18, మే 2018, శుక్రవారం

చిలకపాటి విజయరాఘవాచార్యులు గారి ప్రశంస


డా|| చిలకపాటి విజయరాఘవాచార్యులు
M.A.,Ph.D.,B.Ed.,D.I.S.
సంచాలకులు
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు (HDPT)
కార్యదర్శి & ఆర్థిక సలహాదారు

రెవెన్యూ (దేవదాయ) శాఖ
రాష్ట్ర దేవాలయ పాలన సంస్థ (S.I.T.A)
కృష్ణానది రోడ్డు, సీతానగరం, తాడేపల్లి పోస్టు
గుంటూరు జిల్లా-522501,
ఫోన్: 08645-273139
e-mail : sitaap2015@gmail.com,
ramapaduka@gmail.com



తేది : 06-04-2018
ప్రశంస
తమిళ మహాకవి అప్పయ్య దీక్షితులు తెలుగుభాషను ప్రశంసించారు. తెలుగువాడిగా పుట్టడం, తెలుగుభాష మాట్లాడటం మహాతపస్వికి మాత్రమే సాధ్యమట! రాయప్రోలు వారు  'అవమానమేలరా అనుమానమేలరా... పాడరా నీ తెలుగు బాలగీతములు' అన్నారు . అలాగే శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయల వారిని 'ఆముక్తమాల్యద' కావ్యనిర్మాణం చేయమని ఆనతి ఇచ్చిన సందర్భంలో స్మరణీయం ఇదితెలుగదేలయన్న దేశంబు తెలుగు యేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స”!

శ్రీ నూర్ బాషా రహంతుల్లా గారు ప్రభుత్వ రెవిన్యూ శాఖలో ఉన్నతాధికారి. గత 30 సంవత్సరాలుగా తెలుగు రాజభాష కావాలనీ, గ్రామచావడి మొదలు రాష్ట్ర సచివాలయం దాకా తెలుగు కనపడాలనీ, వినపడాలనీ తెలుగులో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాలనీ, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావాలనీ తపిస్తున్న సుహృత్తు ఆయన. 'తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు....అన్న చందాన సాగుతున్న అధికారభాషగా తెలుగు అమలు ప్రయత్నాలు అంతంత మాత్రంగా జరుగుతుంటే, విసిగి వేసారిపోతున్న రహంతుల్లా గారు అక్షర మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ అనేక ప్రసార మాధ్యమాల ద్వారా తనబుసబుస'లను వ్యాసాల రూపంలో ఆవిష్కరిస్తున్నారు. ఒకవిధంగా శ్రీ రహంతుల్లా గారు అధికారభాషా సంఘంలో ఉండదగిన శ్రద్ధాళువు. వారికి తెలుగుభాషపై వున్న ప్రీతి, మమకారం గమనిస్తే మనం మాతృభాషను ఎంత చిన్నచూపు చూస్తున్నామో అర్ధమవుతుంది. తెలుగును దేవభాషగా వారు కీర్తిస్తారు. వారు వ్రాసిన అనేక వ్యాసాలు హైస్కూల్ స్థాయిలో పాఠ్యాంశంగా పెట్టదగినవి. అలా జరిగితే కనీసం విద్యార్థులు ఉద్యోగులుగా ఎదిగేనాటికి ఆంధ్రభాషకు అధికార పట్టాభిషేకం జరిగి తీరుతుంది.

ఈ మధ్యకాలంలో తెలుగువాడు మరొక తెలుగువాడిని కలిస్తే తెలుగే రానివాడిలాగా ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. ఇది మన తెలుగురాష్ట్రాలలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో కనిపిస్తున్న దుస్థితి. మహానుభావుడు ఎన్.టి.రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో తెలుగులో ఫైలు పంపిస్తేనే చూస్తానని ప్రకటించారు. వారున్న కాలంలో తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగుభాష ఔన్నత్యం పరిఢవిల్లింది. క్రమంగా వారి తరువాత అధికారభాష అమలు వేగం నత్తనడక నడుస్తోంది. ఏదైనా రాజకీయ నిబద్దత లేకుండా ఏ సంస్కరణ అమలులోకి రాదు కదా!

శ్రీ నూర్ బాషా రహంతుల్లా గారు గత 30 ఏళ్ళుగా చేస్తున్న తెలుగుసేవ ఎంతో అభినందనీయం. వారు వ్రాసిన అనేక వ్యాసాలను వర్గీకరించి, చక్కగా గ్రంథంగా పేర్చి మనకు అందిస్తున్నారు. ఇది వారి వ్యాసమాలిక. అధికారులకు, అధికారభాషా ప్రియులకు ఇది చక్కని మేల్కొలుపుగా, మేలు కలుపుగా ఉపకరిస్తుందని భావిస్తున్నాను. తెలుగు అధికారభాష కావాలని 1945 నుండి అద్భుతమైన కృషి చేసిన మహానుభావులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, అధికారభాష సంఘ అధ్యక్షులుగా పనిచేసిన వావిలాల గోపాలక్రిష్ణయ్య గారు, నండూరి రామకృష్ణమాచార్యుల వారు, గజ్జెల మల్లారెడ్డి గారు, ఎ.బి.కె.ప్రసాద్ గారు,మండలి బుద్ధప్రసాద్ గారు ప్రభృతులు. అధికారభాషా చట్టం 1966లోనే వచ్చింది. 1988 నవంబరు 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని, ఇంగ్లీషు కేవలం అనుసంధానభాషగా కేంద్ర ప్రభుత్వంతోను, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతోను ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా అధికారభాషగా తెలుగుభాష మాట్లాడే భాషగానే ఉండాలనేది ఉత్తర్వులు. అలాగే ప్రజలతో ఉత్తర ప్రత్యుత్తరాలు, బహిరంగ విచారణలు కూడా మాట్లాడేవిధంగా తెలుగుభాషలోనే ఉండాలనేది ప్రభుత్వ ఉత్తర్వులు. కానీ ఇంతవరకు అధికారభాషగా తెలుగు గ్రామ కార్యాలయాలలో సైతం కనబడకపోవటం దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితులలో మిత్రులు నూర్ బాషా రహంతుల్లా గారు తీసుకువస్తున్న ఈ వ్యాసమాలిక స్వాగతించదగినది. నూర్ బాషా గారికి హార్దికమైన అభినందనలు తెలియజేస్తున్నాను.

(చిలకపాటి విజయ రాఘవాచార్యులు)


1 కామెంట్‌: