12, నవంబర్ 2016, శనివారం

తెలుగు రాష్ట్రాలలో పరిపాలన తెలుగులోనే జరగాలి



                                  తెలుగు రాష్ట్రాలలో పరిపాలన తెలుగులోనే జరగాలి  
భాషల ప్రాతిపదికపై ఏర్పడిన మొదటి రాష్ట్రం అంధ్రప్రదేశ్ .తమిళభాష ఆధిపత్యాన్ని వదిలించుకొని మన తెలుగు భాషలో మనల్ని మనమే పరిపాలించు కుందామనే సదాశయంతో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు.ఇప్పుడు తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ రెండూ తెలుగు రాష్ట్రాలే.ఉమ్మడి రాష్ట్రంలోని భాషా పరమైన కోరికలే ఇప్పటికీ తెలుగు ప్రజలలో ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి.అవి తీరేదాకా ప్రజలు అడుగుతూనే ఉంటారు.ప్రజల భాషలో పరిపాలన జరగాలనే కోరిక అతి సహజమైనది.తెలుగు ప్రజల పోరాటాల ఫలితంగా   గతంలో కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. వాటి  ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికార భాషగా తెలుగును ఖచ్చితంగా అమలు చెయ్యాలి.అవేమిటో చూద్దాం:
 1.ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 167 తేదీ .19.3.1988 ప్రకారం ఆంగ్లంలో వచ్చిన ఏ ఉత్తరం పైనా ,ప్రతిపాదనపైనా ఎలాంటి చర్య తీసుకోకుండా తిప్పి పంపే అధికారం ప్రతి గజిటెడ్ అధికారికీ ఉంది.తమకంటే పై అధికారుల కార్యాలయాలనుండి వచ్చినా సరే ఆంగ్లంలో వచ్చిన లేఖలను తిప్పి పంపవచ్చు.ఈ విధంగా చేయడం వల్ల జరిగే కష్ట నష్టాలకు,జాప్యానికీ వాటిని ఆంగ్లంలో పంపిన అధికారులదీ ,కార్యాలయాలదే బాధ్యత.
2. ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 587 తేదీ .28.10.1988
ప్రకారం 1988 నవంబరు 1 వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి.అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి.ఆంగ్లం వాడకూడదు.కేంద్ర ప్రభుత్వం,ఇతర రాష్ట్రాలు,రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లం ఉపయోగించాలి
3. ప్రభుత్వ ఉత్తర్వు (సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 218 తేదీ .22.31990 ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ,రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు,అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి.అన్ని శాసనేతర అవసరాలకు ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనే ఉపయోగించాలి.
4. ప్రభుత్వ ఉత్తర్వు( సాధారణ పరిపాలన అ.భా శాఖ) సంఖ్య 420 తేదీ .13.9.2005  ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు,నియమాలు,నిబంధనలు,ఉపవిధులు అన్నీ కూడా తెలుగు భాష లోనే ఉండాలి.
5. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 11 (యువజన & సాంస్కృతిక అధికార భాష శాఖ) తేదీ.14.9.2016 ప్రకారం రాష్ట్రంలోని అన్ని దుకాణాలు ,సముదాయాల బోర్డులు ప్రభుత్వ పధకాల ప్రారంబోత్సవ నామఫలకాలు,శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనే రాయించాలి.
పై ఉత్తర్వులన్నీ ఖచ్చితంగా అమలుచేస్తే పరిపాలన పూర్తిగా తెలుగులోనే జరుగుతుంది.
మరి తెలుగు పరిస్థితి ఎందుకు ఇలా తిరగబడింది ?
తెలుగువాడిగా పుట్టటం ఎన్నోజన్మల పుణ్యఫలం అనీ,రాయల కాలంనాటి రాజభాష అనీ గొప్పలు చెప్పుకోవటమే గానీ క్రమంగా తెలుగు భాష కవిత్వాలకు మాత్రమే పరిమితమై పోయింది. వాస్తవానికి ప్రపంచంలో ఎన్నో భాషలు కాలగమనంలో రాలిపోతూనే ఉన్నాయి.తెలుగులో చదువుకొనే పిల్లలు తగ్గిపోయారు.తెలుగు బడులు మన కళ్ళముందే ఇంగ్లీష్ కాన్వెంట్లు గా మారిపోయాయి.ఇక అటెండర్ ఉద్యోగానికీ తెలుగు అక్కరలేదనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేసారు.ప్రాధమిక పాఠశాలలు కూడా ఇంగ్లీషువే కావాలని పట్టుబడుతున్నారు.ఎందుకంటేఇంగ్లీషు చదువువల్ల,విదేశాల్లో కొలువులవల్ల డబ్బు సంపాదన విపరీతంగా ఉంది.తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది.తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ,డబ్బు వస్తుంటే అప్పుడు కొందరైనా స్వార్ధం కొంత చంపుకొని తెలుగు చదువుతారు.భాషతో సాంకేతిక,ఆర్ధిక విషయాలను ముడిపెట్టకుండా అభివృద్ధి సాధ్యంకాదని స్వర్గీయ అబ్దుల్ కలాం గారు చెప్పారు.ఏ జాతి సమస్త వ్యవహారాలు ఆ జాతి మాతృ భాషలోనే జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది.అది ఎప్పటికీ విజేతగానే ఉంటుంది. భాష పేరుతో ఐక్యత,అభివృద్ధీ కోరే వాళ్ళు ఆ భాషను బ్రతికించటానికి కృషి చెయ్యాలి.మన భాషలో పరిపాలన బాగా జరగటానికి ఇంకా ఏమేమి  పనులు చెయ్యాలో చూద్దాం:
1. నిఘంటువులు
ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది.ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి. పదాల శుద్ధి`యంత్రం, గుణింత, వ్యాకరణ పరిష్కారయంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్‌నిఘంటువులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, ఉచ్ఛారణ పద ప్రయోగ నిఘంటువులు, వ్యుత్పత్తి కోశాలు, లిపిబోధినిలు, సాహిత్య శోధనా పరికరాలు, పదాను క్రమణికలు... ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగా ఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి కార్యాలయాలలో వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి.
2.సాఫ్ట్ వేర్లు
 తమిళంలో ఉత్తమ సాఫ్ట్ వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నారు. తెలుగులో కూడా  ఉత్తమ సాఫ్ట్ వేర్ లు తయారుచేసిన సాంకేతిక నిపుణులకు,తెలుగు భాషకు ఉపకరించే సులభ ఉపకరణాలను తయారు చేసిన సాంకేతిక పరిజ్నానులకు తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.తర్జుమా పరికరాల తయారీ ప్రారంభదశలో ఉంది గనుక కొన్ని తప్పులు వస్తున్నాయి.అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.కంప్యూటర్లలో సాంకేతిక తెలుగు భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి.
3.మార్కులు, ఉద్యోగాలు
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది.ప్రమోషన్లలో కాకుండా ప్రభుత్వోద్యాగాలకు మొదటిసారిగా నేరుగా జరిపే నియామకాలకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.కాబట్టి తమిళనాడును ఆదర్శంగా తీసుకొని  ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలి.తమిళనాడులో లాగా ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలి.  గ్రూప్‌ 1, గ్రూప్‌ 2,3 లాంటి  సర్వీసు ఉద్యోగాలలో తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి.
4.అధికారభాషా సంఘం,అకాడమీ 
 వ్యాపార సంస్థలు,దుకాణాలన్నీ తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయకపోతే వాటి లైసెన్సులు రద్దు చేసే అధికారం కన్నడ అధికార భాషా సంఘానికి ఉన్నట్లుగా, తెలుగు అధికార భాషా సంఘానికి కూడా ఉండాలి. మండల స్థాయి నుండి సచివాలయం వరకు అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి. తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడవిూ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను తెలుగు ప్రజలకు బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు కోడ్లు, మాన్యువల్‌లు, లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కవిూషన్‌ పోటీ పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి.
5.సచివాలయం, శాసనసభలు,న్యాయస్థానాలు
హైకోర్టులో తెలుగులో వాదనలకు అనుమతించాలి. తెలుగును రెండవ జాతీయ భాషగా ప్రకటించాలి. మన ప్రజల భాషలోనే జీవోలు రావాలి. అప్పుడే తెలుగు అధికార భాషగా విరాజిల్లుతుంది.తెలుగు భాష మాట్టాడేవాళ్ళ సంఖ్యనుబట్టి, జనబలాన్ని బట్టి పార్లమెంటులో మన గౌరవం మనకు దక్కుతుంది. హిందీతో పాటు తెలుగును కూడా ఇతర భాషలవాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది.పార్లమెంటులో హిందీ వాళ్ళలాగా మనం కూడా తెలుగులో మాట్లాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులన్నీ తెలుగులో పొందవచ్చు. కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ తెలుగులో నడుపవచ్చు. చట్టాలన్నీ తెలుగులోకి మార్చబడతాయి. తెలుగులో తీర్పులొస్తాయి. తెలుగులో ఇచ్చే అర్జీలు ఢిల్లీలో కూడా చెల్లుతాయి. ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి కొండంత అండ, గౌరవం హిందీ వాళ్ళతో పాటు సమానంగా లభిస్తాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లలో బోర్డుల విూద తెలుగులో కూడా పేర్లు రాస్తారు. ఈ రోజున హిందీ భాష వల్ల హిందీ వాళ్ళకు ఏయే ప్రయోజనాలు ఒనగూడాయో అవన్నీ తెలుగు వాళ్ళు కూడా పొందవచ్చు.
                                                                      --- నూర్ బాషా రహంతుల్లా  9948878833

11, నవంబర్ 2016, శుక్రవారం

సర్వీస్‌ కమిషన్లకు తెలుగు భాషా సేవ చేయాలి (సూర్య 12.11.2016)


సర్వీస్‌ కమిషన్లకు తెలుగు భాషా సేవ చేయాలి



(సూర్య 12.11.2016)

-గ్రూప్‌-2,3 సర్వీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్న సర్వీస్‌ కమిషన్లు
-తెలుగు మాధ్యమ విద్యార్థులకు ఛాన్సు ఇవ్వాలి
-5 శాతం అదనపు మార్కులతో ప్రోత్సహించాలి
-తెలుగు మాట్లాడే జనం సమస్య తీర్చే పోస్ట్ లు
-తెలుగుభాషలోనే వ్యవహారాలు సాగాలి
-ప్రజలతో మమైకమైతేనే రాష్ట్రాల అభివృద్ధి
-జనం భాషకు ప్రభుత్వాలు పట్టం కట్టాల్సిందే

తెలుగుభాషకూ ,తెలుగు విద్యార్ధులకూ సేవ చేసేందుకు సర్వీస్ కమీషన్లకు మంచి అవకాశం వచ్చింది . త్వరలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలు రెండూ భారీ ఎత్తున గ్రూప్‌-2,3 సర్వీసు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయి. వీటిలో మున్సిపల్‌ కమిషనర్‌, ఏసీటీఓ, సబ్‌ రిజిస్ట్రార్ , డిప్యూటీ తహసిల్దార్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డెవలప్ మెంట్‌ ఆఫీసర్‌, ఎక్‌‌స టెన్షన్‌ ఆఫీసర్‌,ఎకైసజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌,అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ఆడిటర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, గ్రామపంచాయతీ సెక్రెటరీ లాంటి ఉద్యోగాలున్నాయి.
తెలుగు ప్రజలతో వ్యవహరించే ఉద్యోగాలే
ఇవన్నీ ఐ ఏ ఎస్‌ ,ఐ పి ఎస్‌ లాంటి ఉన్నతోద్యోగాలు కావు. తెలుగు ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగాలు. తెలుగు ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషణ చేయాలి. గ్రామ సామాజిక , ఆర్థిక వ్యవస్థ పై తగిన అవగాహన తెచ్చుకోవాలి. ప్రజా పరిపాలన పరిజ్ఞానం పెంచుకోవాలి. అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు, పరిష్కారాలు, సూచనలు వినాలి, రాయగలగాలి . ఈ నైపుణ్యాలన్నీ ప్రజల భాష లో తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా ఉంటాయి.
తెలుగు విద్యార్ధులకు ఎన్ని ఉద్యోగాలు?
ఈ ఉద్యోగాలలో తెలుగు మాధ్యమం ద్వారా డిగ్రీలు చేసిన వారికి ఎన్ని దక్కుతాయనేదే నేటి ప్రశ్న. జన్మభూమినీ మాతృభాషను మరువకండి అని పదే పదే తెలుగు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. మన తెలుగుకు ప్రాచీన భాష హోదా రాకుండా అడ్డుపడిన తమిళులతో పోరాడి మరీ సాధించారు. ప్రాచీన భాషా కేంద్రాన్ని కూడా తెలుగు నేలపైకి త్వరలో తేబోతున్నారు. ప్రజల భాషకు పరిపాలనలో పట్టం కడతామనే నాయకుల వాగ్దానాలు రెండు రా„షా్టల్ల్రోనూ వినబడుతున్నాయి. తెలుగును ఉపాధి వనరుగా మార్చాలని అందరూ కోరుతున్నారు. కొందరైతే ప్రజల భాష పదికాలాలపాటు పాలించాలని తపిస్తున్నారు కూడా. తెలుగు విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందేలా ప్రజా సేవ (పబ్లిక్‌ సర్వీస్‌) చేసే బంగారం లాంటి అవకాశం మన సర్వీసు కమీషన్లకు వచ్చింది.
తెలుగు మాధ్యమ అభ్యర్థులను ఆదరించాలి
2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాలు ప్రకటించిన విధానాలు చూస్తే తెలుగు ప్రాణం పోసుకొని తిరిగి లేస్తుందనిపించింది. కాల గమనంలో మన ఆశలు నీరుగారిపోయాయి. 2016లో కూడా మళ్ళీ అవే అంశాలపై అవకాశాలు అన్వేషిస్తున్నాం . తెలుగునాట తెలుగు మీడియం విద్యార్ధులకు పోటీ పరీక్షల్లో ఇంగ్లీషు చదువు వల్ల, విదేశాల్లో కొలువులవల్ల డబ్బు సంపాదన విపరీతంగా ఉంది కాబట్టే అటు జనం పరుగులు పెడుతున్నారు. ఇక్కడే ఉండి దేశ ప్రజలకే సేవ చెయ్యండి, విదేశాలకు పోకండి అని వావిలాల, కాళోజీ లాంటి మహనీయులు ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. వినటం లేదు. కారణం తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ, డబ్బు వస్తుంటే అప్పుడు కొందరైనా స్వార్థం కొంత చంపుకొని తెలుగులో విద్యభ్యాసం చేస్తున్నారు. భాషతో సాంకేతిక, ఆర్ధిక విషయాలను ముడిపెట్టకుండా అభివృద్ధి సాధ్యం కాదు. సమస్త వ్యవహారాలు మాతృభాషలో జరిగే దేశాలే అభివృద్ధి చెందుతాయి. భాష పేరుతో ఐక్యత కోరే వాళ్ళు ఆ భాషను బ్రతికించటానికి కూడా కృషి చెయ్యాలి. మాతృ భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే
ప్రోత్సాహకాలు కావాలి
తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు మనుగడకు దోహద పడుతుంది. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇస్తే, తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగపవ్రేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బతికి బట్టకడుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగును అమలు చేయాలనే పట్టుదల, ఆకాంక్ష ఉంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి. కేవలం తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వాడికి ఇంగ్లీషురాక పోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలోనయినా ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే భరోసా కల్పించాలి. భాషను ఉపాధికి సాంకేతికతకు ముడి పెట్టాలని దివంగత రాష్టప్రతి అబ్దుల్‌ కలాం అన్నారు.అంటే తెలుగు మాధ్యమంలో చదివినా కలెక్టరు, డాక్టరు, ఇంజనీరు కాగలిగే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి! తెలుగు మీడియంలో చదివిన విద్యార్ధులకు సర్వీసుకమీషను పరీక్షల్లో రిజర్వేషన్లో, ప్రోత్సాహక మార్కులో తిరిగి ఇప్పించటానికి కృషి చేస్తామని 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన ప్రకటన ప్రభుత్వ ఉత్తర్వుగా రావాల్సిఉంది.
తమిళనాడు భాషా విధానం అనుసరణీయం
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళ మీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమం లో చదివించరనీ ,ఎవరూ చదవని భాష నశిస్తుందనీ ,తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆభాషలో మాత్రమే చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు .అందుకోసం అత్యవసరంగా ఒక ఆర్డినెన్‌‌స తెచ్చారు. శాసన సభలో, స్థానిక సంస్థల్లో ,ప్రభుత్వ కార్పోరేషన్లు, కంపెనీలలో తమిళ అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని శాసించారు.
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్‌ నంబర్‌ 145 డిపార్‌‌ట మెంట్‌ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియం లో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నారు. చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది. ప్రమోషన్లలో కాకుండా ప్రభుత్వోద్యాగాలకు మొదటిసారిగా నేరుగా జరిపే నియామకాలకు తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది.
తెలుగు రాష్ట్రాల ‘సర్వీస్’ కమీషన్ల కర్తవ్యం
తెలుగు మీడియంలో డిగ్రీ చదివిన వారికి తమిళనాడు తరహాలో 20% ఉద్యోగాలు రిజర్వేషన్‌ ఇవ్వాలి ఉమ్మడి రాష్ట్రంలో 1985 వరకు ఇచ్చినట్లు పోటీ పరీక్షల్లో 5% ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలి. తెలుగు అభివృద్ధి మంత్రిత్వ శాఖల పెద్దలందరూ ఇలాంటి ప్రతిపాదనల అమలుకు ఆహ్వానం పలుకుతున్నారు. అడ్డుచెప్పటం లేదు. కాబట్టి తెలుగు నిరుద్యోగులకు ప్రోత్సాహకాలు అందజేసే మంచి అవకాశం సర్వీస్‌ కమీషన్లకు వచ్చింది. ఉద్యోగ నియామకాలు పూర్తయ్యే లోపు ఈ ప్రతిపాదనలను పబ్లిక్‌ సర్వీసు కమీషన్లు ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాలి.
----నూర్ బాషా రహంతుల్లా 9948878833
http://www.suryaa.com/news/opinion/edit-page/article.asp…
(విశాలాంధ్ర 14.11.2016)
 http://54.243.62.7/images_designer/article_docs/2016/11/13/mainall.pdf

27, మే 2016, శుక్రవారం

ప్రభుత్వ కార్యాచరణ విధాన పత్రం రూపకల్పన కోసం నేను సమర్పించిన అభిప్రాయాలు

విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థలు మరియు ఎన్.టి.ఆర్.ట్రస్ట్ ఆధ్వర్యంలో 31.5.2016 న జరిగే తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జరగవలసిన కృషిని, చేపట్టవలసిన కార్యాచరణను సూచిస్తూ విధాన పత్రం రూపకల్పన కోసం నేను సమర్పించిన అభిప్రాయాలు :
2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాలు ప్రకటించిన విధానాలు చూస్తే తెలుగు ప్రాణం పోసుకొని తిరిగి లేస్తుందనిపించింది.కాల గమనంలో మన ఆశలు నీరుగారిపోయాయి.2016 లో నాలుగేళ్ళ తరువాత జరిగే తెలుగు భాషా సమ్మేళనం లో కూడా మళ్ళీ ఇంచుమించు అవే అంశాలపై సూచనలు అన్వేషిస్తున్నాం .
ఇంగ్లీషు చదువువల్ల,విదేశాల్లో కొలువులవల్ల డబ్బు సంపాదన విపరీతంగా ఉంది కాబట్టే అటు జనం పరుగులు పెడుతున్నారు.ఇక్కడే ఉండి దేశ ప్రజలకే సేవ చెయ్యండి,విదేశాలకు పోకండి అని వావిలాల,కాళోజీ,సత్యసాయిబాబా లాంటి మహనీయులు ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు.వినటం లేదు. వినరుకూడా.కారణం ఏంటంటే తెలుగు మాత్రమే చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది.తెలుగు భాష ద్వారా కూడా ఉద్యోగాలూ,డబ్బు వస్తుంటే అప్పుడు కొందరైనా స్వార్ధం కొంత చంపుకొని తెలుగు చదువుతారు.భాషతో సాంకేతిక,ఆర్ధిక విషయాలను ముడిపెట్టకుండా అభివృద్ధి సాధ్యంకాదు. ఏ జాతి సమస్త వ్యవహారాలు ఆ జాతి మాతృ భాషలోనే జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది.అది ఎప్పటికీ విజేతగానే ఉంటుంది. భాష పేరుతో ఐక్యత కోరే వాళ్ళు ఆ భాషను బ్రతికించటానికి కూడా కృషి చెయ్యాలి. భాష చచ్చిపోతే ఇక ఈ భాషా నినాదం కూడా చేయలేము.
నా సూచనలు :
1. మన రాష్ట్రంలో తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష. ఈ రెండు భాషల ప్రజల మధ్య వారివారి భాషా పదాల పరిచయం, అవ గాహన, మరింత పెరగటానికి నిఘంటువులు ఎంతగానో తోడ్పడతాయి. ఉర్దూ- తెలుగు నిఘంటువు, ఉర్దూ-తెలుగు జాతీయాలు, తెలుగు-ఉర్దూ సామెతలు లాంటి పుస్తకాలు ఎక్కడా అమ్మకానికి దొరకడంలేదు. ముద్రించాల్సిన అవసరంఉంది. ముషాయిరాల కంటే ముఖ్యమైన తెలుగు-ఉర్దూ, ఉర్దూ తెలుగు నిఘంటువులు కావాలి. తెలుగు జాతీయలూ, నుడికారాలూ, పదబంధాలూ కూర్చిన నిఘంటువుల అవసరం ఉంది . తెలుగు ప్రాచీన భాషా పీఠం తెలుగు ప్రాంతానికి తరలిరావాలి.తెలుగు మహా నిఘంటువు, జాతీయాలు, సామెతలు, జానపదగీతాలు, పాత చిత్రాలలోని పాటలు మొదలైన సాహిత్య గ్రంథాలు ముద్రించాలి.ఎన్ని ఎక్కువ తెలుగు నిఘంటువులు నెట్‌లో చేరితే తెలుగు అంతగా బలపడుతుంది.ఆధునిక అవసరాలకు ధీటుగా తెలుగు భాష తయారు కావాలి. ఇంగ్లీషులో ఉన్న సౌలభ్యాలన్నీ తెలుగుకూ కల్పించాలి. పదాల శుద్ధి`యంత్రం, గుణింత, వ్యాకరణ పరిష్కారయంత్రం, సాంకేతిక నిఘంటువులు, మాండలిక నిఘంటువులు, డిజిటల్‌నిఘంటువులు, అమరకోశాలు, పదశోధనా యంత్రాలు, ఉచ్ఛారణ పద ప్రయోగ నిఘంటువులు, వ్యుత్పత్తి కోశాలు, లిపిబోధినిలు, సాహిత్య శోధనా పరికరాలు, పదాను క్రమణికలు... ఇలా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌లోనే నిఘంటువులకు కొత్త పదాలను జోడించే అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏయే ప్రాంతాల్లో ఏ పదాన్ని ఎందుకు, ఎలా వాడుతుంటారో ఆయా ప్రాంతాల ప్రజలనే చెప్పనివ్వాలి. సరిగా ఉన్నట్లు భావించిన కొత్త పదాలను ఎప్పటికప్పుడు నిఘంటువుల్లో చేరుస్తూ పోవాలి. మన నిఘంటువుల సైజు పెరగాలి. అవి జన బాహుళ్యానికి వాడకంలోకి విస్తారంగా వస్తూనే ఉండాలి.
2. వక్ఫ్‌బోర్డు నిఖా నామాలు (వివాహ ధ్రువపత్రాలు) తెలుగు భాషలో కూడా ప్రచురించాలి. మన రాష్ట్రంలో తెలుగు మాతృభాషగల 'తెలుగు ముస్లిములు' లక్షలలో వున్నారు. నిత్యం ఉర్దూ మాట్లాడే ముస్లింలలో కూడా పలువురికి ఉర్దూ చదవడం, రాయడం రాదు. వీరంతా తెలుగులోనే రాతకోతలు సాగిస్తుంటారు. ఉర్దూ రాని ముస్లింలకు కూడ వివాహ ధృవీకరణ (నిఖానామా) పత్రాలను ఉర్దూలోనే జారీ చేస్తున్నారు. తెలుగు ముస్లిముల సౌలభ్యం కోసం ఖాజీలు తెలుగులోనే నిఖా ప్రసంగాలు చేస్తున్నారు. ఖురాన్‌, హదీస్‌వంటి మూల గ్రంథాలన్నిటిని తెలుగులో ముద్రించారు. అలాగే వివాహ ధృవీకరణ పత్రాలను కూడ తెలుగులో ముద్రించి ఇస్తే తెలుగులోనే పూరించి ఇస్తామని ఖాజీలు అంటున్నారు. కాబట్టి వక్ఫ్‌బోర్డు వివాహ ద్రువపత్రాలను తెలుగు భాషలో కూడా ప్రచురించాలి.
3 . తెలుగులో ఉత్తమ సాఫ్ట్ వేర్ లు తయారుచేసిన సాంకేతిక నిపుణులకు,తెలుగు భాషకు ఉపకరించే సులభ ఉపకరణాలను తయారు చేసిన సాంకేతిక పరిజ్నానులకు తెలుగు వైతాళికుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి.తర్జుమా పరికరాల తయారీ ప్రారంభదశలో ఉంది గనుక కొన్ని తప్పులు వస్తున్నాయి.అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.
4 . తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 సర్వీసు ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక మార్కులు ఇస్తే, తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. కొంతవరకైనా ఆఫీసుల్లో తెలుగు బ్రతుకుతుంది. తెలుగు విూడియంలో చదివితే ఉద్యోగా లొస్తాయన్న ఆశతో కొంత మందైనా తెలుగులో చదువుతారు. తెలుగులో చదివిన అధికారులు కార్యాలయాల్లో జరిగే పనులన్నిటికీ ''కొత్తపదాలు'' పుట్టిస్తారు. తెలుగు పదకోశాలు అమలవుతాయి. పరిపాలనకు పనికొచ్చే శాస్త్రీయ తెలుగు తయారవుతుంది. అధికార భాషగా తెలుగును అమలు చేయాలనే పట్టుదల, ఆకాంక్ష ఉంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని ప్రోత్సహించి అధికారులుగా చేయాలి. కేవలం తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వాడికి ఇంగ్లీషురాక పోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలోనయినా ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే వాతావరణం కల్పించాలి. అంటే ఇంగ్లీషు రాకపోయినా కలెక్టరు , డాక్టరు , ఇంజనీరు కాగలిగే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి! అప్పుడు జనం తండోపతండాలుగా తెలుగులో చదువుతారు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్ధులకు సర్వీసుకమీషను పరీక్షల్లో రిజర్వేషన్లో, ప్రోత్సాహక మార్కులో తిరిగి ఇప్పించటానికి కృషి చేస్తామని చేసిన ప్రకటన ప్రభుత్వ ఉత్తర్వుగా రావాల్సిఉంది.
5 . రాష్ట్ర అధికార బాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఏబికె ప్రసాద్‌గారు ప్రభుత్వానికి కొన్ని మంచి సిఫారసులు చేసారు. (ఈనాడు: 19-5-2005).అందులో ఈనాటికీ అమలు కానివి: 1) తెలుగు మీడియంలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. 2) ప్రైవేటు, కార్పోరేట్‌ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉండాలి. 3) వ్యాపార సంస్థలు,దుకాణాలన్నీ తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయకపోతే వాటి లైసెన్సులు రద్దు చేసే అధికారం కన్నడ అధికార భాషా సంఘానికి ఉన్నట్లుగా, తెలుగు అధికార భాషా సంఘానికి కూడా ఉండాలి.4 ) తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు రెండవ స్థానంలో ఉన్నందున ఆ రాష్ట్రంలో తెలుగును రెండవ అధికార భాషగా ప్రకటించాలి. 5 ) రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వాడుక బాషలోకి తేవాలి. 6 ) ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న బాషలన్నిటినీ అప్పటికప్పుడు తర్జుమా చేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటు చేయాలి. 7 ) స్థానిక న్యాయస్థానంలో తీర్పులు అధికార భాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. 8 ) మండల స్థాయి నుండి సచివాలయం వరకు అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి.
6 . తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడవిూ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను తెలుగు ప్రజలకు బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి. పరిపాలక గ్రంథాలు కోడ్లు, మాన్యువల్‌లు, లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కవిూషన్‌ పోటీ పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి. కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులు సంకలనం, వ్యవకలనం లాంటి సంస్కృత పదాలను వాడి తెలుగు మీడియం అంటే పిల్లలు భయపడేలా చేశారు. పిల్లల పుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి.
7 . తెలుగును రెండవ జాతీయ భాషగా ప్రకటించాలి. మన ప్రజల భాషలోనే జీవోలు రావాలి. అప్పుడే తెలుగు అధికార భాషగా విరాజిల్లుతుంది.తెలుగు భాష మాట్టాడేవాళ్ళ సంఖ్యనుబట్టి, జనబలాన్ని బట్టి పార్లమెంటులో మన గౌరవం మనకు దక్కుతుంది. హిందీతో పాటు తెలుగును కూడా ఇతర భాషలవాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది.పార్లమెంటులో హిందీ వాళ్ళలాగా మనం కూడా తెలుగులో మాట్లాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులన్నీ తెలుగులో పొందవచ్చు. కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ తెలుగులో నడుపవచ్చు. చట్టాలన్నీ తెలుగులోకి మార్చబడతాయి. తెలుగులో తీర్పులొస్తాయి. తెలుగులో ఇచ్చే అర్జీలు ఢిల్లీలో కూడా చెల్లుతాయి. ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి కొండంత అండ, గౌరవం హిందీ వాళ్ళతో పాటు సమానంగా లభిస్తాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లలో బోర్డుల విూద తెలుగులో కూడా పేర్లు రాస్తారు. ఈ రోజున హిందీ భాష వల్ల హిందీ వాళ్ళకు ఏయే ప్రయోజనాలు ఒనగూడాయో అవన్నీ తెలుగు వాళ్ళు పొందవచ్చు.
----- నూర్ బాషా రహంతుల్లా
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీకలక్టర్
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ
తుళ్ళూరు 9948878833

31, జులై 2014, గురువారం

పార్లమెంటులో తెలుగు వినబడాలి (తెలుగు వెలుగు ఆగస్టు 2014)


పార్లమెంట్ లో తెలుగు వినపడాలి
తెలుగు వెలుగు ఆగస్టు 2014 
నూర్ బాషా రహంతుల్లా 9948878833

 ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అసలే కనిపించదన్నది చాలా మంది అనుకునే మాట. 
కర్నూలు జిల్లా శ్రీశైలం భూసేకరణ విభాగంలో ప్రత్యేక కలెక్టర్ నూర్ బాషా రహంతుల్లా లాంటి వారు ఈ అభిప్రాయానికి మినహాయింపుగా నిలుస్తారు. మూడు దశాబ్దాలుగా తెలుగును పాలనా భాషగా అమలు చేసేందుకు కృషి చేస్తున్న ఆయన... 'తెలుగు దేవభాషే' అంటారు. రహంతుల్లాతో 'తెలుగు వెలుగు' ముఖాముఖి...

తెలుగుపై అభిమానమెలా పెంచుకున్నారు?
మాతృభాష నాకు తల్లి లాంటిది. నా తల్లిని నేను గౌరవించుకోనా?చిన్నప్పటి నుంచి తెలుగంటే చెప్పలేనంత మమకారం. తీయనైన తెలుగును మింగేస్తున్న ఇతర భాషల  ఆధిపత్యంపై అసంతృప్తి, ఆవేదనల నుంచే మాతృభాషాభివృద్ధి, పరిరక్షణకు ఏదో ఒకటి చేయాలన్న తపన కలిగింది.

మూడుదశాబ్దాలుగాభాషాభివృద్ధి.

పరిరక్షణకు కృషిచేస్తున్నారు.ఈ క్రమంలో మీ అనుభవాలు, విజయాలు?

అమ్మభాషలోనే మన ఆలోచనలు వికసిస్తాయి. అందులోనే మన భావాలను సూటిగా, స్పష్టంగా రాయగలం. పశ్చిమ గోదావరి జిల్లాలో తహశీల్దారుగా పని చేస్తున్నప్పుడు 23 రిట్ పిటీషన్లకు తెలుగులోనే సమాధానాలు రాసి పంపితే పై అధికారులు కోప్పడ్డారు. అయినా చలించలేదు. న్యాయస్థానంలో విజయం సాధించా. నా కార్యాలయానికి వచ్చే విద్యార్థుల నుంచి రైతుల వరకు ధరఖాస్తులు, అభ్యర్థన పత్రాలను వారే రాసుకునే విధంగా నమూనాలను తెలుగులో తయారు చేయించి అందించా. ఇస్లాం, క్రైస్తవ మతాల మీద తులనాత్మక అధ్యయనం చేస్తూ తెలుగులో 10 పుస్తకాలు రాశా. తెలుగు సామెతలతో 1986 నుంచి 1991 వరకు గీటురాయి వారపత్రికలో 'ఉబుసుపోక' శీర్షికతో వ్యంగ్య వ్యాసాలు రాశా. 2003 లో అధికారభాషా సంఘం నుంచి విశిష్ట భాషా పురస్కారం అందుకున్నా. తెలుగులో డిగ్రీ చదివిన నాకు 5 శాతం ప్రాధాన్యత మార్కులు ఇవ్వడం వల్లే ఉద్యోగం వచ్చింది. గుంటూరు జిల్లాలో భూసేకరణ అధికారిగా పనిచేసేటప్పుడు భూసేకరణ అవార్డు పత్రాలను తొలిసారి మాతృభాషలో ఇచ్చాం. చేయాలన్న సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదు.

మాతృభాష పరిరక్షణ గురించి ఏమంటారు?
'మాతృభాషను ప్రేమించే వాడే నిజమైన దేశభక్తుడు' అని గిడుగు రామమూర్తి అన్నారు. మాతృభాషలో చదువుకుంటేనే ఆలోచనలు వికసిస్తాయి. కోర్టుల్లో, వాదనలు, తీర్పులు ఆంగ్లంలో ఉండటంవల్ల బాధితులు, ముద్దాయిలకు మధ్య లాయర్లు దుబాసీలుగా వ్యవహరించాల్సి వస్తోంది. శాస్త్ర సాంకేతిక విషయాలు ఆంగ్లంలో ఉండటం వల్ల ఆయా రంగాల ఫలాలు  ఆ భాష రాని వారికి ఆమడదూరంలో ఉండిపోతాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు, 'విద్యార్థుల గ్రాహ్యతకు, భావవ్యక్తీకరణకు మాతృభాష కీలకం . మాతృభాషలో విద్య నేర్పడం, నేర్వడం ఎంతో సులభం.' అన్నఅంశాన్ని బలంగా నమ్ముతాను.

తెలుగును పాలనా భాషగా ఎందుకు అమలు చేయలోకపోతున్నాం?
తెలుగులోనే ఉత్తర, ప్రత్యుత్తరాలు జరగాలని అవిభాజ్య రాష్ట్ర ప్రభుత్వం గతంలో నాలుగు ఉత్తర్వులను ఇచ్చింది. వాటిని అమలు చేసే అధికారులే లేరు. నల్గొండ జిల్లాలో కలెక్టర్ ముక్తేశ్వరరావు ఈ ఉత్తర్వుల ఆధారంగానే  ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండేలా చేయగలిగారు. పాలనా వ్యవహారాల్లో తెలుగుకు పెద్దపీట వేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు దీనిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభుత్వం తెలుగు అమలు తప్ప వేరే గత్యంతరంలోని పరిస్థితి కల్పించాలి. అప్పుడు పాలనా భాషగా తెలుగుకు ఆదరణ వస్తుంది. తెలుగు మాతృభాషగా ఉన్న ఉద్యోగులు లక్షలాది మంది పనిచేస్తున్నారు. మీ మాతృభాషలోనే దస్త్రాలు (ఫైళ్ళు)  రాయండి. మీ మాతృభాషలోనే కార్యాలయ కార్యక్రమాలు నిర్వహించండి అని ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఏ ఉద్యోగీ వెనుకాడరు. కార్యాలయాల్లో కంప్యూటర్ల వినియోగం అధికంగా ఉంది. వాటిని మాతృభాషకు అనుసంధానం చేసుకోలేకపోతున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఉచితంగా ఇచ్చినా దాన్ని ఇన్ స్టాల్ చేసుకోవడంలో విపలమవుతున్నారు. ఆంగ్లాన్ని సులువుగా టైప్ చేసినట్లు తెలుగును కూడా టైప్ చేసే విధానం తీసుకురావాలి.

తెలుగు మాధ్యమ విద్యపై ఇప్పటి వారిలో అయిష్టత పెరుగుతోంది. కారణం?
ఆంగ్లంలో నేరిస్తేనే వేగంగా ఉద్యోగాలు వచ్చి, అధిక సంపాదనకు అవకాశం ఉంటుందనే భ్రమతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ భాష మీద మోజు చూపుతున్నారు. తెలుగువారి హృదయభాషను మన ప్రభుత్వం పాఠశాలల్లో తప్పనిసరి చేయలేకపోతోంది. తన దగ్గరికి వచ్చే భక్తులకు తెలుగులోనే సందేశాన్నిచ్చే వారు సత్యసాయి బాబా. అలా తెలుగు వినక తప్పని పరిస్థితి కల్పించారు. నా ఉద్దేశంలో రాజకీయ రంగంలో ఎన్టీరామారావు లాగా ఆధ్యాత్మిక రంగంలో సత్యసాయి తెలుగు భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టారు. ఇక్కడ బాగా చదువుకుని ఎక్కువ జీతం వస్తుందని డాలర్ల కోసం విదేశాలకు వెళ్తున్న వారి గురించి 'ఎబ్రాడ్ లో ఏముంది బ్రాడ్ నెస్ మీలోనే ఉంది. దానిని వదిలిపెట్టి విదేశాలకు పోవడం పొరపాటు' అని బాబా చెప్పిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

ఆధునిక సాంకేతిక అవసరాలకు తగ్గట్టు తెలుగు లిపిలో మార్పులు అవసరమా?
"56 అక్షరాలు ఉన్న తెలుగుభాష కంటే 26 అక్షారాలే ఉన్న ఇంగ్లీషు ఎక్కువ వాడుకలోకి వచ్చింది. ప్రపంచ భాష అయింది. కాబట్టి తెలుగుభాషకు 16 అక్షరాలే పెట్టి నంబర్ వన్ పొజిషన్ కు తెస్తాను చూడండి" అంటాడో నాయకుడు ఓ సినిమలో. భాషా సంస్కర్తలు ఈ పనికి పూనుకోవచ్చు. తెలుగులో ఎదురయ్యే మొదటి సమస్య గుణింతాలు, ఒత్తులు. అవసరమైన అక్షరాలను, ఒత్తులను వదిలించుకోవాలి. బ్రౌన్ కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా  తెలుగు ముద్రణ చాలా లోపాలతో సాగుతూ వచ్చింది. ముద్రాక్షరాల సంఖ్యను 405 కన్నా తగ్గించడం ఎవరికీ సాధ్యం కాలేదు. బందరులోని కళ్యాణి టైపు ఫౌండ్రీ అధిపతి కె.వి. కొండయ్య అక్షరాల సొంపు చెడకుండా ముద్రణా యంత్రానికి ఒదిగే విధంగా టైపు తయారీలో సాంకేతిక మార్పులు చేసి 350 కి తెలుగు లిపి రూపాలను కుదించారు. దీన్ని 'కళ్యాణి' టైపు అన్నారు. ఇది కంప్యూటర్ యుగం. వేగం నేటి యుగధర్మం.  ఈ వేగానికి తట్టుకోలేనిదేదీ నేడు నిలవలేదు. తెలుగుభాషకు ఇది సంధిదశ. మద్రాసులో మురళీ కృష్ణ అనే ఇంజనీరు బాపు అక్షరాలతో సహా అందంగా అక్షర స్వరూపాలను కంప్యూటర్ ప్రింటింగ్ కు అనువుగా కీబోర్డు రూపొందించారు. లిపిని ఇంకా సంస్కరించి తెలుగుభాషా స్వరూపాన్ని ఆధునీకరించడానికి ప్రయత్నించాలి. చిన్నారులపై లిపి భారం అధికంగా ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.

కంప్యూటర్లలో తెలుగు వాడుక ఎలా ఉంది. ఇంకా పెంచాలంటే ఏం చేయాలి?
ఇప్పుడు మంచి సాంకేతిక ఉపకరణాలు వచ్చాయి. కొన్ని సమస్యలు తీరాయి. ఇంకా కొన్ని సమస్యలు తీరాలి. అన్ని రకాల ఖతుల(ఫాంట్ల)ను యూనికోడ్ లోకి మార్చుకునే వెసులుబాటు ఉండాలి. రకరాల కీబోర్డులు, ఖతులతో కుస్తీ పడుతున్నాం. ఈ అవస్థ తీరాలంటే యూనికోడ్ లో మాత్రమే పుస్తకాలు ముద్రించమని కోరాలి. అలా చేస్తే ప్రపంచంలో ఉండే తెలుగువాళ్ళు ఎక్కడి నుంచైనా తెలుగు పుస్తకాలను, వ్యాసాలను కంప్యూటర్లలో సులభంగా చదవగలుగుతారు, రాయగలుగుతారు. విషయాలను వెతకగలుగుతారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్ సైట్లను తెలుగులోకి అనువదించనున్నారు. తెలుగు రాయడానికి, తెలుగులో సమాచారం చదవడానికి, చూడటానికి అనుకూలంగా బ్రౌజర్లు ఉండేలా చూడాలి. సమాచారం అంతా తెలుగులో డాక్యుమెంట్ రూపంలో అందుబాటులో ఉండాలి. ఆరు భిన్న రూపాల్లో ఏక సంకేత లిపి తెలుగు ఫాంట్ అభివృద్ధి చేయాలి. తెలుగు అక్షర క్రమం సరిచూసుకోవడానికి పదాల విశ్లేషణ సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేయాలి. ఇది ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండాలి. గౌతమి, వేమన, పోతన, అకృతి వంటి 50 కి పైగా యూనికోడ్ ఫాంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న తెలుగు వాడే పద్ధతులను ప్రజల్లో ప్రచారం చేయాలి.


తెలుగు కీర్తనలకు దిగివచ్చిన దేవుళ్ళు
బమ్మెర పోతన, కంచర్ల గోపన్న (రామదాసు), త్యాగయ్య, అన్నమయ్య, ఉమర్ అలీషా లాంటి ఆధ్యాత్మిక వేత్తలు, సంగీతకారులు, మహాభక్త గాయకులు, భగవంతుని దయానుగ్రహాలపై తమకు హక్కు ఉన్నట్లుగా రచించిన కీర్తనలన్నీ తెలుగులో ఉన్నాయి.  ఆ కీర్తనలు విని దేవుళ్ళే దిగి వచ్చారని బడాయిపోతుంటాం. వాళ్ళ భాషను మాత్రం దైవ భావన లేకుండా అగౌరవ పరుస్తాం. ఇదేం నీతి? రామభద్రుడు పలికిస్తేనే భాగవతం తాను పలికానని పోతనే స్వయంగా చెప్పుకున్నాడు. ఇక పోతన రాయలేక వదిలేసిన పద్యాలను రాముడే వచ్చి తెలుగులో పూరించాడనీ, తానీషాకు డబ్బు చెల్లించి రామదాసును చెర విడిపించాడనీ ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం కదా! అలాంటప్పుడు తెలుగు దేవభాషే కదా! ఒక వేళ అలా అనిపించకపోతే మనలో ఏదో తేడా ఉన్నట్లే.

మీ 'మహా నిఘంటువు' యజ్ఞం ఎంత వరకు వచ్చింది... దాని లక్ష్యం?
మహా నిఘంటువు నిర్మాణం తెలుగు భాషాభివృద్ధికి దోహదం చేస్తుంది. అదింకా ఆరంభ దశలో ఉంది. తెలుగునేల భిన్న ప్రాంతాల్లోని ప్రజల తెలుగు మాండలికాలు, ఆయా ప్రాంతాలకే పరిమితమైన కొన్ని వేల ప్రత్యేక పదాలు ఇప్పుడున్న నిఘంటువుల్లో లేవు. దీంతో ప్రస్తుతమున్న నిఘంటవులు కొంత మేరకే ఉపయోగపడుతున్నాయి. ఆయా కొత్త పదాలన్నింటినీ సేకరించి, వరస క్రమంలో పేర్చి కొత్తగా నిఘంటువు నిర్మాణం చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొల్లేరు ప్రాంతంలో పదుల సంఖ్యలో  చేపల పేర్లు  వాడుకలో ఉన్నాయి. కమ్మరి, కంసాలి ఇలా ప్రతీ కులానికి, వృత్తికే ప్రత్యేకమైన పద సంపద ఎంతో ఉంది. ఇదంతా నేడు కనుమరుగైపోతోంది. ఇవన్నీ నిఘంటువులో చేర్చాలి. హైదరాబాద్ లోని 'ఫ్లై ఓవర్' లను చూసి కొందరు పల్లె వాసులు 'పైదారులు' అన్నారు. తాను చూసిన వస్తువుకు తన భాషలో ప్రతి మనిషీ ఒక పేరు పెట్టుకుంటాడు. ఆ పేరును గౌరవించి నిఘంటువుల్లో చేర్చుకున్న జాతి. ఆ జాతి భాషా బలపడతాయి. మన పాలకులు, సాహితీవేత్తలు, అధికారులు ఈ సత్యాన్ని గ్రహించి ముందుకు నడవాలి.

భాషా పరిరక్షణలో ప్రసార మాధ్యమాల పాత్ర?
తెలుగుభాషా పరిరక్షణకు రామోజీరావు చిత్తశుద్ధితో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వ్యక్తిగా చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వాలు ఒక వ్యవస్థగా చేయాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు సాఫ్ట్ వేర్ వినియోగంలో అధికారులు పడుతున్న ఇబ్బందుల్ని 'ఈనాడు' వంటి తెలుగు పత్రికలు సునాయాసంగా అధిగమిస్తున్నాయి. ఇలాంటి సులభమైన సాంకేతిక మెలకువలు అందరికీ వివరించి, ఆయా సాఫ్ట్ వేర్ లను ప్రభుత్వానికి అందించి సాధారణ పౌరులు సైతం వినియోగించేలా సాయం చేయాలి. పత్రికలు తెలుగుపై అనురక్తిని పెంచేందుకు కృషి చేయాలి. తెలుగుభాషకు సేవ చేసే వాళ్ళను గుర్తించి వారి పరిచయాలను అందరూ ప్రచురిస్తే ఆ స్ఫూర్తి మరింతమంది భాషాభిమానులను తయారు చేస్తుంది.

నూర్ బాషా రహంతుల్లా 1959 ఏప్రిల్ 18న గుంటూరు జిల్లా కంకటపాలెంలో జన్మించారు. నూర్ బాషా రోషన్ బీ, మౌలాలీ దంపతులు ఆయన తల్లిదండ్రులు. ఎం.కాం. చదివిన రహంతుల్లా వివిధ పత్రికల్లో తెలుగు భాష, పరిపాలన సంబంధమైన వ్యాసాలు ప్రచురించారు. వివిధ అంశాలపై 10 తులనాత్మక పరిశీలనా గ్రంథాలు రాశారు. అన్ని మాండలికాల పదాలతో ఆధునిక అవసరాలు తీరేట్లుగా తెలుగు మహా నిఘంటువు నిర్మాణం, తెలుగు లిపి సంస్కరణ, పాలనా వ్యవహారాలు తెలుగులో సాగించడం కృషి చేస్తున్నారు.

మీ కార్యాలయంలో తెలుగు వినియోగంపై ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? ఈ విషయంలో సహోద్యోగుల తోడ్పాటు?
మా కార్యాలయంలో గతంలో ఆంగ్లంలో ఉన్న అన్ని దరఖాస్తు నమూనాలను తెలుగులోకి మార్పించా. మా నుంచి జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ విధిగా తెలుగులోనే నిర్వహించాలని ఆదేశించా. దాన్ని వంద శాతం అమలు చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అన్ని అధికారిక కార్యక్రమాల్లో తెలుగుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ముఖ్యంగా న్యాయస్థానాలతో చేసే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నాను.

ఉన్నతాధికారులకు పని ఒత్తిడి ఉంటుంది మరి మీరు తెలుగుకు సమయం ఎలా కేటాయిస్తున్నారు? అధికార భాష అమలు కావడానికి ఉన్నతాధికారులే ఆటంకం అన్న వాదనలున్నాయి. మీరేమంటారు?
నెలలో రెండు, మూడు రోజులు అమ్మభాష సేవ కోసం కేటాయించలేనంత పని ఒత్తిడి ఏమీ లేదు. ఉన్న సమయాన్నే ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటున్నాను. వ్యక్తిగా ఏ ఉన్నతాధికారీ అధికారభాష అమలయ్యేందుకు ఆటంకమని నేను అనుకోను. వ్యవస్థలో ఉన్నతాధికారులు అధికారభాష తెలుగును పక్కాగా అమలు  చేయడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు తొలగించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో ఉంటూ ఇతర రాష్ట్రాలు, కేంద్రంతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు ఆంగ్లంలో ఉన్నా ఫర్వాలేదు. అయితే అంతర్గత ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలన్న నిబంధన, అమలయ్యేలా అధికార భాషా సంఘం ఒత్తిడి తీసుకురావాలి.

ఏ కార్యాలయంలోనైనా కీలక పత్రాలు ఆంగ్లం, హిందీల్లోనే ఉంటాయి. మరి సగటు తెలుగువాళ్ళ పరిస్థితి ఏంటి?
దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య, ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య సేతుభాషగా ఇంగ్లీషు రూపొందడమే అధికారభాషగా తెలుగు అమలుకు ప్రధాన అవరోధంగా కనిపిస్తోంది. ఆంగ్లం ప్రభావం ముందు ప్రాంతీయ భాషలు వెలవెలబోతున్నాయి. తెలుగుజాతికి గౌరవం దక్కాలంటే రెండో జాతీయ అధికార భాష తెలుగు కావాలి. అందుకు తెలుగు ఎంపీలందరూ కృషి చేయాలి. పార్లమెంటులో రాష్ట్ర విభజన సమయంలో తెదేపా ఎంపీ హరికృష్ణ తెలుగులో మాట్లాడతానంటే స్పీకర్ ఎగతాళిగా చూశారు. రెండో అధికారభాషగా గుర్తిస్తే హిందీ వాళ్ళలా పార్లమెంట్ లో తెలుగులోనే మాట్లాడొచ్చు. కేంద్ర ఉత్తర్వులను తెలుగులో పొందవచ్చు. హిందీ వల్ల హిందీ మాట్లాడేవాళ్ళు ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నారో అవన్నీ తెలుగువాళ్ళు కూడా పొందవచ్చు.

స్థానిక భాషలోనే సమాధానాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం నిబంధన. ఇక్కడేమో తెలుగులో సమాచారం ఇవ్వడం లేదు...
ప్రభుత్వ దస్త్రాలు తెలుగులో ఉంటే సమస్యే లేదు. సమస్య అంతా ఆంగ్లంలో ఉండటం వల్లనే. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ తెలుగులోనే ముద్రిస్తారు. ఎందుకో తెలుసా? చట్టం గట్టిగా చెబుతుంది కాబట్టి. ఇదే చట్టం తెలుగుభాష అమలుకు కూడా వర్తించాలి. చట్టం, నిర్భంధం ఉంటే తెలుగు అమలుకు ఆటంకమే ఉండదు.


ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో పరిశోధన ఎలా ఉంది?
మన భాషను మనమే పాడుచేసుకుంటూ పోతున్నాం. తెలుగు మీద అన్యభాషల ప్రభావం ఉందని పరిశోదనలు చేశారేగానీ, ఫలానా భాష మీద తెలుగు ప్రభావం ఉందని ఒక్కరూ పరిశోధన చేయలేదు. ఈ పని తెలుగు విశ్వవిద్యాలయం చేయాలి. విద్యార్థులను ప్రోత్సహించాలి.

ముస్లింలకు తెలుగులోనే నిఖానామా రూపొందించారు. దానిపై స్పందన...
తెలుగులో పెళ్ళి తంతు జరగాలనే కోరిక తెలుగువారిలో పెరుగుతోంది. వివాహ విధి వాధానమంతా మనకు తెలియాలి అంటూ సామల రమేష్ బాబు తన ఇద్దరు కొడుకుల పెళ్ళి తెలుగులోనే చేశారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి పెళ్ళిళ్ళన్నీ తెలుగులోనే చేయాలని ఉద్యమం చేపట్టారు. వెనిగళ్ళ సుబ్బారావు 'పెండ్లి మంత్రాల వెనుక బండారం' అనే పుస్తకంలో తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఉర్దూలో ముద్రించిన 8 పేజీల పెళ్ళిపుస్తకం నిఖానామా ఖాజీలకు సరఫరా చేస్తుంది. దీన్ని తెలుగులో ముద్రించాలని వక్ఫ్ బోర్డుకు రాశాను. ప్రస్తుతం తెలుగులో కూడా నిఖానామాలు అందుతున్నాయి.

ప్రస్తుతం మన సాహిత్యం పరిస్థితి? తెలుగు సాహిత్యాన్ని యువత ఆకర్షించాలంటే...?
ప్రస్తుతం తెలుగులో చదివితే మంచి జీతాలొచ్చే ఉద్యోగాలు రావేమో అన్న భ్రమలో ఉన్నారు. ఇక తెలుగులో విజ్ఞాన శాస్త్ర సాహిత్యం అంత ఎక్కువగా రాలేదు. కంప్యూటర్ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఆంగ్లం బాగా రావాలి అనుకుంటున్నారు. కంప్యూటర్ కోసం తెలుగును బలిపెట్టడమంటే ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడమే. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాతృభాష కన్నడం కాని వారైనా సరే.. మూడో భాషగానైనా కన్నడం చదవాల్సిందే. కన్నడం లేకుండా అక్కడ పాఠశాల విద్య పూర్తికాదు. ప్రభుత్వోద్యోగాల్లో 15 శాతం మార్కులు కన్నడ మాధ్యమం వాళ్ళకు ప్రోత్సాహకంగా కేటాయించారు. ఇలాంటి విధానాలు మనమెందుకు అమలు చేయలేక పోతున్నాం. భాషను సాహిత్యానికి, కవిత్వానికి మాత్రమే పరిమితం చేస్తే, భాషతో పాటు ఆ భాష మాట్లాడేవారూ వెనుకబడి పోతారు. అందుకే భాషను ఉపాధితో ముడిపెట్టాలి. అప్పుడే యువతరంలో తెలుగుపై అభిమానాన్ని ప్రోది చేయగలుగుతాం.
https://www.facebook.com/nrahamthulla/media_set?set=a.800962669935725.1073741835.100000659993594&type=1&notif_t=like








 తెలుగు వెలుగు 2014
సాక్షి29.8.2015