18, జులై 2012, బుధవారం

దిక్కులేని భాషలకు ఇంగ్లీషే దిక్కు


26.దిక్కులేని భాషలకు ఇంగ్లీషే దిక్కు
                చరిత్రలో ఎప్పుడైనా తెలుగువాళ్ళు మరో దేశం మీద దండయాత్ర చేసి వాళ్ళ మీద మన తెలుగు భాషను రుద్దారా? పోనీ వ్యాపారం పేరుతో తెలుగు దేశపు కంపెనీ ఒకటి పెట్టి నౌకలు వేసికెళ్ళి ఇతర దేశాలను తమ పాలనలోకి తెచ్చుకున్నారా? విదేశీయుల్ని విభజించి పాలించారా? మంచి లాభాలు సంపాదించి మన తెలుగుదేశానికి పట్టుకొచ్చారా? ఇలాంటి కబ్డాకోరు పనులు తెలుగువాళ్ళు చేసినట్లు నా చెవిని పడలేదుగాని ఆంగ్లేయులు అన్ని జాతుల వాళ్ళ మీద, అన్ని భాషల వాళ్ళ మీద చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లీషు అంతర్జాతీయ భాష కావటానికి ప్రధాన కారణం ఆంగ్లేయుల సామ్రాజ్యవాదమే.
                ఇంగ్లీషు వాళ్ళు ఏదేశం మీద కాలుపెడితే ఆ దేశంలో స్కూలు, చర్చి, కోర్టు ఖచ్చితంగా నెలకొల్పేవారట. ఒకవేళ స్కూలు పెట్టకపోయిన చర్చి, కోర్టు తప్పనిసరిగా పెట్టేవారట. ఈ మూడింటిలో తమ భాష అమలు జరిపేవారట. తెలుగువాళ్ళు తమ పనేదో తాము చూసుకొనిపోయే రకమే గాని, దురాక్రమణ తత్వం గల వాళ్ళు కాదు. అవసరమైతే తమ భాషను వదిలేసి, ఇతర భాషలను నేర్చుకుని మరీ ఊడిగం చేసి పొట్టపోసుకునే రకమేగాని, అవతలి వాళ్ళను తమ భాషతో పాలించే రకం కాదు.
                తెలుగువాడి దగ్గరున్న సంపదను దోచుకుపోవటానికి ఎవరెవరో ఎక్కడెక్కడి నుండో వచ్చి దోచుకుపోయారు. మన తెలుగువాడు ఎన్నడు దోచుకురావడానికి బయలుదేరలేదు. అటువంటి అవసరం మన వాళ్ళకు కలగలేదు. ఒకవేళ అలాంటివి గుర్తించిన తెలుగు రాజులు తమలో తామే కలహించుకొని చెరో పక్షమై నశించిపోయారు గాని ఇతరులది దోచుకొచ్చి చెరిసగం పంచుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా బానిసగా సంపాదించుకునేదే తెలుగువాడికి బాగా రుచించింది కానీ, తానే యజమానై ఇతర భాషల వాళ్ళకు జీతాలివ్వటం అనే ఆలోచన అసమంజసంగా, విడ్డూరంగా, అసలు వినటానికే అసహ్యంగా ఉంటూ వచ్చింది.
                ఒక్క తెలుగవాళ్ళే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎవరెవరి భాషలు నాశనమైపోతున్నాయో వాళ్ళందరి తత్వం ఇలాంటిదే. మా వాడు దెబ్బలకోరుస్తాడు అంటే విడిపించే దిక్కులేక అన్నాడట. అంతర్జాతీయ భాషలు కొడుతున్న దెబ్బలకు జాతీయ, ప్రాంతీయ భాషలు విడిపించే దిక్కులేక ఓర్చుకుంటున్నాయి. ఇక ఆయా ప్రాంతాల్లో ఒకటో అధికార భాష, రెండో అధికార భాష తలపడి, కలబడి ఒకదాన్నొకటి తిరస్కరించుకొని, అంతార్జాతీయ భాషనే అంతిమ శరణ్యంగా ఆశ్రయిస్తున్నాయి. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్లు  ఈ ప్రపంచంలో ఎన్నో దిక్కుమాలిన భాషలకు ఇంగ్లిషే దిక్కయింది. అవసరం అలాంటిది.
బడి, గుడి, తీర్పు ఈ మూడూ ఇంగ్లీషులో నడిచేలా ఆంగ్లేయులు ముందు తమ దేశంలో అమలు చేశారు. తరువాత ఇతర దేశాల మీద పడ్డారు. భాష విషయంలో ఇంగ్లీషులో వాళ్ళు ఇంటగెలిచాకే రచ్చ గెలిచారు. తెలుగు వాళ్ళతో పాటు మరెన్నో భాషల వాళ్ళు ఇంట గెలవలేదు. తమ బడుల్ని, గుడుల్ని, తమ తీర్పుల్నీ తమ భాషల్లోకి తెచ్చుకోలేదు. అందుకే వారివి ఆంగ్ల పాలిత ప్రాంతాలుగా మారిపోయాయి.
                ''చంక నాకే వాడిని సంభావన అడిగితే ఏదో చేశాడన్నట్లు, ''అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'' పేరుతో ప్రపంచ వ్యాప్తంగా నాశనమైపోతున్న భాషలను ఉద్ధరించాలని ఐక్యరాజ్యసమితి మొక్కుబడి ప్రయత్నాలు చేస్తోంది. ఏమీ ప్రయోజనం లేదు. తెలుగు లాంటి మిగతా భాషలన్నీ పీకల లోతు ఆంగ్లంలో దిగబడి ఉన్నాయి. అలా అన్ని దేశాలూ ఆంగ్లమే శరణం అనే పద్ధతిలోకి వచ్చేలా మొదటి నుండీ ఆంగ్లేయులు కృషి చేశారు.
                మనిషిని ఒక భాషకు గత్యంతరం లేని బానిసలాగా మార్చే రంగాల్లో మతం, వ్యాపారం చాలా ముఖ్యమైనవి.
1. మతం: ఇంగ్లీషు దేశాల వాళ్ళ మతం క్రైస్తవం. క్రైస్తవ లేఖనాలు హెబ్రూ, గ్రీకు భాషల్లో ఉంటాయి. మత లేఖనాలు ఏ భాషలో ఉంటే ఆ భాష దేవుడి భాషలాగా గౌరవం పొందుతుంది. ప్రపంచంలో ఆ మతస్తులంతా లేఖన భాషనే తప్పనిసరిగా వినియోగిస్తారు. అర్ధం కాకపోయినా సరే. లేఖనం వెలువడిన భాష లిపికి, శబ్దానికి అంత ప్రాధాన్యత నిస్తారు. ఒక పొల్లు తేడా వచ్చినా అపచారంగా భావిస్తారు. హిందువులు సంస్కృత లేఖనాలకు, ముస్లిములు అరబీ లేఖనాలకు, శిక్కులు పంజాబీ లేఖనాలకు ఇచ్చే విలువ ఎలాంటిదో అందరికీ తెలుసు. అయితే హెబ్రూ, గ్రీకు భాషలలో ఉన్న క్రైస్తవ లేఖనాలను ఆంగ్లేయులు పూర్తిగా ఇంగ్లీషులోకి మార్చుకోవటమే గాక వారి మత వ్యవహారాల్లో లేఖనాల మూల భాషలకు ఏ మాత్రం ప్రాముఖ్యతో లేకుండా చేశారు. అంతా ఆంగ్లమయం చేశారు. ఆసియాలో పుట్టిన క్రైస్తవం అమెరికాలో, ఆంగ్లంలోనే పుట్టిందా అన్నట్లు మార్చుకున్నారు. అసలు యేసుక్రీస్తు ఆంగ్లేయుడేమో అనుకునేలా చేశారు. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవ లేఖనాలకు కింగ్‌జేమ్స్‌ వర్షన్‌, రివైజడ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ లాంటి ఎన్నో ఆంగ్లానువాదాలే అనుసంధానంగా ఉన్నాయి గాని హెబ్రూ, గ్రీకు భాషలు కాదు. పైగా ప్రపంచంలో ఏ మతం గురించి తెలుసుకోవాలన్నా సమస్త మతాల విజ్ఞానం ఆంగ్లీ కరించబడింది. ఆంగ్లం ద్వారానే మతాల పరిజ్ఞానం కూడా విస్తారంగా దొరుకుతోంది.  వత్తులు, గుణింతాల బెడదలేకుండా లిపి సౌలభ్యంతో పాటు దాన్ని మతంతో కలగలిపి, మత భాషగా కూడా అభివృద్ధి పరచటం ద్వారా ఇంగ్లీషు అంతర్జాతీయ ఆదరణ పొందింది. తెలుగు లిపిని సంస్కరించేందుకు గానీ ఆంగ్లేయుడిలాగా తెలుగువాడు కృషి చేయలేదు.
2. వ్యాపారం: ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌, ఐక్యరాజ్యసమితి లాంటి పేర్లు, వింటే ఇంగ్లీషు ఎంత వచ్చి తీరాల్సిన భాషగా చేయబడిందో అర్ధమవుతుంది. ''(www)'' అనే ఆంగ్ల అక్షరాలు ఇంటర్‌నెట్‌ వాడే అందరికీ ఆవశ్యం. అంటే ప్రపంచాన్ని అల్లుకున్న సాలెగూడు అని అర్ధం. ఇంగ్లీషే ఆ సాలెగూడు. ఆంగ్లేయుడే ఆ సాలెపురుగు. అప్పిచ్చే వాడికి అప్పు తీసుకున్న వాళ్ళు లోకువ. అప్పిచ్చేవాడి భాషను అప్పు తీసుకునేవాళ్ళు నేర్చుకోక తప్పదు. రాసుకున్న ఒప్పందం అప్పు ఇచ్చేవాడి భాషలోనే ఉంటుంది. తెలుగు వాళ్ళు అంతర్జాతీయ వ్యాపారంలో ఆరితేరి ఇతర దేశాలకు అప్పులిచ్తే స్థితికి ఎదిగి వస్తే అప్పుడు వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుంటారు. అది కూడా తెలుగువాళ్ళు తెలుగులోనే ఒప్పందాలు చేస్తూ  ఉంటేనే సాధ్యం. చింతలూరు ఆయుర్వేదం మందుల సీసాల మీద కూడా ఇంగ్లీషు పేర్లు లేకపోతే అమ్ముడుపోని రోజులివి. ఇంకెక్కడి తెలుగు? దాన్ని బతికించు కోవాలంటే ఇంగ్లీషు వాడు పడినన్ని కష్టాలు పడాలి.
       అయితే మన తెలుగు ప్రముఖుల మనస్తత్వం ఎలా ఉందో చూడండి:
                ''జార్జి చక్రవర్తి న్యూఢిల్లీ వచ్చినప్పుడు ఆయన దర్శనం కోసం గుంటూరు నుండి 'దేశభక్త' బిరుదాంకితుడు కొండా వెంకటప్పయ్య పంతులు వెళ్ళాడు. ఆయనకు కూర్చునే చోటు దొరకలేదు. అందుకని దూరంగా మెట్ల మీద నిలుచునే చోటును టిక్కెట్టు పెట్టి కొనుక్కున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ నుండి ఇంకా చాలా మంది వెళ్ళారు. వారంతా జార్జి గారి పట్టాభిషేకం చూచి తరించారు. ''జార్జి రాజేంద్ర వైభవ నిర్జితేంద్ర'' అంటూ చక్రవర్తిపై పద్యాలు వ్రాసింది ఎవరో తెలుసునా? సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర కవులు. వారికీ దుర్గతి ఎందుకు పట్టింది?
                ''ఆచార్య బి. రామరాజుగారు ఎం.ఏ. తెలుగు చదువు కోవాలని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడి తెలుగు శాఖాధిపతి 'నీకు బుద్ధిలేదా? తెలుగు చదువు కుంటానని వచ్చావు? అని తిట్టాడు. ఆ తిట్టింది మరెవరో కాదు, మహా దేశభక్తుడు మాతృ భాషాభిమాని రాయప్రోలు సుబ్బారావు గారు. దీని వల్ల ఏం తెలుస్తున్నది. ఆదర్శానికి ఆచరణకు చాలా అంతరం ఉంటుంది. భారతీయులకు దేశభక్తి ఎప్పుడూ లేదు. కేవలం రాజభక్తి, దైవభక్తి మాత్రమే ఉంది.''
                                                                         -ముదిగొండ శివప్రసాద్‌, ఆంధ్రభూమి (10-7-2005)
    మరి ప్రపంచంలో ప్రతి ఏటా ఎన్నో భాషలు రక్షించే దిక్కులేక నశిస్తున్నాయని చెబుతున్నారు. వాటిలో తెలుగు కూడా త్వరలో చేరిపోతుందనీ అంటున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎ.బి.కె. ప్రసాద్‌గారు ఏమంటున్నారో చూడండి:
                ''ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ తదితర సంస్థల ద్వారా అమెరికా తదితర పెట్టుబడి దేశాలు చిన్న దేశాలపై పట్టు కలిగి ఉండాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇంగ్లీషుకు ప్రాధాన్యం లభిస్తోంది. వర్థమాన దేశాల మార్కెటింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇంగ్లీషును ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ....ప్రపంచంలో అనేక దేశాల్లో వందలాది భాషలు కనుమరుగయ్యాయి. తెలుగు కూడా కనుమరుగు కాకుండా దానికి సరైన ప్రాధాన్యత నివ్వాలి. ఇందుకు ప్రాధమికవిద్యా స్థాయిలోనే తెలుగు బీజం పడాలి.'' (ఆంధ్రభూమి, 3-7-2005). శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్‌గారు దీనికి కారణం పరిష్కారం రెండూ చేప్పారు. ''ఏ భాషైనా నశించిపోవడానికి ఇతర భాషల పెత్తనం ఎక్కువ కావటంతో పాటు ప్రజల్లో చైతన్యం లేకపోవటం కూడా కారణమే.'' (ఆంధ్రభూమి, 3-7-2005).
                అంటే ఇతర భాషల పెత్తనం మన మీద తగ్గాలి. ఆయా భాషలు మన మీద ఎందుకు పెత్తనం చేస్తున్నాయి? ఎలా పెత్తనం చేయగలుగుతున్నాయి? మనం ఆ భాషల పెత్తనానికి ఎందుకు తలవంచాల్సి వస్తున్నది? మన భాష మరెవరి మీద ఎందుకు పెత్తనం చేయలేక పోతున్నది? మన భాష మన మీదే కాకుండా ఇతరుల మీద కూడా పెత్తనం చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలి? మన భాష పరిస్థితి ఇలాగే ఉంటే అసలు పెత్తనం చేసేందుకు వీలుందా? పెత్తనం చేసేవాళ్ళు ఏ భాష వాళ్ళయి ఉండాలి? ఆ భాషకున్న ఆధిక్యత ఏమిటి? 'దానికా ఆధిక్యత ఎలా వచ్చింది?' మన భాషకు కూడా అటువంటి ఆధిక్యత, సౌలభ్యత తేలేమా? మొదలైన ప్రశ్నలు చైతన్యం ఉన్న ప్రజలు వేసుకుంటారు. పరాన్న జీవులు ప్రశ్నించరు. ప్రశ్నించలేరు. ఎందుకంటే వారు పరులపై ఆధారపడిన పరాన్న జీవులు కాబట్టి. తమ కాళ్ళపై తాము నిలబడి స్వంతంగా బ్రతికే శక్తి సామర్ధ్యాలు లేవు కాబట్టి. అటువంటి వాళ్ళ భాషే బలహీనంగా చచ్చే దశలో ఉంటుంది. అంపశయ్య మీద పడుకోబెట్టిన భాషకు జవజీవాలను ప్రసాదించడం పరాన్న జీవులవల్ల కానేకాదు.

                కాబట్టి తెలుగు భాషకు ముందు కావలసింది స్వయం పోషకత్వం. ఇతర భాషల జోలికి వెళ్ళకపోయినా తన మట్టుకు తాను బ్రతకగలిగే అవకాశం. ఇలాంటి పరిస్థితి లేనేలేదు. రానేరాదు అని మన తెలుగు మేధావులే తేల్చి చెప్పేస్తుంటే ఈ భాషను బ్రతికించేదెవరు? పైగా వేమన పద్యాన్ని తెలుగు జనానికి తెగ వినిపిస్తున్నారు, వేరే దిక్కు లేదంటున్నారు.
''చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్క కుక్కయైన బాధ సేయు
బలిమి లేని వేళ పంతముల్‌ చెల్లవు
విశ్వధాభిరామ వినురవేమ.''
                                                                                          (గీటురాయి 5-8-2005)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి