6, జులై 2012, శుక్రవారం

17. తెలుగు భాషకు తీవ్రమైన అన్యాయం


                                                                             17. తెలుగు భాషకు తీవ్రమైన అన్యాయం

                తెలుగు ప్రాచీన భాషా అధ్యయన కేంద్రాన్ని మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌గారు 29.10.2011న కేంద్ర మంత్రి పురందరేశ్వరి గారికి రాసిన లేఖ 2.2.2012న నాకు పంపారు. అందులో పేర్కొన్న అంశాలు :-
                మైసూరులోని భారతీయ భాషల కేంద్రంలో తెలుగు భాషకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది.
1.            ఒకప్పుడు తెలుగు, తమిళం, బెంగాలి భాషలలో కరస్పాండెన్‌కోర్సు నడిచేది. 2001వ సంవత్సరంలో తెలుగు కోర్సు మాత్రమే మూసివేయబడినది.
2.            2004వ సంవత్సరంలో భాషా మందాకిని ప్రాజెక్టు ప్రారంభించబడినది. దానిలో తెలుగు భాషను తొలగించి బెంగాలీ భాషను పెట్టారు. 2008వ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయంలో కలసి తెలుగు భాషా మందాకిని ప్రాజెక్టు చేయడానికి ఒప్పందం జరిగింది. అయితే అప్పటి నుంచి ఒకటి, రెండు సమావేశాలు తప్ప ఆ ప్రాజెక్టు అతిగతి లేదు.
3.            గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ప్రాజెక్ట్‌ అనేది భారతీయ భాషలలో రచనలు చేసే రచయితల ప్రచురణలకు మరియు పుస్తకాల కొనుగోలుకు ఆర్థిక సహాయం చేసే ప్రాజెక్టు. ఇందులో అతి ఎక్కువ భాగం ఇతర భాషలకు, అతి తక్కువ భాగం తెలుగుకు కేటాయిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల లాంగ్వేజ్‌ వైజ్‌ శ్టాటిస్టిక్స్‌ చూస్తే తెలుగుకు జరుగుతున్న అన్యాయం తేటతెల్లమవు తున్నది.
4.            నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌ చాలా పెద్ద ప్రాజెక్టు. ఇందులో వివిధ భాషలకు చెందిన వంద మంది దాకా పనిచేస్తున్నారు. తెలుగు వారు కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే ూన్నారు.
5.            భారతీయ భాషల ''లింగ్విస్టిక్‌ డేటా కన్సార్టియం'' ఇందులో దాదాపు 70 మంది పనిచేస్తుంటే దురదృష్టవశాత్తు తెలుగువాడు ఒక్కడే.
6.            నేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌. ఇది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు.అనేక రకాల పరీక్షల మూల్యాంకనం మరియు పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌నిర్వహించే పరీక్షలకు సంబంధించిన విధి విధానాలను సూచన చేసే ప్రాజెక్టు ఇది. ఇందులో కూడ తెలుగు భాషకు  స్థానం దక్కక పోవటం దురదృష్టం. కేవలం తమిళం, ర్దూ భాషలకే పరిమితం చేశారు.



7.            మొత్తం ఈ కేంద్రంలో వివిధ ప్రాజెక్టులలో 350 మంది పైగా పనిచేస్తుంటే ఇందులో తెలుగువారు కేవలం 5 గురు మాత్రమే.
                తెలుగు వారికి, తెలుగు భాషకు ఆ కేంద్రంలో ఈ దుస్థితి కల్పించిన సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకుని ఈ పరిస్థితి సవరించవలసిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా సహాయమాత్యులు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి గారిని కోరుతున్నాను.
                2012 ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషోధ్యమ సమాఖ్య ప్రభుత్వానికి 9 డిమాండ్లు పంపింది :-
1.            తెలుగు భాషా రక్షణ అభివృద్ధికై ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలి.
2.            రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో అధికార భాషగా తెలుగును అమలు చెయ్యాలి. చట్టసభలు, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, శాఖాదిపతుల కార్యాలయాల్లో వెంటనే దీనిని అమలు చెయ్యాలి. జిల్లాస్థాయి వరకు న్యాయస్థానాల్లో తెలుగులో వ్యవహారాలు జరిగేందుకు జి.ఓ.నెం. 485(1974) అమలు పరచాలి. అధికార భాషా సంఘాన్ని తగిన అధికారాలు ఇచ్చి వెంటనే నియమించాలి.
3.            ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలన్నిటిలో మాతృభాషలోనే ప్రాధమిక విద్యను బోధించడాన్ని తప్పనిసరి చెయ్యాలి.
4.            ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పి.జి తరగతుల్లోను సాంకేతిక విద్యారంగంలోను రాష్ట్రంలో తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చెయ్యాలి. మొదటి తరగతి నుండి ఒక సబ్జక్టుగా మాత్రమే ఆంగ్లాన్ని బోధించాలి.
5.            ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారి విద్య, భాషా సంస్కృతుల రక్షణకై శాశ్వతస్థాయిన సంయుక్త సభాసంఘాన్ని అన్ని వనరులతో ఏర్పరచాలి.
6.            క్లాసికల్‌భాషగా తెలుగులో పరిశోధన కేంద్రాన్ని కేంద్రానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, దాన్ని ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడం అన్యాయం. వెంటనే తగిన సౌకర్యాలు చూపడంతో పాటు తమిళ, కన్నడాలకు దీటుగా క్లాసికల్‌ తెలుగు అధ్యయన సంస్థను పూర్తి స్థాయిలో స్థాపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
7.            పోటీ పరీక్షల్లో తెలుగు మాధ్యమ అభ్యర్థులను ప్రోత్సహించడానికి 5 శాతం అదనపు మార్కులు కలపాలి.
8.            ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీని, రద్దయిన తక్కిన అకాడమీలను వెంటనే పునరుద్ధరించాలి.

9.            ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో తెలుగు మాట్లాడడాన్ని నేరంగా పరిగణించి శిక్షలు వేయడం రాష్ట్రమంతటా ఒక అలవాటుగా మారింది. తెలుగుభాషను తక్కువ చూపుచూడడం, పలురంగాలలో తెలుగును అవమానించడం సర్వసాధారణమైంది. వివిధ ప్రాంతాల మాండలికాలను, యాసలను హేళన చెయ్యడం, వక్రీకరించడం జరుగుతోంది. ఈ పరిస్థితిని నివారించి, తెలుగు భాషా సంస్కృతుల పట్ల గౌరవాన్ని ఇనుమడింపచేసేందుకు వెంటనే ఒక చట్టాన్ని తీసుకురావాలి.
                పై కనీస డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్చాలి. తెలుగు భాషపట్ల, తెలుగు జాతిపట్ల తన నిబద్ధతను నిరూపించుకోవాలి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్న ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే రాష్ట్రంలోనూ రాష్ట్రం బయటాగల 18 కోట్ల తెలుగు ప్రజలు అసంతృప్తికి పాలక వర్గాలు గురికావలసి వస్తుంది. నిరంతర ఊద్యమాల్ని, ఆందోళనల్ని ఎదుర్కోవలసి వస్తుంది.
                ''ఇంటా బయటా తెలుగును అణచివేస్తున్నారు'' అనే సంపాదకీయం లో సామల రమేష్‌ బాబు ఇలా ఆవేదన చెందారు:
                ''రాష్ట్రంలో తగినచోటునిచ్చి, తెలుగు భాషా పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించే బాధ్యతను తీసుకునే నాధుడు ఎవరూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేడు. తెలుగుకు ఒక మంత్రీ, మంత్రిత్వశాఖ ఉంటేగదా పట్టించుకోవడానికి! ఇదీ మనగతి. ప్రభుత్వ ద్యోగులు తెలుగు నేర్చుకోవలసిన అవసరం లేదని కూడా ఇప్పుడు చేతల్లో చెప్పేసిందన్నమాట! తెలుగును తొంభై తీరులుగా తొక్కివేస్తున్నారు. బయటివారు, లోపలివారూ తెలుగును అణచివేస్తున్నారు''
                                                                                       (నడుస్తున్న చరిత్ర ఫిబ్రవరి 2012)
''తెలుగుకు ప్రపంచీకరణ తెగులు'' పట్టిందంటూ వెన్నెలకంటి రామారావు ఇలా బాదపడ్డారు:
                ''తెలుగు జాతిలో మేధావులు అధిక సంఖ్యలో న్నప్పటికీ తెలుగు భాషకు పారిభాషిక భాషా లక్షణం తీసుకురావడంలో వారందరూ విముఖంగా న్నారు. తమ పరిశోధనలకు, విద్యా ూద్యోగాలకు, పరిపాలనకు పరాయి భాషను పయోగిస్తూ మాతృభాషను కేవలం వాగ్వ్యవహారాలకు, దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం వలన తెలుగు భాష ఆధునీకరణకు  దూరమై ప్రమాదానికి చేరువయ్యింది. మాతృభాషను ఆధునీకరించి తెలుగు జాతి వికాసానికి కృషి చేసే సంకల్పంలేని ప్రభుత్వాల కారణంగా తెలుగు భాషకు ఈ దుస్థితి  ఏర్పడింది.''
                2012 ఫిబ్రవరి 5,6,7 తేదీలలో - ఒంగోలులో జరిగిన 'ప్రపంచ తెలుగు మహోత్సవం'లో ''సంస్కృతం, ఆంగ్లం అనే రెక్కలు లేకుండా తెలుగు అనే పక్షి ఎగురలేదు'' అని పమ్మి పవన్‌కుమార్‌అంటే, ''తెలుగు వాళ్ళం చేతగాని వాళ్ళం అయివుండవచ్చు. తెలుగు చేతగాని నుడికాదు, చేవకలిగిన నుడి.మన చేతగాని తనాన్ని నుడిపైన రుద్దడం తప్పు'' అని స.వెం. రమేష్‌గారు తెప్పికొట్టారు. నేను అంత సాహసించి మాట్లాడటం లేదు. కనీసం సంస్కృతం, ఆంగ్లం అనే రెక్కలతోనైనా తెలుగు పక్షిని స్వేచ్ఛగా, హాయిగా ఎగరనిద్దాం అంటున్నాను.

                మాతృభాషల్లోనే గ్రహాలతో మాట్లాడేదెప్పుడు?'' అంటూ ప్రజా సాహితి సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు ''నిజాం నవాబు కాలంలో ఆనాటి పాలనా భాషైన ర్దూలోనే ఇంజనీరింగు న్యాయ, వైద్య, విద్య సుసాధ్యం అయినట్లు యిప్పుడు మాత్రం దేశీయ భాషలలో ఎందుకు సాధ్యంకాదు?'' అని ప్రశ్నించారు.
                ''లోకముతో కూడా మార్పు చెందనిది ఏదీ వృద్ధి పొందదు. లోకమును అనుసరించి మారినవి వృద్ధిపొంది, మారని వాటిని అణగదొక్కి నిర్మూలము చేయకమానవు. ఇది లోకధర్మము'' అన్నారు గిడుగు.
                ఇంగ్లీషు అలా మార్పు చెందుతూ ఉంది కాబట్టి మిగతా భాషల్ని అణగదొక్కి రాజ్యమేలుతోంది. తెలుగు భాషను కూడా అలా ఆధునిక ప్రజావసరాలన్నింటికీ అనువుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ పోకపోతే తెలుగు అణిగి మణిగి పోవడం ఖాయం. ఇంగ్లీషు మాత్రమే వచ్చిన వాడికి ద్యోగాలు ఎంత సులభంగా దొరుకుతున్నాయో తెలుగు మాత్రమే వచ్చినవాడికి కూడా అంతే సులభంగా ద్యోగం దొరికేదాకా తెలుగు ప్రజలు పోరాడక తప్పదు.
తమిళ అసెంబ్లీలో తెలుగు గోడు
హోసూరు ఎమ్మెల్యే గోపీనాధ్‌: మీరు నన్ను నా భాషలో మాట్లాడటానికి ప్రోత్సహించారు. ముఖ్యమంత్రిగారూ మీరు తెలుగులో మాట్లాడుతుంటే నేను పరవశించి పోతున్నాను. మీ మాటలు విన్న యావత్‌ భారత దేశంలోని తెలుగు ప్రజలు మిమ్మల్ని వేనోళ్ళ కొనియాడుతారు. మా యొక్క గోడు ఏంటంటే మా భాషని కాపాడండి. మాతో పాటు ర్దూ కన్నడ మళయాళ భాషలను కాపాడండి అని విన్నవించుకుంటున్నాను.
ముఖ్యమంత్రి జయలలిత : అన్ని భాషలను కాపాడటానికి మేము సిద్ధంగా న్నాము. ఏం చెయ్యాలో చెప్పండి మీరు.
హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్‌: ఏం చేస్తే బాగుంటదో ఏం చేస్తే మా మైనారిటీ భాషలు కాపాడబడతాయో  ఆలోచించి మీరే చెయ్యండి.
ముఖ్యమంత్రి జయలలిత : కర్నాటకలో విద్యార్థులు కన్నడం చదవకుండా తమ విద్యను కొనసాగించలేరు.ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు తమ మాతృభాష ఏదైనప్పటికీ తెలుగు తప్పనిసరిగా చదవాల్సిందే. కాబట్టి  తమిళనాడులోని విద్యార్థులంతా తమ మాతృభాష ఏదైనప్పటికీ తమిళం చదవాల్సిందే అన్న నిబంధనలో తప్పులేదు. ఎలాంటి మార్పు ఉండబోదు.
                జయలలిత నోట తెలుగు ఎంతో మధురంగా ూంది. తమిళనాడు అసెంబ్లీలో తెలుగు వాణి వినిపించిన హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్‌ను చూసిన మీదట మన నాయకులకు తెలుగును రక్షించుకోవాలన్న తెగువ కలగాలి. తమిళనాడులో నివసించే తెలుగు వాళ్ళతో పాటు ఎవరైనా సరే తమిళం చదవాల్సిందేనని 3.2.12 న అసెంబ్లీలో జయలలిత తెగేసి చెప్పారు.

                తెలుగు భాష పట్ల కూడా అలాంటి దృఢాభిప్రాయం మన నేతలకూ ఉండాలి. ''ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు తమ మాతృభాష ఏదైనప్పటికీ తెలుగు తప్పనిసరిగా చదవాల్సిందే''నన్న జయలలిత మాటలు నిజమైతే చాలు.

1 కామెంట్‌:

  1. 'తెలుగు అధికార భాష కావాలంటే....' పుస్తకంపై ప్రముఖుల అభిప్రాయాలు
    తెలుగు భాషా ఘోషకు ఈ గ్రంథం అక్షర సాక్ష్యం
    'ఆంధ్రత్వమాంధ్ర భాషా చనాల్పశ్చ తపసః ఫలమ్‌'
    'తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడే అదృష్టం కలగడం ఒక వరం. అది చిన్నతనం కాదు. ఆ వరం చిన్నది కాదు. ఎంతో తపస్సు చేస్తే గాని లభించని ఫలం' అన్న అప్పయ్యదీక్షితుల మాటలు అక్షర సత్యాలు.
    మన ఘనతను గానీ, మన చరిత్రను గానీ మనం తెలుసుకోలేం. తెలుసుకొన్నా అది ఘనతని గుర్తించం, భావించం కనీసం మెచ్చుకోలుగా ఒక్కమాటైనా చెప్పం. ఈ నిర్లక్ష్యమే నేడు తెలుగు వెలుగులు క్రమక్రమంగా కొండెక్కిపోయేలా చేస్తుంది. పై మాటల్ని చెప్పిన అప్పయ్య దీక్షితులు పొరుగు రాష్ట్రమైన తమిళదేశీయుడు. మన గొప్ప దనాన్ని పక్కవాళ్ళు గుర్తించడం ద్వారా వారి గొప్పదనం తెలుస్తుందని ఆనందించాలో, మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నామని బాధపడాలో అర్ధం కాని స్థితిలోనే గడిపేస్తున్నాం. స్వతః 'తుళు' భాషను మాతృభాషగా కలిగి, కన్నడ రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు, తెలుగు భాష గురించి, తెలుగువాళ్ళెవరూ అనని అనలేని మాటల్ని ఎలా అన్నాడో చూడండి –
    'తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్ల భుండ, తెలుగొకండ
    నెల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స'
    తెలుగు భాష అస్తిత్వానికి ప్రస్తుతం అంధయుగం. ఎన్ని విధాలుగా చర్చించినా చక్కదిద్దడంలో విఫలమౌతున్న అవాంఛనీయ పరిస్థితుల్లో ఉన్నాం. దానికి కారణాలనేకం.
    మేధావుల హృదయాలు కూడా ఈ విపరీతమయిన మార్పులకి ఏం చెయ్యాలో తెలియక, తెలిసినా ఆశయాలు వాస్తవ రూపం దాల్చక సందిగ్ధంలో ఉన్నాయి. కంటి ముందు కరిగిపోయే తెలుగు తేజాన్ని మళ్ళీ పునరుత్తేజితం చెయ్యాలనే కృతనిశ్చయంతో దీక్షాబద్ధుడై సాగి, 'తెలుగు అధికార భాష కావాలంటే...' అనే గ్రంథాన్ని రచించిన నూర్‌భాషా రహంతుల్లా బహుధా ప్రశంసనీయుడు.
    ఈ పరిశోధనలో ప్రస్తుత తెలుగుభాషా స్వరూపాన్ని సమగ్రంగా విశ్లేషించడంతో పాటు, తెలుగు భాషాభ్యుదయాన్ని అన్వేషించడం ఈ గ్రంథంలోని మరొక ప్రత్యేకత. ఏ వ్యాసానికా వ్యాసం విషయపూర్ణాలై, శ్రేయోదాయకంగా ఉన్నాయి. పరిష్కార మార్గాలెన్నో రచయిత చూపించారు. భాషా చరిత్ర, లిపి విధానం, అన్యదేశాలు, నిఘంటు వుల ఆవశ్యకత, తెలుగుభాషకు జరుగుతున్న అన్యాయం, భాషే ఊపిరిగా బతికిన విశిష్టవ్యక్తుల కథనాలు వంటి అనేక అంశాలతో సాగిన విశిష్ట పుస్తకమిది.
    తెలుగు దేశంలో పుట్టి, తెలుగుతనం నరనరాన ఒంటపట్టించుకొని, తెలుగు భాషను కాపాడడం అటుంచి, కనీసం తెలుగులో మాట్లాడడాన్ని అవమానంగా భావించే వారికి ఈ గ్రంథం ఒక కనువిప్పు. పార్లమెంటరీ అధికార భాషా సంఘ సభ్యుడిగా మూడు సంవత్సరాలు, అదే సంఘానికి ఉపాధ్యక్షుడుగా మరో మూడు సంవత్సరాలు పనిచేసిన నా అనుభవంతో, అక్కడ జాతీయ భాష హిందీని రాజభాషగా అమలుచేయడంలోనూ, ఇక్కడ రాష్ట్రంలో అధికార భాషగా తెలుగును అమలు చేయటంలోనూ, అడ్డంకులు సృష్టిస్తున్నది ఎక్కువ శాతం ఉన్నత అధికారులేనని చెప్పటానికి విచారిస్తున్నాను.
    స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఒక ఉన్నత అధికారి తెలుగు భాష దుస్థితికి దురపిల్లుతూ చేసిన ఆక్రోశం ఈ గ్రంథరూపంలో వెలువడడం బహుదా ప్రశంసనీయం. ఇంత మంచి కృషి చేసిన నూర్‌బాషా రహంతుల్లా మరిన్ని రచనలు చేసి తెలుగు భాషా పునరుజ్జీవానికి దోహదం చెయ్యాలని ఆశిస్తూ..... పద్మశ్రీ డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌,మాజీ రాజ్యసభ సభ్యులు,విశాఖపట్నం ఫోన్‌ : 9849067343

    రిప్లయితొలగించండి