21, జులై 2012, శనివారం

యూనీకోడ్ లోకి మారుదాం


యూనీకోడ్ లోకి మారుదాం

 ఇప్పుడు తెలుగు భాషకూ తెలుగు ప్రజలకూ వున్నన్ని యాతనలు ఇన్నీ అన్నీ కావు. భాషను కాపాడవలసిన వాళ్ళు, పెంపుదలకు ప్రోదిచేయవలసిన వాళ్ళూ అందుకు మారుగా దాని వెనకబాటుకు తోడుపడుతున్నారు అని కొంతమంది భాషా ప్రేమికులు బాధపడుతున్నారు.దుస్థితికి కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి.మిగతా విషయాలు ఎలా ఉన్నా ఇంటర్ నెట్ లోనూ ,పుస్తక ప్రచురణలోను నాకు కనబడిన కొన్ని కారణాలూ వాటి పరిష్కార మార్గాలూ చెబుతా ను:
1.ప్రసిద్ధ ఫాంట్లు
తెలుగు భాషలో మంచి ఫాంట్లు అభివృద్ధి చేశారు.సాంకేతిక పరికరాలు వచ్చాయి. కొన్ని భాషా వ్యాపారసంస్థలు తమ వెబ్‌సైట్లలోని వ్యాసాలని సేవ్‌చేసుకునేందుకు దారి ఇవ్వటం లేదు. కాపీ చేసుకోవటాన్ని అరికట్టడానికి డైనమిక్‌ఫాంటుని ఎంచుకుంటున్నారు. నాగార్జున వెన్న, uni.medhas.org లాంటి వారు వారి ఫాంటుకి పద్మ ఎక్ట్సెన్షన్‌లో సపోర్ట్‌ కలిగిస్తే ఫైర్‌ఫాక్స్‌ లో యూనికోడులో కనిపించేవి. వాటిని అప్పుడు యూనికోడులో సేవ్‌ చేసుకోగలిగేవారు. ఈ సంగతి గమనించిన వ్యాపారస్తులు ఆ ఫాంటుని తొలగించి, పనికట్టుకుని వేరే ఎన్‌కోడింగ్‌కల వేరే ఫాంటుని ఉపయోగించటం మొదలుపెట్టారు. ఈ ఫాంట్లను జాతీయం చెయ్యండి అనే విన్నపాలను కూడా తిరస్కరిస్తున్నారు.ఇంత చక్కటి ఫాంట్లకు రూప కల్పన చేసి వాటిపై  పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నది  ప్రజలకు ఉచితంగా ఇవ్వటానికా?అంటూ వెళ్ళి అడిగినవారిపైన విరుచుకు పడుతున్నారు. వాళ్ళంతా వ్యాపారస్తులు కాబట్టి ఆ అక్షరాలే వాళ్ళ మూలధనం కాబట్టి వారి వాదనలో న్యాయం ఉంది.అందమైన అక్షరాలు రకరకాల సైజుల్లో రూపొందించారు.డీటీపీ వాళ్ళంతా ఇన్నేళ్ళూ ఆ ఫాంట్లలోనే విస్తారమైన సాహిత్యం ముద్రించారు.అదంతా ఇప్పుడు యూనీకోడ్ లోకి మార్చాలన్నా ,తిరిగి యూనీకోడ్ లో టైపు చేయించటమన్నా తలకు మించిన భారం.అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు భాష సాంకేతిక విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి  తేవాలంటే మరేం చెయ్యాలి?ఊరికే అడిగితే ఎవరిస్తారు?కాబట్టి ప్రభుత్వమే ప్రజాదరణ పొందిన ఫాంట్లను కొని జాతీయం చెయ్యాలి.ఆయా ఫాంట్లన్నీ యూనీకోడ్ లోకి మళ్ళించేలా ఫాంటు  మారకాల తయారీ కోసం పెట్టుబడి పెట్టాలి.నిపుణులను ఇందుకు నియోగించాలి.
2.పాత పుస్తకాల భాండాగారం
తెలుగు పత్రికల యాజమాన్యాలు వాటి పాత సంచికలనైనా కొన్నాళ్ళగడువు తరువాత ఉచితంగా నెట్ లో విడుదల చేస్తే బాగుంటుంది.అలాగే వివిధ  ఫాంట్ల  లో ఉన్న ఈ పత్రికను యూనీకోడ్ లోకి మార్చి విడుదల చేస్తే ఇంకా బాగుంటుంది.చదువరులు,పరిశోధకులు సులభంగా వాడుకునేలా పత్రికలన్నీ తెలుగుకు సాంకేతిక హంగులు అద్దాలి
3. ఫాంట్ల మారకం
వెన్న నాగార్జున గారు రూపొందించిన పద్మ ఫాంటు మార్పిడి యంత్రం మన భారతీయ భాషలకు ఎనలేని మేలు చేకూర్చింది.క్రమేణా తెలుగు భాషలో మంచి సాంకేతిక పరికరాలు వచ్చాయి. కొన్ని సమస్యలు తీరాయి. ఇంకా కొన్ని సమస్యలు తీరాలి. తెలుగులో ఇంకా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కావాలి. నాగార్జున వెన్న , కొలిచాల సురేశ్ లాంటివారుd http://eemaata.com/font2unicode/index.php5 లతో తెలుగుకు అద్భుతమైన సేవ చేశారు.వెన్న నాగార్జున గారు (vnagarjuna@gmail.com) యూనికోడేతర ఫాంట్లన్నిటినీ యూనీకోడ్‌కి మార్చేలాగా పద్మ ఫాంటు మారక ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్‌కి మార్చగల సామర్ధ్యానికి ఎదిగింది.http://padma.mozdev.org/. కొన్ని అను ఫాంట్ల సమస్య కొలిచాల సురేశ్‌ (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది. పలానా పలానా సమస్యలను పరిష్కరించండి అంటూ సాంకేతిక నిపుణుల్ని అడిగేవాడిని. 2009లో అను నుండి యూనికోడ్‌ లోకి మార్చే ఒక మారకానికి anurahamthulla version అని నా పేరు కూడా పెట్టారు. అనువాద ఉపకరణాలు, నిఘంటువులు లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌ లోనూ ఆఫ్‌లైన్‌ లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.అనేక రకాల ఫాంట్లను తెలుగు యూనీకోడ్ లోకి మార్చే మంచి సాధనం . http://www.innovatrix.co.in/unicode/fileconverterindex.php5 మీ వ్యాసాలను, పుస్తకాలను యూనీకోడ్ లోకి మార్చుకోండి.
4. యూనీకోడ్‌ లోకి మారుదాం
అందరం యూనీకోడ్‌ లోకి మారుదాం. రకరకాల కీబోర్డులు, ఫాంట్లతో తెలుగు భాషలో కుస్తీపడుతున్నాము. ఈ అవస్థ మనకు తీరాలంటే మనమంతా యూనీకోడ్‌లో మాత్రమే మన పుస్తకాలను ప్రచురించమని కోరాలి. అలా చేస్తే ప్రపంచంలో తెలుగువాళ్ళు ఎక్కడినుండైనా తెలుగు పుస్తకాలను, వ్యాసాలను కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ లలో సులభంగా చదవగలుగుతారు. వ్రాయగలుగుతారు. విషయాలను వెతుక్కో గలుగుతారు.ప్రాచుర్యం పొందిన ఫాంట్లన్నిటినీ యూనీకోడ్‌లోకి మార్చేందుకు, అనువాద సాఫ్ట్‌వేర్‌లు తయారు చేసేందుకు ఖర్చుపెట్టాలి. తమిళనాడు తరహాలో మంచి సాంకేతిక తెలుగు యంత్రాలను కనిపెట్టినవారికి బహుమతులు కూడా ఇవ్వవచ్చు. డి.టి.పీ చేస్తున్న ప్రింటర్లందరూ క్రమేణా యూనీకోడ్‌లోకి మారాలి. యూనీకోడ్ లోకి మారండి అని చాలాకాలం నుండి మనం అందరికీ చెబుతున్నాం.కానీ ఇంకా డి.టి.పి.పని యూనీకోడేతర ఫాంట్లలోనే జరుగుతూ తెలుగు ప్రజలకు మహా ఆటంకంగా ఉంది.కారణం పత్రికల వాళ్ళ ఫాంట్లు అందంగా ఉంతాయి , యూనీకోడ్  ఫాంట్లు అంత అందంగా ఆకర్షణీయంగా ఉండవు అ ని పత్రికలవాళ్ళూ డిటిపి చేసే వాళ్ళూ  అంటున్నారు.
5.తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు
తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.
6. సజీవ వాహిని
సజీవ వాహిని నిర్వాహకులు తెలుగు భాషలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి వారే వెతుక్కునేలా మంచి వెబ్‌సైట్‌ రూపొందించారు. అయితే ఆన్‌లైన్‌ లో మాత్రమే లభిస్తున్న ఈ సౌకర్యాన్ని ఆఫ్‌ లైన్‌లో కూడా అందజేస్తే ఇంటర్‌నెట్‌ లేని వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది. తెలుగు భగవద్గీతకు గానీ, తెలుగు కేతలిక్‌ బైబిల్‌కు గానీ, తెలుగు ఖురాన్‌కు గానీ ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేదు.http://sajeevavahini.com/telugubible అందరూ చూడదగినది. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ మిగతా మత గ్రంథాలకు మన తెలుగు పుస్తకాలకు కూడా లభించేలా కృషి చేస్తే విషయాల పరిశీలన సులభం అవుతుంది. తెలుగు భాష శక్తివంతం కావాలంటే తెలుగులో వెలువడిన అనేక ముఖ్య గ్రంథాలకు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ ఎంతో అవసరం. తెలుగు గ్రంథాలు యూనీకోడ్‌లో ఉంటేనే ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్‌ ఆయా విషయాలను వెతుక్కోటానికి పనికొస్తుంది. కాలంతో పాటు మనం కూడా మారాలి. తెలుగులో తయారైన పి.డి.యఫ్‌. ఫైలును కూడా నేరుగా యూనీకోడ్‌లోకి మార్చగలిగే స్థాయి రావాలి. తెలుగు సాంకేతిక నిపుణుల  కృషి  నిరంతరంసజీవ వాహిని లాగా  సాగుతూనే ఉండాలి.   
( http://www.andhrabhoomi.net/content/unicode  
ఆంధ్ర భూమి   28.7.2012,నడుస్తున్న  చరిత్ర  ఆగస్టు 2012 )

2 కామెంట్‌లు: