6. భారతమాత వర్సెస్ తెలుగు తల్లి బ్రిటీష్ జడ్జి
''సర్కారు, రాయలసీమ ప్రజలు ఇంగ్లీషు నుండి బయటపడి తమ తెలుగు భాష - రాజభాషగా ఉంటుందని ఆశిస్తే, స్వాతంత్య్రం రాకపూర్వం కన్నా, అదేమి దురదృష్టమో, స్వాతంత్య్రం లభించిన తర్వాత ఇంగ్లీషు మీద మమకారం ఎక్కువయ్యింది. తెలుగు ప్రజానీకానికి తెలుగు రాజ్యం వచ్చినట్లు గుర్తెట్లా? హైదరాబాదు సంస్థానంలో ఉర్దూ నెత్తిన రుద్దారని అంధ్రోద్యమం నడువగా, ఆంధ్రప్రదేశ్‌గా ఆవతరణ చెందిన తర్వాత ఉర్దూ బదులు ఇంగ్లీషే పెత్తనం చెయ్యసాగింది. ఎరుగని మిత్రుడు కన్నా ఎరిగిన శత్రువు నయం అన్న సామెతగా ఉర్దూ స్థానంలో ఇంగ్లీషు రావడం సమైక్యానికి సహయపడక పోగా, భాషా రాష్ట్రాల ఆశయమే 20 సంవత్సరాలు అయినా అమలు జరుగదాయె '' అని 1977లో ఆనాటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అన్నారు. ( ' విశాలాంధ్రం ' పేజీలు 77, 78 )
35 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ అధికారభాషగా తెలుగు సుస్థాపితం కాలేదు. ''మా తెలుగుతల్లికీ మల్లెపూదండ'' అంటూ మంత్రులంతా మంగళారతులిస్తున్నారే తప్ప ఆ తల్లికి ఒరగబెట్టింది ఏమీలేదు. ''చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా'' అనే పాటలో శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ ఇలా ఉద్భోదించారు.
ముక్కోటి బలగమోయ్ (ఇప్పుడు ఏడుకోట్లబలగం)
ఒక్కటై మన ముంటె
ఇరుగు పొరుగులోన
ఊరు పేరుంటాది
తల్లి ఒక్కతె నీకు తెలుగోడా
సవతి బిడ్డల పోరు మనకేలా
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
చుక్కాని బట్టరా తెలుగోడా
నావ దరిజేర్చరా మొనగాడా''
కీ.శే. మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి గారు ఇలా వాపోయారు.
''భాషలనెల్ల లెస్సయనబడ్డ స్వభాషను
మాటలాడ నామోషియా?
ఇంటిలో ముసలి మోళ్ళును
ఇంగిలిపీసులోనె సంభాషణ
సేయగావలెనా? పండిన పాపమదెల్ల
ఇట్లు నీ వేషము నిన్ను జూడ
తలవేపన గాయయిపోయె తమ్ముడా!
............................................
ఈడిచి చెంపకాయ నొకటిచ్చు నియంతలు
లేక కాద యీ పోడిమిలోనికిట్లు
దిగిపోయితి వాఖరుకున్ సహోదరా?''
కీ.శే. వేలూరు శివరామ శాస్త్రిగారు కూడా తన ఆవేదన ఇలా వ్యక్తపరచారు.
''తెలివికి సంస్కృతమున్ మరి
కలిమికి ఆంగ్లేయమో ఇక తురకంబో విలువయిడి నేర్చి ఈ నీ
తెలుగెవ్వరి పాలుజేసి తిరిగెదవాంధ్రా!''
వాస్తవం పలికారు శాస్త్రిగారు. సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల ప్రభావానికి తెలుగు ఎంతగానో గురయ్యింది. తెలుగు నిఘంటువు తెరిస్తే ఈ మూడు భాషల పదాలు కలిపి 75 శాతం ఉంటాయి. అచ్చతెలుగు పదాలు కేవలం 25 శాతమే. వాటిలో మనకు అర్థమయ్యే మాటలు చాలా తక్కువ. అంటే క్రమంగా మన మాటలు మనకే వాడుకలో లేకుండా పోతున్నాయి. మన కవులంతా గొప్పలకోసం పోయి సంస్కృతాన్ని మన నెత్తిన రుద్దారని వేంకటరామకృష్ణ కవులు విమర్శించారు.
''ఆంధ్రలోకోపకారమ్ము నాచరింప
భారతమ్మును నన్నయభట్టు తెలుగు
జేయుచున్నాడు సరియె. బడాయిగాక
తొలుత సంస్కృత పతపద్యమెందులకు జెపుడి?
'' ఇప్పటి కైతగాండ్రహహ, ఇంగిలిపీసొక యింత నేర్చి
పై జెప్పెద రాంధ్రపుంగయిత.
సీ! అవి పండితులాదరింతురే? '' అని తిరుపతి వేంకటకవులు నిరసిస్తే,
సుందర్రామశాస్త్రిగారు మాత్రం ఇలా అన్నారు.
''కమలన్ జూదడు భార్య యేనియున్
ఈ కాల స్థితింబట్టి, జర్మను
తైలమ్ము, జపాను సబ్బమెరికా క్రాపున్,
వియన్నా సులోచనముల్,
స్వీడన్ చేతిబెత్తమును, స్విడ్జర్లెండు రిస్ట్వాచి,ఫారెన్ డ్రెస్,
ఫ్రెంచి కటింగు మీసలున్ ఫారిన్ ఫ్యాషన్ లేనిచోన్!''
ఇదంతా ఇలా ఉంటే గోగులపాటికూర్మనాధ కవిగారి గోల ఇంకో రకంగా ఉంది.
''బేగీ అరె అరబ్బీ పడోరేయని బోడి సన్యాసుల బొడుచువారు
మత్రఖో మూపరు మాటీయనుచు వైష్ణవుల బొట్లు దుడువగ బోవువారు
పత్తరు కాయకు బందియారే ఛోడుదేవని శైవుల దిట్టు వారు
కాలటీకా తూనికాల్దేవటంచు మాధ్వుల బ్రల్లదము లాడి త్రోయువారు''
'' ఆవు బైటో అని ఆదరింతురుగదా, తురకలతో మైత్రి నెరపవైతి '' అంటూ భల్లా పేరయ్య సలహాలు ఇస్తాడు. శ్రీ విస్సాప్రెగడ కామరాజు, తిరుమల వేదాంతం శ్రీనివాస దీక్షితయ్యరు, పెంటయ్యకవి, అజ్మతుల్లా, దాశరధి, సినారె, దేవులపల్లి లాంటి వాళ్ళు తెలుగు-ఉర్దూ కలగలిపి కవిత్వాలు చేశారు. ఉదాహరణకు : ' ఖుషీ ఖుషీగా నవ్వుతూ..చలాకి మాటలు రువ్వుతూ..హుషారుగొలిపేవెందుకే..నిషా కనులదానా '. మొత్తం మీద సంస్కృతం, హిందూస్థానీ, ఇంగ్లీషు పదాలు కొల్లలుగా చేరాయి. అందువల్ల తెలుగుభాష సుసంపన్నం అయ్యిందనుకోవాలి. గిడుగు రామమూర్తి పంతులుగారు పరభాషా పదాలను మనవిగానే వాడుకోవాలని అంటూ ఇలా అన్నారు.
''మాలమాటయేని మాదిగ మాటేని
నాటిదేని గాక నేటిదేని
ఈదడైన నేమి యాడదైనను నేమి
ఏడదైన జెల్లు వాడికైన''
ఇలాంటి వాళ్ళ అందరి కృషివల్ల తెలుగుభాష క్రమ క్రమంగా శక్తిని పుంజుకొని ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించింది.
1746లో రెవరెండ్ బెంజిమిన్ షూల్జి తెలుగులో ఆరు క్రైస్తవ పుస్తకాలను జర్మనీ దేశంలోముద్రించాడు.
1814లో విలియం కేరీ తెలుగు వ్యాకరణం 1816లో ఎ.డి.కాంప్‌బెల్ వ్యాకరణం, 1817లో విలియం బ్రౌన్ వ్యాకరణం, 1821లో కాంప్‌బెల్ నిఘంటువు, 1852లో సి.పి. బ్రౌన్ నిఘంటువులు, 1827లో సి.పి. బ్రౌన్ వ్యాకరణం వెలువడ్డాయి. 1840లో మహమ్మద్ రహ్మతుల్లా తెలుగులో మొదటి వారపత్రిక వెలువరించారు. 1926లో వాల్టేరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1948 లో తెలుగుభాషా సమితి తెలుగు విజ్ఞాన సర్వస్వాలు ముద్రించే ప్రయత్నం ఆరంభించింది. 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏర్పడింది. 1966లో తెలుగును అధికార భాషగా ప్రకటించారు. 1967 లో తెలుగు అకాడవిూ ఏర్పడింది. 1969లో డిగ్రీ స్థాయి విద్య తెలుగులో ఉండాలని నిర్ణయించారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. 1976లో జిల్లా స్థాయిలో తెలుగును అధికార భాషగా ప్రకటించారు. 1979లో నంద్యాల మున్సిఫ్ మేజిస్ట్రేటు ఎ ఖాదర్ మొహియుద్దీన్ మొట్టమొదటి ''తెలుగు తీర్పు'' ఇచ్చారు. అదే ఏట డైరెక్టరేట్ల స్థాయిలో తెలుగును అధికార భాషగా చేశారు. 1981లో మున్సిఫ్ మెజిస్ట్రేటు కోర్టుల్లో తెలుగు వాడాలని శాసించారు. 1982లో నాగార్జున సాగర్‌లో సార్వత్రిక విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిగింది. 1983లో సచివాలయ స్థాయిలో తెలుగును అమలు జరపాలని ఆదేశాలిచ్చారు. 1985లో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1988లో దీనికి గుర్తింపు లభించింది. 1988 నవంబర్ 1 నుండి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో నుండి ఇంగ్లీషును తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ''తరతరాల తెలుగుజాతి'' సంగ్రహాలయం ఒకటి సిద్దమౌతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కూడా తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టారు.
'' సాధించినదానికి సంతృప్తిని చెందీ, అదే విజయమనుకుంటే పొరబాటోయి ''అన్న శ్రీశ్రీ పాటను స్మరిస్తూ తెలుగును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. చట్టాలు, కోడ్‌లన్నీ తెలుగులోకి మార్చాలి. తెలుగులో పరిశోధనా స్థాయి విద్యలు (పి.హెచ్.డి) తీసుకురావాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగులో చేసిన అభ్యర్ధులకు ఉద్యోగార్హత పరీక్షల్లో బోనస్ మార్కులు ఇవ్వాలి. తెలుగులో పాలనా వ్యవహారాలు నడపగల ఐ.ఏ.యస్. అధికారుల్ని మాత్రమే మనకు పంపమని కేంద్రాన్ని అడగాలి. అలాగే గవర్నరు విధిగా తెలుగు నేర్చుకోవాలి. తెలుగు రాని గవర్నర్లు, ఐ.ఏ.యస్. అధికారులు మన భాషలో పాలన జరుగకుండా అడ్డుబండలయ్యారు.
(ఆంధ్రపత్రిక 10-5-91)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి