27, జులై 2014, ఆదివారం

ప్రాంతీయ భాషలు చచ్చిపోవాలా?


  ప్రాంతీయ  భాషలు చచ్చిపోవాలా?


నూర్ బాషా రహంతుల్లా 9948878833


మన దేశం భిన్న భాషలు, సంస్కృతులు గల దేశం. దేశ పాలనా నిర్వహణలో అన్ని ప్రాంతాల వారికీ ,అన్నీ  భాషల వారికీ చోటివ్వాలి. గ్రామీణ అభ్యర్ధులకు అన్యాయం కలిగేలా, కార్పొరేట్ విద్యాలయాల్లో ఆంగ్లమో,హిందీనో చదువుకున్నవారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా  ప్రక్రియ సాగకూడదు. సివిల్ సర్వీసులకు ఎంపికయ్యేవారిలో  ఇంగ్లిష్ ప్రావీణ్యం అడుగంటుతున్నదని ‘కాలం చెల్లిన విధానాలకు’ స్వస్తిపలుకుతున్నామని యూపీఎస్సీ కుంటిసాకులు చెబుతున్నది . ఇంగ్లిష్‌లో ప్రావీణ్యమే అభ్యర్థి జయా పజయాలను నిర్ణయించే స్థితి కల్పిస్తోంది. ఐ.ఏ.యస్. లు పనిచేయాల్సింది అమెరికాలో కాదు.మన  దేశంలోనే, వ్యవహరించాల్సిందీ ఈ దేశ ప్రజలతోనే.ఇంగ్లిష్ పరి జ్ఞానంకన్నా సమస్యలను గుర్తించడంలో, వాటికి పరిష్కారాలను వెదకడంలో,ప్రజానీకానికి మేలు చేకూర్చడంలో వారికి ఉండే సమర్ధతను పరీక్షించాలి. వారిలో సమయస్ఫూర్తి, చొరవ, హేతుబద్ధత, అంకితభావం, దృఢ సంకల్పం, నైతికవర్తన వంటివి ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయాలి.యూపీఎస్సీ హిందీకి ఇంగ్లిష్‌కు పెద్దపీట వేస్తున్నది. పరీక్షను ప్రాంతీయ భాషలో రాయొచ్చంటున్నారుగానీ ప్రశ్నపత్రాన్ని మాత్రం ఇంగ్లిష్ లేదా హిందీలో ఇస్తున్నారు.ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానంపై కఠిన పరీక్ష పెడుతోంది.
 
1979 కి ముందు ధనవంతులు, ఉన్నత వర్గాలవారికే సివిల్‌ సర్వీసెస్‌ అందుబాటులో ఉండేవి. ప్రాంతీయ భాషల్లోనూ సివిల్స్‌ రాయడానికి 1979లో అవకాశం కల్పించినప్పటి నుంచి భారతదేశ భాషలన్నిటికీ ప్రాతినిధ్యం దక్కింది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షల్ని రాజ్యాంగం గుర్తించిన 22  భాషల్లో నిర్వహిస్తున్నారు.తెలుగు మాధ్యమంలో యూపీఎస్సీ స్థాయి పుస్తకాలు లేవు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన తెలుగు అభ్యర్థులు పోటీ పడలేకపోతున్నారు. 2013లో తెలుగు మాధ్యమ అభ్యర్థి ఒక్కరైనా విజయం సాధించలేదు. రెండు మూడుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లిన తెలుగు మాధ్యమం అభ్యర్థులు 2013 ప్రాథమిక పరీక్షలోనే తప్పారు. 2012 ఆగస్టులో నిగ్వేకర్‌ కమిటీ సీశాట్‌ పేపర్‌వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందని స్పష్టీకరించింది.
పనిభారం ఎక్కువైనందువల్ల  రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషల్లో పరీక్షలు  నిర్వహించలేక ప్రాంతీయ భాషల్లో పరీక్షలకు హాజరయ్యే గ్రామీణ అభ్యర్థులను దెబ్బతీసిందట .ఆంగ్ల మాధ్యమంలో వృత్తివిద్య అభ్యసించేవారితో గ్రామీణ అభ్యర్థులు పోటీపడలేక ప్రాంతీయ భాషల అభ్యర్థులు పరీక్షలకు శాశ్వతంగా దూరమయితే తమకు పనిభారం తగ్గిపోతుందన్నది యూపీఎస్సీ దురాలోచన.
ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఉండాలని కోరడం ఆయా రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. సివిల్‌ సర్వీసు అధికారులు ఉత్తరప్రత్యుత్తరాలను ఇంగ్లిష్‌లోనే సాగించాలి కాబట్టి ఇంగ్లిష్‌ భాషపై పట్టులేని అభ్యర్థులు అక్కరలేదనే పద్ధతిలో పరీక్షలు రూపొందించారు. ఇంగ్లిషు,హిందీ అసలు రాని అన్నాదురై ,ఆంధ్ర బోజుడుగా పేరెన్నికగన్న శ్రీకృష్ణ దేవరాయలు,మొఘల్‌ చక్రవర్తుల్లో అత్యుత్తమ పాలకుడిగా చరిత్రలో నిలిచిన అక్బర్‌, మైసూరు మహారాజు హైదర్‌ అలీ ఏమీ చదువుకోకపోయినా సమర్థులైన పాలనాదక్షులుగా గణుతికెక్కారు.ప్రజాప్రతినిధులకు తప్పనిసరికాని ఆంగ్ల భాషా ప్రావీణ్యత సివిల్‌ సర్వెంట్లకు మాత్రం ఎందుకు?విదేశీ ఇంగ్లిష్‌ కోసం దేశీయ భాషలను అణగదొక్కడం అన్యాయం.
వాస్తవానికి తెలుగుతో పాటు రాజ్యాంగం గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషల్లో సివిల్స్ మెయిన్ పరీక్షలు రాయటానికి వీల్లేదనే నిర్ణయాన్ని 2013 లోనే ప్రభుత్వం రద్దు చేసింది.రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తింపు పొందిన అన్ని ప్రాంతీయ భాషల్లో సివిల్స్ మెయిన్ పరీక్షలు రాయవచ్చని ప్రకటించింది. కనీసం 25మంది విద్యార్థులు ఉంటే తప్ప ప్రాంతీయ భాషలో పరీక్ష నిర్వహించటం జరగదన్న నిబంధనను రద్దు చేశారు. అదేవిధంగా అభ్యర్థులు ఏ భాషలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారో అదే భాషలో సివిల్స్ మెయిన్ పరీక్షలు రాయాలన్న నిబంధన కూడా వర్తించబోదని స్పష్టం చేశారు. ఇంగ్లీష్‌లో 100 మార్కుల వ్యాసరచనను ఉపసంహరించారు.
సి శాట్ అంటే సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనే ప్రాథమిక పరీక్ష .ఈ పరీక్షలో పాస్ అవ్వాలంటే ఇంగ్లిష్ బాగా వచ్చి ఉండాలి. మెయిన్ పరీక్షలు హిందీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి.తెలుగు జ్నానాన్ని ఏ దశలోనూ పరీక్షించరు. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీషు, హిందీలో మాత్రమే ఇస్తున్నారు. తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రం ఉండదు. ఇంగ్లీషులోనే ప్రశ్నపత్రాన్ని చదివి, అర్థం చేసుకుని పరీక్ష రాయాల్సిందే. హిందీ రాష్ట్రాల విద్యార్థులకు ఈ సమస్య లేదు.

తెలుగు అభ్యర్థులు ఇంగ్లీషునో హిందీనో ఆశ్రయించక తప్పని పరిస్తితి దాపురించింది. ప్రాంతీయ అభ్యర్ధులు ఎవరూ తమ తమ మాతృభాషల్లో పరీక్షలు స్వేచ్ఛగా రాయలేని పరిస్థితిని కల్పించారు.ప్రశ్నా పత్రాలను ఎలా ఇచ్చినా ఎన్ని మార్పులు చేసినా అవి ఆయా ప్రాంతీయ భాషల్లో ఉంటే మిగతా భాషల వాళ్ళు హిందీ వాళ్ళతో సమానంగా పోటీపడి నెగ్గుతారు. తెలుగు విద్యార్థులు పోటీలో నిలదొక్కుకోవాలంటే  తెలుగులోనే  ప్రశ్నాపత్రం ఉండాలి. తెలుగులో పరీక్ష రాసేందుకు 1979 నుంచి ఉన్న అవకాశం ఇప్పుడు ఎందుకు తీసేయాలి? ఇది హిందీ దురభిమానం కాదా?హిందీలో ఉన్నట్లే తెలుగులో ప్రశ్నాపత్రం ఎందుకు ఉండకూడదు? భారతదేశం అంటే హిందీ దేశమా? అనేక భాషలున్న దేశమా?

డిగ్రీ తెలుగులో చదవాలి
ప్రాంతీయ భాషలో తగిన అవగాహన లేకున్నా ఆంగ్లం/హిందీ  ద్వారా కీలక స్థానాలను దక్కించుకునే పరిస్థితే ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆంగ్ల భాషా పరి జ్ఞానాన్ని ర్యాంకుకు పరిగణనలోనికి తీసుకుంటున్నారు. తెలుగు భాషా జ్ఞాన పరీక్షను పూర్తిగా తొలగించారు. ఇక తెలుగు నేర్చుకోవాలనే ప్రోత్సాహకాలు ఏమీ లేవు . ఇలా ప్రాంతీయ భాషలవాళ్ళను పొమ్మనకుండా పొగ బెట్టారు. యూపీఎస్సీ తాజాగా కొత్త నిబంధన ఒకటి పెట్టింది.దాని ప్రకారం డిగ్రీని తెలుగులో చదివితేనే మెయిన్స్ ను తెలుగులో రాసేందుకు అర్హత లభిస్తుంది. అదికూడా 25 మంది ఉంటేనే తెలుగులో పరీక్షలు రాసే సెంటర్ పెడతారట.విద్యా పరంగా  తెలుగు అభివృద్ధి చెందాలంటే ఒక రకంగా ఇది మంచి నిర్ణయమే.అయితే రాష్ట్రం దానిని అందిపుచ్చుకొని ముందుకెళ్ళాలి. ఎలాగంటే పూర్వం మన ఏపీపీయస్సీ తెలుగులో డిగ్రీ చేసినవారికి గ్రూప్ 1,2 పరీక్షల్లో 5 శాతం  ప్రోత్సాహక మార్కులు ప్రధానం చేసింది.ఆ ప్రోత్సాహక మార్కులు మళ్ళీ ఇమ్మని మనం కోరుతున్నాం.అలాగే ఇంగ్లీషు మీడియంలో డిగ్రీ చేసిన వాళ్ళు కోర్టుకు పోయి ఆ ప్రోత్సాహక మార్కుల్ని రద్దు చేయించుకున్నారు గానీ మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది.ఈసారి ఎవరూ కోర్టుకు వెళ్ళలేని పద్ధతిలో చట్టం తెచ్చే యోచన చేస్తోంది.పరీక్షలు ప్రాంతీయ భాషల్లో జరపాలని కోరే ప్రజలు ప్రాంతీయ భాషల్లోనే చదవాలి.పట్టుమని పాతికమందికూడా లేని చోట్ల పరీక్షా కేంద్రం ఎలా పెడతారు?ఏ లాభంలేని చదువును ఎవరు చదువుతారు?తెలుగు పదికాలాలపాటు బ్రతకాలంటే తెలుగులో చదివేవాళ్ళ సంఖ్య పెరగాలి.ప్రాంతీయ భాషల్లో డిగ్రీ చదువు  నిర్బంధం చేస్తేనే ఆ భాషలు బ్రతుకుతాయి.ఇది ఖచ్చితంగా అమలు చెయ్యాలి.

అయితే ఇంగ్లీషు,హిందీలు మాత్రమే అనేక మినహాయింపులను పొందటం వింతగా ఉంది.అడుగడుగునా బాషా వివక్ష కనబడుతోంది.డిగ్రీ హిందీ మీడియంలో చదివినవారే  హిందీ సబ్జెక్టుకు అర్హులు అని నిర్దేశించలేదు.  తెలుగుకు పెట్టిన ఆంక్షలే ఆంగ్లం/హిందీలకూ పెట్టాలి.దేశవ్యాప్తంగా ఆంగ్లం, హిందీ భాషలను బలవంతంగా రుద్దుతున్నారు. ప్రాంతీయ భాషల్లో పరిపాలన లేదు.పరిచయం లేని తెలియని భాషలో పాలన సాగిపోతోంది. తల్లి భాష గొంతు నులిమేందుకు రాష్ట్రాలూ సిద్ధమేనని వాపోయేవారు చిత్తశుద్ధితో ఈ మార్పుకు సిద్ధపడాలి.ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత కోర్సులు కూడా తెలుగులో రావాలి. అప్పుడు  ఆంగ్ల మాధ్యమంలో చదవకపోయినా  పూర్తిగా తెలుగులోనే  సివిల్స్‌ రాయొచ్చు.ఇంగ్లీషుకున్న వెయిటేజిని  తెలుగుకు కూడా కల్పింఛాలి.తెలుగు రాని అధికారులతో తెలుగులో పాలన అమలుకాదు.తెలుగు మన రాష్ట్రం లో అదికార భాష.పరిపాలనా నిర్వహణ  ఉత్తర ప్రత్యుత్తరాలు  తెలుగు లోనే జరగాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలన్నిటిలోను తెలుగు తప్పనిసరి.ఏ రాష్ట్రంలోనైనా  ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఆ రాష్ట్ర మాతృభాషలో యోగ్యతా పరీక్షలో కనీస మార్కులు పొందాలి. మన రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించటానికి తెలుగు రానక్కరలేదు. తెలుగు చదవటం రాయటం రాకున్నా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. మన పాఠశాలల్లో, కళాశాలలో కూడా తెలుగు ప్రథమ భాష కాదు - ద్వితీయ భాష. తెలుగు స్థానంలో మరొక భాష తీసుకోవచ్చు.తెలుగు ఐచ్చికం మాత్రమే.ఆంగ్ల భాషా సామర్ద్యం మాత్రం అందరికి తప్పనిసరి.అందరూ కలిసి తెలుగును అట్టడుగుకు నెట్టి పారేశారు. తెలుగులో పరిపాలన, కార్యనిర్వహణ చేయవలసిన అధికారులకీ తెలుగులో సామర్ద్యం లేదు.మాతృభాష పై నిర్లక్ష్యం కూడదంటూ యన్.టి.ఆర్ పాలనలో తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళకి ఉద్యోగాల్లో ఐదు మార్కులు అదనంగా కలిపి ప్రోత్సహించారు. తర్వాత అది రద్దయింది. తెలుగు మాధ్యమంలో చదివినవారిని ఏదో ఒక అదనపు ప్రయోజనంతో ప్రోత్సహిస్తేనే  తెలుగు భాషకు మంచి రోజులు వస్తాయి.తెలుగు భాషా సామర్ధ్యం అంటే ఛందోబద్ధ సాహిత్యం కాదు.సామాన్యులు రోజువారీ వ్యవహారాల్లో వాడే  తెలుగు.

విద్యార్థులు తెలుగు మీడియంలో చదువులు ప్రారంభించినా, ఇంటర్‌, ఇంజనీరింగ్‌లో ఇంగ్లీషు మీడియంకు వెళ్లిపోతున్నారు.తెలుగు మాధ్యమంలో చదువునేర్పే  మంచి కాలేజీలు లేకపోవడమే దీనికి కారణం. తెలుగు మీడియంలో వివిధ కోర్సులు చేద్దామంటే అవకాశం లేదు. ఆరో తరగతి నుండే ఐఐటి ఫౌండేషన్ కోర్సుల్లో చేరుతున్నారు. గణితం, ఇతర సైన్స్ కోర్సులపైనే దృష్టి పెడుతున్నారు. తెలుగులో ఒక్క వాక్యం కూడా రాయలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగులో మంచి భావవ్యక్తీకరణ శక్తి ఉన్నా తెలుగులో చదువుకొనే అవకాశాలు లేవు. వాటిని ఇకనైనా కల్పించుకోవాలి. తెలుగు వారికి అన్యాయం జరగకూడదనుకున్నప్పుడు వారు ఉద్యోగావకాశాలను సులభంగా పొందేలా తెలుగులో ఆయా కోర్సులూ పెరగాలి.


తెలుగులో సివిల్స్ రాయాలని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను ప్రోత్సహించాలి. మెడిసిన్,ఇంజనీరింగ్ కోర్సులూ తెలుగులో రావాలి.  ఏదో విధంగా తెలుగు మీద ఆంక్షలు పెట్టాలనే ఉత్తరాది సంస్థల ఉద్దేశం  కనిపిస్తోంది కాబట్టి  రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలి.సివిల్స్ మెయిన్ పరీక్ష రాసే అభ్యర్థులు తెలుగులో పరీక్ష రాయాలంటే, తెలుగు మాధ్యమంలో డిగ్రీ చేసి ఉండాలనీ ,డిగ్రీలో తప్పనిసరిగా తెలుగును ప్రథమ భాషగా ఎంచుకుని ఉండాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యుపిఎస్‌సి) తాజాగా జారీచేసిన ఆదేశాలను అడ్డంపెట్టుకొని,ఆధారంగా తీసుకొని రాష్ట్రంలోని కళాశాలల్లో తెలుగు మాధ్యమం ద్వారా అనేక డిగ్రీ కోర్సుల్ని ప్రారంభించాలి. తెలుగు మీడియంలో  చదివిన విద్యార్ధులు పూర్తిగా తెలుగులోనే  ఐ.ఏ.యస్ . పరీక్ష రాసి ఉద్యోగాలు సాధించగలిగితే మన భాష ఎంతో స్వేచ్ఛను శక్తినీ పొందినట్లే .దేశంలో అన్ని భాషలూ సమానమే. హిందీకి ఇంగ్లీషుకి ఇచ్చినంత  విలువ,గుర్తింపు, గౌరవం, సమాన ప్రాధాన్యత  ప్రాంతీయ భాషలకు  ఇవ్వాల్సిందే.  అందరికీ సాధికారికత కల్పించాలని చూడాలే తప్ప ఏకపక్షంగా కొందరికే ప్రయోజనం కల్పించాలని చూడటం సరికాదు.సివిల్స్‌ పరీక్ష పూర్తిగా తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలి.

అన్నీ చోట్లా ఇంగ్లిష్‌కు పెద్దపీటవేస్తున్నారు.హిందీకి మేలుచెయ్యటం కోసం  తెలుగుకు కీడుచేస్తున్నారు.ప్రాంతీయ భాషల వారికి చిక్కులు తెచ్చిమరీ  హిందీ వారికి ప్రత్యేక ప్రయోజనాలు కట్టబెడుతున్నారు.అందరికీ ఆంగ్లభాషా బానిసత్వం, మాతృభాషా దారిద్య్రం అంటగడుతున్నారు.ప్రపంచ తెలుగు మహా సభలు  సన్మానాలు  శాలువాలతో వ్యర్ధమయ్యాయి.సభల ద్వారా తెలుగుకు ఏం న్యాయం చేశారు? తెలుగులో  ఎంత ప్రతిభ ఉన్నా అది ఉద్యోగాలకు పనికిరావటంలేదు. అంతటా ఆంగ్లభాషాభిమానమే,హిందీభాషా పక్షపాతమే రాజ్యమేలుతోంది.అనేక భాషలున్న దేశంలో అన్ని భాషలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం పాలకులకు లేదు.ఆంగ్ల/హిందీయేతర భాషల అభ్యర్థుల పట్ల భాషాపరమైన వివక్ష కొనసాగుతోంది.అన్ని భాషలకూ  సమాన హక్కులు లేవు.

ఇప్పుడు ఇలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు గనుక భవిష్యత్తులో  తెలుగు అభ్యర్థులకు పరీక్ష రాసి ,తెలుగు ద్వారానే పాలనాధికారులయ్యే అవకాశం కలిగించాలి.అన్ని డిగ్రీ చదువులు తెలుగు మాధ్యమంలోకి రప్పించాలి. అది మన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్షలు కూడా తెలుగులో  నిర్వహించాలి.అప్పుడు ఇంజనీరింగ్ అభ్యర్థులు తెలుగులో సివిల్స్ పరీక్ష రాస్తారు. ప్రాంతీయభాషలపట్ల  వివక్ష అని బాధపడకుండా ఇలాంటి ఆంక్షలను అడ్డంపెట్టుకొని మన భాషలో ఎగబాకటానికి ప్రయత్నించాలి.ఈ ఆంక్షలనే ప్రైవేటు కార్పోరేటు విద్యా సంస్థలూ చచ్చినట్లు పాటించేలా చెయ్యొచ్చు. తెలుగులో మాట్లాడిన పిల్లలను కొట్టకుండా నెత్తిన ఎక్కించుకొని తెలుగులోనే ముద్దాడేలా తెలుగుకు ఆయా సంస్థల్లో పెద్దపీటవేసేలా మార్చుకోవచ్చు.
దేశమంతటా ఆ రెండు భాషలే దిక్కు
అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషు,రాజభాషగా  హిందీ.దేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో సెప్టెంబర్‌ 14న రాష్ట్రీయ దివస్‌గా, హిందీ దివస్‌గా నిర్వహిస్తున్నారు. కేంద్ర పాలకులకు ఆయా ప్రాంతాల ప్రజల మాతృ భాషలతో పనిలేదు.అసలు ఆయా భాషస్తుల మొర కూడా వినరు. హిందీ కోసం తప్ప మిగతా భారతీయ  భాషలకోసం కేంద్రం తరుపున ఒక్క పండుగా ఉండదు.కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఇంగ్లీష్‌, హిందీ భాషలలో మాత్రమే నిర్వహిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం త్రిభాష సూత్రం ప్రకారం మన తెలుగు ప్రజలు మాతృభాషను నేర్వకపోయినా  రాజభాషగా హిందీని , అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషును అభ్యసిస్తున్నారు. కేంద్రప్రభుత్వం హిందీ భాషాభివృద్ధి కోసం హిందీప్రచార సభ, హిందీ అకాడమి, సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హిందీ తదితర సంస్థలను ఆయా రాష్ట్రాల రాజధానులలో  ఏర్పాటుచేసింది. ఈ సంస్థలు పాఠశాల విద్యార్థులకు హిందీ పరీక్షలు అక్షరమాల నుంచి ఉపాధ్యాయ శిక్షణ వరకు వివిధ స్థాయిలో హిందీ ప్రచారం కోసం, భాషాభివృద్ధి కోసం పరీక్షలు, శిక్షణా కార్యక్రమాలు, సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తారు.ఇన్ని పనులు తెలుగుకోసం  ఏనాడన్నా చేశారా?అన్ని  రైల్వే స్టేషన్లలో బోర్డులు ఇంగ్లీషుతో పాటుగా హిందీలో కూడా వుంటాయి. ఎల్లైసీ పాలసీలు,రశీదుల మీద, టెలిఫోన్ బిల్లుల మీద తెలుగు ఉండదు కానీ ఇంగ్లీషుతో పాటు హిందీ ఉంటుంది.హిందీ అర్ధం కాకపోతే ఇంగ్లీషులో చదువుకోవాలి.అంతేగానీ మన ప్రాంత కార్యాలయాల్లో కూడా మన మాతృభాషలో ముద్రించరు.కేంద్రం మనకు మన భాషలో ముద్రణకు అనుమతించింది ఓటర్ లిస్టు ఒకటే.ప్రభుత్వ వెబ్ సైట్లలో ఇంగ్లీషుతో పాటు హిందీలో కూడా సమాచారం వుంటుంది.ఈ మధ్య సోషల్ వెబ్ సైట్లలో కూడా హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. పార్లమెంటులో  హిందీ  రాజ్యమేలుతోంది. హిందీయేతరులు అనుమతులు పొందాకే మాట్లాడాల్సి వస్తోంది.ఆనాడు రాజ్యసభలో హరికృష్ణ తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టగానే డిప్యూటీ ఛైర్మన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగులో వద్దు, ఇంగ్లిష్ లో  గాని, హిందీలో గాని మాట్లాడమన్నప్పుడు హరికృష్ణ నాకు తెలుగులో మాట్లాడే హక్కుంది అంటూ  తెలుగులోనే మాట్లాడారు.అనువాదకులు లేని సభలో మాట్లాడినందున ఆయన మాటలు రికార్డుల్లోకి ఎక్కవన్నారు. సభ జరిగేరోజుల్లో షెడ్యూల్డ్ భాషలన్నిటికీ అనువాదకులు అక్కరలేదా? హిందీని మాత్రం సభ్యులందరూ తమ భాషల్లో అర్ధం చేసుకోవాలా? ఇలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో  హిందీయేతర సభ్యులు ఇంగ్లీషులో నెట్టుకొస్తున్నారు గానీ తమ మాతృభాషల్లో మాట్లాడినంతగా ఆయా అంశాలపై అనర్గళంగా ఆవేశంగా మాట్లాడలేకపోతున్నారు. తమ మాతృభాషలో ధీటుగా వాదించి గెలిచే ఆయాచిత వరం హిందీ వాళ్ళకు మాత్రమే దక్కింది.మిగతా భాషలవాళ్ళకు ఈ సదుపాయం నేటికీ లభించలేదు.ఇంగ్లీషు,హిందీలు మాత్రమే తెగ బలిసిపోతున్నాయి.మిగతా భాషలకు పార్లమెంటులో ఇంగ్లీషు,హిందీలతో పాటు సమాన గౌరవం దక్కుతుందా?కనీసం తమ తమ ప్రాంతాలలోని కేంద్ర కార్యాలయాల ఫైళ్ళలో  కూడా ప్రవేశించలేని ప్రాంతీయ భాషలు పోషణలేక క్రమేణా పరమపదించటం ఖాయం.శక్తిచాలని ప్రజలు ఉపాధికి పనికిరాని తమ భాష బాగోగుల కోసం ఎన్నాళ్ళని పోరాడుతారు?ఉద్యోగాలిచ్చే రాజభాషకు ఏనాటికైనా సాగిలపడక ఏంచేస్తారు?కేంద్ర ప్రభుత్వ కోరిక కూడా ఇదేనేమో.అందుకే ఈ నిరంకుశ ఆధిపత్య పోకడలు.  

సూర్య 29.7.2014
https://www.facebook.com/photo.php?fbid=799596050072387&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater
CVR News 30.7.2014










ఆంధ్రజ్యోతి29.8.2015

5, సెప్టెంబర్ 2013, గురువారం

తెలుగు పాలనా భాష కావాలంటే ఏం చెయ్యాలి ?



తెలుగు పాలనా భాష కావాలంటే ఏం చెయ్యాలి ?
నూర్ బాషా రహంతుల్లా  9948878833
తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభల వాగ్దానాలతో ప్రజలకు కలిగిన ఆనందం మరుసటి నెలనుండే ఆవిరి కావటం ఆరంభించింది.మండలి బుద్ధప్రసాద్ గారి రాజీనామాతో తెలుగు భాష మళ్ళీ అనాధలా మిగిలిపోయింది.ఇప్పుడు ఎవరిని అడగాలన్నా భాషకంటే ముఖ్యమైన ఉద్యమాలలో తలమునకలై ఉన్నారు.తెలుగు భాష తెలుగు జాతి అనే పదాలు మాత్రం మారుమోగిపోతున్నాయి.కానీ తెలుగు భాషకు ఏ ప్రయోజనమూ కలగటం లేదు. అంతా ఎరుదాటాక తెప్ప తగలేసిన చందంగా ఉంది.భాషపేరుతో ఐక్యత కోరే వాళ్ళు ఆ భాషను బ్రతికించటానికి కూడా కృషి చెయ్యాలి.భాష చచ్చిపోతే ఇక ఈ భాషా నినాదం కూడా చేయలేము.

తెలుగు కంఠ శోష
పాలనా భాషగా తెలుగుభాష అమలు గురించి 33 సంవత్సరాలుగా రాస్తూనే ఉన్నాను.తెలుగు భాష అధికారికంగా కార్యాలయాల్లో అమలు కావడానికి ఎంతోమందిసూచనలు చేస్తున్నారు. భాష అమలుకోసం ఎవరెవరు ఏమేం చేశారో తెలిపితే ఔత్సాహికులకు ప్రోత్సాహకంగా ఉంటుందని భావించి  ఏం చేస్తే బాగుంటుందో గూడా మళ్ళీ చెబుతున్నాను.తెలుగు భాషోద్యమం  రాష్ట్రోద్యమం దెబ్బకు ఎటో వెళ్ళిపోయింది.ఇక ఎవరికి చెప్పాలి?తెలుగు ప్రజలు,నాయకులు,అధికారులు అందరికీ చెబుతాను. రాష్ట్రం ఒకటిగా ఉన్నా రెండుగా ఉన్నా తెలుగు భాష అందరికీ అవసరమే.తెలుగు పాలనలో అందరికీ సమానంగా అవే భాషాపరమైన అవసరాలు పదే పదే  ఎదురౌతాయి.
నా అనుభవాలు  
ఆనాటి అధికార భాషా సంఘం అధ్యక్షులు గజ్జెల మల్లారెడ్డిగారు నేను గుమాస్తాగా పనిచేస్తున్న ఒక కార్యాలయ తనిఖీకి వచ్చారు. పూర్తిగా తెలుగులోనే ఫైళ్ళు నిర్వహించే ఉద్యోగి ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చర్చించుకొని ఆయన్ని నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన నేను రాసిన ఫైళ్ళన్నీ చూసి తెగ సంబరపడ్డారు. ''ఈ కుర్రవాణ్ణి చూసి మీరంతా నేర్చుకోవాలి. తెలుగు పదాలు దొరక్కపోతే ఏ మాత్రం సంకోచించకుండా ఇంగ్లీషు పదాలనే తెలుగులో రాశాడు. ఇతని వాక్య నిర్మాణం చాలా సులువుగా, సహజంగా, అందరికీ అర్థమయ్యేలా ఉంది. ఇదే మేము కోరుకునేది'' అంటూ నన్ను అభినందించారు. అది హైదరాబాద్‌లోని డైరెక్టొరేట్‌ కార్యాలయం కావడంతో అక్కడ పనిచేసే ఉర్దూ సోదరులు, ఆంగ్ల మేధావుల మధ్య నాకూ, నా భాషకూ ఒక గుర్తింపు వచ్చింది. పూర్తిగా తెలుగులో ఫైళ్ళు నిర్వహించవచ్చు అనే సత్యం తెలిసింది.
తెలుగులో హైకోర్టుకు జవాబులు
పశ్చిమ గోదావరిలో ఎమ్మార్వోగా ఉండగా 23 రిట్‌ పిటీషన్‌లకు పేరావారీ జవాబులు తెలుగులోనే రాసి పంపాను. కలెక్టరేట్‌ నుండి ఫోన్‌. తెలుగులో ఎందుకు పంపారనే ప్రశ్న. తెలుగులోనైతే జవాబులు తప్పుల్లేకుండా సూటిగా, స్పష్టంగా ఇవ్వగలననీ, అర్థంకాక పోవడమనే సమస్యే రాదనీ, వాటిని యధాతథంగా హైకోర్టుకు సమర్పించమనీ, కాదు కూడదంటే ఇంగ్లీషులోకి తర్జుమా చేయించి జిల్లా కేంద్రం నుండే హైదరాబాద్‌కు పంపించండనీ వేడుకున్నాను. అధికార భాషా చట్టం పుణ్యాన వారు వాటిని హైకోర్టులో నివేదించారు. యధాతథంగానో, ఆంగ్లంలోకి మార్పించో నాకు తెలియదుగానీ అన్ని కేసులూ గెలిచాం. ఆలోచన మన అమ్మ భాషలోనే పుడుతుంది. అమ్మ భాషలో వాదిస్తే గెలుపు ఖాయం అనే సంగతి అర్థమయ్యింది.
తెలుగులో దరఖాస్తులు
ఇంకో మండలంలో ఎమ్మార్వోగా ఉండగా ధరఖాస్తు ఫారాలు నింపడానికి ఆఫీసు బయట ఒక ప్రైవేటు వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన వ్యక్తుల అవసరాలనుబట్టి ఇంతింత ఈ ఫారం నింపడానికివ్వాలని వసూళ్ళు చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫారాలు ఇంగ్లీషులో ఉండేవి. ఏయే పనుల కోసం ఈ ఆఫీసుకు ప్రజలు వస్తున్నారు, ఏమేమి ఫారాలు వాళ్ళు పూరించి ఆఫీసులో ఇవ్వాలో తెలుసుకున్నాను. ఓపికగా ఆయా ఫారాలన్నీ తెలుగులోకి అనువదించాను. నాలుగైదు తరగతులు చదివిన వారెవరైనా సులువుగా పూర్తిచేయటానికి వీలుగా అన్నిరకాల ధరఖాస్తుఫారాలు తయారయ్యాయి. వాటిని ఆ ఊళ్ళోని జిరాక్సు షాపులన్నిటికీ ఇచ్చి కేవలం అర్ధరూపాయికే ఏ ఫారమైనా అమ్మాలని చెప్పాము. ఎవరికివారే ఫారాలు నింపుకొని వస్తున్నారు. ప్రతిఫారమూ నాలుగైదు దశలు దాటివచ్చే పద్ధతి తీసేశాం. గ్రామ పాలనాధికారి, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ సంతకాలు చేస్తే చాలు. వాటిపైన నేను సంతకం చేసేవాడిని. ఆఫీస్‌లో గుమాస్తాల ప్రమేయం తగ్గింది. పత్రాల జారీ వేగం పెరిగింది.
పిల్లల బాధలు,రైతుల అగచాట్లు
నేను హై స్కూల్ చదువుకు రోజూ 7 కి.మీ.కంకటపాలెం నుండి బాపట్ల నడిచి వచ్చే వాడిని.కుల,ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్ దార్ ఆఫీస్ కు వారం రోజులపాటు తిరిగేవాడిని.ఎండకు తాళలేక బాపట్ల తహసీల్ దారు ఆఫీసు ఆవరణలో చెట్టు కింద నిలబడేవాడిని.ప్రతిరోజూ డఫేదారు దగ్గర ఒకటే సమాధానం;"దొరగారు క్యాంపు కెళ్ళారు.రేపు రండి" .ఆనాడు ఆ చెట్టు కింద అనుకున్నాను "నేను గనక తాసీల్దారునైతే చిన్నపిల్లలకు చకచకా సంతకాలు చేసి పంపిస్తాను".తహసీల్దారునయ్యాక మాటనిలుపుకున్నాను.
స్కూళ్ళు తెరిచే జూన్‌ మాసంలో సర్టిఫికెట్ల కోసం పిల్లలు బారులు తీరేవాళ్ళు. రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఆ పిల్లల చేతనే సర్టిఫికెట్లపై నంబర్లు వేయించి స్టాంపు, సీలు కొట్టుకోమనేవాడిని. అరగంటలో పిల్లలంతా ఉత్సాహంగా తమ పని ముగించుకొని, సర్టిఫికెట్లతో వెళ్ళిపోయేవారు. అంతా తెలుగులోనే. తెలుగు పిల్లలు తెలుగులో ఎంతో వేగంగా పనిచేసేవాళ్ళు. నా 13 సంవత్సరాల ఎమ్మార్వో పదవీ కాలంలో తెలుగు పిల్లలు ఎక్కడా పొరపాటు చేయలేదు. రిజిస్టర్లన్నీ చక్కటి తెలుగులో మన తెలుగు పిల్లలే నిర్వహించారు. ఆ కాలమంతా నాకు మధురానుభూతి. మండలంలోని అన్ని హైస్కూళ్ళ ప్రధానోపాధ్యాయులకూ ఒక ప్రొఫార్మా ఇచ్చి, వారి స్కూల్లోని పిల్లలందరి కులం, స్వస్థలం, పుట్టిన తేదీ... మొదలైన వివరాలు నింపి ధ్రువీకరించి పంపమని కోరాను. ఆయా గ్రామ పాలనాధికారులు కూడా ఆ వివరాలను ధ్రువీకరించారు. పిల్లలెవరూ మండల కార్యాలయానికి రానక్కరలేకుండా ''శాశ్వత కుల, నివాస స్థల, పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని'' వారి ఫొటోలు అంటించి వారి వారి పాఠశాలల్లోనే పంపిణీ చేశాం. పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ఇళ్లకు పంపిణీ చేయించాం. వీటన్నిటిని తెలుగు రాత పనిలో, మంచి చేతిరాత కలిగిన గ్రామ సేవకులు, ఉపాధ్యాయులు, గ్రామ పాలనాధికారులు, విద్యార్థుల్ని కూడా ఉపయోగించుకున్నాం. ఎలాంటి తప్పులూ దొర్లలేదు. ఏ ఊరి ప్రజల పని ఆ ఊళ్లోనే ఆ ఊరివాళ్లే చేసుకున్నందువలన ఎంతో స్పష్టంగా పని జరిగింది. పల్లెటూళ్ల అందం వాళ్లు రాసిన తెలుగు అక్షరాలతో మరింత పెరిగింది. తల్లి భాషకు దూరమైన రోగులు పల్లెటూళ్లకెళ్లి ప్రాణవాయువెక్కించుకోవచ్చుననే అనిపించింది.ప్రజలకు అవకాశం ఇస్తే వాళ్లు మాట్లాడే భాషలోనే శక్తివంతంగా, జ్ఞానయుక్తంగా దరఖాస్తులు పెడుతున్నారు, విన్నవిస్తున్నారు, పోరాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఆంగ్లం వారికి అరగటంలేదు. తెలుగు చక్కగా జీర్ణమౌతున్న అమృతాహారం.
ఇప్పుడు తెలుగు వాడకంలోంచి సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ పదాలను తీసివేయలేము. అవి మన భాషలో అంతర్భాగాలైపోయాయి. అక్కరలేని ఆపరేషన్‌ ఎవరు చేయించుకుంటారు? చేసినా గాయాలవడం తప్ప మరే మేలూ కలుగదు. అందువలన మన భాష సంకరమైనా బలమైన హైబ్రీడ్‌ భాషలాగా తయారైనందుకు సంతోషపడుతూ, ఈ సంకర తెలుగు భాషలోనే ఆఫీసుల్లో ఫైళ్ళు నడిపితే అదే పదివేలుగా భావించాలి. ఛాందసవాదులు వాళ్ళు చెయ్యరు, ఇంకొకళ్ళను చేయనివ్వరు. ఒకవేళ ఈ పనిని వాళ్ళకప్పజెబితే ఎవరికీ అర్థంగాకుండా పాడుచేస్తారు. ప్రజలు ఇంతకంటే ఇంగ్లీషే నయమని వాపోయేలా చేస్తారు. మన శాసన సభలో ఎమ్మెల్యేలు ఈ మూడు భాషల పదాలు కలగలిపి మనోరంజకంగా మాట్లాడుతున్నారు. అదే నేటి తెలుగు, వాడుక తెలుగు, వారు అడిగింది అడిగినట్లు తెలుగు లిపితో సాగదనుకుంటే ఆంగ్లలిపినే వాడుకోండి. మన మాట ముఖ్యం. వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు మాట్లాడుతున్నది మన ప్రజల భాష. ఆ భాషలో, యాసలో జీవోలు రావాలి. అప్పుడే తెలుగు అధికార భాషగా విరాజిల్లుతుంది.

ఇంకా చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి :
1. మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష. ఈ రెండు భాషల ప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవ గాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి.ఉర్దూ- తెలుగు నిఘంటువు, ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు ఎక్కడా అమ్మకానికి దొరకడం లేదు.ముద్రించాల్సిన అవసరం ఉంది. ముషాయిరాల కంటే ముఖ్యమైన తెలుగు-ఉర్దూ ,ఉర్దూ – తెలుగు నిఘంటువులు కావాలి. వక్ఫ్‌బోర్డు నిఖా నామా లు (వివాహ ద్రువపత్రాలు )  తెలుగు భాషలో కూడా ప్రచురించాలి. తెలుగు జాతీయలూ, నుడికారాలూ, పదబంధాలూ కూర్చిన నిఘంటువుల అవసరం ఉంది
2. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ,పెద్దన,తిమ్మన,తెనాలిరామకృష్ణ,సూరన్న,రామరాజ,మల్లన్న,ధూర్జటి,రామభద్ర, గిడుగు,గురజాడ,సురవరం, యన్.టి.ఆర్.,మండలి,నాట్స్, పొన్నాల,రవిప్రకాష్,లక్కిరెడ్డి అనే 18 అక్షరరూపాలను విడుదల చేశారు.కానీ ఇప్పటికే అనూ,సూరి,లాంటి యూనీ కోడేతర ఫాంట్లలో ముద్రితమై ఉన్న విస్తారమైన తెలుగు సాహిత్యాన్ని తెలుగు యూనీకోడు లోకి మార్చే మార్పిడి సాధనాలు కావాలి.తర్జుమాలో తప్పులు వస్తున్నాయి.అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి.ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.వాటిని తయారు చేసే సాంకేతిక నిపుణులకు నిధులు ఇవ్వాలి, ప్రతి యేటా తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది.కాగితం, కలం రోజులు పోయాయి. ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి. పదాల శుద్ధి`యంత్రం, గుణింత, వ్యాకరణ పరిష్కారయంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్‌నిఘంటువులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, ఉచ్ఛారణ ` పద ప్రయోగ నిఘంటువులు, వ్యుత్పత్తి కోశాలు, లిపిబోధినిలు, సాహిత్య శోధనా పరికరాలు, పదాను క్రమణికలు... ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడిరచే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగా ఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి.
 3. తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇస్తే, తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు మీడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగును అమలు చేయాలనే పట్టుదల, ఆకాంక్ష ఉంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి.
4. ప్రైవేటు, కార్పోరేట్‌ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉండాలి.రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వాడుక బాషలోకి తేవాలి. ఎనిమిదో షెడ్యూల్డ్‌లో పేర్కొన్న బాషలన్నిటినీ అప్పటికప్పుడు తర్జుమా చేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటు చేయాలి. న్యాయస్థానంలో తీర్పులు అధికార భాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి. తెలుగు భాషా రక్షణ అభివృద్ధికై మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయగల ఐ.ఎ.యస్‌. ఐ.పి.యస్‌ అధికారుల్ని, గవర్నర్లును మాత్రమే మన రాష్ట్రంలో నియమించేలా కేంద్రాన్ని కోరాలి.తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ , అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను తెలుగు ప్రజలకు బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు అంటే కోడ్లు, మాన్యువల్‌లు, లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కమీషన్‌ పోటీ పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి. కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులు సంకలనం, వ్యవకలనం లాంటి సంస్కృత పదాలను వాడి తెలుగు మీడియం అంటే పిల్లలు భయపడేలా చేశారు. పిల్లల పుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి. .కేవలం తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వాడికి ఇంగ్లీషురాక పోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో నయినా ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే వాతావరణం కల్పించాలి. అంటే ఇంగ్లీషు రాకపోయినా కలెక్టరు , డాక్టరు , ఇంజనీరు కాగలిగే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి. అప్పుడు జనం తండోపతండాలుగా తెలుగులో చదువుతారు.హైదరాబాదును రెండవ రాజధానిగా  ఏర్పాటు చేసినా చెయ్యకపోయినా తెలుగును మాత్రం రెండవ జాతీయ భాషగా ప్రకటించాలి. 
 (సూర్య 6.9.2013)
http://www.suryaa.com/opinion/edit-page/article-152137
  https://www.facebook.com/photo.php?fbid=627311750634152&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater