18, జులై 2012, బుధవారం

భాషను నీవు రక్షిస్తే - భాష నిన్ను రక్షిస్తుంది!


24.భాషను నీవు రక్షిస్తే - భాష నిన్ను రక్షిస్తుంది!
                తమిళనాడులోని జాతీయ రహదారుల వెంట మైలురాళ్ళ మీద హిందీలో పేర్లు రాయకూడదని, కేవలం తమిళం, ఇంగ్లీషుల్లో మాత్రమే ఉండాలని జయలలిత కేంద్రానికి అల్టిమేటం పంపారు.
                ఇక్కడ మన రాష్ట్రంలో ఓ వ్యక్తి తన కారుకు నంబరు ప్లేటు తెలుగులో రాయించాడని సతాయించి ఫైను వేశారు.తెలుగు అంకెలు ఇప్పుడు ఎవరూ వాడటం లేదు. ఇంగ్లీషు వాళ్ళు కూడా రోమన్ అంకెలు మానేసి అరబిక్ అంకెలు వాడుతున్నారు.వాడకంలో లేని అంకెలు ఎవరికి అర్ధం అవుతాయి? శ్రీ శ్రీ గారు తెలుగు లిపి లో ఉన్న ఆటంకాలు గ్రహించి ఆంగ్ల లిపిలోకి మారటం మంచిది అన్నారు.తెలుగులో ఉన్న సమస్యలు మనమే సరిదిద్దుకోవాలి.
                తమిళనాడులో ప్రతిదీ తమ మాతృభాష తమిళంలోనే ఉండాలనే ఉద్దేశంతో తమిళ పరిరక్షణ ఉద్యమం జరుగుతోంది. తమిళ చిత్రాలకు తమిళ పేర్లే ఉండాలని కూడా అడుగుతున్నారు. కమలహాసన్‌ నటించిన ''ముంబాయి ఎక్స్‌ప్రెస్‌'' పేరు మార్చాలని గొడవకు దిగారు. పేర్ల గురించి కూడా తమిళులకింత పిచ్చా అనిపించవచ్చు.
                తమిళులకు తమ భాష పట్ల అంత మక్కువ పట్టుదల, మొండితనం ఉండబట్టే తమిళం ఈనాటికి సగర్వంగా, తలెత్తుకుని నిలబడగలగింది. ఇండియాలో దాదాపు 30 భాషల్లో సాహితీ సంపద పుష్కలంగా ఉంది. అన్ని భాషలకూ సమాన గౌరవం దక్కలేదు. మొండిగా, మూర్ఖంగా ఎదురు తిరిగి వాదించిన వాళ్ళ భాషే వికసించింది. కర్కశంగా ఇతరుల మీద రుద్దిన వాళ్ళభాషే అభివృధ్ధి చెందింది. నోరూ, వాయీ పడిపోయిన బానిసల్లాగా, చెప్పిందానికల్లా తలాడించిన వాళ్ళ భాష వాడిపోయింది.
                విజ్ఞాన శాస్త్రాన్ని మాతృభాషలో బోధిస్తేనే ప్రగతి సాధ్యం అని మన పాఠశాల విద్యాశాఖ మంత్రి నేదురమల్లి రాజ్యలక్ష్మి 21-1-2005న దక్షిణాది రాష్ట్రాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సభలో అన్నారు. ఇది ఎంతో మంచి మాట. కాని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మీడియం ప్రారంభించినది వీరి హయాంలోనే.
                23-1-2005న విశాఖపట్నంలో మహారాష్ట్ర మండలి స్వర్ణోత్సవ వేడుకలకు గవర్నర్‌ సుశీల్‌ కుమార్‌ షిండే హాజరై మహారాష్ట్రీయులు ఇతర రాష్ట్రాలలో ఉన్నప్పటికి తమ పిల్లలకు మరాఠీ నేర్పించాలని, మరాఠీ భాషను కాపాడుకోవాలనీ పిలుపునిచ్చారు. మరాఠీ మండలి సభ్యులు తమ పిల్లలకు మరాఠీలో ప్రాధమిక విద్య కావాలని మరాఠిలో అడిగితే మనవాళ్ళు ఆనందంగా అంగీకరించారు. మన ఎం.పీ సుబ్బరామిరెడ్డి మరో అడుగు ముందుకేసి మరాఠీ భవన నిర్మాణానికి అయిదు లక్షల రూపాయన తన ఎం.పీ నిధుల్లోంచి మంజూరు చేశారు.ఈ మాత్రం సహాయం మన తెలుగు ప్రజలు ఏయే రాష్ట్రాలలో ఉన్నారో ఆయా రాష్ట్రాల ఎం.పీలందరూ చేస్తే ఎంత బాగుండు! భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనిషిలో తప్పక ఉంటుంది. మాతృభాష వద్దని ఏ మనిషీ బాహాటంగా చెప్పలేడు. చెబితే మిగతా ప్రజలతో వ్యతిరేకత వస్తుంది.
''ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు
ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా
సొంత ఊరువారు తన అంతరాన ఉందురోయ్‌''
                అనే పాట మాతృభాష మీద మమకారం లేని వాళ్ళకు వర్తించదు. తల్లినీ, తల్లి భాషనూ, నీచంగా చూసే వాళ్ళు పరభాషా వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నారు. వీళ్ళ బానిసబుద్ధి వల్ల సామాన్య జనం అన్ని వ్యవహారాల్లో భాషాపరమయిన దౌర్జన్యానికి గురై మూగబోతున్నారు. తెలుగు ''యానాం'' తమళ 'పాండిచ్చెరి'లో నేటికి మగ్గిపోతోంది అంటే మాకు కేంద్రపాలిత ప్రాంతం క్రింద ఉండటమే బాగుంది,మీ ఆంధ్రలో మేము కలవం అనేవాళ్లూ ఉన్నారు.
               ఏలేరు భూసేకరణపై విచారణ కమీషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సోమశేఖర గారు విశాఖపట్నం వచ్చినప్పుడు తనది కర్నాటక రాష్ట్రమనీ, కన్నడం తన మాతృభాషనీ చెబుతూ మన తెలుగువాళ్ళు మైసూర్‌పాక్‌, మైసూర్‌ బజ్జీ, బెంగుళూరు మిరపకాయలు, మైసూర్‌ ఎడ్లు, కర్నాటక సంగీతం, ఉడిపి హోటల్‌.... లాంటి ఎన్నో పేర్లు ఉపయోగిస్తున్నారనీ కన్నడ పదాలెన్నో తెలుగు వాళ్ళు వాడుతున్నారని సంబరపడ్డారు.
                హిందీవాళ్ళు, తమిళులు, కన్నడీలు, మరాఠీలు, ఉర్దూవాళ్ళు, ఆంగ్లేయులు, చివరికి ఒరియావాళ్ళు కూడా తెలుగులో వాడకంలోకి వచ్చిన తమ తమ భాషాపదాలు ఏమేమి ఉన్నాయో అత్యంత శ్రద్ధాసక్తులతో వెతికి పట్టుకొని తెలుగువాళ్ళకే గొప్పగా చెప్పు కుంటున్నారు. మన పండితులు పరిశోధకులు కూడా ''తెలుగు భాషపై ఫలానా భాష ప్రభావం'' అని శోధించి శాస్త్ర గ్రంథాలు రాశారు, రాస్తున్నారు కూడా. అలాగే ''ఫలానా భాషపై తెలుగు ప్రభావం'' అనే పరిశోధక గ్రంధాలు వస్తే బాగుండును. మన విశ్వ విద్యాలయాల వాళ్ళు ఈ అంశం మీద పరిశోధన చేసే వాళ్ళను ప్రోత్సహించాలి. ఈ మధ్యే నా కంటబడ్డ సంగతి: 1-2-2005 పెదవాల్తేర్‌ జంక్షన్‌ దగ్గర, ఓ తండ్రీ కొడుకూ దారిన వెళుతున్నారు. పిల్లవాడికి కుక్క కనబడింది. ''నాన్నా, కుక్క'' అన్నాడు. వెంటనే తండ్రి ''అదేరా, డాగ్గు'' అన్నాడు. కుక్కని డాగ్గు అనాలని తండ్రి పిల్లవాడికి నేర్పుతున్నా డన్నమాట. పిల్లవాడు తెలుగు పలుకులు పలక్కుండా ఇంగ్లీషు ముక్కలు పలికితేనే డాబుసరిగా ఉంటుందనే బడాయి లక్షణం ఆ తండ్రిది. పిల్లలకు ఏది నేర్పితే అదే వస్తుంది. తెలుగులో మాట్లాడితే ఫైన్‌ వేసే స్కూళ్ళు అంత నిర్భయంగా, అదేదో చట్టసమ్మత మయిన హక్కులాగా తెలుగు నేల మీదే నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయంటే ఇలాంటి తల్లిదండ్రుల పిచ్చి మద్దతే కారణం. మావాడు దెబ్బలకు ఓర్చుకుంటాడురా అంటే విడిపించే దిక్కులేక అన్నట్లు.
                29-1-2005న విశాఖపట్నం సమాచార కేంద్రంలో ''సంస్కృత భాషా ప్రశస్తి'' అనే అంశం మీద కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న తెలుగు పెద్దలు తేల్చిన సారం ఏంటంటే ''సంస్కృతం దేవతలు మాట్లాడే భాష కాబట్టి అది దేవభాష. మహా కావ్యాలు సంస్కృతంలో ఉండటానికి ఇదే కారణం. సమస్త మానవ జీవితానికి ఇదే మూలభాష. సంస్కృత భాషను కంఠస్తం చేసే సంప్రదాయం ఉన్నందువల్లనే ఆ భాష ఇప్పటి వరకు తన ఉనికిని కాపాడుకోగలిగింది. సంక్లిష్ట పదజాలంతో గొప్ప భావాన్ని వ్యక్తీకరించగలిగే శక్తి ఈ భాషకుంది. ప్రతి అక్షరానికి కొంత శక్తి ఉంది, దానికి ఒక ఆదిదేవతను, రంగును, లక్షణాన్ని పూర్వీకులు ధృవీకరించారు. శబ్దానికి గల శక్తిని చూపడానికే మంత్రాలను ప్రవేశపెట్టారు. ఇది ఉత్తరాధి భాషలకు జన్మను, దక్షిణాది భాషలకు కండపుష్టిని ఇచ్చింది.''
                ''అరబీ భాషా ప్రశస్తి'' అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తే కూడా ఇంచుమించు ఇలాంటి అమూల్య అభిప్రాయాలే వస్తాయి. మన గ్రంధాలు ఏ భాషల్లో వెలువడితే ఆ భాషలు గొప్పవనే భావన ప్రజలకుంటుంది. ఎందుకంటే సాక్షాత్తూ దేవుడే ఆ భాషను వాడుకున్నాడు గనుక. మరి మిగతా భాషల సంగతి ఏంటి? వాటిని దేవుడు చులకనగా చూశాడని ఎవరూ చెప్పలేరుగాని మన గ్రంధం ఉద్భవించిన భాషను మిగతా భాషల వాళ్ళు నేర్చుకోవాలంటారు. కనీసం మత ధర్మాలను, నియమనిష్టలను అనుసరించటం కోసమైనా ఆ భాష తప్పనిసరి అంటారు. కాదు ఎవరి భాష వారికింపు అంటే ''ఇట్టి దైవధిక్కారమును సైతుమా?'' అంటారు.
                ప్రజలు తమ అవసరాల కోసం భాషల్ని పుట్టించుకున్నారు అని కొందరంటే, కాదు ప్రజలకోసమో భాషలు పుట్టాయి అని కొందరంటారు. భాష భాష కోసమే అని కొందరంటే, కాదు అదీ ప్రజల ఉపయోగం కోసం అని కొందరంటారు. భాష లోతుల్లోకి వెళితే రత్నాలు, మాణిక్యాలు దొరుకుతాయి అని కొందరంటే, పొట్టకూటి కోసం వెతుకులాడే జనానికి గులకరాళ్ళ భాష సరిపోతుందిలే అంటారు మరికొందరు.పొట్టకూటివాడు పిచికారీ అని పిలిచే దాన్ని ముషలికము అని కావాలని సంస్కృతంలోకి తర్జుమా చేసి పిల్లలకు తెలుగంటే విరక్తి కలిగిస్తారు. కూడికను సంకలనము అంటాడు.తీసివేతను వ్యవకలనము అంటాడు.మన భాషను మనమే వద్దనేదశకు చేరుస్తాడు.

                ఇంతకీ చెప్పొచ్చిందేంటంటే, ఎవరి కంపు వారికింపు, పరుల కంపు ఓకరింపు అనే సామెత జన సామాన్యానుభవంలోంచి వచ్చింది. అంటే ఎవడి భాష వాడికి మధురంగా ఉండటం, పరాయి భాష కర్ణ కఠోరంగా ఉండకపోయినా దానికి రెండో స్థానమే ఇవ్వటం సహజం. మనిషి తన స్వంత భాషను ఇష్టపడటం సహజలక్షణం. ప్రపంచంలోని ఎన్నో భాషలవాళ్ళ స్పందన ఇలా సహజంగా ఉంటున్నది. కాని అదేం విచిత్రమో కానీ తెలుగు వాళ్ళు అసహజ లక్షణాలు ప్రదర్శిస్తున్నారు. తమ భాషను విసిరిపారేసి అణగదొక్కి, పరాయి భాషల్ని నెత్తికెత్తుకుని కావలనే తొక్కించుకుంటున్నారు. ఆవులు ఆవులు పోట్లాడుకుని లేగల కాళ్ళు విరగదొక్కినట్లుగా సామాన్య గ్రామీణ జనం తాము చేయని తప్పుకు శిక్షించబడుతున్నారు. పండితుల బడాయికి, అధికారుల అసహజ లక్షణాలకు, నాయకుల మూర్ఖత్వానికి మామూలు తెలుగు జనం బలైపోయారు.తెలుగు నేలపై తెలుగు పాలన లేదు. తెలుగు క్షీణిస్తున్నది. తెలుగు పెద్దలారా, తెలుగును పోషించండి. లేకపోతే మిమ్మల్ని పోషించటానికి ఈ భాషే ఉండదు జాగ్రత్త! భాషో రక్షతి రక్షిత:!
                                                                                                                          (గీటురాయి 25-3-2005)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి