8, నవంబర్ 2019, శుక్రవారం

తెలుగు ఎవరికి కావాలి? ఎందుకు కావాలి?

                                      తెలుగు ఎవరికి కావాలి? ఎందుకు కావాలి?
ఇకమీదట ఆంగ్లమాధ్యమం లోనే చదువులన్నీ ఉండబోతున్నాయని జీవో వచ్చింది.చదువంతా ఇంగ్లీషుమయమైతే ఇక అధికార భాషా సంఘం ఎందుకు,తెలుగు అకాడమీ ఎందుకు,వాటికి పని ఏముంటుంది,వాటి చైర్మన్లు ఏమి చెయ్యను? మొదలైన ప్రశ్నలు భాషా సంఘాలవాళ్ళు సంధిస్తే ,ఇంగ్లీషు మీడియాన్ని ప్రజలు కోరుకున్నారు కాబట్టే ప్రభుత్వంకూడా సరే అందని మంత్రులు కూడా సమర్ధించుకున్నారు.
తెలుగు గురించి గొప్పగా రాసేవారిలో ఎంత మంది తమ పిల్లలను తెలుగుమీడియంలో చదివిస్తున్నారు ? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ పెడితే ఎందుకు ఏడుస్తున్నారూ? ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఉద్యోగం దోరుకుతుంది . తెలుగు బాష వల్ల ప్రయోజనం ఏమిటి?ఉద్యోగం వస్తుందా? తెలుగును ఇన్నాళ్ళూ హత్తుకున్న ఎస్సీ ఎస్టీ, బీసీ. మైనార్టీలకు ఏమి ఒరిగింది? అంబేద్కర్ ఇంగ్లీషు చదువు ద్వారానే దేశానికి రాజ్యాంగం రాయగలిగాడు.పాలకులుకూడా అతన్నే శరణ్యం అనుకున్నారు.గవర్నమెంట్ స్కూల్స్ టీచర్లు కూడా తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్చేది ఉద్యోగాలను ఆశించే. తెలుగు భాష మాత్రమే వస్తే తెలుగు రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు రావు. కాబట్టి ఈ దేశంలో గానీ విదేశాలలో గానీ ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలకు ఇంగ్లీష్ మాత్రమే వస్తే చాలు. మాతృభాష కాబట్టి తెలుగు ఎలాగూ మాట్లాడను వస్తుంది.రాష్ట్రం దాటితే తెలుగుకు దిక్కులేదు.ఇంగ్లీష్ హిందీ వస్తే ప్రపంచంత తిరుగొచ్చు. రాజకీయ నాయకుల పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు.ఎమ్మేల్యేలు,మంత్రులు తమ కొడుకులను కూతుళ్ళను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పమనండి చూద్దాం?ఎవరూ చెప్పరు.
తెలుగు పాఠశాలలు ఎలా ఏడుస్తున్నాయో తెలియదా? అసలు అవి ఉంటేగా చేర్చటానికి?అది ఆంగ్లమాధ్యమం మీద ఏడుపుకాదు.తెలుగు భాష ఉనికిలో లేకుండా పోతుందే అని బాధ.తెలుగోళ్ళు వద్దంటున్నది ఇంగ్లీషు ని కాదు, ఇంగ్లీష్ మీడియంని.ఉద్యోగాలు కేవలం భాషనుబట్టి రావువృత్తి లో ప్రావీణ్యత నుబట్టి వస్తాయి . ఇంగ్లీషు పెట్టినా ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నీటిసరఫరా లాంటి ప్రాధమిక సదుపాయాలకల్పన జరగకపోతే మళ్ళీ ఆందోళన మామూలే. తెలుగు పత్రికాధిపతులు తెలుగు మాధ్యమం కావాలంటూ హైకోర్టుకు వెళ్ళవచ్చుకదా?మాతృభాషలో ప్రాధమిక విద్య నేర్పటం కనీసధర్మం,రాజ్యాంగబద్దం. తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్డులకు ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇవ్వటం రాజ్యాంగబద్దమేనని ఏ రాష్ట్ర భాషను ఆ రాష్ట్రం కాపాడుకోవాలని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది.మన రాష్ట్రంలో కూడా తెలుగులో విద్యను కాపాడుకోటానికి తెలుగువిద్య ద్వారా ఉపాధి కల్పనకు హైకోర్టు ఉద్దేశాన్ని కోరటం మంచిదికాదా? హోం మంత్రి షా ఒకే దేశం, ఒకే భాష అని ఒక శుష్క నినాదం దేశానికి వినిపించాడు. అప్పుడు హిందీని కూడా మన తెలుగు జనం వ్యతిరేకించారు. ఆంగ్లమీడియం అనగానే ఇంగ్లీషుకు మాత్రం నీరాజనాలు పడుతున్నారు. కారణం ఉపాధే . భారతీయ భాషలన్నీ ఆ భాషలద్వారా ఉద్యోగ కల్పనకు ఊపిరి పోయలేదు. సంస్కృత మంత్రాలు నేర్చుకున్న అర్చకునికి పూజారి ఉద్యోగమైనా దొరకవచ్చు గానీ తెలుగు మాధ్యమం లో డిగ్రీ చేసిన వానికి ఏదైనా గ్రామ సచివాలయంలో ఉద్యోగమైనా దొరుకుతుందా?తెలుగు విద్యార్ధులకు మేలు చేసే ఉద్దేశంతో 1985 వరకు సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షలలో 5 శాతం ప్రోత్సాహక మార్కులు ఇచ్చారు.దానిని పునరుద్ధరించటానికి ఎవరూ ప్రయత్నించలేదు.
ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా పరిరక్షణ దినోత్స వంగా తలుచుకోవటం తప్ప తెలుగు పరిరక్షణకోసం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ద్వారా ఫలానా పనులు జరుగుతాయి ఫలానా ఉద్యోగాలు దొరుకుతాయి అనే వాగ్దానం దొరికితే తప్ప ఆంధ్రప్రదేశ్ ఆంగ్లప్రదేశ్ గా మారిపోవటం ఖాయం. కట్టు బొట్టు మాత్రమే కాదు తెలుగు భాష అంటే,తెలుగు పిల్లలకు తెలుగులో చదువు నేర్పటం ఉపాధి కల్పించటం. మధురై హైకోర్టు న్యాయమూర్తి న్యాయ పరీక్షలను తమిళ మాధ్యమం లో రాసిన విద్యార్ధిని అభినందించారట. తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.కోటివిద్యలు కూటికొరకే
ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలో లేకపోతే తెలుగును పాలనా భాషగాఅమలు చెయ్యలేము.ప్రాధమిక విద్య తెలుగుమాధ్యమంలోకి మారాలి.తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పడాలి.తెలుగులో పాలన జరగాలి.తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్ధులకు పోటీ పరీక్షలలో ప్రోత్సాహక మార్కులు,ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఇన్నాళ్ళూ కోరుతూ ఉన్నాము. తెలుగు మాధ్యమం లో ఇకమీదట చదువే ఉండకపోతే ఈ కోర్కెలు కోరేదెవరు,తీర్చేదెవరు?ప్రస్తుతం కోరేవాళ్ళు చాలా తక్కువ కాబట్టే తీర్చే అవసరం రాక పాలకుల పని సుళువయ్యింది.
నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

1 కామెంట్‌: