18, జులై 2012, బుధవారం

మాతృభాషలో చదివితే మనసుకు హత్తుకుంటుంది


22.మాతృభాషలో చదివితే మనసుకు హత్తుకుంటుంది
                కురాన్‌ అంటే దేవుని వాక్యం, అసంబద్ధాలు లేని పరమసత్యం, తేడాలను తేల్చి చెప్పే గీటురాయి అని మనం నమ్ముతాం. ఖుర్‌ఆన్‌ అని పండితులు పలికితే కురాన్‌ అని నాలాంటి సామాన్యులు సంబోధిస్తారు. (అంటే త్సునామీని సునామీ అన్నట్లు) ఈ పదానికి అసలైన అర్ధం ''చదవటం'' అని. ఇది అరబీలోనే ఉండాలిగాని మరో భాషలో ఉండ కూడదని, అసలు కురాన్‌ను అనువదించటం అసాధ్యమనీ, మరో భాషలో దాని అర్ధమే మారిపోతుందనీ కొందరు వాదిస్తున్నారు.
                కురానును ప్రపంచ భాషల్లోకి అనువాదం చేయకపోతే దేవుని వాక్యం ఆయా ప్రజల భాషల్లో ప్రజలకు అందదు. ప్రజల భాషల్లో గీటురాళ్ళు లేనందువల్ల సత్యాసత్యాల నిర్ధారణ కోసం అరబీ భాష తెలసిన వారి కోసం చూడాల్సి వస్తుంది. స్వభాషలో దైవ లేఖనాల పరిశోధన చింతన, తమ సమస్యలకు అన్వయింపు జరగాలంటే అనువాదం తప్పనిసరి. ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోకి దైవ వాక్యం అనువదించబడాలి.
                అరబీ నుండి మరో భాషలోకి అనువదించడం ఎవరికీ చేతకాదు అనే వాదన వెనుక అరబీ దేవుని భాష, మిగతావి మానవ మాత్రుల భాషలు అనే అభిప్రాయం కొంతమందికి ఉంది. అసలు అనువాదం చేయడానికి మిగతా భాషలు వేటికీ సాధ్యం కాని కొన్ని పదాలు అరబీలో ఉన్నాయనే అభిప్రాయం మరికొంత మందికి ఉంది.
                అందువలన చాలా కాలం అర్ధంకాని దాన్ని చదివారు. అర్ధం కాకపోయినా చదవటమే పుణ్యంగా, చదవటమే తప్పనిసరి బాధ్యతగా చదివారు. ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మనిషికి దైవ వాక్యం అందాలని అది కూడా వారి వారి మాతృ భాషల్లో అందాలని, అది వారికి అర్ధమై వారు స్పందించాలనీ ఆది నుంచి కోరుతున్న వాళ్ళూ ఉన్నారు. ఏమైతేనేం వారి కృషి ఫలించి కురాన్‌ ఈనాడు ఎన్నో భాషల్లో ప్రజలకు అందుతోంది. అమృత వాక్యాలను అందిస్తుంది.
                యేసుక్రీస్తు సమరయ స్త్రీతో ''మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు'' అంటాడు (యోహాను 4:22) అలాగే అతేనైయుల దేవతా ప్రతిమల్లో ఒక బలిపీఠం మీద ''తెలియబడని దేవునికి'' అని రాసి ఉందట. దాన్ని చూసి పౌలు ''మీరు తెలియక  దేనియందు భక్తి కలిగి ఉన్నారో, దానినే నేను మీకు తెలియజేస్తున్నాను'' అంటాడు (అపో. కార్య. 17:23)
                ఇలా ఒక మాటకు ఇంకో మాట లింకు చేసుకుంటూ, లంకె వేసుకుంటూ, ఆ మాట ఎక్కడెక్కడ ఉందో అలవోకగా రిఫరెన్సు బైబిల్లో వెతుక్కోవచ్చు. అలా 114సూరాల్లో చక్కగా, సునాయాసంగా దైవ వాక్యాన్ని వెతికి పట్టుకునేందుకు మనకు తెలుగు రిఫరెన్సు కురాను కావాలి. అరబీలో నాలాంటివాణ్ణి వెతకమంటే గుడ్లు తేలేయ్యాల్సిందే గాని ఫలితం ఉండదు. అదే తెలుగులో రిఫరెన్సు కురాను ఉంటే, అవసరమైన ఏ మాటైనా ఈ కళ్ళు వెలికి పట్టుకుంటాయి. తెలుగులో దేవుని వాక్యాలను చూసినప్పుడు మన కళ్ళు అర్ధవంతగా ప్రకాశిస్తాయి. మన మనస్సు ఆనందిస్తుంది. హెచ్చరికలకు భయపడుతుంది. ఆజ్ఞలకు లోబడుతుంది. నీతికి నిలబడుతుంది.
                ఇదివరకు కోడిని కొయ్యాలంటే ఊళ్ళో ముల్లానో, అరబీ పలుకులు పలికే అయ్యానో వెతికి పట్టుకునే వాళ్ళు. అప్పట్లో ఆ లిటరేచరంతా ఉర్దూలోనే ఉండేది. ఇప్పుడు నమాజ్‌ ఎలా చెయ్యాలి, కోడిని ఎలా కొయ్యాలి, జనాజా ఎలా చెయ్యాలి, పెళ్ళి ఎలా చేయాలి లాంటి విషయాలన్నీ తెలుగులో విడమరచి చెబుతూ పుస్తకాలు వచ్చాయి. అజ్ఞానం లోంచి జ్ఞానంలోకి, చీకటి నుంచి వెలుగులోకి, తెలియని భాష లోంచి తెలిసిన భాషలోకి, మోయలేని కాడి క్రింద నుంచి అలవోకగా అర్ధం చేసుకునే దశలోకి తెలుగు జనాన్ని నడిపించింది తెలుగు ఇస్లామిక్‌ సాహిత్యం.
                విశ్వ ప్రభువును అరబ్‌ పక్షపాతిగానో, అరబీ భాషస్తుడిగానో భావించే మూఢనమ్మకం ఎవరిలోనైనా ఉంటే అది వదులుకోవాలి. ఆయనకు అన్ని భాషలు వచ్చు. అన్ని భాషలూ ఆయనలో నుండి పుట్టినవే. చివరికి దోమల భాష, చీమల భాష కూడా. లేకపోతే అన్ని జీవుల భాషల్లో నిరంతరం వెలువడే స్తోత్రం అర్ధం చేసుకోటానికి ఆయనకు అనువాదకులు కావాలా? అక్కరలేదు. ఆయన సర్వజ్ఞాని, సకల భాషా కోవిదుడు. ఆదాము, ఇబ్రాహీము దగ్గర నుండి నేటి వరకు నెలకొన్న భాషలన్నీ ఆయన ఆరాధనకు ఉపయోగపడేవే. సులేమానుకు జంతువుల భాష, పక్షుల భాష అర్ధం చేసుకునే జ్ఞానం దేవుడే గదా ఇచ్చింది? మరి చీమల భాషను అరబీ భాషలోకి మనకు అర్ధం కావడం కోసం దేవుడే తర్జుమా చేసి చెప్పాడు గదా? (కురాన్‌ 27:18). దేవుడికో కొడుకున్నాడనో, మరో దేవదూషణో ఏ భాషలో చేసినా భూమ్యాకాశాలకు, పర్వతాలకు అర్ధం అవుతుందని కురాన్‌ 19:90-91 చెబుతుంది. ఇక్కడ భాష కంటే భావం ముఖ్యం (కురాన్‌ 41:44,45, 26:198-201) అరబీ భాషలో విగ్రహారాధన చేస్తే అది అనుగ్రహ పాత్రం కాదు గదా?
                ఒకనాడు మౌలానా మౌదూది వాఖ్యానం తెలుగులో లేదు. ఈనాడు మలిక్‌ గారి పుణ్యాన తెలుగులో చదువుకోగలుగుతున్నాం. చిలుకూరి నారాయణరావు గారు, మహమ్మద్‌ కాశింఖాన్‌ గారు, అబ్దుల్‌ గఫూర్‌ గారు, హమీదుల్లా షరీఫ్‌ గారు, అబుల్‌ ఇర్ఫాన్‌ గారు..... ఇంకా ఎందరెందరో దైవ వాక్యాన్ని ఇస్లాం సందేశాన్ని తెలుగు ప్రజలకు అందించారు. భవిష్యత్తులో తెలుగు రిఫరెన్సు కురాను, అలాగే తెలుగు కురానుకు కంకార్డెన్స్‌ కూడా వెలువడితే, తెలుగు ప్రజల పరిశీలనకు పరిశోధనకు, అనుదిన జీవితంలో ఉపయో గించుకునేందుకు అవి దోహదపడతాయి. తద్వారా తెలుగులో మరింత ఇస్లామిక్‌ సాహిత్యం వెలువడుతుంది. మాతృభాషలో అందే దైవసందేశం వల్ల మనోనేత్రాలు తెరువబడతాయి. అగమ్యగోచరమైన విషయం కరతలామలకమవుతుంది. అందని ద్రాక్ష అందుతుంది. అది పుల్లగా కాక తియ్యగానే ఉంటుంది. కురానుకు ఎన్ని అనువాదాలు వస్తున్నా ఆదరిస్తున్న తెలుగు ప్రజలే ఇందుకు సాక్షులు! ఇన్నాళ్ళూ దాగిన సత్యాలను రత్న మాణిక్యాల్లాగా తెలుగులో తేటతెల్లం చేసిన అనువాదకులందరికీ ఈ సేవాఫలం దక్కుతుంది.
                ఒక భాష రాయటం, చదవటం వస్తే సరిపోదు. విని అర్ధం చేసుకోవటం, తిరిగి మాట్లాడటం కూడా రావాలి. ఉర్దూ రాయటం, చదవటం రాకపోయినా జబర్దస్తీగా మాట్లాడే వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు. చదివినోళ్ళకంటే వీళ్ళే నయమనిపిస్తారు. ఈ సంగతి గమనించేనేమో మన ''ఆంగ్ల''ప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి డిగ్రీ, పిజి కోర్సుల్లో ఇంగ్లీషు వినడం, మాట్లాడటం సిలబస్‌లో చేర్చుతుందట. తెలుగు బాలలు, భావిపౌరులు అంతర్జాతీయ ఆంగ్లస్థాయిని అందుకోవటం కోసం మన ప్రభుత్వం శక్తివంచన లేకుండా పాటుపడుతోందని వేరే చెప్పాలా?
                అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ''స్వేచ్ఛ'' అనే తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఆవిష్కరించారు ఓపెన్‌సోర్ప్‌ ఉద్యమ రూపకర్త రిచర్డ్‌ సాల్ట్‌మాన్‌. ఇంగ్లీషు రానివాళ్ళు కూడా తెలుగులో కంప్యూటర్‌ ఉపయోగించవచ్చు. వాల్ట్‌ డిస్నీ కార్టూన్‌ ఛానెల్‌ కూడా మన దేశంలో మొట్టమొదటిగా తెలుగు భాషనే ఎంచుకుంది. మనవాళ్ళు ఆంగ్లం వైపు వెళుతుంటే, వాళ్ళేమో మన భాషల్లోకి వస్తున్నారు. టి.వి. ప్రసారాల వల్ల తెలుగు వాడుక భాష జీవం పోసుకుంటున్నది. ఇంగ్లీషును ఏ యూరోపియన్‌ భాషల్లోకైనా అనువాదం చేసే సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. అలాంటి సాఫ్ట్‌వేర్‌ను తెలుగు భాషకు కూడా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఫౌండేషన్‌ మెంబర్‌ కిరణ్‌ చంద్ర చెబుతున్నారు. (ఈనాడు 10-2-2005)
                ఇంతకీ మన అవసరం తెలుగు కురాన్‌కు కంకార్డెన్స్‌. అంటే అక్షర క్రమంలో తెలుగు కురాన్‌లోని ప్రతి మాటా రిఫరెన్సులతో సహా దొరికే నిఘంటువన్న మాట.తెలుగు సాఫ్ట్‌వేర్‌ల తయారీదారులు ఇప్పటి దాకా వ్యాపారబుద్ధితో గుత్తాధిపత్యం చేసి నందువల్ల తెలుగు వాడకం మందగించింది. ఇక స్వేచ్ఛ, స్వతంత్రం లాంటి సాఫ్ట్‌వేర్‌లు భవిష్యత్తులో ఏన్నో వస్తాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తెలుగు కురాన్‌కు మరిన్ని హంగులు, సదుపాయాలు కల్పించుకోవాలి. తద్వారా తెలుగు ప్రజలందరికీ ఇప్పటి వరకు ''తెలియబడని దేవుడు'' తెలుస్తాడు. తెలుగు పరిశోధకులు దైవవాక్యాన్ని వివిధ కోణాల నుండి అధ్యయనం చేసి విలువైన సంగతులు రాబడతారు. పదిమందికి పరమసత్యాలు అర్ధమయ్యేలా రిఫరెన్సులతో సహా వివరిస్తారు. తెలుగు నేలపై వెలుగు పరుచుకుంటుంది.
                                                                                                                                    (గీటురాయి 25-2-2005)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి