27, ఏప్రిల్ 2018, శుక్రవారం

జనభాషకే జేజేలు


జనభాషకే జేజేలు (ఆంధ్రప్రభ  29.11.2017)
మాటకు వాడుక గదా ప్రాణము ?
తెలుగు వారి కున్నంత పరభాషా సహనం, ఈ దేశంలో మరెవరికీలేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సహనం వలనే అనేక పరభాషా పదాలు తెలుగులోకివచ్చి స్థిరపడి దాని స్వంతమే అన్నట్లయిపోయాయి. అచ్చ తెలుగులో మాట్లాడబూనటం సాహసకార్యమే.గిడుగువారు ఇలా అన్నారు. ''పండితులు పుస్తకాలు ఏ భాషలో వ్రాసినా శాస్త్రాలు ఎలాగు కల్పించుకున్నా లౌకిక భాషను నిర్మూలము చేయలేరు. అది వారి నోట్లోనే కాపురముంటుంది. నాలుక మీద నెక్కి నాట్యమాడుతూ ఉంటుంది. సలక్షణముగా వృద్ధి పొందుతుంది.''తెలుగులో మిళతమైపోయిన ఉర్దూ ఆంగ్ల పదాలను పండితులు పుస్తకాల్లోంచి ఏరి పారవేయవచ్చు గాని జనం నోళ్ళలోంచి తీయలేరు.

లోకయాత్ర కొరకు లౌకిక భాషలు
పుట్టి ప్రజల నోట పొంది యుండు
జీవలోక మందు జీవించు భాషలు
జనుల తలపు దెలుపు సాధనములు.

మాల మాటయేని మాదిగ మాటేని
నాటిదేని గాక నేటిదేని
ఈడదైన నేమి యాడదైనను నేమి
ఏడదైన జెల్లు వాడికయిన

వాడిక గద మాట ప్రాణంబు మానంబు
వాడనట్టి మాట పాడువడును
చెల్లుబడిని బట్టి చేకొండ్రు లోకులు
మాడలైన కవుల మాటలైన

లోక సిద్ధమైన లౌకిక పదములు
సార్థకంబు లెల్ల జనుల కగును
మాసినట్టి మాట మరి మరి పరికింప
కోశమందెతెలియు కోవిదులకె.

పుస్తకాల లోన ప్రుచ్చిన మాటలు
ప్రాతలైన వాని ద్రవ్వి యెత్తి
నేడు ఎల్లవారు వాడ గావలెనన్న
గొంతు కడ్డపడదె క్రొత్త మాట? ---- గిడుగు బాలకవి శరణ్యము

ప్రపంచంలో ప్రతి ఏటా ఎన్నో భాషలు రక్షించే దిక్కులేక నశిస్తున్నాయి.వాటిలో తెలుగు కూడా త్వరలో చేరకూడదు.ఆంగ్లేయులు ఎన్ని ఎత్తులువేసి తమ భాషను బలిపీస్తున్నారో అందులో శతశాతం అన్నా తెలుగు వాళ్ళు కృషి చెయ్యాలి. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్లు ఈ ప్రపంచంలో ఎన్నో దిక్కుమాలిన భాషలకు ఇంగ్లిషే దిక్కయింది.అవసరం అలాగా వచ్చింది మరి .

బడి, గుడి, తీర్పు ఈ మూడూ ఇంగ్లీషులో నడిచేలా ఆంగ్లేయులు ముందు తమ దేశంలో అమలు చేశారు. తరువాత ఇతర దేశాల మీద పడ్డారు. భాష విషయంలో ఇంగ్లీషులో వాళ్ళు ఇంటగెలిచాకే రచ్చ గెలిచారు. తెలుగు వాళ్ళతో పాటు మరెన్నో భాషల వాళ్ళు ఇంట గెలవలేదు. తమ బడుల్ని, గుడుల్ని, తమ తీర్పుల్నీ తమ భాషల్లోకి తెచ్చుకోలేదు. అందుకే వారివి ఆంగ్ల పాలిత ప్రదేశా లుగా మారిపోయాయి.

మాతృభాష అంటే పసిపిల్ల వాడికి తల్లి ఉగ్గుపాలతో పాటు రంగరించి పోసే భాష. మవ్మిూ,డాడీ,ఆంటీ,అంకుల్‌,బ్యాగు,బుక్కు,స్లేట్‌పెన్సిల్‌ లాంటి మాటలు తెలుగు తల్లులు తమ పిల్లలకు రంగరించి పోస్తున్నారు. బయట స్కూలు, ఆఫీసు, మార్కెట్టు, కోర్టుల్లో ఎన్నెన్నో ఆంగ్ల పదాలు ఎడతెరిపి లేకుండా వాడుతున్నారు. మాటకు వాడుకే గదా ప్రాణం? వాడకం అంతా ఆంగ్లపదాల్లో జరుగుతూఉంటే తెలుగు గ్రంథానికి పరిమితమై పోయింది. కవులు, సాహితీవేత్తలు మాత్రమే భాష గురించి బాధ పడుతున్నారు. పాలక భాషకు ఉండవలసినంత పదసంపద ఎన్నేళ్లు గడిచినా సమకూర్చలేక పోతున్నారు. అనువాదకులు తేటతెలుగుకు బదులు సంస్కృతం వాడి భయపెడుతున్నారు. కాలగమనంలో కొత్త కొత్త ఆంగ్లపదాలే మనకు అబ్బు తున్నాయిగానీ, కొత్త తెలుగు పదాలుగానీ, పాతవేగాని కొత్తగా వాడకంలోకి రావడం లేదు.

వేలాది ఆంగ్ల పదాలు మన తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ, మన పదాలే అన్నంతగా స్థిరపడిపోయాయి. ఈ పదాలను విడిచిపెట్టి మనం తెలుగులో సంభాషణ చేయలేము. చేసినా ప్రజలకు అర్ధంగాదు. ఉర్ధూ, సంస్కృత,ఆంగ్ల పదాలెన్నింటినో తెలుగు తనలో కలుపుకుంది. అలాగే తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది.వాడుక పదాల సంపద భాషకు జీవమిస్తుంది. అవి పరభాషపదాలు కూడా కావచ్చు. మనం తెలుగును సరిగా నేర్చుకోక ముందే మనకు ఇంగ్లీషు నేర్పారు. వందలాది ఏళ్ళు మనం ఇంగ్లీషును గత్యంతరం లేక హద్దు విూరి వాడినందు వల్ల, అది మన భాషాపదాలను కబళించి తానే తెలుగై మనలో కూర్చుంది. మన ఆత్మలను వశం చేసుకుంది. ఇకఇప్పుడు ఈ ఇంగ్లీషు పదాలను నిర్మూలించడం మన తరం కాదు. వాటిని మన పదాలుగా అంగీకరించడమే మంచిది. ఏఏటికాయేడు మన నిఘంటువుకి పదసంపద సమకూర్చాలి .

నిఘంటువులలో వాడుక భాష పదసంపద పెరగాలి - వాడుకభాష లోకి చట్టాలు మారాలి
మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష. రెండు భాషల ప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవ గాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి.ఉర్దూ-తెలుగు నిఘంటువు, ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు ఎక్కడా అమ్మకానికి దొరకడంలేదు. ముద్రించాల్సిన అవసరంఉంది. ముషాయిరాల కంటే ముఖ్యమైన తెలుగు-ఉర్దూ, ఉర్దూ తెలుగు నిఘంటువులు కావాలి. వక్ఫ్‌బోర్డు నిఖా నామాలు (వివాహ ధ్రువపత్రాలు) తెలుగు భాషలో కూడా ప్రచురించాలి. తెలుగు జాతీయలూ, నుడికారాలూ, పదబంధాలూకూర్చిన నిఘంటువుల అవసరంఉంది.ఆన్‌లెన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగాఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి. వాడుక భాషలో నానా భాషలూ కలగాపులగంగా ఉంటాయి.అయితే అవన్నీ ప్రజలకు బాగా అర్ధమౌతాయి.పరభాషా పదాలనే కారణంతో ఇప్పుడు తెలుగు వాడకంలోంచి సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ పదాలను తీసివేయకూడదు,తీసివేయలేము.ఎందుకంటే అవి మనభాషలో అంతర్భాగాలై పోయాయి. అక్కరలేని ఆపరేషన్ ఎవరు చేయించుకుంటారు? చేసినా గాయాలవడం తప్ప మరే మేలూ కలుగదు. అందువలన ఈ సంకర తెలుగు భాషలోనే ఆఫీసుల్లో ఫైళ్ళు నడిపితే అదే పదివేలుగా భావించాలి.
ఛాందసవాదులు- వాళ్ళు చెయ్యరు, ఇంకొకళ్ళను చేయనివ్వరు. ఒకవేళ ఈ పనిని వాళ్ళకప్పజెబితే ఎవరికీ అర్థంగాకుండా పాడుచేస్తారు. ప్రజలు ఇంతకంటే ఇంగ్లీషే నయమని వాపోయేలా చేస్తారు. మన శాసన సభలో ఎమ్మెల్యేలు ఈ మూడు భాషల పదాలు కలగలిపి మనోరంజకంగా మాట్లాడుతున్నారు. అదే నేటి తెలుగు, వాడుక తెలుగు. వారు అడిగింది అడిగినట్లు తెలుగు లిపితో సాగదనుకుంటే ఆంగ్లలిపినే వాడుకోండి. మన మాటముఖ్యం. వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు మాట్లాడుతున్నది మనప్రజలభాష. ఆభాషలో,యాసలోజీవోలురావాలి. అప్పుడేతెలుగుఅధికారభాషగావిరాజిల్లుతుంది.వేలాది పరభాషా పదాలను ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఇంగ్లీషువాళ్ళు కలుపుకుంటూ రావటానికి కారణం ఏమిటి? ఆంగ్లేతర భాషా పదాలను తమ ఆంగ్ల నిఘంటువులలోకి చేర్చుకోటానికి ఆంగ్లేయులు ఏమాత్రం సిగ్గుపడలేదు. ఒకవైపు తమ భాషను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తూనే,అన్నీ ఇతర భాష ల్లో బాగా ప్రాచుర్యం పొందిన వాడుక పదాలను తమ నిఘంటువుల్లోకి తీసుకొని తమ పద సంపద పెంచుకున్నారు. సామాన్య తెలుగు జనం ఈ పని ఏనాటినుండో చేస్తున్నారు. తెలుగు నిఘంటు కర్తలు కూడా ఆలోచించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి