18, జులై 2012, బుధవారం

అధికార భాషగా తెలుగు


4.అధికార భాషగా తెలుగు
                తెలుగు అధికార భాషగా అమలు జరపాలని రాష్ట్రప్రభుత్వం ఎంతగానో ఆశిస్తున్నప్పటికి ఎన్నో  అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం 5 కోట్ల మందికి తెలుగు మాతృభాష. ఇది ప్రపంచ భాషలన్నిటిలో 15వ స్థానాన్ని, భారతదేశంలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. అయినా పరిపాలనలో ఈ భాష ఆశించినంతగా అమలు జరగటంలేదు.
ఈ పరిస్థితికి కారణాలు :
                ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల పోటీని తట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు అతికష్టంగా  నెగ్గుకురావలసి వస్తున్నది. ఐ.ఎ.యస్‌. అధికారులు మొదలుకొని చిరుద్యోగుల వరకు తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపటాన్ని చిన్నతనంగా భావిస్తున్నారు. కొందరు ఉద్యోగులు తెలుగును బాహాటంగా ఈసడిస్తున్నారు కూడా.
                ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో జరపటానికి  ఉత్సాహం  చూపే  ఉద్యోగుల భాషాపరిజ్ఞానాన్ని పెంచేందుకై వివిధ శాఖల శాసనాలను చట్టాలను తెలుగులోనికి అనువదించి వారికి నేటికీ ప్రభుత్వం ఇవ్వలేదు. పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ వారు ఉద్యోగులకు నిర్వహించే శాఖాపరమైన పరీక్షలు ఇంకా ఆంగ్లంలోనే నిర్వహిస్తున్నారు.
                సచివాలయం మిగతా కార్యాలయాలకు తెలుగుభాష వాడకం విషయంలో మార్గదర్శిగాను ఉండటం లేదు. ప్రభుత్వ శాసనాలు సచివాలయం నుండి ఇప్పటికీ ఆంగ్లంలోనే చేయబడుతున్నాయి.
                ప్రభుత్వ కార్యాలయాలలో నుండి ఇంగ్లీషు టైపుమిషన్లు పూర్తిగా తొలగించ బడలేదు. ప్రస్తుతం వాడుకలోఉన్న తెలుగు టైపు అక్షరాలు మరింత చిన్నవిగా స్పష్టంగా తీర్చిదిద్దబడాలి. రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలలో తెలుగు టైపు యంత్రాలు మాత్రమే ఉంచాలి. కాని ఈపని ఇంకా పూర్తికాలేదు.
                ఇన్ని లోపాలు మనలో ఉంచుకొని కేవలం తెలుగు భాష అంటూ అరిస్తే ప్రయోజనం ఏమిటి? ''తెలుగు ద్రావిడ భాషా కుటుంబంలో ఉత్తరాది భాష. ఆర్య భాషా కుటుంబంలో దక్షణాది భాష. ఇతర భాషలను తేలికగా తనలో కలుపుకోగలదు. దానికి సంకుచితత్వంలేదు'' అని  జి. హామ్‌ ఫీల్డ్‌ మెక్‌లాయిడ్‌ రాశారు. ''శ్రావ్యతలో తెలుగు తమిళాన్ని మించింది. ప్రతి పదం అజంతం. తీయనైన ఆ భాష మాధుర్యాన్ని బట్టి తెలుగును ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ '', అని  జి.ఎ. గారిసన్‌ వ్రాశారు. '' నిరక్షర కుక్షి మాట్లాడినా తెలుగు శ్రవణానందకరంగా ఉంటుంది. తెలుగు ద్రావిడ భాషలన్నిటిలోకి మధురాతి మధురమైనది'' అని హెన్రీమోరిస్‌ తన తెలుగు వ్యాకరణం పుస్తకంలో పేర్కొన్నారు. (1890). ''తెలుగు సంస్కారయుత మైన భాష. భావాలను సొంపుగా సౌలభ్యంతో చక్కగా వ్యక్తం చేయవచ్చు'' అని విలియం కేరీ అను క్రైస్తవ మిషనరీ 1814 లో తన తెలింగ వ్యాకరణంలో రాశారు. అలాంటి సులభమైన భాషను వాడటం మన తెలుగు ఉద్యోగులకు కష్టంగా ఉంది. ''శబ్ద సంపదలోను, శబ్ద సౌష్టవంలోను, భావ వ్యక్తీకరణలోను, శ్రావ్యతలోను తెలుగుతో తక్కిన భాషలు సాటిరావు. ప్రజలు మాట్లాడే సులభ సంస్కృతానికి తెలుగు ఒక ఉదాహరణ '' అని ఎ.డి.కాంప్‌బెల్‌ 1816 లో తన తెలుగు వ్యాకరణం అను గ్రంథంలో అన్నారు.       
                1935లో ముద్రించబడిన తన తెలుగు నిఘంటువుకు ముందుమాట వ్రాస్తూ  '' బ్రిటీష్‌ పరిపాలన అంతమయి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిననాడు వారి భాషలోనే వారి పాలనా వ్యవహారాలను సాగించటానికి ప్రయత్నం చెయ్యాలి '' అని ఆర్‌. కాలెట్టిల్‌ కోరారు. తెలుగు భాషపై మన నాయకులకు, అధికారులకు, ఉద్యోగులకు, ప్రజలకు కూడా ఇలాంటి గౌరవం ఉంటే పరిస్థితి చాలా బాగుంటుంది.
                మహోన్నతమైన తెలుగు భాషను ప్రభుత్వం, ప్రజలు కలిసి అభివృద్ధి చెయ్యాలి. అందుకోసం ఈ క్రింది చర్యలు తోడ్పడగలవు. నాయకులు, అధికారులు, ప్రజలు ముందుగా తమ మనస్సుల్లో తెలుగుభాష పట్ల గౌరవాన్ని పెంచుకోవాలి. ఆ భాష మర్యాదను కాపాడటానికి శపధం తీసికోవాలి. ఎంతో విలువనిస్తూ ఆ భాషను మాట్లాడాలి, వాడుకలోకి తేవాలి, అభివృద్ధి చెయ్యాలి. పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివించాలి.
                రాష్ట్ర ప్రభుత్వం తన చట్టాలు, శాసనాలు, స్మృతులు అన్నిటినీ సరళమైన తెలుగులోకి అనువదించి ముద్రించి అన్ని కార్యాలయాలకు సరఫరా చేయాలి. వాటి ఆధారంగా పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌ శాఖాపరమైన పరీక్షలన్నీ తెలుగులోనే జరపాలి. వివిధ పోటీపరీక్షలలో ఆంగ్లభాషా పరిజ్ఞానానికి బదులు '' తెలుగుభాషా పరిజ్ఞానం '' మీద ఒక ప్రశ్నాపత్రం ప్రవేశపెట్టాలి. సచివాలయం విధిగా తెలుగులోనే శాసనాలు జారీచెయ్యాలి. కార్యాలయాలలోని ఇంగ్లీషు టైపు మిషన్లనన్నిటిని తీసివేసి తెలుగు టైపు మిషన్లును మాత్రమే ఉంచాలి. తెలుగు టైపు అక్షరాల నాణ్యతను పెంచాలి.
                రాష్ట్రప్రభుత్వం నడుపుతున్న ఇంగ్లీషు మీడియం పాఠశాల లన్నిటినీ తెలుగు మాధ్యమం పాఠశాలలుగా మార్చాలి. తెలుగు మాధ్యమ ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే ప్రభుత్వం ధనసహాయం చెయ్యాలి. అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
                రాష్ట్రప్రభుత్వం ఒక సమగ్రమైన తెలుగు-తెలుగు నిఘంటువును తయారు చేయించాలి. తెలుగు జాతీయాలను, సామెతలను, వివిధ ప్రాంతాల యాస పదాలను క్రోడీకరించి ప్రామాణిక గ్రంధాలుగా వెలుపరించాలి, స్నాతకోత్తర, పరిశోధక విద్యలను కూడా తెలుగులో నడపడానికి వీలుగా శాస్త్ర, సాంకేతిక గ్రంథాలను తెలుగులోకి మార్చాలి. తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలలోని తెలుగు విభాగాలు, అధికార భాషాసంఘం, తెలుగు భాషాభిమాన సంఘాలు విడివిడి గాను, కలిసి కట్టుగాను ఈ విషయాలలో కృషి జరపాలి.
                అందరూ కలిసి కృషిచేస్తేనే తెలుగు భాష ఈ రాష్ట్రంలో వెలుగులు విరజిమ్ముతుంది. తెలుగు తల్లిమెడలో దండ వేసినంత మాత్రాన, ప్రారంభించిన పథకాలకు తెలుగును జోడించినంత మాత్రాన తెలుగుభాష వర్ధిల్లదు. తెలుగు భాషను ప్రజలందరికి బోధించినప్పుడే తెలుగు అభివృద్ధి చెందుతుంది.
                తెలుగుభాష పట్ల మక్కువను పెంచుకోవటం ప్రాంతీయతత్వమనో, వేర్పాటుధోరణి అనో అనేవాళ్ళు సంకుచితంగా ఆలోచిస్తున్నారని అనక తప్పదు. భారతదేశం అనేక భాషల మణిహరం అనుకుంటే ఆ హారంలోని మణిపూసలన్నీ అందంగా, సౌష్టవంగా ఉండాలి. కొన్ని సుందరంగాను, మరికొన్ని అందవికారంగాను ఉంటే హారం యొక్క అందమే చెడిపోతుంది. ఏ భాషా రాష్ట్రం ఆ భాషను ముమ్మాటికీ మక్కువతో అభివృద్ధి పరుచుకోవాలి. నేను నా మాతృభాషను ప్రేమించడమే ప్రాంతీయతత్వం అని అంటే నీవు నీ భాషను నాకు బలవంతాన నేర్పాలని చూడటం నాపై దౌర్జన్యం కాదా ? స్వచ్చందంగా అనేక భాషలను నేర్చుకొనే వారికి ఈ విశాల విశ్వంలో అడ్డమేదీలేదు.
                 మాతృబాష హీనదశలో పడియున్న సమయంలో మరో భాషను తెచ్చి నిర్బంధంగా రుద్దటానికి ప్రయత్నించటం బ్రిటిష్‌ పాలకుడు ఆంగ్లాన్ని రుద్దిన తీరునే గుర్తుకు తెస్తుంది. ఏ మనిషికైనా మాతృభాషలోని మాధుర్యం మరో భాషలో చిక్కదు. ఈ సూత్రాన్ని గమనించే క్రైస్తవ సాహిత్యం తెలుగులో బాగా వికసించింది. కొంచెం ఆలస్యంగా నయినాసరే తెలుగు గడ్డకు చెందిన  ముస్లిములు ళ్ళుతెరిచారు. ఇస్లామిక్‌ సాహిత్యం ఈనాడు తెలుగులో ఎంతో వేగంగా ప్రచురించబడుతున్నది.
                తెలుగు మాతృభాషగా కలిగిన ప్రజలు ఏ మతస్థులయినప్పటికీ వారు తెలుగువారు. తల్లిని గౌరవించినట్లుగా తెలుగును గౌరవిద్దాం. అందరమూ కలసి మన భాష ఔన్నత్యం కోసం, ప్రగతి కోసం, పరివ్యాప్తి కోసం కృషిచేద్దాం !
                                                                                   (ఆంధ్రపత్రిక 6-7-88, గీటురాయి 1-7-88)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి