18, జులై 2012, బుధవారం

తెలుగు రెండవ జాతీయ అధికార భాష కావాలి


12.తెలుగు రెండవ జాతీయ అధికార భాష కావాలి
                25-7-2003 న పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారిని కలిశాను. ఆయన కోర్కెకు స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తెలుగుకు జాతీయ అధికార భాష ప్రతిపత్తిని కల్పించవలసిందిగా ప్రధానికి వ్రాసిన లేఖను చూపించారు. ''తెలుగుకు జాతీయ అధికార భాషార్హత లేదా?'' అనే తన కరపత్రంలో ''ఉక్కుమనిషికి పట్టాభి చురక'' అనే అంశాన్ని ఇలా చదివి వినిపించారు.
                ''ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న సమయంలో ఇప్పటి ఆంధ్రప్రాంతం సమిష్టి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. అప్పుడు ఆంధ్రులను ఆంద్రేతర ప్రాంతాల్లో 'మద్రాసీ' లని పిలిచేవారు. ఒకసారి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతున్నది. గాంధీజీ, పండిట్‌ నెహ్రూ, ఉక్కుమనిషి సర్దార్‌ పటేల్‌, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి డాక్టర్‌ పట్టాభి ప్రభృతులున్నారు. పట్టాభి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్యను తీసుకువచ్చేసరికి పటేల్‌ ఎకసక్కెంగా పట్టాభీ! ఆంధ్రరాష్ట్రం ఆంధ్రరాష్ట్రం అని ఎప్పుడూ అంటుంటావు. అసలు నీ ఆంధ్రరాష్ట్రం ఎక్కడ ఉన్నదయ్యా? విూరు మద్రాసీలు కదా? అన్నారు. వెంటనే పట్టాభి తన జేబులోనుంచి అణాకాసు తీసి, 'సర్దార్‌జీ! ఈ అణాపైస 'ఒక అణా' అని అధికార భాషయిన ఇంగ్లీషులోను మన జాతీయ భాషయిన  హిందీలోను, భారత దేశంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే బెంగాలీలోను, ఆతర్వాత 'ఒక అణా' అని తెలుగులోను రాయబడి ఉంది. ఇది బ్రిటీష్‌ ప్రభుత్వం తయారుచేసిన నాణెం (అప్పటికి భారతదేశానికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు.) మరి, దీనిపై మా తెలుగు భాష ఉంది. కానీ విూ గుజరాతీ ఎక్కడా లేదే? అని చురక వేశారు. పటేల్‌ నిరుత్తరుడు అయ్యారు. గాంధీజీ చిరునవ్వుతో చూస్తున్నారు! మహాత్మాగాంధీ మాతృభాష కూడా గుజరాతీ''.
                 ఇండియాలో రెండవ పెద్ద భాష అయిన తెలుగును జాతీయ అధికార భాషగా చెయ్యాలని ముఖ్యమంత్రి కోరేలా చేసినందుకు తుర్లపాటిని అభినందించి, 1986 నుండి ఇప్పటివరకు తెలుగు భాషాభివృద్ధి కోసం నేను వ్రాసిన వ్యాసాల కాపీలను ఆయనకు అందజేశాను. అవన్నీ చూసి విూరు ముస్లిం అయ్యుండి తెలుగు భాష కోసం ఇన్నేళ్ళ పాటు ఇంత కృషి చేయటం ఆశ్చర్యంగా ఉంది. విూరు రాసిన వ్యాసాలు మాలాంటి తెలుగు భాషాభిమానులకు బైబిలు, కురాను, భగవద్గీత లాంటివి అన్నారు. అయ్యా, నేను ముస్లిమునేగాని నా మాతృభాష తెలుగు అంటే ఆయన ఒక పట్టాన నమ్మలేకపోయారు. ముస్లిముల మాతృభాష ఉర్దూ మాత్రమేనని ఆంధ్రలో చాలా మంది అనుకొంటారు. నేను పాలకొల్లు ఎమ్మార్వోగా పని చేసేటప్పుడు హైదరాబాద్‌ నుండి ఒక ముస్లిం అధికారి వచ్చారు. పాలకొల్లు ఎమ్మెల్యే  అల్లు సత్యనారాయణ మమ్మల్నిద్దర్నీ కలిపి. ''ఇక విూరు ఉర్దూ భాషలో మాటాడుకోండి'' అన్నారు. ఆ అధికారికి భాషొచ్చి నోరు తెరిస్తే నాకు భాషరాక నోరు తెరిచాను. నాకు ఉర్దూ రాదు బాబో అంటే ఇంగ్లీషులోకి మళ్ళాడు. ఉర్దూరాని సాయిబులు కూడా ఉంటారని ఎమ్మెల్యేగారికి తెలిసొచ్చింది. హైదరాబాదులో ఎన్నేళ్ళున్నా హైహై అంటం తప్ప ఉర్దూరాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
                ఆకివీడులో రెండేళ్ళ క్రితం రంజాన్‌కి తెలుగు దేశం మండలాధ్యక్ష్యుడు ఇఫ్తార్‌ విందిచ్చారు. ముస్లిములంతా అజాన్‌ ఇచ్చి నమాజు  చేసుకొచ్చారు. అప్పటిదాకా వాళ్ళ నమాజును చూస్తూ హిందూ ప్రముఖులంతా కూర్చున్నారు. తరువాత విందు ఆరగించారు. అప్పుడు నేను విూరిచ్చిన అజాన్‌ అర్థం, విూరు చేసిన ప్రార్ధన అర్థం తెలుగులో చెబితే తెలుగు వాళ్ళందరికీ అర్థమవుతుంది అన్నాను. అప్పుడొకాయన దాని అర్థం తెలుగులో చెప్పాడు. అది విన్న శాసనసభ్యుడు కలిదిండి రామచంద్రరాజు  ''ఇంత మంచి అర్థం ఉందా? మా గాయత్రీ  మంత్రానికీ విూ అజాన్‌కీ తేడా ఏవిూ లేదు, అల్లాహు అక్బర్‌ అంటే విూరు అక్బర్‌ చక్రవర్తిని తలుచుకుంటున్నారేమో అని ఇంతకాలం అనుకున్నాను'' అన్నారు. అంతేగాకుండా ఆయన హాజరయిన ప్రతి జన్మభూమి సభలో ''ముస్లిముల పిలుపుల్లో ప్రార్థనల్లో ఎన్నో మంచి విషయాలున్నాయి, వాటిని మనమంతా తెలుసుకోవాలి'' అంటూ ఇదే అంశాన్ని ప్రజలకు తెలియజేశారు. రోజుకు అయిదు సార్లు మసీదు మైకుల్లో నుండి అందించే ప్రార్థనా పిలుపు ముస్లిమేతరులకు, ముస్లింలకు కూడా ఆర్థం కాకపోవటానికి కారణం అది అరబీ భాషలో మాత్రమే ఉండటం. దానికి తెలుగు అనువాదాన్ని ఇచ్చి అర్థాన్ని తెలుగులో కూడా చెబుతూ వచ్చినట్లయితే మసీదు చుట్టు ప్రక్కల ఉన్న తెలుగు సోదరులంతా విని స్పందించేవారు.

                war against telugu@yahoogroups. com అనే ఒక తెలుగు వ్యతిరేక సంఘం ఇంటర్నెట్‌లో ఒక కథ ప్రచారం చేస్తోంది. '' ఒక బావిలో రెండు కప్పలున్నాయి. ఒకటి తమిళం మాట్లాడేది. ఇంకోటి తెలుగు మాట్లాడేది. బావి విూదికి ఎక్కి బయటికి రావటం కోసం అవి పరస్పరం సహాయం చేసుకుంటూ, చివరికి వచ్చాక, తెలుగు కప్ప తమిళ కప్ప విూద  ఎక్కి బలంగా తమిళ కప్పను బావిలోకి నెడుతూ బయటికి దూకేసింది.'' తమిళులంతా తెలుగువాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆ సంఘం సదా సూచనలిస్తూ ఉంటుంది. మద్రాసు వెళ్ళిన తెలుగువాడు తమిళం నేర్చాడు, హైదరాబాదెళ్ళిన తెలుగువాడు ఉర్దూ నేర్చాడు, బళ్ళారి వెళ్ళిన తెలుగువాడు కన్నడం నేర్చాడు, ఢిల్లీ వెళ్ళిన తెలుగువాడు హిందీ నేర్చాడు, ఇంటింటా తెలుగువాడు ఇంగ్లీషు నేర్చాడు, క్రమేణా తెలుగును మరిచాడు. కానీ మరే భాషనూ తెలుగువాడు అణగద్రొక్కలేదు. పరభాషల పీడనలో తెలుగు అణిగిపోయిందే కానీ, అధికారంలోకి రాలేక పోయింది. తెలుగు భాషను జాతీయ భాషగా గుర్తించేవరకు మన పోరు సాగాలి. 
                ''తెలుగును జాతీయ భాషగా గుర్తించాలని తెలుగు దేశం పార్టీ ఎం.పి. కంభంపాటి రామ్మోహన రావు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  శ్రీకృష్ణదేవరాయలతో పాటు అనేక మంది ప్రముఖులు తెలుగును కీర్తించారని, సుబ్రమణ్యభారతి తెలుగు తీయదనాన్ని శ్లాఘిస్తూ 'సుందర తెలుగు'గా అభివర్ణించారని తెలిపారు. సి.పి. బ్రౌన్‌, బిషప్‌ కాల్డ్‌వెల్‌ తదితర విదేశీయులు తెలుగును అభిమానించారని, జాతీయ భాషగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని అర్హతలు తెలుగుకు ఉన్నాయని బ్రిటన్‌ జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జె.బి.యస్‌. హాల్‌డేన్‌ తెలిపారన్నారు. తెలుగుకు జాతీయ భాష హోదా కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలో ప్రధాన మంత్రికి లేఖ రాశారని తెలిపారు.'' (ఈనాడు 5-8-2003).
ఇవన్నీ తుర్లపాటి కరపత్రంలో ఉన్నవే, అందరూ అడపాదడపా అనుకుంటూ ఉండేవే. కాకపోతే రాజకీయ నాయకుల నోటి నుంచి వెలువడితే శాసనాలు తయారవు తాయి. శాసనం ద్వారా భాష చెల్లుబాటవుతుంది. అది ప్రజల భాషలోఉంటే మరీ సంతృప్తిని, సుఖాన్నీ ఇస్తుంది.
తెలుగు జాతీయ అధికారభాష అయితే లాభమేమిటి?
1.            తెలుగు జాతికి గుర్తింపు, మనలో ఎన్నో కులాలు మతాలు ఉన్నాయి. అవి మనల్ని విడదీస్తున్నాయి. ఈ భాష మనల్ని కలుపుతుంది. ఈ భాష మాట్టాడేవాళ్ళ సంఖ్యనుబట్టి, జనబలాన్ని బట్టి పార్లమెంటులో మన గౌరవం మనకు దక్కుతుంది. హిందీతో పాటు తెలుగును కూడా ఇతర భాషలవాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది.
2.            పార్లమెంటులో హిందీ వాళ్ళలాగా మనం కూడా తెలుగులో మాట్లాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులన్నీ తెలుగులో పొందవచ్చు. కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ తెలుగులో నడుపవచ్చు. చట్టాలన్నీ తెలుగులోకి మార్చబడతాయి. తెలుగులో తీర్పులొస్తాయి. తెలుగులో ఇచ్చే అర్జీలు ఢిల్లీలో కూడా చెల్లుతాయి. ఇతర రాష్ల్రాల్లో ఉన్న తెలుగువారికి కొండంత అండ, గౌరవం హిందీ వాళ్ళతో  పాటు సమానంగా లభిస్తాయి.
3.            దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లలో బోర్డుల విూద తెలుగులో కూడా పేర్లు రాస్తారు. ఈ రోజున హిందీ భాష వల్ల హిందీ వాళ్ళకు ఏయే ప్రయోజనాలు ఒనగూడాయో అవన్నీ తెలుగు వాళ్ళు పొందవచ్చు. తెలుగు నాయకులు నడుం బిగించాలి.
                                                (గీటురాయి 22-8-2003)

 (ఆంధ్రజ్యోతి 26.10.2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి