18, జులై 2012, బుధవారం

దిక్కులేని భాషలకు ఇంగ్లీషే దిక్కు


26.దిక్కులేని భాషలకు ఇంగ్లీషే దిక్కు
                చరిత్రలో ఎప్పుడైనా తెలుగువాళ్ళు మరో దేశం మీద దండయాత్ర చేసి వాళ్ళ మీద మన తెలుగు భాషను రుద్దారా? పోనీ వ్యాపారం పేరుతో తెలుగు దేశపు కంపెనీ ఒకటి పెట్టి నౌకలు వేసికెళ్ళి ఇతర దేశాలను తమ పాలనలోకి తెచ్చుకున్నారా? విదేశీయుల్ని విభజించి పాలించారా? మంచి లాభాలు సంపాదించి మన తెలుగుదేశానికి పట్టుకొచ్చారా? ఇలాంటి కబ్డాకోరు పనులు తెలుగువాళ్ళు చేసినట్లు నా చెవిని పడలేదుగాని ఆంగ్లేయులు అన్ని జాతుల వాళ్ళ మీద, అన్ని భాషల వాళ్ళ మీద చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లీషు అంతర్జాతీయ భాష కావటానికి ప్రధాన కారణం ఆంగ్లేయుల సామ్రాజ్యవాదమే.
                ఇంగ్లీషు వాళ్ళు ఏదేశం మీద కాలుపెడితే ఆ దేశంలో స్కూలు, చర్చి, కోర్టు ఖచ్చితంగా నెలకొల్పేవారట. ఒకవేళ స్కూలు పెట్టకపోయిన చర్చి, కోర్టు తప్పనిసరిగా పెట్టేవారట. ఈ మూడింటిలో తమ భాష అమలు జరిపేవారట. తెలుగువాళ్ళు తమ పనేదో తాము చూసుకొనిపోయే రకమే గాని, దురాక్రమణ తత్వం గల వాళ్ళు కాదు. అవసరమైతే తమ భాషను వదిలేసి, ఇతర భాషలను నేర్చుకుని మరీ ఊడిగం చేసి పొట్టపోసుకునే రకమేగాని, అవతలి వాళ్ళను తమ భాషతో పాలించే రకం కాదు.
                తెలుగువాడి దగ్గరున్న సంపదను దోచుకుపోవటానికి ఎవరెవరో ఎక్కడెక్కడి నుండో వచ్చి దోచుకుపోయారు. మన తెలుగువాడు ఎన్నడు దోచుకురావడానికి బయలుదేరలేదు. అటువంటి అవసరం మన వాళ్ళకు కలగలేదు. ఒకవేళ అలాంటివి గుర్తించిన తెలుగు రాజులు తమలో తామే కలహించుకొని చెరో పక్షమై నశించిపోయారు గాని ఇతరులది దోచుకొచ్చి చెరిసగం పంచుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా బానిసగా సంపాదించుకునేదే తెలుగువాడికి బాగా రుచించింది కానీ, తానే యజమానై ఇతర భాషల వాళ్ళకు జీతాలివ్వటం అనే ఆలోచన అసమంజసంగా, విడ్డూరంగా, అసలు వినటానికే అసహ్యంగా ఉంటూ వచ్చింది.
                ఒక్క తెలుగవాళ్ళే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎవరెవరి భాషలు నాశనమైపోతున్నాయో వాళ్ళందరి తత్వం ఇలాంటిదే. మా వాడు దెబ్బలకోరుస్తాడు అంటే విడిపించే దిక్కులేక అన్నాడట. అంతర్జాతీయ భాషలు కొడుతున్న దెబ్బలకు జాతీయ, ప్రాంతీయ భాషలు విడిపించే దిక్కులేక ఓర్చుకుంటున్నాయి. ఇక ఆయా ప్రాంతాల్లో ఒకటో అధికార భాష, రెండో అధికార భాష తలపడి, కలబడి ఒకదాన్నొకటి తిరస్కరించుకొని, అంతార్జాతీయ భాషనే అంతిమ శరణ్యంగా ఆశ్రయిస్తున్నాయి. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్లు  ఈ ప్రపంచంలో ఎన్నో దిక్కుమాలిన భాషలకు ఇంగ్లిషే దిక్కయింది. అవసరం అలాంటిది.
బడి, గుడి, తీర్పు ఈ మూడూ ఇంగ్లీషులో నడిచేలా ఆంగ్లేయులు ముందు తమ దేశంలో అమలు చేశారు. తరువాత ఇతర దేశాల మీద పడ్డారు. భాష విషయంలో ఇంగ్లీషులో వాళ్ళు ఇంటగెలిచాకే రచ్చ గెలిచారు. తెలుగు వాళ్ళతో పాటు మరెన్నో భాషల వాళ్ళు ఇంట గెలవలేదు. తమ బడుల్ని, గుడుల్ని, తమ తీర్పుల్నీ తమ భాషల్లోకి తెచ్చుకోలేదు. అందుకే వారివి ఆంగ్ల పాలిత ప్రాంతాలుగా మారిపోయాయి.
                ''చంక నాకే వాడిని సంభావన అడిగితే ఏదో చేశాడన్నట్లు, ''అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'' పేరుతో ప్రపంచ వ్యాప్తంగా నాశనమైపోతున్న భాషలను ఉద్ధరించాలని ఐక్యరాజ్యసమితి మొక్కుబడి ప్రయత్నాలు చేస్తోంది. ఏమీ ప్రయోజనం లేదు. తెలుగు లాంటి మిగతా భాషలన్నీ పీకల లోతు ఆంగ్లంలో దిగబడి ఉన్నాయి. అలా అన్ని దేశాలూ ఆంగ్లమే శరణం అనే పద్ధతిలోకి వచ్చేలా మొదటి నుండీ ఆంగ్లేయులు కృషి చేశారు.
                మనిషిని ఒక భాషకు గత్యంతరం లేని బానిసలాగా మార్చే రంగాల్లో మతం, వ్యాపారం చాలా ముఖ్యమైనవి.
1. మతం: ఇంగ్లీషు దేశాల వాళ్ళ మతం క్రైస్తవం. క్రైస్తవ లేఖనాలు హెబ్రూ, గ్రీకు భాషల్లో ఉంటాయి. మత లేఖనాలు ఏ భాషలో ఉంటే ఆ భాష దేవుడి భాషలాగా గౌరవం పొందుతుంది. ప్రపంచంలో ఆ మతస్తులంతా లేఖన భాషనే తప్పనిసరిగా వినియోగిస్తారు. అర్ధం కాకపోయినా సరే. లేఖనం వెలువడిన భాష లిపికి, శబ్దానికి అంత ప్రాధాన్యత నిస్తారు. ఒక పొల్లు తేడా వచ్చినా అపచారంగా భావిస్తారు. హిందువులు సంస్కృత లేఖనాలకు, ముస్లిములు అరబీ లేఖనాలకు, శిక్కులు పంజాబీ లేఖనాలకు ఇచ్చే విలువ ఎలాంటిదో అందరికీ తెలుసు. అయితే హెబ్రూ, గ్రీకు భాషలలో ఉన్న క్రైస్తవ లేఖనాలను ఆంగ్లేయులు పూర్తిగా ఇంగ్లీషులోకి మార్చుకోవటమే గాక వారి మత వ్యవహారాల్లో లేఖనాల మూల భాషలకు ఏ మాత్రం ప్రాముఖ్యతో లేకుండా చేశారు. అంతా ఆంగ్లమయం చేశారు. ఆసియాలో పుట్టిన క్రైస్తవం అమెరికాలో, ఆంగ్లంలోనే పుట్టిందా అన్నట్లు మార్చుకున్నారు. అసలు యేసుక్రీస్తు ఆంగ్లేయుడేమో అనుకునేలా చేశారు. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవ లేఖనాలకు కింగ్‌జేమ్స్‌ వర్షన్‌, రివైజడ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ లాంటి ఎన్నో ఆంగ్లానువాదాలే అనుసంధానంగా ఉన్నాయి గాని హెబ్రూ, గ్రీకు భాషలు కాదు. పైగా ప్రపంచంలో ఏ మతం గురించి తెలుసుకోవాలన్నా సమస్త మతాల విజ్ఞానం ఆంగ్లీ కరించబడింది. ఆంగ్లం ద్వారానే మతాల పరిజ్ఞానం కూడా విస్తారంగా దొరుకుతోంది.  వత్తులు, గుణింతాల బెడదలేకుండా లిపి సౌలభ్యంతో పాటు దాన్ని మతంతో కలగలిపి, మత భాషగా కూడా అభివృద్ధి పరచటం ద్వారా ఇంగ్లీషు అంతర్జాతీయ ఆదరణ పొందింది. తెలుగు లిపిని సంస్కరించేందుకు గానీ ఆంగ్లేయుడిలాగా తెలుగువాడు కృషి చేయలేదు.
2. వ్యాపారం: ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌, ఐక్యరాజ్యసమితి లాంటి పేర్లు, వింటే ఇంగ్లీషు ఎంత వచ్చి తీరాల్సిన భాషగా చేయబడిందో అర్ధమవుతుంది. ''(www)'' అనే ఆంగ్ల అక్షరాలు ఇంటర్‌నెట్‌ వాడే అందరికీ ఆవశ్యం. అంటే ప్రపంచాన్ని అల్లుకున్న సాలెగూడు అని అర్ధం. ఇంగ్లీషే ఆ సాలెగూడు. ఆంగ్లేయుడే ఆ సాలెపురుగు. అప్పిచ్చే వాడికి అప్పు తీసుకున్న వాళ్ళు లోకువ. అప్పిచ్చేవాడి భాషను అప్పు తీసుకునేవాళ్ళు నేర్చుకోక తప్పదు. రాసుకున్న ఒప్పందం అప్పు ఇచ్చేవాడి భాషలోనే ఉంటుంది. తెలుగు వాళ్ళు అంతర్జాతీయ వ్యాపారంలో ఆరితేరి ఇతర దేశాలకు అప్పులిచ్తే స్థితికి ఎదిగి వస్తే అప్పుడు వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుంటారు. అది కూడా తెలుగువాళ్ళు తెలుగులోనే ఒప్పందాలు చేస్తూ  ఉంటేనే సాధ్యం. చింతలూరు ఆయుర్వేదం మందుల సీసాల మీద కూడా ఇంగ్లీషు పేర్లు లేకపోతే అమ్ముడుపోని రోజులివి. ఇంకెక్కడి తెలుగు? దాన్ని బతికించు కోవాలంటే ఇంగ్లీషు వాడు పడినన్ని కష్టాలు పడాలి.
       అయితే మన తెలుగు ప్రముఖుల మనస్తత్వం ఎలా ఉందో చూడండి:
                ''జార్జి చక్రవర్తి న్యూఢిల్లీ వచ్చినప్పుడు ఆయన దర్శనం కోసం గుంటూరు నుండి 'దేశభక్త' బిరుదాంకితుడు కొండా వెంకటప్పయ్య పంతులు వెళ్ళాడు. ఆయనకు కూర్చునే చోటు దొరకలేదు. అందుకని దూరంగా మెట్ల మీద నిలుచునే చోటును టిక్కెట్టు పెట్టి కొనుక్కున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ నుండి ఇంకా చాలా మంది వెళ్ళారు. వారంతా జార్జి గారి పట్టాభిషేకం చూచి తరించారు. ''జార్జి రాజేంద్ర వైభవ నిర్జితేంద్ర'' అంటూ చక్రవర్తిపై పద్యాలు వ్రాసింది ఎవరో తెలుసునా? సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర కవులు. వారికీ దుర్గతి ఎందుకు పట్టింది?
                ''ఆచార్య బి. రామరాజుగారు ఎం.ఏ. తెలుగు చదువు కోవాలని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడి తెలుగు శాఖాధిపతి 'నీకు బుద్ధిలేదా? తెలుగు చదువు కుంటానని వచ్చావు? అని తిట్టాడు. ఆ తిట్టింది మరెవరో కాదు, మహా దేశభక్తుడు మాతృ భాషాభిమాని రాయప్రోలు సుబ్బారావు గారు. దీని వల్ల ఏం తెలుస్తున్నది. ఆదర్శానికి ఆచరణకు చాలా అంతరం ఉంటుంది. భారతీయులకు దేశభక్తి ఎప్పుడూ లేదు. కేవలం రాజభక్తి, దైవభక్తి మాత్రమే ఉంది.''
                                                                         -ముదిగొండ శివప్రసాద్‌, ఆంధ్రభూమి (10-7-2005)
    మరి ప్రపంచంలో ప్రతి ఏటా ఎన్నో భాషలు రక్షించే దిక్కులేక నశిస్తున్నాయని చెబుతున్నారు. వాటిలో తెలుగు కూడా త్వరలో చేరిపోతుందనీ అంటున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎ.బి.కె. ప్రసాద్‌గారు ఏమంటున్నారో చూడండి:
                ''ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ తదితర సంస్థల ద్వారా అమెరికా తదితర పెట్టుబడి దేశాలు చిన్న దేశాలపై పట్టు కలిగి ఉండాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇంగ్లీషుకు ప్రాధాన్యం లభిస్తోంది. వర్థమాన దేశాల మార్కెటింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇంగ్లీషును ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ....ప్రపంచంలో అనేక దేశాల్లో వందలాది భాషలు కనుమరుగయ్యాయి. తెలుగు కూడా కనుమరుగు కాకుండా దానికి సరైన ప్రాధాన్యత నివ్వాలి. ఇందుకు ప్రాధమికవిద్యా స్థాయిలోనే తెలుగు బీజం పడాలి.'' (ఆంధ్రభూమి, 3-7-2005). శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్‌గారు దీనికి కారణం పరిష్కారం రెండూ చేప్పారు. ''ఏ భాషైనా నశించిపోవడానికి ఇతర భాషల పెత్తనం ఎక్కువ కావటంతో పాటు ప్రజల్లో చైతన్యం లేకపోవటం కూడా కారణమే.'' (ఆంధ్రభూమి, 3-7-2005).
                అంటే ఇతర భాషల పెత్తనం మన మీద తగ్గాలి. ఆయా భాషలు మన మీద ఎందుకు పెత్తనం చేస్తున్నాయి? ఎలా పెత్తనం చేయగలుగుతున్నాయి? మనం ఆ భాషల పెత్తనానికి ఎందుకు తలవంచాల్సి వస్తున్నది? మన భాష మరెవరి మీద ఎందుకు పెత్తనం చేయలేక పోతున్నది? మన భాష మన మీదే కాకుండా ఇతరుల మీద కూడా పెత్తనం చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలి? మన భాష పరిస్థితి ఇలాగే ఉంటే అసలు పెత్తనం చేసేందుకు వీలుందా? పెత్తనం చేసేవాళ్ళు ఏ భాష వాళ్ళయి ఉండాలి? ఆ భాషకున్న ఆధిక్యత ఏమిటి? 'దానికా ఆధిక్యత ఎలా వచ్చింది?' మన భాషకు కూడా అటువంటి ఆధిక్యత, సౌలభ్యత తేలేమా? మొదలైన ప్రశ్నలు చైతన్యం ఉన్న ప్రజలు వేసుకుంటారు. పరాన్న జీవులు ప్రశ్నించరు. ప్రశ్నించలేరు. ఎందుకంటే వారు పరులపై ఆధారపడిన పరాన్న జీవులు కాబట్టి. తమ కాళ్ళపై తాము నిలబడి స్వంతంగా బ్రతికే శక్తి సామర్ధ్యాలు లేవు కాబట్టి. అటువంటి వాళ్ళ భాషే బలహీనంగా చచ్చే దశలో ఉంటుంది. అంపశయ్య మీద పడుకోబెట్టిన భాషకు జవజీవాలను ప్రసాదించడం పరాన్న జీవులవల్ల కానేకాదు.

                కాబట్టి తెలుగు భాషకు ముందు కావలసింది స్వయం పోషకత్వం. ఇతర భాషల జోలికి వెళ్ళకపోయినా తన మట్టుకు తాను బ్రతకగలిగే అవకాశం. ఇలాంటి పరిస్థితి లేనేలేదు. రానేరాదు అని మన తెలుగు మేధావులే తేల్చి చెప్పేస్తుంటే ఈ భాషను బ్రతికించేదెవరు? పైగా వేమన పద్యాన్ని తెలుగు జనానికి తెగ వినిపిస్తున్నారు, వేరే దిక్కు లేదంటున్నారు.
''చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్క కుక్కయైన బాధ సేయు
బలిమి లేని వేళ పంతముల్‌ చెల్లవు
విశ్వధాభిరామ వినురవేమ.''
                                                                                          (గీటురాయి 5-8-2005)

మనం తెలుగువాళ్ళం - ఏమీచాతగాని వాళ్ళం


                    25.మనం తెలుగువాళ్ళం - ఏమీచాతగాని వాళ్ళం
                ''జనగణమన అధినాయకుడెవరనుకున్నారు? జార్జి మహారాజు'' (మారుతీరావు ''మళ్ళీ మధుమాసం'') ''మైలాగియిలా ఈ ఇంగ్లీషువారికి లక్ష్యం లేదు'' (గురజాడ అప్పారావు ''కన్యాశుల్కం'')
                ''తాజా కాలిన్స్‌ ఇంగ్లీష్‌ డిక్షనరీలో బద్మాష్‌, చంగా, చుడ్డీ, దేశీ, ఆంటీజీ, అంకుల్‌జీ, గోరా, కుర్తా, కుత్తా, కుత్తి, హరామ్‌జాదా, హరామ్‌జాదీ, యార్‌, మహల్‌, లాంటి పదాలు చోటుచేసుకున్నాయి. 'ఇంగ్లీషు ఇంత అందమైన భాష కావటానికి కారణం అది మొదటి నుండీ ఇతర భాషల నుండి పదాలను స్వీకరించటమే' అని ఎడిటర్‌ ఇన్‌చీఫ్‌ జెరిమీ బట్టర్‌ ఫీల్డ్‌ అనారు''. (డక్కన్‌ క్రానికల్‌ 9-6-2005)
                మహారాజా, మహారాణి, మహాత్మాలాంటి ఎన్నో భారతీయ పదాలు ఇంగ్లీషు డిక్షనరీల్లోకి ఎప్పుడో ఎక్కేశాయి. కనీసం ఈ పదాలు ఫలానా భాష నుండి అరువు తెచ్చుకున్నవని కూడా ఇంగ్లీషు నిఘంటువుల్లో గుర్తులు పెట్టడం లేదు. అవి ఇంగ్లీషు వాళ్ళు స్వంతం చేసుకుంటున్నారు. ఇలాంటి పని మన భారతీయ భాషల వాళ్ళు ఎంత మాత్రం చేయటం లేదు. అంటరానితనం వంటబట్టించుకున్న జనం అప్రాచ్యపు భాషల పట్ల గూడా ఇదే తత్వాన్ని ఆచరిస్తున్నారు. హింగ్లీష్‌, తెల్గిష్‌, భాషలు మాట్లాడుతూ అప్రాచ్యులతో ఉపాధికోసం అంటకాగుతున్న వారే, స్వదేశంలో సంస్కృతి, సంప్రదాయం, సాహితీవిలువలు అంటూ ప్రజలు వాడుకలోకి తెచ్చిన అప్రాచ్యపు పదాలను కూడా నిఘంటువుల్లోకి తేకుండా భాష శక్తివంతం కాకుండా అడ్డుకుంటున్నారు.
                తెలుగువాళ్ళ గురించి, ఇంగ్లీషువాళ్ళ గురించి, కొన్ని పాత్రలతో మన తెలుగు ప్రముఖ రచయితలు కొన్ని మరువరాని మాటలు చెప్పించారు. (సంకలనం: బూదరాజు రాధాకృష్ణ 2004): ''తిట్లకు ఇంగ్లీషూ, దీవించటానికి సంస్కృతమూ అయితే, తెలుగు కూరలు బేరం చేయడానికి తప్ప దేనికీ పనికి రాదు'' -కొడవటిగంటి, ఐశ్వర్యా
                ''తెలుగులో అచ్చుతప్పులు లేకుండా పుస్తకం వస్తుందని గ్యారంటీ లేదు'' -కొడవటిగంటి, అనామిక
                ''ఇంగ్లీషుకి తండ్రి ల్యాటిన్‌. తెలుక్కి తల్లి సంస్కృతం, అవటం చేత ఇంగ్లీషు తెలుగూ కలవ్వేమో అని కొందరికి డౌటేహం'' -భమిడిపాటి, బాగుబాగు
                తెలుగులో నూటికి తొంభైతొమ్మిది అనుకరణం -భమిడిపాటి, తెలుగు వ్యాకరణం
                తెలుగులో తలకట్లు ప్రత్యేకించి పిలకలు అయిపోయినాయి అందుకని అక్షరాల తెలుగు వ్యక్తులు కచటతపలు. - భమిడిపాటి, కచటతపలు.
                తెలుగులో ప్రార్ధనేమిటి నీ మొహం? దేవుడికి తెలుగురాదు. -భమిడిపాటి, వేషం తగాదా
                తెలుగు వాళ్ళందరినీ భర్జించేది తెలుగుతో నిమిత్తం లేనిదే. -భమిడిపాటి, తుక్కుముక్కల హక్కుచిక్కు
                ఈ పదేళ్ళ మధ్య మన యూనివర్శిటీలు మూడు కనీసం యాభై మంది తెలుగు డాక్టర్లను తయారుచేశాయి. కాని మన భాషలో విమర్శ సాహిత్యం ఇంచుమించు లేనేలేదు. -మహీధర, స్వయంవరణం
                తెలుగురాని వాళ్ళు తెలుగు పుస్తకం ఎలాగూ చదవరు. ఇంగ్లీషు చదివిన తెలుగు వాళ్ళు తెలుగు పుస్తకం కేసి చూడనైనా చూడరు. అందుకే తెలుగు రచయిత ఈనాడు అరకప్పు కాఫీకి దిక్కులేక అలమటిస్తున్నాడు. -సూర్యారావు, నీలితెరలు
                మనం తెలుగువాళ్ళం, ఏమీ చాతగాని వాళ్ళం. -కొడవటిగంటి, అనామిక
                గొప్ప తెలుగువాళ్ళు తెలుగు వచ్చినా వాడరు. తెలుగు వాడకుండా ఉంటేగానీ తెలుగు వాళ్ళచేత గొప్పవాళ్ళనిపించుకోలేరు. -భమిడిపాటి, తెలుగు
                గర్వించవేలరా తెలుగోడా గత కీర్తి తలబరువు గలవాడా -మల్లారెడ్డి, ఆంధ్రప్రభోదము
                మనకి ఇంగ్లీషు అచ్చిరాదని చెబితే విన్నావు కావు. ఈ వెధవ ఇంగ్లీషు చదువు నించి బ్రాహ్మాణీయం చెడిపోతుంది. మన శాస్త్రాల్లో మాటలు మనం మరిచిపోయినాము. ఆ మాటలే తెల్లవాళ్ళు దొంగతనంగా పట్టుకుపోయి శాస్త్రం చెప్పినట్లలా ఆచరించి మనరాజ్యం లాగుకున్నారు.ఇంగ్లీషువాడు 'తింక్‌' అన్నాడోయ్‌. ఆలోచిస్తేగానీ నిజం బోధపడదు. ఇంగిలీషు వాడు సోమరితనం వొప్పడండీ. మన పుస్తకాల్లో మర్మం కనుక్కొని దొర్లు బాగుపడుతున్నారు. మన పుస్తకాలు బూజెక్కించి మనం చెడుతున్నాం. -గురజాడ, కన్యాశుల్కం
                ఇంగ్లీషు చదువుకునే వారందరూ దౌరవాది నరకాలలో పడిపోతారు. -కందుకూరి, హాస్య సంజీవని
                తెలుగులో కోపం ఎట్లా వస్తుందోయ్‌, ఇంగ్లీషులో అన్నా -గంగాధరరావు, బంగారు సంకెళ్ళు
                మనకి ఇంగ్లీషు రాజభాషే కాకుండా మన్మధభాష కూడా అయిపోయింది. -లక్ష్మణరావు, అతడు -ఆమె ఇంగ్లీషులో మాట్లాడుతుంటే కులం ఏదయిందీ అసలు తెలుసుకోలేం. -కొడవటిగంటి, అనుభావం.
                ఇంగిలీషోడి అమల్లో ఏపని చేసిన బంగారం పలుకుతుంది. ఈ ఇంగ్లీషువాళ్ళు చదువులు పెట్టి మన వేళ్ళతో మనకళ్ళే పొడుస్తున్నారు. -గురజాడ, కొండుభట్టీయము
                ఈ మాటలన్నీ మన భాషపట్ల మక్కువతో అన్నవే. దురుద్దేశమేమీ లేదు. మంచి పలుకు లెప్పుడైనా, ఎవరివైనా ఉదాహరించవచ్చు.
                'మన వాళ్ళు వట్టి వెధవాయలోయ్‌' అంటే ఇక మనవాళ్ళు ఎన్నటెన్నటికి వెధవాయలుగా ఉండిపోవాల్సిందే అనే కోర్కె ఆ మాట అన్నవాడికి లేదు. వీళ్ళు బాగుపడాలి అనే ఆశ అందులో ఉంది. అసలు ఎప్పటి కైనా బాగుపడతారా అనే అనుమానమూ ఉంది. ఇదేం జాతిరా బాబూ ఇలాంటి మాటలతో పొడిస్తేనన్నా కదులుతారనే తాపత్రయమూ ఉంది. ఇంగ్లీషు వాళ్ళు తమ భాషాభివృద్ధి కోసం ఎంత శ్రమ పడుతున్నారో అలాంటి శ్రమ మన తెలుగు వాళ్ళు కూడా పడాలని వారికోరిక.
                రచయితల మనోభావాల్ని అర్ధం చేసుకోలేనంత అజ్ఞానులెవరూ తెలుగు ప్రజల్లో లేరు. కాకపోతే వందల సంవత్సరాల పాటు పరభాషల పాలనలో మగ్గిపోయి నందువల్ల సంక్రమించిన బానిస మనస్తత్వం స్వేచ్ఛ స్వాతంత్రం లభించిన తరువాత కూడా వదుల్చుకోలేక పోయారు. దానికి నాయకులు, అధికారులే వందలాది కారణాలు చెబుతున్నారు. కారణం తెలిసినప్పుడు తెలివిగలవాడెవడైనా పరిష్కారం కనుక్కుంటాడు. పరిష్కారం అక్కరలేదు అనుకునేవాడు ప్రయత్నించడు. ప్రయత్నమే చెయ్యనివాడు పరాన్నజీవిలా బ్రతుకుతాడు. పరాన్నజీవికి స్వంత ఆలోచనలు, ఆవిష్కరణలు ఉండవు. మరొకడు అభివృద్ధి పరిచిందాన్ని పడి మేయటం తప్ప, తాను కూడా శ్రమపడడు. ఒకవేళ శ్రమ పడినా ఆయాచితంగా ఫలాలు వచ్చి పడటం కోసమే శ్రమ పడతాడు. స్వంత గుర్తింపు లేనందుకు సిగ్గుపడడు. సిగ్గుపడితే, స్వేచ్ఛ వచ్చాక కూడా బానిస బుద్ధి ప్రదర్శించడు. తన భాషకు కూడా అధికారం ఇస్తాడు. అధికారపూర్వకంగా తన భాషను ఉపయోగిస్తాడు. అదేమి విచిత్రమో కానీ తెలుగువాడు భాషపేరుతో ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించాడు కానీ తన భాషకు అధికార దండం అందించలేక పోయాడు.
                అధికార భాషా సంఘానికి కొన్ని అధికారాలను ఇస్తూ చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు 8-6-2005న ఎ.బి.కె. ప్రసాద్‌ గారు నాతో చెప్పారు. ఆయన కృషి ఫలించాలని ఆశిద్దాం.అధికారభాషా సంఘాలకు ఇప్పటికైనా అవసరమైన అధికారాలు ఇవ్వాలి.
                                                                                         (గీటురాయి 15-7-2005)

భాషను నీవు రక్షిస్తే - భాష నిన్ను రక్షిస్తుంది!


24.భాషను నీవు రక్షిస్తే - భాష నిన్ను రక్షిస్తుంది!
                తమిళనాడులోని జాతీయ రహదారుల వెంట మైలురాళ్ళ మీద హిందీలో పేర్లు రాయకూడదని, కేవలం తమిళం, ఇంగ్లీషుల్లో మాత్రమే ఉండాలని జయలలిత కేంద్రానికి అల్టిమేటం పంపారు.
                ఇక్కడ మన రాష్ట్రంలో ఓ వ్యక్తి తన కారుకు నంబరు ప్లేటు తెలుగులో రాయించాడని సతాయించి ఫైను వేశారు.తెలుగు అంకెలు ఇప్పుడు ఎవరూ వాడటం లేదు. ఇంగ్లీషు వాళ్ళు కూడా రోమన్ అంకెలు మానేసి అరబిక్ అంకెలు వాడుతున్నారు.వాడకంలో లేని అంకెలు ఎవరికి అర్ధం అవుతాయి? శ్రీ శ్రీ గారు తెలుగు లిపి లో ఉన్న ఆటంకాలు గ్రహించి ఆంగ్ల లిపిలోకి మారటం మంచిది అన్నారు.తెలుగులో ఉన్న సమస్యలు మనమే సరిదిద్దుకోవాలి.
                తమిళనాడులో ప్రతిదీ తమ మాతృభాష తమిళంలోనే ఉండాలనే ఉద్దేశంతో తమిళ పరిరక్షణ ఉద్యమం జరుగుతోంది. తమిళ చిత్రాలకు తమిళ పేర్లే ఉండాలని కూడా అడుగుతున్నారు. కమలహాసన్‌ నటించిన ''ముంబాయి ఎక్స్‌ప్రెస్‌'' పేరు మార్చాలని గొడవకు దిగారు. పేర్ల గురించి కూడా తమిళులకింత పిచ్చా అనిపించవచ్చు.
                తమిళులకు తమ భాష పట్ల అంత మక్కువ పట్టుదల, మొండితనం ఉండబట్టే తమిళం ఈనాటికి సగర్వంగా, తలెత్తుకుని నిలబడగలగింది. ఇండియాలో దాదాపు 30 భాషల్లో సాహితీ సంపద పుష్కలంగా ఉంది. అన్ని భాషలకూ సమాన గౌరవం దక్కలేదు. మొండిగా, మూర్ఖంగా ఎదురు తిరిగి వాదించిన వాళ్ళ భాషే వికసించింది. కర్కశంగా ఇతరుల మీద రుద్దిన వాళ్ళభాషే అభివృధ్ధి చెందింది. నోరూ, వాయీ పడిపోయిన బానిసల్లాగా, చెప్పిందానికల్లా తలాడించిన వాళ్ళ భాష వాడిపోయింది.
                విజ్ఞాన శాస్త్రాన్ని మాతృభాషలో బోధిస్తేనే ప్రగతి సాధ్యం అని మన పాఠశాల విద్యాశాఖ మంత్రి నేదురమల్లి రాజ్యలక్ష్మి 21-1-2005న దక్షిణాది రాష్ట్రాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సభలో అన్నారు. ఇది ఎంతో మంచి మాట. కాని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మీడియం ప్రారంభించినది వీరి హయాంలోనే.
                23-1-2005న విశాఖపట్నంలో మహారాష్ట్ర మండలి స్వర్ణోత్సవ వేడుకలకు గవర్నర్‌ సుశీల్‌ కుమార్‌ షిండే హాజరై మహారాష్ట్రీయులు ఇతర రాష్ట్రాలలో ఉన్నప్పటికి తమ పిల్లలకు మరాఠీ నేర్పించాలని, మరాఠీ భాషను కాపాడుకోవాలనీ పిలుపునిచ్చారు. మరాఠీ మండలి సభ్యులు తమ పిల్లలకు మరాఠీలో ప్రాధమిక విద్య కావాలని మరాఠిలో అడిగితే మనవాళ్ళు ఆనందంగా అంగీకరించారు. మన ఎం.పీ సుబ్బరామిరెడ్డి మరో అడుగు ముందుకేసి మరాఠీ భవన నిర్మాణానికి అయిదు లక్షల రూపాయన తన ఎం.పీ నిధుల్లోంచి మంజూరు చేశారు.ఈ మాత్రం సహాయం మన తెలుగు ప్రజలు ఏయే రాష్ట్రాలలో ఉన్నారో ఆయా రాష్ట్రాల ఎం.పీలందరూ చేస్తే ఎంత బాగుండు! భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనిషిలో తప్పక ఉంటుంది. మాతృభాష వద్దని ఏ మనిషీ బాహాటంగా చెప్పలేడు. చెబితే మిగతా ప్రజలతో వ్యతిరేకత వస్తుంది.
''ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు
ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా
సొంత ఊరువారు తన అంతరాన ఉందురోయ్‌''
                అనే పాట మాతృభాష మీద మమకారం లేని వాళ్ళకు వర్తించదు. తల్లినీ, తల్లి భాషనూ, నీచంగా చూసే వాళ్ళు పరభాషా వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నారు. వీళ్ళ బానిసబుద్ధి వల్ల సామాన్య జనం అన్ని వ్యవహారాల్లో భాషాపరమయిన దౌర్జన్యానికి గురై మూగబోతున్నారు. తెలుగు ''యానాం'' తమళ 'పాండిచ్చెరి'లో నేటికి మగ్గిపోతోంది అంటే మాకు కేంద్రపాలిత ప్రాంతం క్రింద ఉండటమే బాగుంది,మీ ఆంధ్రలో మేము కలవం అనేవాళ్లూ ఉన్నారు.
               ఏలేరు భూసేకరణపై విచారణ కమీషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సోమశేఖర గారు విశాఖపట్నం వచ్చినప్పుడు తనది కర్నాటక రాష్ట్రమనీ, కన్నడం తన మాతృభాషనీ చెబుతూ మన తెలుగువాళ్ళు మైసూర్‌పాక్‌, మైసూర్‌ బజ్జీ, బెంగుళూరు మిరపకాయలు, మైసూర్‌ ఎడ్లు, కర్నాటక సంగీతం, ఉడిపి హోటల్‌.... లాంటి ఎన్నో పేర్లు ఉపయోగిస్తున్నారనీ కన్నడ పదాలెన్నో తెలుగు వాళ్ళు వాడుతున్నారని సంబరపడ్డారు.
                హిందీవాళ్ళు, తమిళులు, కన్నడీలు, మరాఠీలు, ఉర్దూవాళ్ళు, ఆంగ్లేయులు, చివరికి ఒరియావాళ్ళు కూడా తెలుగులో వాడకంలోకి వచ్చిన తమ తమ భాషాపదాలు ఏమేమి ఉన్నాయో అత్యంత శ్రద్ధాసక్తులతో వెతికి పట్టుకొని తెలుగువాళ్ళకే గొప్పగా చెప్పు కుంటున్నారు. మన పండితులు పరిశోధకులు కూడా ''తెలుగు భాషపై ఫలానా భాష ప్రభావం'' అని శోధించి శాస్త్ర గ్రంథాలు రాశారు, రాస్తున్నారు కూడా. అలాగే ''ఫలానా భాషపై తెలుగు ప్రభావం'' అనే పరిశోధక గ్రంధాలు వస్తే బాగుండును. మన విశ్వ విద్యాలయాల వాళ్ళు ఈ అంశం మీద పరిశోధన చేసే వాళ్ళను ప్రోత్సహించాలి. ఈ మధ్యే నా కంటబడ్డ సంగతి: 1-2-2005 పెదవాల్తేర్‌ జంక్షన్‌ దగ్గర, ఓ తండ్రీ కొడుకూ దారిన వెళుతున్నారు. పిల్లవాడికి కుక్క కనబడింది. ''నాన్నా, కుక్క'' అన్నాడు. వెంటనే తండ్రి ''అదేరా, డాగ్గు'' అన్నాడు. కుక్కని డాగ్గు అనాలని తండ్రి పిల్లవాడికి నేర్పుతున్నా డన్నమాట. పిల్లవాడు తెలుగు పలుకులు పలక్కుండా ఇంగ్లీషు ముక్కలు పలికితేనే డాబుసరిగా ఉంటుందనే బడాయి లక్షణం ఆ తండ్రిది. పిల్లలకు ఏది నేర్పితే అదే వస్తుంది. తెలుగులో మాట్లాడితే ఫైన్‌ వేసే స్కూళ్ళు అంత నిర్భయంగా, అదేదో చట్టసమ్మత మయిన హక్కులాగా తెలుగు నేల మీదే నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయంటే ఇలాంటి తల్లిదండ్రుల పిచ్చి మద్దతే కారణం. మావాడు దెబ్బలకు ఓర్చుకుంటాడురా అంటే విడిపించే దిక్కులేక అన్నట్లు.
                29-1-2005న విశాఖపట్నం సమాచార కేంద్రంలో ''సంస్కృత భాషా ప్రశస్తి'' అనే అంశం మీద కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న తెలుగు పెద్దలు తేల్చిన సారం ఏంటంటే ''సంస్కృతం దేవతలు మాట్లాడే భాష కాబట్టి అది దేవభాష. మహా కావ్యాలు సంస్కృతంలో ఉండటానికి ఇదే కారణం. సమస్త మానవ జీవితానికి ఇదే మూలభాష. సంస్కృత భాషను కంఠస్తం చేసే సంప్రదాయం ఉన్నందువల్లనే ఆ భాష ఇప్పటి వరకు తన ఉనికిని కాపాడుకోగలిగింది. సంక్లిష్ట పదజాలంతో గొప్ప భావాన్ని వ్యక్తీకరించగలిగే శక్తి ఈ భాషకుంది. ప్రతి అక్షరానికి కొంత శక్తి ఉంది, దానికి ఒక ఆదిదేవతను, రంగును, లక్షణాన్ని పూర్వీకులు ధృవీకరించారు. శబ్దానికి గల శక్తిని చూపడానికే మంత్రాలను ప్రవేశపెట్టారు. ఇది ఉత్తరాధి భాషలకు జన్మను, దక్షిణాది భాషలకు కండపుష్టిని ఇచ్చింది.''
                ''అరబీ భాషా ప్రశస్తి'' అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తే కూడా ఇంచుమించు ఇలాంటి అమూల్య అభిప్రాయాలే వస్తాయి. మన గ్రంధాలు ఏ భాషల్లో వెలువడితే ఆ భాషలు గొప్పవనే భావన ప్రజలకుంటుంది. ఎందుకంటే సాక్షాత్తూ దేవుడే ఆ భాషను వాడుకున్నాడు గనుక. మరి మిగతా భాషల సంగతి ఏంటి? వాటిని దేవుడు చులకనగా చూశాడని ఎవరూ చెప్పలేరుగాని మన గ్రంధం ఉద్భవించిన భాషను మిగతా భాషల వాళ్ళు నేర్చుకోవాలంటారు. కనీసం మత ధర్మాలను, నియమనిష్టలను అనుసరించటం కోసమైనా ఆ భాష తప్పనిసరి అంటారు. కాదు ఎవరి భాష వారికింపు అంటే ''ఇట్టి దైవధిక్కారమును సైతుమా?'' అంటారు.
                ప్రజలు తమ అవసరాల కోసం భాషల్ని పుట్టించుకున్నారు అని కొందరంటే, కాదు ప్రజలకోసమో భాషలు పుట్టాయి అని కొందరంటారు. భాష భాష కోసమే అని కొందరంటే, కాదు అదీ ప్రజల ఉపయోగం కోసం అని కొందరంటారు. భాష లోతుల్లోకి వెళితే రత్నాలు, మాణిక్యాలు దొరుకుతాయి అని కొందరంటే, పొట్టకూటి కోసం వెతుకులాడే జనానికి గులకరాళ్ళ భాష సరిపోతుందిలే అంటారు మరికొందరు.పొట్టకూటివాడు పిచికారీ అని పిలిచే దాన్ని ముషలికము అని కావాలని సంస్కృతంలోకి తర్జుమా చేసి పిల్లలకు తెలుగంటే విరక్తి కలిగిస్తారు. కూడికను సంకలనము అంటాడు.తీసివేతను వ్యవకలనము అంటాడు.మన భాషను మనమే వద్దనేదశకు చేరుస్తాడు.

                ఇంతకీ చెప్పొచ్చిందేంటంటే, ఎవరి కంపు వారికింపు, పరుల కంపు ఓకరింపు అనే సామెత జన సామాన్యానుభవంలోంచి వచ్చింది. అంటే ఎవడి భాష వాడికి మధురంగా ఉండటం, పరాయి భాష కర్ణ కఠోరంగా ఉండకపోయినా దానికి రెండో స్థానమే ఇవ్వటం సహజం. మనిషి తన స్వంత భాషను ఇష్టపడటం సహజలక్షణం. ప్రపంచంలోని ఎన్నో భాషలవాళ్ళ స్పందన ఇలా సహజంగా ఉంటున్నది. కాని అదేం విచిత్రమో కానీ తెలుగు వాళ్ళు అసహజ లక్షణాలు ప్రదర్శిస్తున్నారు. తమ భాషను విసిరిపారేసి అణగదొక్కి, పరాయి భాషల్ని నెత్తికెత్తుకుని కావలనే తొక్కించుకుంటున్నారు. ఆవులు ఆవులు పోట్లాడుకుని లేగల కాళ్ళు విరగదొక్కినట్లుగా సామాన్య గ్రామీణ జనం తాము చేయని తప్పుకు శిక్షించబడుతున్నారు. పండితుల బడాయికి, అధికారుల అసహజ లక్షణాలకు, నాయకుల మూర్ఖత్వానికి మామూలు తెలుగు జనం బలైపోయారు.తెలుగు నేలపై తెలుగు పాలన లేదు. తెలుగు క్షీణిస్తున్నది. తెలుగు పెద్దలారా, తెలుగును పోషించండి. లేకపోతే మిమ్మల్ని పోషించటానికి ఈ భాషే ఉండదు జాగ్రత్త! భాషో రక్షతి రక్షిత:!
                                                                                                                          (గీటురాయి 25-3-2005)