18, జులై 2012, బుధవారం

అథోగతి పాలైన అధికార భాష


8. అథోగతి పాలైన అధికార భాష
                భాషా ప్రాతికపదిక మీద తెలుగు రాష్ట్రం ఏర్పడి 43 ఏళ్ళు గడిచినా, తెలుగులో చట్టాలు, చేయకపోవటం వల్ల అధికార భాషగా తెలుగు అధోగతి పాలయ్యింది. ఐ.ఎ.ఎస్‌. మొదలు అటెండర్‌ వరకు అందరికీ ఈ భాష మీద చిన్న చూపే. ప్రపంచంలో 15వ స్థానాన్ని , భారత దేశంలో రెండవ స్థానాన్ని పొందిన ఈ భాషకు విలువలేదు. ఇప్పుడు కంప్యూటర్ల రాకతో రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలన్నీ తెలుగు వాడకాన్ని తుంగలో తొక్కాయి.
                '' చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ '', '' మా తెలుగు తల్లికీ మల్లెపూదండ '' లాంటి గీతాలను మనం పాడుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవాలను జరుపుకోవచ్చుగానీ, తెలుగు భాషకు పాలనా భాషగా ఎంతశక్తిని కల్పించామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలుగు తల్లి విగ్రహం సచివాలయ సవిూపంలోనే విరిగి పోయింది. అంతకు ముందు నలభై ఏళ్ళ నుండి సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు భాషల సమ్మెట దెబ్బలకు తెలుగు భాష తునాతునకలైపోతూ నానాటికి తీసికట్టునాగం భట్టూ అన్నట్లు మనుగడ సాగిస్తూ ఉంది. మరి మన ఆంగ్ల భాషాదాస్యం పోయి, తెలుగుకు సముచిత స్థానం రావాలంటే ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకోవాలి.
                1. ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలల్ని నిషేధించాలి. ఇంగ్లీషు, హిందీ, మరే ఇతర భాషనైనా నేర్చుకోవటం వ్యక్తుల స్వేచ్ఛకు వదిలేయాలి. మన మాతృభాష అయిన తెలుగును మాత్రం నిర్భంధంగా నేర్పాలి. డిగ్రీ స్థాయి వరకు ఎక్కడా ఇంగ్లీషు, హిందీ తగలగూడదు. అప్పుడు మాత్రమే తెలుగు బలపడుతుంది.
                2. చందస్సుతో కూడిన తెలుగు వ్యాకరణాలను చెప్పి పిల్లల్ని భయపెట్టటం ఆపి, వాడుక భాషను, ఆధునిక సాంకేతిక పదజాలాన్ని విస్తారంగా నూరిపోయాలి. భాషను సులభతరం చెయ్యాలి.
                3. తెలుగులోనే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి. అధికార భాషగా తెలుగు అమలు కాకుండా అడ్డుబండలుగా ఉన్న గవర్నర్లు, ఐ.ఎ.ఎస్‌ల వ్యవస్థలో మార్పు తేవాలి.  కేంద్రప్రభుత్వం కూడా మన రాష్ట్రంలోని తన కార్యాలయాలలో తెలుగు వారినే నియమించాలి. హిందీతో సమానంగా తెలుగును గౌరవించాలి.
                4. కోర్టు తీర్పులు, జీ.వో.లు తెలుగులో రావాలి. చిన్నద్వీపం నుండి వలసవచ్చిన తెల్లవాడు తన భాషకు మనల్ని దాసులుగా చేసి పోయాడు. మనం ఇతరుల విూద మన భాషను రుద్దలేకపోయినా, కనీసం మనలోనైనా మన భాషను పరిపుష్టం చేసుకోలేమా?ఇంగ్లీషో, హిందీనో నేర్చుకుంటేనే మనకు మనుగడ అంటే ఇక తెలుగు వల్ల లాభం ఏమిటి?
                5. మన నాలుకలపై స్థిరపడిన పరభాషా పదాలను మనవిగానే భావించి (బస్సు, సైకిలు. రైలు, పంపు.....లాంటివి) సమగ్రమైన తెలుగు-తెలుగు నిఘంటువులు తరచుగా ముద్రిస్తూ ఉండాలి. అన్ని చట్టాలూ తెలుగులో ముద్రించాలి. సర్వీస్‌ కమీషన్‌ తన శాఖా పరమైన పరీక్షలన్నీ తెలుగులోనే నిర్వహించాలి. ఇంటర్వ్యూలన్నీ తెలుగులో ఉండాలి.
                6. ఇంగ్లీషు టైపు మిషన్లను కార్యాలయాల్లో నుంచి పూర్తిగా తీసివేసి, తెలుగు టైపు మిషన్లు, తెలుగు కంప్యూటర్లు మాత్రమే ఉంచాలి. తెలుగు లిపిని సంస్కరించాలి. వత్తులు, గుణింతాల సంస్కరణ జరిపి, ఆంగ్లభాషకు దీటుగా టైపు చేయదగిన రీతిలో తెలుగును తీర్చిదిద్దాలి. ( ఉదాహరణకు, , , లాంటి వాటిని ప్రజలు వదిలేశారు.) చాదస్తపు గ్రాంధిక భాష వాడకాన్ని మందగింపజేస్తుంది. అక్కరలకు అనుగుణంగా, స్వేచ్ఛగా నర్తింపగల భాష. విస్తారంగా వ్యాపిస్తుంది.
                  ఒకరు చెప్పిన సంగతి మరొకరికి సరిగా అర్థమవుతున్నదా లేదా అని చూడక, వ్యాకరణ దోషాలు వెతికే గ్రాంథిక సంప్రదాయ ఛాందస పండితులకు, శిష్ట కరణాలకు, గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారు వాడుక భాషలో ఆనాడు పాఠాలు చెప్పారు. అన్యదేశ్యాలు, అపభ్రంశాలు, గ్య్రామ్యాలు, రూంపాంతరాలూ, సందులూ గొందులూ అని అదే పనిగా వెతకకుండా స్వేచ్ఛగా హృదయపూర్వకంగా భాషను వినియోగించండి అంటూ సవాలక్ష ఉదాహరణలతో గిడుగు వారు వ్రాసిన ''బాలకవి శరణ్యము''లో నేటి కవులు, విలేకరులు, రచయితలు తెలుసుకోవలసిన విషయాలు బోలెడన్ని ఉన్నాయి.

లోకయాత్ర కొరకు లౌకిక భాషలు
పుట్టి ప్రజల నోట పొంది యుండు
జీవలోక మందు జీవించు భాషలు
జనుల తలపు దెలుపు సాధనములు.

మాల మాటయేని మాదిగ మాటేని
నాటిదేని గాక నేటిదేని
ఈడదైన నేమి యాడదైనను నేమి
ఏడదైన జెల్లు వాడికయిన

వాడిక గద మాట ప్రాణంబు మానంబు
వాడనట్టి మాట పాడువడును
చెల్లుబడిని బట్టి చేకొండ్రు లోకులు
మాడలైన కవుల మాటలైన

లోక సిద్ధమైన లౌకిక పదములు
సార్థకంబు లెల్ల జనుల కగును
మాసినట్టి మాట మరి మరి పరికింప
కోశమందెతెలియు కోవిదులకె.

పుస్తకాల లోన ప్రుచ్చిన మాటలు
ప్రాతలైన వాని ద్రవ్వి యెత్తి
నేడు ఎల్లవారు వాడ గావలెనన్న
గొంతు కడ్డపడదె క్రొత్త మాట?
తెలుగు భాషా చరిత్రలో మైలు రాళ్ళు
1746  -  రెవరెండ్‌ బెంజిమిన్‌ షూల్జి తెలుగులో ఆరు క్రైస్తవ పుస్తకాలను జర్మనీ  దేశంలో ముద్రించారు.
1814  -  విలియం కేరీ తెలుగు వ్యాకరణం
1816  -  ఎ.డి. క్యాంప్‌ బెల్‌ వ్యాకరణం
1817  -  విలియం బ్రౌన్‌ వ్యాకరణం
1821  -  క్యాంప్‌ బెల్‌ నిఘంటువు
1827  -  సి.పి. బ్రౌన్‌ వ్యాకరణం
1840  -  ముహమ్మద్‌ రహ్మతుల్లా తెలుగులో మొదటి వారపత్రిక వెలువరించారు.
1852  -  సి.పి. బ్రౌన్‌ నిఘంటువు
1926  - వాల్తేరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన
1948  -  తెలుగుభాషా సమితి విజ్ఞాన సర్వస్వాలు ముద్రించింది.
1956  -  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది.
1957  -  ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ  ఏర్పాటు.
1966  -  తెలుగును అధికార భాషగా ప్రకటించారు.
1967  -  తెలుగు అకాడమీ  ఏర్పడింది.
1969  -  డిగ్రీ స్థాయి విద్య తెలుగులో ఉండాలని నిర్ణయించారు.
1975  -  మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు.
1976  -  జిల్లా స్థాయిలో తెలుగును అధికార భాషగా ప్రకటించారు.
1979  -  నంద్యాల మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ శ్రీ ఖాదర్‌ మొహియుద్దీన్‌ మొట్టమొదటి  ''తెలుగు తీర్పు '' ఇచ్చారు.
1979  -  డైరెక్టొరేట్ల స్థాయిలో తెలుగు అధికార భాషఅయ్యింది.
1981  -  మున్సిఫ్‌ మేజిస్ట్రేటు కోర్టుల్లో తెలుగు వాడాలని శాసించారు.
1982  -  నాగార్జున సాగర్‌లో ఓపెన్‌ యూనివర్శిటీ స్థాపించారు.
1983  -  సచివాలయ స్థాయిలో తెలుగు అమలుకు ఆదేశాలు.
1985  -  తెలుగు విశ్వవిద్యాలయ స్థాపన.
1988  -  రాష్ట్రప్రభుత్వకార్యాలయాల్లో ఇంగ్లీషు తొలగించాలని ఉత్తర్వులు
1989  -  తరతరాల తెలుగు జాతి సంగ్రహాలయం స్థాపన. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్థాయిలో  తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టారు.
1990-99-కూడిక, తీసివేత, హెచ్చవేత లాంటి తేలికైన తెలుగు పదాలను తొలగించి,  ఆ స్థానంలో సంకలనము, వ్యవకలనము, గుణకారము లాంటి సంస్కృత పదాలను చేర్చి పిల్లలకు పాఠ్యపుస్తకాలు తయారు చేశారు. పిచికారీ అనే పదం 'ముషలికం' అయ్యింది. ఎక్కువ మార్కులు వస్తాయని సంస్కృతం తీసుకుంటున్నారు. కంపూటర్ల రాకతో తెలుగును నెట్టివేసి ఇంగ్లీషు రాజభాషగా వెలిగిపోతోంది. అధికార భాషా సంఘం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ, తెలుగు భాషకు ఊపిరి పోసే చర్యలు ఏం తీసుకున్నా యో, తెలియటం లేదు.  ప్రభుత్వం తెలుగు వైపు దృష్టి సారించాలి.
                                                                                                    (గీటురాయి 29-10-99)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి