం వల్ల, భాషాస్వభావ పరిజ్ఞాన లోపం వల్ల, మాతృభాషాభిమాన లోపంవల్ల, తెచ్చిపెట్టుకున్న చిక్కులే మనకెక్కువ. ఉపయోగం వల్ల భాష పెరుగుతుంది. తెలుగును అధికార భాషగా వినియోగించినప్పుడు అదే సహజంగా అభివృద్ధవుతుంది.''
''...56 అక్షరాలున్న తెలుగు భాషకంటే 26 అక్షరాలే ఉన్న ఇంగ్లీషు ఎక్కువ వాడుకలోకి వచ్చింది, ప్రపంచ భాష అయ్యింది. కాబట్టి తెలుగు భాషకు 16 అక్షరాలే పెట్టి నంబర్‌ వన్‌ పొజిషన్‌ తెస్తాను చూడండి..'' అంటాడొక నాయకుడు సినిమాలో. అది అతను భావావేశంలో సాధ్యసాధ్యాలను గమనించకుండా అన్నమాట అయినప్పటికీ భాషా సంస్కర్తలు ఈ పనికి పూనుకోవచ్చు. తెలుగులో ఎదురయ్యే మొదటి సమస్య గుణింతాలు, వత్తులు. వీటివలన అక్షరానికి క్రిందా పైనా మరో రెండు లైన్లు స్థలం అవసరమవుతుంది. టైపుమిషను, కంప్యూటర్‌లలో అక్షరాలు ముద్రించేటప్పుడు ఈ విషయం తెలుస్తుంది. ఇంగ్లీషులో కేవలం AEIOU అనే అచ్చులతో మిగతా 21 హల్లులు కలిసి భాష ఒకే లైనులో సాఫీగాసాగి పోతుంది. ''తెలుగు లిపి పరిణామం'' అనే వ్యాసంలో డాక్టర్‌ తిరుమల రామచంద్ర వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలివి. ''..తెలుగు లిపి గుండ్రంగా అవటానికి 2500 ఏళ్ళు పట్టింది. అంతకు ముందు ఇవి అడ్డపు, నిలువు గీతలే. భాష ధ్వనిరూపం. ఈధ్వనికి సంకేతాలే లిపులు. అచ్చు వచ్చిన తరువాత లిపి స్వరూపం మరింత సుందరమయి స్థిరపడింది. ఇక్ష్వాకుల కాలంలో శిల్పులు అక్షరాలకు ఒంపులు వయ్యారాలు చేకూర్చారు. అక్షరాల నిలువు గీతలు అడుగున పొడవై కుడి వైపునకు వంపు తిరిగాయి. శాలంకాయనుల కాలంలో కొన్ని అక్షరాల తలపై అడ్డగీత ఏర్పడింది. కొన్ని అక్షరాలు గుండ్రతనం వదిలి కోణాకారం దాల్చాయి. విష్ణుకుండినుల కాలంలో తలపై అడ్డుగీత అన్ని అక్షరాలపై కనిపించింది. వీరి కాలంలో 'ళ్జ' ఆనే వింత అక్షరం ఉండేది. తరువాత అంతరించింది. చాళుక్య లిపి చక్కగా నిలువుగా ఉంటుంది. నన్నయ కాలం నుంచి వేంగీ చాళుక్య లిపిలో మార్పులు ప్రారంభమై 200 ఏళ్ళకు కన్నడ, తెలుగు లిపులు విడిపోయాయి. తెలుగు మరీ గుండ్రమై పోయింది, కన్నడ లిపి కోణాకార మయ్యింది. నన్నయ్య కాలపు అక్షరాలకు మధ్యన అడ్డంగా గీత గీస్తే తలకట్టు దగ్గర తెగుతుంది. అంటే తలకట్టు సగమూ, తక్కిన అక్షరం సగమూను. కాకతీయుల అక్షరాలలో తలకట్టు చిన్నదై తక్కిన భాగం పెద్దది కావటంతో అక్షరాలు పొంకంగా , దీర్ఘవర్తులంగా అయి అందం వచ్చింది. ప, హలు తలకట్టు విదిల్చుకున్నాయి. చాప, జల్లెడ వంటి వాటిలో 'త ఒత్తు' వంటి గుర్తు 19వ శతాబ్దంలో సి.పి. బ్రౌన్‌ పెట్టించాడు. మరో వింత అక్షరం అరసున్న. 16వ శతాబ్దానికి ముందు కనిపించదు.
ముఖ్యాక్షరాలు ఎంతగా మారాయో గుణింతాల గుర్తులు అంతకు రెండింతలుగా మారాయి. క్రావడి మరొక్క రూపం వలపల గిలక 'కర్మ' అని వ్రాయడానికి కమ్‌ అని వ్రాసేవారు. ఈ విధంగా తెలుగు లిపి 23 వందల సంవత్సరాలలో ఎన్నో మార్పులు పొంది నేటికీ రూపానికి వచ్చింది. ప్రస్తుత యంత్రయుగంలో ఎన్నో మార్పులు పొందవచ్చు. లోహాక్షరాలు చేతితో పేర్చుకొనే అవసరం పోయి, ఆంగ్లంలో లాగా మోనోటైప్‌ యంత్రాలలోను, లైనోటైప్‌ యంత్రాలలోను టైప్‌లాగా కొట్టే వరకు అభివృద్ధి చెందింది. అక్షరాలను విడగొట్టి కలిపే పద్ధతిలో స్వరూపాలు గూడా ముందుకన్నా మారాయి. కంప్యూటర్‌ ద్వారా కంపోజ్‌ చేసే పద్ధతి ప్రస్తుతం గొప్ప విప్లవం. ఒకచోట వాడిన మాట పలుచోట్ల అక్షరరూపం దాల్చే పద్ధతి కూడా వచ్చింది. శ్రమ తగ్గించుకొని లాఘవం కోరే మానవుని బుద్ధి ఈ వర్ణమాలలోనూ ఎన్నోమార్పులు తలపెట్టవచ్చు.
విజయ లిపి –భారతి లిపి
భారతదేశం లోని అనేక భాషల లిపులను కలపటానికి ఉమ్మడి లిపులను తయారు చేయటానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి : సత్య సాయిబాబా కోరికమేరకు కన్నడ –తెలుగు లిపులను కలిపి విజయ లిపి రూపొందించే ప్రయత్నం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల స్మృతి చిహ్నంగా.. విజయనగర సామ్రాజ్యాన్ని జ్ఞప్తికి తెచ్చేలా ‘విజయ లిపి’ అని పేరు పెట్టారు. బాబా చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. మద్రాసు ఐ.ఐ.టి. ప్రొఫెసర్ వడ్డాది శ్రీనివాస చక్రవర్తి భారతి లిపి రూపొందించారు. పెరియార్ రామస్వామి కూడా తమిళ అక్షరమాల ను ఆధునీకరించారట.ఇవన్నీ ప్రజలకు లిపి బాధలు తొలగించటానికే.

 ''కొన్ని తెలుగు ముద్రాక్షరాలు అచ్చు కూర్పరులకు విసుగు పుట్టించేవి. తెలుగు లిపిలో ఉన్న క్లిష్టత వల్ల తెలుగులో అచ్చు కూర్చటానికి (కంపోజింగ్‌కు) చాలా ప్రయాస పడేవారు. ఉదాహరణకు ఆనాడు అచ్చులో ఉపయోగిస్తున్న అర్ధచంద్రాకారంలో వేరొక వర్ణానికి కిందరాస్తూ ఉండిన రావడి కూర్పు చాలా శ్రమ కలిగించేది. దీన్ని సి.పి. బ్రౌన్‌ తెలుగు శాసనాలలో ఉన్న గుర్తును నమూనాగా గ్రహించి లాంటి రెండు రూపాలు కల్పించారు. ఈ సంస్కరణల వల్ల కూర్పరులకు కొంత శ్రమ తగ్గింది. అచ్చు కూర్పు కొంత మేరకు వేగవంతమయ్యింది. ఈ కొత్త రూపాలకు 'బ్రౌన్‌ రావళ్ళు' అనే పేర్లు కలిగాయి. ఇలాగే ప,వ,న, స, ల విషయంలో లిపిలో ఉన్న సామ్యాన్ని బట్టి పొరబాటు పడటానికి అవకాశం ఉన్న దాన్ని గ్రహించి కన్నడంలో ఉన్నట్లు ఈ అక్షరాలలో స్పష్టంగా మార్పు కనబడే విధంగా టైపులు పోత పోయించి సి.పి.బ్రౌన్‌ వాటిని వాడుకలోకి తెచ్చారు. కాని ఇవి తెలుగులో నిలిచినట్లు కనబడదు. బ్రౌన్‌ కొన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టినా, తెలుగు, ముద్రణ పెక్కు లోపాలతో సాగుతూ వచ్చింది. ముద్రాక్షరాల సంఖ్యను 405 కన్నా తగ్గించటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. బందరులోని కళ్యాణీ టైపు ఫౌండ్రీ అధిపతి కె.వి. కొండయ్యగారు అక్షరాల సొంపు చెడకుండా ముద్రణా యంత్రానికి ఒదిగే విధంగా టైపు తయారీలో సాంకేతిక మార్పులు చేసి, 350కి తెలుగు లిపి రూపాలను కుదించారు. దీన్ని '' కళ్యాణీ టైపు '' అన్నారు. తక్కువ వ్యవధిలో అచ్చుకూర్చి తక్కువ వ్యయంతో తెలుగు పుస్తకాలు ముద్రించవలసిన అవసరం ఏర్పడింది. దీనికి తెలుగు లిపి ప్రతిబంధక మైంది. అది ముద్రణకు అనుకూలంగా లేదు. గుణింతపు గుర్తులు (తలకట్టులు, గుడులు, సుడులు) మొదలైనవి అక్షరానికి పైనా కిందా ఉండటం, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలూ, వీటి గుర్తులు కొన్ని సూటిగా అక్షరం కింద ఉండటం, అక్షరాలు అధికంగా ఉండటం అనే అంశాలు తెలుగు లిపిలోని క్లిష్టతకు ముఖ్యమైన కారణాలు. ఇలాంటి క్లిష్టత వల్లే తెలుగులో పుస్తక ముద్రణ వేగంగా జరగటం లేదు. లోపాలను తొలగించి తెలుగు లిపి సంస్కరణ తప్పనిసరిగా జరపవలసి ఉంది.
మన మీనాడు కంప్యూటర్‌ యుగంలో పురోగమిస్తున్నాం. పరిణామాలను ఆహ్వానిస్తున్నాం. వేగం నేటి యుగధర్మం. ఈ వేగానికి తట్టు కోలేనిదేదీ నిలవదు. మందకొడిగా అక్షరాలు కూడా నడక సాగించలేవు. తెలుగు భాషకు. ఇదొక సంధియుగం. మద్రాసులో మురళీకృష్ణ అనే ఇంజనీరు బాపు అక్షరాలతో సహా అందంగా అక్షర స్వరూపాలకు కంప్యూటర్‌ ప్రింటింగ్‌కి అనువుగా కీ బోర్డులు రూపొందించాడు. లిపిని ఇంకా సంస్కరించి తెలుగు భాషా స్వరూపాన్ని ఆధునీకరించటానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'' . ప్రభుత్వం, అధికార భాషా సంఘం ,తెలుగు విశ్వవిద్యాలయం ''లిపి సంస్కరణ'' కొరకై నడుము బిగించాలి.

 ఒకసారి నేనే న్యాయమూర్తినయ్యాను. రంపచోడవరం మొబైల్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ . అంతా గిరిజనులు, మన అచ్చ తెలుగువాళ్ళు, ఆహా, ఇంకేం తెలుగులో తీర్పులివ్వొచ్చు అని ఆనందపడుతూ వెళ్ళాను. అక్కడా పదిమంది లాయర్లు ' యువరానర్‌' అంటూ ప్రత్యక్షమయ్యారు. ఆంగ్ల భాషాకోవిదులైన అడ్వకేట్లు నల్లకోట్లు వేసి నాముందుకొచ్చి, నేను తెలుగు న్యాయం మాత్రమే చెప్పబూనటం అపూర్వం, సాహసం, ప్రమాదభరితం అని ఆంగ్లంలో ఉపదేశించారు. అడివిలో కూడా ఆంగ్లమేనా ఇక నా తెలుగెక్కడ తల్లీ? అని తడుముకున్నాను, మదనపడ్డాను. వాది, ప్రతివాది, సాక్షులు అంతా తెలుగులో చెబుతున్నారు. వాళ్ళు చెప్పింది చెప్పినట్లు వాంగ్మూలం టైపు చేయమంటే ''తెలుగు టైపు మిషన్‌ లేదు, అయినా అది కష్టం, విూరు ఇంగ్లీషులోకి మార్చి చెప్పండి కొడతాం'' అని సిబ్బంది ఇబ్బంది పడ్డారు. శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్లుగా బహుశా తెలుగును అభిమానించే న్యాయమూర్తులంతా ఇటువంటి ఇబ్బందుల్ని నెగ్గుకు రాలేక మౌనం దాల్చారని స్వానుభవం మీద అర్థం అయ్యింది.
కంప్యూటర్లొచ్చాయి, కోర్టులో తెలుగు సాఫ్ట్‌వేర్‌ వాడుకోవచ్చుగదా అని కొందరు ఉచిత సలహాపడేశారు. నిజమే గదా అని కంప్యూటర్‌ అడిగాం. ఇస్తామన్నారు అయితే దానికి ఇంగ్లీష్‌ కీబోర్డే ఉంటుంది. ఇంగ్లీష్‌లో కొడితే తెలుగు అక్షరాలు ప్రత్యక్షమవుతా యన్నారు. మాడుమీద కొడితే మోకాలు పగిలినట్లు ఈ బాధ మనకెందుకు తెలుగు మాటల్నే ఇంగ్లీషులో కొడదాం తేలికగా పనైపోతుంది annaru kondaru అసలు విషయం అర్థంకాకుండా పోతుంది annaru inkondaru ఇలాంటి తీర్పులు ఎవరు ఒప్పుకొంటారండీ అని ఇంకొంత మంది ఆక్రోశించారు. వత్తులు గుణింతాలతో పడిలేచి చచ్చేకంటే, యంత్రానికి అనువైన ఆంగ్లాక్షరాలతో పనిచేసుకోవచ్చు గదా అప్పుడు మన తెలుగును ఇంగ్లీషొచ్చినోళ్ళంతా చదువుతారు, తద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇంగ్లీష్‌ సౌలభ్యాలన్నీ మనం కొట్టేయవచ్చు అన్నారింకొందరు . అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్టవు తుందేమోనని అన్నారు మరికొందరు. ఆచర్చ అంతటితో ఆపాము.
ఇంతకీ తెలుగుకు వైభవం తేవటానికి ప్రభుత్వం నడుం బిగించిదనే వార్తలు, ప్రజల భాషకు పట్టం కట్టడానికి పలుచర్యలు తీసుకుంటామని అధినేతలు ప్రకటించటం సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఎన్టీరామారావుగారు న్యాయ పంచాయితీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. అవి వస్తే ప్రజల భాషలో తీర్పులొస్తాయి. పరాయి ప్లీడర్లు, పరాయిభాష, పరాయి ప్రాంతం లాంటి సమస్యలు ఉండవు. ఏ భాషలో న్యాయస్థానం తీర్పులిస్తుందో అదే నిజమైన అధికార భాష. తెలుగుకు ఆ స్థాయి రావాలి అని నాఆకాంక్ష! ఇంగ్లీషు ప్రభావంతో తెలుగు తెల్లబోతోంది. ఆధునికులు మాట్లాడే నాలుగు ముక్కల తెలుగులో మూడుమాటలు ఇంగ్లీషువే ఉంటున్నాయి. ఇంగ్లీషు మాటలతో చక్కగా కలిసి పోయి కొత్తరకం ''తెల్గిష్‌'' భాష తయారయింది. ప్రస్తుతం ''తెల్గిష్‌'' వీరవిహారం చేస్తోంది.                                                                 సంస్కృతం, తమిళంతోపాటు తెలుగు కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలుగా కేంద్రం ప్రకటించింది. ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి. చైనా భాష తమిళంకంటే ప్రాచీనం. వారు లిపి ఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలాసార్లు సంస్కరించుకున్నారు. మనం కుండపెంకుల మీద, బండరాళ్ళమీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యావాళ్ళు, జపాన్‌వాళ్ళు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాషను ప్రాచీనహోదాతోపాటు ఆ భాషను ఆదునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవడం. భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవితానికి సంబంధించి పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి.                                                                                      తెలుగు లిపి ఎన్నోసార్లు మారింది

"ఇంపు చేయవచ్చు కంప్యూటరందుండు

అచ్చరాల బెడద ఖచ్చితముగా

అలవికానిదంటు అన్వేషణకు లేదు

తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ


ఉన్నలోపములను తిన్నగా సవరించి

తల్లిభాష నున్నతముగా తీర్చిదిద్ది

అప్పగింపవోయి అధికార పీఠాన్ని

తెలివి తెచ్చుకోని తెలుగు బిడ్డ


అరయ యూనికోడు కందరూ క్రమముగా

మారి మాతృభాష మనుగడకును

సహకరించినపుడె సంపూర్ణ సమృద్ధి

తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ


లోటు పాటులుంటె నీటుగా సవరించి

పాటు చేసి తెలుగు మీట నొక్కు

ఎలుకలున్న వంచు యిల్లు తగలేతుమా

తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ


లిపిని సంస్కరించి అపర వజ్రమ్ముగా

తీర్చి దిద్ది చూడు తెలుగు భాష

రాజ పీఠమునకె తేజస్సు నందించు

తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ "

--- ఆకురాతి గోపాలకృష్ణ


లిపిని మార్చుకోవడం ఎందుకు ?
ఇంగ్లీషు స్థాయిలో మన భాషకుకూడా అభివృద్ధి చేసిన యాంత్రిక సదుపాలు కల్పించడం కోసమే.వాస్తవానికి లిపి సంస్కరణ యంత్రాలకనుగుణంగా జరగాలి. కంప్యూటర్‌లలో వాడకానికి ప్రస్తుతం తెలుగు సాఫ్ట్‌వేర్‌లో ఏయే సమస్యలు తలెత్తుతున్నాయో వాటిని నిశితంగా, పరిశీలించి నిరంతరం వాటిని బాగుచేసే నిపుణుల్ని నియమించాలి. పరిశోధకుల్ని ప్రోత్సహించాలి.అలాంటి మంచి పనులు ఏవీ ఏళ్ళతరబడి తెలుగువాళ్ళు చేసి తెలుగు ప్రజలకు తెలుగు ద్వారా సౌకర్యం కల్పించలేదు.
భాషను పాడుచేసుకొవడం, మళ్ళీ బాగుచేసుకోవాలన్న అలోచనే లేకపోవటం, అరకొరగానైనా చేపట్టిన పనిని పూర్తి చేసుకోలేక చతికిల పడుతూ ఆంధ్రులు ఆరంభ శూరులు అన్న నానుడిని సార్థకం చేశారు.
పూర్వం మన భాష నశించిపోతుందే అని కొంత మంది నాయకులైనా బాధపడేవారు. కానీ ఇప్పుడు తెలుగు ఎందుకూ పనికిమాలిన భాషనీ, ఇంగ్లీషు, హిందీ వస్తే మనం ఎక్కడైనా చలామణీ కావొచ్చనీ, పదవులు దక్కాలన్నా, పరపతి పెరగాలన్నా కేవలం తెలుగు వస్తే చాలదనీ, హిందీ, ఇంగ్లీషు భాషలు తప్పనిసరిగా నేర్వాలనీ, చచ్చిపోయే ముసలి భాషను ఎవరూ బ్రతికించలేరనీ మన తెలుగు మేధావులే వాదిస్తున్నారు. మన నాయకులు అందుకు వంతపాడుతున్నారు. ఇక వీళ్ళు తెలుగుకు అధికార పీఠం దక్కనిస్తారా? తెలుగు జనం ఉద్యోగాల కోసం, విజ్ఞానం కోసం ఇంగ్లీషును ఆశ్రయించక తప్పదంటున్నారు మన మేధావులు.

తెలుగు అధికార భాష కావాలంటే ఇంగ్లీషు స్థాయికి దానిని అభివృద్ది చెయ్యాలి. తెలుగు నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి. ఎందుకు? ఎలా? అని మన పాలకులు, ప్రజలు ప్రశ్నించుకోవాలి. మన ప్రభుత్వం నడుపుతున్న తెలుగు మీడియం స్కూళ్ళన్నీ ఇంగ్లీషు లిపి లోకి మారిస్తే చాలు. ఒక్క చర్యతో అన్నిసమస్యలూ పరిష్కార మవుతాయి. కానీ, ఇప్పుడున్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ళన్నింటినీ తెలుగు మీడియం లోకి మార్చాలంటే అడుగడుక్కీ అడ్డంకులొస్తాయి. ముందు ఇంగ్లీషులో తీర్పులిచ్చే కోర్టులే అడ్డుపడతాయి. కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది. గవర్నర్లు, ఇతర భాషల ఐ.ఎ.యస్‌. ఆఫీసర్లు అడ్డుపడతారు.
ఈనాడు అమెరికాలో కంటే ఎక్కువగా ఇండియాలోనే ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళున్నారు.ఆ మేరకు మన భాషలు నాశనం అయిపోయాయి. దీనికి ప్రధాన కారణం మన దేశానికి లింకు భాష కావాలి. జాతీయ, అంతర్జాతీయ భాషల్ని మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేశం కోసం మోస్తూ, మన భాషను గత్యంతరం లేక నిర్లక్ష్యం చేస్తూ పోవాలి.
ఒక్కో భాష మాట్లాడేవారు ఒక్కో జాతి. ఎవరి భాష వారికి గొప్ప. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని మనమంటే కాదు హిందీయే గొప్ప అంటారు ఉత్తరాది వాళ్ళు.అలాంటి పరిస్తితుల్లో ఇంగ్లీషే భారతీయులందరికీ అవసరమైన లింకు భాషగా తప్పనిసరి అయ్యింది. నిరాఘాటంగా ఇండియాను పాలిస్తోంది.
మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీషు భాషను పాశ్చాత్యులే కాకుండా భారతీయులు కూడా సాంకేతికంగా, శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చేశారు. కోట్లాది మంది భారతీయులు ఇంగ్లీషు నేర్చారు. అఆలు రాకపోయినా ABCD లు వచ్చేస్తున్న రోజులివి. తప్పదు మరి. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవాలి. ఇంగ్లీష్‌ వాళ్ళు I,II,III, IV లాంటి రోమన్‌ అంకెలు వాడేవారు. తరువాత 1,2,3,4,5,6,7,8,9 అనే అంకెల్ని అరబ్బుల నుండి, '0' ను ఇండియా నుండి తీసుకెళ్ళి తమవిగా చేసుకున్నారు. ఏమీ సిగ్గుపడలేదు. దొంగతనంగా,నామర్దాగా భావించలేదు. పరాయి భాషలకు చెందిన అంకెలని ద్వేషించలేదు. తమ అంకెలు నామ రూపాల్లేకుండా పోతున్నాయే అని బాధపడలేదు. కేవలం సౌకర్యం చూసుకున్నారు. తమ భాష చెలామణీ కావటం చూసుకున్నారు.
మరి మనవాళ్ళు లింకు భాషగా ఇంగ్లీషును ఎన్నుకున్న రోజున, ఇంగ్లీషు లిపిని కూడా లింకు లిపిగా జాతీయ లిపిగా నిర్ణయించినట్లయితే భారతీయ భాషల నడక వేగం పెరిగి ఉండేది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్ళకూ ఒకే లిపి నేర్పబడేది. భారతీయ భాషలు శబ్ద రూపంలో ఎన్ని విన్యాసాలు చేసినా, ఒకే లిపిలో ఉంటే కనీసం దేశస్తులంతా చదివే వాళ్ళు. ఒక లిపికి అలవాటైన మనిషి తన భాషను మరో లిపిలో రాయటానికి, తన భాషను మరో లిపిలో చదవటానికి అంత సుళువుగా ఇష్టపడడు. లిపి మారితే తన భాషే మారిపోయినట్లుగా ఫీలవుతాడు. కానీ ఈనాడు మనం మన పొరుగు భాషలను కూడా చదవలేకపోతున్నాం. దేశమంతటికీ ఒకే లిపి ఉన్నప్పుడు ఇరుగు పొరుగు భాషలు అర్థం కాకపోయినా, మాట్లాడలేకపోయినా కనీసం చదవటం వస్తుంది. ఏ భాష వాడికైనా చదివిపెట్టడం వస్తుంది. వంద రూపాయల నోటు మీద 18 లిపుల్లో ముద్రించనక్కరలేదు. ఆయా భాషల వాళ్ళు వందరూపాయల్ని ఏమని పలుకుతారో ఆ శబ్దాన్ని ఇంగ్లీషు లిపిలో ముద్రించవచ్చు. వందరూపాయల్ని ఏ భాష వాళ్ళు ఏమని పిలుస్తారో మిగతా అన్ని భాషల వాళ్ళూ చదివి తెలుసుకోవచ్చు. దీన్ని Transliteration అంటారు. సంస్కృత శ్లోకాల్ని,అరబీ సూరాలను మనం తెలుగు లిపిలో రాసుకుంటున్న మాదిరిగానన్న మాట.
మన ఆర్టీసీ బస్సుల మీద తెలుగు అంకెలు వేశారు కానీ అరబీ అంకెల్ని అంటే నేటి ఇంగ్లీషు అంకెల్నే జనం చదువుతున్నారు. కాలగమనంలో పారవేయబడిన వాటిని వెతికి తీసుకొచ్చి జనానికి అలవాటు చేస్తామంటున్న భాషాప్రియులు, అంతకంటే సుళువుగా జనమందరికీ అలవాటైన వాటితోనే భాషాభివృద్ధి చేయవచ్చు. వాక్కు రూపంలో ఉండే భాషకు మనిషి కల్పించిన రూపమే లిపి. లిపిరాని వాడికీ భాష ఉంటుంది. అసలు భాషే రాని వాడికి లిపి ఏముంటుంది? భాషను చదవటానికీ, రాయటానికీ పెట్టుకున్న గుర్తులే అక్షరాలు. అవి మన దేశంలో అందరికీ ABCD ల రూపంలో నేర్పబడ్డాయి. ''అఆ'' అనే అక్షరాలొచ్చిన పిల్లలు దేశమంతటా ఉండరు కానీ ABCD అనే అక్షరాలొచ్చిన పిల్లలు దేశమంతటా ఉన్నారు. వండి వడ్డించిన దాన్ని తినటానికి తిరస్కరించినందువల్ల మన జాతి శుష్కించిపోతున్నది. తెల్లవాడు అందరివీ దొంగలించి తిని బలిసిపోయాడు. నల్లవాడు అలిగి నలిగి నీలిగి నీరసించాడు.
సుప్రీం కోర్టు నుండి, ఈ దేశ సర్వోన్నత పాలక పీఠాల నుండీ ఇక ఇంగ్లీషును తొలగించటం సాధ్యం కాదు గనుక రకరకాల లిపుల్ని సంస్కరించి యావత్తు భారత జాతికీ అర్థం అయ్యేలా చేయటం అసాధ్యం గనుక, ఆంగ్ల లిపిని స్వంతం చేసుకుని, దేశంలోని అన్ని భాషలకూ దాన్నే జాతీయలిపిగా అమలు చేస్తే మనకు ఎన్నో కష్టాలు తగ్గుతాయి. అంతర్జాతీయంగా ఆంగ్లభాష లిపికి సమకూరిన యాంత్రిక ప్రయోజనాలన్నీ మన దేశీయ భాషలకూ సమకూరుతాయి. ఈ మార్పుకొక తరం పడుతుంది. వివిధ లిపులకు అలవాటు పడిన పెద్దలు తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. కానీ కొత్తగా నేర్చుకునే పిల్లలు సునాయాసంగా ఇంగ్లీషుతోపాటే తమ మాతృభాషల్నీ ఒకే కీ బోర్డుతో సాధన చేస్తారు. ఇంగ్లీషు అక్షరమాలలో లేని కొన్ని శబ్దాలకు కొత్త అక్షరాలను జోడించుకోవటం కన్నా, ఉన్న అక్షరాలకే కొన్ని గుర్తులు జోడించటం ద్వారా ఈ శబ్దం వస్తుందని శాసనం చేయవచ్చు. దేశీయ భాషల మధ్య నిఘంటువుల తయారీ కూడా సుళువవుతుంది. భాషలు నేర్చుకోవటం కూడా తేలికవుతుంది.
మీసేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు తెలుగు ఫిర్యాదులు రోమన్ లిపిలోనే పంపుతున్నారు. ఇంగ్లీషు రాని వాళ్ళు కూడా ఇంగ్లీషు లిపిలో తమ తెలుగు ఫిర్యాదుల్ని ఎంతో చక్కగా పంపించారు. ఒక ఫిర్యాదు ఇలా ఉంది:-
Ayyaa,
NAA BHARTHA CHANIPOYI NAALUGELLAYYINDI. KUTUMBHASANKSHEMA PADHAKAM KINDA NAAKU SAHAYAM INKAAANDALEDU. TAMARU DAYATO AA SAHAYAM IPPINCHAGALARU.
ఈ ఫిర్యాదు యధాతథంగా కలెక్టర్‌ నుండి MROకు వెళితే, MROకూడా Telugu లోనే చక్కగా జవాబిచ్చాడు. పనిలో వేగం పెరిగింది. ఆంగ్ల భాష రాకపోయినా, అనువదించి కూర్చుకునే నేర్పు లేకపోయినా భావం చక్కగా చేరాల్సిన చోటికి చేరింది. ఆంగ్ల లిపి ద్వారా ఒన గూడే ఈ సదుపాయాన్ని మనం ఎందుకు స్వంతం చేసుకోకూడదు? నేటి పెద్దలు ముందు చూపుతో చేసే త్యాగాలే రేపటి పౌరులకు సుఖమైన జీవితాన్నిస్తాయి.
గుండ్రని అందమైన నా లిపి అంతరిస్తోందనే బాధ నాకూ ఉంది. కానీ లిపిని అంకెల్ని యంత్రానికి తగ్గరీతిలో ఆంగ్లేయులు అభివృద్ధి పరిచారు. వాళ్ళ అంకెల్ని మనం ఎలాగూ వాడుతూనే ఉన్నాం. ఇక అక్షరాలను కూడా వాడుకుంటే అధికార భాషగా రోమన్‌ తెలుగును ఫైళ్ళలో కంప్యూటర్ల ద్వారా అమలు చేయటం ఎంతో సుళువవుతుంది. లిపిసమస్య సాకుతో అధికారభాష అమలును ప్రక్కన పెట్టటం కంటే అంతర్జాతీయంగా అమలవుతున్న లిపినే మన భాషకు వాడుకుంటే మేలు జరుగుతుందని ఆశ. రానున్న రోజుల్లో దేశమంతటికీ ఉమ్మడి లిపిగా ఆంగ్లాక్షరాలను ఉపయోగించుకునే విషయమై విస్తృతంగా చర్చలు జరగాలి. దేశ భాషలన్నింటికీ జవసత్వాలను సమకూర్చే నిర్ణయాలు జరగాలని ఆశిద్దాం.
లిపిని మార్చుకోవటం ఎలా?
‘‘ప్రపంచంలోని అన్ని భాషల ముద్రణ ఒక ఎత్తు. తెనుగు ముద్రణే ఒక ఎత్తు. ఇదొక గారడీ. తెనుగు అక్షరాలు కూర్చడానికి కంపోజిటరు 700 దిమ్మలు, గళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి కంపోజిటరు శతావధాని, సహస్రావధాని కావలసి ఉంటుంది. ఈ చిక్కును తొలగించుకోడానికి ఏ రోమన్‌లిపినో అనుసరిస్తే అచ్చు సౌకర్యం కలుగుతుందనుకుంటే అనూచానంగా వచ్చిన ఈ లిపిని వదులుకోడం ఎలా?’’
(తిరుమల రామచంద్ర, మన లిపి పుట్టు పూర్వోత్తరాలు 1957) “ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్ఛితాభిప్రాయం. ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను” అని అన్నారు మహాకవి శ్రీ శ్రీ , ---ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196
భారతీయ భాషలకు ఏకలిపి అవసరమే
అంతర్జాతీయ ధ్వని విధేయ లిపి కాకపోయినా, ఆ పద్ధతిలో సవరింపబడిన రోమను లిపి భవిష్యత్తులో ప్రపంచ భాషలన్నిటికి సర్వవిధాల తగినదై సర్వోత్తమమూ, అభ్యుదయకరమూ అయిన లిపి కాగలదు. టైపుమిషను, లైనోటైపు మొదలైన వాటికి ఒకే విధమైన ముద్రాఫలకాలు(Key boards) మనకు లభిస్తాయి. ప్రపంచ మంతటా ఒకే విధమైన ముద్రణ వ్యవస్థ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఆంగ్ల అక్షరాలు రాస్తున్న పద్ధతిలోరోమ న లిపిలో రాసే విధానం అన్నమాట ) - కస్తూరి విశ్వనాథం (1989 నవంబర్‌ తెలుగు వైజ్ఞానిక మాసపత్రిక)

ముస్తఫా కమాల్ ఆటా టర్క్ లిపి సంస్కరణ

టర్కీ జాతిపిత,టర్కీ మొదటి అధ్యక్షుడు.1928 నవంబర్ 1 నుండి టర్కీభాషకు కొత్త అక్షరమాల ప్రవేశపెట్టాడు.అప్పటివరకు ఉన్న పార్శీ -అరబిక్ లిపి స్థానంలోకి అప్పటికే పాలకభాషగా అభివృద్ధి చెంది,ప్రజాదరణ పొందిన లాటిన్ లిపిని రప్పించాడు.టర్కీ భాష ఉచ్చరణకు వీలుగా 23 ఆంగ్లాక్షరాలకు అదనంగా అవసరమైన [ Ç, Ğ, I, İ, Ö, Ş, Ü ] అనే 6 గుర్తులను కలిపి 8అచ్చులు,21హల్లులుతో 29 అక్షరాలను సమకూర్చారు.ఇందువలన భాష చదవటం రాయటం సులభమై అక్షరాస్యత పెరిగింది. మనం కూడా త,ద,ణ,ళ,శ,లాంటి కొన్ని అక్షరాలకు గుర్తులు కల్పించుకోవచ్చు. ప్రస్తుతం యూనికోడ్లో మన తెలుగు అక్షరాలు అన్నీ ఇంగ్లీషు కీబోర్డు ద్వారానే టైపు చేస్తున్నాము కదా?
ప్రపంచీకరణ వచ్చిన తరువాత భాషల మద్య పోటీ అనివార్యం అయ్యింది. ఏ భాష నేర్చుకుంటే ఉపాధి లబిస్తుందో, ఆ భాష వైపుకే మనిషి పరుగులు తీస్తున్నాడు. అది అతని అవసరం. తెలుగుభాష మాత్రమే వచ్చిన వాడికి కూడా శాస్త్ర విజ్ఞానం,వృత్తి, ఉపాధి లభిస్తుందనే హామీ దొరికిన నాడు తెలుగు తప్పని సరిగా బ్రతుకుతుంది. తెలుగు భాష ఇంకా పది కాలాలపాటు మనుగడ సాగించేందుకు ఉన్న అన్ని మార్గాలలో ప్రతి ఒక్కరం ప్రయత్నిద్దాం.

నూర్ బాషా రహంతుల్లా ,స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,అమరావతి 9948878833((గీటురాయి 19.1.2018 - 2.2.2018)

Nalini Mohan Kumar KalvaNalini Mohan Kumar Kalva బాగుంది " లిపి సంస్కరణ " లో భాగంగా ఇక్కడ నా స్వీయానుభవం చెప్పదలచేదేమంటే ,ఇప్పుడు నేను ఉపయోగించే పద్దతి "గూగుల్ ట్రాన్స్ లిట రేషన్ - తెలుగు " ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ,నేను ఇంగ్లీష్ కీ బోర్డ్ ద్వారానే ఈ విధంగా ఇంగ్లీష్ అక్షరాలు ను ఉపయోగించే " తెలుగు లిపి " ఆటో మేటిక్ గా కనబడే సౌలభ్యం వచ్చింది . వాస్తవానికి నేను ఏ టైపు మిషన్ పైన టైపు చేయడం( ఇంగ్లీష్ ,గాని తెలుగు కానీ ) నేర్చుకోలేదు. కానీ నేను అలవాటు ద్వారా ఈ విధంగా తెలుగు లో వ్రాయడం ,(అదే టైపు చేయడం) అవలీలగా చేయగలుగుతున్నాను . కాబట్టి తెలుగు భాషాభిమానులు ప్రతి ఒక్కరు ఈ విధంగా కంప్యూటర్ లోనూ అదేవిధంగానే సెల్ ఫోన్లో గూడాను ఇదే విధంగా చేసుకోవచ్చు . ముఖ్యంగా ఈ విషయ ప్రక్రియను నాకు చెప్పి అలవాటు చేసిన వాడు మిత్రుడు రహంతుల్లా నే !. అందుకు నేను మిత్రుడికి ఋణ పడిఉంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను .