3, జనవరి 2021, ఆదివారం

హైకోర్టుల్లోకి హిందీని రానివ్వలేదు

 


హైకోర్టుల్లోకి హిందీని రానివ్వలేదు (వ్యూస్ 3.1.2021)
దేశంలో భాష‌లు 1625
60శాతం మందిది హిందీయేత‌ర భాషే
హిందీ మాట్లాడేది 40శాతమే
(నూర్ బాషా రహంతుల్లా, 6301493266)
దేశంలో హిందీ ధగధగలాడాలని, అది రాజభాషగా వెలుగులీనాలని ‘హిందీ దివస్‌’ పేరుతో ఉత్సవాలు నిర్వ‌హిస్తున్నారు. దేశానికి ఉమ్మడి భాష హిందీ అంటున్నారు. అప్పుడే మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌ కన్న కలలు నెరవేరతాయట. తెలుగు గురించి మన రాయలవారు, గురజాడ, కందుకూరి, గిడుగు కూడా కలలు కన్నారు. దేశంలోని 1,625 భాషలకు దినాలు దివసాలు ఎవరు నిర్వ‌హిస్తారు? దేశంలో 60 శాతంమంది హిందీయేతర భాషలు మాట్లాడుతుంటే 40 శాతంమంది మాట్లాడే హిందూస్థానీ (హిందీ) కి అగ్రాసనం వేశారు. హిందీ రాష్ట్రాల్లో కూడా బ్రజ్‌భాషా, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వి ఉరుదూ లాంటి 49 మాండలికాలు పలుకుబడులు ఉన్నాయి. 22 జాతీయ భాషలతోపాటు ఇంగ్లిష్‌ కూడా అధికార భాషే. హిందీని మిగతా భాషలపై రుద్ద వద్దని అన్ని రాష్ట్ర భాషలనూ బ్రతకనివ్వాలని హిందీయేతర భాషల నేతలు కోరితే ఆంగ్లం నుంచి హిందీకి మారే ప్రసక్తే లేదని జవహర్‌లాల్‌ నెహ్రూ అన్నారు. అంబేడ్కర్‌ కూడా దేశీయ భాషల్ని రక్షించి అభివృద్ధి చేయమన్నారు. హిందీని ప్రజలందరి మీదా రుద్దమని ఇంగ్లీషే అనుసంధాన భాష అని రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు అన్నారు. దేశ ప్రజలుకూడా మంచి ఉద్యోగాల కోసం అంతర్జాతీయ భాష ఇంగ్లీషును ఆశ్రయిస్తున్నారు. రాజభాషగా హిందీని కూడా అందరికీ నేర్పాలని పురుషోత్తందాస్‌ టాండన్‌, గుల్జారీలాల్‌ నందా, అమిత్‌ షా వరకు కోరుతూనే ఉన్నారు. అసలు హిందీ వాళ్ళు ఎప్పుడైనా మరో భారతీయ భాష నేర్చుకున్నారా? పరభాషా సహనం తెలుగువారికి ఎప్పుడూ ఎక్కువే.
ఐరాస‌లో పీవీ హిందీ ప్ర‌సంగం
ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడిన మొదటి తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు. ప్రణబ్ ముఖర్జీ తనకు హిందీ రాదు కాబట్టే ప్రదాని కాలేకపోయానని బాధపడ్డారు. ప్రభుత్వ సమాచారమంతా ఇంగ్లీషు హిందీలలోనే ఉంటుంది. అధికార కార్యకలాపాలన్నీ హిందీలో నడిపే సిబ్బందికి నగదు పారితోషికాలిస్తున్నారు. హిందీయేతర రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉత్తరప్రత్యుత్త రాలు నిర్వ‌హించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా హిందీ ప్రశ్నపత్రం ఉండాలనే నియమాన్ని ఆనాడే రాజశేఖరరెడ్డి తోసిపుచ్చారు. హిందీ దేశ ఉమ్మడి భాష కాదని ఎన్ జి రంగా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కరుణానిధి లాంటి దక్షిణాది నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో వాడే హిందీ సంస్కృత పదాలతో జటిలంగా, కృత్రిమంగా ఉంటున్నదని హిందీ వాళ్ళే ఆరోపిస్తున్నారు. ముందు సామాన్యులకు అర్ధమయ్యేలా వాడుక పదాలు వాడమంటున్నారు.
ప్రాంతీయ భాష‌ల‌ను విస్మ‌రించి హిందీయా?
తెలుగు లాంటి ప్రాంతీయ భాషలు మరుగున పడిపోతున్నా సరే స్కూళ్ళలో హిందీని కచ్చితంగా బోధించాలని కస్తూరిరంగన్‌ కమిటీ సిఫార్సు. ఏమిటీ హిందీపెత్తనం? మొండిగా హిందీ తప్పదు అనటం ఉద్యమాలు తలెత్తితే అనలేదనటం కేంద్రానికి అలవాటుగామారింది. ప్రజలు దేశంలో కాదు భాషలో నివసిస్తారని పెద్దలు అంటారు. తనపై మరో భాష పెత్తనాన్ని మనిషి సహించలేడు. ఇంగ్లీషు, హిందీవాళ్లు కూడా అంతే. వారిపై మరో భాష అధికారాన్నీ, ఆధిపత్యాన్నీ ఒప్పుకోరు. తమ భాషపై ప్రజలకుండే మక్కువ అలాంటిది. తెలుగు ఇప్పటికే సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబీ, ఇంగ్లీషు భాషల కాళ్ళ కింద నలిగినాశనమై పోయింది. ఆర్యులకు పూర్వమే సవర, కోయ భాషల్లో ఎన్నో తెలుగు పదాలు వున్నట్టు గిడుగు శ్రీరామమూర్తి చెప్పారు. మన తెలుగు పదాలే మనకే తెలియకుండా పోయాయి. ఒక పక్క ఏ భాషనూ ప్రభుత్వం ప్రజలపై రుద్దకూడదు అంటూనే హిందీని ద్వితీయ భాషగానైనా నేర్చుకోవాలని చెబుతున్నారు. తెలుగు నేర్చుకోమని ఏ హిందీ రాష్ట్రానికైనా ఎప్పుడైనా చెప్పారా? దేశ ప్రజలందరినీ ఒకే దేశం ఒకే పౌరసత్వం కిందకు రాబట్టగలము కానీ 1,625 భారత భాషలను హిందీ క్రిందకు తీసుకురాగలమా? ఒకే భాష అనటం సమంజసమా? సాధ్యమా? ఈ పని ఇంగ్లీషువల్ల కూడా కాలేదు. కాబోదు. ప్రాంతీయ భాషలపై హిందీని ఉన్నత పీఠం ఎక్కించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
ఏ భాష‌కూ జాతీయ హోదా లేదు
ఏ భాషకూ జాతీయ హోదాను రాజ్యాంగం కట్టబెట్టలేదు. హిందీకి లిపికూడా లేదు.దేవనాగరి లిపిని కట్టబెట్టారు. హిందీ పట్ల మిగతా భాషల వాళ్ళకు వ్యతిరేకత పెరిగేలా హిందీ దివాసాలు దినాలు మాత్రం చేస్తున్నారు. 1938లో రాజగోపాలాచారి మద్రాసు లో హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా చేసి వల్లగాక 1940 లో ఉపసంహరించుకున్నారు. ఈసారి కేంద్ర నాయకులు రంగంలో దిగి చెన్నై లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఏర్పాటుచేశారు. మిగతా భాషలకు ఎక్కడా కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. భాషల విషయంలో బ్రిటీష్ పాలకులే నయమనిపించారు. ప్రజల భాషల్లో చదువులు నేర్పారు. పతకాలు, నిఘంటువులు ఇచ్చారు. మూలభాష దేవభాష అనకుండా జనంలోకి చొచ్చుకుపోయి తమ మతగ్రంధాలు, ప్రార్ధనలను కూడా ఎవరిభాషలో వారిని చేసుకోనిచ్చారు. కాబట్టే ఇంగ్లీషుకు కోర్టులు, మతము, సాంకేతికత, వలసలు, వాణిజ్యం, విద్య, వినోదం అన్నీ తోడై సహజ పద్ధతుల్లోనే అంతర్జాతీయ భాషగా విస్తరించింది. హిందీని రాజభాషగా ఊరేగించాలన్న ఉత్సవాల కోరిక తప్ప పరోపకారం లేకపోతే ఎలా? ఏ భాష కైనా ఆదాన ప్రదానాలు ఇచ్చి పుచ్చుకోవటాలు తప్పవు. ప్రజలకు ఈనాడు ఇంగ్లీషు వలన ఒనగూడుతున్న ప్రయోజనాలు హిందీ వలన కూడా కలిగితే ప్రజలు వాళ్ళంతట వాళ్ళే స్వచ్ఛందంగా హిందీని కోరుకుంటారు. కోరుకోనివ్వాలి. సంస్కృతాన్నిసామాన్యులకు దాచిపెడితే పాచిపోయింది. లాటిన్, గ్రీకు భాషలు కూడా అంతే.
హిందీ నేర్చుకుంటే లాభాలేమిటి?
రాజభాష హిందీ నేర్చుకున్నవారికి కలిగే లాభాలు ఏమిటి? లాభాలు చెప్పకుండా హిందీ దివసాల పేరుతో కోట్లరూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తున్నారు. మంచిదే. అయితే దేశభాషలందు మా భాష కూడా లెస్సే అనే మిగతా భాషల దివసాలకు కూడా బడ్జెట్లో డబ్బులిచ్చారా? ఇస్తే బాగుండేది. కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో హిందీ ఆఫీసర్లు, రోజుకో హిందీ పదం, హిందీలో పరిభాషా కల్పన, ప్రాచుర్యం, సివిల్స్ పరీక్షలలో హిందీ లాంటి సదుపాయాలు హిందీకే కలిగిస్తున్నారు. తెలుగుకు ఏ సదుపాయమూ కల్పించనప్పుడు కంచి గరుడ సేవలాగా ఈ హిందీ భారమెందుకు? హిందీయేతర ప్రజలు మాతృభాషతోపాటు ఆంగ్లం చాలులే అనుకోరా? ఉపయోగాలులేని ఏక పక్ష హిందీ శాసనాలవల్ల మిగతా భాషస్తుల్లోఅయిష్టత పెరుగుతుంది. ఎంతో కాలం గడిచాక ప్రాంతీయ భాషలలోనూ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. ఇంగ్లీషు మీడియం వాళ్ళతో హిందీ మీడియం వాళ్ళు పోటీ పడలేకపోతున్నారు. హిందీ భాషకు అనేక రాయితీలు ఇచ్చారు. హిందీ వాళ్లలాగా ఐఐటిలలో తెలుగులో చదువుకొని ఈ రోజుల్లో ఇంజనీర్లు కాగలమా? ఉద్యోగాలు వస్తాయా? ఉపాధి కోసమేకదా ఆంగ్ల మాధ్యమం విస్తరిస్తోంది? రాష్ట్ర భాషలు ఎందుకు క్షీణిస్తున్నాయి? కేంద్రమే హిందీతో ఉద్యోగాలు ఇవ్వలేకపోతే బడుగు ప్రజల బాగుకోసం ఇంగ్లీషునే కోరుకునే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపరిధిలో ప్రాంతీయ భాషలతో ఉద్యోగాలు ఏమిస్తాయి? హిందీ నూతన విద్యావిధానం తో భారీ ఉపాధి సాధ్యమేనా?
80 ఏళ్ళ క్రిత‌మే ఉర్దూ మీడియం
నైజాం ప్రభుత్వం 80 ఏళ్లక్రితమే ఉర్దూ మీడియంలోనే వకీళ్ళు,వైద్యులు,శాస్త్రవేత్తలను తయారు చేసింది. తెలంగాణా విడిపోయాక తెలుగు ఉర్దూ అకాడమీలు రెండూ కనుమరుగయ్యాయి. జన ఘోషకు స్పందించాల్సిన సర్కారీ యంత్రాంగం జన భాషకు పట్టం కట్టాల్సిందేనంటూ పట్టుపట్టిన ఎన్టీఆర్‌, దస్త్రం తెలుగులో రూపొందిస్తేనే సంతకం చేస్తానన్నాడు. ఫైలు తెలుగులో తెస్తేనే సంతకం పెట్టాడు. యధారాజా తధా ప్రజా అన్నట్లు అధికారులు తెలుగులో ఫైళ్ళను పరుగులెత్తించారు.
భాషా ప్రాతిపదిక మీద జాతుల విభజన అనే సూత్రాన్ని మన దేశం సోవియట్ నుండే స్వీకరించింది. అక్కడ రష్యన్ భాషా రుద్దుడు ఎలాంటి ఫలితాన్ని తెచ్చిందో ఇక్కడ హిందీని బలవంతంగా రుద్దడం కూడా అలాంటి ఫలితాన్నే తెస్తుంది.
బాల‌ల్లో మాతృభాషా బీజాలు నాటాలి
బాలల్లో మాతృభాషలోనే విజ్ఞాన బీజాలు నాటాలి. మన పిల్లలకు తెలుగే సరిగా రాదు, ఆలోచన వికసించేదశలో హిందీ అదనపు బారమా ? తనభాషే తనకు రాని పసి మనసును పరాయి భాషలకు వశం చేయటం కాదా? హిందీ రాష్ట్రాల్లో పిల్లలు ఇంగ్లిషుతోపాటు ఆధునిక భారతీయ భాషల్లో ఒకదాన్ని ఎంచుకోవాలట. హిందీయేతర రాష్ట్రాల్లోనైతే ఆంగ్లం, స్థానిక భాషతోపాటు హిందీ బోధన కూడా సాగాలట. వాస్తవానికి ఇంగ్లీషే జాతీయ భాష అన్నాయి కోర్టులు. సుప్రీం కోర్టులో చెలామణి అయ్యే ఇంగ్లీషే జాతీయ భాష. హిందీతోపాటు ఏ భారతీయ భాషకూ ఇంగ్లీషు స్థాయి దక్కలేదు.న్యాయస్థానాల్లోకి హిందీని ఈనాటికీ తీసుకు రాలేకపోయారు. నాయకులు సైతం ఇంగ్లీషు వైపే మొగ్గారు.రాజ్యాంగమే ఇంగ్లీషులో రాశారు. హైకోర్టులు,సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు హిందీని న్యాయస్థానాల గడప దగ్గరే ఆపేశారు. ఇంగ్లీషు తప్ప మరేభాషా హైకోర్టుల్లో వద్దన్నారు.అందరూ ఇంగ్లీష్ అభిమానులే. మద్రాసు హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా వినియోగించేందుకు అనుమతించాలని కరుణానిధి విన్నవించారు,తమిళనాడు శాసనసభ తీర్మానించింది అయినా కేంద్రం తిరస్కరించింది. హైకోర్టు,సుప్రీంకోర్టుల్లో హిందీ తీర్పులు తేవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అడిగినా లాకమీషన్ ఇంగ్లీషులో తప్ప హిందీ లో గానీ ఇంకా ఏ ఇతర భారతీయ భాషలలో గానీ వాదనలు తీర్పులు కుదరవని తీర్మానించింది.హై కోర్టుల్లో హిందీ ఎందుకు వద్దో లాకమీషన్ చెప్పిన కారణాలు :
“భాష దేశ ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. భాష ప్రజలను ఐక్యపరుస్తుంది. ఎవరిమీదా ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడదు.ఉన్నతన్యాయస్థానాలలోని వాదనలు తీర్పులు మామూలుగా జరిగేది ఆంగ్ల భాష లోనే.భారతీయ న్యాయ వ్యవస్థ ఇంగ్లీషుకు అమెరికా న్యాయ పుస్తకాలకు అలవాటుపడింది. కాబట్టి ఉన్నత న్యాయమూర్తుల్ని ఇంగ్లీషుకే స్వేచ్ఛగా వదిలేయ్యాలి.ఒక రాష్ట్ర హైకోర్టు జడ్జి మరో ప్రాంతానికి బదిలీపై వెళితే ఆ రాష్ట్ర భాష నేర్చుకొని ఆ భాషలో తీర్పులివ్వాల్సివస్తుంది. అది చాలా కష్టం. జడ్జీలమీద అనేక భాషల భారం మోపకూడదు. వాళ్ళమీద ఏ భాషనూ రుద్దకుండా జడ్జీలను వాళ్ళ భాషకు వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయ్యాలి. దేశప్రజలందరూ తప్పక సర్వోన్నత న్యాయస్థానం తీర్పులిచ్చే ఏకైక భాష అయిన ఇంగ్లీషును అర్ధం చేసుకోక తప్పదు. అన్నీ కోర్టుల్లో ఇంగ్లీషే ఉంటే వివిధ భాషా ప్రాంతాలమధ్య న్యాయవాదుల కదలిక సులభం అవుతుంది. కోర్టుల్లో హిందీ అమలు కోసం కావాల్సిన చట్టపరమయిన నియమాలు నిబంధనలు ముందు ఇంగ్లీషులోనే చెయ్యాలి. ఉన్నత న్యాయ స్థానాలను మాత్రం ఆంగ్ల భాషను మార్చుకోమని అడగవద్దు”. జాతీయ భాష హిందీ కాదు ఇంగ్లీషే ,దేశానికి ఆంగ్లమే దిక్కు అంటున్నారు న్యాయమూర్తులు. ఇంగ్లీషు రాని హిందీ వాళ్ళెవరూ హై కోర్టుల్లో పనికిరారు.హిందీగానీ, మరే భారతీయ భాషగానీ హై కోర్టుల దరిదాపుల్లోకి వెళ్లలేదు. జాతీయ అనుసంధాన భాష హిందీ కాదు ఇంగ్లీషే. హిందీ దివస్,‘హిందీవారం’, “రాత కోతలన్నీ హిందీలోనే “ లాంటి కార్యక్రమాలన్నీ కోర్టుబయట మానసిక తృప్తీ ఓదార్పు పొందటం కోసమే. 1990లోనే ఉత్తరప్రదేశ్ లో ములాయంసింగ్‌ ఇంగ్లీషు మీడియాన్ని రద్దుచేశాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీనే వినియోగించాలంటూ ఆదేశించారు. నేటికీ హిందీ రాష్ట్రం లో హిందీ హై కోర్టుల లోకి రాలేకపోయింది. తెలుగులోనే తీర్పులు వచ్చేలా గ్రామ న్యాయాలయాలు రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుతీర్పులు అడిగే వాళ్ళే లేరు,హై కోర్టుల జోలికి వెళ్లకుండా అధికార భాషా సంఘాలతోనూ, భాషా ప్రాధికార సంస్థలతోనూ,కళాపరిషత్తులు,అకాడమీలు,అవధానాలు,దివసాలతోనూ భారతీయ భాషలు అన్నీ సరిపెట్టుకోక తప్పదు.
--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి