2, ఫిబ్రవరి 2012, గురువారం

తెలుగు భాషకు తీవ్రమైన అన్యాయం

తెలుగు ప్రాచీన భాషా అధ్యయన కేంద్రాన్ని మన రాష్ట్రం లోనే ఏర్పాటు చేయాలని కోరుతూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు 29.10.2011 న కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి గారికి రాసిన లేఖ 2.2.2012 న నాకు పంపారు.అందులోపేర్కొన్న అంశాలు;

మైసూరులోని భారతీయభాషల కే0ద్రంలో తెలుగు భాషకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది.

1. ఒకప్పుడు తెలుగు, తమిళం, బెంగాలి భాషలలో కరస్పాండెన్ కోర్సు నడిచేది. 2001 వ సంవత్సరంలో తెలుగు కోర్సు మాత్రమే మూసివేయబడినది.

2. 2004 వ సంవత్సరం లో భాషా మందాకిని ప్రాజెక్టు ప్రారంభించబడినది. దానిలో తెలుగు భాషను తొలగించి బెంగాలీ భాషను పెట్టారు. 2008వ సంవత్సరం లో తెలుగు విశ్వవిద్యాలయంతో కలసి తెలుగు భాషా మందాకిని ప్రాజెక్టు చేయడానికి ఒప్పందం జరిగింది. అయితే అప్పటి నుంచి ఒకటి, రెండు సమావేశాలు తప్ప ఆ ప్రాజెక్టు అతిగతి లేదు.

3. Grant in aid project అనేది భారతీయ భాషలలో రచనలు చేసే రచయితల ప్రచురణలకు మరియు పుస్తకాల కొనుగోలుకు ఆర్ధిక సహాయం చేసే ప్రాజెక్టు. ఇందులో అతి ఎక్కువ భాగం ఇతర భాషలకు, అతి తక్కువ భాగం తెలుగుకు కేటాయిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల Language wise statistics చూస్తే తెలుగుకు జరుగుతున్న అన్యాయం తేటతెల్ల మవుతున్నది.

4. National Translation Mission చాలా పెద్ద ప్రాజెక్టు. ఇందులో వివిధ భాషలకు చెందిన వంద మంది దాకా పనిచేస్తున్నారు. తెలుగు వారు కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారు.

5. LDC-IL (Linguistic Data Consortium of Indian Languages) ఇందులో దాదాపు 70 మంది పనిచేస్తుంటే దురదృష్టవశాత్తు తెలుగువాడు ఒక్కడే.

6. NTS (National Testing Services) ఇది కూడ చాలా పెద్ద ప్రాజెక్టు. అనేక రకాల పరీక్షల మూల్యాంకనం మరియు పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే పరీక్షలకు సంబందించిన విధి విధానాలను సూచన చేసే ప్రాజెక్టు ఇది. ఇందులో కూడ తెలుగు భాషకు స్ధానం దక్కక పోవటం దురదృష్టం. కేవలం తమిళం, ఉర్దూ భాషలకే పరిమితం చేశారు.

7. మొత్తం ఈ కే0ద్రం లో వివిధ ప్రాజెక్టులలో 350 మంది పైగా పనిచేస్తుంటే ఇందులో తెలుగువారు కేవలం 5 గురు మాత్రమే.

తెలుగు వారికి, తెలుగు భాషకు ఆ కే0ద్రం లో ఈ దుస్దితి కల్పించిన సంబందిత అధికారుల పై చర్యలు తీసుకుని ఈ పరిస్దితి సవరించవలసిందిగా కే0ద్ర మానవ వనరుల అభివృద్ది శాఖా సహాయమాత్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధ్రీశ్వరి గారిని కోరుతున్నాను.

2012 ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్బంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య ప్రభుత్వానికి ఎనిమిది డిమాండ్లు పంపింది:-

1. తెలుగు భాషా సంస్కృతుల అభివృద్దికై ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలి.

2. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, స్పీకర్ కార్యాలయాల్లో

అధికార భాషగా తెలుగును పూర్తిగా ఆచరణలో పెట్టాలి. జిల్లాస్ధాయి వరకు న్యాయ స్ధానాల్లో

తెలుగులో వ్యవహారాలు జరిగేoదుకు జి.ఒ.నెం.485(1974) అమలు పరచాలి. అధికార భాషా

సంఘాన్ని తగిన అధికారాలు ఇచ్చి వెంటనే నియమించాలి.

3. క్లాసికల్ భాషగా తెలుగులో పరిశోదన కేoద్రాన్ని కేoద్ర ప్రభుత్వo నిధులు విడుదల చేసినా, దాన్ని

ఆంద్రప్రదేశ్ లో స్ధాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ద వహించకపోవడం అన్యాయం,. వెంటనే తగిన

సౌకర్యాలు చూపడంతో పాటు తమిళ, కన్నడాలకు దీటుగా క్లాసికల్ తెలుగు అద్యయన సంస్ధను

పూర్తి స్ధాయిలో స్ధాపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

4. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారి విద్య, భాషా సంస్కృతుల రక్షణకై శాశ్వతస్ధాయిన సంయుక్త

సభాసంఘాన్ని అన్నివనరులతో ఏర్పరచాలి.

5. ఇంటర్మీడియట్, డిగ్రీ, పి.జి.తరగతుల్లోను సాంకేతిక విద్యారంగంలోను రాష్ట్రంలో తెలుగు భాషను

ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చెయ్యాలి.

6. ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలన్నిటిలో మాతృ భాషలోనే ప్రాధమిక విద్యను బోదించడాన్ని

తప్పనిసరి చెయ్యాలి.

7. ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో తెలుగు మాట్లాడడాన్ని నేరంగా పరిగణించి శిక్షలు వేయడం

రాష్ట్రమంతటా ఒక అలవాటుగామారింది. తెలుగుభాషను తక్కువ చూపుచూడడం,

పలురంగాలలో తెలుగును అవమానించడం సర్వసాధారణమైంది. వివిధ ప్రాంతాల

మాండలికాలను, యాసలను హేళన చెయ్యడం, వక్రీకరించడం జరుగుతోoది. ఈ పరిస్ధితిని

నివారించి, తెలుగు భాషా సంస్కృతుల పట్ల గౌరవాన్ని ఇనుమడింపచేసేoదుకు వెంటనే ఒక

చట్టాన్ని తీసుకురావాలి.

8. ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీని వెంటనే పునరుద్ధరించాలి.

- పై కనీస డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్చాలి. తెలుగు భాషపట్ల, తెలుగు జాతిపట్ల తన నిబద్దతను నిరూపించుకోవాలి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్న ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే రాష్ట్రం లోనూ రాష్ట్రం బయటాగల 18 కోట్ల తెలుగు ప్రజల అసంతృప్తికి పాలక వర్గాలు గురికావలసి వస్తుంది. నిరంతర ఉద్యమాల్ని, ఆందోళనల్ని ఎదుర్కోవలసి వస్తుంది.

ఇంటాబయటా తెలుగును అణచివేస్తున్నారు అనే సంపాదకీయం లో సామల రమేష్ గారుఇలా ఆవేదన చెందారు:-

రాష్ట్రం లో తగినచోటునిచ్చి, తెలుగు భాషా పరిశోధనా కేoద్రాన్ని ప్రారంభించే బాద్యతను తీసుకునే నాధుడు ఎవరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం లో లేడు. తెలుగుకు ఒక మంత్రీ, మంత్రిత్వశాఖ ఉంటేగదా పట్టించుకోవడానికి ! ఇదీ మనగతి. ప్రభుత్వ ఉద్యోగులు తెలుగు నేర్చుకోవలసిన అవసరం లేదని కూడా ఇప్పుడు చేతల్లో చెప్పేసిందన్నమాట! తెలుగును తొంభై తీరులుగా తొక్కివేస్తున్నారు. బయటివారు, లోపలివారూ తెలుగును అణచివేస్తున్నారు. -(నడుస్తున్న చరిత్ర ఫిబ్రవరి 2012)

తెలుగుకు ప్రపంచీకరణ తెగులు పట్టిందంటూ వెన్నెల కంటి రామారావు ఇలా బాధపడ్డారు:-

తెలుగు జాతిలో మేధావులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ తెలుగు భాషకు పారిభాషిక భాషా లక్షణం తీసుకురావడంలో వారందరూ విముఖంగా ఉన్నారు. తమ పరిశోధనలకు, విద్యా ఉద్యోగాలకు, పరిపాలనకు పరాయి భాషను ఉపయోగిస్తూ మాతృభాషను కేవలం వాగ్వ్య వహారాలకు, దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం వలన తెలుగు భాష ఆధునీకరణకు దూరమై ప్రమాదానికి చేరువయ్యింది. మాతృభాషను ఆధునీకరించి తెలుగు జాతి వికాసానికి కృషి చేసే సంకల్పంలేని ప్రభుత్వాల కారణంగా తెలుగు భాషకు ఈ దుస్ధితి ఏర్పడింది.

2012 ఫిబ్రవరి 5,6,7 తేదీలలో -ఒంగోలులో జరిగిన ప్రపంచ తెలుగు మహొత్సవం లో సంస్కృతం, ఆంగ్లం అనే రెండు రెక్కలు లేకుండా తెలుగుఅనే పక్షి ఎగురలేదు అని పమ్మి పవన్ కుమార్ అంటే, తెలుగు వాళ్లం చేతగాని వాళ్లం అయివుండవచ్చు. తెలుగు చేతగాని నుడికాదు, చేవకలిగిన నుడి. మన చేతగాని తనాన్ని నుడిపైన రుద్దడం తప్పు అని స.వెం. రమేష్ గారు తిప్పికొట్టారు.

మాతృ భాషల్లోనే గ్రహాలతో మాట్లాడేదెప్పుడు?” అంటూ ప్రజా సాహితి సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు నిజాం నవాబు కాలం లో ఆనాటి పాలనా భాషైన ఉర్దూలోనే ఇంజనీరింగు న్యాయ, వైద్య, విద్య సుసాధ్యం అయినట్లు యిప్పుడు మాత్రం దేశీయ భాషలలో ఎందుకు సాధ్యం కాదు?” అని ప్రశ్నించారు.

లోకముతో కూడా మార్పు చెందనిది ఏదీ వృద్ది పొందదు. లోకమును అనుసరించి మారినవి వృద్దిపొంది, మారని వాటిని అణగదొక్కి నిర్మూలము చేయకమానవు. ఇది లోకధర్మము అన్నారు గిడుగు.

ఇంగ్లీషు అలా మార్పు చెందుతూ ఉంది కాబట్టి మిగతా భాషల్ని అణగదొక్కి రాజ్యమేలుతోoది. తెలుగు భాషను కూడ అలా ఆధునిక ప్రజావసరాలన్నింటికీ అనువుగా అన్నిరంగాలలో అభివృద్ది చేసుకుంటూ పోకపోతే తెలుగు అణిగి మణిగి పోవటం ఖాయం. ఇంగ్లీషు మాత్రమే వచ్చిన వాడికి ఉద్యోగాలు ఎంత సులభంగా దొరుకుతున్నాయో తెలుగు మాత్రమే వచ్చిన వాడికి కూడా అంతే సులభంగా ఉద్యోగం దొరికేదాకా తెలుగు ప్రజలు పోరాడక తప్పదు.తమిళ అసెంబ్లీలో తెలుగు గోడు

హోసూరు ఎమ్మెల్యే గోపీనాద్:మీరు నన్ను నా భాషలో మాట్లాడటానికి ప్రోత్సాహించారు.ముఖ్యమంత్రిగారూ మీరు తెలుగులో మాట్లాడుతుంటే నేను పరవశించి పోతున్నాను.మీమాటలు విన్నయావత్ భారత దేశంలోని తెలుగు ప్రజలు మిమ్మల్ని వేనోళ్ల కొనియాడుతారు.మాయొక్క గోడు ఏంటంటే మా భాషని కాపాడండి.మాతో పాటు ఉర్దూ కన్నడ మళయాళ భాషలను కాపాడండి అని విన్నవించుకుంటున్నాను.

ముఖ్య మంత్రి జయలలిత:అన్ని భాషలను కాపాడటానికి మేము సిద్ధంగా ఉన్నాము.ఏంచెయ్యాలో చెప్పండి మీరు.

హోసూరు ఎమ్మెల్యే గోపీనాద్:ఏంచేస్తే బాగుంటదో ఏం చేస్తే మా మైనారిటీ భాషలు కాపాడబడతాయో ఆలోచించి మీరే చెయ్యండి.
ముఖ్య మంత్రి జయలలిత:కర్నాటకలో విద్యార్ధులు కన్నడం చదవకుండా తమ విద్యను కొనసాగించలేరు.
ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యార్ధులు కూడా తమ మాతృ భాష ఏదైనప్పటికీ తెలుగు తప్పనిసరిగా చదవాల్సిందే.కాబట్టి తమిళనాడులోని విద్యార్ధులంతా తమ మాతృభాష ఏదైనప్పటికీ తమిళం చదవాల్సిందే అన్న నిబంధనలో తప్పులేదు.ఎలాంటి మార్పు ఉండబోదు.

జయలలిత నోట తెలుగు ఎంతో మధురంగా ఉంది.తమిళనాడు అసెంబ్లీ లో తెలుగు వాణి వినిపించిన హోసూరు ఎమ్మెల్యే గోపీనాద్ ను చూసిన మీదట మన నాయకులకు తెలుగును రక్షించుకోవాలన్న తెగువ కలగాలి.తమిళనాడులో నివసించే తెలుగు వాళ్ళుతో పాటు ఎవరైనా సరే తమిళం చదవాల్సిందేనని 3.2.12 న అసెంబ్లీలో జయలలిత తెగేసి చెప్పారు.
తెలుగు భాష పట్ల కూడా
అలాంటి దృడాభిప్రాయం మన నేతలకూ ఉండాలి .
ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యార్ధులు తమ మాతృ భాష ఏదైనప్పటికీ తెలుగు తప్పనిసరిగా చదవాల్సిందేనన్న జయలలిత మాటలు నిజమైతే చాలు.

2 కామెంట్‌లు: