6, జులై 2012, శుక్రవారం

18. తమిళులు ఎలా చేస్తే మనమూ అలా చేద్దాం


18. తమిళులు ఎలా చేస్తే మనమూ అలా చేద్దాం
                1.8.2006 నుండి తమిళనాడులో కొన్ని సంస్కరణలకు ముఖ్య మంత్రి కరుణానిధి శ్రీకారం చుట్టారు. అందులో తమిళభాషకు ప్రాణం పోసే సంస్కరణలు కొన్ని న్నాయి.
1.            అన్ని స్కూళ్ళల్లో తమిళభాష నేర్పటం నిర్బంధం చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలనే తేడా లేదు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళయినా సరే తమిళం నేర్వాల్సిందే.
2.            కామరాజు పుట్టిన రోజును ''విద్యాభివృద్ధి దినోత్సవం''గా జరుపుతారు.
3.            తమిళ పేర్లు పెట్టిన సినిమాలకు ప్రోత్సాహకాలిస్తారు.
4.            అన్ని కులాల ప్రజలూ 'అర్చకులు' అవుతారు.
                కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాక ఏ కులం వ్యక్తి అయినా గుడిలో పూజారి కావచ్చు. పైగా సంస్కృత మంత్రాల స్థానంలో తమిళ మంత్రాలు, ప్రార్థనలు చదవొచ్చు. ఒక పక్క బడుగు కులాల వాళ్ళకు అర్చక పదవుల వల్ల సాంఘిక గౌరవం దక్కుతూ, మరో పక్క వెనుకబడిన కులాలు రక్షించుకుంటూ వస్తున్న  తమిళం దేవభాషగా విరాజిల్లుతుంది. భయతారక మంత్రం ఇది.
                పై సంస్కరణలు మన రాష్ట్రంలో కూడా త్వరలో రావాలని ఆశిద్దాం. తెలుగు ప్రజలకంటే తమిళుల జనసంఖ్య తక్కువే. అయినా తమిళులకు చేవ ఎక్కువ. తమిళాన్ని దేవభాషగా గౌరవిస్తారు. మన తెలుగు కూడా దేవభాషే అని చాటిచెబుదాం. తెలుగును దేవభాషగా గౌరవిద్దాం. ఇందులో తప్పేం లేదు. ఇంగ్లీషు, సంస్కృతం, అరబీ భాషలను మనం గౌరవించటం లేదా? అలాగే మన భాషను కూడా గౌరవిద్దాం.                                                                  (1.9.2006, గీటురాయి వారపత్రిక)

కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ ప్రాచీన తమిళ మహాసభ అమోదించిన తీర్మానాలపై ఆ రాష్ట్ర క్యాబినెట్‌తీసుకున్న నిర్ణయాలు ఇవి:
  1. తమిళానికి కేంద్రంలో అధికార భాషా హోదా కల్పించాలి. ఈ అంశంపై పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించి దానిపై చర్చించాలి.
  2. మద్రాసు హైకోర్టులో తమిళంలో వాదనలకు అనుమతించాలి. దీనిపై ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్ర ప్రభుత్వానికి 2006లోనే లేఖ రాశారు.
  3. తమిళ భాషాభివృద్ధికి పరిశోధనలకు అవసరమైన రాయితీ నిధులను కేంద్రం ఇవ్వాలి. రాష్ట్రంలో శాసన అధ్యయన కేంద్రం నెలకొల్పాలి.
  4.  తమిళంలో చదువుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ ూద్యోగావకాశాలు, ప్రాధాన్యత ఇవ్వాలి.
  5.  పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో తమిళ ప్రాచీన భాషా శీర్షికను చేర్చాలి.
  6.  తమిళ భాషాభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులు ఏర్పరచాలి.
  7.  తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌ వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్‌పేరుతో రూ. 1 లక్ష నగదు అవార్డు, ప్రశంసాపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.
                మన రాష్ట్రం కూడా తెలుగు భాష గురించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను. తమిళులు ఎలా చేస్తే మనమూ అలా చేద్దాం.
                ఇక నుంచి తమిళనాడులోని అన్ని డిగ్రీ కళాశాలల్లో కూడా ద్వితీయభాషగా తమిళమే వుండబోతోందని ఆ రాష్ట్ర న్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచే తమిళ సాహిత్యం, పద్య, గద్య, వ్యాకరణం తదితరాలన్నీ వుంటాయన్నారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో తమిళ వ్యాకరణ చరిత్ర, ప్రాచీన తమిళంలు సబ్జెక్టులుగా వుంటాయన్నారు.          ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌, ఎయిడెడ్‌కళాశాలలు, స్వయంప్రతిపత్తి కళాశాలలకు కూడా ఈ విధానాలే వర్తిస్తాయని పొన్ముడి ప్రకటించారు.మనం కూడా ఇలాంటి ప్రకటన ఆశించవచ్చా?
                12.10.2004న తమిళాన్ని ప్రాచీన భాషగా కేంద్రం గుర్తించింది. ప్రాచీన భాష హోదా వల్ల తమిళ పీఠానికి కేంద్రం నుండి వస్తున్న కోట్లాది రూపాయల నిధులతో 29 ఎరకాల స్థలంలో సంస్థ భవనం కట్టారు. ఆ పీఠంలో 11 శాఖలు ఏర్పాటు చేశారు అవి :-
                1. సాహిత్యం, 2. భాషాశాస్త్రం, 3. అనువాదం, 4. నిఘంటువులు, 5. భాషా చరిత్ర, 6. పురాతత్వం, 7. శిలాశాసనాలు, నాణాలు 8. రాతప్రతులు, 9. కళలు, శిల్పం, 10. భాషా సాంకేతిక పరిజ్ఞానం, 11. విదేశాల్లో తమిళం.
                8.5.2009న తెలుగు కన్నడ పీఠాలు ఏర్పాటు చేయటానికి కేంద్రం అంగీకరించింది. తీరా తెలుగు పీఠం కూడా మైసూరులోనే ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు ప్రజల నిరసనకు తలొగ్గి తెలుగు కేంద్రం తెలుగు ప్రాంతంలోనే ఏర్పాటు చేయటానికి అంగీకరించారు. 17.10.2012న కన్నడ కేంద్రం మైసూరులో ప్రారంభించారు. కన్నడ అభివృద్ధికి 200 కోట్ల బడ్జెట్‌పెంచినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సదానంద గౌడ ప్రకటించారు. ''క్లాసికల్‌కన్నడ'' అనే వెబ్‌సైట్‌కూడా ప్రారంభించారు.

                మన తెలుగు భాషా పరిశోధనా పీఠం ఇంకా ఎక్కడా పెట్టలేదు. త్వరగా మేలిమి తెలుగు కేంద్రాన్ని విజయవాడలో పెడితే బాగుంటుంది. అలాగే తెలుగుపీఠంలో కూడా 11 శాఖలు ఏర్పాటు చెయ్యాలి. 200 కోట్లు నిధులివ్వాలి. ''మేలిమితెలుగు'' వెబ్‌సైట్‌ను ప్రారంభించాలి. తెలుగులో త్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేస్తూ ప్రతిఏటా వాటి రూపకర్తలకు నగదు బహుమతులు ప్రకటించాలి.
 (ఈనాడు 30.8.2015)

2 కామెంట్‌లు: