30, జనవరి 2018, మంగళవారం

తెలుగు వాడుక భాషలో పాలన జరగాలి

తెలుగు వాడుక భాషలో పాలన జరగాలి
28.1.2018 తెనాలి తెలుగు మహోత్సవంలో నేను చదివి సమర్పించిన వినతి పత్రం :
పాలనా భాషగా తెలుగుఅమలులో ఎదురౌతున్న సమస్యలు – అనుభవాలు -పరిష్కారాలు
తెలుగులో పాలన కోసం అవసరమైన పనులన్నీ చేస్తామని ముఖ్యమంత్రులు అందరూ ప్రకటించారు.ప్రజాస్వామ్య పాలనలో ప్రజావాక్కే శిరోధార్యం.తెలుగులో పరిపాలన కార్యక్రమం విజయవంతం కావటానికి కేవలం ప్రభుత్వ సాయం మాత్రమే సరిపోదు. ప్రజల పట్టుదల,ప్రయత్నం,ఆదరణ కూడా కావాలి.వాస్తవానికి అధికారభాషగా తెలుగును పాలనలో అమలు చేయటంలో పాలకులకు ,అధికారులకు ఇంకా కొన్ని సమస్యలు ఎదురౌతున్నాయి.
ప్రభుత్వం అవసరమైన ఉత్తర్వులు చాలావరకు ఏనాడో ఇచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సింది అధికారులే. వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో కారణాలు తెలుసుకోవాలి. నిర్లక్ష్యంతో తెలుగులో దస్త్రాలను నిర్వహించని వారిని శిక్షించాలి. కాలయాపనకు సహేతుకమైన కారణాలు ఉంటే వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు సరిగా అమలుకు నోచుకోకలేదు. ఉత్తరువులను అమలుచేయటంలో అధికారులకు కలుగుతున్న ఆటంకాల పరిష్కారానికి అవలంబించదగ్గ పద్ధతులు పరిశీలిద్దాం.
నేను ఒక గుమాస్తా స్థాయి నుండి తహసీల్దారు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ వరకు అనేక ఉద్యోగాలు చేశాను. తెలుగు భాషలో ఫైళ్ళ నిర్వహణ,ఉత్తరప్రత్యుత్తరాలలో నాకు ఎదురైన అనుభవాలు,సమస్యలు, నాకు తోచిన సలహాలు పరిష్కార మార్గాలు మీతో పంచుకుంటాను:
అనుభవం1 : ఆంగ్ల న్యాయవ్యవస్థతో:
పశ్చిమ గోదావరిజిల్లా మొగల్తూరు మండలంలో ఎమ్మార్వోగా ఉండగా 23 రిట్ పిటీషన్లకు పేరావారీ జవాబులు తెలుగులోనే రాసిపంపాను. కలెక్టరేట్ నుండిఫోన్. తెలుగులో ఎందుకు పంపారనే ప్రశ్న. తెలుగులోనైతే జవాబులుతప్పుల్లేకుండా సూటిగా, స్పష్టంగా ఇవ్వగలననీ, అర్థంకాక పోవడమనే సమస్యేరాదనీ, వాటిని యధాతథంగా హైకోర్టుకు సమర్పించమనీ, కాదు కూడదంటే ఇంగ్లీషులోకితర్జుమా చేయించి జిల్లా కేంద్రం నుండే హైకోర్టుకు పంపించండనీ వేడుకున్నాను. అప్పుడు 167/19.3.1988 అనే ప్రభుత్వ ఉత్తర్వు నన్ను ఆదుకుంది. దాని ప్రకారం ఆంగ్లంలో వచ్చిన ఏ ఉత్తరం పైనా ,ప్రతిపాదనపైనా ఎలాంటి చర్యతీసుకోకుండా తిప్పి పంపే అధికారం ప్రతి గజిటెడ్ అధికారికీ ఉంది. తమకంటే పై అధికారుల కార్యాలయాలనుండి వచ్చినా సరే ఆంగ్లంలో వచ్చిన లేఖలను తిప్పిపంపవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల జరిగే కష్ట నష్టాలకు,జాప్యానికీ వాటిని ఆంగ్లంలో పంపిన అధికారులదీ, కార్యాలయాలదే బాధ్యత. ఈ జీవో పుణ్యాన వారు నన్నేమీ అనకుండా వాటిని ఆంగ్లంలోకి మార్పించి హైకోర్టులోనివేదించారు.
మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారుః “మాతృమూర్తికి ఎంతటిగౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితోసమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయస్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈదారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినప్పుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం.” (“అమ్మనే మరుస్తారా!” ఈనాడు 27-2-2006).
కరీంనగర్జిల్లా సిరిసిల్ల ఆర్డీవో నాగేందర్150 పేజీల ప్రతివాదనను తెలుగులో రూపొందించి హైకోర్టులో దాఖలు చేస్తే, దానిని హైకోర్టు కూడా సదభిప్రాయంతో స్వీకరించింది. ఇందుకు ఎ.బి.కె. ప్రసాద్ గారు హర్షం వ్యక్తం చేస్తూ, ఆర్డీవోకు అభినందనలు తెలియజేశారు. (ఈనాడు 28.6.2006) ఇలాంటి వారిని గుర్తించి,ప్రోత్సహించాలి.
రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి లాంటి పెద్దలంతా కక్షిదారుల భాషలోనే హై కోర్టుల్లో కూడా వాదనలూ తీర్పులు ఉండాలని చెబుతున్నారు కదా అన్న ధైర్యంతో ఇటీవల ఒక కేసులో తెలుగులో ప్రతివాదన తయారుచేసి తీసికెళితే హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది దానిని తిరస్కరించారు. హైకోర్టులో తెలుగు వాదన చెల్లదు అన్నారు. తెలుగులో వాదన తెచ్చినందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇంగ్లీషులో వాదించలేని నేను డిప్యూటీ కలక్టర్ పదవికి తగనని ఎగతాళి చేశారు. చివరికి నా తెలుగు ప్రతివాదాన్ని ఇంగ్లీషులోకి మార్చి ఇస్తేనే తీసుకున్నారు. హైకోర్టు స్థాయికి తెలుగు భాష ఇంకా వెళ్ళలేదు.తెలుగులో వాదించుకునే పరిస్తితి ఇంకా దిగజారింది.
పరిష్కారమార్గాలు : జిల్లా స్థాయి కోర్టుల్లో దిగువ స్థాయి న్యాయస్థానాల్లో వాదప్రతివాదాలు తెలుగులో జరగాలి. తీర్పులన్నీ తెలుగులోనే ఇవ్వాలి అని 29.3.1974 న హోమ్ శాఖ 485 నంబరు తొలిసారిగా జీవో జారీ చేసింది. దానిని ఖచ్చితంగా జిల్లాస్థాయి న్యాయవాదులు న్యాయమూర్తులు అమలు చేసేలా చూడాలి. ఈ సౌలభ్యం హైకోర్టుల్లో కూడా దొరికేలా చెయ్యాలి. అన్నీ న్యాయస్థానాలతో పాటు అన్నిఆఫీసుల్లో కూడా తెలుగులోకి అనువదించి రాయగల రైటర్లను నియమించాలి. పోలీసు స్టేషన్లు,హైస్కూళ్ళలో లాగా ఈ రైటర్లు వివిధ పత్రాలను దస్త్రాలను తెలుగులో రాసి కంప్యూటర్లో భద్రం చెయ్యాలి. ప్రతి ఆఫీసుకు అవసరమైన రైటర్లను సర్వీసు కమీషన్ పరీక్ష ద్వారా నియమించుకోవాలి.రైటర్లకు కంప్యూటర్ లో తెలుగు భాషా పరిజ్నానం తప్పనిసరి అర్హతగా నిర్ణయించాలి. 587/28.10.1988,218/22.3.1990,420/13.9.2005, 11/14.9.2016 జీవోల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వఉత్తర ప్రత్యుత్తరాలన్నీ సాధ్యమైనంత తెలుగులోనే జరగాలి. అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి. ఆంగ్లం వాడకూడదు. కాబట్టి తెలుగు రైటర్ల విస్తృత నియామకం వలన వేలాది తెలుగు యువకులకు ఉపాధి దొరుకుతుంది. తెలుగు భాషను కాపాడే రక్షకులు కూడా ఏర్పడతారు. పరిపాలన పూర్తిగా తెలుగులోనే జరుగుతుంది.
అనుభవం2:మాదిరి తెలుగు ధరఖాస్తులు :
ఒక మండలంలో ఎమ్మార్వోగా ఉండగా దరఖాస్తు ఫారాలు నింపడానికి ఆఫీసుబయట ఒక ప్రైవేటువ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన వ్యక్తుల అవసరాలనుబట్టి ఇంతింత ఈ ఫారం నింపడానికివ్వాలని వసూళ్ళు చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫారాలు ఇంగ్లీషులో ఉండేవి. ఏయే పనులకోసం ఈ ఆఫీసుకు ప్రజలువస్తున్నారు, ఏమేమి ఫారాలు వాళ్ళు పూరించి ఆఫీసులో ఇవ్వాలో తెలుసుకున్నాను.ఓపికగా ఆయా దరఖాస్తులు తెలుగులోకి అనువదించాను. నాలుగైదు తరగతులు చదివిన వారెవరైనా పూర్తిచేయటానికి వీలుగా అన్నిరకాల దరఖాస్తుఫారాలు తయారయ్యాయి. వాటిని ఆ ఊళ్ళోని జిరాక్సు షాపులన్నిటికీ ఇచ్చి కేవలం అర్ధరూపాయికే ఏఫారమైనా అమ్మాలని చెప్పాము. ఎవరికివారే ఫారాలు నింపుకొని వస్తున్నారు. ప్రతిఫారమూ నాలుగైదు దశలు దాటివచ్చే పద్ధతి తీసేశాం. గ్రామ పాలనాధికారి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సంతకాలు చేస్తే చాలు. వాటిపైన నేను సంతకంచేసే వాడిని. ఆఫీస్లో గుమాస్తాల ప్రమేయం తగ్గింది. పత్రాల జారీ వేగం పెరిగింది.
పరిష్కారమార్గాలు: అన్నిరకాలదరఖాస్తులు తెలుగులోముద్రించి అన్ని శాఖల వెబ్ సైట్లలో ఉంచాలి. తెలుగుభాషా సంస్కృతుల అభివృద్ధి అధ్యయన కమిటీ చేసిన ఈ సూచనలు అమలు చెయ్యాలి: 1. తెలుగు భాషాభివృద్ధిప్రాధికార సంస్థ - ఏడు విభాగాలు : అధికార భాష అమలు , తెలుగుభాషాభివృద్ధి, ఈ-తెలుగు, అనువాద, ప్రచురణలు, అంతర్జాతీయ తెలుగుభాషాభివృద్ధి, గ్రంథాలయాలు అన్ని అధికారాలతో ఏర్పాటు చేయాలి. తెలుగు భాషను కించపరిచే ధికారులను దండించే అధికారం ఈ సమ్స్థకు ఉండాలి.
* సచివాలయం స్థాయినుంచి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు అన్నీతెలుగులోనే ఉండాలి. తెలుగు అమలును నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యతీసుకునే అధికారం ప్రాధికార సంస్థకు కల్పించాలి.
* తెలుగు మాధ్యమవిద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి విభాగంలోనూ 10శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
* అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించాలి.
* ఆంగ్ల మాధ్యమంలో తెలుగును, తెలుగు మాధ్యమంలో ఆంగ్లాన్ని ఒక బోధనాంశంగాఉంచాలి. డిగ్రీ స్థాయిలో అన్ని సెమిస్టర్లలో తెలుగును తప్పనిసరిగాబోధించాలి.
* ఇంటర్మీడియట్, డిగ్రీల స్థాయిల్లో తెలుగు, సంస్కృతం మిశ్రమ బోధనా విధానాన్ని పాటించాలి.
* హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పరిచి, న్యాయపాలనలో తెలుగు అమలు కోసం సత్వర చర్యలు తీసుకోవాలి. తెలుగులో తీర్పులువెలువరించేలా న్యాయమూర్తులను ప్రోత్సహించాలి.
* ఆన్లైన్లోఈ-తెలుగు పద్ధతిలో తెలుగు బోధన, అంతర్జాలంలో తెలుగు సాహిత్యం, శాస్త్రసాంకేతిక గ్రంథాల వ్యాప్తి, శాసనాల డిజిటలీకరణ, వెబ్సైట్ల నిర్వహణ, కంప్యూటర్లలో తెలుగు ఉపకరణాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
అనుభవం3: పనుల జాప్యం :
నేను హై స్కూల్ చదువుకు రోజూ 7 కి.మీ. కంకటపాలెం నుండి బాపట్ల నడిచి వచ్చే వాడిని. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్ దార్ ఆఫీస్కు వారం రోజులపాటు తిరిగేవాడిని. ప్రతిరోజూ డఫేదారు దగ్గర ఒకటే సమాధానం- దొరగారు క్యాంపు కెళ్ళారు, రేపురండిఅనేవాడు.ఎర్రటి ఎండ తట్టుకోలేక ఆవరణలో ఒక చెట్టు క్రింద చేరేవాడిని. ఆ చెట్టుకింద ఆనాడు అనుకున్నాను. నేను గనక తాసీల్దారునైతే చిన్నపిల్లలకు చకచకా సంతకాలు చేసి పంపిస్తాను అని. తహసీల్దారునయ్యాక మాట నిలుపుకున్నాను.
పరిష్కారమార్గాలు:ఇప్పుడు ‘విద్యార్ధుల సేవలో’ రెవిన్యూ’ అనే మంచి కార్యక్రమం జరుగుతోంది. “జన్మభూమి-మన ఊరు”లో కూడా ఇలా పాత పెండింగ్ కేసులన్నీ పరిష్కరించవచ్చు. తెలుగులో చక్కగా స్వేచ్ఛగా పని చేయవచ్చు. కంప్యూటర్లో కూడా తెలుగులో పనిచేయగలిగే సిబ్బంది మనకు మంచి సంపదే. తెలుగులో కంప్యూటర్ల వాడకంపై మంచి శిక్షణ ఇప్పిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు రైటర్ల సంపదను పెంచాలి.
అనుభవం 4.అనువాదాలు, మొదటి తెలుగు అవార్డు :
2008 లో పులిచింతల ప్రాజెక్ట్ లో భూసేకరణ సమ్మతి అవార్డు తెలుగులో ఇచ్చాను.అంతకు ముందు ఎలాంటి మాదిరీ లేని పరిస్థితుల్లో కొత్తగా అనువాదానికి స్వయంగా పూనుకొని రాసిన ఆ అవార్డు రాష్ట్రంలో మొదటి తెలుగు అవార్డు అయ్యింది. అధికారులారా! ఇలా మీరెందుకు రాయలేరు? అంటూ అప్పటి అధికారభాషా సంఘం అద్యక్షులు వారి మాసపత్రిక  పాలనాభాష (సమాచారనేత్రం) జనవరి, 2009, లో ఆ అవార్డును ప్రచురించారు. కాబట్టి ఎవరో ఒకరు పూనుకొని కొత్త పత్రాల్ని తయారు చేయాలి. అవే కాలక్రమేణా మెరుగు పడుతూ వాడుక భాషలోకి మారుతూ అందరికీ మార్గదర్శక మౌతాయి.
పరిష్కారమార్గాలు:తెలుగుఅనువాదాలు ఇంకా బాగుపడాలి. ప్రస్తుతం ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషు లోకి కంప్యూటర్ పై జరిగే అనువాదాలు సవాలక్ష లోపాలతో ఉన్నాయి. తెలుగువారు సాంకేతికంగా ఎంత ఎదిగినా నేటివరకూ అనువాద యంత్రాల తయారీలో బాగా వెనుకబడే ఉన్నారు. కారణం సర్వ సమగ్ర తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు లేకపోవటమే!
అనువాదాలను తప్పుల్లేకుండా చేసి ఇచ్చే సాఫ్ట్ వేర్ల తయారీదార్లపై తెలుగు ప్రజలు,నాయకులు దృష్టి సారించాలి. మంచి తమిళంలోఉత్తమ సాఫ్ట్ వేర్ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. తెలుగులో కూడా ఉత్తమ సాఫ్ట్‘వేర్ లు తయారుచేసిన సాంకేతిక నిపుణులకు, తెలుగు భాషకు ఉపకరించే సులభ ఉపకరణాలను తయారు చేసిన సాంకేతిక పరిఙ్ఞానులకు తెలుగు వైతాళికుల పేరుమీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. మనకు కూడా కొలిచాల సురేశ్ ,వెన్ననాగార్జున, రహమాన్ లాంటి కంప్యూటర్ తెలుగు లిపి సాంకేతికులు చాలామంది ఉన్నారు. తెలుగులోకి తర్జుమాలో తప్పులు రాకుండా మెరుగు పరిచే వారికి ఆర్ధిక సహాయం చెయ్యాలి. అనువాద ఉపకరణాలు లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి. యంత్రాను వాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులోకంప్యూటర్ వాడకం పెరగాలి. తెలుగు నుండి ఇంగ్లీషు తదితర భాషల్లోకి అలాగే ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేసే ఉపకరణాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. అనువాదంలో చోటుచేసుకుంటున్న లోపాలను తప్పుల్నీ సరిదిద్దటానికి తెలుగు సాంకేతిక నిపుణులు అందరూ పూనుకోవాలి. ఈ అనువాద సామాగ్రి ఎంత నాణ్యంగా అభివృద్ధి చెందితే తెలుగులో పాలన అంత నాణ్యత గా ఉంటుంది. ఫైళ్ళ కదలికలో వేగం పెరుగుతుంది. ఏ ఏటికాయేడు విడుదలైన అనువాద ఉపకరణాలలో నాణ్యమైన వాటికి బహుమతులివ్వాలి.
అనుభవం 5.వాడుక పదాలు:
1986-90 ప్రాంతాల లో హైదరాబాదు డైరెక్టరేట్ల లో పనిచేసాను. నండూరి రామకృష్ణమాచార్య గారు అధికార భాషా సంఘం తరుపున నేను పనిచేస్తున్న కార్యాలయాన్ని దర్శించారు. అచ్చగా తెలుగులోనే ఫైళ్ళు నడిపే వారిది ఒక్క సీటు చూపించండి అని అడిగితే నాదగ్గరకు తీసుకొచ్చారు. ఆయన నా ఫైళ్ళను చూసి ఆనందం వ్యక్తంచేశారు. ఆంగ్ల పదాలకు అర్ధం తెలియకపోతే భయపడకుండా అందరికీ వాడుకైన ఆంగ్లపదాలనే తెలుగులో స్వేచ్ఛగా సరళంగా రాస్తున్నారు .ఇదే మేము కోరుతున్నది” అని ప్రశంసించారు.
“సార్, తెలుగు మాతృభాషగా గల 'తెలుగు ముస్లిములు' నిఖానామాను తెలుగులో ప్రచురించి ఇవ్వమని కోరుతున్నారని వారిని అడిగితే వక్ఫ్ బోర్డు వారిని సంప్రదించారు. కొన్ని ఉర్దూ పదాలు తెలుగు ముస్లిములు కూడా పలుకుతారు కాబట్టి వాటినే తెలుగులో ప్రచురిస్తే చాలు అన్నారు.
2009 లో అధికార భాషాసంఘం అధ్యక్షులు ఏ బి కె ప్రసాద్ గారికి ఐ.కొండలరావు గారి ఉర్దూ –తెలుగు నిఘంటువును అందజేశాను. 2009 ఏప్రిల్ 25 వతేదీన ఈనిఘంటువును పునర్ముద్రించి విడుదలచేశారు. ఉర్దూ అకాడమీ డీటీపీ తరువాత ప్రచురించకుండా ఆపివేసిన పటేల్ అనంతయ్య కమిటీ తెలుగు-ఉర్దూ నిఘంటువును తెలుగు అధికారభాషాసంఘం నిధులతో పూర్తి చేయించడానికి ప్రయత్నించారు.
2013 లో తెలుగు అధికార భాషాసంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ గారు కూడా తెలుగు- ఉర్దూ నిఘంటువు ప్రచురణకు ఆదేశించారు కూడా.
పరిష్కారాలు:మనం మాట్లేడేటప్పుడు ఎలా మాట్లాడుతామో రాసేటప్పుడు కూడా అలానే రాస్తే అందరికీ తేలికగా అర్ధమౌతుంది. రైలు ను ధూమశకటం అననక్కరలేదు. ఇంగ్లీషును ఉర్దూను పరభాషాపదాల పేరుతో తోసివేయ నక్కర లేదు. తెలుగు జనం కొన్ని పరభాషా పదాలనే వాడుకలో పలుకుతున్నారు. అందువలన నిఘంటువులలోకూడా వాడుక భాష పదసంపద పెరగాలి. వాడుకభాష లోకే చట్టాలు, దస్త్రాలు మారాలి. ఏ పదాన్ని ఎలా వాడాలో తెలియజేసే సోదాహరణ పదకోశాలు పంపిణీ చెయ్యాలి. అనేక అవసరాలలో ఉపయోగించేలా మాదిరి ఉత్తరాలను, ఆదేశాలను తెలుగులో తయారు చేయించి వాటిని నెట్ లో ఉంచాలి. ఫైళ్ళ నిర్వహణలో కలిగే అనుమానాలను నివృత్తి చేసే యంత్రాంగాన్ని సిద్ధం చెయ్యాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష వాడకం పరిరక్షణ నిరంతర కార్యక్రమంగా సాగాలి.
ఆన్లైన్లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలావాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగాఉన్నట్లు భావించినకొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి. వాడుక భాషలో నానా భాషలూ కలగాపులగంగా ఉంటాయి.అయితే అవన్నీ ప్రజలకు బాగా అర్ధమౌతాయి. పరభాషా పదాలనే కారణంతో ఇప్పుడు తెలుగు వాడకంలోంచి సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ పదాలను తీసివేయలేము. ఎందుకంటే అవి మనభాషలోఅంతర్భాగాలై పోయాయి. తెలుగు లోపాలించటం అంటే గ్రాంథుఇక తెలుగులో కాక, జనవ్యవహారంలో ఉన్న భాషలోనే పాలించడం అనే విషయాన్ని మొదట గుర్తించాలి. ప్రజలు ఇంతకంటే ఇంగ్లీషే నయమని వాపోయేలా తెలుగు అనువాదాలు ఉండకూడదు. అందరికీ అర్థమయ్యే రీతిలో, సరళంగా క్లుప్తంగా, వేగంగా పలికేందుకు వీలుగా ఉండేలా తెలుగు మాటలను వాడటం అలవాటు చేసుకోవాలి.
సంస్కృతం, ఇంగ్లీషు భాషల మితిమీరిన వాడకం వల్ల, అవి మన భాషాపదాలను కబళించి తామే తెలుగై కూర్చున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీషు మాటలు జనం నాలుకలమీద విస్తారంగా వాడబడుతున్నవాటిని యథాతహంగా పాలనాభాషలో వాడుకోవటం ఉత్తమం. ఇక ఇప్పుడు ఈ ఇంగ్లీషు పదాలను నిర్మూలించడం మన తరం కాదు. వాటిని మన పదాలుగా అంగీకరించడమే మంచిది.
అనుభవం 6.కంప్యూటర్లో తెలుగు టైపు సమస్యలు :
కంపూటర్లో తెలుగు టైపు చేసేటప్పుడు తెలుగు ఫాంట్లు లేక యూనీకోడ్ లోకి మార్చటానికి రకరకాల సమస్యలు వచ్చేవి. 2009లో అను నుండి యూనికోడ్ లోకి మార్చే ఒకమారకానికి anurahamthulla version అని నా పేరుని పెట్టారు. తెలుగు భాషలో మంచిఫాంట్లు అభివృద్ధి చేశారు. సాంకేతిక పరికరాలు వచ్చాయి.
పరిష్కారాలు:
అక్షర రూపాలు పెరగాయి .లిపి,అనువాద సమస్యలు తగ్గాలి .ప్రపంచతెలుగు మహాసభల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలిరామకృష్ణ, సూరన్న, రామరాజ, మల్లన్న, ధూర్జటి, రామభద్ర, గిడుగు, గురజాడ, సురవరం, యన్.టి.ఆర్., మండలి, నాట్స్, పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి అనే18 అక్షరరూపాలను విడుదలచేశారు.అనూ, సూరిలాంటి యూనీ కోడేతర ఫాంట్లలో ముద్రితమై ఉన్న విస్తారమైన తెలుగుసాహిత్యాన్ని తెలుగు యూనీకోడు లోకి మార్చే మార్పిడి సాధనాలు కూడా వచ్చాయి.
ఇప్పటికీ తెలుగు ప్రజలకు అనువాద సమస్య అలాగే ఉంది .తర్జుమాలో ఇప్పటికీ చాలా తప్పులు వస్తున్నాయి. అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ వాటిని విరివిగా వాడుకునే సౌలభ్యాలు కలగాలి. వాటిని తయారు చేసే సాంకేతిక నిపుణులకు నిధులు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.
అధికారుల దగ్గర కంప్యూటర్ అనువాదకుల్ని కూర్చోబెట్టి తెలుగునుండి ఇంగ్లీషుకు ,ఇంగ్లీషు నుండి తెలుగుకు వందలాది వాక్యాలను అనువాదం చేయించి పరిశీలించాలి. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో రకరకాల పరిస్థితుల్లో మనం వాడుతున్న తెలుగు ఇంగ్లీషు వాక్యాలకు సరైన అనువాదం వస్తుందా లేదా అని పరిశీలించాలి. వేరే అర్ధం వస్తుందా?పదాల పొందిక క్రమము సరిపోతోందా? అనీ చూడాలి.
అనుభవం 7 .రోమన్ లిపి :
వత్తులు ,గుణింతాల ఇబ్బందిని అధిగమించలేకనే చాలామంది బాగా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగు టైపింగ్ జోలికి రాలేకపోతున్నారు.లిపి సంస్కరణ కూడా అవసరమే. వత్తులూ గుణింతాల బెడద లేకుండా ఒకే వరసలో సాగిపోయేలా రోమన్ లిపిని యంత్రానికి తగ్గరీతిలో ఆంగ్లేయులు ఎంతగానో అభివృద్ధి పరిచారు, అరబిక్ అంకెలను,భారతదేశపు సున్నాను అరువు తెచ్చుకొని మరీ ఆంగ్ల లిపిని విశ్వవ్యాప్తం చేశారు.ఆంగ్ల భాషనూ, అంకెల్ని మనం ఎలాగూ వాడుతూనే ఉన్నాం. ఇక అక్షరాలను కూడా వాడుకుంటే అధికార భాషగా రోమన్ తెలుగును పిల్లలకు నేర్పటం, ఫైళ్ళలో ద్వారా అమలు చేయటం ఎంతో సుళువవుతుంది
పరిష్కారాలు:
వత్తులూ గుణింతాల బెడద అంటూ తెలుగు లిపిసమస్య సాకుతో అధికారభాష అమలును ప్రక్కన పెట్టటం కంటే అంతర్జాతీయంగా అమలవుతున్న లిపినే మన భాషకు వాడుకుంటే మేలు జరుగుతుంది.దేశమంతటికీ ఉమ్మడి లిపిగా ఆంగ్లాక్షరాలను ఉపయోగించుకోవాలి. ప్రపంచం మొత్తం చదవగలిగే స్థాయికి ఎదిగిన ఆంగ్ల లిపిని వాడుకోవటం ద్వారా మన దేశ భాషలన్నింటికీ జవసత్వాలు సమకూరుతాయి.పైగా అన్నిభాషల వాళ్ళూ సెల్ ఫోనుల్లో ఆంగ్ల లిపి ద్వారానే మెసేజీలు ఇప్పటికే పంపుకుంటున్నారు.ప్రపంచ దేశాలలో ఆంగ్ల లిపిలోని సంస్కృత శ్లోకాలను,అరబీ సూరాలను చదువు కుంటున్నారు. దేశ వాసులందరినీ రోమన్ లిపి ద్వారా త్వరగా అక్షరాస్యుల్ని చేయవచ్చు.దేశ మంతటా ఒకే లిపి ఉండటం వలన అందరూ అన్ని భాషలనూ అర్ధం చేసుకోలేకపోయినా కనీసం అన్ని భాషలనూ చదవగలుగుతారు,కార్యాలయాలనుండి వచ్చే ఉత్తర్వులను చదవటం, చదివించుకొనటం సులువౌతుంది.లిపి ద్వారా ఐక్యత వస్తుంది.అందువలన తెలుగులో పాలన వ్యవహారాలు సులువుగా జరగాలంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆనాడు కోరినట్లు లిపి సంస్కరణన్నా జరగాలి లేదా శ్రీ శ్రీ గారి సలహా మేరకు రోమన్ లిపిలో అయినా కార్యాలయ వ్యవహారాలు నడపాలి.
అనుభవం 8. తెలుగు మాధ్యమం :
తెలుగు తెలుగు రక్షణ అంటూ తెగ అరిచేవాళ్ళు తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో ఎందుకు చదివిస్తున్నారు?అనే ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి అనేకసార్లు ఎదురయ్యింది. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళ స్థాయిలో తెలుగు బడులు లేవు. కార్పోరేట్ స్కూళ్ళతో పోటీ పడలేక కునారిల్లుతున్నాయి. తెలుగు స్కూళ్ళ ద్వారా చదివితే ఉద్యోగాలు వస్తాయో రావో అనే సందేహమే తల్లిదండ్రుల తటపటాయింపుకు కారణం. తెలుగు మాధ్యమంలో అసలు ఉన్నత విద్యే లేనప్పుడు ఎంత తెలుగు భాషాభిమాని అయినా, భాషోద్యమకారుడైనా తమ పిల్లల్ని ఎక్కడ ఎలా చదించగలడు?
పరిష్కారాలు:
తెలుగు మాధ్యమంలో చదువులు పెరగాలి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో తెలుగు మీడియం ఉండాలి.వివిధ వృత్తివిద్యలు ,న్యాయ, వైద్య సాంకేతిక విద్యలు కూడా తెలుగు మాధ్యమంలో నేర్వగలిగిన నాడు తెలుగు సమాజమంతా తెలుగులో పాలన పరిధిలోకి దానంతట అదే వచ్చేస్తుంది. తెలుగులో ఉన్నత విద్యా సదుపాయాలు అత్యంత అవసరం.తెలుగులో చదువు చెప్పేశాస్త్ర సాంకేతిక విద్యా సంస్థలనూ కళాశాలల్నీ,తెలుగులో చదివే విద్యార్ధులనూ రాయితీ లిచ్చి ప్రోత్సహించాలి. రాష్ట్రంలోని కేజీ టూ పీజీ వరకూ అన్ని స్థాయిలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తామని ప్రభుత్వం వారు ప్రకటించారు. అయితే పిల్లల పాఠ్యపుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి. సంకలనం, వ్యవకలనం లాంటి పదాల స్థానంలో కూడికలు, తీసివేతల్లాంటి మాటలు రావాలి.
అనుభవం 9.ప్రోత్సాహకాలు ,ఉద్యోగాలు :
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకుప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళమీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమంలో చదివించరనీ, ఎవరూ చదవనిభాష నశిస్తుందనీ, తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆ భాషలో మాత్రమే చదివిన వారికివెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు. .అందుకోసం అత్యవసరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. శాసన సభలో, స్థానిక సంస్థల్లో, ప్రభుత్వకార్పోరేషన్లు, కంపెనీలలో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని శాసించారు.
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్-ది. 30.09.2010 ద్వారాతమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది.ప్రమోషన్లలో కాకుండా ప్రభుత్వోద్యాగాలకుమొదటిసారిగా నేరుగాజరిపే నియామకాలకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది. రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళుకాపాడుకోవాలని, ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధిచేసుకోవాలనికూడా తెలియ జేసింది. కాబట్టి, తమిళనాడును ఆదర్శంగా తీసుకొని ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకుతెలుగుమాధ్యమంలో చదివిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలేరా ? తమిళనాడులో లాగా ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వవచ్చు కదా? లాంటి ప్రశ్నలు కొన్నిచోట్ల అడిగారు.
పరిష్కారాలు:
గ్రూప్ 1, గ్రూప్ 2,3 లాంటి సర్వీసు ఉద్యోగాలలోతెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇకమీదట కూడా ఇవ్వవచ్చు. తమిళ మాధ్యమంలో చదివే వారికి ఉద్యోగాల నియామకాల్లో ఐదు మార్కులు అదనంగా తమిళనాడులో ఇప్పటికీ ఇస్తున్నారు. మనకు కోర్టు కేసులు ఏమన్నా ఉంటే తెలుగు మాధ్యమ అభ్యర్డులకు ఎందుకు ఇలా ప్రోత్సాహక మార్కులివ్వాల్సి వస్తుందో కారణాలను స్పష్టంగా తెలియజేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి భాషలను ఆయారాష్ట్రాల పాలక భాషలుగా అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే బలహీన భాషల రక్షణ ఎలా జరుగుతుంది? సొంత వాళ్ళ రక్షణ ,ఆదరణ కరువైనందువల్లే మరోమార్గం లేక అన్నిభాషలు ఆంగ్లాన్ని ఆశ్రయిస్తున్నాయి.
అంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల సర్వీస్ కమీషన్లు రెండూ భారీ ఎత్తున గ్రూప్-2,3 సర్వీసుఉద్యోగాల భర్తీచేస్తు న్నాయి. వీటిలో మున్సిపల్ కమిషనర్, ఏసీటీఓ, సబ్రిజిస్ట్రార్,డిప్యూటీ తహసిల్దార్,అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్,అసిస్టెంట్ డెవల్పమెంట్ ఆఫీసర్, ఎక్స్టేన్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,సీనియర్ ఆడిటర్,సీనియర్అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, గ్రామపంచాయతీ సెక్రెటరీ లాంటి ఉద్యోగాలున్నాయి. ఇవన్నీ తెలుగులో చేసే ఉద్యోగాలే. ఐ ఏ ఎస్ ,ఐ పి ఎస్ లాంటి ఉన్నతోద్యోగాలు కావు.తెలుగు ప్రజలతోమమేకమై వారితోముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగాలు. వీరు తెలుగు ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషణ చేయాలి .గ్రామ సామాజిక , ఆర్థిక వ్యవస్థ పై తగిన అవగాహన తెచ్చుకోవాలి. ప్రజా పరిపాలన పరిజ్ఞానం పెంచుకోవాలి. అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు, సూచనలు వినాలి, రాయగలగాలి. ఈ నైపుణ్యాలన్నీ తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి.
గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5 శాతం ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి.తమిళనాడు తరహాలో తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు 20 శాతం ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ ఇస్తే, అప్పుడు తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి.
--- నూర్ బాషా రహంతుల్లా,స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,అమరావతి,9948878833


2 కామెంట్‌లు: