31, ఆగస్టు 2019, శనివారం

పాలనాభాషగా తెలుగు అమలుకు పది సూచనలు


పాలనాభాషగా తెలుగు అమలుకు పది సూచనలు
ప్రపంచ తెలుగు రచయితల సంఘం 4వ మహాసభల సందర్భంగా వెలువరించబోతున్న “ప్రపంచ తెలుగు” గ్రంధంలో ప్రచురించటానికి “పాలనా భాషగా తెలుగు” అనే అంశంపై నన్ను ఒక వ్యాసం రాసిపంపమని కోరారు. తెలుగు పాలనాభాషగా మన ప్రభుత్వ కార్యాలయాల్లో  తెలుగు అమలుకోసం ఒక తెలుగు వాడిగా , ఒక ప్రభుత్వ అధికారిగా  1974 నుండి వివిధ పత్రికలలో వ్యాసాలు రాస్తూనే ఉన్నాను.పత్రికలలో ప్రచురితమైన వ్యాసాలను సంకలనపరచి  1.తెలుగు అధికారభాష కావాలంటే?(2004,2006), 2. తెలుగు దేవభాషే (2012), 3. తెలుగులో పాలన (2018) అనే మూడు పుస్తకాలను తెచ్చాను. ఆ పుస్తకాలలో తెలుగును , ప్రభుత్వ కార్యాలయాలలో ఎలా అమలు చెయ్యాలో, పాలనా భాషగా తెలుగు అమలులో ఎదురయ్యే సమస్యలు పరిష్కారాలు మళ్ళీ మళ్ళీ స్వానుభవంతో చెబుతూనే ఉంటాను.
ఆంగ్ల కాన్వెంట్ల ఉద్యమం
కొన్నేళ్ళక్రితం మొదలైన ఆంగ్ల కాన్వెంట్ల ఉద్యమం రాష్ట్రమంతా పాకి ప్రభుత్వాలకు సోకి 2019 కల్లా  తెలుగులో  ప్రాధమికవిద్యలేకుండా పోయింది.  ఇప్పుడు బడుల్లో తెలుగు నేర్పే వాళ్ళూ లేరు.నేర్చే వాళ్ళూ లేరు.కేవలం పద్యాలు,శతకాలు మాత్రమే చదివిన వాళ్ళు, తెలుగులో మిగతా శాస్త్రాలేమీ చదువని వాళ్ళు, ఉద్యోగులైతే కార్యాలయాల్లో తెలుగులో ఫైళ్ళు నడపగలరా?ప్రాధమిక విద్యను తెలుగు మాధ్యమంలో లేకుండా నిర్మూలించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలే  తెలుగును పాలనాభాష కాకుండా మొదటి దెబ్బ కొట్టాయి. ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలో లేకపోతే  తెలుగును పాలనా భాషగాఅమలు చెయ్యటం అసాధ్యమే.పునాది లేకుండా భవనాన్ని కట్టలేము. 
 భాషల ప్రాతిపదికపై ఏర్పడిన మొదటి రాష్ట్రం అంధ్రప్రదేశ్. తమిళభాష ఆధిపత్యాన్ని వదిలించుకొని మన తెలుగు భాషలో మనల్ని మనమే పరిపాలించు కుందామనే సదాశయంతో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల భాషలో పరిపాలన జరగాలనే కోరిక అతి సహజమైనది.ఇప్పుడు మాతృభాషకు దూరమైన తెలుగు ప్రజలు మమ్మల్ని ఇంగ్లీషులోనే పాలించండి అని రివర్స్ లో కోరుకునే స్థాయికి వచ్చారు.బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఒకకేసులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న న్యాయవాదిని నేను తమిళుణ్ణి,నన్ను హిందీలో ప్రశ్నలు అడగవద్దు,ఇంగ్లీషులోనే అడగండి,ఎందుకంటే కోర్టు అధికారభాషకూడా ఇంగ్లీషే అన్నాడు. అలా నేను తెలుగువాడిని అనిచెప్పగలిగే  నాయకుడు మనకు కూడా కావాలి.ఎన్టీఆర్ తరువాత తెలుగును అంతగా ప్రేమించిన నాయకుడు మనకు రాలేదు.ఆయన తెలుగులో రాస్తేనే ఫైళ్ళపై సంతకాలు పెట్టేవాడట.నశించిపోయిన హెబ్రూ భాషను ఇశ్రాయిల్ దేశస్తులు అనేక కష్టాలు పడి పునరుద్ధరించుకొని పాలనలోకి తెచ్చుకున్నారని మన తెలుగు నాయకులే భాషా దినోత్సవాలలో చెబుతూ ఉంటారు. తెలుగు హెబ్రూ అంతగా నాశనమై పోలేదు.ఇంకా జనంలో బ్రతికేఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన జీవోలను అమలు చేస్తే చాలు అని భాషాభిమానులు కోరుతున్నారు.
అమలుకాని శాసనాలు
జిల్లా స్థాయి కోర్టుల్లో దిగువ స్థాయి న్యాయస్థానాల్లో వాదప్రతివాదాలు తెలుగులో జరగాలి.తీర్పులన్నీ తెలుగులోనే ఇవ్వాలి అనేదే 1974 లో వచ్చిన మొదటి జీవో (ప్రభుత్వ ఉత్తర్వు (హోంశాఖ) సంఖ్య 485 తేదీ.29.3.1974).
ఆతరువాత తెలుగులో పాలన సాగించటం కోసం 1988 నుండి 2018  వరకు 6  ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. వాటి ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికార భాషగా తెలుగును ఖచ్చితంగా అమలు చెయ్యాలి.జీవోలిచ్చారు గానీ ఆ ఉత్తర్వులు ఎన్నడూ సరిగా అమలుకాలేదు.అవేమిటో చూద్దాం:
1. ఆంగ్లంలో వచ్చిన ఏ ఉత్తరం పైనా ,ప్రతిపాదనపైనా ఎలాంటి చర్య తీసుకోకుండా తిప్పి పంపే అధికారం ప్రతి గజిటెడ్ అధికారికీ ఉంది.తమకంటే పై అధికారుల కార్యాలయాలనుండి వచ్చినా సరే ఆంగ్లంలో వచ్చిన లేఖలను తిప్పి పంపవచ్చు.ఈ విధంగా చేయడం వల్ల జరిగే కష్ట నష్టాలకు,జాప్యానికీ వాటిని ఆంగ్లంలో పంపిన అధికారులదీ ,కార్యాలయాలదే బాధ్యత. (ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 167తేదీ.19.3.1988)
2. 1988 నవంబరు 1 వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి.అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి.ఆంగ్లం వాడకూడదు.కేంద్ర ప్రభుత్వం,ఇతర రాష్ట్రాలు,రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లం ఉపయోగించాలి.(ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణపరిపాలనఅ.భాశాఖ)సంఖ్య587తేదీ.28.10.1988)
3. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ,రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు,అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి.అన్ని శాసనేతర అవసరాలకు ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనే ఉపయోగించాలి. (. ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య218తేదీ.22.31990)
4. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు,నియమాలు,నిబంధనలు,ఉపవిధులు అన్నీ కూడా తెలుగు భాష లోనే ఉండాలి. (ప్రభుత్వ ఉత్తర్వు( సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 420 తేదీ .13.9.2005 )
5.రాష్ట్రంలోని అన్ని దుకాణాలు ,సముదాయాల బోర్డులు ప్రభుత్వ పధకాల ప్రారంబోత్సవ నామఫలకాలు,శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనే రాయించాలి.( ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 11 (యువజన & సాంస్కృతిక అధికార భాష శాఖ) తేదీ.14.9.2016

6. తెలుగు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ దానికుండే  అధికారాలు అది విధించే జరిమానాలు నియమాలు వివరంగా చెప్పారు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 40 (యువజనాభ్యుదయ భాషా సాంస్కృతిక శాఖ)  తేదీ 10.7.2018.
ప్రాధమిక విద్య తెలుగులో
హెబ్రూ భాష గురించి ఇజ్రాయేలీయుల లాగా   పట్టుదలతో పై ఉత్తర్వులన్నీ ఖచ్చితంగా అమలుచేస్తే పరిపాలన పూర్తిగా తెలుగులోనే జరుగుతుంది.జరిగి తీరాలి.పాలకుల్లో మాతృభాష రక్షణపై పట్టుదల ఉండాలి. అవసరమైతే నిరంకుశత్వం చూపాలి.ప్రాధమిక విద్యే తెలుగులోలేకపోతే  పాలనా భాషగా తెలుగు ఎలా మారుతుంది?  
తెలుగువాడిగా పుట్టటం ఎన్నోజన్మల పుణ్యఫలం అనీ,అది రాయల కాలంనాటి రాజభాష అనీ గొప్పలు చెప్పుకోవటమే గానీ క్రమంగా తెలుగు భాష పాలనకు దూరమై కవులకూ కవిత్వాలకు మాత్రమే పరిమితమై పోయింది.తెలుగులో చదువుకొనే పిల్లలు తగ్గిపోయారు.తెలుగు బడులు మన కళ్ళముందే ఇంగ్లీష్ కాన్వెంట్లు గా మారిపోయాయి.తెలుగులో చదివితే ఉద్యోగాలు రావు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా చేసారు.ప్రాధమిక పాఠశాలలు కూడా ఇంగ్లీషువే కావాలని పట్టుబడుతున్నారు.ఎందుకంటే తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది.తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ,డబ్బు వస్తుంటే అప్పుడు కొందరైనా స్వార్ధం కొంత చంపుకొని తెలుగు చదువుతారు.తెలుగు భాషను బయటి వాడు ఎలాగూ ఆదరించడు ఇంట్లోని వాడూ ఆదరించటం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో పరిపాలన కోరుతున్న మనల్ని కొందరు విచిత్రంగా చూస్తారు.ప్రజల భాష పాలనా భాష గా మారకపోతే ఆ భాష చచ్చిపోతుంది.తెలుగు భాషను ఇళ్ళల్లో మాట్లాడుకోవటానికి పరిమితం చేసి ఆఫీసుల్లో మాత్రం ఆంగ్లానికి పట్టం కడుతున్నారు.తెలుగు ప్రజలు ఇంట్లో తెలుగు మాట్లాడుకున్నా , ఆఫీసులో ఇంగ్లీషు, కోర్టులో ఇంగ్లీషు, కొన్ని ప్రాంతాల్లో హిందీ లేదా ఉర్దూ మాట్టాడాల్సి వస్తుంది. చివరికి దేవుడి ప్రార్ధన చేసుకుందామన్నా సంస్కృతంలోనో అరబ్బీలోనో చేసుకోవాల్సి వస్తోంది. తెలుగు మనిషి మనసుతో పనిలేని ఓ యంత్రం లాగా మారాడు. అలా కాకుండా ఆఫీసుల్లో కూడా తెలుగు  రాజ్యమేలాలి అంటే తెలుగు భాష నేర్పాలి,తెలుగు నేర్చిన వారిని మాత్రమే అధికారులుగా రానివ్వాలి.పాలకులకు ఆచరణలో కొన్ని భాషాపర మైన అవసరాలు,సమస్యలు పదేపదే ఎదురౌతాయి.అందువలన మన భాషలో పరిపాలన బాగా జరగటానికి ఇంకా ఏమేమి సమస్యలు ఎదురౌతాయో వాటిని అధిగమించి ఎలా పనులు చెయ్యాలో చూద్దాం:

1.      న్యాయపాలన తెలుగులో
పూర్వం రాజులు చక్రవర్తులు తమ తమ మాతృ భాషలలో ప్రజలతో సంభాషించేవారు. అలాగే ధైనందిన జీవిత వ్యవహారాల పరిష్కారాల విషయంలో కూడా మాతృభాషని ఉపయోగించటం వలన ప్రజలకు రాజ్యపాలన దగ్గరైంది. ప్రజల భాషలోనే రాజ్యపాలన సాగింది. ఎవరైనా బాధితుడు వచ్చి ధర్మగంటను మ్రోగిస్తే, రాజు విచ్చేసి బాధితుడి మొర విని నిందితుడ్ని పిలిపించి అందరి సమక్షంలో విచారించేవాడు. అ విచారణలో ఇరు పక్షాల వాదోపవాదాలు మాతృ భాషలో జరిగేవి. తీర్పరి అయిన రాజుగారికి ఫిర్యాది-నిందితుడికీ మధ్య మధ్యవర్తిగా ఏ' ప్లీడరు' వుండేవాడు కాదు.
రాజు విచారణ జరిపేటపుడు ప్రజల భాషలోనే ప్రశ్నించి వివాద మర్మాన్ని పసిగట్టేవాడు. చివరకు ప్రజల భాషలోనే తీర్పు ప్రకటించే వాడు. ఈ మేరకు ఆటు విచారణ ఇటు తీర్పు ప్రజల సొంత భాషల్లో జరగటంతో మధ్యవర్తుల ఆవసరమే వుండేది కాదు. తీర్పు సొంతభాషలో రావడంతో ఫిర్యాదికిగానీ, నిందితుడికిగాని అర్ధంకానిదంటూ ఏవిూ వుండేది కాదు. ప్రస్తుత న్యాయపరిపాలన విధానంతో అనాటి పద్థతులను పోల్చి చూసుకుంటే ఎంతో క్షోభ కల్గుతుంది. కక్షిదారుల భాషలోనే హైకోర్టు తీర్పులుకూడా రావాలని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కోరారు.ప్రజలకు న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యంకాదు.తనకు జరిగిన న్యాయాన్ని తనసొంతభాషలో చదువుకోవాలనే రాష్ట్రపతి అభిప్రాయం మేరకు సుప్రీం కోర్టు తీర్పుల్ని కూడా ప్రాంతీయ భాషల్లోకి మార్చి వెబ్ సైట్ లో పెట్టారు.  
2.అన్నిదరఖాస్తులు తెలుగులో
పాలకొల్లు మండలంలో ఎమ్మార్వోగా ఉండగా దరఖాస్తు ఫారాలు నింపడానికి ఆఫీసు బయట ఒక ప్రైవేటువ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన వ్యక్తుల అవసరాలనుబట్టి ఇంతింత ఈ ఫారం నింపడానికివ్వాలని వసూళ్ళు చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫారాలు ఇంగ్లీషులో ఉండేవి. ఏయే పనులకోసం ఈ ఆఫీసుకు ప్రజలు వస్తున్నారు, ఏమేమి ఫారాలు వాళ్ళు పూరించి ఆఫీసులో ఇవ్వాలో తెలుసుకున్నాను. ఓపికగా ఆయా దరఖాస్తులు తెలుగులోకి అనువదించాను. నాలుగైదు తరగతులు చదివిన వారెవరైనా పూర్తిచేయటానికి వీలుగా అన్నిరకాల దరఖాస్తుఫారాలు తయారయ్యాయి. వాటిని ఆ ఊళ్ళోని జిరాక్సు షాపులన్నిటికీ ఇచ్చి కేవలం అర్ధరూపాయికే ఏ ఫారమైనా అమ్మాలని చెప్పాము. ఎవరికివారే ఫారాలు నింపుకొని వస్తున్నారు. ప్రతిఫారమూ నాలుగైదు దశలు దాటివచ్చే పద్ధతి తీసేశాం. గ్రామ పాలనాధికారి, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ సంతకాలు చేస్తే చాలు. వాటిపైన నేను సంతకం చేసేవాడిని. ఆఫీస్‌లో గుమాస్తాల ప్రమేయం తగ్గింది. పత్రాల జారీవేగంపెరిగింది.
3.తెలుగులో ధృవీకరణపత్రాలు
నేను హై స్కూల్ చదువుకు రోజూ 7 కి.మీ. కంకటపాలెం నుండి బాపట్ల నడిచి వచ్చే వాడిని. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్ దార్ ఆఫీస్‌కు వారం రోజులపాటు తిరిగేవాడిని. ప్రతిరోజూ డఫేదారు దగ్గర ఒకటే సమాధానం- దొరగారు క్యాంపు కెళ్ళారు, రేపురండి. ఆనాడు అనుకున్నాను నేను గనక తాసీల్దారునైతే చిన్నపిల్లలకు చకచకా సంతకాలు చేసి పంపిస్తాను. తహసీల్దారునయ్యాక మాట నిలుపుకున్నాను.
స్కూళ్ళు తెరిచే జూన్ మాసంలో సర్టిఫికెట్ల కోసం పిల్లలు బారులు తీరేవాళ్ళు. రద్దీ ఎక్కువగా ఉండేది. మండలంలోని అన్ని హైస్కూళ్ళ ప్రధానోపాధ్యాయులకూ ఒక ప్రొఫార్మా ఇచ్చి, వారి స్కూల్లోని పిల్లలందరి కులం, స్వస్థలం, పుట్టిన తేదీ- మొదలెన వివరాలు నింపి ధ్రువీకరించమని కోరాను. ఆయా గ్రామ పాలనాధికారులు కూడా ఆ వివరాలను ధ్రువీకరించారు. పిల్లలెవరూ మండల కార్యాలయానికి రానక్కరలేకుండా ।శాశ్వత కుల, నివాస స్థల, పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని' వారి ఫొటోలు అంటించి, వారి వారి పాఠశాలల్లోనే పంపిణీ చేశాం. పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ఇళ్లకు పంపిణీ చేయించాం. వీటన్నిటిని తెలుగు రాతపనిలో, మంచి చేతిరాతకలిగిన గ్రామసేవకులు, ఉపాధ్యాయులు, గ్రామ పాలనాధికారులు, విద్యార్థుల్ని కూడా ఉపయోగించుకున్నాం. ఏ ఊరి ప్రజల పని ఆ ఊళ్లోనే ఆ ఊరివాళ్లే చేసుకున్నందువలన ఎంతో స్పష్టంగా పనిజరిగింది.

 4.తెలుగు అనువాదాలు బాగుపడాలి
2008 లో పులిచింతల ప్రాజెక్ట్ లో భూసేకరణ సమ్మతి అవార్డు తెలుగులో ఇచ్చాను.అంతకు ముందు ఎలాంటి మాదిరీ లేని పరిస్థితుల్లో కొత్తగా అనువాదానికి స్వయంగా పూనుకొని రాసిన ఆ అవార్డు రాష్ట్రంలో మొదటి తెలుగు అవార్డు అయ్యింది. --- అధికారులారా! ఇలా మీరెందుకు రాయలేరు?! (జనవరి, 2009, పాలనాభాష (సమాచారనేత్రం). కాబట్టి ఎవరో ఒకరు పూనుకొని కొత్త పత్రాలను తయారు చేయాలి.అవే కాలక్రమేణా మెరుగు పడుతూ వాడుక భాషలోకి మారుతూ అందరికీ మార్గదర్శకమౌతాయి.
ప్రస్తుతం ఇంగ్లీషు నుండి తెలుగులోకి ,తెలుగు నుండి ఇంగ్లీషు లోకి కంప్యూటర్ పై జరిగే అనువాదాలు సవాలక్ష లోపాలతో ఉన్నాయి.తెలుగువారు సాంకేతికంగా ఎంత ఎదిగినా నేటివరకూ అనువాద యంత్రాల తయారీలో బాగా వెనుకబడే ఉన్నారు.కారణం తెలుగు చదువు నాశనమై పోవడమే.కాబట్టి అనువాదాలను తప్పుల్లేకుండా చేసి ఇచ్చే సాఫ్ట్ వేర్ల తయారీదార్లపై తెలుగు ప్రజలు,నాయకులు దృష్టి సారించాలి. తెలుగులోకి తర్జుమాలో తప్పులు రాకుండా మెరుగు పరిచే వారికి ఆర్ధిక సహాయం చెయ్యాలి.అనువాద ఉపకరణాలు లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.తెలుగు నుండి ఇంగ్లీషు తదితర భాషల్లోకి అలాగే ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేసే ఉపకరణాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు.అనువాదంలో చోటుచేసుకుంటున్న లోపాలను తప్పుల్నీ సరిదిద్దటానికి తెలుగు సాంకేతిక నిపుణులు అందరూ పూనుకోవాలి.ఈ అనువాద సామాగ్రి ఎంత నాణ్యంగా అభివృద్ధి చెందితే తెలుగులో పాలన అంత నాణ్యత గా ఉంటుంది.ఫైళ్ళ కదలికలో వేగం పెరుగుతుంది. ఏ ఏటికాయేడు విడుదలైన అనువాద ఉపకరణాలలో నాణ్యమైన వాటికి బహుమతులివ్వాలి.

5. నిఘంటువులలో వాడుక భాష
తెలుగు జాతీయలూ, నుడికారాలూ, పదబంధాలూకూర్చిన నిఘంటువుల అవసరంఉంది.ఆన్‌లెన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగాఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి. వాడుక భాషలో నానా భాషలూ కలగాపులగంగా ఉంటాయి.అయితే అవన్నీ ప్రజలకు బాగా అర్ధమౌతాయి.పరభాషా పదాలనే కారణంతో ఇప్పుడు తెలుగు వాడకంలోంచి సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ పదాలను తీసివేయకూడదు.వాడుక తెలుగు భాషలోనే ఆఫీసుల్లో ఫైళ్ళు నడిపితే అదే పదివేలు.మన శాసన సభలో ఎమ్మెల్యేలు ఈ మూడు భాషల పదాలు కలగలిపి మనోరంజకంగా మాట్లాడుతున్నారు. అదే నేటి తెలుగు, వాడుక తెలుగు.వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు మాట్లాడుతున్నది మన ప్రజల భాష.

అనువాదకులు తేటతెలుగుకు బదులు సంస్కృతం వాడి భయపెడుతున్నారు. కాలగమనంలో కొత్త కొత్త ఆంగ్లపదాలే మనకు అబ్బు తున్నాయిగానీ, కొత్త తెలుగు పదాలుగానీ, పాతవేగాని కొత్తగా వాడకంలోకి రావడంలేదు.పైగా పిల్లల చదువంతా ఇంగ్లీషు మీడియంలో ఉంది.వేలాది ఆంగ్ల పదాలు మన తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ, మన పదాలే అన్నంతగా స్థిరపడిపోయాయి. ఈ పదాలను విడిచిపెట్టి మనం తెలుగులో సంభాషణ చేయలేము. చేసినా ప్రజలకు అర్ధంగాదు. ఉర్ధూ, సంస్కృత,ఆంగ్ల పదాలెన్నింటినో తెలుగు తనలో కలుపుకుంది. అలాగే తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది.వాడుక పదాల సంపద భాషకు జీవమిస్తుంది. అవి పరభాషపదాలు కూడా కావచ్చు. మనం తెలుగును సరిగా నేర్చుకోక ముందే మనకు ఇంగ్లీషు నేర్పారు. వందలాది ఏళ్ళు మనం ఇంగ్లీషును గత్యంతరం లేక హద్దు విూరి వాడినందు వల్ల, అది మన భాషాపదాలను కబళించి తానే తెలుగై మనలో కూర్చుంది. మన ఆత్మలను వశం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇంగ్లీషు పదాలను నిర్మూలించడం మన తరం కాదు. వాటిని మన పదాలుగా అంగీకరించడమే మంచిది. ఏఏటికాయేడు మన నిఘంటువుకి పదసంపద సమకూర్చాలి . ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది.ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి.
6.అక్షర రూపాలు లిపిసమస్యలు  
రెండవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా2.11.2012 న శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలిరామకృష్ణ, సూరన్న, రామరాజ, మల్లన్న, ధూర్జటి, రామభద్ర, గిడుగు, గురజాడ, సురవరం, యన్.టి.ఆర్., మండలి, నాట్స్, పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి అనే18 అక్షరరూపాలను విడుదలచేశారు.
అలాగే మే 25, 2019 న మనబడి స్నాతకోత్సవ సందర్భంగా పొట్టి శ్రీరాములు ,శ్యామల రమణ ఖతులను విడుదల చేశారు. ఈ ఖతులన్నీ సిలికానాంధ్ర http://fonts.siliconandhra.org/ వెబ్ సైట్ లో ఉచితంగా దొరుకుతున్నాయి. కానీ ఇప్పటికే అనూ, సూరి లాంటి యూనీ కోడేతర ఫాంట్లలో ముద్రితమై ఉన్న విస్తారమైన తెలుగు సాహిత్యాన్ని తెలుగు యూనీకోడు లోకి మార్చే మార్పిడి సాధనాలు కావాలి. తర్జుమాలో తప్పులు వస్తున్నాయి. అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి. వాటిని తయారు చేసే సాంకేతిక నిపుణులకు నిధులు ఇవ్వాలి. ప్రతి యేటా తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.
7. లిపి సంస్కరణ - రోమన్ లిపి
ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని తన నిశ్ఛితాభిప్రాయమని 1976 లోనే మొదటి ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా అన్నారు మహాకవి శ్రీ శ్రీ .( ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196).
వత్తులు ,గుణింతాల ఇబ్బందిని అధిగమించలేకనే చాలామంది బాగా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగు టైపింగ్ జోలికి రాలేకపోతున్నారు.లిపి సంస్కరణ కూడా అవసరమే. వత్తులూ గుణింతాల బెడద లేకుండా ఒకే వరసలో సాగిపోయేలా రోమన్ లిపిని యంత్రానికి తగ్గరీతిలో ఆంగ్లేయులు ఎంతగానో అభివృద్ధి పరిచారు,అరబిక్ అంకెలను,భారతదేశపు సున్నాను అరువు తెచ్చుకొని మరీ ఆంగ్ల లిపిని విశ్వవ్యాప్తం చేశారు.ఆంగ్ల భాషనూ, అంకెల్ని మనం ఎలాగూ వాడుతూనే ఉన్నాం. ఇక అక్షరాలను కూడా వాడుకుంటే అధికార భాషగా రోమన్‌ తెలుగును పిల్లలకు నేర్పటం, అమలు చేయటం ఎంతో సుళువవుతుంది. లిపిసమస్య సాకుతో అధికారభాష అమలును ప్రక్కన పెట్టటం కంటే అంతర్జాతీయంగా అమలవుతున్న లిపినే మన భాషకు వాడుకుంటే మేలు జరుగుతుంది.చరిత్రలో తెలుగు లిపి ఎన్నో సార్లు మారింది.దేశమంతటికీ ఉమ్మడి లిపిగా ఆంగ్లాక్షరాలను ఉపయోగించుకోవాలి.ప్రపంచం మొత్తం చదవగలిగే స్థాయికి ఎదిగిన ఆంగ్ల లిపిని వాడుకోవటం ద్వారా మన దేశ భాషలన్నింటికీ జవసత్వాలు సమకూరుతాయి.పైగా అన్నిభాషల వాళ్ళూ సెల్ ఫోనుల్లో ఆంగ్ల లిపి ద్వారానే మెసేజీలు ఇప్పటికే పంపుకుంటున్నారు.ప్రపంచ దేశాలలో ఆంగ్ల లిపిలోని సంస్కృత శ్లోకాలను చదువు కుంటున్నారు.దేశ వాసులందరినీ రోమన్ లిపి ద్వారా త్వరగా అక్షరాస్యుల్ని చేయవచ్చు.దేశ మంతటా ఒకే లిపి ఉండటం వలన అందరూ అన్ని భాషలనూ అర్ధం చేసుకోలేకపోయినా కనీసం అన్ని భాషలనూ చదవగలుగుతారు,కార్యాలయాలనుండి వచ్చే ఉత్తర్వులను చదవటం చదివించుకొనటం సులువౌతుంది.లిపి ద్వారా ఐక్యత వస్తుంది.అందువలన తెలుగులో పాలన వ్యవహారాలు సులువుగా జరగాలంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆనాడు కోరినట్లు లిపి సంస్కరణన్నా జరగాలి లేదా శ్రీ శ్రీ గారి సలహా మేరకు రోమన్ లిపిలో అయినా కార్యాలయ వ్యవహారాలు నడపాలి.

8. తెలుగు మాధ్యమంలో చదువులు
ప్రాధమికవిద్యకే తెలుగులో దిక్కులేనప్పుడు పై చదువులు కూడా తెలుగులో కావాలని ప్రజలు ఏ ధైర్యంతో అడుగుతారు? ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో 5వ తరగతి వరకు తెలుగు మీడియం ఉండాలి. రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వాడుక భాషలోకి తేవాలి. ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలన్నిటినీ అప్పటికప్పుడు తర్జుమాచేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటుచేయాలి. అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి. తెలుగు భాషా రక్షణ అభివృద్ధికి మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలి. తెలుగులో ఉత్తరప్రత్యుత్తరాలు రాయగల ఐ.ఎ.యస్., ఐ.పి.యస్. అధికారుల్ని మాత్రమే ప్రజలతో సంబంధమున్న కీలక స్థానాల్లో నియమించాలి. తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషాసంఘం, తెలుగు అకాడమీ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలకు  కార్యాలయాల్లో తెలుగు అమలు  కోసం పనులు అప్పగించాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు అంటే కోడ్లు, మాన్యువల్‌లు లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్నికార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కమిషన్ పోటీపరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి. కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులు సంకలనం, వ్యవకలనం లాంటి సంస్కృత పదాలను వాడి తెలుగు మీడియం అంటే పిల్లలు భయపడేలా చేశారు. పిల్లల పుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి.  తెలుగు మీడియంలో  చదివినా  ఉద్యోగం వస్తుందనే వాతావరణం కల్పించాలి.
9. ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు  
ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి- అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలి (రాజ్యాంగం 345 ఆర్టికిల్).
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళ మీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమం లో చదివించరనీ ,ఎవరూ చదవని భాష నశిస్తుందనీ ,తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆభాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు .అందుకోసం అత్యవసరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చారు.శాసన సభలో,స్థానిక సంస్థల్లో ,ప్రభుత్వ కార్పోరేషన్లు,కంపెనీలలో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలుఇవ్వాలనిశాసించారు.
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది. ప్రభుత్వోద్యాగాలలో  నియామకాలకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది. ఈ తీర్పు వచ్చి ఎన్నో ఏళ్ళు కాలేదు. కాబట్టి తమిళనాడును ఆదర్శంగా తీసుకొని తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు  ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలి.తెలుగు మీడియం అభ్యర్ధులకు 10 శాతం ఉద్యోగాలు కోటా ఇస్తామని అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి గారు ప్రకటించారు. ఇంటర్ వరకు కూడా తెలుగు మీడియాన్ని తప్పనిసరి చేస్తామన్నారు.(ఆంధ్రజ్యోతి 9.12.2016).ఈ ప్రకటనలు జీవో లుగా రాలేదు. తెలుగుభాషకు ప్రోత్సాహకాలు ఏమీ ప్రకటించకుండానే 2019 తెలుగు భాషా దినోత్సవం జరిగిపోయింది. వాటిలో పాల్గొన్న నాయకులుకూడా తెలుగు భాషను పొగిడి ఉత్సవాలు ముగించారు.

కనీసం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకు కూడా తెలుగు మాధ్యమం లో చదివిన అభ్యర్డులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండేది.  ఎందుకంటే గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ గ్రామ  ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగులు. ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష  తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి. తమిళనాడు తరహాలో తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు 20 శాతం ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ ఇస్తే,అప్పుడు తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు ఎక్కువమంది రంగప్రవేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ పాలనా తెలుగు తయారవుతుంది.అధికారభాషగా తెలుగు అమలు కావాలంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయకతప్పదు.
10. అధికారభాషా సంఘం
చాలాకాలం పాటు ఉందోలేదో తెలియని అధికారభాషా సంఘానికి ఊపిరిపోస్తూ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారిని అధ్యక్షుడిగా  నియమించారు. ఆయన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని అందుకోసం ఒక సాఫ్ట్ వేర్ ను  కూడా తయారుచేశామని చెప్పారు. ప్రధాని మోడీ హిందీలో మాట్లాడుతుంటే ఇంగ్లీషులోకి అనువాదం వినిపించే సాఫ్ట్ వేర్ ఈమధ్య వాడారట.దానిని పార్లమెంటులో తెలుగు వాళ్ళ కోసంకూడా ఏర్పాటు చేయించాలి. తెలుగుకు ఒక మంత్రిత్వ శాఖను, తెలుగు ప్రాధికారసంస్థ ఏర్పాటు,దానికి పనులు చేసే అధికారులను నియమింపజేసుకోవాలి. అధికార భాషా సంఘం అధికారాలను పెంచాలి. హైకోర్టులో తెలుగులో వాదనలకు అనుమతి అడగాలి. తెలుగును రెండవ జాతీయ భాషగా ప్రకటించమని కోరాలి. తెలుగులోనే  జీవోలు రప్పించాలి.సర్వీస్‌కవిూషన్‌ పోటీ పరీక్షలు,శాఖాపరమైనపరీక్షలు తెలుగులోనిర్వహించాలి.
---- నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్
అమరావతి 6301493266 , 9948878833

(nrahamthulla@gmail.com)