18, జులై 2012, బుధవారం

దాస్యం చేసే భాష అధికార భాష ఎలా అవుతుంది ?


9.దాస్యం చేసే భాష  అధికార భాష ఎలా అవుతుంది ?
                డర్బన్‌లో కామన్‌వెల్త్‌ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు (చోగమ్‌)ను ప్రారంభిస్తూ ఎలిజిబెత్‌ రాణి ''ఇంగ్లీషు మన ఉమ్మడి భాష. వరల్డ్‌వైడ్‌ వెబ్‌లాగా ఇది మన దేశాల ప్రజలందరినీ ఒక దగ్గరకు చేరుస్తుంది'' అన్నారు. (ఈనాడు 13.11.99). 54 దేశాల ప్రభుత్వాధి నేతలు తమ తమ మాతృ భాషల్లో ఏమనుకున్నారో గానీ, ఆవిడకు ఎదురు చెప్పలేదు.
                అక్కడే కామన్‌ వెల్త్‌ బిజినెస్‌ ఫోరంలో పాల్గొన్న భారత ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా మాత్రం ప్రపంచ వాణిజ్య సంస్థ షరతులపై ఇలా నిరసన వ్యక్తం చేశారు:
'' ప్రపంచంలో ఆయా దేశాల స్థానిక స్థితిగతులను బట్టి ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ భేదాలను గుర్తించాలి. ఒక దేశం తన ప్రమాణాలను మరో దేశంపై రుద్ద రాదు.'' (ఈనాడు 15.11.99)
                కామన్‌ వెల్త్  ప్రధాన కార్యరర్శి ఎమేకా అనయోకు ఇలా అన్నారు. ''అంతర్జాతీయ ద్రవ్యనిధి. ప్రపంచ బ్యాంకు లాంటిి అంతర్జాతీయ సంస్థలు, ఇప్పటికీ కొన్ని ధనిక దేశాల గుప్పిట్లోనే ఉన్నాయి. పేద దేశాలు, ప్రధానంగా చిన్న దేశాలు ఈ సంస్థల కార్యకలాపాల్లో పాలు పంచుకోలేక పోతున్నాయి. దీంతో ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఏవో కొన్ని ధనిక దేశాలకు పరిమితం అనీ, పేద దేశాలను విస్మరించటం సరైనదేనన్న భావం బలపడుతోంది.''
                ఈ సంగతులన్నీ ప్రపంచ భాష జాతీయ భాషలను, జాతీయ భాషలు ప్రాంతీయ భాషలను ఎలా అణగద్రొక్కి  పరిపాలన చేస్తాయో మనకు వివరిస్తున్నాయి.
                పేద భాషలు ధనిక భాషలకు పాదాక్రాంతమై ఊడిగం చేస్తూ, కాల గమనంలో నామ రూపాలు లేకుండా నశించి పోతాయన్నది చరిత్ర నేర్పిన పాఠం. ధనికుడు పేద వాడి భాషను నేర్చుకోడు. తన భాషను బానిస మీద నిర్భంధంగా రుద్దుతాడు. ఆఫ్రికా నుండి నీగ్రోలను పట్టుకెళ్ళి  వారిచేత పశువుల్లాగా పని చేయించుకున్న అమెరికా వాళ్లు, నీగ్రో వాళ్ళకు కూడా ఒక భాష ఉంది అనే విషయం పట్టించుకోలేదు. అసలు వాళ్ళను మనుషుల్లాగానే చూడలేదు. ఈ రోజు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నారు.
                దోపిడీ దురాక్రమణ తత్వం గల వారి భాషలు అభివృద్ధి చెందుతుంటే, పరభాషా సహనం, దాస్య ప్రవృత్తిగల వారిభాషలు కునారిల్లిపోతాయని చరిత్ర రుజువు చేసింది. ప్రపంచ భాష, జాతీయ భాషలు ఇలాగే పెత్తనం చేస్తే వచ్చే శతాబ్దానికి మన తెలుగు బాష ఈనాటి ఎరుకల, యానాది, లంబాడీ, కోయ, సవరలాంటి భాషల స్థాయికి దిగజారిపోతుంది. ఆ తరువాత శతాబ్దానికి మనం జాతీయ భాష అని చెప్పుకునే హిందీ కూడా అంతరించి ఒకే అంతర్జాతీయ భాష రాజ్యమేలుతుంది. ప్రపంచ బ్యాంకులో ప్రపంచ పోలీసులో ఎవరి ఆధిక్యత ఉంటే వారిభాషే ప్రపంచ భాష అవుతుంది. మిగతా భాషల వారికి వారి భాష గుండెల్లో ఆవేదన రూపంలో ఉంటుందే తప్ప, గొంతుపెగిలి భావం పలకాలంటే, అది ఆంగ్లంలోనే పలకాలి. లేకపోతే అమెరికావాడి ముందు ఆనాటి నీగ్రోవాడి గోలలాగానే ఉంటుంది. అప్పిచ్చేవాడి భాషను అప్పు తీసుకునేవాడు తప్పక నేర్చుకోవాలి.
                ''పొట్ట - మనసు'' అనే అంశం మీద డాక్టర్‌ రామ్మనోహర లోహియా 1958లో ఇలా అన్నారు. '... స్వతంత్ర భారతదేశం ఒక విచిత్ర పరిస్థితిని సృష్టించింది. దేశపు నిజమైన యజమానిని పరాయివాడిగా తయారుచేసింది. ఎవరో పరాయివాడు మన పొలాన్ని ఆక్రమించుకుని మనల్నే బయటకు గెంటివేసినట్లుగా ఉంది. ఇంగ్లీషు భాషను తొలగించినట్లయితే ప్రభుత్వం, చట్టాలు, కార్మిక సంఘాలు, సార్వజనిక సంస్థలూ, వాటి నాయకులూ అందరూ కూడా కోట్లాది ప్రజలతో ముఖాముఖిగా నిలబడాల్సి వస్తుంది. సామంత రాజ్యపు చత్రమంతా సడలి పోతుంది. సైన్యం సంగతే తీసుకోండి. కల్నల్‌ కంటే పై పదవుల్లో నియామకానికి గీటురాయి ఏమిటి? యుద్ధకౌశలం కాదు. ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం. ఇంగ్లీషులో నోట్‌రాయగలగడం, మాట్లాడ గలగటం. మామూలు   మనుషులు హవల్దార్లు కావచ్చు. పై పదవులకు ద్వారాలు మూత పడ్డాయి. ఇంగ్లీషురాని వాళ్ళకు ఎంత యుద్ధ కౌశలం ఉన్నా అంతకంటే పైపదవులకు పోలేరు.
                దేశీయ భాషల ద్వారా జ్ఞానసముపార్జన అసంభవం అనే వాదం అర్థరహితమైంది. రష్యా శాస్త్రజ్ఞులు విధిగా ఆంగ్లభాషను నేర్చుకొనవలసి వచ్చివుంటే, స్పుత్నిక్‌ను కనుక్కోగలిగే వారు కాదు. జ్ఞానాన్ని ఆర్జించదలుచు కున్నట్లయితే, భాషాజ్ఞానం సంపాదించటానికి శ్రమపడే కంటే, విషయజ్ఞానాన్ని సంపాదించటానికి శ్రమపడాలి. భారత దేశంలోని బాల బాలికలకు ఐదేళ్ళ వయస్సు నుంచే వెర్రి ఎక్కిస్తారు. చివరి వరకు ఈ వెర్రితోనే విద్యాభ్యాసం కొనసాగుతుంది. భాషాజ్ఞానాన్ని సంపాదించే బరువు చిరుప్రాయంలోనే వారి మేధస్సు విూద మోపుతారు. విషయ జ్ఞానం వారికి లభ్యంకాదు. విశ్వ విద్యాలయాల్లోని విద్వాంసులు గాడిదల్లాగా తయారయ్యారు.
                రష్యా, జపాను, జర్మనీ దేశాల్లో వైజ్ఞానికులు ఆంగ్ల  భాషా జ్ఞానపు బరువును మోయకుండా, విషయ జ్ఞానం ఆధారంగానే అనేక ఆవిష్కరణలు చేయగలిగారు. భారతీయ బాల బాలికల మెదళ్ళపై నుంచి భాషా జ్ఞానపు బరువును తొలగిస్తే, వారికి గంభీరమైన విషయపరిజ్ఞానం కలుగుతుంది. భాషా పరిజ్ఞానం సంపాదించటానికి భారతీయులు పడే శ్రమభారం వల్ల భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం వంటి శాస్త్రాల విషయపరిజ్ఞానం అసలు అబ్బనే అబ్బదు. ఆంగ్లభాషా పరిజ్ఞానాన్ని సంపాదించటానికే విద్యార్థి జీవితం అంతా ఖర్చయిపోతుంది. అందువల్లనే ఈనాడు భారతీయుల శాస్త్రవిజ్ఞానం ఆంగ్ల పరిజ్ఞానానికి అనుకరణలుగా ఉన్నాయి. మనదేశ పరిస్థితులను, ప్రత్యేక సమస్యలను, అవసరాలను పరిష్కరించటానికి వాటిలో మార్గాలు కనిపించవు. అంతేకాదు, ఆంగ్లం రాకపోతే ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన వైజ్ఞానికుల స్థాయిని అందుకోగల విద్వాంసులు కూడా మనలో లేరు. భారతీయ విద్యార్థుల్ని ఆంగ్లభాషా సంకెళ్ళతో బంధించి వేశారు. ఫలితంగా వారి మెదళ్ళు బూజుపట్టి పోయాయి.
                ఇంగ్లీషు ప్రపంచభాష అవుతుందని కొంతమంది భ్రమ పడుతుంటారు. ఏ భాష కూడా ప్రపంచ భాష కాలేకపోయింది. 19వ శతాబ్దంలో ఫ్రెంచి భాషను ప్రపంచ భాషగా భావించేవారు. ఈనాడు ఇంగ్లీషును ప్రపంచభాషగా భావించేవారు మూర్ఖులు. 8వ లేదా 9వ శతాబ్దంలో అరబ్బీని ప్రపంచభాషగా భావించేవారు. రెండువేల ఏళ్ళ క్రిందట సంస్కృతాన్ని ప్రపంచభాషగా భావించారు. ఇదంతా ప్రవహిస్తున్న జలం. ఇంగ్లీషు ప్రపంచ భాష కాగలదన్న ఆశ అడియాసే...'' (''భాషా సమస్య'' తెలుగు అకాడవిూ ప్రచురణ పేజీలు 29-35)
                రామ్మనోహర లోహియా తన మాతృ భాష హిందీ గురించి ఎంత పరితపించాడో, నేను నా మాతృభాష అయిన తెలుగు గురించి అంతగా పరితపిస్తాను. లోహియా భారతదేశంలో ఇంగ్లీషును తొలగించి హిందీని రాజభాషగా అమలు  చేయాలని ఉద్యమం తెచ్చాడు. నేను దీనిని వ్యతిరేకిస్తాను. నాకు తెలుగే రాజభాష. ఎందుకంటే దేవుడు నన్ను ఈ భాషవారిలోనే పుట్టించాడు. నా తల్లి ఈ భాషలోనే మాట్లాడింది. ఈ భాషలోనే నా ఆనందం, నా విచారం స్వేచ్ఛగా వ్యక్తం  చేయగలను. ఈ భాషలోనే హృదయాన్ని దైవం ముందు కుమ్మరించగలను. నిర్భంధించి నేర్పేది ఏదైనా యాంత్రికమే అవుతుంది గానీ ఐచ్ఛికం కాదు. ఐచ్ఛికత లేకుండా చేయించేది ఏదైనా బానిసత్వమే అవుతుంది భాషా దాస్యం చేసే బానిసలకు స్వంత ఆలోచనలు రావు. వారు యజమాని భాషను మోస్తూ అవస్థ పడుతుంటారుగాని, తమ భాషద్వారా అభివృద్ధి పథాన్ని అందుకోలేరు.
                అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు డాక్టర్‌. పి. యశోదారెడ్డి ఇలా అన్నారు. ''పాలకులు దేశీయులైనప్పుడు అధికారభాష దేశభాష రూపంలో ఉంటుంది. దౌర్భాగ్య విశేషంతో దేశం పరహస్తగతమైనప్పుడు పరిపాలకులు వారి సౌకర్యాన్ని అనుసరించి వారి అభిమానభాషను అధికారభాషగా గుర్తిస్తూ రాజదండాన్ని దాని చేతికి అందిస్తారు. రాజాశ్రయాన్ని ఆశించిన వారికీ, ఉద్యోగులకూ, వ్యాపారస్తులకూ, ఆ భాషను నేర్వక తప్పదు. దాని దుష్ప్రభావాన్ని సామాన్యుడు అనుభవించక తప్పదు. ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం అనే ఈ మూడు విశేషాలు ఒకే చోట సిద్ధించటం ఆ జాతి నోచిన నోము ఫలం, ఒక వరప్రసాదం, ఒక భాగ్య విశేషం. సాహిత్య భాషకు అధికార దండం ఏది? ఏలుబడిని నెరిపే గౌరవం ఏది? అధికార భాషకు కావలసింది సొగసులు, అలంకారాలు, రసధ్వనులూ కాదు. అధికారికంగా ఆ భాషలో చేసే విషయ నివేదనం ప్రధానం. అంటే అనేక తరాలనుండి ఆ భాష అధికారికంగా ఆయా శాఖలకు, ఆయా సాంకేతికమైన ప్రత్యేక పదజాలంతో ఆజ్ఞలనూ, ప్రకటనలనూ, సూచనలనూ, సమాచారాన్నీ పంపే అలవాటు, ప్రజా ప్రభుత్వరంగాలలో ప్రభుత్వపాలనా పరిభాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపే స్తోమత. ఈ స్థైర్యం ఆ జాతి పాలకులు తమ భాషలో రాజ్యాంగాన్ని నడుపుతూ పరిపాలన సాగించి ఉంటే, దానంతట అదే వచ్చి ఉండేది. కానీ మన పరిస్థితి వేరు. తెలుగువారు ఆరంభ శూరులు. ఉద్యమ ప్రారంభకులే కాని దాని ఫలితాలను సంపూర్ణంగా చూడగల ఓపిక లేనివారు. ఏదైనా ప్రణాళిక విజయవంతం కావాలంటే ఆలోచన, ఆచరణ రెండూ కావాలి. ప్రాంతీయ భాషలకు సామంతత్వమే కాని సార్వభౌమత్వం లేదు. అందుకు కారణం భారత ప్రభుత్వం కేంద్రంలో గుర్తించిన అధికారభాష హిందీ. అది మనకు జాతీయ భాష. మన రాష్ట్రం ఆంధ్రరాష్ట్రమైనా సచివాలయాల్లో పనిచేసే ఉన్నత అధికారులు తెలుగువారు కారు.ఆయా జిల్లాల కలెక్టర్లు తెలుగువారు కారు. మరి మన ప్రభుత్వ ధ్యేయం ప్రజా సంక్షేమం సామాన్య జనానీకపు కష్టసుఖాలను వింటూ వారి వీపు తట్టి అండగా నిలువవలసిన ఈ ఉన్నతాధికారులు తెలుగు మాట్లాడగలరే కాని నిర్ణయాలు తెలుగులో వ్రాయడం కష్టం. ఈనాడు ఇంగ్లీషు భాషను ఎంత తప్పుగా వ్యవహరించినా, వ్రాసినా ఆ భాషమాత్రం ఒక సంస్కార చిహ్నంగా నాగరికతా లక్షణంగా మారింది. తెలుగు భాష సాధికారికంగా న్యాయస్థానాల్లో, పోలీసు శాఖల్లో, తంతితపాలాశాఖలో మెలిగే ప్రతిపత్తిని సంపాదించిననాడే అధికార భాషగా చెలామణి స్థిరపడుతుంది.''
                                                               (ఆంధ్రప్రదేశ్‌ దర్శిని, విశాలాంధ్ర ప్రచురణ పేజీలు 945-853)
                అధికార భాషగా తెలుగు అమలు కావాలని ప్రజలు కోరుతుంటే, విశ్వవిద్యాలయా లను ప్రైవేటుపరం చేయాలని, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు విూడియం ప్రవేశ పెట్టాలని రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వపాలనా వ్యవహారాల్లో తెలుగు వాడకంపై అసిస్టెంట్‌ సెక్షనాఫీసర్లకు శిక్షణ నిచ్చే కార్యక్రమాన్ని 22.11.99న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనందరావు ప్రారంభిస్తారనీ, ఇది 30.11.99 వరకు కొనసాగుతుందని రాష్ట్ర సమాచారశాఖ ''ఇంగ్లీషులో'' పంపిన ఒక ప్రకటనలో పేర్కొందని ఈనాడు దిన పత్రికలో 22.11.99న వచ్చింది.
                రామ్మనోహర లోహియా 26.5.1960 తేదీన హైదరాబాదులో చేసిన ప్రసంగంలో ఇలా అన్నారు. '' తెలుగు భాష పునాది మీద విశాలాంధ్ర రాష్ట్రాన్నయితే ఏర్పరచుకున్నారు. గానీ తెలుగులో ఆ రాష్ట్రాన్ని పాలించుకోలేరు. కొంత కాలం క్రితం తెలుగు రచయితల మహాసభలో అనేక ప్రసంగాలు ఇంగ్లీషులోనే జరిగాయట ! డబ్బూ, ప్రతిష్టా, ఆంగ్లభాషలో ఉంటే ప్రజలు అటువైపే పరుగులిడటం సహజం. వీటిని తగ్గించటానికి ఒకటే మార్గం ఉంది. భారతదేశంలో కలెక్టర్‌ పదవి కూడా  ఇంగ్లీషు భాష రాకపోయినా పొందవచ్చని  ప్రజలకు తెలిసినప్పుడు భారతదేశంలో వకీలు, ఇంజనీరు, డాక్టరు కావడానికీ ఆంగ్లభాషా పరిజ్ఞానం బొత్తిగా అక్కరలేదని తెలిసినప్పుడు ప్రత్యేకంగా ఎటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనవసరం లేదు. కోట్లాది ప్రజలు తమ ఇష్టపూర్వకంగా అత్యంత త్వరగా తెలుగు, తమిళం, హిందూస్తానీ లాంటి దేశీయ భాషలను నేర్చుకుంటారు. ఇంగీషు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది వారికి? ఈనాడు తమ ఆర్థిక, సాంఘిక పరిస్థితులను కాస్త మెరుగుపరుచుకోవాలన్న దృష్టితో విధిలేక వారు ఇంగ్లీషు నేర్చుకుంటున్నారు. ఇదంతా అంతం కావాలంటే భారతదేశంలో ఎంత పెద్ద పదవికైనాసరే, నియామకం కోసం జరిగే పరీక్షలకు ఇంగ్లీషు రానివారు కూడా హాజరవడానికి అవకాశం లభించాలి.'' (భాషా సమస్య పేజీలు 81-83)
                 మన రాష్ట్ర ప్రభుత్వం, సర్వీసు కమీషన్‌ ద్వారా ఆరు నెలలకొకసారి జరిపే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలనైనా తెలుగులో జరుపుతుందని ఆశిద్దాం!
                                                                                   (గీటురాయి వారపత్రిక 17-12-99)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి