12, జూన్ 2019, బుధవారం

అమ్మఒడి -రాజన్న బడి

అమ్మఒడి కంటే రాజన్న బడిబాటేమేలు
"అమ్మ ఒడి పథకం" ప్రకారం పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. ఈ పధకాన్ని ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తింపచేయడంతో కార్పోరేట్ స్కూళ్ళు ఈ నిధుల్ని భోంచేస్తాయని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. పేదవాళ్ళే ప్రభుత్వ బడులకు పోతారు కాబట్టి ఈ సహాయాన్ని వాళ్ళవరకే పరిమితం చేస్తే బాగుండేది అని కొందరు అంటున్నారు.ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు వశమైపోయిన విద్యా వైద్యరంగాలలో ప్రభుత్వ సహాయం చిన్నదైనా పెద్దదైనా ప్రభుత్వ సంస్థలకే చేస్తే అవి బాగుపడతాయని వారి భావన.

అందరినీ మెప్పించడం అలవి గాని పని
ఈసురోమంటున్న ప్రభుత్వ స్కూళ్ళు కూడా పదోతరగతి ఫలితాలలో 93.21% ఉత్తీర్ణత సాధించాయి. గురుకుల పాఠశాలలు 98.28% ఉత్తీర్ణత సాధించాయి.ప్రభుత్వ సాయం పెరిగే కొద్దీ సర్కారు బడుల ఫలితాలూ మెరుగవుతాయి. ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయకుండా చూడాలి. పేదలకు ఈ పథకం ద్వారా వచ్చే 15 వేల రూపాయలను ప్రైవేటు పాఠశాలలు రాబట్టుకోకూడదు. ఫీజు రియంబర్సుమెంట్ల ద్వారా ప్రైవేటు కాలేజీలు బాగుపడ్డాయి.ప్రభుత్వ కళాశాలల్లో సరైన సదుపాయాలు , బోధనా సిబ్బంది ఉంటే అంత డబ్బు వెచ్చించి ప్రైవేట్ కాలేజీలకు ఎవరూ వెళ్ళరు.అయితే ప్రైవేటు విద్యా సంస్థలకు ఇచ్చే ప్రభుత్వ సాయం సరిపోవటం లేదనీ ఆ పధకాల కోసం ప్రైవేటు సంస్థలేమీ వెంపరలాడటం లేదనీ కార్పోరేట్ వర్గాలు వాదిస్తున్నాయి. పైగా ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచే పథకాల అమలుకోసం కార్పోరేట్ శక్తులే కృషి చేస్తున్నాయని ప్రైవేట్ పెట్టుబడులు లేకపోతే ప్రభుత్వం ఈ పధకాలు అసలు అమలు చేయగలదా? అని వాదిస్తున్నారు.ఇద్దరినీ మెప్పించటం అలవిమాలిన పని
.
అందరూ ఒక ఎత్తు - అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు
ప్రజోపయోగకర పథకాలు, ప్రణాళికలు రూపొందించినప్పుడల్లా ప్రైవేట్ కార్పొరేట్ వర్గాలు అందులో తమ వాటా కోసం ప్రయత్నించడం ఖాయం. ప్రజాసేవ పేరుతో పాలకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టే పధకాలు విజయవంతం కావాలంటే ముందు అంతర్గత లోపాలను సవరించుకోవాలి. మరుగు దొడ్లు లేని స్కూలుకు ,నీళ్ళు దొరకని స్కూలుకు ,పిల్లల్ని పంపించాలని ఏ తల్లి కి అనిపించదు. అమ్మఒడి కార్యక్రమం కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమం లాగా తయారుకాదని ఏమిటి గ్యారంటీ? ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ పాఠశాలలను ఈ రెండు కార్యక్రమాలకు కేటాయించిన నిధులతో బాగుచేయవచ్చు.అక్షరదీక్షకు ఇచ్చిన పలకలను ముసలివాళ్ళు తమ పిల్లలకే ఇచ్చారట.అమ్మఒడికి చేర్చిన 15 వేలు ఎన్నిరకాల ఖర్చులకు వాడుకుంటారో?ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రైవేటు స్కూళ్ళలాగా ఉంటే పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలోనే చేరుస్తారు.ప్రజలు కోరారని ప్రభుత్వ స్కూళ్ళలో తెలుగు మీడియం బదులు ఇంగ్లీషు మీడియం కూడా ప్రవేశపెట్టారు.ఇక ప్రైవేటు వాళ్ళకంటే ఏమి తక్కువయ్యిందని ప్రైవేటు స్కూళ్ళకూ,ప్రైవేటు స్కూళ్ళలో పిల్లల్ని చేర్చే వాళ్ళకూ అమ్మఒడి డబ్బులివ్వాలి? ఎవరు ఎట్లాపోతే నాకేంటి ? ఇందులో నాకొచ్చేదెంత అని అడిగే జనం ఎక్కువయ్యారు.కోర్కెలు అనంతాలు. అవి తీరేకొద్దీ కొత్తవి పుట్టుకొస్తాయి. వ్యక్తిగత కోర్కెల బదులు సమిష్టి కోర్కెల సాధనకు జనం సిద్ధపడితే బాగుండు.

అ - ఆ లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట
ప్రభుత్వ పధకాలన్నీ ప్రభుత్వ సంస్థలకే రావాలని ఉద్యమించే వాళ్ళు ప్రభుత్వ సంస్థల బాగుకోసం పని చెయ్యాలి.వర్షానికి కారిపోయే,కూలిపోయే పాఠశాలలు,ఆసుపత్రులను బాగుచేయటానికి అధికారులు ,పార్టీల నేతల దగ్గరకు,పదే పదే తిరగాలి.కొంతమంది డాక్టర్లు, ఉపాధ్యాయులు వారు పనిచేసే భవనాల బాగుకోసం నిరంతరం కృషి చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.అలాగే ప్రైవేట్ ప్రాక్టీసును మానిపించాలి.స్థానికంగా నివాసం ఉండే ఉపాధ్యాయునికి పాఠశాల సమస్యలు బాగా అవగతమౌతాయి.అలాగే ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివిస్తే బడులు బాగుపడతాయి. ఉపాధ్యాయులు బాధ్యతగా పాఠాలు చెబుతారు.బడి ప్రతిష్ఠ పెరుగుతుంది..ఈమధ్య కొంతమంది కలక్టర్లు,డిప్యూటీ కలక్టర్లు కూడా తమ బిడ్డల్ని ప్రభుత్వ బడుల్లో చేర్చి ఆదర్శంగా నిలిచారు.ఏ వసతులూ లేని ప్రభుత్వ స్కూళ్ళలో ఎలా చేరతారు?స్కూళ్ళ బాగుకోసం ఏమీ చెయ్యకుండా వాటికి ప్రాధాన్యత ఎలా వస్తుంది?ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా ఉపాధ్యాయులు,అధికారులు,రాజకీయ నాయకులు వాళ్ళపిల్లల్ని చేరిస్తే కొంత నిఘా పెరిగి అవి బాగుపడతాయి.

అడిగేటంత అన్యాయానికి లోబడతానా?
అడిగిందే పాపం - అనుగ్రహించటం తన స్వభావం అన్నట్లు ఉంది అమ్మఒడి వరం.వరమడిగిన జనం ఈ డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచమని కోరాలి.పిల్లల సంఖ్యకు తగ్గట్లు టీచర్ల సంఖ్యను పెంచమని కోరాలి.టీచర్లకు బోధనా నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించమని కోరాలి.కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం బోడేమ్మనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బస్సు ను ఏర్పాటు చేసినట్లు అవసరమైన ప్రతిస్కూలుకీ బస్సు ఏర్పాటు చేసుకోవాలి.స్కూళ్ళకు చేయాలనుకుంటే ఎన్ని పనులు లేవు? సత్తా ఉంటే స్వయంగా చెయ్యాలి,లేకపోతే చేయించాలి.రెండూ అవసరమే. ఒక కేంద్ర మంత్రి మధ్యాహ్న భోజనం పధకం దండగామారి పధకం పిల్లలు భోంచేసి కూలి పనులకు వెళ్ళిపోతున్నారు అని వాపోయారు గానీ ఆ పధకం మంచిదే.దానిని ఇంకా ఇంకా ఉపయోగకరంగా తీర్చిదిద్దుకోవాలి.మనసుంటే మార్గముంటుంది.

రాజన్న బడి బాట నిభంధనలు నయం
రాజన్న బడి బాట లో బూట్లు,సాక్సు,దుస్తులు,సైకిలు ... లాంటివన్నీ ప్రభుత్వ స్కూళ్ళకు పోయే వారికేనట. అమ్మ ఒడికి,ఆరోగ్యశ్రీ కి కూడా ఇలాంటి నియమాలే పెడితే బాగుండేది. విద్యాభివృద్ధి జరగాలి అది ప్రవేటుదైనా ప్రభుత్వపరంగా నైనా సరే అనుకుంటే ఆరోగ్యశ్రీ లో కార్పొరేట్ ఆసుపత్రలకు,ఫీజు రీయింబర్సుమెంటులో కార్పొరేట్ కాలేజీలకు ఇచ్చినట్లు ఇవీ ఇవ్వవచ్చు.కానీ ప్రభుత్వ ఆసుపత్రలు,ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలి వాటి ద్వారానే ఈ సేవలన్నీ ప్రజలకు అందించాలి అనుకుంటే మాత్రం వీటికి కేటాయించిన నిధులు ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలు,ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పనకు వాడాలి.తద్వారా ప్రజలు ప్రభుత్వ స్కూళ్ళకు ,హాస్పిటళ్ళకు రావటానికి మొగ్గుచూపే వాతావరణం తేవాలి. ప్రభుత్వ స్కూళ్ళలో ,హాస్పిటళ్ళలో ఖచ్చితంగా కనీస సదుపాయాలు కల్పించాలి.108,104 సేవలను ప్రజలు మరచిపోలేరు.అలాగే అమ్మఒడి రాజన్న బాట పట్టాలి.దీర్ఘ కాలంలో ప్రజలకు మేలు చేస్తాయనుకున్న పధకాలు నిరంకుశంగా అమలు చెయ్యాలి.మీకు వెయ్యి రూపాయలు వ్యక్తిగత సాయం చేస్తామనే పధకంకంటే మీ స్కూల్లో ఇంకో గది కట్టిస్తామనే పధకమే మేలు.
---నూర్ బాషా రహంతుల్లా ,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి