18, జులై 2012, బుధవారం

13. అమెరికా పోయే నలుగురికోసం అంతా ఇంగ్లీషే చదవాలా?

13.అమెరికా పోయే నలుగురికోసం అంతా ఇంగ్లీషే చదవాలా? ''నియంతకుండే అధికారాలు నాకుంటే, విదేశీ భాషల ద్వారా విద్యా బోధనను ఆపేసేవాడినే. మాతృభాషల్లో విద్యనేర్పని పంతుళ్ళను, ప్రొఫెసర్లను ఉద్యోగాల్లో నుండి ఊడబీకే వాడిని. ఈ చెడుగుకు తీవ్ర చికిత్స అవసరం. బోధనా మాధ్యమం ప్రాంతీయ భాషల్లోకి తక్షణం మారాలి. రోజురోజుకీ పేరుకుపోతున్న ఈ అన్యాయం ంటే కొంతకాలం కల్లోలం జరగటాన్నే నేను కోరుకుంటాను'' అని మహాత్మాగాంధీ ''హరిజన్‌'' పత్రిక 9-7-1938లో పేర్కొన్నారు. తిలక్‌, రాజేంద్రప్రసాద్‌, నెహ్రూ, నేతాజీ, పటేల్‌, లాల్‌బహదూర్‌ శాస్రి, టాగోర్‌ లాంటి వాళ్ళంతా ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన జరగాలని కోరారు. 1948లో రాధా కృష్ణన్‌ కవిూషన్‌ ఈ విషయాన్ని నొక్కి చెప్పింది. కొఠారీ కవిూషన్‌ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. ఏదిగొప్పభాష? ప్రజలకోసం, ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, పాలనా యంత్రాంగానిదొక భాష, ప్రజలదొక భాష కావటం మన ప్రజల దురదృష్టం. అధికారులకీ ప్రజలకీ మధ్య పరాయి భాష అడ్డు తెరలాగా ఉంది. ప్రజలు మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తున్నది. పాలకుల్లో అహంకారం, అవినీతి, ఇంగ్లీషులో ప్రజల్ని హడలగొట్టడం, పెరిగి పోయాయి. ప్రజలకు అధికారులకు మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు పరాయి భాషను తొలగించలేక, మాతృభాషను మరుగునపడేసి, పరాయి భాషనే ప్రజలందరినీ నేర్చుకోమంటున్నారు. ''అమెరికా పోయే నలుగురికోసం అంతా ఇంగ్లీషు చదవాలా?'' అని కీ.శే. వావిలాల గోపాలకృష్ణయ్య (అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులు) బాధపడేవారు. ఆంగ్లభాషా వేత్త మెకాలే ''మేము వెళ్ళి పోయినా మా భాష మిమ్మల్ని పరిపాలిస్తుంది'' అన్నాడంటే, ఇంగ్లీషుకు ఈ దేశం ఎంత వశమైపోయిందో దేశీయ భాషలు ఎంతగా పరాధీనమై పోయాయో ఊహించుకోవచ్చు. వాసమూర్తి '' భాషా సమస్య (1968 ) '' అనే పుస్తంలో ఇలా అన్నారు: ''..ప్రపంచంలో ఏ భాషా భగవంతుని నోటినుంచి ఊడిపడ్డట్లు పరిపూర్ణమై గొప్పదై పుట్టలేదు. ఏ భాషా నీచమై జన్మించలేదు. ఏ భాషైనా ఎంతైనా వికసించవచ్చు. ఎంతైనా పోవచ్చు. అంతా ఆ భాషలు వాడే ప్రజలపైనా పరిస్థితులపైనా అవకాశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేకానీ కొన్ని భాషలు గొప్పవి. కొన్ని వెనుక బడ్డవి. అందుచేత అవి గొప్ప భాషలకు దాస్యం చేయాలని పరోక్షంగానే అయినా చెప్పబూనడం భాషారంగంలో నాజీలుగా వ్యవహరించడమే కాగలదు. ఇంగ్లీషు పుట్టడమే గొప్ప భాషగా పుట్టలేదు. స్కాండినేవియన్‌, ఫ్రెంచి, లాటిన్‌, గ్రీకు భాషలనుంచి అది అపారశబ్ద సముదాయం, మంచి మార్పులూ తెచ్చుకుంది. మన భాషలు కూడా తగిన అవకాశం ఇచ్చి, విరివిగా వాడుక చేస్తే, శక్తివంతమైన వైజ్ఞానిక భాషలుగా రూపొందుతాయి.'' మన రాజ్యాంగం ఏంచెబుతోంది? 346 వ నిబంధన - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాష్ట్రాల మధ్య ఆంగ్లబాష వాడకంలో ఉండాలి. రెండు అంతంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరిస్తే హిందీ వాడుకోవచ్చు. 347వ నిబంధన- ఒక రాష్ట్రంలో తాము వాడుతున్న భాషను అధికార భాషగా గుర్తించాలని రాష్ట్రపతికి విన్నవిస్తే రాష్ట్రపతి ఆదేశాలివ్వవచ్చు. 348 వ నిబంధన - సుప్రీంకోర్టు, రాష్ట్రహైకోర్టులలో, పార్లమెంట్‌ బిల్లులు, రాజ్యాంగసవరణలు, రాష్ట్రపతి గవర్నర్లు జారీచేసే చట్టాలు ఇంగ్లీషులో ఉండాలి. 348 (2)వ నిబంధన - ఒక రాష్ట్రం రాష్ట్రపతి అనుమతిపొంది హిందీని రాష్ట్రభాష గానే కాకుండా హైకోర్టులో కూడా హిందీ వాడటానికి నిర్ణయం తీసుకోవచ్చు. 349 వ నిబంధన - రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి 15 సంవత్సరాల్లో అధికార భాష సవరణ ప్రతిపాదనలు చేయరాదు. 350 వ నిబంధన - దేశంలోని ఏ వ్యక్తి అయినా కేంద్ర, రాష్ట్ర అధికారులకు ఏ భాషలోనైనా ధరఖాస్తు పెట్టుకోవచ్చు. 348, 349 వ నిబంధనలవల్ల 1965 వరకు ఇంగ్లీషు అధికారభాషగా దేశంలో వేళ్ళూనుకు పోయింది. దాన్ని తొలగించటానికి, ఎవరి తరం కాలేదు. 348 (2)వ నిబంధన తెలుగు భాషకు కూడా వర్తింపజేయవలసిందిగా మన రాష్ట్రం కేంద్రాన్ని కోరాలి. అప్పుడు మన రాష్ట్ర హైకోర్టులో తెలుగు ప్రవేశిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి