24, డిసెంబర్ 2012, సోమవారం

తెలుగునెక్కడ బతకనిచ్చారు?



తెలుగునెక్కడ బతకనిచ్చారు?
          17-9-2004 న తమిళాన్ని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినపుడే మనవాళ్లు తమిళ నాయకుల్ని చూసైనా నేర్చుకోవాలని మన తెలుగు పెద్దలు సుద్దులు చెప్పారు. వెయ్యేళ్లనాటి ‘రాత సాహిత్యం’ మనకీ ఉందిలే అనే తెలుగువాళ్ళ ధీమాను దెబ్బతీస్తూ 1500 ఏళ్ల లిఖిత సాహిత్యం ఉండాలని కాలవ్యవధిని పెంచేశారు. అంటే తమిళానికున్న స్థానం ఇక ఏ భాషకూ దక్కకుండా ఏర్పాట్లు చేశారు. భాషలను విభజించి పాలిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించనందుకు నిరసనగా వేటూరి సుందరరామ్మూర్తి గారు తన పాటకిచ్చిన జాతీయ అవార్డును వాపసు చేశారు. తెలుగు ప్రాచీనతకు ఆధారాల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఇప్పుడు ఎవరి భాషల మూలాలు వాళ్ళు వెతుక్కుంటున్నారు. భాషల పోటీ మొదలయ్యింది.
      
              నన్నయ్యగారిని “ఆదికవి” అన్నారు కాబట్టి ఆయన కాలం నాటికి,   అంటే        వెయ్యేళ్ళ పరిమితికే ప్రాచీనతా నిర్ధారణా ప్రమాణాన్ని కుదించాలని   మన పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య దలైలామా ‘కాలచక్ర తంత్రం’     జరిపిన      అమరావతికి 2500 సంవత్సరాలనాడే గౌతమబుద్ధుడు    వచ్చాడు గదా !    అప్పుడిక్కడ తెలుగు లేదా ? మాటలు అక్షరాలుగా మారి సాహిత్యరూపం    పొందటానికి లక్షల ఏళ్ళు పట్టవచ్చు. నిరంతరం        యుద్ధాల్లో మునిగి తేలే ప్రాంతాల్లో భాష ఉంటుంది గానీ, వ్రాసిన     సాహిత్యానికి భద్రత        ఉండకపోవచ్చు. ఏ జాతి ప్రజలకు అన్ని రంగాల్లో భద్రత ఉంటుందో, ఆ జాతి      ప్రజా భాషకూ భద్రత ఉంటుంది.      మనుషులుంటేనే గదా భాష బతికేది ?

              అలాగే ఒక జాతి ప్రజల భాష నిరాదరణకు గురైతే ఆ జాతి కూడా     క్రమేణా        నీరసించిపోతుంది. లిపులున్న భాషలకే అతీగతీ లేకపోతుంటే,        లిపులులేని        ఎన్నో విలువైన భాషలు తమ ప్రాచీనతను ఎలా    తెలియజేసుకుంటాయి ?

       అయినా ప్రాచీన భాషలకు మాత్రమే కోట్లాది రూపాయలను కుమ్మరించాలనే       అసహజ భావన ఎలా కలిగింది ? ఒక కుటుంబంలోని బిడ్డల్లో ఎవరైనా   పేదరికంలో వుంటే మిగతా కుటుంబ సభ్యులు ఆ పేదవాడికి సాయం   చేస్తారు. బైబిల్ లో ఏసుక్రీస్తు “ఉన్నవాడికే ఇంకా ఇవ్వబడుతుంది. లేని    వాడి దగ్గరనుండి వాడికున్నది కూడా తీసివేయబడుతుంది” అంటారు.        ప్రస్తుతం కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అలాగే ఉంది.

              అంతర్జాతీయ భాష పేరుతో ఇంగ్లీషు, జాతీయ భాష పేరుతో హిందీ,   అమరభాష పేరుతో సంస్కృతం, ప్రాచీన భాష పేరుతో తమిళం కోట్లాది       రూపాయల ప్రజాధనాన్ని పంచుకుంటున్నాయి. మనల్ని అడగకుండానే,     మన అనుమతి లేకుండానే ఈ పంపకం జరిగిపోయింది. పంట వాళ్ళు   పట్టుకెళ్లి పరిగె మనకొదిలారు.

       బోర్డుల మీద రాసిన హిందీ పేర్లు తుడిపేస్తు, Long live Classical Divine     Tamil అనే భాషాభక్తిని తమిళులు ప్రదర్శిస్తూ వారి భాషను సంస్కృతం    హిందీ భాషల బారినుండి రక్షించుకుంటుంటే, తెలుగువాళ్లు తెలుగునే చీదరించుకుంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒక జాతి సమస్త వ్యవహారాలు     దాని భాషలో సాగితేనే గదా ఆ జాతికో భాష స్థిరపడేది, బలపడేది ? ఇక్కడ      తెలుగు భాషను చంపేస్తు కేంద్రాన్ని ఏమి అడిగినా పెద్దగా ప్రయోజనం      ఉండదు. గొప్పల కోసం బడాయి కోసం సంస్కృతం, హిందీ ఇంగ్లీషుల్ని   నేర్చుకున్నారు గానీ, తెలుగునెక్కడ బతకనిచ్చారు ?

       భాషోద్యమం దారి తప్పిందనే వ్యాసంలో రంగనాయకమ్మ ఇలా అన్నారు :

       “మనుషులు ఎంత ప్రాచీనమో భాషలు అంత ప్రాచీనం. అనేక తెగల మనుషులు ఈనాటికీ రాళ్ళల్లోనూ రప్పల్లోనూ అడవుల్లోనూ కొండల్లోనూ      పడి ఏడుస్తుంటే వాళ్ళకు లిఖిత సాహిత్యం ఎలా వస్తుంది ? వాళ్ళ భాషలకు లిపి లేకపోతే అది వాళ్ళ తప్పా ? లిపి కూడా లేని భాషల్ని     పట్టించుకోకుండా అభివృద్ధి చెందిన భాషలకోసమే డబ్బు గుప్పించడం        ఎందుకు?” (ఈనాడు 9-2-2006)
    హిందీ కోసం ఏం చేశారో చూడండి ?
1949 భారతదేశానికి హిందీ అధికార భాషగా ఉండాలని రాజ్యాంగ సభ తీర్మానించింది.
1952 హిందీ స్వచ్ఛంద శిక్షణను విద్యాశాఖ చేపట్టింది. గవర్నర్లు, హైకోర్టు, సుప్రీం కోర్టు హిందీ వాడొచ్చని ఆదేశాలిచ్చారు.
1955 అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో హిందీ బోధనా కార్యక్రమం మొదలుపెట్టారు. ఖేర్ కమీషన్ వేశారు. దేశమంతా హిందీ వాడాలని ఆదేశించారు. (ఆర్టికల్ 343(2))
1960 హిందీ టైపింగు, స్టెనోగ్రఫీ నిర్భంధం చేశారు. హిందీ శబ్దకోశాలు, చట్టాల
       తర్జుమా జరగాలని రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు.
1963  హిందీ జాతీయ అధికార భాషా చట్టం తెచ్చారు.
1967  ప్రధాన మంత్రి అధ్యక్షతన కేంద్రీయ హిందీ సమితి ఏర్పాటు చేశారు. త్రి భాషా సూత్రం తెచ్చారు.
1971   కేంద్రీయ అనువాద బోర్డు నెలకొల్పారు.
1975  అధికార భాష డిపార్ట్ మెంట్ స్థాపించారు.
1977 అప్పటి విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడారు.
1981   సెంట్రల్ సెక్రటేరియట్ లో అధికారభాష సర్వీస్ ప్రారంభించారు.
1983  యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలలో హిందీ వాడకం పెంచటం కోసం అధికార భాషా శాఖలో టెక్నికల్ సెల్ ఏర్పాటు చేశారు.
1985  ఉద్యోగులకు హిందీ టైపింగ్, షార్ట్ హ్యాండ్ నేర్పటానికి సెంట్రల్ హిందీ టైనింగ్ ఇన్ స్టిట్యూట్ స్థాపించారు.
1986  ఇందిరాగాంధీ రాజభాషా అవార్డులు మొదలుపెటారు.
1988  అప్పటి విదేశాంగ మంత్రి శ్రీ పి. వి. నరసింహారావు ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడారు.
1999  హిందీ అధికారభాష గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరిపారు.
2000 హిందీలో ఇ-మెయిల్, చాటింగ్ సదుపాయాలతో అధికార భాషా డిపార్ట్ మెంట్ పోర్టల్ తెరిచింది. గ్యాన్ – విగ్యాన్ జాతీయ అవార్డులు ఇవ్వటం మొదలుపెట్టారు.
2003 ఎన్.డి.ఎ, సి.డి. యస్. పరీక్షా పత్రాలు హిందీలో ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. హిందీ ప్రభోధ్, హిందీ ప్రవీణ్, హిందీ ప్రగ్య, సెల్ఫ్ లెర్నింగ్ కంప్యూటర్ ప్రోగ్రాములు అధికార భాష డిపార్ట్ మెంట్ వెబ్ సైట్లో చేర్చారు. తెలుగు తదితర భాషల వాళ్ళు ఉచితంగా హిందీ నేర్చుకోవచ్చు.
2004 అధికార భాషా చట్టం అమలు చేసే హిందీ అధికారుల సంఖ్య పెంచారు. ఎన్ సి ఇ ఆర్ టి లాంటి సంస్థలన్నీ వాటి పుస్తకాలలో వాడే సాంకేతిక పదాలను సూచించటానికి శాస్త్రసాంకేతిక హిందీ పదాల కమీషన్ ను నెలకొల్పారు.
2005 525 హిందీ ఫాంట్లు, ఫాంట్ కోడ్ కన్ వర్టర్లు, డిక్షనరీలు ఉచితంగా ప్రజలకు పంచారు. గ్యాన్ –విగ్యాన్ బహుమతుల మొత్తాన్ని పెంచి రాజీవ్ గాంధీ జాతీయ అవార్డులుగా పేరు మార్చారు.
      
              ఇలాంటి పనులన్నీ తెలుగు కోసం చెయ్యాలి. నిజామాబాద్ కలెక్టర్ రాయుడు తెలుగులో నివేదికలు పంపని అధికారులందరికీ మెమోలు జారీ చేశాడట. ఇలా మన పరిధిలోనే కొంతపని జరగాలి. క్రమశిక్షణ రావాలి. “తెలుగు బిడ్డవయుండి, తెలుగు మాట్లాడేందుకు సంకోచపడేవు సంగతేమిటిరా ?” అనే కాళోజీ వేసిన సూటిప్రశ్న మనం వేసుకోవాలి. తెలుగు భాషోద్యమ నాయకులు కొందరు పరస్పరం ఇంగ్లీషులో తిట్టుకుంటున్నారు. ఇక్కడా కులాల వారీ గొడవపడుతున్నారు. కులాల వారీగా చీలి తెలుగు భాష ఎలా ఉండాలో నిర్దేశించుకుంటున్నారు.
తమిళం కోసం ఏం చేశారు ?
మైసూరులోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజస్
“క్లాసికల్ తమిళ్” కోసం ఇస్తున్న అవార్డులు ఇవి :

1.    చెమ్మోజి చెమ్మల్ అవార్డులు – 3 (ఒక్కొక్కటి లక్ష రూపాయలు) 1-విదేశీయులకు, 1-ప్రవాస భారతీయులకు, 1-దేశీయులకు.

2.    చెమ్మోజి చెల్వర్ అవార్డులు -5 (ఒక్కొక్కటి 50 వేల రూపాయలు) (30-40 ఏళ్ల వయస్సులోని పండితులకు).

3.    డాక్టరల్ ఫెలోషిప్పులు -10 (నెలకు 10 వేల రూపాయల చొప్పున అయిదేళ్ళ పాటు) అదనంగా ఏడాదికి పదివేల మొత్తం.

4.    పోస్ట్  డాక్టరల్ ఫెలోషిప్పులు -5 (నెలకు 12 వేల రూపాయల చొప్పున మూడేళ్లు, అదనంగా ఏడాదికి రూ|| 20,500).

ఈ మాత్రం తెలుగుకు కూడా ఇవ్వవచ్చు గదా ? 12-10-2004 తమిళాన్ని “ప్రాచీన భాష”గా గుర్తించింది మొదలు చక చకా ఈ పనులన్నీ జరిగిపోయాయి.

సంస్కృతం వేదభాష కాబట్టి ఆ భాష మాట్లాడేవాళ్లు ఇప్పుడెవరూ లేకపోయినా మతాచారాల కోసమే బ్రతికించుకుంటూ వస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో పదాలు పుష్కలంగా ఉన్నా వాటిని కాదని సంస్కృత పదాలను పసిపిల్లల మీద రుద్దుతూ చదివిస్తున్నారు. ఉదాహరణకు కూడికను సంకలనం అనటం, తీసివేతను వ్యవకలనం అనటం. “ఎవరికీ తల్లిభాష కాని  భాషకు పట్టం కట్టి, మాతృభాషలోని చేవను జావకార్చి ప్రజల భాషను ప్రజల దగ్గరకు తీసుకుపోవడానికి పడుతున్న ఈనాటి పాట్లకు ఈ పండితులే కారకులని అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎ.బి.కె. ప్రసాద్ వాపోయారు. ప్రాచీన సారస్వతంలో పండితులు జానపదుల ఉనికిని, వారి పద సాహిత్యాన్నీ, వారి పాటలనూ విస్మరించి తెలుగువారి చరిత్రకు అన్యాయం చేశారని బాధపడ్డారు. ఆంధ్రదేశంలో పనిగట్టుకొని బౌద్ధధర్మాన్ని నిర్మూలించారనీ, ఆంధ్రుల చారిత్రక ఆధారాలను అదృశ్యం చేశారనీ, కులవ్యవస్థతో బౌద్ధధర్మాన్ని భారతదేశ సరిహద్దులు దాటించడమేగాక, తెలుగు భాషకూ చీడపట్టించారని, తెలుగులో జైన బౌద్ధమతాలు సృష్టించిన సాహిత్యాలను నామ రూపాలు లేకుండా చేశారనీ విమర్శించారు. (వార్త 9-2-2006).

‘అణచివేతే అసలు కారణం’ అనే వ్యాసంలో కత్తి పద్మారావు ఇలా అన్నారు. ‘ఆంధ్రులు బౌద్ధాన్ని ఆదరించడం వల్ల వైదిక గ్రంధాలు వీరిని నిందిస్తూ వచ్చాయి. ఎంతో ప్రాచీనమైన తెలుగు మౌఖిక రూపం నుండి లిఖిత రూపానికి రాకపోవటానికి కారణం అది రాజభాష కాకపోవటమే. ఆంధ్రదేశంలో క్రీ.పూ 300 నుండి క్రీ. శ. 300 వరకు ప్రాకృతం, క్రీ.శ. 300 నుండి 600 వరకు సంస్కృతం రాజభాషగా పెత్తనం చేశాయి. తెలుగు సాహిత్యం మొదట బౌద్ధంలో ఆవిర్భవించింది. 1700 సంవత్సరాల పాటు మాట్లాడుతూ ఏ జాతి అయినా సాహిత్యం లేకుండా ఉంటుందా ? రాజకీయ, మత అణచివేతల్లోనే తెలుగు తన సాహిత్యాన్ని కోల్పోయింది. లిఖితంలో ఉన్నా లేకపోయినా భాష భాషే. కులమత భేదాలు పాటించకుండా మనం అందరం ఒక భాషాజాతిగా పోరాడాలి.” (ఆంధ్ర జ్యోతి 8-2-2006)

ప్రపంచంలో మనుషుల్ని భాషే ఒక జాతిగా కలుపుతుంది. ఎందుకంటే ఆ జాతి వ్యవహారాలు ఆ జాతి భాషలోనే నడుస్తాయి కాబట్టి, కానీ తెలుగు జాతికి సమాచార సాధనంగా, విజ్ఞాన ప్రదాయినిగా ఉండాల్సిన తెలుగు భాష – మనల్ని అందరినీ ఒకే బాట మీదకు, ఒకే మాట మీదకు తేలేని దీన పరిస్థితికి అణగదొక్కారు. ముఖ్యంగా మన పద సంపదను ఎందుకూ పనికిరాని దానిలా తీసిపారేశారు. మన జనం మాట్లాడేదే నిజమైన తెలుగు. అది గ్రంధాల్లోకి రాలేదు. ఈ గ్రంధాల్లోకి రాని తెలుగును వేల ఏళ్ల నుండి మన ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రజల నోళ్లలోని తెలుగు పదాలు ఈనాటికీ నిఘంటువుల్లోకీ, గ్రంధాల్లోకి ఎక్కకుండా అడ్డుపడుతున్నవాళ్లు లేరా? Penis, vegina లాంటి పదాలకు సంస్కృత పదాలను కాకుండా మన జనం పలికే తెలుగు పదాలనే యథాతధంగా ఇప్పటికైనా గ్రంధాల్లోకి ఎక్కించగలరా ? ఎందుకో నాకే భయంగా ఉంది. అంటే నా భాషను నేనే పలకలేకపోతున్నాను. నా భాషను నేనే రాయలేకపోతున్నాను. ఎందుకీ అపరాధ భావన నాకు కలుగుతోంది ? ఇంతకంటే పచ్చి బూతు మాటల్ని సంస్కృతంలో, ఇంగ్లీషులో నిర్భయంగా మాట్లాడుతున్నారు, రాస్తున్నారే! ఏమిటీ సంకెళ్ళ పరిస్థితి ? ఆనాడెప్పుడో అణచివేశారు కాబట్టి అలా జరిగిందన్నారు. ఇప్పుడు కూడా మన పదాలను మనమే చీదరించుకుంటున్నామే? ఇక ప్రాచీన తెలుగు పదాలను తవ్వి తలకెత్తుకోగలమా ? ఆ ధైర్యం మనకులేదు. అవతలి వాళ్లేమనుకుంటారోనని తన మాటల్ని తన గొంతులోనే దిగమింగే మానసిక రుగ్మత తెలుగుజాతిని తరతరాలుగా పీడిస్తోంది. దీనికి చికిత్స జరగాలి.

తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించాలని త్వరలో అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తారని పెద్దలు చెబుతున్నారు. ప్రాచీన భాషగా తెలుగు గుర్తించబడితే వందకోట్ల రూపాయల దాకా నిధులు వస్తాయి. అయితే ఆ డబ్బుతో ప్రాచీన సాహిత్యాన్ని ప్రచురించి ప్రచారం చెయ్యాలేగాని నేటి మన భాషావసరాలకు వాడకూడదట. ఇందువలన తెలుగు  జాతి ప్రజలందరికీ, అనుదిన జీవితంలో మనం వాడే వాడుక భాషకు జరిగే మేలేమీ ఉండదు. ఆ ప్రాచీన భాషను మన ఆఫీసుల్లో వాడకంలోకి తేగలమా? ఆ డబ్బంతా ప్రాచీన సాహితీవేత్తల పీఠాలకే ఖర్చవుతుంది తప్ప చదివే వాళ్లెవరూ ఉండరు. ప్రజలు ఆదరిస్తేనే గదా ఏ భాషకైనా మనుగడ ఉండేది ? ప్రజలు ఆ భాషను ఆదరించాలంటే ఆ భాషలో చదువులు, ఉద్యోగాలు ఉండాలి. ఆ భాషను ఆధునిక అవసరాలకూ ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలి. లిపిని కూడా యంత్రాలకు అనుకూలంగా సంస్కరించుకోలేని వాళ్ళం మనం, ఇండియాలో కొన్ని వందల ఏళ్ల క్రితం మాత్రమే పుట్టిన ఉర్దూ భాషలో నిజాం రాజులు వకీలు, వైద్యవిద్యల్ని కూడా అభివృద్ధి పరుచుకోలేదా? ఆ భాషలో ఉన్నత చదువులు మన కళ్ల ముందే దశాబ్దాల్లోనే అంతరించిపోవటం మనం చూడలేదా?

ఆదికవితో ఆగిపోవటం తప్పు. ఆదికవి అని ఒక వ్యక్తికి పేరు పెట్టేముందు ఆ కవికి ముందు ఎలాంటి సాహిత్యంగానీ కవులుగానీ లేకుండానే ఆయన స్వయంభువులాగా వెలిశాడా అని ఆలోచించి ఉండాల్సింది. ఆదికవికి అవతల తెలుగే లేదా? తెలుగు పల్లె పదాలను, తెలుగు పల్లె కవుల్నీ తిరస్కరించి ఘంటాలు పట్టి ఆకుల మీద సంస్కృతం రాసిన పండితుల్ని మాత్రమే గుర్తించిన దాని ఫలితమే ఇది. ఇప్పటికైనా ప్రజల వాడుకలోని తెలుగుకు పట్టంగట్టి, పల్లెభాష ప్రాచీనతను చరిత్రకారులు వెతకాలి. అది బుడబుక్కల వారి తెలుగు కావచ్చు. కాటిపాపల వారి తెలుగు కావచ్చు. అదే అసలైన తెలుగు. ప్రాచీన కాలం నుండి సంస్కృత పండితుల ఛీత్కారానికి, రాజ్యాధికారుల హేళనకు గురైన తెలుగు, బడుగువర్గాల వారి బాసే అసలైన తెలుగు. ఇప్పటికీ చూడండి – తెలంగాణా వాళ్ళు మాట్లాడే భాషను ఎగతాళి చేస్తున్నాను. వాళ్ళది తెలుగు కాదా ? మాండలికాల పట్ల, వృత్తికులాల వారి తెలుగు భాష పట్ల ఇంత వివక్షను నేటికీ ప్రదర్శిస్తూ తెలుగు జాతిని ఇంకెప్పుడు ఏకం కానిస్తారు ? ప్రాచీనత వల్ల ఒరిగేదేం లేదు. అన్నీ కులాల్లో, అన్నీ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న నేటి తెలుగుకు  అభివృద్దికి నిధులు కావాలి !
          (గీటురాయి వారపత్రిక : 24-2-2006)

13, డిసెంబర్ 2012, గురువారం

తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

తెలిసి నడుచుకొమ్ము తెలుగుబిడ్డ - ఆకురాతి గోపాలకృష్ణ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రఖ్యాత హేతువాది,కవిశ్రీ ఆకురాతి గోపాలకృష్ణ గారు "తెలుగు అధికార భాష కావాలంటే.." ,"తెలుగు దేవ భాషే" పుస్తకాలలోని నాఆవేదనలూ, అభ్యర్ధనలూ ఈ శతకంలో కూర్చారు. 'తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ' 107 పద్యాల శతకం (16 పేజీలు) ముద్రించాము.దాని పిడిఎఫ్ ప్రతిని కోరినవారికి పంపిస్తున్నాను.nrahamthulla@gmail.com కు మీ మెయిల్ ఐ.డి. పంపండి.ఎవరికి వీలైన రీతిలో వారు ఈ శతకాన్ని ప్రచారంలోకి తెండి.కాపీరైట్లేమీ లేవు ,పెద్ద ఖర్చుకూడా కాదు గనుక పునర్ముద్రణలు చేయించండి.ఆకురాతి గోపాలకృష్ణ గారిని ఫోన్ చేసి అభినందించండి.ఫోను.9493513850. 1. పాలనాధికార పగ్గాలతో, పేద బ్రతుకు తెరవొసంగు బాటలన్ని ఒరులకిచ్చి వారికూడిగం సేతువా? తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 2. ప్రాచ్యభాష యెదిగి ప్రాంతీయ భాషకు ఊపిరంద నీక యుసురు తీసె మ్రింగి వేసెగా తిమింగ్ల రూపు దాల్చి తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 3. ప్రాణ వాయు వాంగ్ల భాషకే అందిస్తె మాతృభాష కింక మనుగడేది ? గొప్పదైన పాము కప్పను మ్రింగదా ? తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 4. కొంప పెత్తనమ్ము ఉంపుడు గత్తెకా ? ఎంత ధారుణమ్ము ? ఎంత తెగవు ? తల్లి సవతి యైన పిల్లల భవితేమి ? తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 5. పసి వయస్సులోనే పరభాష చొప్పించి లేత మెదడు మీద వాత లిడకు పులుల స్వారీ పగటి కలలు గావింపదా ? తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 6. అమ్మవడిని మాన్పి అతిచిన్న బిడ్డల సవతి కప్పగించి సాకమనిన గొప్ప సవతి ప్రేమ చెప్పు నాకింపదా? తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 7. మమత పుంజుకొన్న మమ్మీలు, డాడీలు కుమ్ముచుండే తల్లి రొమ్ము మీద ముద్దు సేయ దివిటీ మూతిని కాల్చదా? తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 8. తమిళము మలయాళ తల్లులకీనాడు బిడ్డలిచ్చుచున్న పెంపు చూడు తల్లిభాష నీకు తగనిదై పోయెనా? సొంత తల్లి పరువు సంతలో తీయకు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 9. పరుల భాష నెంత పాండిత్యమున్ననూ భావ వ్యక్తీకరణ భ్రష్టు గుండు అలవిగాని బండ తలకెత్తుకున్నట్లు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 10. అట్టహాసమైన ఆంగ్ల వక్తల మధ్య తెల్లబోయి మిగులు తెలుగు వక్త సానిడాబుగాంచి జంకేటి భార్యలా తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 11. యెల్ల వనరులున్న తల్లి భాషీనాడు బ్రతుకు యవని బ్రహ్మ రక్కసల్లె కానుపించు చుండ కాంక్షతో నేర్తురా? తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 12. దేశభాషలందు తెలుగు లెస్సన్నట్టి కృష్ణదేవరాయ కీర్తి శిఖలు అన్ని దిశల చాటి వన్నె కెక్కిన భాష తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 13. చరితయున్ను తగిన సాహిత్య ప్రాచీన ప్రతిభ కల్గినట్టి ప్రముఖ భాష! కన్న తెలుగు తల్లి ఉన్నతిని కాపాడు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 14. ఇంపు చేయవచ్చు కంప్యూటరందుండు అచ్చరాల బెడద ఖచ్చితముగ అలవికానిదంటు అన్వేషణకు లేదు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 15. ఉన్నలోపములను తిన్నగా సవరించి తల్లిభాష నున్నతముగ తీర్చి అప్పగింపవోయి అధికార పీఠాన్ని తెలివి తెచ్చుకోని తెలుగు బిడ్డ 16. దేశ భాషలందు తేజరిల్లిన తెలుగు వాసి తగ్గి ఆంగ్ల దాసి యయ్యె కుక్క వాత పడ్డ బక్క సింహం భంగి తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 17. ఆంగ్ల సంస్కృతాల నాలింగనం గొనీ సరకుగొనని తెలుగు సన్నగిల్లె కూరుచున్న కొమ్మ కూలిపోబోతోంది తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 18. అచ్చ తెలుగు వదలి ఆసంస్కృతంబునే మంత్రములకు వాడు తంత్రమేమి ? శ్రేష్టమైన వృత్తి చేజారుతుందనా ? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 19. తెలుగు దేశ బిడ్డ తెలుగు పండిత పోష్టు ఆంగ్ల భాషలోన ఆర్డరేసి అచ్చ తెనుగు వాణ్ణి బిచ్చమెత్తింతురా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 20. అన్యదేశమందు ఆంధ్రులిర్వురు కలువ మాత్రు భాష దాచి మసులు కొండ్రు మాటు దాచు కొనెడి మర్మాంగ జబ్బల్లే తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 21. ఆంధ్రభాష మనకు అధికారి యైయింత అన్నమిచ్చుననెడి ఆశయుండె ఆంగ్లమిచట జేరి అడియాశ జేసెరా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 22. అర్ధమవని భాష కధికార మందిస్తె బడుగు మూకనెల్ల పారద్రోలి కనక పీఠమందు శునకమై వర్ధిల్లు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 23. రూకలిచ్చు భాష కాకతో నేర్చేరు యేమి యివని దాని నేర్వరెవరు పాలు యివని పశు కబేళాల కర్పితం తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 24. మిసిమి కల్గు కవుల పసిడి పల్కుల తల్లి సిరుల రాజసమ్ము తరిగిపోయె తిరుమలేశు నగలు అరువు కేగిన రీతి తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 25. పేద తెలుగు వారు పిరియాదు లందిస్తె ఆంగ్లమందు తీర్పు లదరగొట్టు కోతి కాఫరైన కొబ్బరి కాయల్లె తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 26. స్వంత భాష నున్న సౌలభ్య మేనాడు అన్యభాషలందు అందబోదు తల్లిప్రేమ, మారు తల్లిలో దొరకునా ? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 27. ఆంగ్ల భాష సుంత అలవడినంతనే తెలుగు నీసడించు పులుగు లార యేరు దాటి తెప్ప నేల తగలేతురు ? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 28. వెర్రి తెలుగు కవికి యెర్ర పైసా కూడ రాల్చు దిక్కు లేదు రాష్ట్ర మందు తనదు రాతె తనకు తల కొర్వి యగుచుండె తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 29. ఇంచుమించుగా ప్రపంచ వ్యాప్తంబుగా పదునెనిమిది కోట్ల ప్రబలమైన సంతు యుండు తల్లి కింత అన్యాయమా ? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 30. అష్ట దిగ్గజాల హావభావాలతో కృష్ణ దేవరాయ కొలువులోని తెలుగు వైభవమ్ము తిరిగి మళ్ళొచ్చునా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 31. పొరుగు భాషతనకు భుక్తి కల్పించినా తనదు మాతృభాష దైన్య స్థితికి కఠిన ఆకురాయి కరిగి ఆక్రోశించె తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 32. తెలుగు ఉద్యమాన్ని తెగువతో చేపట్టి లౌక్యమౌ పధాన రహంతుల్లా గారు,బండి ముందు కరదీపికై నిలిచే (బండి ముందు నడుచు బంటు తానై నిలిచే) తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 33. అంటు వ్యాధి వోలె వ్యాపించి దేశాన ఆంగ్ల మోజు ప్రజల కంట గట్ట కాని వెంట్లు వెలసె కడగండ్ల ప్లాంట్లుగా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 34. తెలుగు నేల మీద తెలుగు బిడ్డే తెలుగు ఉచ్ఛరింప, పట్టి శిక్షవేయు బంటు పెత్తనమ్ము ఇంటి కెగ బ్రాకింది తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 35. మిసిమి కోలు పోయి పసిడి బాల్యంలోనె బండబారు తోంది భరత జాతి కానివెంట్లు జైళ్ళు, ఖైదీలె పిల్లలై తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 36. అమ్మ యనెడి తెలుగు కమ్మని పిలుపును మమ్మి వచ్చి చేరి మట్టు పెట్టె మేక వన్నె పులిని సాకిన ఫలమిది తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 37. పదవి నున్న వారు పలుకరు స్కూళ్ళ, ని ర్లక్ష్యమందు తెనుగు లైను దప్పె దిక్కు లేని శిశువు కుక్క పాలైనట్లు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 38. మొదటి తరగతందె ముదనష్ట పింగ్లీషు తెలుగు భాష గొంతు నులుముచుండె చంటి బిడ్డ కెపుడు చనుబాలె అమృతం. చంటిబిడ్డనెలుగుబంటి కందింతురా? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 38. చంటిబిడ్డ త్రాగు చనుబాలురా తెలుగు అమ్మ రొమ్ము విడచి ఆంగ్లమనెడి ఖరము చన్ను గుడుచు ఖర్మ పట్టింపకు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 39. ప్రధమ విద్య మాతృ భాష యందున్నపుడె గట్టి పడును బేసు మట్టమెపుడు పై తరగతులందె పరభాషలకు చోటు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 40. తెలుగు మీడియమ్ము తెలుగు విద్యార్ధులకు చదువు కొనుట కెంతో సౌఖ్యప్రదము ఇంపిత మగుదారి కంప కొట్టించారు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 41. గుండెలోని బాధ దండిగా వివరింప మాతృభాష యొకటె మహిని చెల్లు మనసు దోచు పండు మామిడే నన్నట్లు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 42. తెలుగు నేల మీద తిన్నగా జన్మించి తెలుగు పాలు త్రాగి తెలుగు తల్లి రొమ్ము మీద గుద్దు రోమియోగాకుమీ తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 43. పెద్ద భాష వచ్చి గద్దెపై కూర్చుంటె మాతృభాష నోట మన్ను పడును పక్షి గూటి లోకి పాము జొర పడ్డట్లె తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 44. వొరుల కిచ్చి పొలము వారి వద్దే కూలి చేయబోవు టెంత హేయ కరము ఆంగ్ల ఆదిపత్యమటువంటిదే గురూ తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 45. ఇరుగు పొరుగు భాష కిస్తున్న గౌరవం తెలుగు కివ్వ రేమి తెగులొ యనకు పేద కన్నిచోట్ల వేదనే యెదురగు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 46. విధినెరింగి నేటి అధికార గణమంత ఆంగ్ల భేషజాన్ని అట్టె వదిలి తెలుగు ఉచ్చరిస్తె తిరిగి రాదా గతము తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 47. అమెరికాకు బోవు ఆ నల్గురి కొరకు ఆంగ్ల బండ నెత్తిరందరికిని ఉత్త సూది కొరకు ఎత్తకు దూలాన్ని తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 48. పరుగు లెత్తి యచట పాలు ద్రావే కంటె నిలబడింట త్రాగు నీరు మేలు అమెరికాల కేగి యగ చాట్లు పడ నేల (అమెరికా ఉపాధి హైక్లాసు బెగ్గింగు) తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 49. చదువు చక్కనైన సంస్కార లావణ్య అందమైన తెలుగు ఆడపిల్ల కన్ని యుండె, యిప్పు డయిదవ తన మివ్వు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 50. సర్వమతము లందు సామూహ ప్రార్ధనల్ స్వీయ భాషలందు చేయరేల దేవుడితరభాష తెలియని మూర్ఖుడా ? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 51. ఆంధ్రముస్లిములను అరబి ఆకర్షించె సంస్కృతమ్ము తెలుగు జాతి నొంచె బల్లి యొడిసి పట్టు బలహీన జీవులన్ తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 52. రక్తి చూపకుంటె ముక్తి సున్నాయంచు భక్త తతికి త్రొక్కి పట్టి నేర్పు మౌఢ్యమతపు భాష మర్మంబు తెలుసుకో తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 53. శాస్త్ర యుక్తమైన సంస్కృతమేనాడో తెలుగు భాష మీద తిష్ట వేసి కొలువు తీరినట్టి గోముఖ వ్యాఘ్రహం తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 54. వేల యేండ్ల నుండి విలువైన గ్రామీణ పారిభాషికాల పట్టరైరి ఎక్కడున్న గొంగళక్కడే నన్నట్లు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 55. మాతృభాష తోనె మహనీయుడైనట్టి సత్య సాయి గొప్ప చరిత చూడు నేల విడిచి సాము మేలు కాదెన్నటికి తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 56. లోటు పాటులుంటె నీటుగా సవరించి పాటు చేసి తెలుగు మీట నొక్కు ఎలుకలున్న వంచు యిల్లు తగలేతుమా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 57. A,B లు C,D లు, యే శివాజీకొచ్చు? ఆంధ్ర భోజుకేమి ఆంగ్లమొచ్చు? ఆంగ్ల కోడిలేక అవని తెల్లారునా? కోడికూయకుంటె కొంప తెల్లారదా? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 58. జన్మమిచ్చినట్టి జననిగా వేనోళ్ళ పొగడగానె తల్లి దిగులు పోదు పూజసేయ గోవు పుష్టికి నోచునా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 59. భక్తి మహిమ పెంచు భారతం రామాయ ణాది కావ్యధారలందు తడిసి తెలుగు నేలలందు వెలుగు లీనిన భాష తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 60. బడుగు భాష యనుచు బాణాలు సంధించి తెనుగు తల్లి యుసురు తీయబోకు నిందమోపి సతిని బొందపెట్టిన రీతి తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 61. చిన్న చూపదేల చీదరింపదియేల? తెలుగు తల్లి మీద ద్వేషమేల? ఆంగ్లకోటు దాల్చి అధికుడ ననుకోకు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 62. మాతృభాష నొదిలి మరియొక భాషపై కాలుమోపు వాడు కలత చెందు నాటు పడవ నొదిలి ఓటి పడవెక్కకు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 63. చిన్నతనము నందె కన్నతల్లిని వీడి అన్యదేశవాస ఆంధ్రులంత తెలుగు దైన్యస్ధితికి దిగ్బ్రాంతి చెందేరు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 64. అర్ధమవని భాష అధికార మందుంటె అనువదించి తెల్పు అల్పులైన మాయ మోసగాళ్ళు మనకొంప ముంచరా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 65. పాలనాధికార పగ్గాలు చేపట్టి సాటిభాష లన్ని సాగు చుండ తల్లి తెలుగు భాష దాస్యమే విడదాయె తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 66. సకలమైన యితర జాతి పదాలతో సంకరించె నన్న శంక పడకు యెట్టిదైన పిల్లి యెలుకను పట్టేను తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 67. రాజపీఠమందు రంజిల్లు భాషకు మతపు భాషలకును క్షతియులేదు ప్రాణ హానియెపుడు ప్రాంతీయభాషకే తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 68. వట్టిమాట లంటు కొట్టిపారేయక పట్టుతోడ బుద్ది పదును చూపి మేలు చేయు భాష నేలిక చేసుకో తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 69. వచ్చి రాని ఆంగ్ల భాషతో కుస్తీలు పట్టు లెక్చరర్ల బాధచూడు నక్కలకును ద్రాక్ష నిక్కితే అందునా ? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 70. మాతృదేశ ప్రేమ మరువకు మరువకు మాతృభాష ప్రతిభ మబ్బువీడి వెల్లివిరిసి నపుడె యిల్లు స్వర్గంబురా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 71. దేశమేమొ తెలుగు దేశీయులు తెలుగు అమలు చేయు వారలంత తెలుగు ఆంగ్ల భాషకేల అధికార పీఠమ్ము? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 72. ప్రజల నోళ్ల నుండు భాషోన్నతిన్ పొందు ప్రజకు దూరమైన భాష చచ్చు తైలమిడని దివ్వె తిన్నగా కొండెక్కు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 73. ఒరుల గొప్ప చూచి పరవశించుట మాని స్వంత జాతి ప్రతిభ చాటనెంచు కుంటి యైన కూడ యింటి బిడ్డే మేలు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 74. ఆంగ్ల భాషయేమొ అసలు నేర్వను రాదు తెలుగు చదవ బ్రతుకు తెరవు లేదు సొంత కూడు పాయె బంతి కూడూ పాయె తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 75. ఆలయాల పూజ కర్హత లేదని తెలుగు మంత్రములకు విలువ నివరు తెలుగు రాని వాడు దేవుడెట్లాయెనో తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 76. కామధేను వంటి కమ్మని తెలుగుండ ఇంగిలీషు నెత్తి కెత్తుకోకు గంగి గోవు నొదిలి గాడిద కొలువట్లు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 77. బానిసత్వమందు బ్రతికిన జాతికి తగ్గదాయె మోజు దాస్యమందు పోదు బిడ్డతోనె, పురిటి కంపన్నట్లు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 78. ఆంగ్ల భాష మీద అభిమానమున్ బెంచి తెలుగును విడనాడు తెగువ యేల ? ఆలి దొరకెనంచు అమ్మను చంపకు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 79. తేనె లొలుకు నట్టి తెలుగును విడనాడి గొంతు దిగని ఆంగ్ల చింతయేల? అక్షయమ్మునొదలి భిక్షెత్తు కొన్నట్లు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 80. లిపిని సంస్కరించి అపర వజ్రమ్ముగా తీర్చి దిద్ది చూడు తెలుగు భాష రాజ పీఠమునకె తేజస్సు నివ్వగా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 81. ఇళ్ళలో యింగ్లీషు బళ్ళలో యింగ్లీషు తల్లి భాష విలువ తరుగుతోంది చుప్పనాతి ప్రభుత చోద్యం చూస్తోంది తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 82. కంటిపాప వోలె కాపాడగల బిడ్డ ఎరరుగనట్లు తల్లి నే మరిస్తే మాతృ మూర్తి కింక మరణమే శరణమ్ము తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 83. స్వంత తల్లి నగలు, సవతికి అందించి బాధపెట్టు సుతులు బ్రతుకనేల మాతృభాష ద్రోహ మట్టిదేయగుజుమి తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 84. బలసినట్టి భాష, బలహీనమగు దాని యిట్టె మింగి వేసి గుట్ట గూల్చు తెలుగు భాష కిట్టి స్థితిని రానీయకు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 85. ఆంధ్ర ప్రభుత తెలుగు కంగీకరించినా పెక్కు ఆఫీసర్లు లెక్క గొనరు పారునీళ్ళ కెపుడు పాచి తెగులన్నట్లు (దైవ ఆజ్నకైన దారివరు పూజార్లు ) తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 86. తెగులుపట్టినట్టి తెలుగు బిడ్డల్లోని అంతరించినపుడె ఆంగ్లతిక్క మాతృభాష కొచ్చు మంచి రోజానాడు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 87. ఇళ్ల లోనె కాదు బళ్లలో గుళ్లలో కోర్టులందు ప్రజల హార్టులందు చోటు గొన్న భాష సుస్థిరమై నిలుచు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 88. ఆంగ్లముండు వారి కన్ని ఉద్యోగాలు తెలుగు భాష కింక విలువ యేది అద్దె వాడికిల్లు అసలు వాడికి నిల్లు (బంటుకు విలువిస్తే బాసును మ్రింగడా?) తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 89. లోకమార్పు తోడ పోకడలు మారాలి మారనట్టి దెల్ల మరణ మందు తెలుగు తల్లి కట్టి స్ధితిని పట్టింపకు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 90. కొన్ని కోట్ల ప్రజలు ఎన్నో తరంబులు కూర్చుకున్న భాష కూలెనంటె భాషతోడ జాతి భవిత మరణింపదా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 91. ఆంద్ర భాషకంటె ఆంగ్లమే మేలైతే చదివి నీవె అందు చతురు డగుము ఆంగ్ల గజ్జి తెచ్చి అందరికి పుల్మకు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 92. తెలుగు వేషధరణ తెలుగు వేదికలందె వేదికలను దాటి వెలికిరాదు ఆంగ్లమైక మందె ఆఫీసు గణముండు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 93. అసలు చిత్త శుద్ది ఆఫీసరందుంటే తెలుగు కూడ మంచి స్ధితి గడించు మెత్తగుంటె రౌతు నర్తించు గుర్రాలు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 94. విలువ తరిగినట్టి తెలుగు మీడియాన్ని యెంచుకున్నవాడు కించవడును యేమిటీ పరీక్ష యెన్నాళ్ళు ఈశిక్ష? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 95. అరచి పిలుచుచుండిరక్బరు ననుకొంటి అల్లాహో అకబరు అని వచింప అర్ధమవని భాష తర్జుమా యిట్లుండు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 96. పట్టి మతములన్ని పల్కించు ప్రార్ధనల్ వారి భాషలోనే బూరడించు అర్ధమవని గోష వ్యర్ధ ప్రయాసరా తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 97. సకల మతములందు సమభావ దృష్టితో తెనుగు భాష యున్నతికి తపించు రహంతుల్లా గారి తహతహను గుర్తించి తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 98. బడుగు తెలుగు భాష పాలింప యోగ్యమా సాద్యమెట్టులనకు చవట వోలె నూర్ బాషా గారి తీరుగని నేర్చుకో తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 99. అరయ యూనికోడు కందరూ క్రమముగా మారి మాతృభాష మనుగడకును సహకరించినపుడె సంపూర్ణ సమృద్ది తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 100. కన్నతల్లి కింత గంజి పోయుట మాని సానికొంప మరిగి చంపజూచు బిడ్డలున్న పురిటి గడ్డ కాదీ భూమి తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 101. పూర్వరాజసాన పుట్టి పెరిగిన భాష ప్రజలు రేబవళ్ళు పలుకు భాష కవుల గంటమందు కదం త్రొక్కిన భాష తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 102. ఆంద్రదేశ రాజ అధికార పీఠాన తెలుగు తల్లి పఠిమ తీర్చి దిద్ది నిలుపకల్గు వరకు నిద్రపోరాదని తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 103. పరుల పాలనమ్ము పనికి రాదంటి మే వారి తోక (భాష) పట్టి వదల రేమి? ఊడిగమ్ము కింత ఉబలాటమెందుకో ? తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 104.ఉట్టికెక్కనమ్మ ఉరుకునా స్వర్గాని కనుప్రచార దోరణనుసరించి కన్నతల్లి పరువు గంగలో కలుపకు తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 105.దేశ భాషలందు దేదీప్యమానమై వెలుగునిచ్చినట్టి తెలుగు దివ్వె ఆంగ్లహోరులోన ఆరిపోబోతోంది తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ || 107.ఐక్యరాజ్యసమితి అల్పాయు భాషల్లో తెలుగు చేరెనంచు తేల్చి చెప్పె కళ్ళు తెరవకుంటె ఇల్లు కొల్లేరగును తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||