4, జనవరి 2021, సోమవారం

బానిసత్వ నిర్మూలన సాధ్య‌మేనా?

 బానిసత్వ నిర్మూలన సాధ్య‌మేనా?

 

డిసెంబ‌ర్ 2న మొక్కుబ‌డిగా నిర్వ‌హ‌ణ‌
అన్ని దినోత్స‌వాల‌దీ అదే తంతు
ప్రపంచంలో మూడు కోట్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. బానిసలను వెట్టి చాకిరీ నుండి బయట పడేసే ఉద్దేశం తో 1949లో ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం’ నిర్వహించాలని నిర్ణయించింది. బానిసత్వ నిర్మూలన జరగలేదు కానీ ఏటా డిసెంబర్‌ రెండో తేదీన ఇది దినోత్సవం లాగా జరుగుతుంది. ఎవరికీ ఏమీ అందకుండానే ప్రాణాంతక పురుగుమందులతోనే ‘ప్రపంచ నేల దినోత్సవం’,అంతర్జాతీయ మానవ హక్కుల దినం’ జరిపేశారు. బానిసత్వం ఎన్నో రకాలుగా ఉంటుంది. శారీరక మానసిక ఆర్థిక బానిసత్వాలు నిరంతరం చూస్తూనే ఉన్నాం.కులాలు మతాలు బలహీనుల్ని ఏలాయి. బానిసలు నేటికీ కొనసాగుతూనే ఉన్నారు.
రైతుల్ని ఉగ్ర‌వాదులంటున్నారు
ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే రైతులు వ్యవసాయ బిల్లుల రద్దుకోసం పోరాడారు. ఆందోళన చేస్తున్న రైతుల్ని ఉగ్రవాదులన్నారు, రైతులకు ఉత్పత్తి వ్యయానికి రెండు రెట్లు అధిక ఆదాయాన్ని అందిస్తామని వాగ్దానం చేసిన కేంద్రం ఈ చట్టాల పట్ల రైతుల అభ్యంతరాలేమిటో తెలుసుకోవాలి. భారత ఆహార మార్కెట్‌ ను కార్పొరేట్ల పరం చేస్తారేమోననే రైతుల భయాన్ని పోగొట్టాలి. ఆర్థిక అసమానతలు పెరిగి ఉపాధి పడిపోయింది. ఉద్దీపనల వల్ల సామాన్యులకు లాభం చేకూరాలి. ఉపాధి కల్పనే మాంద్యానికి మందు. విమానాశ్రయాలు, రైల్వేలు, పోర్టులు, బిఎస్‌ఎన్‌ఎల్‌, బ్యాంకులు చివరికి వ్యవసాయాన్నికూడా కార్పొరేట్లకు అప్పగిస్తే కార్పొరేట్ల ఆస్తితో పాటు పేదలూ పెరుగుతారు. ఆఫ్రికాలోని నీగ్రోలను అమెరికాకు తరలించి బానిసలుగా మార్చి అమ్మారు. బానిసత్వం నేటికీ వెట్టిచాకిరీగా కొనసాగుతోంది.
క‌రోనా బ‌తుకులు కుదేలు
కరోనాతో ఉపాధి పోయి కొన్ని కోట్లమంది వలస కార్మికుల బతుకులు కుదేలయ్యాయి. ప్రపంచంలో కరోనాతో 17.27 లక్షలమంది ఇండియాలో1.46 లక్షలమంది చనిపోయారు. మంచి నీళ్ళు త్రాగి ఏలూరులో వందలమంది ఆసుపత్రి పాలయ్యారు. బిహార్‌లో మోనోక్రొటోఫాస్‌ అవశేషాలున్నమధ్యాహ్నభోజనాన్ని తిని పిల్లలు చనిపోయారు. దేశంలో సగం మందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వలేమని మూడేళ్లు పడుతుందని భారత్ బయోటెక్ వాళ్ళు అంటున్నారు. జనం చేతిలో కాసులు గలగలలాడేలా ఉపాధి కల్పించాలి. కొనుగోలు సామర్థ్యం పెరిగితే గిరాకీ ఊపందుకొని మాంద్యం తగ్గుతుంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. పంజాబ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. రైతులను నష్టపరిచే ఎటువంటి చట్టాలనూ తమ రాష్ట్రంలో అమలుచేసేది లేదని కెసిఆర్‌ ప్రకటించారు. లాభాల కోసం మాత్రమే పనిచేసే కార్పొరేట్ వ్యాపారులు దళారులుగా చేరకపోతే దేశంలో ఎక్కడ మంచి ధర దొరికితే అక్కడికెళ్లి రైతులు తమ పంటలను అమ్ముకోవచ్చుననే చట్టం మంచిదే.
కార్పొరేట్ల సంప‌ద‌తో పాటు పెరుగుతున్న పేద‌రికం
కార్పొరేట్ల సంపదతో పాటే దేశంలో పేదరికమూ పెరుగుతోంది. అంబానీ ఆదాయం గంటకు 90కోట్లు కాగా, గ్రామీణ పేదల ఆదాయం నెలకు 5వేలే. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంత పురోగమించినా అన్నం పెట్టే రైతులు లేకుండా పూట గడవదు. వ్యవసాయం లేకుండా మానవాళికి బతుకు లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావటంలేదు. రైతులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోపక్క అమెజాన్లు, వాల్‌మార్టులు చిన్నచిల్లర దుకాణాలను ఛిద్రం చేసి మరీ ఎదుగుతున్నాయి. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటు బ్యాంకుల జాతీయకరణ లక్ష్యాలను దెబ్బ తీస్తుంది. ప్రైవేటు బ్యాంకులు తమ బ్యాంకులను ఏర్పాటు చేసిన పెద్ద సంస్థలకు తక్కువ వడ్డీలకు రుణాలిస్తాయి. ప్రైవేటు బ్యాంకులు తిరిగిరాని రుణాలతో దివాళా తీస్తాయి. ప్రజల డిపాజిట్లకు గ్యారంటీ ఉండదు. ముప్పైలక్షలకోట్ల కరోనా ఆత్మనిర్భర ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చినా ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదు.
ప‌నికొచ్చే చ‌దువులు ఎక్క‌డా?
పనికొచ్చే చదువులు లేవు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు కళాసీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే రెండు కోట్లమంది నిరుద్యోగులు పోటీపడ్డారు. రైల్వే గేట్‌మెన్‌, అసిస్టెంట్, గ్యాంగ్‌మెన్‌ ఉద్యోగాలకు 82 లక్షల మంది పట్టభద్రులు బారులు తీరారు. పనిమంతులు దొరకట్లేదని కార్పొరేట్లు, పనే దొరకట్లేదని పట్టభద్రులూ బాధపడుతున్నారు. ఉపాధికల్పించలేని చదువుల కోసం విద్యారుణాలు మాత్రం ఇస్తున్నారు. మానవాభివృద్ధి సూచీల్లో చైనా 85 వ స్థానంలో ఉంటే ఇండియా 131 వ స్థానంలో ఉంది. ప్రపంచ భూమిలో ఇండియాకు 2.4శాతం ఉంటే జనాభా 16శాతం ఉంది. సంతానోత్పత్తి పెరుగుతూ జనసంఖ్య చైనాను దాటేలా ఉంది. మన దేశంలో సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాలుఉంటే బంగ్లాదేశ్‌(72.6), నేపాల్‌(70.8), భూటాన్‌(71.8) . పదివేల జనాభాకు మన దేశంలో వైద్యులు 9 మంది మాత్రమే. వైద్య కళాశాలల్లో సీట్లు చాలక మన విద్యార్థులు చైనా, రష్యా, ఫిలిప్పీన్స్‌ దేశాలకు వలసపోతున్నారు. వైద్య విద్య ఖర్చు భరించలేని ప్రజలతో వైద్యుల సంఖ్య, ఆసుపత్రి సదుపాయాలు ఎలా పెరుగుతాయి. గిరిజన జనాభా ఎనిమిది శాతం ఉన్నప్పటికీ టీచర్లలో వారు 3 శాతమే. జనాభాకు తగినట్లు మొత్తం 1500 విశ్వవిద్యాలయాలు కావాల్సి ఉండగా 993 మాత్రమే ఉన్నాయి. దాదాపు కోటి మంది ఏటా వృత్తి ఉపాధి నైపుణ్యం లేని డిగ్రీలు, రెండు లక్షల మంది ఎంఫిల్‌ , పిహెచ్‌డిలు పొందుతున్నారు. విద్య మీద పెట్టుబడిలో ప్రపంచంలో అమెరికా 27, చైనా 44 , సూడాన్‌ 157, ఇండియా 158, నమీబియా 159వ స్ధానాల్లో ఉన్నాయి. 117 దేశాల ప్రపంచ ఆకలి సూచిక జాబితాలో శ్రీలంక 66, నేపాల్‌ 73, బంగ్లా 88, పాకిస్తాన్‌ 94,ఇండియా 102, ఆఫ్ఘనిస్తాన్‌ 108వ స్థానాలు.
అక్క‌ర‌కు రాని ఆయుష్మాన్ భార‌త్‌
ఆయుష్మాన్‌ భారత్‌ ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో భరించలేని ఆరోగ్య ఖర్చుతో ప్రజలు అప్పులపాలౌతున్నారు. మన దేశ జిడిపి పెరుగుతున్నా సామాన్య జనం చేతుల్లోకి ఆదాయం రావటంలేదు. ప్రపంచ సంతోష సూచికలో 133 నుంచి 140కి దిగజారింది. డిల్లీలో కుక్కలకు కూడా దహనవాటిక ఏర్పాటుచేశారట. మనిషి ఎంత ధనికుడై బ్రతికినా చివరికి సమాధికి చేరాల్సిందే. కొన్ని చోట్ల సంపన్నులు తమ శ్మశానాలను స్వర్గ పురాలుగా శుభ్రంగా అందంగా మార్చుకుంటున్నారు. పేద కులాలకు చాలా చోట్ల శ్మశానాలే లేవు. శ్మశానాలు ఉన్నా సరైన దారిలేక శవాలను మోస్తూ మరుభూమికి చేరవేయటానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. దారి పక్క రోడ్డు, డొంక, కాల్వ పోరంబోకు స్థలాలలోనే అంత్యక్రియలు కానిచ్చేస్తున్నారు. శ్మశానాల ఏర్పాటూ సంక్షేమ కార్యక్రమమే కాబట్టి ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
ప్ర‌బ‌లుతున్న అంట‌రానిత‌నం
అంటరానితనం నిషేధమైనా ఇప్పటికీ అనేక రూపాల్లో ప్రబలిపోతోంది. ఆడవారిని హింస, బలవంతం, మోసాలు చేసి శ్రమదోపిడి చేస్తున్నారు. అప్పులిచ్చి బానిసలుగా మార్చి లైంగిక దోపిడి చేస్తున్నారు. పిల్లలను చదివించకుండా జీతానికి పనుల్లో పెడుతున్నారు. బలవంతపు పెళ్ళిళ్లు, బాల్య వివాహాలు చేస్తున్నారు. ఈ తప్పుడు పనులన్నీ బానిసత్వమే. అక్రమంగా రవాణా చేసి బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు. కులాంతర వివాహాలకు వ్యతిరేకులు పరువు హత్యలు చేస్తున్నారు. బాల్య వివాహాలు ఆపటానికి మహిళలకు వివాహ వయస్సును 18 ఏళ్లు , పురుషులకు 21 ఏళ్లుగా పెంచారు. ప్రపంచంలో బాలికా వధువులు భారత్‌ లోనే ఎక్కువ. సంప్రదాయాలు, సామాజిక ఆచారాలు, పేరు చెప్పి కుమార్తె రజస్వల అయితే చాలు పెళ్ళి చేస్తున్నారు.15–19 ఏళ్ల ప్రాయంలోనే బాలికా వధువులు తల్లులవుతున్నారు. 18 ఏళ్లకు ముందే వివాహమాడుతున్న బాలికల సంఖ్య 36 శాతం దాకా ఉంది. మహిళలపై లైంగిక హింస జరుగుతోంది. మహిళలు మగవారిపై ఆధారపడి, వారికి బానిసలుగా ఉంటున్నారు. చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల భార్యగా, తల్లిగా, కోడలిగా బరువైన బాధ్యతలు స్వీకరించి మైనర్‌ బాలికలు ఒంటరితనానికి, కుంగుబాటుకు గురౌతున్నారు. మహిళలకు సమాన చదువు ఆస్తి హక్కు కావాలని జ్యోతిబా ఫూలే, గురజాడ,కందుకూరి,పెరియార్‌ రామస్వామి, అంబేద్కర్‌, నారాయణ గురు లాంటి వారు చేసిన పోరాటాల ఫలితంగా మహిళలకు కొన్ని హక్కులు వచ్చాయి. ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు అనే పాత వాగ్ధానం ప్రకారం ఎన్టీఆర్ పక్కా ఇల్లుదగ్గర నుంచి రాజీవ్ స్వగృహ, టిడ్కో ఆత్మనిర్భర్‌ భారత్‌, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన లాంటి ఎన్నో పధకాల కింద కోట్ల ఇళ్ళు మంజూరౌతున్నాయి. ఇల్లులేని వారి సంఖ్య ప్రతి జనాభా లెక్కల్లో పెరుగుతూనే ఉంది. ఇంకా పట్టణ ప్రాంతాల్లో 1.12 కోట్ల ఇళ్లకు గిరాకీ ఉందట. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసిచూడు అన్నారు. ఇల్లు లేకపోయినా పెళ్లి చేసుకున్నవారి ఆవేదన తగ్గాలి. ఇళ్ళు అందుబాటు ధరల్లో లేవు. పేదల ఇళ్లకోసం సరైనచోట భూమి దొరకక ఆవ భూముల్లో ఇళ్ల స్థలాలు పంచుతున్నారు. వాటిని మెరక చేసి ఇళ్ళు కట్టాలి. లేదా అపార్ట్ మెంట్లు కట్టి ప్లాటు ఇవ్వాలి. ఇళ్ల పథకాలు జాప్యం లేకుండా పూర్తి చేయాలి. భూమి ధర రోజురోజుకూ పెరిగి ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయాలు పెరుగుతాయి.
జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం హ‌ర్ష‌దాయ‌కం
జగన్ ప్రభుత్వం మహిళల పేరుతో 30.76 లక్షల కుటుంబాలకు ఇంటి పట్టాలు 2.62 లక్షల టిడ్కో ఇళ్ళు ఇవ్వటం హర్షదాయకం. తెలంగాణాలో డబల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లు కట్టించి పేదకుటుంబాలకు ఇవ్వటం పేదల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్ధిక భద్రత నిస్తుంది. కుటుంబాల ఆర్ధిక భద్రత పెరిగినప్పుడు అప్పులు తగ్గి రక్షణ పెరుగుతుంది. వివక్ష అణచివేత హింస బానిసత్వం తగ్గుతాయి.
--(నూర్ బాషా రహంతుల్లా, ఏపీ రిటైర్ట్ స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ 6301493266)) కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి