27, మే 2010, గురువారం

ఇలా చేస్తే బాగుంటుంది

ఇలా చేస్తే బాగుంటుంది
తెలుగుభాష అమలు గురించి పత్రికలకు నేను రాయడం మొదలుపెట్టి 30 సంవత్సరాలు గడిచిపోయాయి. తెలుగు భాష అధికారికంగా కార్యాలయాల్లో అమలు కావడానికి ఎంతోమంది సూచనలు చేస్తున్నారు. అయితే ఎవరెవరు ఏమేం చేశారో, ఎలా చేసి సఫలీకృతులయ్యారో తెలియజేస్తే ఇంకా బాగుంటుందని అనిపించి, భాష అమలుకోసం ఎవరెవరు ఏమేం చేశారో తెలిపితే ఔత్సాహికులకు ప్రోత్సాహకంగా ఉంటుందని భావించీ నా అనుభవాలు రాస్తున్నాను. ఏం చేస్తే బాగుంటుందో గూడా మళ్ళీ చెబుతున్నాను.
ఆనాటి అధికార భాషా సంఘం అధ్యక్షులు గజ్జెల మల్లారెడ్డిగారు నేను గుమాస్తాగా పనిచేస్తున్న ఒక కార్యాలయ తనిఖీకి వచ్చారు. పూర్తిగా తెలుగులోనే ఫైళ్ళు నిర్వహించే ఉద్యోగి ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చర్చించుకొని ఆయన్ని నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన నేను రాసిన ఫైళ్ళన్నీ చూసి తెగ సంబరపడ్డారు. ''ఈ కుర్రవాణ్ణి చూసి మీరంతా నేర్చుకోవాలి. తెలుగు పదాలు దొరక్కపోతే ఏ మాత్రం సంకోచించకుండా ఇంగ్లీషు పదాలనే తెలుగులో రాశాడు. ఇతని వాక్య నిర్మాణం చాలా సులువుగా, సహజంగా, అందరికీ అర్థమయ్యేలా ఉంది. ఇదే మేము కోరుకునేది'' అంటూ నన్ను అభినందించారు. అది హైదరాబాద్‌లోని డైరెక్టొరేట్‌ కార్యాలయం కావడంతో అక్కడ పనిచేసే ఉర్దూ సోదరులు, ఆంగ్ల మేధావుల మధ్య నాకూ, నా భాషకూ ఒక గుర్తింపు వచ్చింది. పూర్తిగా తెలుగులో ఫైళ్ళు నిర్వహించవచ్చు అనే సత్యం అందరికీ తెలిసింది.
తెలుగులో జవాబులు
పశ్చిమ గోదావరిలో ఎమ్మార్వోగా ఉండగా 23 రిట్‌ పిటీషన్‌లకు పేరావారీ జవాబులు తెలుగులోనే రాసి పంపాను. కలెక్టరేట్‌ నుండి ఫోన్‌. తెలుగులో ఎందుకు పంపారనే ప్రశ్న. తెలుగులోనైతే జవాబులు తప్పుల్లేకుండా సూటిగా, స్పష్టంగా ఇవ్వగలననీ, అర్థంకాక పోవడమనే సమస్యే రాదనీ, వాటిని యధాతథంగా హైకోర్టుకు సమర్పించమనీ, కాదు కూడదంటే ఇంగ్లీషులోకి తర్జుమా చేయించి జిల్లా కేంద్రం నుండే హైదరాబాద్‌కు పంపించండనీ వేడుకున్నాను. అధికార భాషా చట్టం పుణ్యాన వారు వాటిని హైకోర్టులో నివేదించారు. యధాతథంగానో, ఆంగ్లంలోకి మార్పించో నాకు తెలియదుగానీ అన్ని కేసులూ గెలిచాం. ఆలోచన మన అమ్మ భాషలోనే పుడుతుంది. అమ్మ భాషలో వాదిస్తే గెలుపు ఖాయం అనే సంగతి అందరికీ అర్థమయ్యింది.
తెలుగులో దరఖాస్తులు
ఇంకో మండలంలో ఎమ్మార్వోగా ఉండగా ధరఖాస్తు ఫారాలు నింపడానికి నా ఆఫీసు బయట ఒక ప్రైవేటు వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన వ్యక్తుల అవసరాలనుబట్టి ఇంతింత ఈ ఫారం నింపడానికివ్వాలని వసూళ్ళు చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫారాలు ఇంగ్లీషులో ఉండేవి. ఏయే పనుల కోసం ఈ ఆఫీసుకు ప్రజలు వస్తున్నారు, ఏమేమి ఫారాలు వాళ్ళు పూరించి ఆఫీసులో ఇవ్వాలో తెలుసుకున్నాను. ఓపికగా ఆయా ఫారాలన్నీ తెలుగులోకి అనువదించాను. నాలుగైదు తరగతులు చదివిన వారెవరైనా సులువుగా పూర్తిచేయటానికి వీలుగా అన్నిరకాల ధరఖాస్తుఫారాలు తయారయ్యాయి. వాటిని ఆ ఊళ్ళోని జిరాక్సు షాపులన్నిటికీ ఇచ్చి కేవలం అర్ధరూపాయికే ఏ ఫారమైనా అమ్మాలని చెప్పాము. ఎవరికివారే ఫారాలు నింపుకొని వస్తున్నారు. ప్రతిఫారమూ నాలుగైదు దశలు దాటివచ్చే పద్ధతి తీసేశాం. గ్రామ పాలనాధికారి, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ సంతకాలు చేస్తే చాలు. వాటిపైన నేను సంతకం చేసేవాడిని. ఆఫీస్‌లో గుమాస్తాల ప్రమేయం తగ్గింది. పత్రాల జారీ వేగం పెరిగింది.
పిల్లల బాధలు
నేను హై స్కూల్ చదువుకు రోజూ 7 కి.మీ.బాపట్ల నడిచి వచ్చే వాడిని.కుల,ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్ దార్ ఆఫీస్ కు వారం రోజులపాటు తిరిగేవాడిని.ఎండకు తాళలేక బాపట్ల తహసీల్ దారు ఆఫీసు ఆవరణలో చెట్టు కింద నిలబడేవాడిని.ప్రతిరోజూ డఫేదారు దగ్గర ఒకటే సమాధానం;" దొరగారు క్యాంపు కెళ్ళారు.రేపు రండి" .ఆనాడు ఆ చెట్టు కింద అనుకున్నాను "నేను గనక తాసీల్దారునైతే చిన్నపిల్లలకు చకచకా సంతకాలు చేసి పంపిస్తాను".తహసీల్దారునయ్యాక మాటనిలుపుకున్నాను.
స్కూళ్ళు తెరిచే జూన్‌ మాసంలో సర్టిఫికెట్ల కోసం పిల్లలు బారులు తీరేవాళ్ళు. రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఆ పిల్లల చేతనే సర్టిఫికెట్లపై నంబర్లు వేయించి స్టాంపు, సీలు కొట్టుకోమనేవాడిని. అరగంటలో పిల్లలంతా ఉత్సాహంగా తమ పని ముగించుకొని, సర్టిఫికెట్లతో వెళ్ళిపోయేవారు. అంతా తెలుగులోనే. తెలుగు పిల్లలు తెలుగులో ఎంతో వేగంగా పనిచేసేవాళ్ళు. నా 13 సంవత్సరాల ఎమ్మార్వో పదవీ కాలంలో తెలుగు పిల్లలు ఎక్కడా పొరపాటు చేయలేదు. రిజిస్టర్లన్నీ చక్కటి తెలుగులో మన తెలుగు పిల్లలే నిర్వహించారు. ఆ కాలమంతా నాకు మధురానుభూతి. మండలంలోని అన్ని హైస్కూళ్ళ ప్రధానోపాధ్యాయులకూ ఒక ప్రొఫార్మా ఇచ్చి, వారి స్కూల్లోని పిల్లలందరి కులం, స్వస్థలం, పుట్టిన తేదీ... మొదలైన వివరాలు నింపి ధ్రువీకరించి పంపమని కోరాను. ఆయా గ్రామ పాలనాధికారులు కూడా ఆ వివరాలను ధ్రువీకరించారు. పిల్లలెవరూ మండల కార్యాలయానికి రానక్కరలేకుండా ''శాశ్వత కుల, నివాస స్థల, పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని'' వారి ఫొటోలు అంటించి వారి వారి పాఠశాలల్లోనే పంపిణీ చేశాం. పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ఇళ్లకు పంపిణీ చేయించాం. వీటన్నిటిని తెలుగు రాత పనిలో, మంచి చేతిరాత కలిగిన గ్రామ సేవకులు, ఉపాధ్యాయులు, గ్రామ పాలనాధికారులు, విద్యార్థుల్ని కూడా ఉపయోగించుకున్నాం. ఎలాంటి తప్పులూ దొర్లలేదు. ఏ ఊరి ప్రజల పని ఆ ఊళ్లోనే ఆ ఊరివాళ్లే చేసుకున్నందువలన ఎంతో స్పష్టంగా పని జరిగింది. పల్లెటూళ్ల అందం వాళ్లు రాసిన తెలుగు అక్షరాలతో మరింత పెరిగింది. తల్లి భాషకు దూరమైన రోగులు పల్లెటూళ్లకెళ్లి ప్రాణవాయువెక్కించుకోవచ్చుననే అనిపించింది.
ప్రజలకు అవకాశం ఇస్తే వాళ్లు మాట్లాడే భాషలోనే శక్తివంతంగా, జ్ఞానయుక్తంగా దరఖాస్తులు పెడుతున్నారు, విన్నవిస్తున్నారు, పోరాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆంగ్లం వారికి అరగటంలేదు. తెలుగు చక్కగా జీర్ణమౌతున్న అమృతాహారం. మాటలవరకైతే ఎంతో బాగుంటుంది కానీ అప్పు తెచ్చుకున్న సంస్కృతాక్షరాలు, వరుసవావి లేకుండా తయారుచేసిన లిపి మన పిల్లలకు అరక్కపోవడమేగాక మళ్లీ దాని జోలికి వెళ్లటానికి బెదిరిపోయే పరిస్థితి వచ్చింది. 18 అక్షరాలతో తమిళ లిపి తమిళులకు వరమయ్యింది. 56 అక్షరాలు, వత్తులు, గుణింతాలు మనకున్నా, అవి శాస్త్రీయంగానూ, క్రమపద్ధతిలోనూ, పిల్లల మనస్సులపై సుళువుగా ముద్రవేసేవిగానూ లేనందువల్ల తెలుగు లిపి మనకు మనమే ''తెచ్చిపెట్టుకున్న చేటు''గా మారింది. ఇది భాష తప్పు కాదు. దాన్ని చెడగొట్టిన మన పెద్దల తప్పు.
కర్త కర్మ క్రియలతో సంబంధం లేకుండా అసలు వాక్యం అర్థమయితే చాలునని ఇంగ్లీషు వాళ్ళు తమ భాష వాడకానికి సడలింపులిచ్చారు. మరి మనవాళ్ళో? అసలీ కర్త, కర్మ, క్రియ అనే పదాలు పల్లెటూరి తెలుగువాళ్ళు పలుకుతారా? పలకరు. చేసినవాడు, చేసినపని, చేయించుకున్నవాడు... అంటారు. అలా అంటే సంస్కృత పండితులు ఊరుకోరు. శతాబ్దాల తరబడి వీళ్ళు చేసిన పెత్తనం వల్లనే మన తెలుగు వికృతం అయ్యింది. మన కూడిక సంకలనం అయ్యింది. మన తీసివేత వ్యవకలనం అయ్యింది. మన సాగు సేద్యం అయ్యింది. మన నెత్తురు రక్తంగా మారింది. మన బువ్వ అన్నం అయ్యింది. మన జనం పలికే తెలుగుపదాలు, సంస్కృత పదాలుగా మార్చి, మన పూర్వీకుల నాలుకలు సంయుక్తాక్షరాలు పలికేలా సాగగొట్టిన ఘనత ఈ సంస్కృత పండితులదే. వీళ్ళవల్లనే తెలుగుకు పురాతన భాష హోదా దక్కకుండా పోయింది. నన్నయ్యకు ముందు తెలుగు కవులెవరూ లేరనే పిడివాదం మనకు మనమే తగిలించుకున్న గుదిబండ.
ఇక ఇప్పుడు తెలుగు వాడకంలోంచి సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ పదాలను తీసివేయలేము. అవి మన భాషలో అంతర్భాగాలైపోయాయి. అక్కరలేని ఆపరేషన్‌ ఎవరు చేయించుకుంటారు? చేసినా గాయాలవడం తప్ప మరే మేలూ కలుగదు. అందువలన మన భాష సంకరమైనా బలమైన హైబ్రీడ్‌ భాషలాగా తయారైనందుకు సంతోషపడుతూ, ఈ సంకర తెలుగు భాషలోనే ఆఫీసుల్లో ఫైళ్ళు నడిపితే అదే పదివేలుగా భావించాలి. ఛాందసవాదులు వాళ్ళు చెయ్యరు, ఇంకొకళ్ళను చేయనివ్వరు. ఒకవేళ ఈ పనిని వాళ్ళకప్పజెబితే ఎవరికీ అర్థంగాకుండా పాడుచేస్తారు. ప్రజలు ఇంతకంటే ఇంగ్లీషే నయమని వాపోయేలా చేస్తారు. మన శాసన సభలో ఎమ్మెల్యేలు ఈ మూడు భాషల పదాలు కలగలిపి మనోరంజకంగా మాట్లాడుతున్నారు. అదే నేటి తెలుగు, వాడుక తెలుగు, వారు అడిగింది అడిగినట్లు తెలుగు లిపితో సాగదనుకుంటే ఆంగ్లలిపినే వాడుకోండి. మన మాట ముఖ్యం. వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు మాట్లాడుతున్నది మన ప్రజల భాష. ఆ భాషలో, యాసలో జీవోలు రావాలి. అప్పుడే తెలుగు అధికార భాషగా విరాజిల్లుతుంది. (విపుల నవంబర్ 2007)

5 కామెంట్‌లు:

 1. ఈ 17 చట్టాలను తెలుగు లోకి తర్జుమా చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.G.O.Ms.No Law (D) Department103/28-07-2010
  1. The Andhra Pradesh Assigned Lands (Prohibition of Transfers) (Amendment)
  Act, 2008 (Act No.21 of 2008)
  2. The Industrial Disputes (Andhra Pradesh Amendment) Act, 2008 (Act No.22 of
  2008)
  3. The Andhra Pradesh Land Acquisition (Andhra Pradesh Amendment) Act, 2008
  (Act No.23 of 2008)
  4. The Andhra Pradesh Advocates ‘Clerks’ Welfare Fund (Amendment) Act, 2008
  (Act No.24 of 2008)
  5. The Andhra Pradesh Land Reforms (Ceiling on Agricultural Holdings) (Second
  Amendment) Act, 2008 (Act No.25 of 2008)
  6. The Andhra Pradesh Tax on Entry of Motor Vehicles into Local Areas
  (Amendment) Act, 2008 (Act No.26 of 2008)
  7. The Andhra Pradesh Entertainments Tax (Amendment) Act, 2008 (Act No.27 of
  2008)
  8. The Andhra Pradesh Universities (Amendment) Act, 2008 (Act No.29 of 2008)
  9. The Andhra Pradesh Excise (Amendment) Act, 2008 (Act No.33 of 2008)
  10. The Andhra Pradesh Rural Electric Co-operative Societies (Temporary Provisions)
  (Amendment) Act, 2008 (Act No.34 of 2008)
  11. The Hyderabad Metropolitan Development Authority (Amendment) Act, 2008
  (Act No.35 of 2008)
  12. The Andhra Pradesh Vaidya Vidhana Parishad (Amendment) Act, 2008 (Act
  No.36 of 2008)
  13. The Andhra Pradesh Municipalities (Amendment) Act, 2008 (Act No.37 of 2008)
  14. The Andhra Pradesh Fiscal Responsibility and Budget Management (Amendment)
  Act, 2008 (Act No.39 of 2008)
  15. The Andhra Pradesh Education (Amendment) Act, 2008 (Act No.40 of 2008)
  16. The Andhra Pradesh Farmer’s Management of Irrigation Systems (Amendment)
  Act, 2008 (Act No.41 of 2008)
  17. The Andhra Pradesh Municipal Laws (Fourth Amendment) Act, 2008 (Act No.42
  of 2008)

  రిప్లయితొలగించండి
 2. లక్ష్మణ్‌రావు పతంగే గారు ఉర్దూ తెలుగు నిఘంటువును తెలుగు లిపిలో కూర్చారు. దీనిని ఎమెస్కోవారు జూన్ 2010లో ప్రచురించారు. దీనిని ఆంధ్రభారతిలో నిఘంటుశోధనకు జతచేసాం. దీనిని మీరు చూసి మీ సలహాలనూ,అభిప్రాయాలనూ తెలియచేయ ప్రార్థన.

  http://www.andhrabharati.com/dictionary/

  Regards,
  SeshatalpaSayee Vadapalli.

  రిప్లయితొలగించండి
 3. శేషతల్పశాయి గారూ
  *మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష. ఈ రెండు భాషల ప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవ గాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి. ఉర్దూ- తెలుగు నిఘంటువు, ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు ఎక్కడా అమ్మకానికి దొరకడం లేదు.ముద్రించాల్సిన అవసరం ఉంది.

  * 1938-మొదటి ఉర్దూ - తెలుగు నిఘంటువు 1938లో వరంగల్ ఉస్మానియా కాలేజిలో అరబిక్ మాజీ ప్రొఫెసర్ శ్రీ ఐ.కొండలరావు సంకలనపరచి ప్రచురించారు.ఇది అలీఫ్ నుండి లామ్ వరకు అహ్మదియా ప్రెస్ కర్నూలులోను మీమ్ నుండి యే వరకు వరంగల్ కుమార్ ప్రెస్ లోను ప్రింటు చేయబడింది.మొత్తం 857 పేజీల పుస్తకం.

  *ఈ పురాతన ప్రతిని స్కాన్ చేయించి పునర్ముద్రణ చేయాటానికి అంగీకరించిన తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు ప్రసాద్ గారికి 6.10.2008 న అందజేశాను.2009-శ్రీ ఎ.బి.కె.ప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం 862 పేజీలతో ఈ నిఘంటువును పునర్ముద్రించింది.2009 ఏప్రిల్ 25 వ తేదీన ఉర్దూ తెలుగు నిఘంటువును అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబికెప్రసాద్ గారు విడుదల చేశారు.

  రిప్లయితొలగించండి
 4. అయ్యా మీరు తెలుగు కోసం ఎంతగా తపించిపోతున్నారో మీ బ్లాగ్ ద్వారా అర్ధమవుతుంది.

  రిప్లయితొలగించండి
 5. "తల్లి భాషకు దూరమైన రోగులు పల్లెటూళ్లకెళ్లి ప్రాణవాయువెక్కించుకోవచ్చుననే అనిపించింది.
  ప్రజలకు అవకాశం ఇస్తే వాళ్లు మాట్లాడే భాషలోనే శక్తివంతంగా, జ్ఞానయుక్తంగా దరఖాస్తులు పెడుతున్నారు, విన్నవిస్తున్నారు, పోరాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆంగ్లం వారికి అరగటంలేదు. తెలుగు చక్కగా జీర్ణమౌతున్న అమృతాహారం."

  ఒక్క క్షణం నేను ఎక్కడున్నానా ఆనిపిస్తోంది. ఆరవ తరగతిలో చేరినప్పుడు స్కూల్లో రిజిస్టర్‌లో సంతకం చేయవలసి వచ్చిన సందర్భాల్లో నేను చక్కగా నాపేరు తెలుగులో రాస్తే ఆ స్కూల్లో క్లర్కుగా పనిచేస్తున్న మా బంధువే ఒకాయన నా చేతివేళ్లపై పెడీమని బర్రతో వాయించాడు. ఆ భయం జీవితమంతా వెంటాడుతూనే ఉంది. నేను కొన్న పుస్తకాల్లో తప్ప నా పేరు తెలుగులో ఎక్కడా రాసుకోలేనంతగా జీవిక ఇప్పుడు కూడా సాగుతోంది మరి.
  రహంతుల్లా గారు,
  "తెలుగులో రాసే అవకాశం ఇస్తే" అని మీరు తెలుగు నేలలో ఉండే చెబుతున్నారు. మనం ఎంతగా పతనమయ్యామో, మాతృభాషా సంస్కారం లేని మన దేశ రాజకీయ వ్యవస్థ ఎంతగా మనల్ని పతనావస్థకు తీసుకెళ్ళిందో ఈ మాట చాలు. ఒక్కమాటలో ఇది జాతి దౌర్భాగ్యం. ఆన్‌లైన్‌లో దాదాపు మీ ప్రతి రచనా చదువుతూనే ఉన్నాను. ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి