6, జులై 2012, శుక్రవారం

16. తెలుగు కుత్తుకపై కత్తి


16.  తెలుగు కుత్తుకపై కత్తి

                ఆంధ్రప్రదేశ్‌అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు ఏ.బి.కె. ప్రసాద్‌గారు సాక్షి దినపత్రికలో 20.1.2012''తెలుగు కుత్తుకపై కత్తి అనే వ్యాసంలో వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలు : ''నేడు మన పాలకులు తెలుగుకు పట్టిస్తున్న 'తెగులు' ను చూస్తుంటే  ఎన్నెన్నో ఘోరాలు కళ్ళముందు కదలాడుతాయి. ఆంధ్రప్రదేశ్‌పబ్లిక్‌సర్వీస్‌కమీషన్‌నిర్వహిస్తున్న 'గ్రూప్‌- 1' పరీక్షలలో అనుసరిస్తున్న తీరు తెలుగు మాధ్యమం అభ్యర్థులను నిరుత్సాహపరిచే విధంగా ఉండటం తెలుగు మాధ్యమ అభ్యర్థులకే కాదు, భాషాభిమానులకు, ప్రాచీన భాషా ప్రతిపత్తిని అధికారికంగా పొందిన తెలుగు ఉనికిపట్ల ఆందోళనపడుతున్న భాషా ప్రియులందరికీ ఆగ్రహ కారణమవుతోంది.
                ఇంగ్లీష్‌ప్రశ్నల్ని ఊతంగా తీసుకుని తెలుగు మాధ్యమం అభ్యర్థులకు తప్పుడు అనువాద పదాలతో కూడిన ప్రశ్నాపత్రాలు ఇచ్చి, సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయడం వల్లనే తెలుగు అభ్యర్థులు ఎక్కువ మార్కులు పొందలేక ఇంటర్వ్యూలకు అనర్హులు కావడం దారుణం. ఈ అనువాద లోపాల్ని కమిషన్‌తీవ్రంగా పరిగణించకపోవడం విచారకరం.
                తెలుగువాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సైతం తెలుగు మాధ్యమంలో చదివి తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాయడాన్నీ, తెలుగు మాధ్యమాన్ని ఎంచుకోవడాన్నీ మహా పాపంగాను, మహా నేరంగానూ భావించే దశకు రాష్ట్ర పాలనా వ్యవస్థ దిగజారిపోయింది. తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసే ఉద్యోగార్థులైన అభ్యర్థుల పట్లనే ఈ వివక్ష దేనికి?  మూడేళ్ళ క్రితం వరకూ తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేసి గ్రూప్‌1 పరీక్షలలో అట్టడుగు వర్గాలకు చెందిన అభ్యర్థులు సైతం టాపర్స్‌గా వచ్చారు. తెలుగు ప్రథమ అధికార భాషగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సర్వీసులలోకి రాగోరే అభ్యర్థులకు నిర్వహించే పరీక్షలలో ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలలో ఈ అవకతవకలు దేనికి? రాష్ట్రపాలక వర్గానికి, ఇరుగు పొరుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు విద్యావ్యవస్థలోనూ, ఉద్యోగ వ్యవస్థలోనూ తమ మాతృభాషలను ఎలా పెంచి పోషించుకుంటున్నామో గ్రహింపు ఉండవలసినంతగా లేదు. కనుకనే మన విద్యా వ్యవస్థలోనూ, పాలనా వ్యవస్థలోనూ, తెలుగు వినియోగపు విలువను కాపాడుకోలేకపోతున్నారు. కర్ణాటక ప్రభుత్వం, ఉద్యోగార్థులకు కన్నడ భాషాజ్ఞానాన్ని, వినియోగ పాటవాన్నీ విధిగా ప్రకటించడమే గాక, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌విద్యా దశల్లో సహితం మాతృభాషలో స్పర్శ కోల్పోకుండా ఉంచుతోంది. పొరుగు వాణ్ని చూసైనా మన పాలకులు విద్యావ్యవస్థలో మాతృభాష స్థానాన్ని స్పష్టంగా నిర్వచించి స్థిరపరచాలి. తెలుగు ప్రజలకిదే గుణపాఠం! బోధనా పరంగానూ, పాలనా పరంగానూ మాతృభాషను చక్కదిద్దుకోవలసిన అవసరం ఎప్పటికన్నా నేడు ఎక్కువగా ఉందన్న గ్రహింపు అవశ్యం, అవసరం! ఈ గుర్తింపునకు ముందు జాతికి జీవగర్రలు ప్రజా హృదయాలేనన్న 'యాది' పాలకులకు నిద్రలో కూడా తన్నుతూ ఉండాలి! అన్యభాషలను గౌరవించటంతో పాటు తల్లి భాషను ఒంటపట్టించుకోవడం ఎలాగో నేర్వాలి, నేర్పాలి!!

                ''కొమర్రాజు లక్ష్మణరావు గారి ''దేశభాషలలో శాస్త్ర పఠనం'' అనే వ్యాసంలో శాస్త్రపఠనానికి కొన్ని భాషలు మాత్రమే అర్హమైనవన్న వాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ''జ్ఞానమొక భాష యొక్క యబ్బ సొమ్ము కాదు'' అన్నాడు. ''ఆంగ్లభాషపై అభిమానమున్న యెడల ఆ భాషను క్షుణ్ణముగా అధ్యయనము చేయవచ్చును, కాని కమ్మరము, కుమ్మరమును అదే భాషలో చదువవలసిన అవుసరమేమున్నది'' అన్నాడు. ఈ విషయములో జర్మనులు మనకు ఆదర్శము కావలెనన్నాడు.
                అలాగే ఔరంగజేబు తన గురువునకు పయోగకరమైన విద్యావసరాల గురించీ, అదీ స్వభాషలోనే జరగాలనీ వ్రాసిన త్తరాన్ని లక్ష్మణరావు పారశీక భాష నుండి తెలుగులోకి అనువదించి ఇలా వ్యాఖ్యానించాడు:
                ''బాల బాలికలకు బోధింపబడు విషయములు వారికి, వారి జీవితకాలములో నుపయోగకరముగా నుండవలయును. కేవలము పాండిత్యము జూపుటకై అనుపయోగకరములగు విషయములు వారికి నేర్పి గుడ్డిపాఠముచేయించి కాలము వ్యర్థపుచ్చుట, వారికిని, దేశమునకును హానిప్రదము. బాలురకు శాస్త్రములన్నియు వారి మాతృభాషలోనే నేర్పవలయును గాని పరభాషలో నేర్పుట కేవలము ద్రావిడ ప్రాణాయామమని ఔరంగజేబు ూత్తరము వలన మనవారు ముఖ్యముగా నేర్చుకొనవలయును. మొదట పరభాష నభ్యసించుటకు బాలుర కాలమెంతయో వ్యర్థమగును. అట్టు పరభాష వచ్చిన తరువాత, ఆ భాషలో శాస్త్రముల నభ్యసించుటకంటె మొదట నుండియు స్వభాషలోనే శాస్త్రాధ్యయనము చేసిన యెడల బాలురకెంతయో కాలము, శ్రమయు కలిసివచ్చును కదా? తెలివిగల పిల్లవానికి ఇంగ్లీషుభాష చక్కగ నభ్యసించుటకు సుమారు ఆరేడు సంవత్సరములు పట్టును. అప్పటికా బాలునకు ఇంగ్లీషులో గ్రంథావలోకనము చేయుటకును, శాస్త్రాభ్యాసము చేయుటకును అధికారము కల్గును. ఇట్లు పరభాషాధ్యయనమునకై ఏడెనిమిది సంవత్సరములు వ్యర్థమగుచుననవి. దేశ భాషలలో శాస్త్రములు జెప్పిన యెడల నీ ఏడెనిమిది సంవత్సరములలో నెన్నియో విద్యలలో పారంగతుడు కావచ్చును. కాని సకల శాస్త్రజ్ఞానమును, ఇంగ్లీషుభాషయను గదిలోబెట్టి తాళమువైచి, ఏ.బి.సి.డి. అను తాళపుచెవిని సంపాదించుటకు ఎనిమిది సంవత్సరములు ముక్కు పట్టుకొని తపస్సు చేయనివారలకు జ్ఞానభాండారములోని సొత్తును కొల్లగొట్టునధికారము లేదనియు, విద్యామహిమయు మాతృభాషా ప్రభావమును తెలియని దూరదృష్టి విహీనులు తప్ప మరెవ్వరును చెప్పజాలరు.... ఇంగ్లీషుభాషనే జ్ఞానసాధనముగా బెట్టిరేని ఔరంగజేబు తన గురువును నిందించినట్లు రాబోవు తరమునందలి విద్యార్థులు తమ యాయుష్యములోని పది సంవత్సరములు పాడుచేసినందులకు మనలను నిందింపక మానరు.''                    
                                                                   (1910 భారతి మాసపత్రిక, సాధారణ సంవత్సరాది సంచిక)

నా అభిప్రాయం :      

1.            తెలుగు మీడియం ద్వారా డిగ్రీ చదివిన అభ్యర్థులకు పూర్వం ఇచ్చిన పద్ధతిలోనే మళ్ళీ అయిదు శాతం ప్రోత్సాహక మార్కులు ఇస్తే తెలుగులో చదివే విద్యార్థులు పెరుగుతారు.
2.            సర్వీస్‌కమీషన్‌ఇన్ని రకాల పరీక్షలకు బదులు డిగ్రీ అర్హత గల గ్రూప్‌1, 2 ద్యోగాలన్నిటికీ కలిపి ఒకే పరీక్ష ప్రతి ఏటా నిర్వహించి అందులో అభ్యర్ధులకు వచ్చిన మార్కులను బట్టి పోస్టులు కేటాయిస్తే ఖర్చు ఇద్దరికీ భారీగా తగ్గుతుంది. సమయమూ కలిసి వస్తుంది.
3.            తెలుగు మొదటి అధికార భాష కాగా ఉర్దూ రెండవ అధికార భాష మన రాష్ట్రంలో తెలుగు నుండి ఇంగ్లీషుకు, ఉర్దూ నుండి ఇంగ్లీషుకూ నిఘంటువులున్నాయి. కానీ ఈ ఇద్దరు అన్నదమ్ములూ పరస్పరం తెలుగు-ర్దూ, ర్దూ-తెలుగు నిఘంటువులు నిర్మించుకోలేదు. రెండూ దేశభాషలే. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్ళయినా ఒకరి భాష ఒకరికి సరిగా రాదు.ఏబికె ప్రసాద్‌గారు తెలుగు ర్దూ నిఘంటువు గురించి ఆయన పదవీ విరమణా నంతరం ఇప్పటికి కూడా ఆరా తీస్తున్నారు.ఎన్నో ఉర్దూ పదాలు, ఇంగ్లీషు పదాలు తెలుగు ప్రజల అనుదిన జీవిత సంభాషణల్లో పాతుకుపోయి ఉన్నాయి. అనువాదం చేసే ప్రొఫెసర్లు పండితులు ప్రజలకు అర్థం కాని కృత్రిమ భాషా పదాలను సృష్టించే కంటే ప్రజలలో పాతుకుపోయిన ూర్దూ, ఇంగ్లీషు పదాలనే వాడితే మన తెలుగు విద్యార్థులను కాపాడిన వారౌతారు.
4.            ప్రాచీన భాషా పీఠం మన రాష్ట్రంలోనే పెడతారు కాబట్టి దానికి వచ్చే నిధులతో మహా నిఘంటువు, జాతీయాలు, సామెతలు, జానపదగీతాలు, పాత చిత్రాలలోని పాటలు మొదలైన సాహిత్య గ్రంథాలు ముద్రించాలి.
5.            పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు ఉపయోగపడే సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఇస్తూ ఉండటానికి అమలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగం, మంత్రాగం ఏర్పడాలి.
                21.2.2012న మాతృభాషా దినోత్సవ సందర్భంలో మన తెలుగు ప్రముఖులు పలికిన మాటలు కొన్ని గుర్తుంచుకుందాము :
''ప్రపంచ వ్యాప్తంగా ూన్న తెలుగువారిని సమన్వయ పర్చేందుకు రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి. అధికార భాషా సంఘాన్ని వెంటనే పునరుద్ధరించాలి. ద్యోగాల్లో ఐదుశాతం వెయిటేజీ ఇస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుగు నేర్చుకుంటారు.'' 
                                                                                           - మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు.
                ''శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మాతృభాషలో అందించటం వల్లే ఇటలీ, జర్మనీ, చైనా, రష్యా, జపాన్‌, కొరియా దేశాలు అభివృద్ధి చెందాయి.''                                                                                     - రాఘవులు
                ''ఆంగ్లంలో మాట్లాడకుంటే నన్ను దండించారు. పబ్లిక్‌స్కూళ్ళలో ఆంగ్లం తప్ప మరో భాషకు చోటు లేదు. తెలుగు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే ఎవరూ బాధ్యతల్ని స్వీకరిస్తారో వెతికిపెట్టండి.''                          - ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
                అదే రోజు సిలికానాంధ్ర వాళ్ళు యూనీ కోడులో 3 ఫాంట్లు (అక్షర రూపాలు ఆయా దాతల పేరుతో విడుదల చేశారు.)వాటి పేర్లు :  1. పొన్నాల, 2. రవిప్రకాష్‌, 3. లక్కిరెడ్డి. అక్షరరూపాలు బాగున్నాయి. అక్షర దాతలకు ధన్యవాదాలు. తెలుగు భాషకు మరెన్నో అక్షర రూపాలు సమకూర్చాలి, ఇంకా అనేక అక్షర రూపాలను వాటి గుత్తాధిపతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసి జాతికి అందించాలి. ఫాంటు కన్వర్టర్లను ఎప్పటికప్పుడు తాజా పరుస్తూ ఉండాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి