27, జులై 2014, ఆదివారం

ప్రాంతీయ భాషలు చచ్చిపోవాలా?


  ప్రాంతీయ  భాషలు చచ్చిపోవాలా?


నూర్ బాషా రహంతుల్లా 9948878833


మన దేశం భిన్న భాషలు, సంస్కృతులు గల దేశం. దేశ పాలనా నిర్వహణలో అన్ని ప్రాంతాల వారికీ ,అన్నీ  భాషల వారికీ చోటివ్వాలి. గ్రామీణ అభ్యర్ధులకు అన్యాయం కలిగేలా, కార్పొరేట్ విద్యాలయాల్లో ఆంగ్లమో,హిందీనో చదువుకున్నవారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా  ప్రక్రియ సాగకూడదు. సివిల్ సర్వీసులకు ఎంపికయ్యేవారిలో  ఇంగ్లిష్ ప్రావీణ్యం అడుగంటుతున్నదని కాలం చెల్లిన విధానాలకుస్వస్తిపలుకుతున్నామని యూపీఎస్సీ కుంటిసాకులు చెబుతున్నది . ఇంగ్లిష్‌లో ప్రావీణ్యమే అభ్యర్థి జయా పజయాలను నిర్ణయించే స్థితి కల్పిస్తోంది. ఐ.ఏ.యస్. లు పనిచేయాల్సింది అమెరికాలో కాదు.మన  దేశంలోనే, వ్యవహరించాల్సిందీ ఈ దేశ ప్రజలతోనే.ఇంగ్లిష్ పరి జ్ఞానంకన్నా సమస్యలను గుర్తించడంలో, వాటికి పరిష్కారాలను వెదకడంలో,ప్రజానీకానికి మేలు చేకూర్చడంలో వారికి ఉండే సమర్ధతను పరీక్షించాలి. వారిలో సమయస్ఫూర్తి, చొరవ, హేతుబద్ధత, అంకితభావం, దృఢ సంకల్పం, నైతికవర్తన వంటివి ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయాలి.యూపీఎస్సీ హిందీకి ఇంగ్లిష్‌కు పెద్దపీట వేస్తున్నది. పరీక్షను ప్రాంతీయ భాషలో రాయొచ్చంటున్నారుగానీ ప్రశ్నపత్రాన్ని మాత్రం ఇంగ్లిష్ లేదా హిందీలో ఇస్తున్నారు.ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానంపై కఠిన పరీక్ష పెడుతోంది.
 
1979 కి ముందు ధనవంతులు, ఉన్నత వర్గాలవారికే సివిల్‌ సర్వీసెస్‌ అందుబాటులో ఉండేవి. ప్రాంతీయ భాషల్లోనూ సివిల్స్‌ రాయడానికి 1979లో అవకాశం కల్పించినప్పటి నుంచి భారతదేశ భాషలన్నిటికీ ప్రాతినిధ్యం దక్కింది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షల్ని రాజ్యాంగం గుర్తించిన 22  భాషల్లో నిర్వహిస్తున్నారు.తెలుగు మాధ్యమంలో యూపీఎస్సీ స్థాయి పుస్తకాలు లేవు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన తెలుగు అభ్యర్థులు పోటీ పడలేకపోతున్నారు. 2013లో తెలుగు మాధ్యమ అభ్యర్థి ఒక్కరైనా విజయం సాధించలేదు. రెండు మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లిన తెలుగు మాధ్యమం అభ్యర్థులు 2013 ప్రాథమిక పరీక్షలోనే తప్పారు. 2012 ఆగస్టులో నిగ్వేకర్‌ కమిటీ సీశాట్‌ పేపర్‌వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందని స్పష్టీకరించింది.
పనిభారం ఎక్కువైనందువల్ల  రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషల్లో పరీక్షలు  నిర్వహించలేక ప్రాంతీయ భాషల్లో పరీక్షలకు హాజరయ్యే గ్రామీణ అభ్యర్థులను దెబ్బతీసిందట .ఆంగ్ల మాధ్యమంలో వృత్తివిద్య అభ్యసించేవారితో గ్రామీణ అభ్యర్థులు పోటీపడలేక ప్రాంతీయ భాషల అభ్యర్థులు పరీక్షలకు శాశ్వతంగా దూరమయితే తమకు పనిభారం తగ్గిపోతుందన్నది యూపీఎస్సీ దురాలోచన.
ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఉండాలని కోరడం ఆయా రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. సివిల్‌ సర్వీసు అధికారులు ఉత్తరప్రత్యుత్తరాలను ఇంగ్లిష్‌లోనే సాగించాలి కాబట్టి ఇంగ్లిష్‌ భాషపై పట్టులేని అభ్యర్థులు అక్కరలేదనే పద్ధతిలో పరీక్షలు రూపొందించారు. ఇంగ్లిషు,హిందీ అసలు రాని అన్నాదురై ,ఆంధ్ర బోజుడుగా పేరెన్నికగన్న శ్రీకృష్ణ దేవరాయలు,మొఘల్‌ చక్రవర్తుల్లో అత్యుత్తమ పాలకుడిగా చరిత్రలో నిలిచిన అక్బర్‌, మైసూరు మహారాజు హైదర్‌ అలీ ఏమీ చదువుకోకపోయినా సమర్థులైన పాలనాదక్షులుగా గణుతికెక్కారు.ప్రజాప్రతినిధులకు తప్పనిసరికాని ఆంగ్ల భాషా ప్రావీణ్యత సివిల్‌ సర్వెంట్లకు మాత్రం ఎందుకు?విదేశీ ఇంగ్లిష్‌ కోసం దేశీయ భాషలను అణగదొక్కడం అన్యాయం.
వాస్తవానికి తెలుగుతో పాటు రాజ్యాంగం గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషల్లో సివిల్స్ మెయిన్ పరీక్షలు రాయటానికి వీల్లేదనే నిర్ణయాన్ని 2013 లోనే ప్రభుత్వం రద్దు చేసింది.రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తింపు పొందిన అన్ని ప్రాంతీయ భాషల్లో సివిల్స్ మెయిన్ పరీక్షలు రాయవచ్చని ప్రకటించింది. కనీసం 25మంది విద్యార్థులు ఉంటే తప్ప ప్రాంతీయ భాషలో పరీక్ష నిర్వహించటం జరగదన్న నిబంధనను రద్దు చేశారు. అదేవిధంగా అభ్యర్థులు ఏ భాషలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారో అదే భాషలో సివిల్స్ మెయిన్ పరీక్షలు రాయాలన్న నిబంధన కూడా వర్తించబోదని స్పష్టం చేశారు. ఇంగ్లీష్‌లో 100 మార్కుల వ్యాసరచనను ఉపసంహరించారు.
సి శాట్ అంటే సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనే ప్రాథమిక పరీక్ష .ఈ పరీక్షలో పాస్ అవ్వాలంటే ఇంగ్లిష్ బాగా వచ్చి ఉండాలి. మెయిన్ పరీక్షలు హిందీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి.తెలుగు జ్నానాన్ని ఏ దశలోనూ పరీక్షించరు. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీషు, హిందీలో మాత్రమే ఇస్తున్నారు. తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రం ఉండదు. ఇంగ్లీషులోనే ప్రశ్నపత్రాన్ని చదివి, అర్థం చేసుకుని పరీక్ష రాయాల్సిందే. హిందీ రాష్ట్రాల విద్యార్థులకు ఈ సమస్య లేదు.

తెలుగు అభ్యర్థులు ఇంగ్లీషునో హిందీనో ఆశ్రయించక తప్పని పరిస్తితి దాపురించింది. ప్రాంతీయ అభ్యర్ధులు ఎవరూ తమ తమ మాతృభాషల్లో పరీక్షలు స్వేచ్ఛగా రాయలేని పరిస్థితిని కల్పించారు.ప్రశ్నా పత్రాలను ఎలా ఇచ్చినా ఎన్ని మార్పులు చేసినా అవి ఆయా ప్రాంతీయ భాషల్లో ఉంటే మిగతా భాషల వాళ్ళు హిందీ వాళ్ళతో సమానంగా పోటీపడి నెగ్గుతారు. తెలుగు విద్యార్థులు పోటీలో నిలదొక్కుకోవాలంటే  తెలుగులోనే  ప్రశ్నాపత్రం ఉండాలి. తెలుగులో పరీక్ష రాసేందుకు 1979 నుంచి ఉన్న అవకాశం ఇప్పుడు ఎందుకు తీసేయాలి? ఇది హిందీ దురభిమానం కాదా?హిందీలో ఉన్నట్లే తెలుగులో ప్రశ్నాపత్రం ఎందుకు ఉండకూడదు? భారతదేశం అంటే హిందీ దేశమా? అనేక భాషలున్న దేశమా?

డిగ్రీ తెలుగులో చదవాలి
ప్రాంతీయ భాషలో తగిన అవగాహన లేకున్నా ఆంగ్లం/హిందీ  ద్వారా కీలక స్థానాలను దక్కించుకునే పరిస్థితే ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆంగ్ల భాషా పరి జ్ఞానాన్ని ర్యాంకుకు పరిగణనలోనికి తీసుకుంటున్నారు. తెలుగు భాషా జ్ఞాన పరీక్షను పూర్తిగా తొలగించారు. ఇక తెలుగు నేర్చుకోవాలనే ప్రోత్సాహకాలు ఏమీ లేవు . ఇలా ప్రాంతీయ భాషలవాళ్ళను పొమ్మనకుండా పొగ బెట్టారు. యూపీఎస్సీ తాజాగా కొత్త నిబంధన ఒకటి పెట్టింది.దాని ప్రకారం డిగ్రీని తెలుగులో చదివితేనే మెయిన్స్ ను తెలుగులో రాసేందుకు అర్హత లభిస్తుంది. అదికూడా 25 మంది ఉంటేనే తెలుగులో పరీక్షలు రాసే సెంటర్ పెడతారట.విద్యా పరంగా  తెలుగు అభివృద్ధి చెందాలంటే ఒక రకంగా ఇది మంచి నిర్ణయమే.అయితే రాష్ట్రం దానిని అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలి. ఎలాగంటే పూర్వం మన ఏపీపీయస్సీ తెలుగులో డిగ్రీ చేసినవారికి గ్రూప్ 1,2 పరీక్షల్లో 5 శాతం  ప్రోత్సాహక మార్కులు ప్రధానం చేసింది.ఆ ప్రోత్సాహక మార్కులు మళ్ళీ ఇమ్మని మనం కోరుతున్నాం.అలాగే ఇంగ్లీషు మీడియంలో డిగ్రీ చేసిన వాళ్ళు కోర్టుకు పోయి ఆ ప్రోత్సాహక మార్కుల్ని రద్దు చేయించుకున్నారు గానీ మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది.ఈసారి ఎవరూ కోర్టుకు వెళ్ళలేని పద్ధతిలో చట్టం తెచ్చే యోచన చేస్తోంది.పరీక్షలు ప్రాంతీయ భాషల్లో జరపాలని కోరే ప్రజలు ప్రాంతీయ భాషల్లోనే చదవాలి.పట్టుమని పాతికమందికూడా లేని చోట్ల పరీక్షా కేంద్రం ఎలా పెడతారు?ఏ లాభంలేని చదువును ఎవరు చదువుతారు?తెలుగు పదికాలాలపాటు బ్రతకాలంటే తెలుగులో చదివేవాళ్ళ సంఖ్య పెరగాలి.ప్రాంతీయ భాషల్లో డిగ్రీ చదువు  నిర్బంధం చేస్తేనే ఆ భాషలు బ్రతుకుతాయి.ఇది ఖచ్చితంగా అమలు చెయ్యాలి.

అయితే ఇంగ్లీషు,హిందీలు మాత్రమే అనేక మినహాయింపులను పొందటం వింతగా ఉంది.అడుగడుగునా బాషా వివక్ష కనబడుతోంది.డిగ్రీ హిందీ మీడియంలో చదివినవారే  హిందీ సబ్జెక్టుకు అర్హులు అని నిర్దేశించలేదు.  తెలుగుకు పెట్టిన ఆంక్షలే ఆంగ్లం/హిందీలకూ పెట్టాలి.దేశవ్యాప్తంగా ఆంగ్లం, హిందీ భాషలను బలవంతంగా రుద్దుతున్నారు. ప్రాంతీయ భాషల్లో పరిపాలన లేదు.పరిచయం లేని తెలియని భాషలో పాలన సాగిపోతోంది. తల్లి భాష గొంతు నులిమేందుకు రాష్ట్రాలూ సిద్ధమేనని వాపోయేవారు చిత్తశుద్ధితో ఈ మార్పుకు సిద్ధపడాలి.ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత కోర్సులు కూడా తెలుగులో రావాలి. అప్పుడు  ఆంగ్ల మాధ్యమంలో చదవకపోయినా  పూర్తిగా తెలుగులోనే  సివిల్స్‌ రాయొచ్చు.ఇంగ్లీషుకున్న వెయిటేజిని  తెలుగుకు కూడా కల్పింఛాలి.తెలుగు రాని అధికారులతో తెలుగులో పాలన అమలుకాదు.తెలుగు మన రాష్ట్రం లో అదికార భాష.పరిపాలనా నిర్వహణ  ఉత్తర ప్రత్యుత్తరాలు  తెలుగు లోనే జరగాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలన్నిటిలోను తెలుగు తప్పనిసరి.ఏ రాష్ట్రంలోనైనా  ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఆ రాష్ట్ర మాతృభాషలో యోగ్యతా పరీక్షలో కనీస మార్కులు పొందాలి. మన రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించటానికి తెలుగు రానక్కరలేదు. తెలుగు చదవటం రాయటం రాకున్నా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. మన పాఠశాలల్లో, కళాశాలలో కూడా తెలుగు ప్రథమ భాష కాదు - ద్వితీయ భాష. తెలుగు స్థానంలో మరొక భాష తీసుకోవచ్చు.తెలుగు ఐచ్చికం మాత్రమే.ఆంగ్ల భాషా సామర్ద్యం మాత్రం అందరికి తప్పనిసరి.అందరూ కలిసి తెలుగును అట్టడుగుకు నెట్టి పారేశారు. తెలుగులో పరిపాలన, కార్యనిర్వహణ చేయవలసిన అధికారులకీ తెలుగులో సామర్ద్యం లేదు.మాతృభాష పై నిర్లక్ష్యం కూడదంటూ యన్.టి.ఆర్ పాలనలో తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళకి ఉద్యోగాల్లో ఐదు మార్కులు అదనంగా కలిపి ప్రోత్సహించారు. తర్వాత అది రద్దయింది. తెలుగు మాధ్యమంలో చదివినవారిని ఏదో ఒక అదనపు ప్రయోజనంతో ప్రోత్సహిస్తేనే  తెలుగు భాషకు మంచి రోజులు వస్తాయి.తెలుగు భాషా సామర్ధ్యం అంటే ఛందోబద్ధ సాహిత్యం కాదు.సామాన్యులు రోజువారీ వ్యవహారాల్లో వాడే  తెలుగు.

విద్యార్థులు తెలుగు మీడియంలో చదువులు ప్రారంభించినా, ఇంటర్‌, ఇంజనీరింగ్‌లో ఇంగ్లీషు మీడియంకు వెళ్లిపోతున్నారు.తెలుగు మాధ్యమంలో చదువునేర్పే  మంచి కాలేజీలు లేకపోవడమే దీనికి కారణం. తెలుగు మీడియంలో వివిధ కోర్సులు చేద్దామంటే అవకాశం లేదు. ఆరో తరగతి నుండే ఐఐటి ఫౌండేషన్ కోర్సుల్లో చేరుతున్నారు. గణితం, ఇతర సైన్స్ కోర్సులపైనే దృష్టి పెడుతున్నారు. తెలుగులో ఒక్క వాక్యం కూడా రాయలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగులో మంచి భావవ్యక్తీకరణ శక్తి ఉన్నా తెలుగులో చదువుకొనే అవకాశాలు లేవు. వాటిని ఇకనైనా కల్పించుకోవాలి. తెలుగు వారికి అన్యాయం జరగకూడదనుకున్నప్పుడు వారు ఉద్యోగావకాశాలను సులభంగా పొందేలా తెలుగులో ఆయా కోర్సులూ పెరగాలి.


తెలుగులో సివిల్స్ రాయాలని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను ప్రోత్సహించాలి. మెడిసిన్,ఇంజనీరింగ్ కోర్సులూ తెలుగులో రావాలి.  ఏదో విధంగా తెలుగు మీద ఆంక్షలు పెట్టాలనే ఉత్తరాది సంస్థల ఉద్దేశం  కనిపిస్తోంది కాబట్టి  రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలి.సివిల్స్ మెయిన్ పరీక్ష రాసే అభ్యర్థులు తెలుగులో పరీక్ష రాయాలంటే, తెలుగు మాధ్యమంలో డిగ్రీ చేసి ఉండాలనీ ,డిగ్రీలో తప్పనిసరిగా తెలుగును ప్రథమ భాషగా ఎంచుకుని ఉండాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యుపిఎస్‌సి) తాజాగా జారీచేసిన ఆదేశాలను అడ్డంపెట్టుకొని,ఆధారంగా తీసుకొని రాష్ట్రంలోని కళాశాలల్లో తెలుగు మాధ్యమం ద్వారా అనేక డిగ్రీ కోర్సుల్ని ప్రారంభించాలి. తెలుగు మీడియంలో  చదివిన విద్యార్ధులు పూర్తిగా తెలుగులోనే  ఐ.ఏ.యస్ . పరీక్ష రాసి ఉద్యోగాలు సాధించగలిగితే మన భాష ఎంతో స్వేచ్ఛను శక్తినీ పొందినట్లే .దేశంలో అన్ని భాషలూ సమానమే. హిందీకి ఇంగ్లీషుకి ఇచ్చినంత  విలువ,గుర్తింపు, గౌరవం, సమాన ప్రాధాన్యత  ప్రాంతీయ భాషలకు  ఇవ్వాల్సిందే.  అందరికీ సాధికారికత కల్పించాలని చూడాలే తప్ప ఏకపక్షంగా కొందరికే ప్రయోజనం కల్పించాలని చూడటం సరికాదు.సివిల్స్‌ పరీక్ష పూర్తిగా తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలి.

అన్నీ చోట్లా ఇంగ్లిష్‌కు పెద్దపీటవేస్తున్నారు.హిందీకి మేలుచెయ్యటం కోసం  తెలుగుకు కీడుచేస్తున్నారు.ప్రాంతీయ భాషల వారికి చిక్కులు తెచ్చిమరీ  హిందీ వారికి ప్రత్యేక ప్రయోజనాలు కట్టబెడుతున్నారు.అందరికీ ఆంగ్లభాషా బానిసత్వం, మాతృభాషా దారిద్య్రం అంటగడుతున్నారు.ప్రపంచ తెలుగు మహా సభలు  సన్మానాలు  శాలువాలతో వ్యర్ధమయ్యాయి.సభల ద్వారా తెలుగుకు ఏం న్యాయం చేశారు? తెలుగులో  ఎంత ప్రతిభ ఉన్నా అది ఉద్యోగాలకు పనికిరావటంలేదు. అంతటా ఆంగ్లభాషాభిమానమే,హిందీభాషా పక్షపాతమే రాజ్యమేలుతోంది.అనేక భాషలున్న దేశంలో అన్ని భాషలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం పాలకులకు లేదు.ఆంగ్ల/హిందీయేతర భాషల అభ్యర్థుల పట్ల భాషాపరమైన వివక్ష కొనసాగుతోంది.అన్ని భాషలకూ  సమాన హక్కులు లేవు.

ఇప్పుడు ఇలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు గనుక భవిష్యత్తులో  తెలుగు అభ్యర్థులకు పరీక్ష రాసి ,తెలుగు ద్వారానే పాలనాధికారులయ్యే అవకాశం కలిగించాలి.అన్ని డిగ్రీ చదువులు తెలుగు మాధ్యమంలోకి రప్పించాలి. అది మన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్షలు కూడా తెలుగులో  నిర్వహించాలి.అప్పుడు ఇంజనీరింగ్ అభ్యర్థులు తెలుగులో సివిల్స్ పరీక్ష రాస్తారు. ప్రాంతీయభాషలపట్ల  వివక్ష అని బాధపడకుండా ఇలాంటి ఆంక్షలను అడ్డంపెట్టుకొని మన భాషలో ఎగబాకటానికి ప్రయత్నించాలి.ఈ ఆంక్షలనే ప్రైవేటు కార్పోరేటు విద్యా సంస్థలూ చచ్చినట్లు పాటించేలా చెయ్యొచ్చు. తెలుగులో మాట్లాడిన పిల్లలను కొట్టకుండా నెత్తిన ఎక్కించుకొని తెలుగులోనే ముద్దాడేలా తెలుగుకు ఆయా సంస్థల్లో పెద్దపీటవేసేలా మార్చుకోవచ్చు.
దేశమంతటా ఆ రెండు భాషలే దిక్కు
అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషు,రాజభాషగా  హిందీ.దేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో సెప్టెంబర్‌ 14న రాష్ట్రీయ దివస్‌గా, హిందీ దివస్‌గా నిర్వహిస్తున్నారు. కేంద్ర పాలకులకు ఆయా ప్రాంతాల ప్రజల మాతృ భాషలతో పనిలేదు.అసలు ఆయా భాషస్తుల మొర కూడా వినరు. హిందీ కోసం తప్ప మిగతా భారతీయ  భాషలకోసం కేంద్రం తరుపున ఒక్క పండుగా ఉండదు.కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఇంగ్లీష్‌, హిందీ భాషలో మాత్రమే నిర్వహిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం త్రిభాష సూత్రం ప్రకారం మన తెలుగు ప్రజలు మాతృభాషను నేర్వకపోయినా  రాజభాషగా హిందీని , అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషును అభ్యసిస్తున్నారు. కేంద్రప్రభుత్వం హిందీ భాషాభివృద్ధి కోసం హిందీప్రచార సభ, హిందీ అకాడమి, సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హిందీ తదితర సంస్థలను ఆయా రాష్ట్రాల రాజధానులలో  ఏర్పాటుచేసింది. ఈ సంస్థలు పాఠశాల విద్యార్థులకు హిందీ పరీక్షలు అక్షరమాల నుంచి ఉపాధ్యాయ శిక్షణ వరకు వివిధ స్థాయిలో హిందీ ప్రచారం కోసం, భాషాభివృద్ధి కోసం పరీక్షలు, శిక్షణా కార్యక్రమాలు, సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తారు.ఇన్ని పనులు తెలుగుకోసం  ఏనాడన్నా చేశారా?అన్ని  రైల్వే స్టేషన్లలో బోర్డులు ఇంగ్లీషుతో పాటుగా హిందీలో కూడా వుంటాయి. ఎల్లైసీ పాలసీలు,రశీదుల మీద, టెలిఫోన్ బిల్లుల మీద తెలుగు ఉండదు కానీ ఇంగ్లీషుతో పాటు హిందీ ఉంటుంది.హిందీ అర్ధం కాకపోతే ఇంగ్లీషులో చదువుకోవాలి.అంతేగానీ మన ప్రాంత కార్యాలయాల్లో కూడా మన మాతృభాషలో ముద్రించరు.కేంద్రం మనకు మన భాషలో ముద్రణకు అనుమతించింది ఓటర్ లిస్టు ఒకటే.ప్రభుత్వ వెబ్ సైట్లలో ఇంగ్లీషుతో పాటు హిందీలో కూడా సమాచారం వుంటుంది.ఈ మధ్య సోషల్ వెబ్ సైట్లలో కూడా హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. పార్లమెంటులో  హిందీ  రాజ్యమేలుతోంది. హిందీయేతరులు అనుమతులు పొందాకే మాట్లాడాల్సి వస్తోంది.ఆనాడు రాజ్యసభలో హరికృష్ణ తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టగానే డిప్యూటీ ఛైర్మన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగులో వద్దు, ఇంగ్లిష్ లో  గాని, హిందీలో గాని మాట్లాడమన్నప్పుడు హరికృష్ణ నాకు తెలుగులో మాట్లాడే హక్కుంది అంటూ  తెలుగులోనే మాట్లాడారు.అనువాదకులు లేని సభలో మాట్లాడినందున ఆయన మాటలు రికార్డుల్లోకి ఎక్కవన్నారు. సభ జరిగేరోజుల్లో షెడ్యూల్డ్ భాషలన్నిటికీ అనువాదకులు అక్కరలేదా? హిందీని మాత్రం సభ్యులందరూ తమ భాషల్లో అర్ధం చేసుకోవాలా? ఇలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో  హిందీయేతర సభ్యులు ఇంగ్లీషులో నెట్టుకొస్తున్నారు గానీ తమ మాతృభాషల్లో మాట్లాడినంతగా ఆయా అంశాలపై అనర్గళంగా ఆవేశంగా మాట్లాడలేకపోతున్నారు. తమ మాతృభాషలో ధీటుగా వాదించి గెలిచే ఆయాచిత వరం హిందీ వాళ్ళకు మాత్రమే దక్కింది.మిగతా భాషలవాళ్ళకు ఈ సదుపాయం నేటికీ లభించలేదు.ఇంగ్లీషు,హిందీలు మాత్రమే తెగ బలిసిపోతున్నాయి.మిగతా భాషలకు పార్లమెంటులో ఇంగ్లీషు,హిందీలతో పాటు సమాన గౌరవం దక్కుతుందా?కనీసం తమ తమ ప్రాంతాలలోని కేంద్ర కార్యాలయాల ఫైళ్ళలో  కూడా ప్రవేశించలేని ప్రాంతీయ భాషలు పోషణలేక క్రమేణా పరమపదించటం ఖాయం.శక్తిచాలని ప్రజలు ఉపాధికి పనికిరాని తమ భాష బాగోగుల కోసం ఎన్నాళ్ళని పోరాడుతారు?ఉద్యోగాలిచ్చే రాజభాషకు ఏనాటికైనా సాగిలపడక ఏంచేస్తారు?కేంద్ర ప్రభుత్వ కోరిక కూడా ఇదేనేమో.అందుకే ఈ నిరంకుశ ఆధిపత్య పోకడలు.  

సూర్య 29.7.2014
https://www.facebook.com/photo.php?fbid=799596050072387&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater
CVR News 30.7.2014










ఆంధ్రజ్యోతి29.8.2015

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి