30, జనవరి 2020, గురువారం

తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు

తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలుతెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు
తెలుగులో ముప్ఫైకి పైగా శతకాలు ముస్లిం కవులు రాశారు :
ముహమ్మద్‌ హుస్సేన్‌
భక్త కల్పద్రుమ శతకం (1949),మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం ''సుమాంజలి''.,హరిహరనాథ శతకము,అనుగుబాల నీతి శతకము,తెనుగుబాట శతకము.
''మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
మాతృభాష యొండు మాన్యము గదా
మాతృశబ్దము విన మది పులకింపదా?
వినుత ధర్మశీల తెనుగు బాల''
షేక్‌ దావూద్‌
1963 రసూల్‌ప్రభు శతకము,అల్లామాలిక్‌శతకము
సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌
''సయ్యదయ్యమాట సత్యమయ్య'' సూక్తి శతకము,
ముహమ్మద్‌ యార్ సోదర సూక్తులు
గంగన్నపల్లి హుస్సేన్‌దాసు
హుస్సేన్‌దాసు శతకము - ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య
హాజి ముహమ్మద్‌జైనుల్‌అబెదీన్‌
ప్రవక్త సూక్తి శతకము, భయ్యా శతకము
తక్కలపల్లి పాపాసాహెబ్‌
''వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
బెండ్లియాడి మతమభేదమనియె
హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
పాపసాబు మాట పైడిమూట''
షేక్‌ ఖాసిం
సాధుశీల శతకము :
''కులము మతముగాదు గుణము ప్రధానంబు
దైవచింత లేమి తపముగాదు,
బాలయోగి కులము పంచమ కులమయా,
సాధులోకపాల సత్యశీల''
షేక్‌ అలీ
''గురుని మాట శయము గూర్చుబాట''అనే మకుటంతో 'గురునిమాట' శతకం (1950) మానస ప్రబోధము శతకం
''ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన
పాండితీ ప్రకర్ష పట్టుబడదు
పరులభాష గాన బాధను గూర్చును
గురుని మాట యశము గూర్చు బాట''
''దేశ భాషలెల్ల దీక్ష వహించి నీ
వభ్యసించవలయు నర్భకుండ
మాతృభాష నేర్చి మర్యాదలందుమా
గురుని మాట యశము గూర్చు బాట''
షంషీర్‌ అహ్మద్‌ కెంపుగుండె 1999
''ప్రజల భాష తెలుగు,
ప్రజల నేలు ప్రభువుల భాష తెలుగు
ఆలు బిడ్డలతో ఆనందంగా పలకరించి,
పులకించి,ప్రేమ మీర పరవశించు,
ఆంధ్రుల ఇంటింటా మాటాడు భాష తెలుగు
కాసుకు కల మమ్ముకున్నంతలోనే, నీకు నాకు మధ్య
ఇంగిలీషు దొరతనపుదూరమెందుకో!?
మనం మాట్లాడే భాషలోనే, పాలన మర్మాలు
ప్రజలకు విడమరచి చెప్పలేని, దౌర్భాగ్యమెందుకు?
మండు వేసవిలో మృగతృష్ణల వెంట ఈ పరుగులెందుకు?
అమ్మలాంటి కమ్మనైన గంగిగోవు పాలనొదిలి
ఖరము పాల కొరకు
ఇంగిలీషు షోకు వెంట ఈ పరుగులెందుకు?''
షేక్‌ మస్తాన్‌ ''తెలుగు సాహిత్యం - 1984 వరకు ముస్లిముల సేవ'' అనే సిద్ధాంత వ్యాసానికి అలీఘర్‌ముస్లిం విశ్వవిద్యాలయ ఆచార్యుడు షేక్‌ మస్తాన్‌ గారికి పి.హెచ్‌.డి. వచ్చింది.ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఆయన 1991లో ప్రచురించారు.ఆ గ్రంథంలో 1984 వరకు వెలువడిన 42 మంది తెలుగు ముస్లిముల గ్రంథాలను పేర్కొన్నారు :- అబ్దుల్‌గపూర్‌ ముహమ్మద్‌ ఖుర్‌ఆన్‌, ఇస్లాం మత ప్రభువులు, మిష్‌కాతె షరీఫ్‌ అలి ముహమ్మద్‌ ఆణి ముత్యాలు, హృదయమాధురి, వేదనా సౌరభము, మమత. షేక్‌ రసూల్‌ మిత్రబోధామృతము అహమ్మద్‌బాషా సయ్యద్‌ శ్రీ ప్రవక్త ముహమ్మద్‌ రసూల్‌వారి దివ్య చరిత్ర. ఆలీ షేక్‌ గురునిమాట, మానస ప్రబోధము ఇస్మాయిల్‌ చెట్టునా ఆదర్శం, మృతవృక్షం, చిలకలు వాలిన చెట్టు. ఆఁ? ఉమర్‌ఆలీషా అనసూయాదేవి, ఉమర్‌ఖయ్యామ్‌, కళ, ఖండ కావ్యములు, చంద్రుగుప్త, తత్త్వ సందేశము, దానవవధ, బర్హిణిదేవి,బ్రహ్మ విద్యా విలాసము, మహాభారత కౌరవ రంగము, శ్రీ ముహమ్మద్‌వారి చరిత్ర, స్వర్గమాత, సూఫీ వేదాంత దర్శనము. ఖాసింఖాన్‌ ముహమ్మద్‌ ఆవిమారకము, ఆత్మాభిమానము, ఆల్బర్ట్‌ఐన్‌స్టీన్‌, ఉత్తరరామ చరిత్ర, ఖురానెషరీప్‌,దేవుడు, నాదేశము, దేశభక్తులు ప్రతిమ, వాసవదత్త. ఖాసీంఖాన్‌ సాహేబ్‌ షేక్‌ వీరభద్ర విజయము ఖాసీం సాదుశీల శతకము గపూర్‌ బేగ్‌ ముహమ్మద్‌ నిరపరాధులు, గ్రీష్మంలో వసంతం. జలాలుద్దీన్‌ యూసఫ్‌ మొహమ్మద్‌
లోక శాంతికి దైవ సూత్రము, మతము, రాజకీయము యదార్ధమేది, దైవనియమావళి. జైనుల్‌ అబెదీన్‌ ముహమ్మద్‌
ఖుర్‌ఆన్‌సూక్తులు, ఖుర్‌ఆన్‌ప్రవచనములు, ముహమ్మద్‌ప్రవక్త జీవితము - సందేశములు, భయ్యా శతకము (అను) ప్రవక్త సూక్తి శతకము. దరియా హుస్సేన్‌షేక్‌ పురుషోత్తముడు. దస్తగిరి అచ్చుకట్ల మణి మంజూష, అమృతమూర్తి దావూద్‌షేక్‌ చిత్త పరివర్తనము, దాసీపన్నా, రసూల్‌ప్రభుశతకము, సంస్కార ప్రణయము, సూఫీ సూక్తులు. నఫీజుద్దీన్‌ ముహమ్మద్‌ కనకపు సింహాసనమున, దేవుడూ నీకు దిక్కెవరు, ధర్మ సంరక్షణార్థం, విముక్తి, విధి విన్యాసాలు.నూరుల్లా ఖాద్రి సయ్యద్‌ రమజాను మహిమలు, నమాజు బోధిని, సుందరమగు నమూనా, విశ్వాసములు, ఆరుమాటలు, జుబా : పాపాసాహెబ్‌ తక్కల్లపల్లి అంబ, రాణీ సంయుక్త, సత్యాన్వేషణము, పాపసాబు మాట పైడిమూట.పీరాన్‌ నిజామి, హజరత్‌హుస్సేన్‌ సంస్కరణము, సూరాయె ఫాతిహా, హజ్రత్‌ముహమ్మద్‌, సీరత్‌ను గురించి ఉపన్యాసములు.ఫరీదు షేక్‌ వేమన బుడన్‌సాహేబ్‌షేక్‌ ఖుతుబ్‌నామా, జలాల్‌నామా మస్తాన్‌ సయ్యద్‌ మధు మహబూబ్‌ సమత మహబూబ్‌ ఖాన్‌ సూరీడు మహబూబ్‌ సాహేబ్‌ షేక్‌ శ్రీ శైల క్షేత్ర మహాత్యము. ముహమ్మద్‌ అజమ్‌ సయ్యద్‌ సూక్తి శతకము ముహమ్మద్‌ హుస్సేన్‌ షేక్‌ భక్త కల్పధ్రుమ శతకము, హరినాధ శతకము, సుమాంజలి, తెలుగుబాల, అనుగు బాల మిష్కిన్‌సాహేబ్‌ షేక్‌ నానార్ధనవనీతము మీరా జాన్‌షేక్‌ సర్వమత సార సంగ్రహణము మొహియుద్దీన్‌ హుస్సేన్‌ సయ్యద్‌షా తౌహీద్‌ మొహిద్దీన్‌ పీరా పటూరి ఇస్లాం బోధిని, మొహిద్దీన్‌ మల్లిక్‌ సుల్తాన్‌ శ్రేయస్కర మార్గము, మరణానంతర జీవితము, ఇస్లాం జీవిత విధానము, ఆర్థిక సమస్య - ఇస్లాం పరిష్కారము, నిర్మాణము - విచ్చిన్నము, కలిమయె-తయ్యబ-ఆర్ధము, ప్రపంచ మార్గదర్శి, ఇస్లాం శిక్షణ, ఇస్లాం బోధిని, నిర్యాణము, విచ్చిన్నము యార్‌ ముహమ్మద్‌ ఆ వేదన, సోదర సూక్తులు రసూల్‌ షేక్‌ మిత్ర బోధామృతము వజీర్‌ రహమాన్‌ ఎచటికి పోతావీరాత్రి, కవిగా చలం. వలి శ్రీమతి లక్ష్మీఊర్వశి, సలాం అబ్దుల్‌ చలంగారి శ్రీశ్రీ, షంసుద్దీన్‌ముహమ్మద్‌ కళంకిని, విజయ, నల్లబంగారం, ధనవంచిత అమృతపధం హమీదుల్లా షరీఫ్‌ షేక్‌ దైవ ప్రవక్తలు, ఖురానీ గాధలు
మారుపేర్లతో కొందరు
ఖాదర్‌మొహియుద్దీన్‌,(సౌజన్య) (మహమ్మద్‌నఫీజుద్దీన్‌), శాతవాహన (గులాంగౌస్‌), కౌముది (మహమ్మద్‌సంషుద్దీన్‌), శశిశ్రీ (బేపారి రహంతుల్లా), దేవీప్రియ (షేక్‌ఖాజా హుసేన్‌)
ఇంకా వాహెద్,స్కైబాబా, షేక్‌కరీముల్లా, సత్యాగ్ని హుసేన్‌, సుగంబాబు, అఫ్సర్‌, యాకూబ్‌, డానీ, ఖదీర్‌బాబు, బా రహంతుల్లా, వేంపల్లి షరీఫ్‌, అక్కంపేట ఇబ్రహీం, దాదా షయాత్‌, దిలావర్‌, ఖాజా, పద్మశ్రీ నాజర్‌, ఇనగంటి దావూద్‌, షహనాజ్‌బేగం, షాజహానా, మహజబీన్‌, జరీనాబేగం, షహనాజ్‌ఫాతిమా,రహమాన్ లాంటి తెలుగు రచయితలు ఎందరో ఉన్నారు.
తెలుగులో 11 మంది 14 ఖురాన్‌ అనువాదాలు చేశారు :
1925-చిలుకూరి నారాయణరావు
1941-ముహమ్మదు ఖాసిం ఖాన్
1948-ముహమ్మద్ అబ్దుల్ గఫూర్,
1980-షేక్ ఇబ్రాహీం నాసిర్
1985-హమీదుల్లా షరీఫ్
2004-అబుల్ ఇర్ఫాన్
2007-యస్.ఎం.మలిక్
2008-డాక్టర్ అబ్దుల్ రహీమ్
2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,
2010-అబ్దుల్ జలీల్
2012-డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ సత్తార్, 2012-అజీజుర్రహమాన్
2013 –అజీజుర్రహమాన్
2020-అజీజుర్రహమాన్
స్వాతంత్య్రానికి పూర్వం ముస్లిములు 5 తెలుగు పత్రికలు నడిపారు :-
1842 ''వర్తమాన తరంగిణి'' వార పత్రిక.
1842 జూన్‌8న సయ్యద్‌రహమతుల్లా
మద్రాసు.
సయ్యద్‌రహమతుల్లా తెలుగు పత్రికా రంగంలో అడుగు పెట్టిన తొలి ముస్లిం. మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు :
''మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర బాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింప జేయడమునకు కారకులమైతిమి.''
1891 ''విద్యన్మనోహారిణి'' మీర్‌షుజాయత్‌అలీఖాన్‌, నరసాపురం, తరువాత ఈ పత్రిక వీరేశలింగం గారు నడిపిన ''వివేకవర్ధిని'' లో కలిసిపోయింది.
1892 ''సత్యాన్వేషిణి'' బజులుల్లా సాహెబ్‌, రాజమండ్రి
1909 ''ఆరోగ్య ప్రబోధిని'' షేక్‌అహ్మద్‌సాహెబ్‌, రాజమండ్రి.
1944 ''మీజాన్‌'' దినపత్రిక కలకత్తావాలా, హైదరాబాదు అడవి బాపిరాజు సంపాదకుడు.
2010 - సయ్యద్‌ నశీర్‌అహమ్మద్‌ 333 మంది తెలుగు ముస్లిం కవులు,రచయితలు, అనువాదకుల వివరాలతో 257 మంది ఫొటోలు, చిరునామాలతో 'అక్షరశిల్పులు' పుస్తకం 2010 లో ప్రచురించారు.2010 లో ''సయ్యద్ సలీం'' నవల ''కాలుతున్న పూటతోట''కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.---నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266

9, జనవరి 2020, గురువారం

తెలుగు మాధ్యమాన్నీ కొనసాగించాలి

తెలుగు మాధ్యమాన్నీ కొనసాగించాలి (సూర్యలో నా సంపాదకీయం 10.1.2020)
విజయవాడలో4 వ ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభల తీర్మానాలలో తెలుగు చదువులకు ఉద్యోగాలు ఇవ్వండి అని కూడా తీర్మానం చేరిస్తే బాగుండేది.కోటివిద్యలు కూటికోసమే కదా? మండలి బుద్ధప్రసాద్ గారి లాంటివాళ్లు ఇంకా తెలుగు వెనకాలేపడి పరుగుతీస్తున్నారు. బీజీపీ ఎమ్మెల్సీ మాధవ్ గారి లాంటి చాలామంది తెలుగు మాధ్యమంలో చదివినవారికీ,పోటీ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సభల్లో కోరారు. కానీ ఉద్యోగాలు రాక ప్రజల ఆదరణ తగ్గింది.మీటింగ్ ఎదుటివారికి మాత్రమేనా? వీళ్ళ పిల్లలు అందరూ ఏ స్కూలుకు వేళ్ళాతున్నారో చెప్పాలి అని కొందరు వింతగా ప్రశ్నిస్తున్నారు.వాస్తవానికి ఒకవేళ ఎవరన్నా తమపిల్లలను తెలుగు మీడియం స్కూళ్ళకు పంపాలనుకుంటే సరైన స్కూలు కావాలి.తెలుగు బడుల్లో నీటి వసతి,మరుగుదొడ్లు ఉండవు.పిల్లల్ని ఎలా పంపిస్తారు? కార్పొరేట్ స్కూళ్ళు కాన్వెంట్లను చూసి తెలుగుబడులను చూస్తే ఏమనిపిస్తుంది?ఎలా ఉంటుంది?తెలుగుబడులు పాలకుల ప్రజల నిరాదరణకు గురైన కారణంగా ప్రైవేటు వాళ్ళు కాన్వెంట్లతో సొమ్ముచేసుకున్నారు.తెలుగులో చదివితే ఉద్యోగాలు ఇస్తున్నారా? ప్రోత్సాహకాలు ఏమున్నాయి? మనిషి ఆశబోతు.ఎటు లాభం ఉంటే అటే పోతాడు.ప్రజల పాలకుల ఆదరణ ఆచరణ ఉంటేనే ఏ పధకమైనా సఫలం అయ్యేది.అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన విషము పెట్టిన కుడుచునే ప్రియసుతుండు అన్నట్లు రేపు ప్రభుత్వ ఆంగ్లమీడియమ్ స్కూళ్ళలో కూడా ప్రాధమిక సదుపాయాలు లేకపోతే ప్రైవేటు కాన్వెంట్లదే రాజ్యం! తెలుగు లోనే.చదువు ఉండాలి ఇంగ్లీషు వద్దు అనే వాళ్లూ ఉన్నారు.చాలా తక్కువగా ఉన్నప్పటికీ అల్పసంఖ్యాకుల భాషను కాపాడటం ప్రభుత్వధర్మం. నాతల్లి అనాకారి అయినా పేదరాలైనా నాకు ఇష్టమే.నిజాన్ని నిజమనే చెబుదాం.ఇంగ్లీషు మీడియం స్కూలైనా మరుగు దొడ్డి లేకపోతే చేర్చం. న్యాయం అడగటం కూడా పోరాటమే.అహింసాయుత పోరాటాలకు ఎవరి అడ్డూలేదు. తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలని ఉత్తర్వులు ఇచ్చారు అని అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అంటున్నారు.తెలుగు సభల్లోనేమో అందరి కోరికా.తెలుగును కాపాడుకోవాలి, అన్ని సబ్జెక్టులనూ యధాతధంగా తెలుగులో కొనసాగించాలి అని. సభల్లో ఎక్కువమంది కోరిక ఏమిటంటే తమిళమాధ్యమ విద్యార్ధులకు ఇస్తున్నట్లే తెలుగు మాధ్యమ విధ్యార్హులకూ ఉద్యోగాలు ఇప్పించి తెలుగులో పాలన జరపాలని.ఆంగ్లమాధ్యమాన్ని రద్దు చేయనక్కరలేదు.తెలుగు మాధ్యమాన్ని కూడా ఉంచండి.తెలుగులో తీర్పులు, పాలన ఉంటాయని కదా తెలుగు రాష్ట్రాన్ని తెచ్చుకుంది? తెలుగులో చదివినవారికి ఉద్యోగాలు కల్పించాలి.ఎన్టీ రామారావు గారి పాలన వరకూ సర్వీసుకమీషన్ పరీక్షల్లో తెలుగుమాధ్యమ అభ్యర్ధులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కులను పునరుద్ధరించాలి.తమిళనాడులో లాగా తెలుగు మాధ్యమం లో చదివినవారికి ఉద్యోగాలిస్తూ ప్రభుత్వం అండగా నిలవాలి. తెలుగు పత్రికాధిపతులు,తెలుగు భాషాసంఘాల వాళ్ళు మౌనంగా ఉండకూడదు. తెలుగు మాధ్యమవిద్య కోసం హైకోర్టుకు వెళ్ళిన భాషాభిమానులకు న్యాయవాదులకు కృతజ్నతలు.భాషాభిమానం ఒక్కటే మనల్ని కాపాడదు. బాషద్వారా బువ్వ దొరికేలా చెయ్యాలి.తెలుగు మాధ్యమం ద్వారా కూడా ఉద్యోగాలు దొరుకుతుంటే జనం ఎవరూ చెప్పకుండానే ఎగబడతారు.తెలుగుద్వారా ఉద్యోగాలెప్పుడో అని మొదటి ప్రపంచతెలుగు సభల్నాడే శ్రీశ్రీ తన అసంతృప్తినివెళ్ళగక్కాడు.ఇంగ్లీషు లిపినే తెలుగుకు వాడుకుందామన్నాడు.ఆయనమాట ఎవరూ వినలేదు.తెలుగు పాఠ్యపుస్తకాలలో తేలికైన తెలుగుపదాలకు బదులు కఠిన సంస్కృతపదాలు కుమ్మరించి,ఆంగ్లపదాలను కూడా అడ్డుకొని పిల్లలు తెలుగు చదువంటే పారిపోయేలా చేశారు.వేలాది ఇంగ్లీషు పదాలను జనమే సొంతంచేసుకున్నారు.ఇప్పుడు ఇంగ్లీషే సులభం అని కొందరు న్యాయమూర్తులు కూడా అంటున్నారు. ప్రజల నాడి కనిపెట్టిన పాలకులు తధాస్తు అంటున్నారు.ఇక ప్రజల భాష తెలుగు పాలనాభాష అవుతుందా?అలాంటి ఆశలు మనము ఉన్నాయా?అడగకపోతే అమ్మాయినా పెట్టదు అని సామెత.అవసరసమయంలో అన్నార్తి అడగకపోతే ఎలా?
తెలుగు అధికారభాష కావాలంటే,తెలుగు దేవభాషే ,తెలుగులో పాలన అనే నా మూడు పుస్తకాలలో నేను కోరింది ప్రజల భాష పాలనా భాష గా మారాలనే. రాజ్యాంగం 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలి, అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని,చెన్నై మదురై,బెంగుళూరు హైకోర్టులు చెప్పాయి. ఆ రాష్ట్రాలలో తమిళ, కన్నడ భాషలు పాలనాభాషలుగా ఉండాలని కోరాయి. తమిళనాడులో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జీవో ఇచ్చారు. ఆప్పట్లో తెలుగు మీడియం అభ్యర్ధులకు 10 శాతం ఉద్యోగాలు కోటా ఇస్తామని మన మంత్రులు కూడా ప్రకటించారు.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలని విజయవాడ తెలుగు మహాసభల్లో ఒక తీర్మానం చేసినట్లయితే బాగుండేది. కనీసం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకు కూడా తెలుగు మాధ్యమం లో చదివిన అభ్యర్డులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండేది. ఎందుకంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ గ్రామ ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగులు. ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి. ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివి ఉద్యోగాలు దొరకక పొతే మన ప్రజలు పిల్లల్ని తెలుగులో చదివించరు.తెలుగు భాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి.తెలుగురాష్ట్రాలలో తెలుగు భాష రక్షణ,తెలుగులో పాలన కోసం తెలుగు మాధ్యమం లో చదివినవారికి ప్రోత్సాహకాలు,ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వాలు అండగా నిలవాలి.
నూర్ బాషా రహంతుల్లా ,
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266