6, జులై 2012, శుక్రవారం

తెలుగు దేవ భాషే -- ముందుమాట


‘‘భాషలందు పుణ్య భాషలు వేరయా’’ అన్నట్లు కొందరు పండితులు కొన్ని భాషలు గొప్పవి, కొన్ని భాషలు హీనమైనవి అంటూ శతాబ్దాల తరబడి చేసిన విష ప్రచార బాధితురాలు మన తెలుగు భాషామతల్లి. డబ్బు సంపాదించి పెట్టగల భాషలే ఎప్పుడూ దేవభాషలుగా ఘనకీర్తిని పొందాయి. డబ్బు రాని విద్య దరిద్రానికే అన్నట్లు ఇప్పుడు మన తెలుగు తృణీకారానికి గురి అవుతోంది. వ్యాపారం కోసం, పరిపాలన కోసం, మతం కోసం దేవ భాషలుగా భావించిన వాటిని అధికారులూ, వ్యాపారులూ,మత పెద్దలూ తలా ఓ చెయ్యి వేసి కాపాడుతున్నారు. మేపీ పోషిస్తున్నారు. పనికిరాదనుకుంటే మాతృభాషను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. మాతృభాషను కూడా మార్చుకుంటున్నారు.
                దేవభాష అన్నది మనం కలిపించుకున్న పదమే. దేవుళ్ళూ, దేవతలూ, దయ్యాలూ మనుషులను ఆవహించినప్పుడు పూనకంలో వెలువడే మాటలే దేవభాష అయ్యేటట్లయితే మాతృభాషలన్నీ దేవభాషలే అవుతాయి. ఎందుకో గానీ కొంతమందికి ఈ వాదన రుచించదు. నీ ఇష్టమొచ్చిన భాషలో, నీకు వచ్చిన భాషలో పూనకం కుదరదు అంటారు. దైవావేశితులైన స్వాముల పూనకం వేరు, ప్రవక్తల పూనకం వేరు, మామూలు మనుషుల పూనకం వేరు అంటారు.
                అరబీ, సంస్కృతం, ఇంగ్లీషు లాంటి దేవభాషల వల్ల అనేక భాషలున్న రాజ్యాలలో సమైఖ్యత సిద్ధించింది. మతపరమైన కర్మకాండలన్నీ అందరూ ఏకరీతిన జరుపుకోగలిగారు. నిజమే. అలాగని అమ్మను అవతలపడేసి అమ్మమ్మను ఎత్తుకో అంటే ఎలా? మనం అమ్మనూ గౌరవిస్తాము అమ్మమ్మను, నాయనమ్మను కూడా గౌరవిస్తాము. పాస్‌పోర్టు జాతీయతను బట్టి మాత్రమే ఇస్తారు కానీ భాషను బట్టి కాదు. కాబట్టి నేను తెలుగువాడిని అని ఇక ఎక్కడా చెప్పుకోవద్దు అంటే ఎలా?
                ఎవరి మాతృభాషపై వారికి అభిమానం ఉండడం సహజం. ఎవరి మాతృభాష కోసం వారు పాటుపడటం ధర్మం. ఆ క్రమంలో ఏదైనా భాష వాళ్ళు ‘‘మాదీ దేవ భాషే’’ అంటే మిగతా దేవ భాషలవాళ్ళు ూదార బుద్ధితో హర్షించాలి. సరసన చేర్చుకోవాలి గానీ ఇలా అడగటం తమ దేవ భాషను దిగజార్చాలనే ప్రయత్నం అని ఆక్రోశించవచ్చా? భాషల రంగంలోని గొంతుకోత పోటీలో ఓడిపోయిన భాష తన శక్తిని కూడ దీసుకొని తిరిగి లేవటానికి ప్రయత్నిస్తే చేయూతనివ్వాలిగానీ ఇంకా చంపవచ్చా? పతనమైపోయిన ఒక భాష తన పూర్వ వైభవం కోసం పరితపిస్తే నిజమైన దేవ భాష దాని పీఠాన్ని దానికిచ్చి ఆదుకోవాలిగానీ ఇంకా కిందకు పడదోయవచ్చా? నీ రాజ్యంలో నీవుండు. నా రాజ్యంలో నేనుంటాను. నా జోలికి నీవు రాకు. నీ జోలికి నేను రాను అనటం తప్పెలా అవుతుంది? నీ పప్పులూ నా పొట్లూ కలిపి ఊదుకు తిందాం రా అంటే ఎవరైనా ఎంతకాలం వస్తారు? కాలం గడిచేకొద్దీ తమకు జరుగుతున్న నష్టం తెలిసి నోరు విప్పి అడగరా?
                మాతృభాషాభిమానుల్ని అవమానించటం, దేవభాషల పేరుతో అజమాయిషీ చెయ్యటం ఎందుకు? ఎవరి భాషతో వారిని బ్రతకనివ్వండి. ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టవద్దు. తమను తాము దిద్దుకోక తప్పని పరిస్తితి వచ్చినప్పుడు అటు నుంచి నరుక్కు రమ్మంటారు. మీకు నిజంగా మీ భాష పైన మమకారం ూంటే మా సంగతి తరువాత చూద్దురుగానీ అవతలి మతం వాళ్ళతో మీ భాషా సంస్కరణ మొదలు పెట్టుకు రండి అంటారు. చివరికి అన్ని భాషలూ తమ మీదకు వలస వచ్చిన పెద్ద భాషల పాలన నుండి స్వాతంత్య్రం అయినా పొందాలి లేదా తమ ూనికినైనా కోల్పోవాలి. పాలిత భాషలు చేసేది తమ బ్రతుకు పోరాటమే గానీ మరో భాష మీద దాడి కాదు కాబట్టి చిన్న భాషలని దయచేసి కించపరచవద్దు.
                ఒక మతం వాళ్ళ భాషపై మరో మతం వాళ్ళు చేసే అధ్యయనాలు జనం ప్రామాణికంగా తీసుకోరు. ఒక భాష పైకి రాకపోవడానికి ఇంకొక భాష కారణం అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇంకో భాష నేర్చుకుంటే తప్ప బ్రతుకు తెరువు దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు. మాతృభాష బ్రతకటం కోసం, దాని కనీస హక్కుల కోసం చేసే పోరాటాన్ని భాషా దురభిమానం అనటం బలిసిన భాషల అహంకారమే. ఏమీ లేని పేదవాడు తన భాషలోని మల్లెపూలు కోసి ఉంచుకోవడానికి తన దగ్గర న్న మురికి గోచీ బట్టలైనా వాడతాడు. అది నేరమేమీ కాదు. అన్నీ న్న వాడు పేదవాడికి సహాయం చెయ్యకపోగా ఛీఛీ అనటం అహంకరించడం అన్యాయం.
                తెలుగు దేవభాష అనగానే తెలుగు కూడా దేవభాషా? అని ఆవేశపడవద్దు. ఎగతాళి చేయొద్దు. నిదానంగా స్థిమితంగా ఆలోచించండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంత చర్చ జరిగితే అంత మేలు. ఏదో జరగరానిది జరగబోతున్నట్లు కొంతమంది ఆందోళన చెందుతారు. మతపరమైన అంశాలు మాతృభాషలలోనే సాగాలంటే ఇప్పటికప్పుడే ఏమీ జరుగదు. జనానికి నచ్చితే క్రమేణా దైవ ప్రార్థనలు, పూజలూ, పునస్కారాలూ, కర్మకాండలూ స్వచ్ఛందంగానే మాతృభాషలలోకి మరలుతాయి. ఎందుకు మరలాలి? ఏమిటీ ప్రయోజనం? ఇవి మాతృభాషలలో ఎవరికి వారే చేసుకుంటారు కాబట్టి దైవారాధనలో మనసు తృప్తి చెందుతుంది. ఆనందం కలుగుతుంది. అంతా చక్కగా అందరికీ అర్థమౌతుంది. భాషల వాడకంలో నిర్బంధం పనికిరాదు. నిరంకుశత్వాన్ని వ్యతిరేకించే సౌమ్యవాదులు తెలుగు ప్రజల పట్ల కూడా అదే రకం దారతను ప్రదర్శించాలి. తెలుగే దేవభాష’, ‘తెలుగు దేవ భాషే’, ‘తెలుగూ దేవభాషేఅనే మాటల్లో ఒకదానికీ మరొక దానికీ అర్ధంలో ఎంత తేడా వుందో చూడండి. తెలుగుకు మరొక భాషను ఆదేశించే స్థాయి లేదు కానీ నేనూ బతికే న్నాను, నన్ను పయోగించుకోండి అని అభ్యర్థించుకునే అర్హత ఇంకా ఉంది.
                భాషలన్నీ మనిషే తయారు చేసుకున్నాడు. కానీ మతస్తుల నమ్మకం ప్రకారం ‘‘అన్ని భాషలూ దేవుడు పుట్టించినవే’’ అయినప్పటికీ మాంత్రిక భాషలూ, తాంత్రిక భాషలూ, యాంత్రిక భాషలూ సాంకేతిక భాషలూ అని మనిషి వాటిని చీల్చాడు. కుల వివక్ష, మత వివక్ష లాగానే భాషా వివక్ష కూడా పుట్టించాడు. ఈ నేరాన్నీ దేవుడికే అంటగట్టాడు. అసలు దేవుడికి కొన్ని ‘‘దరిద్రపు భాషలు’’ రావు పొమ్మన్నాడు. తెలుగు తల్లి అంటే ఒక దరిద్రదేవతఅనీ, ఆమె భాషను దేవుడే నశించిపోయే భాషల జాబితాలోకి నెడుతున్నాడు అనీ వాదిస్తున్నారు. రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్లు లేనిదే కొన్ని జాతులు ఎలా ఎక్కిరాలేవో అలాగే దేవుడి రక్షణ లేకపోతే కొన్ని భాషలు కూడా అభివృద్ధి చెందలేవు. అందుకే ఈ భాషల సమరంలో ఇలా తెలుగూ దేవభాషేఅనాల్సి వచ్చింది.
                తెలుగు తల్లి భాష కూడా దేవ భాషే అని నమ్మి ‘‘తెలుగు దేవ భాషే’’ అనే పేరు ఈ పుస్తకానికి పెట్టాను. భాషలన్నీ దేవుడివే అయినప్పుడు నా తల్లి బాషకూడా దేవ భాషే అవ్వాలి గదా అని అతి సాధారణంగానే అనుకున్నాను.
                ఏదైనా ఒక భాష దేవ భాష లేదా దేవతా భాష అనే అభిప్రాయం కలిగితే ఆ భాషను ఎంతో గౌరవిస్తారు. పూజ్య భావంతో మొక్కుతారు, సాగిల పడతారు. అందుకే తెలుగు భాషామతల్లిని మన పెద్దలు తెలుగుతల్లి అనే దేవతగా భావించి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ ` మా కన్న తల్లికీ మంగళారతులు’’ అంటూ అడపాదడపా పూజలూ జరిపిస్తున్నారు. మనిషికి జడవని వారు కొందరు దేవుడికి భయపడతారు. దేవుడి భాష పట్ల శ్రద్ధా భక్తులు కనబరుస్తారు. ఒక సంస్కృత శ్లోకమో, అరబ్బీ లిపిలోని సూరానో కనబడితే కళ్ళకద్దుకొని జేబులో దాచుకున్న వారిని నేను చూశాను. అదే వాటి అర్థాలు వివరించిన తెలుగు లిపిలోని కాగితానికి, సంస్కృత శ్లోకానికో, అరబీ లిపిలోని సూరాకో ఇచ్చినంత విలువ ఇవ్వకపోవటాన్ని గమనించాను. నా భాషకు విలువ లేకపోవటానికి ఏమిటి కారణం? అని పరిపరి విధాలా ఆలోచించాను. తెలుగుకు పూర్వ వైభవం రావాలంటే ఏమేం పనులు చెయ్యాలో అన్నీ చెయ్యాలి.
                తెలుగును దేవభాష అంటేనే ఒప్పుకోలేక కడుపు రగిలిపోయే తెలుగు బిడ్డలు ఒక పక్క, సంస్కృతం, అరబీలతో తెలుగును సమానం చేసి మాట్లాడుతారా? ఎంత ధైర్యం? అని కారాలు మిరియాలు నూరే తెలుగు బిడ్డలు మరోపక్క. ‘‘దేవభాష అంటే మృత భాష’’ ఆ భాష ప్రజల రోజువారీ వాడకంలో వుండదు. దేవుడి కోసం ప్రార్థనల్లో, కర్మకాండలలో మాత్రమే దేవ భాషను వాడుతారు. ఇంకా తెలుగుకు బోలెడంత ఆయుషు ఉంది కదా? అప్పుడే తొందరపడి తెలుగును దేవభాషల జాబితాలో చేరుస్తారా? అని వాదించే తెలుగు బిడ్డలు ఇంకో పక్క. అడుక్కు తినే వాడి దగ్గరకు గీరుకుతినే వాడొచ్చినట్లు, కూర్చొని తన్నేవాడి దగ్గరకు కూలబడితన్నే వాడు వచ్చినట్లు తెలుగును కూడా మరో దేవ భాషగా మార్చి మా పొట్టకొట్టొద్దు అని ఆక్రోశించే తెలుగు బిడ్డలు మరో వైపు. ఇలా రకరకాల శాపనార్థాలతో ‘‘తెలుగు కూలిందాకా ఒకటే పోరు’’ అన్నట్లుగా ఉంది. ఇవన్నీ తీరుబడిగా ఆలోచిస్తే అర్థమయ్యే వాస్తవం ఏంటంటే ` జనం దైవారాధనల కోసమైనా అలాంటి భాషలకు చావు లేకుండా చేస్తున్నారు. ప్రపంచ భాష దెబ్బకు కాలక్రమేణా వేలాది భాషలు చనిపోతాయి. అంటే మృత భాషలు అవుతాయి. మృత భాషలన్నీ దేవ భాషలు కాలేవు. దేవుడిని చేరిన భాషలను దేవ బాషలు అనటంలో తప్పులేదు. మనిషే వాటిని దేవ భాషలుగా సమాజంలో నిలబెట్టాలి. ఎలాగా? బతికున్న రోజుల్లో తల్లికి కూడు పెట్టని కొందరు ఘనంగా వర్ధంతులు చేస్తూ అమ్మను స్మరించుకుంటారే? అలాగన్నమాట. శవాన్ని మేళతాళాలతో ఆనందంగా ఊరేగిస్తూ స్మశానానికి తీసుకెళ్ళే జాతులనెప్పుడైనా చూచారా? మృతుడు దుఃఖ విముక్తుడయ్యాడని వాళ్ళు సంతోషపడతారట. ఆ దేవుడే ఇన్ని భాషలను పుట్టిస్తూ చంపేస్తూ వుంటే మానవమాత్రులం మనమేం చేయగలం? మనకెందుకు బాధ? ఆ మహా మహా రాజ భాషలకే చావు తప్పలేదు. అవన్నీ దేవుడి దగ్గరకు చేరి దేవ భాషలైపోలా? మనం ఈనాటికీ వాటిని గౌరవించటం లేదా? తెలుగు చనిపోయి నామరూపాలు లేకుండా నాశనమై, కనుమరుగు కావటం కంటే దేవ భాషగానైనా మన కళ్ళముందు శాశ్వతంగా కొనసాగటం మహా భాగ్యం కదా? చేజేతులా మన భాషను మనమే చంపుకొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో చచ్చీ సాధించే గొప్ప భాషల సరసన తెలుగును చేర్చటమే మన భాషకు మనం చేసే కనీస మేలు. ప్రయత్నాలు ఇప్పటి నుండి మొదలు పెడితే ఇంకో వందేళ్ళకైనా తెలుగూ దేవ భాషల సరసన చేరవచ్చు.
                ఈ పుస్తకంలోనే చెప్పాలనుకున్నవన్నీ చెప్పలేకపోయాను. కాలం మార్పుల మాయం కదా. భవిష్యత్తులో చెప్పాల్సి వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటాను. మన మాటలోని మాధుర్యం మనమెందుకు వదులుకోవాలి ?  ఒకనాడు పరమ దేవభాష ఇంగ్లీషుకున్న సౌలభ్యాలన్నీ తెలుగుకు కూడా ఉంటే బాగుండునే అనుకునేవాడిని. ఇప్పుడీ పుస్తకానికి ముందుమాట తెలుగులో నా చేతులతో నేనే కంప్యూటర్లో టైపు చేసుకునే స్థాయికి తెలుగును మన సాంకేతిక నిపుణులు చేర్చారు. ఆనందంగా ఉంది. మన భాషకు సాంకేతిక ఊపిరులూదుతున్న వాళ్ళందరికీ నమస్కారం. అలాగే రాజభాష కావలసిన తెలుగుకు ఇప్పుడున్న ఆటంకాలన్నీ తొలిగేలా అధికారులు, రాజకీయ నాయకులు, మతపెద్దలు, పురోహితులు, ముల్లాలు, కళాకారులు, అధ్యాపకులు, ఆచార్యులు అంతా ఎవరి పరిధిలో వాళ్ళు సహకరించాలి అని మనవి చేస్తున్నాను.
                తెలుగులో పాలన జరగాలనీ, విద్యాబుద్ధులు తెలుగులోనే ఉండాలనీ 1980 నుండీ నేను పత్రికలకెక్కటం మొదలుపెట్టాను. తెలుగు కూడా చనిపోయే భాషల జాబితాలో చేరింది అన్న వార్తలు వినబడ్డ తరువాత నా తల్లి భాషకు ఎందుకింత దుస్థితి కలిగింది అనే ఆవేదన పెరిగింది. నా అమ్మ భాష బతకాలి, ప్రజారంజకంగా నా భాషలో కూడా పాలన జరగాలి అని నాకు చిన్న ఆశ పుట్టింది. అది దురాశ అని కొందరూ అత్యాశ అని కొందరు విమర్శించారు, విమర్శిస్తూనే వున్నారు. 
                నేను అత్యాశపరుణ్ణీ, దురాశావాదినీ, నిరాశావాదినీ కాదు. కేవలం సమంజసమైన, సహజ న్యాయం కోరే, ఆశావాదిని. అమ్మకు న్యాయం చెయ్యని కొడుకూ ఒక కొడుకేనా? అనే సామెత గుర్తొచ్చింది. తెలుగుకు సరైన న్యాయం జరిగే వరకు, తెలుగుకు పట్టం కట్టేదాకా నా ప్రయత్నం నేను చేస్తూనే వుండాలి అనుకున్నాను. అప్పటివరకూ పత్రికల్లో వచ్చిన నా వ్యాసాలతో ‘‘తెలుగు అధికార భాష కావాలంటే...’’ పుస్తకం 19 అధ్యాయాలతో 2004లో ఒకసారీ, 28 అధ్యాయాలతో 2006లో మరొకసారీ తెచ్చాను. 2006 నుండి పత్రికలలో వచ్చిన 22 వ్యాసాలతో ఈ పుస్తకం తెస్తున్నాను.
                ముందుమాటలు రాసిచ్చిన గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్‌గారికీ, డాక్టర్‌జి.వి. పూర్ణచందు గారికీ,  అన్నయ్య ప్రొఫెసర్‌నూర్‌బాషా అబ్దుల్‌గారికీ, డానీ గారికీ, నిసార్‌అహ్మద్‌గారికీ, ముఖపత్రం అందంగా తీర్చి ఇచ్చిన అబ్దుల్లా గారికీ, పుస్తకం ముద్రించిన శ్రీశ్రీ విశ్వేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు.

1 కామెంట్‌:

  1. తెలుగే దేవభాష --- ఆచార్య ప్రభోదానంద యోగి
    "భాష అనగా భావమును వ్యక్తము చేయునది మాత్రమే.భాషలో అక్షరములుండవచ్చును, ఉండక పోవచ్చును.ముందు 'భాష' పుట్టుతుంది.తర్వాత 'లిపి' పుట్టుతుంది.ప్రపంచ వ్యాప్తముగా యున్న భాషలు 7,105 కాగా అందులో లిపి యున్నవి 3,570 భాషలు.లిపి లేని భాషలు 696.మిగతా 2839 భాషలు మారుమూల ప్రాంతములలో తక్కువ జనాభా మధ్య గలవు.కొన్ని భాషలు లిపిలేనివయినా భావము మాత్రము శబ్దముతోనే యుండుట వలన ఆ శబ్దమును భాష అని అన్నారు.తెలుగు భాష ''జ్ఞానచిహ్నము''గా భూమి మీద తయారయినది కానీ ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు.మన భాషకు ''తెలుగు'' అని పేరు పెట్టిన వాడు సూర్యుడని ఎవరికీ తెలియదు.నేడు సూర్యునకున్న పేర్లన్నీ తెలుగు భాషలోనివే. ఆదిత్యుని చేత పేరు పెట్టబడిన ఆదిభాష 'తెలుగు'. చాలా భాషల పేర్లలో అర్థము లేదు. అట్లే భాషయొక్క లిపిలో కూడా అర్థము లేదు. భాషకు అర్థము, మరియు భాషయొక్క లిపికి అర్థము ఒక్క తెలుగు భాషకే ఉంది ,ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు భాష అయినందున, సూర్యుడు భూమిమీద తన జ్ఞానమును తెలుగు భాషలోనే తెలియజేసియుండుట వలన, తెలుగు భాష దైవజ్ఞానమునకు దగ్గరగా అర్థములను కలిగియుండుట వలన తెలుగు భాషను అన్ని విధములా దైవభాషగా చెప్పవచ్చును.తెలుగు భాష ప్రపంచములో మొట్టమొదట పుట్టిన భాష. అయినా ఆనాడు భాషకు పేరులేకుండాయుండెడిది.సంస్కృతము చాలా వెనుక పుట్టినదని తెలియవలెను. తెలుగు భాషలో యున్నన్ని అక్షరములు మరి ఏ ఇతర భాషలో లేవు. అందువలన ఏ చిన్న శబ్దమునయినా, ఎంత కఠినమైన శబ్దమునయినా తెలుగు భాషలోని లిపి వలన వ్రాయవచ్చును.సంస్కృత భాషకు లిపిలేదు.సంస్కృతమును వ్రాయుటకు ఇతర భాషలను వాడుకోవలసి వచ్చినది. భాష అన్న తర్వాత అది భావమును తెలుపుటకే ఎక్కువగా ఉపయోగపడవలసి యుండగా, సంస్కృత భాష మాత్రము భావమును తెల్పు సందర్భములలో బహుతక్కువగా వాడబడుచున్నది.అర్చనలందును, పొగడ్తలందును, మంత్ర జపములందును వాడుకొంటున్నారు.అంతేకాక మొదట పుట్టిన తెలుగు భాషలోని పదములను ఎక్కువగా సంస్కృతములో పెట్టుకోవడము జరిగినది.ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు. ప్రపంచములో అన్నిటికంటే పెద్దదయిన బ్రహ్మవిద్యను చెప్పబడిన భాష తెలుగు.ప్రపంచములోని ఎన్నో భాషలలో తెలుగు భాషా బీజములు కనిపించుచున్నవి.తెలుగు పదములు అన్ని భాషలలో ఉన్నాయి. తెలుగు కంటే పెద్ద భాష ఏదీ లేదు.వాస్తవానికి ప్రపంచ భాషలన్నిటికీ రాజుగా ,చక్రవర్తిగా తెలుగు భాష ఉండాలి.శ్లోకము తప్ప పద్యము వ్రాయుటకు పనికిరాని సంస్కృతము కంటే పద్యమును శ్లోకమును రెండిటినీ వ్రాయగల తెలుగే గొప్ప.ఆధ్యాత్మికమునకు తెలుగులో యున్నంత అర్థము, వివరము వేరే భాషలో లేదు.''ఆత్మ'' అను పదము తెలుగు భాషలోనే పుట్టినది.వాస్తవముగా తెలుగు భాష దైవభాషయే". --- ఆచార్య ప్రభోదానంద యోగి (లు అంటే ఏమిటి? 2016)https://www.facebook.com/nrahamthulla/posts/1167077539990901

    రిప్లయితొలగించండి